
అమెరికా విధించబోయే సుంకాల గురించి మనతో సహా ప్రపంచమంతా బెంబేలు పడుతున్న వేళ, అక్కడ చదివే మన విద్యార్థులు, వృత్తిగత నిపుణులు వీసా సమస్యలతో సతమతమవుతున్న వేళ నాలుగు రోజుల వ్యక్తిగత పర్యటన కోసం ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబ సమేతంగా సోమవారం మన గడ్డపై అడుగుపెట్టారు. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఎంతో ఇష్టుడైన నేత కనుక ఆయన ద్వారా కొన్ని సమస్యలైనా పరిష్కారమవుతాయన్న విశ్వాసం మన దేశానికున్నట్టుంది.
అందుకే కావొచ్చు... ప్రోటోకాల్స్ పక్కనబెట్టి మరీ ఆయనకు ఘనస్వాగతమిచ్చారు. మారిన పరిస్థితుల రీత్యా అమెరికాతో కొత్తగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం మన దేశానికి తప్పనిసరి. ఇప్పటికే ఆ విషయంలో ఇరు దేశాల మధ్యా సంప్రదింపులు సాగుతున్నాయి. ఒప్పందాలకు సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాలు ఖరారయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన తర్వాత వాన్స్ ప్రకటించారు.
దాదాపు 60 దేశాలపై సుంకాలను భారీ యెత్తున పెంచుతూ ఈ నెల 2 నుంచి అమల్లోకొస్తాయని ప్రకటించిన ట్రంప్, ఆ తర్వాత 90 రోజుల పాటు నిలిపివేశారు. కేవలం చైనాపై మాత్రమే అవి కొనసాగుతున్నాయి. పాత ఒప్పందాల స్థానంలో కొత్తవి కుదుర్చుకోవటం, తమకు మరింత మేలు కలిగేలా చేసుకోవటం ట్రంప్ ధ్యేయం. అందుకోసమే మూడు నెలల కొత్త గడువు విధించారు.
నాలుగేళ్ల క్రితం రిపబ్లికన్ పార్టీకీ, ప్రత్యేకించి ట్రంప్‌కూ తీవ్ర వ్యతిరేకి అయిన జేడీ వాన్స్ ట్రంప్ తొలి దశ పాలనలోనే ఆయనకు మద్దతుదారుగా మారారు. గడచిన వంద రోజులుగా ఉపాధ్యక్షుడిగా ఆయన వ్యవహార శైలి గమనిస్తే రిపబ్లికన్ పార్టీలో ఆయన మున్ముందు కీలకపాత్ర పోషించే అవకాశాలున్నాయని సులభంగానే చెప్పొచ్చు. ఆ మితవాద పక్షానికి ఆయన సరికొత్త స్వరంగా మారారు.
ట్రంప్‌ను ఏయే అంశాల్లో ఇంతవరకూ వాన్స్ ఒప్పించారన్నది ఎవరికీ తెలి యదుగానీ... ఆయన విజన్‌ను తు.చ. తప్పకుండా పాటిస్తున్న నేతగా ఇప్పటికే నిరూపించు కున్నారు. మ్యూనిక్ భద్రతా సదస్సు సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మారిన అమెరికా వైఖరిని నిక్కచ్చిగా చెప్పటంలో వాన్స్ విజయం సాధించారు. యూరప్ దేశాలు నొచ్చుకున్నా ఆయన ఖాతరు చేయలేదు. బ్రిటన్ విధానాలను దుయ్యబట్టారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని మందలిస్తున్న ట్రంప్‌తో గొంతు కలిపారు. గ్రీన్‌ల్యాండ్‌ను కొనితీరాలన్న ట్రంప్ అభిమతానికి అనుగుణంగా చెప్పాపెట్టకుండా కుటుంబ సమేతంగా వాన్స్ అక్కడికెళ్లారు. ప్రస్తుతం రక్షణ, విదేశీ వ్యవహారాలు డెన్మార్క్‌కు అప్పగించటం మినహా ఇతరత్రా స్వయం ప్రతిపత్తిని అనుభవిస్తున్న గ్రీన్‌ల్యాండ్‌కుగానీ, డెన్మార్క్‌కుగానీ ఈ ప్రతిపాదన ఇష్టం లేదు. ట్రంప్ మాదిరే స్వేచ్ఛా వాణిజ్యాన్ని, ఉదారవాద ఆర్థికవిధానాలనూ, భారీ వలసలనూ వాన్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తారు.
వాన్స్ అంటే వల్లమాలిన అభిమానం ఏర్పడటానికి ట్రంప్‌కు చాలా కారణాలున్నాయి. వాన్స్ లోని రచనా శక్తి అందులో ఒకటి. ఒకప్పుడు తనను ‘అమెరికన్ హిట్లర్’ అన్నా దాన్నంతటినీ మరిచి పోయే స్థాయిలో వాన్స్ ఆత్మకథాత్మక నవల ‘హిల్‌బిల్లీ ఎలిజీ’ ట్రంప్‌ను కట్టిపడేసింది. 2022లో ఆయనను ఒహాయో సెనెటర్‌ను చేయటమేగాక, అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ ఉపాధ్యక్ష అభ్యర్థిగా నిర్ణయించటానికి కూడా ఆ నవల ఉపకరించింది.
శ్వేతజాతి అమెరికన్ జనాన్ని కూడగట్టడంలో, డెమాక్రాట్ల ఏలుబడిలో జరిగిన అన్యాయాలను ఏకరువు పెట్టడంలో ట్రంప్‌కు వాన్స్ నవల తోడ్పడిందని చెప్పాలి. పర్వత ప్రాంతాలను ఆనుకుని వుండే మారుమూల ప్రాంతాల్లో అక్షరాస్యతకూ, అభివృద్ధికీ దూరంగా వుండే శ్వేతజాతి అట్టడుగు వర్గాల జీవితాన్ని ఆ నవలలో వాన్స్ చిత్రీకరించారు. అరకొర పనులతో, అర్ధాకలి బతుకులతో వెళ్లబుచ్చే జనాలను నేరుగా చూసిన ఆ ప్రాంతవాసిగా వాన్స్ దాన్ని ప్రభావవంతంగా చెప్పగలిగారు.
ఆ అట్టడుగు జనం గురించి ట్రంప్ ఎంత మాట్లాడినా నవలలో వాన్స్ చిత్రించిన జీవితానుభవం ట్రంప్‌కు లేదు. అది తెలుసుకున్నాక ఆయన మరింతగా ఆ వర్గంలోకి చొచ్చుకుపోగలిగారు. అందుకే కావొచ్చు... ట్రంప్‌కు వాన్స్ అంటే ప్రత్యేకాభిమానం ఏర్పడింది. అలాగని ఆయనను తన వారసుడిగా ప్రకటించదల్చుకోలేదు. మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయటాన్ని రాజ్యాంగం నిరాకరిస్తున్నా, దాన్ని ఎలాగోలా మార్చి మరోసారి ఆ పీఠాన్ని అధిష్ఠించాలని ట్రంప్ కలలుగంటున్నారు. అదెంతవరకూ కుదురుతుందో భవిష్యత్తే తేల్చాలి. అసాధ్యమైతే మాత్రం ట్రంప్ మొదటి ఎంపిక వాన్సే కావొచ్చు.
గత ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల వాణిజ్యం విలువ 12,920 కోట్ల డాలర్లు. మన నుంచి అమెరికా నిరుడు 8,740 కోట్ల డాలర్ల సరుకును దిగుమతి చేసుకుంది. మూడు నెలల తర్వాత మనపై 26 శాతం సుంకాలు విధిస్తే అక్కడి మార్కెట్‌లో మన సరుకుల ధర పెరిగి డిమాండ్ పడి పోవచ్చు. అందుకే ద్వైపాక్షిక చర్చలు అత్యవసరమయ్యాయి.
తమను నష్టపరిచే విధంగా అమె రికాతో ఎవరైనా ఒప్పందం చేసుకుంటే ప్రతిచర్యలు తీసుకోవాల్సి వస్తుందని చైనా హెచ్చరించగా... ఆ దేశంతో పరిమిత వాణిజ్యమే నెరపాలని ప్రపంచ దేశాలకు ట్రంప్ చెబుతున్నారు. ఇది ముదిరితే పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారొచ్చు. వర్తమాన అంతర్జాతీయ పరిస్థితుల్లో దౌత్యం తాడు మీది నడక లాంటిది. దాన్ని విజయవంతంగా పరిపూర్తి చేయటం అంత సులభమేం కాదు.
గట్టిగా మాట్లాడి, అనుకున్నది సాధించటంలో మోదీకి మరెవరూ సాటిరారని వాన్స్ కితాబిచ్చారు. కుదరబోయే ఒప్పందాలు దాన్ని నిరూపిస్తే అంతకన్నా కావాల్సిందేముంది?