
విశాఖ: స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె ఉద్రిక్తతలకు దారి తీసింది. తమను విధుల్లోకి తీసుకోకపోతే నిరసనకు దిగుతామని రెండు రోజుల క్రితం హెచ్చరించిన కాంట్రాక్ట్ కార్మికులు.. దానిలో భాగంగానే ఈరోజు(శుక్రవారం) సమ్మెకు పూనుకున్నారు. రోడ్డుపైనే బైఠాయించిన కార్మికులు.. తమను తొలగిస్తే సహించబోమని హెచ్చరించారు. దీంతో కూర్మన్నపాలెం ఆర్చ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంట్రాక్ట్ కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాంట్రాక్ట్ కార్మికులను బలవంతంగా అరెస్ట్ చేశారు పోలీసులు.


చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఇప్పుడు ఎక్కడున్నారు?
‘కాంట్రాక్ట్ కార్మికులకు తొలగిస్తే సహించం. తొలగించిన వారిని వెంటనే విధుల్లో తీసుకోవాలి. స్టీల్ ప్లాంట్ ను ఆదుకుంటామన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎక్కడున్నారు. మాతో మీకు అవసరం తీరిపోయింది కాబట్టి నోరు మెదపడం లేదా?, స్టీల్ ప్లాంట్ టెంట్ దగ్గరికి వచ్చి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మద్దతు తెలిపిన విషయాన్ని మర్చిపోయారా? , కార్మికుల కష్టాలు మీకు కనిపించడం లేదా?. త్వరలోనే నిరవధిక సమ్మెకు దిగుతాం’ అంటూ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరించారు కాంట్రాక్ట్ కార్మికులు.

