విశాఖ ఉక్కుపై బాబు అండ్‌ కో యూటర్న్‌ | Chandrababu spoke to the media in reverse on 17th of last month about the Visakha Steel Plant | Sakshi
Sakshi News home page

విశాఖ ఉక్కుపై నాడు ప్రగల్భాలు.. నేడు బేల మాటలు

Published Thu, Oct 10 2024 5:39 AM | Last Updated on Thu, Oct 10 2024 5:46 AM

Chandrababu spoke to the media in reverse on 17th of last month about the Visakha Steel Plant

ఎందాకైనా వెళ్లి పోరాడతామని నాడు బాబు, పవన్‌ శపథాలు, హామీలు

అఖిల పక్షం వేయాలని, అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్‌ 

ప్రైవేటీకరణను నిలవరించలేని జగన్‌ రాజీనామా చేయాలని గగ్గోలు

ప్రైవేటీకరణను గతంలో తానే అడ్డుకున్నానని, ఇప్పుడూ అడ్డుకుంటానన్న బాబు

కూటమి అభ్యర్థులను గెలిపిస్తే ఢిల్లీలో బలంగా మన వాణి వినిపిద్దామన్న పవన్‌

తీరా అధికారంలోకి వచ్చాక ఏ మాత్రం నిలువరించలేని వైనం

ఒకవైపు 4,800 మంది ఉద్యోగుల తొలగింపునకు యత్నాలు

500 మంది కార్మికుల డిప్యుటేషన్‌కు రంగం సిద్ధం.. ఉత్పత్తిలో కోత..రుణానికి 

నిబంధనల కొర్రీ.. మరోవైపు కార్మికుల జీతాల్లో, హెచ్‌ఆర్‌ఏ, విద్యుత్‌ బిల్లుల్లో కోత 

తాజా పరిణామాలపై నోరు మెదపక పోవడమే ఇందుకు నిదర్శనం

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో మాట్లాడతామని చంద్రబాబు సమర్థింపు 

సెయిల్‌లో విలీనానికి ఆ సంస్థ, కేంద్రం ఒప్పుకోవాలంటూ మెలిక

కార్మికులే కారణమంటూ జనసేన నేతల విమర్శలు.. ఖండించని పవన్‌

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఎన్నికల ముందు, ఆ తర్వాత ఒకవైపు చంద్రబాబు నాయుడు, మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ గురించి కోటలు దాటేలా మాటలు మాట్లాడారు. దానిని కాపాడుకునేందుకు ఎంత వరకైనా వెళతామని ఇద్దరూ హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం నాలుక మడతేశారు. నిర్భీతిగా మాట మార్చేస్తున్నారు. ‘ప్రైవేటీకరణను నిలవరించలేని జగన్‌.. రాజీనామా చెయ్యి’ అంటూ నాడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు డిమాండ్‌ చేశారు. తాము అధికారంలోకి వస్తే స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటానని ఎన్నికలకు ముందు ప్రజాగళం సభలో శపథం చేశారు. 

వాజపేయి హయాంలో స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోతే తానే అడ్డుకున్నానని, కేంద్రం నుంచి ఆర్థిక సాయం రాబట్టి ఫ్యాక్టరీని ఆదుకున్నామని.. ఇప్పుడూ కాపాడుకుంటామని గద్దె నెక్కిన కొత్తలో సెలవిచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారం యూని­యన్‌ నాయకులకూ మొన్న ఆగస్టులో అదే హామీ ఇచ్చారు. ‘విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం కానివ్వం. అసెంబ్లీలో తీర్మానం చేయాలి. వారంలో అఖిలపక్షం ఏర్పాటు చేయాలి. నాతో కలిసి రండి, ఢిల్లీకి తీసుకువెళ్తా. ఇక్కడ కూటమి అభ్యర్థిని గెలిపిస్తే ఢిల్లీలో మన వాణి బలంగా వినిపిద్దాం..’ అని ఎన్నికలకు ముందు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ బల్లగుద్ది చెప్పారు. 

5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీర్చాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరుతానని హామీ ఇచ్చారు. ఇన్ని మాటలు మాట్లాడిన ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌.. ఇప్పుడు మాట మార్చేశారు. పవన్‌ మౌన వ్రతం పాటిస్తుండగా.. చంద్రబాబు తన ఒక్కడి చేతుల్లో లేదంటూ సన్నా­యి నొక్కులు నొక్కుతున్నారు. ‘వైఎస్సార్‌ ప్రభుత్వ హయాంలో స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంపై ఢిల్లీ వెళదామని నేను పిలిస్తే స్పందించారా? ప్రైవేటు ఉక్కు కర్మాగారాలన్నీ లాభాల బాటలో నడుస్తుంటే.. విశాఖ ఉక్కు కర్మాగారం ఇలా భ్రష్టు పట్టడానికి కారణమేంటో యాజమా­న్యం, సిబ్బంది ఆలోచించుకోవాలి’ అంటూ చంద్రబాబు గత నెల 17న మీడియాతో రివర్స్‌లో మాట్లాడారు. 
 
అప్పుడు మొత్తం పిక్చర్‌ తెలీదట!
‘‘విశాఖ స్టీలు ప్లాంటును ఏ విధంగా రివైవ్‌ చేసుకోవాలి? ఏ విధంగా ట్రాక్‌లో పెట్టాలి.. ఏ విధంగా చేస్తే ముందుకు వెళుతుంది.. అనే అంశాల గురించి సీరియస్‌గా ఆలోచిస్తున్నాం. సెయిల్‌­లో విలీనం చేయాలనేది ఒక ప్రత్యామ్నాయం. అందుకు సెయిల్, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకో­వాలి. అదొక సమస్య. ఎన్‌ఎండీసీకి భూమి ఇస్తే.. వారు డబ్బులిచ్చినా అది తాత్కాలికం. ఆ డబ్బులు చాలవు. రూ.వెయ్యి కోట్లు, రెండు వేల కోట్లతో రివైవ్‌ కాదు. దీనికి ఒక పూర్తి ప్యాకేజీ ఇవ్వాలి. ముడి సరుకు కూడా లేదు. ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు మేం ఆలోచిస్తున్నాం. మొత్తం మీద ఫెయిర్‌గా డిస్కస్‌ చేయకపోతే ఏం జరుగుతుందో నాకైతే తెలీదు. 

ఎవరో ఒకరు.. కేంద్రమో, రాష్ట్ర ప్రభుత్వమో, బ్యాంకులో ఎవరో ఒకరు డబ్బులు ఇవ్వాలి. మేనిఫెస్టోలో విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణను ఆపేస్తాం అని చెప్పాం. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు మొత్తం పిక్చర్‌ ఉండదు. వెరీ క్లియర్‌. అందరూ గుర్తు పెట్టుకోవాలి’’ అని తాజాగా అమరావతిలో జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఉన్న సమాచారంతో హామీ లిచ్చామని, ఇప్పుడు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని దాటవేసే ప్రయత్నం చేశారు. 

పైగా సెయిల్‌లో విలీనానికి సెయిల్, కేంద్రం ఒప్పుకోవాలని.. ఇది తమ చేతుల్లో లేదనే రీతిలో వ్యాఖ్యానించారు. తద్వారా విశాఖ స్టీలు ప్లాంటుపై ఎన్నికల ముందు, ఆ తర్వాత కూడా కొద్ది రోజులు మాట్లాడిన మాటలు అంతా హంబక్‌ అని చంద్రబాబు తాజా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

అసెంబ్లీ తీర్మానంతో వైఎస్సార్‌సీపీ అడ్డుకునే యత్నం 
»  స్టీల్‌ ప్లాంట్‌ను దివాలా పరిశ్రమగా చూపించే కుట్ర జరుగుతోంది. 2021లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించడానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. వెంటనే అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కమిటీ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్లాంట్‌ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రానికి లేఖలు రాశారు. 

»    అంతటితో ఆగకుండా అసెంబ్లీలో సైతం ప్రైవే­టీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. విశాఖలో భారీ బహిరంగ సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చిన సం­దర్భంలో కూడా వేదికపై లక్షల మంది ప్రజ­ల సమక్షంలో ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయా­­న్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

»   రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆశీల్‌మెట్ట జంక్ష¯న్‌ నుంచి కూర్మన్నపాలెం జంక్ష¯Œన్‌ వరకు అప్పటి ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో భారీ పాదయాత్ర చేపట్టారు. స్టీలు ప్లాంట్‌ ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ నుంచి లభించిన మద్దతు కార్మికుల్లో ధైర్యాన్ని పెంచింది. ఫలితంగా కేంద్రం దూకుడుగా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఎన్నికలకు వెళ్లింది.

»  ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు స్టీలు ప్లాంటులో ఇంత జరుగుతున్నా... ఏ ఒక్క రోజూ నోరు విప్పి మాట్లాడేందుకు సాహసించ లేదు. పైగా జనసేన నేతలు నెపమంతా కార్మికులపై నెట్టేందుకు యత్నించారు. సీఎం చంద్రబాబు మరో అడుగు ముందుకు వేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఉన్న సమాచారంతో మాట్లాడతామని, ఇప్పుడు అంత సులువు­కాదంటూ చావు కబురు చల్లగా చెప్పారు.  

రుణం పేరుతో నిబంధనలు, బెనిఫిట్స్‌లో కోత  
»     స్టీల్‌ ప్లాంట్‌ కోసం రూ.12 వేల కోట్ల బెయిల్‌ అవుట్‌ ప్యాకేజీ కావాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే, కేంద్రం రూ.2 వేల కోట్ల రుణాన్ని (ఎస్‌బీఐ ద్వారా) అందిస్తున్నట్టు పైకి నటిస్తూ.. ఈ నిధులను జీఎస్టీ, పీఎఫ్‌ బకాయిలు, ప్రభుత్వ లెవీ, వెండర్స్‌కు చెల్లింపులు చేయాలని నిబంధనలు విధించింది. ఇతరత్రా అంశాలకు ఖర్చు చేస్తే.. ఆ నిధుల్ని ఫ్రీజ్‌ చెయ్యాలంటూ ఆదేశించింది. 

»   వాస్తవానికి స్టీలు ప్లాంటు పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యం 7.9 మిలియన్‌ టన్నులు. పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు 30 వేల మంది కార్మికులు ఉండాలి. ఒకవైపు సెయిల్‌లో 19 మిలియ¯Œన్‌ టన్నుల సామర్థ్యానికి లక్ష మంది కాంట్రాక్ట్‌ కార్మికులు పని చేస్తున్నారు. ఇందుకు భిన్నంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఉన్న 14 వేల మందిలోనే 4 వేల మందిని తొలగించేందుకు ప్రయత్నించడాన్ని కార్మిక సంఘాలు గట్టిగా ప్రతిఘటించాయి.

»    దీంతో రానున్న రోజుల్లో విడతలు విడతలుగా కార్మికులను తొలగించేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్‌లోనూ భారీగా కోతలకు యాజమాన్యం దిగింది. గత ఆరు నెలలుగా ఉద్యోగులు జీతం ఒకేసారి అందుకున్న దాఖలాలు లేవు. సగం జీతం కూడా నెలాఖరున చెల్లిస్తుండడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. సకాలంలో వాయిదాలు చెల్లించ లేక డీఫాల్టర్లుగా మారుతున్నారు. 

ఉద్యోగుల ఆర్థిక అవసరాలకు అండగా ఉండే పీఎఫ్, త్రిఫ్ట్‌ సొసైటీలకు యాజమాన్యం సకాలంలో నగదు చెల్లించడం లేదు. టౌన్‌షిప్‌లో నివసిస్తున్న కార్మికులకు విద్యుత్‌ చార్జీల పెంపు, పీఆర్‌పీ, ఈఎల్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ తాత్కాలికంగా నిలుపుదల వంటి అనేక చర్యలకు దిగింది. వీటన్నింటిపై ఏ ఒక్క రోజు కూడా కూటమి నేతలు కార్మికుల పక్షాన నిలబడి మాట్లాడిన దాఖలాలు లేవు.

జగన్‌ చెప్పిందే నిజమవుతోంది.. 
వాస్తవానికి ఎన్నికల ముందు గాజువాకలో జరిగిన సభలో అప్పటి ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ... గాజువాక అసెంబ్లీ, విశాఖ పార్లమెంటు సీట్లల్లో టీడీపీకి ఓటు వేయడం అంటే స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణకు ఓటు వేయడమేనని స్పష్టంగా తేల్చి చెప్పారు. 

రాష్ట్రంలో గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ వచ్చి గెలుపొందారు. ఆ తర్వాత స్టీలు ప్లాంట్‌ ఉన్న నియోజకవర్గంలో తమకు వచ్చిన భారీ మెజార్టీ ధైర్యంతోనే ప్రైవేటీకరణ ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయని అర్థమవుతోంది. ప్రతి రోజూ ఏదో ఒక సమస్యతో కార్మికులు, ఉద్యోగులు పోరుబాట పడుతున్నప్పటికీ కూటమి నేతలెవ్వరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదు.

పరిస్థితి తారుమారు
»   కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్‌ ప్లాంట్‌ పరిస్థితి తారుమారైందని స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగుదేశం మద్దతుతో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ ఎన్డీయే సర్కారు వరుస నిర్ణయాలతో స్టీల్‌ ప్లాంట్‌ను దివాలా దిశగా తీసుకెళ్తోంది. ఇందుకు రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా సహ­కరిస్తోంది. ముందుగా మూల ధనం సమీ­కరణ పేరుతో ఆస్తుల వేలానికి సిద్ధమైంది. 

»  ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై నగరాల్లో ఉన్న ఖరీదైన భవనాలు, స్టాక్‌ యార్డుల విక్రయానికి రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మొత్తం ఆస్తుల మార్కెట్‌ విలువ రూ.476.18 కోట్లుగా లెక్కగట్టింది. ఆ వెంటనే ఉత్పిత్తిని తగ్గించే కుట్రలో భాగంగా రెండు నెలల క్రితం బ్లాస్ట్‌ ఫర్నేస్‌–1ను మూసివేసింది. 

»  స్టీల్‌ ప్లాంట్‌కు ఏటా 73 లక్షల టన్నుల స్టీల్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. కానీ సంస్థ నిర్వీర్యం చేయడానికి బ్లాస్ట్‌ ఫర్నేస్‌–1ను మూసేసిన కూటమి ప్రభుత్వం.. గత నెలలో బొగ్గు కొరతను కారణంగా చూపిస్తూ... బ్లాస్ట్‌ ఫర్నేస్‌–3ని బ్లోడౌ¯న్‌ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం బ్లాస్ట్‌ ఫర్నేస్‌–2 ద్వారా మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. సాధారణంగా ఒక్కో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ నుంచి రోజుకు 7 వేల టన్నుల ఉత్పత్తికి అవకాశమున్నప్పటికీ.. బీఎస్‌–2 ద్వారా కేవలం 4 నుంచి 5 వేల టన్నులు స్టీల్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు.

»    మరో వైపు సుమారు 4 వేల మంది ఉద్యోగులను వీఆర్‌ఎస్‌ పేరుతో ఇంటికి పంపించడానికి రూ.1,261 కోట్లు కేటాయించింది. రాత్రికి రాత్రి రేపటి నుంచి ఉద్యోగాల్లోకి రావద్దంటూ కార్మికులకు కబురు పంపింది. అయితే, కార్మికుల నుంచి వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా స్టీలు ప్లాంటు యాజమాన్యం వెనక్కు తగ్గింది. మరోవైపు 500 మంది ప్లాంట్‌ అధికారులను ఛత్తీస్‌గఢ్‌లోని నగర్‌నార్‌ స్టీల్‌ ప్లాంటుకు డిప్యుటేషన్‌పై పంపాలని తీర్మానించారు. వీరితో పాటు 25 శాతం మంది సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిని తగ్గించాలని నిర్ణయించారు. 

»   మరోవైపు జనసేన నేత బొలిశెట్టి సత్య నోటి దురుసుతో అసలు ప్రైవేటీకరణకు కారణం కార్మికులే అని నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఆ వ్యాఖ్యలను ఆ పార్టీకి చెందిన ఏ ఒక్కరూ ఖండించలేదు. పైగా పవన్‌ కళ్యాణ్‌ మౌనం కాస్తా ఇదే తమ పార్టీ స్టాండ్‌ అనే రీతిలో ప్రజలకు అర్థమవుతోంది.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement