విజయవాడ బస్టాండ్‌లో నిలిచిపోయిన బస్సులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బంద్ విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో పోరాడుతున్న రైతుల పిలుపు మేరకు శుక్రవారం భారత్ బంద్ నిర్వహించారు. దీనికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్‌లోనూ బంద్‌ను తలపెట్టిన పలు ప్రధాన పక్షాలు.. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు తెలపడంతో పాటు ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బీజేపీ, జనసేన మినహా వైఎస్సార్‌సీపీ, వామపక్షాలు, టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ తదితర పార్టీలు సంఘీభావంగా నిలిచాయి. లారీ అసోసియేషన్, ఉద్యోగ, కార్మిక, విద్యార్థి, వాణిజ్య, వర్తక సంఘాలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి బంద్‌లో పాలుపంచుకున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే పలు ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, వామపక్ష పార్టీలకు చెందిన నేతలు రోడ్లపై రాస్తారోకో, ధర్నాలతో నిరసన తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించే చర్యలు విడనాడాలని, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఆందోళనకారులు నినదించారు. బంద్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లు, హోటల్స్, వర్తక, వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలకు సెలవు ఇచ్చారు.
విజయవాడ బస్టాండ్ వద్ద బోసిపోతున్న పోలీస్ కంట్రోల్ రూం సెంటర్
► విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ (పీఎన్‌బీఎస్) వద్ద ధర్నా చేపట్టారు. బంద్ సందర్భంగా పలువురు నేతల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
► గుంటూరులో వివిధ పార్టీల నేతలు ఆర్టీసీ బస్టాండ్ నుంచి మార్కెట్ సెంటర్, శంకర్ విలాస్ సెంటర్ మీదుగా లాడ్జి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.
► కర్నూలు కొత్త బస్టాండ్ వద్ద మధ్యాహ్నం తర్వాత కూడా ఆర్టీసీ బస్సులను బయటకు రాకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది ఆర్టీసీ డిపోల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
► అనంతపురం, కడప, చిత్తూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి తదితర జిల్లాల్లో ఆర్టీసీ బస్టాండ్‌ల వద్ద పలు పార్టీలు, కార్మీక సంఘాల నేతలు ఆందోళనలు నిర్వహించారు. ప్రైవేటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
భీమవరంలో బస్సులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బంద్ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. భీమవరం శివారున ఉన్న తిరుమల విద్యా సంస్థకు బంద్ సందర్భంగా సెలవు ప్రకటించారు. క్లాసులు జరగకపోయినా హాస్టల్‌లో విద్యార్థులు చదువుకోవడాన్ని గమనించిన భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) ప్రతినిధులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ సమయంలో కొంత వాగ్వాదం జరగడంతో విద్యా సంస్థకు చెందిన బస్సులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. స్థానికులు జోక్యం చేసుకని సర్దుబాటు చేశారు. రాళ్లు రువ్వడంపై కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తిరుపతిలో గుండు కొట్టించుకుని నిరసన తెలుపుతున్న ఉద్యమకారులు
బంద్‌కు మావోయిస్టు పార్టీ మద్దతు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన బంద్‌కు మద్దతు తెలుపుతున్నట్టు మావోయిస్టు పార్టీ కార్యదర్శి గణేష్ ఆడియో విడుదల చేశారు. మావోయిస్టులు ఎప్పుడూ ప్రజల వెంటే ఉంటారని, బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలని, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
నినాదాలతో మారుమోగిన విశాఖ
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో జరిగిన పలు నిరసన కార్యక్రమాల్లో ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’, ‘విశాఖ ఉక్కు – ప్రైవేటీకరణ వద్దు’ అంటూ ఆందోళనకారులు నినదించారు. జిల్లా వ్యాప్తంగా పలు విద్యా సంస్థలు, వాణిజ్య, వర్తక సముదాయాలు, దుకాణాలు మూతపడ్డాయి. నగరంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. జిల్లాలో ఆర్టీసీ బస్సులన్నీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు డిపోలకే పరిమితమయ్యాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే వైఎస్సార్‌సీపీ శ్రేణులు, వామపక్ష, ప్రజా సంఘాల నేతలు, ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు, సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీ, సీఐటీయూసీ, సీఎఫ్‌ఐటీయూ, టీఎన్‌టీయూసీ , డీవైఎఫ్‌ఐ, ఐవైఎఫ్, ఏపీ మహిళా సమాఖ్య, ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా, ఏఐడీఎస్‌వో, పీడీఎస్‌వో నాయకులు నిరసనలో పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నగర, రూరల్ పరిధిలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తల ఆధ్వర్యంలో పలు చోట్ల రాస్తారోకోలు చేపట్టారు.
విశాఖపట్నం మద్దిలపాలెం డిపోలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు
► గాజువాక, విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమ, విశాఖ ఉత్తర నియోజకవర్గాలలో వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళన నిర్వహించారు. హెచ్‌పీసీఎల్ గేటు వద్ద వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నేతలు నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు.మోకాళ్లపై నిరసన తెలిపారు.
► గాజువాక, లంకెలపాలెం, కూర్మన్నపాలెం, షీలానగర్, పెదగంట్యాడ ప్రాంతాల్లో ఆయా వైఎస్సార్‌సీపీ పార్టీల నేతలు, అఖిలపక్ష కారి్మక సంఘాల నేతలు కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మద్దిలపాలెం కూడలిలో నిరసన చేపట్టి, వెంకోజిపాలెం వరకు ప్రదర్శన కొనసాగించారు.
► హుకుంపేట, అరకులోయ జంక్షన్, పాడేరు, అనకాపల్లి మెయిన్‌రోడ్ జంక్షన్‌లో రాస్తారోకోలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment