క్యాప్టివ్ మైన్స్, సెయిల్‌లో విలీనం, ప్రైవేటీకరణ రద్దు
ప్రైవేటీకరణ ఆగుతుందని స్పష్టమైన ప్రకటన చేయని కేంద్ర ప్రభుత్వం
సొంత గనులు లేకుండా ప్లాంటు మనుగడ ఎలా సాధ్యం?
సెయిల్‌లో విశాఖ ఉక్కు విలీనాన్ని పట్టించుకోని కేంద్రం
రూ.11,440 కోట్ల ప్యాకేజీ బకాయిలకే సరిపోతుందని కార్మిక సంఘాల ఆందోళన
అయినా ఏదో ఘనత సాధించినట్లు చంకలు కొట్టుకుంటున్న చంద్రబాబు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నది జగన్ సర్కారే..
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు కార్మికుల పోరాటమంతా.. ప్లాంటు ప్రైవేటీకరణను పూర్తిగా నిలిపి వేయడం.. క్యాపిటివ్ మైన్స్‌ను కేటాయించడం.. సెయిల్‌లో విలీనం చేయడం..! మరి విశాఖ ఉక్కుకు ఊరట దక్కాలంటే ఇందులో ఒక్కటైనా నెరవేరాలి కదా? తమ ఆందోళనను ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్రం నుంచి రూ.వేల కోట్ల ప్యాకేజీని సాధించినట్లు సీఎం చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు ప్రచారం చేసుకోవడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
ఆ ప్యాకేజీతో ఒరిగేదేమీ లేదని.. ముడి సరుకు సరఫరాదారుల బకాయిల చెల్లింపు, బ్యాంకు రుణాలు, ఉద్యోగుల పెండింగ్ వేతనాలు, ఇతర బెనిఫిట్స్, స్వచ్ఛంద పదవీ విరమణ పథకం అమలుకే అది చాలదని కార్మిక సంఘాలు పెదవి విరుస్తున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటన చేయాలని, అప్పటివరకు తమ పోరాటం ఆగదని సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.
భారీగా బకాయిలు..
విశాఖ స్టీలు ప్లాంటు ఇప్పటికే రూ.25 వేల కోట్ల మేర నిధుల లోటు ఎదుర్కొంటోంది. ముడి సరుకు సరఫరా చేసిన వెండర్స్‌తో పాటు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, వాటిపై వడ్డీ, ఉద్యోగులకు బకాయిపడ్డ వేతనాలు, వివిధ రకాల బెనిఫిట్స్, వీఆర్‌ఎస్ అమలు.. ఇలా మొత్తం రూ. 25 వేల కోట్ల మేర స్టీలు ప్లాంటు లోటు బడ్జెట్‌లో ఉంది. ఉద్యోగులకు సెప్టెంబరు నుంచి పెండింగ్ వేతనాలు, పీఎఫ్ ఇతర బకాయిలు కలిపి రూ.1,600 కోట్ల మేర ఉన్నాయి.
ప్రైవేటీకరణలో భాగంగా అమలు చేస్తున్న వీఆర్‌ఎస్ కోసం రూ.1,000 కోట్ల మేర అవసరం. ముడి సరుకు సరఫరా చేసిన వెండర్స్‌కు ఏకంగా రూ.7 వేల కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. విశాఖ ఉక్కుకు ప్రస్తుతం ఏకైక రైల్వే లైన్ ద్వారా ఆరు ర్యాకులు (దాదాపు వంద టన్నులు) బొగ్గు సరఫరా అవుతుండగా పూర్తి స్థాయిలో ఉత్పత్తి కావాలంటే రోజూ తొమ్మిది ర్యాక్‌లు అవసరం.
నక్కపల్లి ప్రైవేటు స్టీలు ప్లాంటులో కూడా ఉత్పత్తి ప్రారంభమైతే మరో 4–5 ర్యాకులు బొగ్గు అవసరం అవుతుంది. రోజుకు 13–14 ర్యాక్‌ల బొగ్గును ఒక్క రైల్వే లైను ద్వారా తీర్చడం సాధ్యం కాదు. ప్రైవేట్ సంస్థతో పోటీపడి బొగ్గు సమస్యను పరిష్కరించుకునే అవకాశం విశాఖ స్టీలుకు ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక ప్రస్తుతం ఉన్న 12 వేల మంది ఉద్యోగుల్లో నాలుగు వేల మంది పదవీ విరమణ పొందుతున్నారు. మరో 1,000 మందిని వీఆర్‌ఎస్ ద్వారా తొలగించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేవలం 7 వేల మందితో 7 మిలియన్ టన్నుల ప్లాంటులో పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు.
వైఎస్సార్‌సీపీ ఉక్కు సంకల్పం..
విశాఖ స్టీలు ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ 2021 ఫిబ్రవరి 6వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. ఈమేరకు అసెంబ్లీలో 2021 మే నెలలో తీర్మానం కూడా చేశారు. పార్లమెంటులో సైతం వైఎస్సార్ సీపీ తన గళాన్ని వినిపించింది.
ఇదే విషయాన్ని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి సైతం తాజాగా స్వయంగా చెప్పారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దంటూ వైఎస్ జగన్ కేంద్రానికి పలు దఫాలు వినతిపత్రాలు సమర్పించారు. ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో 2022 నవంబరు 12న జరిగిన ప్రధాని మోదీ సభలో కూడా వైఎస్ జగన్ దీన్ని ప్రస్తావించారు.
ఎంపీ వి.విజయసాయిరెడ్డి విశాఖలో భారీ పాదయాత్రను కూడా చేపట్టారు. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లోనూ వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు విశాఖ స్టీలు ప్లాంటు ఆర్థిక సమస్యలతో పాటు ప్రైవేటీకరణ అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించారు.
తాత్కాలిక ఉపశనమం..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. రుణాలు, పెండింగ్ బకాయిలు కలిపితే సుమారు రూ.25 వేల కోట్ల బకాయిలున్నాయి. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసేలా చర్యలు తీసుకోవాలి. – నీరుకొండ రామచంద్రరావు, చీఫ్ పేట్రన్, స్టీల్ ఐఎన్‌టీయూసీ
సొంత గనులు కేటాయిస్తేనే..
ప్యాకేజీ వల్ల తాత్కాలిక ఉపశమనం మాత్రమే. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయిస్తేనే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వీఆర్‌ఎస్‌ను ఉపసంహరించుకోవాలి. సొంత గనులు ఇవ్వడంతో పాటు సెయిల్‌లో విలీనం చేయాలి. – యు.రామస్వామి, ప్రధాన కార్యదర్శి, స్టీల్ సీఐటీయూ
అంతా బూటకం..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీతో సమస్య పరిష్కారం అయిపోతుందని ప్రకటన చేయడం బూటకం. దేశంలో అన్ని స్టీల్‌ప్లాంట్లకు సొంత గనులు ఉన్నప్పుడు విశాఖ ప్లాంట్‌కు మాత్రం ఎందుకు ఇవ్వరు? స్టీల్‌ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడవాలంటే సొంత గనులు కేటాయించి ప్రైవేటీకరణ చర్యలు ఉపసంహరించుకోవాలి. – సీహెచ్ నరసింగరావు, సిటూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment