Balbir Singh
-
విజయ సారథులు వీరే
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారిలో ఒక డాక్టర్, ఒక రిటైర్డ్ టీచర్, ఆర్మీలో పని చేసిన వ్యక్తి , ఢిల్లీ పోలీసు మాజీ కానిస్టేబుల్ ఇలా ఎందరో ఉన్నారు. ఏడాది పాటు ఉద్యమాన్ని సజీ వంగా నిలిపి ఉంచడానికి వీరంతా పాటుపడ్డారు. రాకేశ్ తికాయత్ భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి అయిన రాకేశ్ తికాయత్ ఉద్యమాన్ని తన భుజస్కంధాలపై మోశారు. ఒకప్పుడు ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ అయిన ఆయన కరకు ఖాకీలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఉద్యమం నీరుకారిపోతున్న సమయంలో ఉద్వేగభరిత ప్రసంగాలతో నిరసనకారుల్లో మళ్లీ ఉత్తేజాన్ని నింపారు. 52 ఏళ్ల వయసున్న తికాయత్ ప్రభుత్వంతో చర్చల్లోనూ కీలకపాత్ర పోషించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో నిరసనలు చేపడితే కేంద్రం దిగి వస్తుందన్న వ్యూహాన్ని రచించి ప్రభుత్వంలో కదలిక తెచ్చారు. దర్శన్పాల్ వృత్తిరీత్యా డాక్టర్ అయిన దర్శన్పాల్ దేశవ్యాప్తంగా రైతు సంఘాలను ఏకం చేశారు. 40 రైతు సంఘాలను ఒకే గూటికి తీసుకువచ్చి కిసాన్ ఏక్తా జిందాబాద్ నినాదంతో ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. అఖిల భారత సంఘర్‡్ష సమన్వయ కమిటీ సభ్యుడైన దర్శన్ పాల్ పంజాబ్ నుంచి ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్రలకు ఉద్యమాన్ని వ్యాప్తి చేయడంలో కీలకంగా వ్యవహరించారు. జోగిందర్ సింగ్ భారతీయ కిసాన్ యూనియన్ (ఉగ్రహాన్) అధ్యక్షుడు అయిన జోగిందర్ సింగ్ ఉగ్రహాన్ ఒకప్పుడు ఆర్మీలో పని చేశారు. రైతు సంఘాల్లో అత్యధికం సింఘూ సరిహద్దుల్లోనే ఉద్యమిస్తే టిక్రీలో ఉద్యమాన్ని జోగిందర్ సింగ్ ఒంటిచేత్తో నడిపించారు. రైతు నిరసనల్లో దూకుడు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్లారు. రైల్ రోకోలు, బీజేపీ నేతల ఘొరావ్లలో జోగిందర్ సింగ్ ఎప్పుడూ ముందుండేవారు. బల్బీర్ సింగ్ రాజేవాల్ భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధ్యక్షుడు అయిన బల్బీర్ సింగ్ రాజేవాల్ సూటిగా, సుత్తిలేకుండా మాట్లాడడంలో దిట్ట. 78 ఏళ్ల వయసున్న ఈ రైతు నాయకుడు కేంద్ర మంత్రులతో చర్చల సమయంలో తమ వాదనల్ని గట్టిగా వినిపించేవారు. అంతేకాదు రైతులు చేయాల్సిన నిరసనలపై బల్బీర్సింగే ప్రణాళికలు రచించి ముందుకి నడిపించారు. సుఖ్‌దేవ్ సింగ్ కొక్రికలన్ స్కూలు టీచర్‌గా పని చేసి రిటైర్ అయిన 71 ఏళ్ల సుఖ్‌దేవ్ సింగ్ పోలీసులతో ఘర్షణలు జరిగినప్పుడల్లా తానే ముందు ఉండేవారు. ఛలో ఢిల్లీ ఆందోళన సమయంలో పోలీసులకు ఎదురెళ్లి నిలుచున్న సాహసి. బీకేయూ, ఉగ్రహాన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సుఖ్‌దేవ్ సహ రైతులకు రక్షణగా ఎప్పుడూ తానే ముందుండేవారు. -
నేడే భారత్ బంద్
న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు శుక్రవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా రవాణా సేవలపై ప్రభావం పడుతుందని అంచనా. అయితే ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు, పాండిచ్చేరిలో మాత్రం భారత్ బంద్ లేదు. సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటన ప్రకారం శుక్రవారం ఉదయం ఆరుగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు దేశవ్యాప్తం గా బంద్ నిర్వహిస్తారు. రవాణా సేవలను బంద్ సందర్భంగా అడ్డుకుంటామని రైతు నేత బల్బీర్ సింగ్ చెప్పారు. పలు ట్రేడ్ యూనియన్లు, సంఘా లు తమ బంద్‌కు మద్దతు తెలిపాయన్నారు. అంబులెన్స్, ఫైర్ వంటి ఎమర్జెన్సీ సేవలను మాత్రం అడ్డుకోమని తెలిపారు. వ్యవసాయ చట్టాలపై తాము చేస్తున్న ఆందోళన ఆ తేదీకి నాలుగు నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో భారత్ బంద్ నిర్వహించాలని నిర్ణయించినట్లు రైతు నేత బూటా సింగ్ తెలిపారు. పాలు, కూరల రవాణాను కూడా అడ్డుకుంటామని కిసాన్ మోర్చా నేత దర్శన్ పాల్ చెప్పారు. మేం పాల్గొనం రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్‌లో తాము పాల్గొనమని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య ప్రకటించింది. శుక్రవారం మార్కెట్లు తెరిచే ఉంచుతామని సమాఖ్య పేర్కొంది. చర్చల ద్వారానే చట్టాలపై ప్రతిష్ఠంభన వీడుతుందని, అందువల్ల సాగు చట్టాలపై చర్చలు జరపాలని సమాఖ్య కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ అభిప్రాయపడ్డారు. అయితే కిసాన్ మోర్చా మాత్రం పలు యూనియన్లు, పార్టీలు, సంఘాలు తమకు మద్దతు ఇచ్చినట్లు చెబుతోంది.బంద్ ప్రభావం పంజాబ్, హర్యానాల్లో మాత్రమే ఎక్కువగా ఉంటుందని కిసాన్ మోర్చా సీనియర్ సభ్యుడు అభిమన్యు కోహర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బంద్‌లో పాల్గొనాలని ట్రేడర్ల సమాఖ్యలకు రైతులు విజ్ఞప్తి చేశారని, సాగు చట్టాలు ట్రేడర్లపై కూడా పరోక్షంగా నెగెటివ్ ప్రభావం చూపుతాయని చెప్పారు. -
ఆరోగ్యమంత్రికి కరోనా, రాహుల్‌తో కలిసి వేదిక
ఛంఢీఘర్: పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిద్ధుకు మంగళవారం కరోనా టెస్ట్ నిర్వహించారు. పరీక్షలలో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇటీవల సంగ్రూర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో వేదికను పంచుకున్నారు. బల్బీర్ సింగ్ సిద్ధుకు తేలికపాటి జ్వరం, గొంతు నొప్పి ఉండటంతో పరీక్షలు చేశామని మొహాలి సివిల్ సర్జన్ మంజిత్ సింగ్ తెలిపారు. ‘బల్బీర్ సింగ్ తన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆయనతో ఉన్న వ్యక్తులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు’ అని డాక్టర్ తెలిపారు. సంగ్రూర్‌లో సోమవారం నిర్వహించిన ఖేతి బచావోలో బల్బీర్ సింగ్ సిద్ధు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కేంద్రం చేసిన కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్, పంజాబ్ ప్రధాన కార్యదర్శి హరీష్ రావత్, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సునీల్ జఖర్, మంత్రులు బల్బీర్ సిద్ధూ, విజయ్ ఇందర్ సింగ్లా, రానా గుర్మిత్ సోధి, రాజ్యసభ ఎంపీ దీపేందర్ హుడా తదితరులు పాల్గొన్నారు. చదవండి: రైతులకు అన్యాయం జరగనివ్వం -
ఎట్టకేలకు ఆడి ఏ6 భారత మార్కెట్లోకి
సాక్షి, న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ 2020 మోడల్ ఏ6 సెడాన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న మిడ్-సైజ్ లగ్జరీ సెడాన్ విభాగంలో 8వ జనరేషన్ ఆడి ఏ 6ను గురువారం ఆవిష్కరించింది. భారత క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆడీ ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ థిల్లాన్‌తో కలిసి ఈ కారును విడుదల చేశారు. దీని ప్రారంభ ధరను రూ. 54.20 లక్షలు’ఎక్స్‌షోరూం)గా హై ఎండ్ వెర్షన్ ధర రూ. 59.20 లక్షలుగా ఉండనుంది. ప్రీమియం ప్లస్, టెక్నాలజీ అనే రెండు వేరియంట్లలో ఈ కారు లభిస్తుంది. పూర్తిగా అప్‌గ్రేడ్ చేసిన స్టైలింగ్, మెరుగైన ఇంటీరియర్‌తో, వెనుక భాగంలో ఎక్కువ స్పేస్ తదితర మార్పులతో సరికొత్తగా దీన్ని తీసుకొచ్చింది. ఆడీ ఏ6 ప్రధాన ఫీచర్లు : 2.0 లీటర్ల టీఎఫ్ఎస్ఐ, బీఎస్-6 పెట్రోల్ ఇంజిన్, 240 బీహెచ్పీ శక్తిని, 370 ఎన్ఎం టార్క్, 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేరుబాక్స్, ,ఎనిమిది ఎయిర్‌బ్యాగులు, ఇంటీరియర్‌గా ట్విన్ టచ్ స్ర్కీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఏబీఎస్, ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్, ఈఎస్పీ, పార్కింగ్ సెన్సర్స్, 360 డిగ్రీ కెమెరా వంటి అధునాతన సౌకర్యాలతో క్యాబిన్ తీర్చిదిద్దింది. కేవలం 6.8 సెకన్లలో కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కారు ముందు భాగంలో సింగిల్ ఫ్రేమ్ గ్రిల్, సరికొత్త ఎల్ఈడీ హెడ్ ల్యాంప్‌లను అమర్చారు. 18 అంగుళాల అలాయ్ వీల్స్, హ్యాండ్స్ ఫ్రీ పార్కింగ్ సదుపాయం, వర్చువల్ కాక్‌పిట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫోర్-జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, లైటింగ్ ప్యాకేజీ లాంటి ఆకర్షణీయమైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. డీజిల్ ఇంజిన్ కార్లకు స్వస్తి పలకాలనే ఫోక్స్‌వ్యాగన్ నిర్ణయంలో ఈ కారు ప్రస్తుతం కేవలం పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే లభ్యం కానుందని ఆడీ తెలిపింది. అయితే భారత్‌లో మాత్రం డిమాండ్ ఆధారంగా భవిష్యత్తులో డీజిల్ ఇంజిన్ వేరియంట్‌ను విడుదలచేయనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇక మార్కెట్లో ప్రత్యర్థుల పోటీ విషయానికి వస్తే...మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్, బీఎండబ్ల్యూ 5 సిరీస్, వోల్వో ఎస్90, జాగ్వార్ ఎక్స్ఎఫ్తో ఈ కారు పోటీపడనుంది. -
పంద్రాగస్టుకి గోల్డ్
మెడల్ కాదు. ఒలింపిక్స్ వేదికపై దేశానికి ప్రాతినిథ్యం వహిస్తే చాలనుకునే ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. ఎందుకంటే... ఒలింపిక్స్‌లో వివిధ దేశాల తరపున అంతర్జాతీయ ఆటగాళ్లు పాల్గొంటారు. అలా 1948లో ఇంగ్లాండ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో ఇండియన్ హాకీ టీమ్ ఫస్ట్ గోల్డ్ మెడల్ కొట్టింది. పతకం నెగ్గిన సంతోషంతో దేశ పతాకం రెపరెపలాడింది. ఈ మధురమైన సంఘటనల ఆధారంగా హిందీలో రూపొందిన సినిమా ‘గోల్డ్’. ఇండియన్ హాకీ టీమ్ ప్లేయర్ బల్బీర్‌సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించారు. రీమా ఖగ్తీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మౌనీ రాయ్, కునాల్ కపూర్, అమిత్, వినీత్ కీలక పాత్రలు చేశారు. గతేడాది డిసెంబర్లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా చిత్రబృందం తెలిపింది. అంటే.. పంద్రాగస్టుకి ‘గోల్డ్’ అన్నమాట. గతేడాది ఇండిపెండెన్స్ వీక్‌లో ‘టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్‌కథ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అక్షయ్ ఈసారి ‘గోల్డ్’ సినిమాతో థియేటర్స్‌లోకి రానుండటం విశేషం. -
గోల్డ్‌తో హిట్!
ముంబైలోని ఓ స్పోర్ట్స్ గ్రౌండ్లోకి ఉదయం ఏడున్నర గంటలకు అడుగుపెట్టారు హీరో అక్షయ్‌కుమార్. సాయంత్రం ఐదున్నర వరకు అక్కడే ఉన్నారట. ఏదైనా గేమ్ చూడ్డానికి వెళ్లి ఉంటారనకుంటే పొరపాటే. ఆడడానికి వెళ్లారు. గ్రౌండ్లో రెచ్చిపోయి ఆడడం మొదలుపెట్టారు. మరి.. గెలిచారా? అంటే.. చెప్పలేం. ఎందుకంటే సిల్వర్ స్క్రీన్‌పైనే చూడాలి. అక్షయ్‌కుమార్ హీరోగా దర్శకురాలు రీమా ఖగ్తి రూపొందిస్తున్న చిత్రం ‘గోల్డ్’. హాకీ ప్లేయర్ బల్బీర్‌సింగ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 1948 లండన్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన ప్లేయర్ బల్బీర్ సింగ్. రీసెంట్గా ఈ సినిమా సెకండ్ షెడ్యూల్‌ను ముంబైలో స్టార్ట్ చేశారు. సినిమాలో కీలకమైన రెయినీ సీక్వెన్స్‌ను షూట్ చేశారు. బల్బీర్ బెంగాలీ అనే విషయం తెలిసిందే. అందుకే స్పెషల్‌గా ఓ కోచ్‌ని పెట్టుకుని బెంగాలీ నేర్చుకుంటున్నారు అక్షయ్. అంతేకాదు.. క్యారెక్టర్లో పర్ఫెక్షన్ కోసం బెంగాలీ కల్చర్, కట్టుబొట్టులపై అక్షయ్ పట్టు సాధిస్తున్నారు. ఇందతా చూస్తుంటే అక్షయ్ సినిమాతో హిట్ గోల్ కొట్టడం పక్కా అని ఊహించవచ్చు. ఇంతకీ ఈ మ్యాచ్ రిలీజ్ డేట్ .. అదేనండీ సినిమా విడుదల ఎప్పుడంటే వచ్చే ఏడాది ఆగస్టులో. -
ఆ జవాను మానసిక స్థితి సరిగా లేదు
న్యూఢిల్లీ: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) జవాను జరిపిన కాల్పుల్లో నలుగురు సహచరులు మృతి చెందిన ఘటనకు సీఐఎస్ఎఫ్ అధికారుల నిర్లక్ష్యం కూడా ఓ కారణమని తెలుస్తోంది. కాల్పులు జరిపిన బల్బీర్ సింగ్ మానసిక పరిస్థితి సరిగా లేదని, దీనికోసం సైకియాట్రిక్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నట్లు వెల్లడైంది. బల్బీర్ తల్లి మాట్లాడుతూ.. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని అందరికీ తెలుసు అని అన్నారు. స్నేహితులు సైతం అతడు ప్రమాదకరమైన వ్యక్తి అని మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. గతంలో అతడి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యులు సీఐఎస్ఎఫ్ అధికారులకు వివరించినట్లు సమాచారం. గతంలో బొకారోలో విధులు నిర్వర్తించే సమయంలో సైతం బల్బీర్.. ఓ కారు డ్రైవర్‌ను చంపడానికి ప్రయత్నించాడని తెలుస్తోంది. బల్బీర్ మానసిక పరిస్థితి సరిగా లేకున్నా కూడా సీఐఎస్ఎఫ్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, అందువల్లనే నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బల్బీర్ జరిపిన కాల్పుల్లో హెడ్ కానిస్టేబుళ్లు బచ్చా శర్మ, అమర్నాథ్ మిశ్రాతో పాటు.. ఏఎస్ఐ జీఎస్ రామ్, హవల్దార్ అరవింద్ రామ్ మృతి చెందిన విషయం తెలిసిందే. -
స్వర్ణం నా చివరి కోరిక: బల్బీర్
చండీగఢ్: శ్రీజేశ్ నాయకత్వంలోని భారత హాకీ జట్టు ఒలింపిక్ పతకం సాధిస్తుందనే నమ్మకముందని హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. హాకీ జట్టు ఒలింపిక్స్ స్వర్ణం సాధిస్తే చూడాలనేదే తన చివరి కోరికని ఈ 92 ఏళ్ల మాజీ క్రీడాకారుడు పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చాక వరుసగా మూడు ఒలింపిక్స్‌లో (1948, 1952, 1956) పసిడిని సాధించిన హాకీ జట్టులో బల్బీర్ సభ్యుడు. అంతేకాకుండా భారత హాకీ జట్టుకు చీఫ్ కోచ్‌గా, మేనేజర్‌గా సేవలందించారు. -
వారు 160 కిమీ నదిని శుభ్రం చేశారు
చండీగఢ్: కాలుష్య కాసారంగా మారిన గంగా నదిని శుభ్రం చేయడానికి ప్రభుత్వం వందల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. అదే పంజాబ్‌కు చెందిన ఎకో బాబాగా గుర్తింపు పొందిన ప్రముఖ పర్యావరణవేత్త బల్బీర్ సింగ్, ప్రభుత్వం నుంచి ఒక్క నయా పైసా ఆశించకుండా ఓ నదిని 160 కిలీమీటర్ల మేర శుభ్రం చేశారు. పంజాబ్ రాష్ట్రంలోని దోవ్బా ప్రాంతం గుండా ప్రవహిస్తున్న కాలి బెయిన్ నది పారిశ్రామిక వ్యర్థాలు, ప్రజలు వేసిన చెత్తా చెదారంతో పూర్తిగా కలుషితమై పోయింది. నదీ ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడడంతో పలు చోట్ల నది ఎండిపోయి పక్కనున్న పొలాలకు నీటి కరవు కూడా ఏర్పడింది. ఈ పరిస్థితిని ప్రత్యక్షంగా గమనించిన ఎకో బాబా నదిని శుభ్రం చేయడానికి ఏదో ఒకటి చేయాలనుకున్నారు. నది పరివాహక ప్రాంతంలోఉన్న 24 గ్రామాలకు వెళ్లారు. ప్రజలందరికి నదిని శుభ్రం చేసుకోవాల్సిన అవసరాన్ని, పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను విడమర్చి చెప్పారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ప్రతి గ్రామం నుంచి కొంత మంది స్వచ్ఛంద సేవకులను ఎంపిక చేసుకున్నారు. ఆయా గ్రామాల నుంచి విరాళాలు కూడా సేకరించి నది శుభ్రానికి అవసరమైన పలుగు, పారతోపాటు అందుబాటులో ఉన్న ఇతర పరికరాలను కూడా కొనుగోలు చేశారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాలంటీర్లతో కలసి నదిలోకి దిగారు. నదికి అడ్డంగా పెరుగుతున్న పిచ్చి మొక్కలను, నీటిలో పెరుగుతున్న గుర్రపు డెక్కను ముందుగా తొలగించారు. అనంతరం నదిలో పూడిక తీశారు. నది గట్లను పటిష్టం చేశారు. నదికి గట్లను కట్టి వాటిని అందంగా తీర్చిదిద్దారు. నది పొడవున ఒడ్డున అందమైన మొక్కలను పెంచారు. ఇలా ఆయన యజ్ఞం నదిలో 160 కిలోమీటర్ల వరకు సాగింది. పారిశ్రామిక వ్యర్థాలు కలువ కుండా చర్యలు తీసుకున్నారు. నదిలో చెత్తా చెదారం వేయకుండా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. పాడుపడిన నదికాస్త ఇప్పుడు గుర్తుపట్ట రాకుండా మారిపోయింది. సుందర వనాల మధ్య అందంగా పారుతున్న సెలయేరులా మారిపోయింది. గత కొన్నేళ్లు నీటి చుక్క కూడా దక్కని పొలాలకు ఇప్పుడు నీరు దండిగా పారుతోంది. నదిని చూసి ప్రకృతి ఆరాధాకులు కూడా ముచ్చట పడుతున్నారు. ప్రభుత్వాలు చేయలేని పనిని ఒక్క ఎకో బాబా చేసి చూపించారు. -
కొడుకు ఆకాశానికి ఎదిగినా... నాన్న నేలమీదే!
కొడుకు గొప్పగా చరిత్రకెక్కాడు...కాసుల వర్షం కురిపించే క్రీడలో అవకాశం సాధించి భారత్ దృష్టిని ఆకర్షించాడు. ఈ ఘనతతో అతని కుటుంబం దర్జాగా బతికేయొచ్చు. బల్లే బల్లే అని భాంగ్రా చేయడం కోసం కాలు కదపడం తప్ప... ఇల్లు గడవడం కోసం అడుగు తీసి అడుగు వేయాల్సిన పని లేదు. కానీ బాస్కెట్‌బాల్ స్టార్ సత్నామ్ సింగ్ కన్నవారు మాత్రం కొత్తగా వచ్చిన సిరి గురించి ఆలోచించడం లేదు. తమవాడి ఘనతకు ఒక వైపు మురిసిపోతూ... మరో వైపు తమకు అలవాటైన రీతిలో ‘సాగు’తో సాగిపోతున్నారు! పై చిత్రంలో గేదెల కొట్టంలో సీరియస్‌గా పని చేసుకుంటున్న వ్యక్తే సత్నామ్ తండ్రి బల్బీర్ సింగ్. నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా ఆయన కుమారుడి పేరు మార్మోగిపోతోంది. ‘భారత్‌లో బాస్కెట్‌బాల్‌ను పత్రికల మొదటిపేజీకి తెచ్చిన ఘనుడు’ అంటూ బీబీసీ ప్రశంసించింది. ఓవైపు ఇంత సందడి సాగుతున్నా... బల్బీర్ తన పనిని మాత్రం మానలేదు. భార్య సుఖ్వీందర్, కూతురు సరబ్జోత్, మరో కొడుకు బియాంత్ తోడుగా బాగా బిజీ అయిపోయాడు. గేదెలకు మేత వేయడం, పాలు పితికి వాటిని ఊర్లోని డెయిరీకి పంపడం సహా ఆయన టైమ్ టేబుల్ ఏ మాత్రం మారలేదు. కనీసం సంబరాల కోసమైనా విశ్రాంతి పేరు చెప్పి కూర్చోలేదు. ‘మా ఊళ్లో అందరూ చేసే పనే నేనూ చేస్తున్నాను. ఇందులో తప్పేమీ లేదు. దేవుడి దయ వల్ల మావాడు ఇంత గొప్పవాడు అయ్యాడు. లేదంటే అతనూ ఇక్కడే, ఇదే పని చేసేవాడేమో. కాబట్టి కొడుకు అందరికన్నా మిన్నగా ఏదో సాధించాడని కాలిపై కాలు వేసుకొని కూర్చోలేను’ అని బల్బీర్ ఒకింత గర్వంగా చెబుతున్నారు. ఇంటర్వ్యూ అడిగితే... ‘మీరు కాస్త ఇక్కడ కూర్చోండి... గేదెకు మేత వేసి వస్తాను’ అంటూ వెళ్లిపోయారు..! ఆయనే కావాల్సిందట! సత్నామ్ సింగ్ ఎత్తు 7 అడుగుల 2 అంగుళాలు. అతని తండ్రి ఎత్తు మరో 2 అంగుళాలు ఎక్కువే! 7.4 అడుగుల బల్బీర్ సింగ్ తానూ ఒకప్పుడు బాస్కెట్‌బాల్ ఆడాలని కలగన్నారు. అయితే సత్నామ్ తాత మాత్రం ‘ఆటా లేదు బంతీ లేదు’ అంటూ పొలం వెంట పరుగు పెట్టించారట. దాంతో బల్బీర్కు మళ్లీ అలాంటి ఆలోచనే రాలేదు. కానీ కొడుకును చూశాక ఆయనకు మళ్లీ ఆట గుర్తుకొచ్చింది. ఈ సారి బల్బీర్ తన తండ్రిలాంటి తప్పు చేయలేదు. నీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చాడు... సత్నామ్‌ను స్టార్‌ను చేసేదాకా పట్టు వదల్లేదు. -
బల్బీర్ సింగ్‌కు జీవిత సాఫల్య పురస్కారం
న్యూఢిల్లీ: తొలిసారిగా ప్రవేశపెట్టిన హాకీ ఇండియా అవార్డుల్లో బల్బీర్ సింగ్ సీనియర్‌కు మేజర్ ధ్యాన్‌చంద్ జీవితకాల సాఫల్య పురస్కారం అందించారు. శనివారం ఈ అవార్డుల కార్యక్రమం జరిగింది. 90 ఏళ్ల బల్బీర్కు ట్రోఫీతో పాటు రూ. 30 లక్షల నగదును అందించారు. 1948 నుంచి 56 వరకు జరిగిన ఒలింపిక్స్‌లో స్వర్ణాలు సాధించిన హాకీ జట్టులో బల్బీర్ సభ్యుడు. 1956 ఒలింపిక్స్ ఫైనల్లో ఆయన చేసిన ఐదు గోల్స్ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. అలాగే పురుషుల విభాగంలో ఉత్తమ ఆటగాడిగా బీరేంద్ర లక్రా.. మహిళల్లో వందనా కటారియా అవార్డులను గెలుచుకున్నారు. వీరికి రూ.25 లక్షల చొప్పున నగదును అందించారు. పీఆర్ శ్రీజేష్ (ఉత్తమ గోల్‌కీపర్), దీపికా (ఉత్తమ డిఫెండర్), మన్‌ప్రీత్‌సింగ్ (ఉత్తమ మిడ్‌ఫీల్డర్), ఆకాశ్‌దీప్‌సింగ్ (ఉత్త మ ఫార్వర్డ్) తదితరులు అవార్డులు గెలుచుకున్న వారిలో ఉన్నారు. -
లివింగ్ లెజెండ్
హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ సీనియర్ హాకీలో దిగ్గజమంటే అందరికీ గుర్తుకొచ్చేది మేజర్ ధ్యాన్‌చంద్.. భారత హాకీపై అంతగా తనదైన ముద్రవేశారు. అయితే ధ్యాన్‌చంద్ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు పొందిన వారు మరొకరు ఉన్నారు. ఆయనే ట్రిపుల్ ఒలింపియన్ బల్బీర్ సింగ్ సీనియర్. కెప్టెన్‌గా, ఆటగాడిగా, కోచ్‌గా ఇలా అన్నింటా తానేంటో నిరూపించుకున్నారు. లివింగ్ లెజెండ్‌గా అందరి మన్ననలు అందుకుంటున్న బల్బీర్... హాకీలో భవిష్యత్ తరాలకు స్ఫూర్తి ప్రదాత. భారత హాకీలో బల్బీర్ సింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సెంటర్ ఫార్వర్డ్‌గా ప్రత్యర్థి పాలిట సింహస్వప్నం. మైదానంలో పాదరసంలా కదులుతూ గోల్స్ వర్షం కురిపించడంలో దిట్ట. ఒలింపిక్స్‌లో మనకు తిరుగులేని రోజుల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడేలా చేయడంలో ఈ పంజాబీదే కీలకపాత్ర. 1928 నుంచి 1956 వరకు వరుసగా ఆరుసార్లు స్వర్ణం సాధిస్తే.. అందులో తాను పాల్గొన్న వరుస మూడు ఒలింపిక్స్‌లోనూ బల్బీర్ భారత్‌ను చాంపియన్‌గా నిలిపారు. ఒలింపిక్స్ రారాజు స్వతంత్ర భారతావనిలో మొదటిసారిగా ఒలింపిక్స్‌లో ఇండియాకు 1948లో తొలి బంగారు పతకం దక్కింది. అదికూడా లండన్ ఆతిథ్యమిచ్చిన ఒలింపిక్స్‌లోనే కావడం విశేషం. ఈ విజయంలో బల్బీర్ సింగ్‌ది కీలకపాత్ర. లండన్ ఒలింపిక్స్‌లో బల్బీర్ 8 గోల్స్ చేశారు. గ్రూప్ దశలో అర్జెంటీనాపై 6, ఫైనల్లో గ్రేట్ బ్రిటన్‌పై 2 గోల్స్ చేసి భారత్‌కు బంగారు పతకం అందించారు. ఇక 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లోనూ బల్బీర్ అంతకన్నా ఎక్కువ జోరును కనబర్చారు. క్వార్టర్స్, సెమీస్‌తో పాటు ఫైనల్లోనూ పాదరసంలా కదిలి జట్టును విజయపథాన నడిపించారు. మెల్బోర్న్ ఆతిథ్యమిచ్చిన 1956 ఒలింపిక్స్‌లో బల్బీర్ సింగ్ కెప్టెన్‌గా తానేంటో నిరూపించుకున్నారు. ఈ ఒలింపిక్స్‌లో ఆయన గ్రూప్ దశలో అద్భుత ఆటతీరును ప్రదర్శించారు. అప్ఘానిస్థాన్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో భారత్ 14 గోల్స్ చేయగా, అందులో ఆయన 5 గోల్స్ సాధించారు. ఆ తర్వాత సారథిగా జట్టును ముందుండి నడిపించారు. ఇక ఫైనల్లో పాకిస్థాన్‌పై గెలవడం ద్వారా స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. గిన్నిస్ బుక్‌లో గోల్స్ 1952 హెల్సింకి ఒలింపిక్స్ ఫైనల్లో బల్బీర్ సింగ్ ప్రత్యర్థి పాలిట సింహస్వప్నమయ్యారు. ఆయన కురిపించిన గోల్స్ వర్షం ఆతిథ్య నెదర్లాండ్స్‌ను, హాకీ అభిమానులను నోరెళ్లబెట్టేలా చేసింది. ఈ ఫైనల్లో హాకీ దిగ్గజం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు గోల్స్ సాధించి భారత మువ్వన్నెల జెండా రెపరెపలాడేలా చేశారు. ఫైనల్లో ఓ క్రీడాకారుడు ఐదు గోల్స్ చేయడం అదే తొలిసారి. 62 ఏళ్లుగా ఈ రికార్డు ఆయన పేరిటే కొనసాగుతోంది. ఈ ఘనతే బల్బీర్కు గిన్నిస్ బుక్‌లో చోటు దక్కేలా చేసింది. కోచ్ పాత్రలో... బల్బీర్ కెప్టెన్‌గా, ఆటగాడిగా మాత్రమే కాదు.. కోచ్‌గానూ మెరిశారు. 1971 ప్రపంచ కప్ హాకీలో భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. అప్పుడు భారత్ కాంస్య పతకం సాధించింది. అంతేకాదు 1975 ప్రపంచకప్‌లో చాంపియన్‌గా నిలిచిన సమయంలో బల్బీర్ జట్టుకు మేనేజర్‌గా ఉన్నారు. భారతరత్నపై ఆశ పద్మశ్రీ అవార్డు దక్కించుకున్న క్రీడాకారుల్లో మొదటివారు బల్బీర్. భారత్ స్వాతంత్య్రం సాధించిన తర్వాత వరుసగా మూడుసార్లు బంగారు పతకాలు సాధించడంలో ముఖ్యపాత్ర పోషించినందుకు ఆయనకు ఈ ఘనత దక్కింది. ఇప్పుడు ఆయన లక్ష్యం భారతరత్న. క్రికెట్ దిగ్గజం సచిన్‌కు భారతరత్న దక్కడంతో చాలా మంది క్రీడా దిగ్గజాలు ఇప్పుడు దేశ అత్యున్నత పౌర పురస్కారంపై ఆశలు పెంచుకుంటున్నారు. ఇందులో బల్బీర్ కూడా ఒకరు. ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్లు పెరిగిపోతున్న నేపథ్యంలో తనకూ ఈ పురస్కారం లభిస్తుందని ధీమాగా ఉన్నారు. 90 ఏళ్ల వయసున్న బల్బీర్ తన జీవిత కాలంలో ఈ పురస్కారం అందుకుంటానంటున్నారు.