కొనుగోలుకు ఆర్టీసీ నిర్ణయం
అద్దె ప్రాతిపదికన కాకుండా సొంతంగా సమకూర్చుకోనున్న సంస్థ
‘మహాలక్ష్మి’రద్దీ నేపథ్యంలో చర్యలు
నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కొత్తగా 500 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ పథకం అమలులోకి రాకముందుతో పోలిస్తే ప్రస్తుతం బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య దాదాపు రెట్టింపైంది.
ఈ సంఖ్య 35 లక్షల నుంచి 66 లక్షలకు పెరిగింది. దీంతో బస్సులు చాలక ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు కొత్తగా 500 బస్సులు కొనుగోలు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదించబోతోంది.
కనీసం 4 వేలు అవసరం..
ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో వంద శాతం దాటుతోంది. ప్రత్యేక సందర్భాల్లో అది 106 శాతాన్ని మించుతోంది. ఇప్పటికే చాలా బస్సులు పాతవై మరిన్ని ఇబ్బందులు వస్తున్నాయి. పాత బస్సుల్లో దాదాపు వేయి వరకు తొలగించాల్సి ఉంది. దీంతో ఇప్పటికిప్పుడు నాలుగు వేల బస్సుల అవసరం ఉంది. కానీ అన్ని సమకూర్చుకునే పరిస్థితి ఆర్టీసీకి లేదు. దీంతో కొన్నికొన్ని బస్సులు పెంచుకుంటూపోవాలని సంస్థ భావిస్తోంది.
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నగరంలో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే తిరిగేలా చూడాలని ఆదేశించటంతో ఆమేరకు చర్యలు ప్రారంభించింది. కేంద్రప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ బస్సులు కోరుతోంది. 2800బస్సులు మంజూరు చేయాలని దరఖాస్తు చేసింది. అవన్నీ సబ్సిడీ ద్వారా సరఫరా అవుతాయి. ఆర్టీసీ సొంతంగా వాటిని కొనదు.
జీసీసీ పద్ధతిలో ప్రైవేటు సంస్థలు వాటిని టెండర్ల ద్వారా పొంది ఆర్టీసీకి అద్దెకిస్తాయి. అవి దశలవారీగా ఆర్టీసీకి చేరుతాయి. అవి వచ్చే కొద్దీ వాటి సంఖ్యకు సమానంగా నగరంలోని డీజిల్ బస్సులను జిల్లాలకు తరలిస్తారు. జిల్లాలకు తరలే బస్సుల్లో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులే ఎక్కువగా ఉంటాయి.
వాటిని ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సులుగా మార్పుచేసి జిల్లాల్లో వాడతారు. దీనివల్ల కొంత కొరత తీరుతుంది. ఇక సొంతంగా కొత్త బస్సులు 500 కొంటే చాలావరకు సమస్య పరిష్కారమవుతుందని సంస్థ భావిస్తోంది. వాటి కొనుగోలుకు సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరబోతోంది.
ఆ సిబ్బంది కొత్త బస్సులకు...
హైదరాబాద్‌లో తిరుగుతున్న డీజిల్ బస్సులను జిల్లాలకు తరలించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకోవాలన్న నిర్ణయంతో పెద్ద సంఖ్యలో సిబ్బంది మిగిలిపోనున్నారు. అద్దె బస్సులకు డ్రైవర్లు, మెకానిక్‌లు ప్రైవేటు వారే ఉండనున్నందున ఆర్టీసీ సిబ్బంది జిల్లాలకు తరలాల్సి ఉంటుంది. జిల్లాల్లో ఉన్న ఖాళీలు భర్తీ కాగా, మిగతావారు అదనంగా మారతారు.
ఇప్పుడు కొత్తగా కొనే ఐదొందల బస్సులకు దాదాపు 1,300 మంది సిబ్బంది అవసరమవుతారు. ఆ అదనపు సిబ్బందిని ఈ బస్సులకు వినియోగించుకోవటం ద్వారా సర్దుబాటు చేస్తారు. ఇక మరో 3 వేల మందిని కొత్తగా నియమించుకునే ప్రతిపాదన పెండింగులో ఉంది. అలా వచ్చే వారిని కూడా ఈ కొత్త బస్సులతోపాటు ఇతరత్రా ఖాళీల్లో భర్తీ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment