చండీగఢ్: కాలుష్య కాసారంగా మారిన గంగా నదిని శుభ్రం చేయడానికి ప్రభుత్వం వందల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. అదే పంజాబ్‌కు చెందిన ఎకో బాబాగా గుర్తింపు పొందిన ప్రముఖ పర్యావరణవేత్త బల్బీర్ సింగ్, ప్రభుత్వం నుంచి ఒక్క నయా పైసా ఆశించకుండా ఓ నదిని 160 కిలీమీటర్ల మేర శుభ్రం చేశారు.
పంజాబ్ రాష్ట్రంలోని దోవ్‌బా ప్రాంతం గుండా ప్రవహిస్తున్న కాలి బెయిన్ నది పారిశ్రామిక వ్యర్థాలు, ప్రజలు వేసిన చెత్తా చెదారంతో పూర్తిగా కలుషితమై పోయింది. నదీ ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడడంతో పలు చోట్ల నది ఎండిపోయి పక్కనున్న పొలాలకు నీటి కరవు కూడా ఏర్పడింది. ఈ పరిస్థితిని ప్రత్యక్షంగా గమనించిన ఎకో బాబా నదిని శుభ్రం చేయడానికి ఏదో ఒకటి చేయాలనుకున్నారు.
నది పరివాహక ప్రాంతంలోఉన్న 24 గ్రామాలకు వెళ్లారు. ప్రజలందరికి నదిని శుభ్రం చేసుకోవాల్సిన అవసరాన్ని, పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను విడమర్చి చెప్పారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ప్రతి గ్రామం నుంచి కొంత మంది స్వచ్ఛంద సేవకులను ఎంపిక చేసుకున్నారు. ఆయా గ్రామాల నుంచి విరాళాలు కూడా సేకరించి నది శుభ్రానికి అవసరమైన పలుగు, పారతోపాటు అందుబాటులో ఉన్న ఇతర పరికరాలను కూడా కొనుగోలు చేశారు.
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాలంటీర్లతో కలసి నదిలోకి దిగారు. నదికి అడ్డంగా పెరుగుతున్న పిచ్చి మొక్కలను, నీటిలో పెరుగుతున్న గుర్రపు డెక్కను ముందుగా తొలగించారు. అనంతరం నదిలో పూడిక తీశారు. నది గట్లను పటిష్టం చేశారు. నదికి గట్లను కట్టి వాటిని అందంగా తీర్చిదిద్దారు. నది పొడవున ఒడ్డున అందమైన మొక్కలను పెంచారు. ఇలా ఆయన యజ్ఞం నదిలో 160 కిలోమీటర్ల వరకు సాగింది. పారిశ్రామిక వ్యర్థాలు కలువ కుండా చర్యలు తీసుకున్నారు. నదిలో చెత్తా చెదారం వేయకుండా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు.
పాడుపడిన నదికాస్త ఇప్పుడు గుర్తుపట్ట రాకుండా మారిపోయింది. సుందర వనాల మధ్య అందంగా పారుతున్న సెలయేరులా మారిపోయింది. గత కొన్నేళ్లు నీటి చుక్క కూడా దక్కని పొలాలకు ఇప్పుడు నీరు దండిగా పారుతోంది. నదిని చూసి ప్రకృతి ఆరాధాకులు కూడా ముచ్చట పడుతున్నారు. ప్రభుత్వాలు చేయలేని పనిని ఒక్క ఎకో బాబా చేసి చూపించారు.
వారు 160 కిమీ నదిని శుభ్రం చేశారు
Published Sat, Apr 9 2016 7:10 PM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM
Advertisement
Advertisement