
'సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి'
హైదరాబాద్: కార్మిక వర్గ పొట్టకొట్టేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిద్దామని, రేపు (సెప్టెంబర్ 2న) సార్వత్రిక సమ్మెను జయపద్రం చేద్దాం' అంటూ వైఎస్‌ఆర్‌సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి పిలుపునిచ్చారు. కార్మిక సంఘాల భారత్ బంద్ నేపథ్యంలో గురువారం ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలకు ముందు హామీలతో ఊదరగొట్టి.. తీరా ఎన్నికలైపోయాక కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి ఉద్యోగాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉద్యోగాన్ని చంద్రబాబు నాయుడు సంపాదించేసుకున్నారని గౌతంరెడ్డి విమర్శించారు. ఇచ్చిన హామీలు గాలికొదిలేసి ప్రజా సంక్షేమాన్ని ఆటకెక్కించారని ధ్వజమెత్తారు.
ప్రభుత్వరంగ పరిశ్రమలన్నింటినీ ప్రైవేటీరణ, కార్మిక సంస్కరణల పేరిట మొత్తం కార్మికుల చట్టాలన్నింటినీ కుదించి కార్మికుల హక్కును అణిచివేయడం లాంటి చర్యలు కార్మికులలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయని గౌతంరెడ్డి దుయ్యబట్టారు. కాగా, రేపు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమ్మెలో 10 లక్షల మంది ఉద్యోగులు పాల్గొననున్నారు. ఈ బంద్ నేపథ్యంలో బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, రవాణా సంస్థలు మూతపడనున్నాయి. అఖిల భారత సమ్మెకు స్థానిక కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి.