
న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు శుక్రవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా రవాణా సేవలపై ప్రభావం పడుతుందని అంచనా. అయితే ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు, పాండిచ్చేరిలో మాత్రం భారత్ బంద్ లేదు. సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటన ప్రకారం శుక్రవారం ఉదయం ఆరుగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు దేశవ్యాప్తం గా బంద్ నిర్వహిస్తారు. రవాణా సేవలను బంద్ సందర్భంగా అడ్డుకుంటామని రైతు నేత బల్‌బీర్ సింగ్ చెప్పారు. పలు ట్రేడ్ యూనియన్లు, సంఘా లు తమ బంద్‌కు మద్దతు తెలిపాయన్నారు. అంబులెన్స్, ఫైర్ వంటి ఎమర్జెన్సీ సేవలను మాత్రం అడ్డుకోమని తెలిపారు. వ్యవసాయ చట్టాలపై తాము చేస్తున్న ఆందోళన ఆ తేదీకి నాలుగు నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో భారత్ బంద్ నిర్వహించాలని నిర్ణయించినట్లు రైతు నేత బూటా సింగ్ తెలిపారు. పాలు, కూరల రవాణాను కూడా అడ్డుకుంటామని కిసాన్ మోర్చా నేత దర్శన్ పాల్ చెప్పారు.
మేం పాల్గొనం
రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్‌లో తాము పాల్గొనమని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య ప్రకటించింది. శుక్రవారం మార్కెట్లు తెరిచే ఉంచుతామని సమాఖ్య పేర్కొంది. చర్చల ద్వారానే చట్టాలపై ప్రతిష్ఠంభన వీడుతుందని, అందువల్ల సాగు చట్టాలపై చర్చలు జరపాలని సమాఖ్య కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్‌వాల్ అభిప్రాయపడ్డారు. అయితే కిసాన్ మోర్చా మాత్రం పలు యూనియన్లు, పార్టీలు, సంఘాలు తమకు మద్దతు ఇచ్చినట్లు చెబుతోంది.బంద్ ప్రభావం పంజాబ్, హర్యానాల్లో మాత్రమే ఎక్కువగా ఉంటుందని కిసాన్ మోర్చా సీనియర్ సభ్యుడు అభిమన్యు కోహర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బంద్‌లో పాల్గొనాలని ట్రేడర్ల సమాఖ్యలకు రైతులు విజ్ఞప్తి చేశారని, సాగు చట్టాలు ట్రేడర్లపై కూడా పరోక్షంగా నెగెటివ్ ప్రభావం చూపుతాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment