కొడుకు ఆకాశానికి ఎదిగినా... నాన్న నేలమీదే!
కొడుకు గొప్పగా చరిత్రకెక్కాడు...కాసుల వర్షం కురిపించే క్రీడలో అవకాశం సాధించి భారత్ దృష్టిని ఆకర్షించాడు. ఈ ఘనతతో అతని కుటుంబం దర్జాగా బతికేయొచ్చు. బల్లే బల్లే అని భాంగ్రా చేయడం కోసం కాలు కదపడం తప్ప... ఇల్లు గడవడం కోసం అడుగు తీసి అడుగు వేయాల్సిన పని లేదు. కానీ బాస్కెట్‌బాల్ స్టార్ సత్నామ్ సింగ్ కన్నవారు మాత్రం కొత్తగా వచ్చిన సిరి గురించి ఆలోచించడం లేదు. తమవాడి ఘనతకు ఒక వైపు మురిసిపోతూ... మరో వైపు తమకు అలవాటైన రీతిలో ‘సాగు’తో సాగిపోతున్నారు!
పై చిత్రంలో గేదెల కొట్టంలో సీరియస్‌గా పని చేసుకుంటున్న వ్యక్తే సత్నామ్ తండ్రి బల్బీర్ సింగ్. నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా ఆయన కుమారుడి పేరు మార్మోగిపోతోంది. ‘భారత్‌లో బాస్కెట్‌బాల్‌ను పత్రికల మొదటిపేజీకి తెచ్చిన ఘనుడు’ అంటూ బీబీసీ ప్రశంసించింది. ఓవైపు ఇంత సందడి సాగుతున్నా... బల్బీర్ తన పనిని మాత్రం మానలేదు. భార్య సుఖ్వీందర్, కూతురు సరబ్‌జోత్, మరో కొడుకు బియాంత్ తోడుగా బాగా బిజీ అయిపోయాడు.
గేదెలకు మేత వేయడం, పాలు పితికి వాటిని ఊర్లోని డెయిరీకి పంపడం సహా ఆయన టైమ్ టేబుల్ ఏ మాత్రం మారలేదు. కనీసం సంబరాల కోసమైనా విశ్రాంతి పేరు చెప్పి కూర్చోలేదు. ‘మా ఊళ్లో అందరూ చేసే పనే నేనూ చేస్తున్నాను. ఇందులో తప్పేమీ లేదు. దేవుడి దయ వల్ల మావాడు ఇంత గొప్పవాడు అయ్యాడు. లేదంటే అతనూ ఇక్కడే, ఇదే పని చేసేవాడేమో. కాబట్టి కొడుకు అందరికన్నా మిన్నగా ఏదో సాధించాడని కాలిపై కాలు వేసుకొని కూర్చోలేను’ అని బల్బీర్ ఒకింత గర్వంగా చెబుతున్నారు. ఇంటర్వ్యూ అడిగితే... ‘మీరు కాస్త ఇక్కడ కూర్చోండి... గేదెకు మేత వేసి వస్తాను’ అంటూ వెళ్లిపోయారు..!
ఆయనే కావాల్సిందట!
సత్నామ్ సింగ్ ఎత్తు 7 అడుగుల 2 అంగుళాలు. అతని తండ్రి ఎత్తు మరో 2 అంగుళాలు ఎక్కువే! 7.4 అడుగుల బల్బీర్ సింగ్ తానూ ఒకప్పుడు బాస్కెట్‌బాల్ ఆడాలని కలగన్నారు. అయితే సత్నామ్ తాత మాత్రం ‘ఆటా లేదు బంతీ లేదు’ అంటూ పొలం వెంట పరుగు పెట్టించారట. దాంతో బల్బీర్‌కు మళ్లీ అలాంటి ఆలోచనే రాలేదు. కానీ కొడుకును చూశాక ఆయనకు మళ్లీ ఆట గుర్తుకొచ్చింది. ఈ సారి బల్బీర్ తన తండ్రిలాంటి తప్పు చేయలేదు. నీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చాడు... సత్నామ్‌ను స్టార్‌ను చేసేదాకా పట్టు వదల్లేదు.