
వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి వివరణ ఇవ్వకుండా కనీసం 20 మంది ఇమ్మిగ్రేషన్ కోర్టు న్యాయమూర్తులను తొలగించారు. అంతకు ముందు ఇంకా ప్రమాణ స్వీకారం చేయని 13 మంది న్యాయమూర్తులను, ఐదుగురు అసిస్టెంట్ చీఫ్ ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తులను నోటీసు లేకుండా తొలగించారని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ ఇంజనీర్స్ అధ్యక్షుడు మాథ్యూ బిగ్స్ తెలిపారు. ఇలా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారు. ఆ వ్యాజ్యాలపై ట్రంప్ స్పందించారు.
‘తన దేశాన్ని కాపాడుకునే వారు ఎన్నటికి రాజ్యాంగాన్ని ఉల్లంఘించరూ’ అంటూ ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే కొటేషన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.
పలు ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్‌ల జారీ
ఈ ఏడాది జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టారు. వెంటనే తన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకు కట్టుబడుతూ అమెరికా ఫస్ట్ నినాదంతో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమ వలసదారులను వెనక్కి పంపడం,పుట్టుక ద్వారా వచ్చే పౌరసత్వానికి ముగింపు,ఆరోగ్య సమస్యల దృష్ట్యా సరిహద్దుల్ని మూసివేయడం, అమెరికా- మెక్సికో మధ్యన గోడ నిర్మించడం, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీగా సుంకాలు విధించడం ఇలా మెరుపు వేగంతో పలు ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్‌లను జారీ చేశారు.
ట్రంప్‌కు వ్యతిరేకంగా వరుస వ్యాజ్యాలు
అయితే, వాటిల్లో అక్రమ వలసలపై కొనసాగుతున్న కఠిన చర్యలు, లింగమార్పిడి వ్యక్తులను అమెరికా సైన్యంలో పనిచేయకుండా నిషేధించే ప్రయత్నాలు, ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యంగా పలు నిర్ణయాలు తీసుకోవడం అంశాలపై వ్యతిరేకత ఎదురైంది. అమెరికా వ్యాప్తంగా పలువురు ట్రంప్ నిర్ణయాలను సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిల్లో, అక్రమ వలసలపై అణిచివేతపై పది వ్యాజ్యాలు, జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేయాలన్న ట్రంప్ ఆదేశాన్ని సవాలు చేసే ఏడు వ్యాజ్యాలు ఉన్నాయి. దీంతో ట్రంప్ న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దీంతో పాటు జనవరి 2021 కాపిటల్ అల్లర్లపై బ్యూరో దర్యాప్తులో పాల్గొన్న ఎఫ్‌బీఐ ఏజెంట్లు, సిబ్బంది పేర్లను వెల్లడించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై ట్రంప్‌పై పలు కేసులు నమోదయ్యాయని అమెరికా మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
నెపోలియన్‌ను ప్రస్తావిస్తూ
ఈ వరుస పరిణామలపై ట్రంప్ స్పందించారు. తన దేశాన్ని రక్షించేవాడు ఏ చట్టాన్ని ఉల్లంఘించడు అని ట్రూత్ సోషల్ యాప్‌లో పోస్ట్ చేసారు. తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకోవడానికి ముందు 1804లో నెపోలియన్ కోడ్ ఆఫ్ సివిల్ లాను రూపొందించిన ఫ్రెంచ్ సైనిక నాయకుడి ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే కొటేషన్ ప్రస్తావించారు. ఫ్రాన్స్‌లో తన నిరంకుశ పాలనను సమర్థిస్తూ, ఇది ప్రజల ఇష్టమని వ్యాఖ్యానించే సమయంలో నెపోలియన్ తరచూ ఈ కొటేషన్‌ను వినిపించేవారు.
కోర్టు తీర్పులకు తాను కట్టుబడి ఉంటానని ట్రంప్ చెబుతుండగా, ఆయన సలహాదారులు సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై దాడి చేసి, వారిపై అభిశంసనకు పిలుపునిచ్చారు. కార్యనిర్వాహక వర్గం చట్టబద్ధమైన అధికారాన్ని నియంత్రించడానికి న్యాయమూర్తులకు అనుమతి లేదు’ అని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గత వారం ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment