
బెంగాల్‌లోని గిద్దేశ్వర్ శివాలయంలోకి ప్రవేశించిన దళితులు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఓ గ్రామంలో మూడు దశాబ్దాల కులవివక్షకు దళితులు ముగింపు పలికారు. 300 ఏళ్ల తరువాత 130 దళిత కుటుంబాలు తమ ఇష్టదైవం ఆలయంలోకి ప్రవేశించాయి. పూర్బా బర్ధమాన్ జిల్లాలోని గిద్దేశ్వర్ శివాలయం ఈ చారిత్రాత్మక సన్నివేశానికి వేదికైంది. కత్వా సబ్ డివిజన్‌లోని గిద్‌గ్రామ్ గ్రామంలోని దస్పార ప్రాంతానికి చెందిన ఐదుగురు సభ్యుల బృందం బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఆలయం మెట్లు శివలింగంపై పాలు, నీరు పోసి మహదేవునికి అభిషేకం చేశారు.
దాస్ ఇంటి పేర్లు కలిగిన దళిత కుటుంబాలు చెప్పులు కుట్టడం, నేత సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే స్థానికంగా ఉన్న గిద్దేశ్వర్ శివాలయం 300 ఏళ్ల కిందట స్థాపించారు. అప్పటి నుంచి వీరికి ఆలయంలోకి ప్రవేశం లేదు. శివుడిని పూజించేందుకు అనుమతించాలని మూడు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా కూడా వారు పూజలు చేయడానికి ప్రయత్నించగా వారిని ఆలయ ప్రాంగణం నుంచి తరిమివేశారు. అంతేకాదు దాదాపు గ్రామ బహిష్కరణ చేశారు. వారికి నిత్యావసర వస్తువులు అమ్మడంతో పాటు వారి నుంచి పాలవంటివి కొనడం మానేశారు.
దీంతో దళితులు స్థానిక యంత్రాంగం, పోలీసుల సహాయం కోరారు. దస్పారా గ్రామస్తులతో పలుమార్లు చర్చలు జరిపిన పోలీసులు.. సమస్యను పరిష్కరించారు. అంతేకాదు దళితుల నుంచి పాలను కూడా సేకరించాలని పాలకేంద్రాలను పోలీసులు ఆదేశించారు. అలా యంత్రాంగం, పోలీసుల జోక్యంతో వందల ఏళ్ల అణచివేతను ఎదిరించిన దళితులు బుధవారం ఆలయంలో పూజలు చేశారు. పూజలు చేసే హక్కు లభించినందుకు సంతోషంగా ఉందని, అందరూ బాగుండాలని దేవుడిని కోరుకున్నానని సంతోష్ దాస్ అనే వ్యక్తి తెలిపారు.
అయితే ఈ సంతోషం తాత్కాలికమా? దీర్ఘకాలికమా అనేది ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులు, యంత్రాంగం ఉండగా కిమ్మనకుండా ఉన్న గ్రామస్తులు.. వాళ్లు వెళ్లిపోయాక కూడా తమను అనుమతిస్తారా? అని దళితులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. వారి సందేహాలకు ఊతమిస్తూ ఆలయ సేవకుడు సనత్ మండల్ మాత్రం ఈ నిర్ణయాన్ని విముఖతతోనే అంగీకరించారు. ఆలయంలోకి దళితులు ప్రవేశిస్తే ఆలయ పురాతన సంప్రదాయాలు, స్వచ్ఛత, పవిత్రత పెద్ద ప్రశ్నలా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆలయంలోకి దళితుల ప్రవేశంతో పెద్ద ప్రతిష్టంభన తొలగిందని ఇది స్వాగతించాల్సిన విషయమని తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అపూర్వ ఛటర్జీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment