Judges
-
భారత్‌లో బంగ్లా న్యాయమూర్తులకు శిక్షణ.. రద్దు చేసిన మహమ్మద్ యూనస్
ఢాకా : బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారధి మహమ్మద్ యూనస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెలలో భారత్‌లో జరగనున్న 50 మంది బంగ్లాదేశ్ న్యాయమూర్తులు, న్యాయాధికారులకు జరగాల్సిన శిక్షణా కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్ కేంద్రంగా నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ, స్టేట్ జ్యుడీషియల్ అకాడమీలో బంగ్లాదేశ్‌కు చెందిన న్యాయమూర్తులకు,న్యాయాధికారులకు శిక్షణ కార్యక్రమం జరగనుంది. అయితే, ఈ తరుణంలో ఈ ట్రైనింగ్‌ను రద్దు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ న్యాయ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. దూరం పెరిగిందా?బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అవామీ లీగ్ 16 ఏళ్ల పాలనకు అక్కడి విద్యార్థులు ముగింపు పలికారు. హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. దీంతో షేక్ హసీనా గత ఏడాది ఆగస్టు 5న భారత్‌కు వచ్చారు. నాటి నుంచి భారత్- బంగ్లాదేశ్‌ల మధ్య సంబధాలు క్షీణించాయి. ఆగస్టు 8న మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, హిందవులపై,ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు జరిగాయి. ఆ తర్వాత దేశద్రోహం కేసులో అరెస్టయిన హిందూ గురువు, ఇస్కాన్ మాజీ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పలు మార్లు బెయిల్ కోసం అప్లయి చేసినా ఆయనకు ఊరట దక్కలేదు. ఇలా నాటి నుంచి భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య దూరం పెరిగిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
బుల్డోజర్ సంస్కృతిపై వేటు!
‘చావుకి పెడితే లంఖణానికి వస్తార’ని నానుడి. కొన్నేళ్లుగా ప్రజాస్వామ్యంలో బుల్డోజర్ స్వామ్యాన్ని జొప్పించి మురిసి ముక్కలవుతున్నవారికి సర్వోన్నత న్యాయస్థానం కీలెరిగి వాత పెట్టింది. నేరం రుజువై శిక్షపడిన లేదా నిందితులుగా ముద్రపడినవారి ఆవాసాలను కూల్చటం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. అలాంటి చేష్టలకు పాల్పడే ప్రభుత్వాధికారులు బాధితులకు పరిహారం చెల్లించటంతోపాటు వారి ఇళ్ల పునర్నిర్మాణానికయ్యే మొత్తం వ్యయాన్ని వ్యక్తిగతంగా భరించాల్సి వుంటుందని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం తేల్చిచెప్పింది. కూల్చివేతలకు ఏ నిబంధనలు పాటించాలో వివరించే మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని ఉల్లంఘించే అధికారులపై కోర్టు ధిక్కార నేరం కింద చర్యలు తీసుకోవటంతోపాటు వ్యాజ్యాలు కూడా మొదలవుతాయని హెచ్చరించింది. ‘ఇళ్లు కూల్చినప్పుడల్లా నిశిరాత్రిలో నడిరోడ్లపై చిన్నా రులూ, ఆడవాళ్లూ విలపిస్తున్న దృశ్యాలు అరాచకానికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఒకప్పుడు అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కొన్ని విధివిధానాలు పాటించేవారు. నోటీసులిచ్చి సంజాయిషీలు తీసుకుని ఆ తర్వాత చర్యలు ప్రారంభించేవారు. కీడు శంకించినవారు న్యాయస్థానాలను ఆశ్రయించటం, వారికి ఊరట దొరకటం కూడా రివాజే. తమకు నచ్చని అభిప్రాయాలున్నా, ఏదో ఉదంతంలో నిందితులుగా ముద్రపడినా వారి ఇళ్లూ, దుకాణాలూ కూల్చే పాపిష్టి సంస్కృతి ఇటీవలి కాలపు జాడ్యం. సినిమా భాషలో చెప్పాలంటే ఇది ‘పాన్ ఇండియా’ సంస్కృతి! దీనికి ఆద్యుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఉత్తర ప్రదేశ్‌లో నేర సంస్కృతిని అరికట్టడంలో, సంక్షేమ పథకాలు అర్హులకు అందించటంలో ఆయన విజయం సాధించారని బీజేపీ చెబుతుంటుంది. కానీ అంతకన్నా ‘బుల్డోజర్ బాబా’గా పిలిపించుకోవటం యోగికి, అక్కడి బీజేపీకి ఇష్టం. చూస్తుండగానే ఇది అంటువ్యాధిలా పరిణమించింది. మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, కర్ణాటకల్లో బీజేపీ ప్రభుత్వాలు బుల్డోజర్లతో విధ్వంసానికి దిగాయి. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకున్నాక బాబు ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయాలను బుల్డోజర్లతో కూల్చాలని చూసింది. ఒకటి రెండుచోట్ల ఆ పనిచేసింది కూడా. ఇక తమకు వ్యతిరేకంగా పనిచేశారన్న కక్షతో దిక్కూ మొక్కూలేని పేదల ఇళ్లు సైతం ఇదే రీతిలో ధ్వంసం చేసింది. రాజస్థాన్‌లో 2022లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా బీజేపీ ఏలుబడిలో ఉన్న రాజ్‌గఢ్ మున్సిపాలిటీ పరిధిలో ఈ దుశ్చర్య చోటు చేసుకుంది. మహారాష్ట్రలో శివసేన–కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి సర్కారు హయాంలో నిందితుల ఇళ్లనూ, దుకాణాలనూ కూల్చారు. కేంద్రం మాటే చెల్లుబాటయ్యే ఢిల్లీలో జహంగీర్‌పురా ప్రాంతంలో మతఘర్షణలు జరిగినప్పుడు అనేక ఇళ్లూ, దుకాణాలూ నేలమట్టం చేశారు. బాధితులు సుప్రీంకోర్టు ఉత్తర్వులు పొందేలోగానే విధ్వంసకాండ పూర్తయింది. 2020 నుంచి ముమ్మరమైన ఈ విష సంస్కృతిపై సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరిస్తూనే వచ్చింది. ‘నిందితులు మాత్రమే కాదు, శిక్ష పడినవారి ఇళ్లను సైతం కూల్చడానికి లేదు. ఈ విషయంలో చట్టనిబంధనలు పాటించి తీరాలి’ అని స్పష్టం చేసింది. కానీ ఆ చేష్టలు తగ్గిన దాఖలా లేదు. చుట్టూ మూగేవారు ‘ఆహా ఓహో’ అనొచ్చు. అవతలి మతంవారి ఇళ్లు, దుకాణాలు కూలుతున్నాయంటే తన్మయత్వంలో మునిగే వారుండొచ్చు. ఆఖరికి ఇళ్లు కూల్చిన ఉదంతాల్లో పాలుపంచుకున్న అధికారులు విందులు చేసుకున్న ఉదంతాలు కూడా వెల్లడయ్యాయి. కానీ సమాజంలో అరాచకం ప్రబలకూడదన్న ఉద్దేశంతో రాజ్య వ్యవస్థ ఏర్పడినప్పుడూ... రాజ్యాంగమూ, చట్టాలూ ఉన్నప్పుడూ... రాజ్యవ్యవస్థే తోడేలుగా మారితే దిక్కెవరు? సుప్రీంకోర్టు వద్దుగాక వద్దని చెప్పాక కూడా ఈ పోకడ ఆగలేదంటే ఏమను కోవాలి? ఒక వ్యక్తి నిజంగా తప్పు చేశాడనుకున్నా అతని కుటుంబమంతా అందుకు శిక్ష అనుభవించి తీరాలన్న పట్టుదల నియంతృత్వ పోకడ కాదా? సుప్రీంకోర్టు 95 పేజీల్లో ఇచ్చిన తీర్పు ఎన్నో విధాల ప్రామాణికమైనదీ, చిరస్మరణీయమైనదీ. ‘ఇల్లంటే కేవలం ఒక ఆస్తి కాదు... అది కొందరు వ్యక్తుల, కుటుంబాల సమష్టి ఆకాంక్షల వ్యక్తీకరణ. అది వారి భవిష్యత్తు. వారికి స్థిరత్వాన్నీ, భద్రతనూ చేకూరుస్తూ, సమాజంలో గౌరవం తీసుకొచ్చేది. ఇలాంటి ఇంటిని బలవంతంగా తీసుకోవాలంటే ముందుగా ఇతర ప్రత్యామ్నాయాలేవీ లేవని అధికారులు విశ్వసించాలి’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించిన తీరు అమానవీయత నిండిన పాలకులకు ఏమేరకు అర్థమైందో సంశయమే. ఆ మాటెలా వున్నా కఠిన చర్యలుంటాయన్న హెచ్చరిక వారిని నిలువరించే అవకాశం ఉంది. దేశంలో దిక్కూ మొక్కూలేని కోట్లాదిమంది సామాన్యులకు ఊరటనిచ్చే ఈ తీర్పులో హిందీ భాషా కవి ప్రదీప్ లిఖించిన కవితకు కూడా చోటు దక్కింది. దాని సారాంశం – ‘ఇల్లు, పెరడు ప్రతి ఒక్కరి స్వప్నం. ఆ కలను కోల్పోవడానికి సిద్ధపడతారా ఎవరైనా?’ బ్రిటన్ న్యాయకోవిదుడు లార్డ్ డెన్నింగ్ చేసిన వ్యాఖ్యలను కూడా తీర్పులో ఉటంకించారు. ‘రాజ్యా ధికారాన్ని ధిక్కరించి అతి సామాన్యుడు వేసుకున్న గుడిసె చిరుగాలికే వణికేంత బలహీనమైనది కావొచ్చు. ఈదురుగాలికి ఇట్టే ఎగిరిపోవచ్చు. దాన్ని వర్షం ముంచెత్తవచ్చు. కానీ చట్టనిబంధన అనుమతిస్తే తప్ప ఆ శిథిల నిర్మాణం వాకిలిని అతిక్రమించటానికి ఇంగ్లండ్ రాజుకు సైతం అధికారంలేదు’ అని లార్డ్ డెన్నింగ్ అన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చూశాకైనా తమపై ఏ స్థాయిలో విశ్వాసరాహిత్యం ఏర్పడిందో ప్రభుత్వాలు గ్రహించాలి. నీతిగా, నిజాయితీగా, రాజ్యాంగానికి అనుగుణంగా పాలించటం నేర్చుకోవాలి. -
అన్ని ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి రాష్ట్రాలకు అధికారం లేదు
ఆర్టికల్ 39(బి)లో పేర్కొన్న సామాజిక వనరులు అన్న పదబంధం ప్రైవేటు యాజమాన్యంలోని అన్ని ఆస్తులు, వనరులకు వర్తిస్తుందా అన్నది మా ముందున్న ప్రశ్న. సైద్ధాంతికంగా చూస్తే అవుననే సమాధానమే వస్తుంది. కానీ ఆ మేరకు జస్టిస్ కృష్ణయ్యర్ ఇచ్చిన తీర్పు, దాని ఆధారంగా సంజీవ్ కోక్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించలేకపోతున్నాం. కేవలం భౌతిక అవసరాల నిర్వచన పరిధిలోకి వచ్చినంత మాత్రాన ప్రతి ప్రైవేట్ ఆస్తినీ సామాజిక వనరుగా పరిగణించడం కుదరదు.– సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ న్యూఢిల్లీ: ప్రైవేట్ ఆస్తులపై ప్రభుత్వాల అధికార పరిధికి సంబంధించిన అతి కీలకమైన అంశంపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. అన్ని ప్రైవేట్ ఆస్తులూ సామాజిక వనరుల నిర్వచన పరిధిలోకి రావని స్పష్టం చేసింది. ‘‘కనుక రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని ప్రైవేట్ ఆస్తుల మీదా హక్కులు ఉండబోవు. సమాజ హితం, ఉమ్మడి ప్రయోజనాలు, సామాజిక పంపకం నిమిత్తం ఏ ప్రైవేట్ ఆస్తినైనా స్వాదీనం చేసుకునేందుకు వాటికి అధికారం లేదు’’ అని తేల్చి చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఈ మేరకు 7–2 మెజారిటీతో చరిత్రాత్మక తీర్పు వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(బి) ఆధారంగా ప్రైవేట్ యాజమాన్యంలోని అన్ని వనరులను స్వా«దీనం చేసుకునే హక్కు రాష్ట్రాలకు లేదని పేర్కొంది. వాటికి ఆ అధికారం ఉందంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ చిన్నపరెడ్డి తదితరులు ఇచ్చిన గత తీర్పులతో విభేదించింది. వాటిలో వెలిబుచ్చిన అభిప్రాయాలను లోపభూయిష్టమైనవిగా, కాలదోషం పట్టినవిగా పేర్కొంది. ఆ తీర్పులను కొట్టేసింది. ఆర్థిక ప్రజాస్వామ్యానికి కూడా రాజ్యాంగం అనుమతిస్తోందంటూ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే, ‘‘కొన్ని ప్రైవేట్ ఆస్తులు మాత్రం ఆర్టికల్ 39(బి)లో పేర్కొన్న ‘సామాజిక వనరులు, సమాజ హితం’ పరిధిలోకి వస్తాయి. ఆ నిర్దిష్ట అవసరాల నిమిత్తం వాటిని ప్రభుత్వాలు స్వాదీనం చేసుకోవచ్చు’’ అని స్పష్టం చేసింది. సీజేఐతో పాటు జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీ ఈ మేరకు మెజారిటీ తీర్పు వెలువరించారు. వారి తరఫున సీజేఐ 193 పేజీల తీర్పును రాశారు. ఈ తీర్పుతో జస్టిస్ బి.వి.నాగరత్న పాక్షికంగా, జస్టిస్ సుధాన్షు ధూలియా పూర్తిగా విభేదించారు. కాలానుగుణంగా మారాలి: సీజేఐ ఆర్టికల్ 39(బి) కింద కేవలం ప్రైవేట్ ఆస్తులను కూడా సామాజిక వనరులుగా భావించవచ్చా అన్న అంశం 1992 నుంచి న్యాయస్థానాల్లో నలుగుతోంది. దీనికి సంబంధించి 16 పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. దీన్ని 2002లో తొమ్మిది మంది సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించారు. 2024లో సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం దీన్ని విచారణకు చేపట్టింది. ప్రైవేట్ ఆస్తులన్నింటినీ సామాజిక వనరులుగా భావించడానికి వీల్లేదని సీజేఐ తన తీర్పులో స్పష్టం చేశారు. అలా భావించవచ్చని, వాటిని సమాజ హితం కోసం స్వాదీనం చేసుకోవచ్చని పేర్కొన్న గత తీర్పులు సామ్యవాద ధోరణితో కూడినవని అభిప్రాయపడ్డారు. ‘‘ఆర్టికల్ 39(బి)లో పేర్కొన్న సామాజిక వనరులు అన్న పదబంధం ప్రైవేటు యాజమాన్యంలోని అన్ని ఆస్తులు, వనరులకు వర్తిస్తుందా అన్నది మా ముందున్న ప్రశ్న. సైద్ధాంతికంగా చూస్తే అవుననే సమాధానమే వస్తుంది. కానీ ఆ మేరకు జస్టిస్ కృష్ణయ్యర్ ఇచ్చిన తీర్పు, దాని ఆధారంగా సంజీవ్ కోక్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించలేకపోతున్నాం. కేవలం భౌతిక అవసరాల నిర్వచన పరిధిలోకి వచ్చినంత మాత్రాన ప్రతి ప్రైవేట్ ఆస్తినీ సామాజిక వనరుగా పరిగణించడం కుదరదు. సదరు ఆస్తి తాలూకు స్వభావం, సమాజ శ్రేయస్సుపై దాని ప్రభావం, వనరుల అలభ్యత, అది ప్రైవేటు చేతుల్లో ఉంటే తలెత్తే పరిణామాలు తదితరాలన్నింటినీ బేరీజు వేసిన మీదట మాత్రమే అది సామాజిక వనరో, కాదో తేల్చాలి. ప్రజా విశ్వాస సిద్ధాంతాన్ని కూడా దీనికి వర్తింపజేయాల్సి ఉంటుంది. అడవులు, చెరువులు, చిత్తడి నేలలు, సహజ వనరులతో కూడిన భూముల వంటివి ప్రైవేట్ స్వాదీనంలో ఉంటే ఆర్టికల్ 39(బి) కింద వాటిని సమాజ అవసరాల నిమిత్తం ప్రభుత్వాలు సేకరించవచ్చు. అదే సమయంలో స్పెక్ట్రం, ఎయిర్‌వేవ్స్, సహజ వాయువు, గనులు, ఖనిజాల వంటి కొరతతో కూడిన పరిమిత వనరులు కొన్నిసార్లు ప్రైవేట్ అజమాయిషీలో ఉండేందుకు ఆస్కారముంది. కనుక పంపకం అనే మాటకున్న అర్థం విస్తృతమైనది’’ అని సీజేఐ పేర్కొన్నారు. ‘‘గత తీర్పుల్లో జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ చిన్నపరెడ్డి నిర్దిష్ట ఆర్థిక సిద్ధాంతాల ప్రాతిపదికన అభిప్రాయాలు వెలిబుచ్చారు. కానీ స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో సంక్షేమ ఆధారిత విధానాలున్నాయి. తర్వాత మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, జాతీయీకరణ వంటివాటి కాలం నడిచింది. ఇది పెట్టుబడుల ఉపసంహరణల యుగం. ప్రైవేట్ పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. కనుక గత పరిస్థితులను ఇప్పుడు ప్రాతిపదికగా తీసుకోరాదు. ప్రస్తుత, భావి అవసరాలను తగ్గట్టుగా తీర్పులుండాలి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం కూడా ఫలానా ఆర్థిక విధానాన్నే పాటించాలని సూచించలేదన్నారు. ఇద్దరు న్యాయమూర్తులు ఏమన్నారంటే... ఏ ప్రైవేట్ ఆస్తులనైనా సమాజ హితానికి స్వా«దీనం చేసుకునే అధికారం ప్రభుత్వాలకు ఉందన్న జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ చిన్నపరెడ్డి తదితర తీర్పులకు నేటికీ కాలదోషం పట్టలేదని జస్టిస్ ధూలియా అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ఆర్టికల్ 38, 39ల్లో పేర్కొన్న సూత్రాలను పక్కన పెట్టడం సబబు కాదన్నారు. అలా చేయడం ప్రభుత్వాల చేతులను కట్టేయడమే అవుతుందని 97 పేజీల తీర్పులో స్పష్టం చేశారు. ‘‘ఎందుకంటే అంబేడ్కర్ హెచ్చరించిన సామాజిక, ఆర్థిక అసమానతలు మన దేశంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పేద, సంపన్న వర్గాల మధ్య ఆదాయ, సంపదపరమైన భారీ అసమానతలు నానాటికీ మరింతగా పెరుగుతున్నాయి’’ అన్నారు. జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ చిన్నపరెడ్డి తీర్పులకు పూర్తిగా కాలదోషం పట్టలేదని జస్టిస్ నాగరత్న కూడా అభిప్రాయపడ్డారు. అయితే, ‘‘భౌతిక వనరులను ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యంలోవిగా విభజించవచ్చు. పూర్తిగా వ్యక్తిగత అవసరాలను తీర్చేవాటిని మినహాయించి ఇతర ప్రైవేటు ఆస్తులను సమాజ హితం కోసం ప్రభుత్వం సేకరించవచ్చు. ఆ మీదట సమాజ హితం కోసం అర్హులకు వాటిని చట్టపరమైన మార్గాల్లో తాత్కాలిక/శాశ్వత ప్రాతిపదికన బేషరతుగానో, షరతులతోనో పంపకం చేయవచ్చు’’ అని ఆమె పేర్కొన్నారు. అయితే జస్టిస్ కృష్ణయ్యర్ తీర్పుపై సీజేఐ చంద్రచూడ్ వ్యాఖ్యలను ‘పరుషమైనవి, అనవసరమైనవి’గా జస్టిస్ ధూలియా, జస్టిస్ నాగరత్న అభివర్ణించడం విశేషం. వాటితో తాము గట్టిగా విభేదిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. కృష్ణయ్యర్, చిన్నపురెడ్డి తీర్పులు... సమాజహితం కోసం ప్రైవేట్ ఆస్తులను సేకరించే అధికారం ప్రభుత్వాలకు ఉంటుందని 1977లో కర్నాటక ప్రభుత్వం వర్సెస్ రంగనాథరెడ్డి కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణయ్యర్ పేర్కొన్నారు. ప్రైవేట్ యాజమాన్యంలోని ఆస్తులు సామాజిక వనరుల నిర్వచనంలోకి రావంటూ ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన మెజారిటీతో తీర్పును వ్యతిరేకించారు. ప్రైవేట్ ఆస్తులు కూడా ఆ నిర్వచనం పరిధిలోకి వస్తాయంటూ ఆయన మైనారిటీ తీర్పు వెలువరించారు. ఆస్తులపై భూస్వాములు, పెట్టుబడిదారుల ఆస్తుల కోటలను బద్దలు కొట్టడానికి ఆర్టికల్ 39(బి)ని రాజ్యాంగంలో ఉద్దేశపూర్వకంగానే చేర్చారని అభిప్రాయపడ్డారు. 1983లో సంజీవ్ చోక్ కేసులో సీజేఐ చిన్నపరెడ్డి కూడా జస్టిస్ కృష్ణయ్యర్ మైనారిటీ తీర్పును పూర్తిగా సమర్థించారు. సామ్యవాద సిద్ధాంతకర్తల ఆదర్శాలే ఆర్టికల్ 39(బి)లో ప్రతిఫలించాయని ఆయన పేర్కొన్నారు. ఆర్టికల్ 39(బి) ఏం చెబుతోందంటే... ‘‘సామాజిక వనరులు సమాజ విశాల హితం కోసం పంపిణీ అయేలా చూడటం ప్రభుత్వ బాధ్యత. ఇందుకు వీలుగా సదరు వనరులపై యాజమాన్యం, నియంత్రణకు అవసరమైన విధానాలను రూపొందించాలి’’. -
సామాన్యుల భాషలో... సన్నిహితమైన న్యాయం
మన దేశంలోని అన్ని హైకోర్టుల్లో అధికారికంగా వాడేది ఇంగ్లీషు భాష. కానీ కేసులో గెలిచినవాడు, ఓడిన సామాన్యుడు కూడా తమ గెలుపోటములకు కారణాలు అర్థం చేసుకోలేని పరిస్థితి. అందుకే తీర్పుల్లోని కారణాలు అర్థమయ్యే భాషలో తెలియ జేసి, సామాన్యుడికి న్యాయ వ్యవస్థ చేరువ కావాలనే సదుద్దేశ్యంతో సుప్రీంకోర్టు, దేశంలోని అన్ని హైకోర్టులు వారి తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించి, ఉచితంగా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తాము ఇంగ్లీషులో వెలువరించే ముఖ్యమైన తీర్పులను తెలుగులోకి అనువాదం చేయించే ప్రక్రియను యుద్ధ ప్రాతి పదికన చేపట్టింది. తదనుగుణంగా ఇంగ్లీషు నుండి తెలుగులోకి తర్జుమా చేయటానికి విశ్రాంత ఉద్యోగులు, విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదుల సేవలు వినియోగించుకుంటోంది. అనువాదకుల కొరత మూలాన ప్రస్తుతానికి ముఖ్యమైన తీర్పులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అనువాదకుల సేవలు ఉచితంగా స్వీకరించటం లేదు. వారి సేవలకు గాను, హైకోర్టు ప్రతి పేజీకి మూడు వందల రూపాయలు చెల్లిస్తుంది. ఇంగ్లీషులో వెలువరించిన తీర్పుల కాపీలను వారి ఇంటి దగ్గరే అనువాదం చేసి, సహేతుకమైన సమయంలో అను వాదాన్ని హైకోర్టులోని సంబంధిత అధికారులకు స్వయంగా అందజేయడం లేదా ఆన్లైన్లో పంపించటం అనువాదకుల పని. ఈ కార్యక్రమ సక్రమ నిర్వహణ కోసం హైకోర్టు తన పరిపాలనా భవనంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగంలో తెలుగు భాషపై పట్టున్న ఇద్దరు విశ్రాంత జిల్లా న్యాయమూర్తులను ఎడిటర్, డిప్యూటీ ఎడిటర్‌గా; ఒక విశ్రాంత సీనియర్ సివిల్ జడ్జిని రిపోర్టర్‌గా నియామకం చేసింది. ఇంగ్లీషు నుండి తెలుగులోకి ప్రైవేటు అనువాదకులు తర్జుమా చేసిన∙ముఖ్యమైన తీర్పులను జాగ్రత్తగా పరిశీలించి, ప్రతి తీర్పుకు అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలను జోడించి, వాటిని తెలంగాణ హైకోర్టు వెబ్సైట్లో నెల వారీగా పెట్టవలసిన బాధ్యత వీరికి అప్పగించింది. వెబ్‌సైట్‌ను 2024 ఆగస్టు 15న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ముఖ్య మైన తీర్పుల తెలుగు ప్రతులను ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని చదువుకునే అవకాశం కల్పించారు. అనువాదకులను శాశ్వత ప్రాతిపదికన నియమించుకోడానికి, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు అనుమతి ఇచ్చింది. 25 తెలుగు అనువాదకులు, 10 డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 5 తెలుగు టైపిస్ట్ పోస్టులను కూడా మంజూరు చేసింది. త్వరలో హైకోర్టు ఈ పోస్టులను భర్తీ చేసే అవకాశం లేకపోలేదు. తెలుగు అనువాదకులు దొరకటం అంత సులభమేమీ కాదు. ఎందుకంటే తెలంగాణ సచివాలయంలో కూడా ఈ కొరత ఉందని తెలుస్తోంది.మరో విషయమేమంటే ప్రతి పౌరుడికీ హైకోర్టు వెబ్సైట్ ద్వారా ముఖ్యమైన తెలుగు తీర్పులను డౌన్ లోడ్ చేసుకునే సౌలభ్యం ఉందనే విషయం తెలియ జేయాలనే ఆశయంతో... జిల్లా న్యాయమూర్తులు, జిల్లా, మండల న్యాయ సేవాధికార సంస్థలు; సంబంధిత జిల్లా ప్రభుత్వ అధికారులు న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా ప్రచారం కల్పించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతగా ప్రచారం కల్పించినా తెలుగులో తీర్పులు చదువుకోవాలనుకునే విషయం, అది ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉందనే విషయం అంత సులువుగా సామాన్యుడికి తెలియక పోవచ్చు. అవగాహన కల్పించటానికి సకల ప్రయత్నాలు చేయటానికి న్యాయ వ్యవస్థ గట్టిగానే కృషి చేయాలి. దీనికి న్యాయవాదుల పాత్ర పరిమితమని అనుకోవద్దు. ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కక్షిదారులు తాము దాఖలు చేసిన కేసుల్లో న్యాయ మూర్తులు ఇంగ్లీషులో వెలువరించిన తీర్పులను తమ భాషలో చదివి అర్థం చేసుకొని సంతృప్తి పడాలనే దృక్పథం. అనువాదం అంటే ప్రస్తుత కాలంలో ఎవరికీ అర్థం కాని పూర్తి గ్రాంథిక భాషా ప్రయోగం చేయకుండా, వ్యవహారిక భాషను వాడాలనీ, అవసరమైతే దైనందిన ఇంగ్లీషు పదాలను అదే విధంగా వాడాలనీ హైకోర్టు సూచన చేసింది. టెక్నాలజీ అతి వేగంగా దూసుకుపోతున్న ప్రస్తుత కాలంలో, ఇప్పటికే హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్లలో రికార్డ్ చేసిన సాక్ష్యాల నకళ్ళను అప్పటికప్పుడు ఇరు పక్షాలకు ఉచితంగా అందజేసే ఏర్పాటు ఉంది. అదే విధంగా హైకోర్టు రిజిస్ట్రీ జోక్యం లేకుండా, తీర్పు చెప్పిన రోజే తీర్పు ప్రతిని ఇరుపక్షాలకు కోర్టులోనే ఉచితంగా అందజేయాలి. దిగువ కోర్టుల్లో కూడా సివిల్, క్రిమినల్ తీర్పు అనే భేదం లేకుండా, ఇదే పద్ధతి పాటించడానికి ఎటువంటి ఆటంకం ఉండకపోవచ్చు. అయితే నూటికి నూరు శాతం తీర్పుల తెలుగు అనువాదం సరైనది లేదా తప్పులు లేనిదని చెప్పలేం. ఈ తెలుగు తీర్పుల అనువాదం కేవలం చదువుకొని అర్థం చేసుకోవడానికి మాత్రమే పరిమితం. తెలుగు అనువాదం ఆధారంగా ఎవరు కూడా తప్పొప్పులు ఎంచి దానిపై అప్పీళ్ళు వేసే అవకాశం లేదు. ఇందు కోసం హైకోర్టు వెబ్సైట్లో డిస్ క్లెయిమర్ కూడా చొప్పించారు.తడకమళ్ళ మురళీధర్ వ్యాసకర్త విశ్రాంత జిల్లా జడ్జిమొబైల్: 98485 45970 -
సమాజం పట్ల కరుణతోనే న్యాయమూర్తిగా నిలదొక్కుకున్నా..
ముంబై: న్యాయస్థానాలు, న్యాయమూర్తులు సైతం సూక్ష్మ పరిశీలనకు గురి కావాల్సిందేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. న్యాయమూర్తుల పనితీరును చుట్టూ ఉన్న సమాజం పరిశీలిస్తూనే ఉంటుందని అన్నారు. అయితే, సమాజం పట్ల ఉన్న దయ, కరుణ, జాలి, అనురాగం వల్లే తాను అన్ని రకాల పరిశీలనలు, పరీక్షలకు నిలిచి, న్యాయమూర్తిగా నిలదొక్కుకున్నానని తెలిపారు. సమాజం పట్ల తమ ప్రేమానురాగాలు తమ తీర్పుల ద్వారా వెల్లడవుతాయని వివరించారు. జస్టిస్ చంద్రచూడ్ వచ్చే నెల 10వ తేదీన పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ముంబైలో ఆయనను ఘనంగా సత్కరించారు. జస్టిస్ చంద్రచూడ్ అందించిన సేవలను న్యాయవాదులు ప్రశంసించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ తాను ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. ‘‘ఐఐటీ–ధన్బాద్లో చేరేందుకు సకాలంలో అడ్మిషన్ ఫీజు రూ.17,500 చెల్లించలేకపోయిన దళిత విద్యార్థికి మా ఆదేశాలతో ప్రవేశం లభించింది. ఇలాంటి తీర్పులు తనకెంతో సంతృప్తిని ఇచ్చాయి’’ అని తెలిపారు. -
న్యాయ వ్యవస్థపై ఏఐ ప్రభావం
కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం అన్ని రంగాలపైనా విశేషంగా పడుతోంది. అందులో భాగంగానే న్యాయ వ్యవస్థనూ అది ప్రభావితం చేస్తోంది. ఏఐతో న్యాయమూర్తుల పని సులువవుతుంది. దేశంలో లక్షల సంఖ్యలో ప్రాక్టీసు చేస్తున్న న్యాయవాదులు సాధ్యమైనంత త్వరగా ఏఐ వినియోగంలో నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. న్యాయ శాస్త్రంలోని అనేక అంశాలు చిటికెలో ఏఐ ద్వారా అందుబాటు లోకి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల న్యాయ వ్యవస్థలో ఉన్నవారి పని భారం తగ్గుతుంది. మొత్తం మీద ఏఐ వల్ల న్యాయవ్యవస్థ ఎలా లాభం పొందుతుందో ఇక్కడ చూద్దాం:ఏఐ కేసు డేటాను విశ్లేషించడానికీ, ఫలితా లను అంచనా వేయడానికీ, నమూనాలను గుర్తించడానికీ సాయపడుతుంది. న్యాయ మూర్తులు అదనపు సమాచారంతో నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఏఐ ఆధారిత సాధనాలు న్యాయవాదులు, న్యాయమూర్తులకు సంబంధిత చట్టాల పూర్వాపరాలు, కేస్ స్టడీస్, పరిశోధనలో సమయం ఆదా చేయడంలో సహాయ పడతాయి. ఏఐ ఆధారిత చాట్ బాట్లు వర్చువల్ కోర్టు ప్రొసీడింగ్స్‌లో సహాయ పడతాయి. షెడ్యూల్ చేయడం, రిమైండర్లు, ప్రాథమిక విచారణల వంటి పనులలో సహాయ పడతాయి. ఏఐ ఆధా రిత న్యాయ సహాయం, మద్దతును అందించడం ద్వారా... ముఖ్యంగా అట్టడుగు వర్గాలు న్యాయం పొందడంలో అంతరాన్ని తగ్గించవచ్చు. ఏఐ రొటీన్ టాస్క్‌ను ఆటోమేట్ చేయగలదు. న్యాయ మూర్తులు, న్యాయస్థాన సిబ్బందిని మరింత సంక్లిష్టమైన, అధిక విలువైన పనులపై దృష్టి పెట్టేలా చేస్తుంది. న్యాయ ప్రక్రియలను మెరుగు పరచడానికి, జాప్యాలను తగ్గించడానికి, న్యాయ వ్యవస్థకు గల మొత్తం సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది.ఏజీఐ... అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలి జెన్స్ (కృత్రిమ సాధారణ బుద్ధి) ఒక భావితర హిత ఏఐ వ్యవస్థను సూచిస్తుంది. ఇది మనుషుల మేధస్సుకు సమానంగా విభిన్న పనులను అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం జ్ఞానాన్ని అనేక విభాగాల్లో ఉపయోగించే సామర్థ్యాలు కలిగి ఉంటుంది. ఉదాహరణకు: కారణాలు చెప్పడం, సమస్యలను పరిష్కరించడం; అనుభవం నుంచి నేర్చుకోవడం; సహజ భాషను అర్థం చేసుకోవడం, వివిధ రంగాల్లో జ్ఞానాన్ని ఉపయోగించడం వంటి పనులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.ఏఐ పరిశోధనలో ఏజీఐని పవిత్ర కాంక్షగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది అపారమైన అవకా శాలను తెచ్చిపెడుతుంది. అయితే ఏజీఐ ఇంకా పరిశోధన, అభివృద్ధి దశలోనే ఉంది. ఏఐ సాధానాలతో సమర్థవంతంగా పని చేయడానికి వ్యూహం, న్యాయవాదులకు, కక్షి దారులకు కౌన్సెలింగ్ వంటి అధిక విలువ గల పనులపై దృష్టి పెట్టడానికి, న్యాయవాదులు కొత్త నైపుణ్యాలను పెంచుకోవాల్సి ఉంటుంది. న్యాయ వాద వృత్తిలో జూనియర్లు, లేదా పారాలీగల్స్ వంటి నిర్దిష్ట పాత్రలను ఏఐ స్థానభ్రంశం చేయ గలదు. సబ్స్క్రిప్షన్ ఆధారిత చట్టపరమైన సేవలు, ఏఐ ఆధారిత లీగల్ కన్సల్టింగ్ వంటి కొత్త వ్యాపార నమూనాలను ఏఐ ప్రారంభించగలదు.చట్టపరమైన ఆచరణలో ఏఐ ఉపయోగం, నిర్ణయాధికారం పారదర్శకంగా, జవాబుదారీ తనంగా ఉండేలా చూసుకోవడం వంటి నియంత్రణ సమస్యలను లేవనెత్తవచ్చు. న్యాయవాదులు ఏఐపై ఎక్కువగా ఆధారపడవచ్చు. దీని వల్ల అవ సరమైన నైపుణ్యాలను, నిర్ణయాన్ని (తీర్పును) కోల్పోయే అవకాశం ఉంది. ఏఐ ఆధారిత చట్ట పరమైన సాధనాలు డేటా చౌర్యం, ఉల్లంఘనల వంటి ప్రమాదాన్ని పెంచుతాయి.న్యాయవాదులు ఏఐని ఉపయోగించడంలో నైతికపరమైన చిక్కులను పరిగణనలోకి తీసు కోవాలి. ఏఐ తీసుకునే నిర్ణయం న్యాయంగా, నిష్పక్ష పాతంగా ఉండేలా చూసుకోవాలి. నైపుణ్యా లను సాధ్యమైనంత త్వరగా పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో ఏఐ నుంచి ఎదురయ్యే సవా ళ్లను దీటుగా ఎదుర్కోవచ్చు. వృత్తిపరంగా విజ యవంతంగా ముందుకు వెళ్లవచ్చు. అయితే ఈ వ్యస్థపై నిరంతర పరిశీలన, పర్యవేక్షణ ఉండాలి.– ఆగూరు ఉమామహేశ్వరరావు సీనియర్ న్యాయవాది -
DY Chandrachud: న్యాయ వ్యవస్థకు ప్రజా విశ్వాసమే కీలకం
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థకు, న్యాయమూర్తులకు ప్రజా విశ్వాసమే అత్యంత కీలకమని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. ప్రజల నమ్మకం చూరగొనేలా పని చేయాలని న్యాయమూర్తులకు సూచించారు. ప్రజలు నేరుగా ఎన్నుకోనప్పటికీ, ప్రజా తీర్పునకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ న్యాయమూర్తులపై గురుతర బాధ్యత ఉందని చెప్పారు. జడ్జిగా విశ్వసనీయత, తగిన గుర్తింపు పొందాలంటే ప్రజల ఆమోదం, నమ్మకం చాలా ముఖ్యమని అన్నారు. భూటాన్‌లోని ‘జేఎస్‌డబ్ల్యూ స్కూల్ ఆఫ్ లా’లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో జస్టిస్ చంద్రచూడ్ ప్రసంగించారు. ప్రజలకు నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను కూడా కోర్టులు పరిష్కరిస్తుంటాయని పేర్కొన్నారు. అందుకే వారి విశ్వాసం పొందడం చాలా ముఖ్యమని స్పష్టంచేశారు. ఏ దేశంలోనైనా ప్రజల మద్దతుతో న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే అక్కడ రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన పాలన సజావుగా సాగుతుందని వివరించారు. ప్రజాభిప్రాయం అనేది న్యాయ వ్యవస్థలో అంతర్గత తనిఖీగా తోడ్పడుతుందని సూచించారు. న్యాయ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేవలం న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్లు ప్రజలకు కనిపించాలని స్పష్టంచేరు. భారత్‌లోని కోర్టుల్లో ప్రవేశపెట్టిన సాంకేతిక విధానాలను జస్టిస్ చంద్రచూడ్ ప్రస్తావించారు. వర్చువల్ విచారణ, కోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం, కేసుల ఈ–ఫైలింగ్, ఆన్లైన్ కేసు సమాచార వ్యవస్థ, కృత్రిమ మేధ(ఏఐ)తో కోర్టు తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించడం వంటి విధానాలు తీసుకొచ్చామని వెల్లడించారు. ఇవి సత్ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. సామాన్య ప్రజల కోసం సుప్రీంకోర్టు ప్రక్రియలను మరింత సులభతరం చేశామని చెప్పారు. -
Pune Porsche car crash: మైనర్ నిందితునికి బెయిలు.. జడ్జిల తొలగింపు
పుణే: పోర్షే కారు దుర్ఘటనలో మైనర్ నిందితుడికి బెయిల్ మంజూరు చేసిన కేసులో జువెనైల్ జస్టిస్ బోర్డు (జేజేబీ)కి చెందిన ఇద్దరు జడ్జిలను మహారాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. విధానపరమైన లోపాలు, దుష్ప్రవర్తన, నిబంధనలు పాటించకపోవ డంవంటి ఆరోపణలపై ఎల్.ఎన్.దన్వాడే, కవితా థోరట్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ (డబ్ల్యూసీ డీ) దర్యాప్తు కమిటీ సిఫారసు చేసింది. ఈ మేరకు జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కల్పించిన అధికారాలను దుర్వినియోగం చేసిన ట్లు తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరి ని యామకాన్ని రద్దు చేసింది. పుణేలోని కళ్యా ణి నగర్ ప్రాంతంలో ఓ బిల్డర్ కుమారుడైన 17 ఏళ్ల బాలుడు మద్యం మత్తులో పోర్షే కారు నడిపి మోటార్ సైకిల్‌ను ఢీకొట్టాడు. ఈ దుర్ఘటనలో ఇద్దరు ఐటీ నిపుణులు మృతి చెందారు. అప్పటి జేజేబీ జడ్జిలు నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఆ షరతులలో రోడ్డు భద్రతపై 300 పదాల వ్యాసం రాయాలని ఉంది. ఇది జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. -
ధిక్కార ‘స్వర’ భాస్కరం!
స్వర భాస్కర్... బాలీవుడ్ హీరోయిన్, నటిగా కొందరికి తెలుసు. హిందుత్వ వ్యతిరేకిగా... తప్పును తప్పు అని ఎత్తిచూపగల వ్యక్తిగా మరికొందరికి పరిచయం! ముస్లిం స్నేహితుడిని పెళ్లాడి.. ఇటీవలే తల్లిఅయిన స్వర భాస్కర్ తాజాగా మళ్లీ తన ధిక్కార స్వరంతో మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. న్యాయస్థానాలు, న్యాయమూర్తుల తీరును నేరుగా ప్రశ్నించారు. ఏళ్లుగా నిర్బంధంలో మగ్గుతున్న జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్, గుజరాత్ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ వంటి వారికి మద్దతుగా ఏర్పాటైన ఒక కార్యక్రమంలో స్వర భాస్కర్ మాట్లాడుతూ... ‘‘నేను ఈ రోజు న్యాయవ్యవస్థను ఒక ప్రశ్న అడగదలిచాను. దేనికి మీకు భయం? సామాన్య ప్రజలకైతే బతుకు సాగాలన్న భయం ఉంటుంది. ఎవరైనా దాడి చేసి కొడతారన్న భయం ఉంటుంది. దేశంలో ముస్లింలను ఎక్కడపడితే అక్కడ దాడి చేసి కొట్టేస్తున్నారు. పాపం ఈ దేశంలో దళితులపై కూడా విచ్చలవిడి దాడులు జరుగుతున్నాయి. మాలాంటి వాళ్లకు కూడా పని దొరకదనో.. కామెడీ షోల్లాంటివి చేయనివ్వరని, నటించిన సినిమాలు రిలీజ్ కాకుండా అడ్డుకంటారనో భయాలు ఉండవచ్చు. మరి మీకే రకమైన భయాలు ఉన్నాయి? అధికారం మీ చేతుల్లో ఉంది. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఉంది. అరవై, డెబ్భై ఏళ్ల వయసు వాళ్లు.. హైకోర్టుల్లో, సుప్రీంకోర్టుల్లోకి చేరిపోతున్నారు. మీ పిల్లలు కూడా పెద్దవాళ్లై పోయి ఉంటారు. ఖరీదైన.. మంచి కాలేజీల్లో, విదేశాల్లో చదువుకుని ఉంటారు. పెళ్లాం పిల్లలతో వాళ్లు జీవితంలో స్థిరపడి పోయి ఉంటారు. అలాంటి మీకు ఈ వృద్ధాప్యంలో ఎందుకు భయం? ఇంకా ఎలాంటి ఆశ మిగిలిపోయింది మీలో? ఏం కావాలి మీకు? రాజ్య సభ సభ్యత్వం, గవర్నర్ పదవుల అవసరం ఏమిటి? ఇన్ని ఆశలు పెట్టుకున్న మీరు మీ పని చేయమని మాత్రమే కదా మేము అడుగుతున్నది? అది కూడా మీరు చేయలేకపోతున్నారు ఎందుకు?’’ అంటూ న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై ప్రశ్నల వర్షం కురిపించారు.Why are you so scared at this age? What is the greed you have at this age? Do you want a Governor or Rajya Sabha post at this age?- @ReallySwara#UmarKhalidpic.twitter.com/2CSyEGWUFL— Mohammed Zubair (@zoo_bear) September 18, 2024 ఉమర్, ఖాలిద్, అతర్, గుష్ఫా, షెర్జీల్ ఇమామ్ వంటి ఎందరో మూడు నాలుగైదేళ్లుగా జైళ్లలో మగ్గిపోతున్నారని గుర్తు చేసిన స్వర.. ‘‘న్యాయవ్యవస్థ వీరిని పూర్తిగా మరచిపోయినట్లు అనిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. బెయిల్ లేకుండా.. విచారణ కూడా మొదలు కాకుండా ఇలాంటి వాళ్లు ఎంతకాలం నుంచి మగ్గిపోతున్నారో కూడా న్యాయవ్యవస్థ పట్టించుకోవడం లేదని అన్నారు. ‘‘అందుకే నేను ఈ వేదికపై నుంచి నాలుగేళ్ల కాలం అనేది ఎంత పెద్ద సమయమో చెప్పదలుచుకున్నాను. ఉమర్ ఖలీద్ 2020 సెప్టెంబరులో ఇరవయ్యవ తేదీ అరెస్ట్ అయ్యాడు. ఆ తరువాత మూడుసార్లు కోవిడ్ వచ్చి పోయింది. వ్యాధి కారక వైరస్ మూడు నాలుగు మార్లు రూపం మార్చుకుంది కూడా. ప్రాణాంతక మహమ్మారి జబ్బుకు చికిత్స కూడా దాదాపుగా అందుబాటులోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం ఫహాద్ (భర్త)ను కలిశా. అప్పట్లో ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉండింది. తరువాత మా దోస్తీ కాస్తా ప్రేమగా మారింది.. రెండు కుటుంబాలు కలిసి మాట్లాడుకున్నాయి. పెళ్లికి నిర్ణయించాం. అదీ పూర్తయ్యింది. కానీ... అప్పుడూ.. ఇప్పుడూ వాళ్లు (ఉమర్ తదితరులు) జైళ్లల్లోనే ఉండిపోయారు. బెయిల్ రాలేదు.. విచారణ మొదలు కాలేదు.’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
సీఎం హోదాలో ఉండి సుప్రీం తీర్పుపై వ్యాఖ్యలా!
సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ కవితకు బెయిలు మంజూరుపై స్పందిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలా ఎలా మాట్లాడతారంటూ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ తప్పుబట్టారు. ఇలాంటి ప్రకటనల వల్ల ప్రజల్లో భయాందోళనలు కలగొచ్చని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డి నిందితుడిగా ఉన్న ఓటుకు కోట్లు కేసు దర్యాప్తు హైదరాబాద్ నుంచి భోపాల్‌కు బదిలీ చేయాలంటూ, బీఆర్ఎస్ నేతలు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, కల్వకుంట్ల సంజయ్, మొహమ్మద్ అలీలు దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్ గవాయి, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ల మార్పు అంశం ప్రస్తావనకు వచ్చిన సమయంలో.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కుదిరిన ఒప్పందం వల్లే కవితకు బెయిలు వచ్చిందంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తులు ఘాటుగా స్పందించారు.మనస్సాక్షి ప్రకారమే విధులు నిర్వర్తిస్తాం‘సుప్రీంకోర్టు తీర్పులపై వచ్చే విమర్శలు పట్టించుకోబోం. మాకెలాంటి ఇబ్బందీ లేదు. మనస్సాక్షి ప్రకారమే విధులు నిర్వర్తిస్తాం. ఇష్టం ఉన్నా లేకపోయినా మా విధులు మేం నిర్వర్తిస్తాం. కానీ న్యాయమూర్తులను అవమానించేలా ఇలాంటి ప్రకటనలు చేయకూడదు. ఆ తరహా ప్రకటనలు ఎలా చేయగలరు? రాజకీయ పార్టీలతో సంప్రదించిన తర్వాత ఆదేశాలు జారీ చేయాలా? రాజకీయ సంప్రదింపుల వరకూ వేచి ఉండాలా? సుప్రీంకోర్టు ఆదేశాలపై వ్యాఖ్యలు చేసే ధైర్యం ఎవరికైనా ఉంటే, మా తీర్పులపై గౌరవం లేకుంటే.. కేసు విచారణ సుప్రీంకోర్టులో కాకుండా మరెక్కడైనా జరగనివ్వండి..’ అంటూ జస్టిస్ గవాయి ఘాటుగా వ్యాఖ్యానించారు. పదే పదే అలాంటి వ్యాఖ్యలా?‘ఆ తరహా వ్యాఖ్యలు..మళ్లీ గురువారం ఉదయం కూడా! బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తొలి వంద రోజుల్లోనే ఈ తరహా స్టేట్మెంట్లు ఇవ్వడాన్ని ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. కోర్టుపై ఆక్షేపణలు చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి చేసే బాధ్యతాయుతమైన ప్రకటనేనా ఇది? న్యాయవ్యవస్థకు ఆమడ దూరంలో ఉండడమే కార్యనిర్వాహకుల ప్రాథమిక విధి. విమర్శించండి.. కానీ ఆక్షేపణలు వద్దు..’ అని జస్టిస్ విశ్వనాథన్ స్పష్టం చేశారు.అలాగైతే న్యాయాధికారులపై విశ్వాసం లేనట్లే అవుతుంది..‘ఓటుకు నోటు కేసు విచారణ బదిలీ చేయాలన్న పిటిషన్లు విచారణకు స్వీకరిస్తే న్యాయాధి కారులపై కోర్టుకు విశ్వాసం లేనట్లే అవుతుంది. ఎన్నికల సమయంలో ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తారు. చట్టసభల్లో జోక్యం చేసుకోబోమని ఎప్పుడూ చెబుతుంటాం. వారికీ ఇది వరిç్తÜ్తుంది..’ అని జస్టిస్ గవాయి పేర్కొన్నారు. దర్యాప్తు పారదర్శకంగా జరిగే అవకాశం లేదు: పిటిషనర్ల తరఫు న్యాయవాదివ్యాఖ్యల సవరణకు ప్రయత్నిస్తామని తెలంగాణ ప్రభుత్వం తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయ వాది ముకుల్ రోహత్గీ తెలిపారు. అయితే జరగా ల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయిందని, అటువంటి వ్యాఖ్యలు న్యాయమూర్తులపై ఒత్తిడి తీసుకు రావడంతోపాటు దిగువ కోర్టులకూ వ్యాపించే అవకాశం ఉందని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది సి.సుందరం పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ప్రస్తుతం సీఎం కావడంతో పాటు ఏసీబీని కూడా తన అధికార పరిధిలో ఉంచుకున్నారని, దర్యాప్తు పారదర్శకంగా జరిగే అవకాశం ఉండదని అన్నా రు. దర్యాప్తు అధికారులు కూడా మారారని చెప్పా రు. గతంలో దాఖలు చేసిన కౌంటరుకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. పోలీసులపై కూడా రేవంత్‌రెడ్డి వివాదాస్పద వ్యా ఖ్యలు చేశారని తెలిపారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అని, ఏ వ్యక్తీ తన సొంత విషయంలో న్యాయ మూర్తి కాకూడదనే సహజ న్యాయసూత్రం గుర్తుచేశారు. న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంచాలిఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మా సనం.. స్వతంత్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తే దర్యాప్తుపై విశ్వాసం పెరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. గతంలో దర్యాప్తుపై స్టే ఇచ్చిన అంశం, సీబీఐకి బదిలీ తదితర అంశాలపై ఆరా తీసింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంపై తెలంగాణకు చెందిన సహచరులను సంప్రదిస్తామని తెలిపింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తామని, అయితే ప్రస్తుత పిటిషన్‌ను కొట్టివేస్తామని పేర్కొంది. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంచాలని, అందరికీ విశ్వాసం కలిగేలా నియామకం చేపడతామని జస్టిస్ గవాయి చెప్పారు. ప్రస్తుత పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేంద్రరావుతో పాటు మరో న్యాయవాది ఉమా మహేశ్వరరావు ఉత్తమమని భావిస్తున్నామ న్నారు. అయితే తమకు పోలీసు అధికారుల విషయంలో ఆందోళన ఉందని పిటిషనర్ల తరఫు మరో సీనియర్ న్యాయవాది శేషా ద్రినాయుడు చెప్పారు. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. -
CJI D Y Chandrachud: బెయిల్ అర్జీలపై ‘సేఫ్ గేమ్’ వద్దు
బెంగళూరు: బెయిల్ అర్జీల విషయంలో ట్రయల్ కోర్టుల జడ్జీలు ‘సేఫ్ గేమ్’ ఆడుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. అనుమానాస్పదం అనే పేరు చెప్పి ప్రతి కేసులోనూ బెయిల్ తిరస్కరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఆదివారం బెంగళూరులో బెర్క్లే సెంటర్ 11వ వార్షిక సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ట్రయల్ కోర్టులు ప్రతి బెయిల్ పిటిషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలి. కానీ అనుమానాస్పదం పేరిట అర్జీలను ట్రయల్ కోర్టుల జడ్జీలు కొట్టేస్తున్నారు. ఇలాంటి సేఫ్‌గేమ్ పనికిరాదు. బెయిల్ అర్జీలపై ఇంగిత జ్ఞానంతో ఆలోచించాలి. కేసు ప్రాముఖ్యతను బట్టి తుది నిర్ణయం తీసుకోవాలి. అంతేగానీ పై కోర్టుకు వదిలేయకూడదు. ఎందుకంటే వాళ్లంతా హైకోర్టు గడపతొక్కుతున్నారు. అక్కడా బెయిల్ దొరక్కపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. అనవసరంగా అరెస్ట్ అయిన వాళ్లు కూడా సుప్రీంకోర్టు దాకా రావాల్సిన పరిస్థితి! ఇలాంటి కేసులన్నీ అంత దూరం రావడం సరికాదు’’ అన్నారు. వాతావరణ మార్పులు మహిళలు, చిన్నారులు, దివ్యాంగులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని సీజేఐ అన్నారు. ‘‘వాతావరణ మార్పులతో వలసలు పెరుగుతున్నాయి. ప్రజలకు నాణ్యమైన జీవితం కరువవుతోంది. ఆహార కొరతతో చిన్నారులు, ఇతర సమస్యలతో మహిళలు బాధ పడుతున్నారు. ఇబ్బందుల కొలిమిలో కాలిపోతున్నారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. -
హైకోర్టుల్లో 331 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 7, తెలంగాణ హైకోర్టులో 16 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలు, సబార్డినేట్ కోర్టుల్లో 84, తెలంగాణలో 115 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది. దేశంలో వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 331 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించింది. అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లోని జిల్లాలు, సబార్డినేట్ కోర్టుల్లో 5,432 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పదవులను ఎప్పటికప్పుడు భర్తీ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపింది. న్యాయమూర్తుల పదవీ విరమణ, రాజీనామాలు, పదోన్నతుల ద్వారా ఖాళీ అయిన పదవులను వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది. ఇది నిరంతర ప్రక్రియని స్పష్టం చేసింది. దేశంలోని జిల్లాల కోర్టుల్లో న్యాయమూర్తుల పదవులను భర్తీ చేయాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాల హైకోర్టులతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని పేర్కొంది. నిబంధనల ప్రకారం.. జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో న్యాయమూర్తుల ఎంపిక, నియామకాల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపింది. అలహాబాద్ హైకోర్టులో అత్యధికంగా 70 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించింది. ఆ తర్వాత పంజాబ్, హరియాణా ఉమ్మడి హైకోర్టులో 29, బాంబే హైకోర్టులో 25, కలకత్తా, గుజరాత్ హైకోర్టుల్లో 21 చొప్పున ఖాళీలు ఉన్నట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 1,250, గుజరాత్లో 535, బిహార్‌లో 467, తమిళనాడులో 334, రాజస్థాన్‌లో 300 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. -
హైకోర్టు శాశ్వత జడ్జీలుగా జస్టిస్ శ్రీనివాస్‌రావు,జస్టిస్ రాజేశ్వర్‌రావు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులోని అదనపు న్యాయమూర్తులు జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్‌రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావును శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని ఫిబ్రవరి 13న హైకోర్టు కొలీజియం నిర్ణయించింది. ముఖ్యమంత్రి, గవర్నర్లు దీనికి సమ్మతి తెలియ జేశారు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన కొలీజియం సమావేశమై శాశ్వత న్యాయమూర్తులుగా నియామకానికి జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వర్‌రావుకు తగిన అర్హతలు ఉన్నాయని నిర్ణయించింది. వారిద్దరినీ శాశ్వత న్యాయమూర్తు్తలుగా నియమించాలని ఈ నెల 16న కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను ఆమోదించిన కేంద్రం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే వారం వారు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఓయూ నుంచి బీఏ, ఎల్ఎల్బీ..సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో 1969, ఆగస్టు 31న జగ్గన్నగారి శ్రీనివాస్‌రావు జన్మించారు. ఆయన తల్లిదండ్రులు లక్ష్మీబాయి, మాణిక్యరావు. పాఠశాల విద్య లింగన్నపేటలో.. గంభీరావుపేట ప్రభుత్వ కళాశాలలో ఇంటర్, హైదరాబాద్ నారాయణగూడలోని భవన్స్ న్యూ సైన్స్ కళాశాల నుంచి డిగ్రీ చేశారు. ఓయూ నుంచి బీఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1999 ఏప్రిల్ 29న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. తొలుత జి.కృష్ణమూర్తి వద్ద జూనియర్‌గా పనిచేశారు. రిట్ సర్వీస్, నాన్ సర్వీస్ మ్యాటర్స్, సివిల్, క్రిమినల్ కేసులకు సంబంధించి ట్రయల్ కోర్టులు, హైకోర్టులు, ట్రిబ్యునళ్లలో సమర్థంగా వాదనలు వినిపించారు. 2006 నుంచి స్వతంత్ర న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2015 నుంచి న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టే వరకు సింగరేణి కాలరీస్ లిమిటెడ్ స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. 2022 ఆగస్టు 16న హైకోర్టు అదనపు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు ఈ రెండేళ్లలో కొన్ని వేల కేసుల్లో తీర్పులు వెలువరించారు. ఆయనకు భార్య శ్రీలత ఇద్దరు పిల్లలు ప్రణీత్, ప్రక్షిప్త ఉన్నారు. 2001లో ఏపీ బార్ కౌన్సిల్లో ఎన్రోల్మహబూబాబాద్ జిల్లా సూదన్‌పల్లిలో 1969 జూన్ 30న నామవరపు రాజేశ్వర్‌రావు జన్మించారు. తల్లిదండ్రులు గిరిజాకుమారి, సత్యనారాయణరావు. పాఠశాల విద్య వరంగల్‌లో.. హైసూ్కల్, ఇంటర్ గోవిందరావుపేటలో.. డిగ్రీ మహబూబాబాద్‌లో పూర్తి చేశారు. ఓయూ నుంచి లా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించారు. 2001 ఫిబ్రవరి 22న న్యాయవాదిగా ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యారు. తొలుత సీవీ రాములు కార్యాలయంలో న్యాయవాదిగా పనిచేశారు. 2015లో ఉమ్మడి హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులై 2019 వరకు విధులు నిర్వర్తించారు. యూజీసీ న్యాయవాదిగానూ పనిచేశారు. 2016 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 2019 వరకు ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ ప్యానల్‌గా విధులు నిర్వహించారు. 2019 నవంబర్ నుంచి అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా పనిచేస్తూ 2022 ఆగస్టు 16న అడిషనల్ జడ్జిగా పదోన్నతి పొందారు. దాదాపు ఈ రెండేళ్ల కాలంలో కొన్ని వేల కేసుల్లో తీర్పులు వెలువరించారు. -
నల్ల కోటు... రాజకీయం!
కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ రాజ్యానికి మూలస్తంభాలు. ఇందులో న్యాయ వ్యవస్థ మిగిలిన రెండింటికంటే విశిష్టమైనది. ఎందుకంటే మొత్తం మూడు వ్యవస్థల పరిధులనూ, పరిమితులనూ నిర్ణయించగల, నిర్దేశించగల స్థానం ఆ ఒక్క వ్యవస్థకు మాత్రమే వుంది. ఇతర రెండు వ్యవస్థలతో పోలిస్తే ఇప్పటికీ న్యాయ వ్యవస్థపై ప్రజలకు కొద్దో గొప్పో విశ్వనీయత వుంది. దానికి విఘాతం కలిగించే పరిణామాలు అడపా దడపా చోటుచేసుకుంటున్న సంగతి కూడా కాదనలేనిది. 175 ఏళ్ల చరిత్ర కలిగిన కలకత్తా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి, ఆ పదవికి రాజీనామా ఇచ్చిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ వైనం అటువంటిదే. తన రాజకీయ రంగ ప్రవేశంపై జస్టిస్ గంగోపాధ్యాయ ఇచ్చిన సంజాయిషీ ఆశ్చర్యం కలిగిస్తుంది. అధికార పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ తనను రోజూ దుమ్మెత్తిపోయటం, అసభ్య పదజాలంతో దూషించటం ఆయన తట్టుకోలేకపోయారట. కనుక నల్లకోటు, న్యాయదండం విడిచిపెట్టి ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకోవటమే ఆయనకు పరిష్కారంగా తోచింది! అలా అసభ్య పదజాలంతో దూషించే నేతలకు చదువు సక్రమంగా లేదన్న జస్టిస్ గంగోపాధ్యాయ విమర్శలో నిజం వుండొచ్చు. కానీ ఆయన చదువుసంధ్యలూ, విజ్ఞతా ఏమయ్యాయి? తాను వెలువరించే తీర్పులకు పూలు తప్ప రాళ్లు పడవని ఎలా అనుకున్నారు? తృణమూల్ సర్కారుపై వచ్చిన అవినీతి ఆరోపణల విషయంలో జస్టిస్ గంగోపాధ్యాయ కఠినంగా వ్యవహరించారన్న పేరు వుంది. మొత్తం 14 ఉదంతాల్లో ఆయన సీబీఐ దర్యాప్తు జరపాలని ఆదేశించారు. అందులో ఉపాధ్యాయ నియామకాల కోసం పెద్దయెత్తున ముడుపులు చేతులు మారాయన్న స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్సెస్సీ) కేసు ప్రధానమైనది. ఆయన ఉత్తర్వుల కారణంగా 2022లో ఉన్నత విద్యాశాఖమంత్రిగా వున్న పార్థా ఛటర్జీతోపాటు దళారులు, డబ్బులిచ్చి ఉద్యో గాల్లోకొచ్చిన కొందరు టీచర్లు అరెస్టయ్యారు. నిజానికి ఆ కేసులో జస్టిస్ గంగోపాధ్యాయ ఇచ్చిన ఆదేశాలు ఆయనకు పేరుప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. అవినీతిపై నిప్పులు కక్కే యోధుడిగా, సీఎం పదవికి అన్నివిధాలా అర్హతగల వ్యక్తిగా లోక్‌సభ కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌధురి అప్పట్లో కీర్తించారు. వామపక్షాలు సైతం ఆయన తీర్పులను ప్రశంసించాయి. కానీ అవి జస్టిస్ గంగో పాధ్యాయ చెవికి సోకినట్టు లేదు. ‘న్యాయమూర్తులుగా తమ తీర్పులు నచ్చకపోతే విమర్శించవచ్చు, అప్పీల్‌కు పోవచ్చు. కానీ దూషిస్తారా?’ అని ఆయన ప్రశ్నించటం సబబే. కానీ ఆయన చేయాల్సిందేమిటి? దూషణలకు జవాబుగా ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకోవటమా? ఇందువల్ల ఆయనకుగానీ, మొత్తంగా వ్యవస్థకుగానీ విశ్వసనీయత పెరుగుతుందా? నిరుడు జస్టిస్ గంగో పాధ్యాయ తృణమూల్‌ను విమర్శిస్తూ స్థానిక చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ దాన్ని తీవ్రంగా తప్పుబట్టి మందలించినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. న్యాయమూర్తి పదవిలో వుంటూ రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేయటం జస్టిస్ గంగోపాధ్యాయతోనే మొదలు కాలేదు. 1967లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ కోకా సుబ్బారావుతోపాటు జస్టిస్ రంగనాథ్ మిశ్రా, జస్టిస్ బహరూల్ ఇస్లాం, జస్టిస్ ఫాతిమా, జస్టిస్ సదాశివం, జస్టిస్ రంజన్ గొగోయ్ వరకూ ఎందరో వున్నారు. జస్టిస్ బహరూల్ ఇస్లాం 1983లో అప్పటి బిహార్ పీసీసీ(ఐ) అధ్యక్షుడు జగన్నాథ్ మిశ్రాపై వచ్చిన ఫోర్జరీ, నేరపూరిత ప్రవర్తన ఆరోపణలనుంచి ఆయన్ను విముక్తి చేసిన నెల రోజులకే అస్సాంలో ఎంపీగా పోటీచేసే అవకాశం వచ్చింది. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. రిటైర్మెంట్ అనంతరం లా కమిషన్, మానవహక్కుల సంఘం, కంపెనీ లా బోర్డు, వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ వంటి సంస్థలకు నేతృత్వం వహించే అవకాశం ఎటూ వుంటుంది. అది కూడా సరికాదని అభ్యంతరం చెప్పేవారున్నారు. రాజీనామా చేసిన వెంటనే బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించటం, అంతకు వారంరోజుల ముందు ఆ పార్టీ నేతలను సంప్రదించినట్టు చెప్పటం జస్టిస్ గంగోపాధ్యాయ విజ్ఞతపై సందేహాలు రేకెత్తిస్తుంది. ఈ వారంరోజుల్లో కేసులేమీ చూడలేదన్నంత మాత్రాన ఈ సందేహాలు సమసిపోవు. మిమ్మల్ని ముందుగా బీజేపీ నేతలే సంప్రదించారా అన్న ప్రశ్నకు ఆయన లౌక్యంగా ‘మేమిద్దరం ఒకరినొకరం సంప్రదించుకున్నాం’ అని చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ నీతివంతమైన పాలన గురించి ఎవరికీ భ్రమల్లేవు. నాలుగైదేళ్ల క్రితం ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే తమ పార్టీలో అవినీతి నేతలు మితిమీరుతున్నారనీ, వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాల్సి వుంటుందనీ హెచ్చరించిన సంగతి అందరికీ గుర్తుంది. ఇలాంటి పరిస్థితి వున్నది గనుకే జస్టిస్ గంగోపాధ్యాయ వెలువరించిన తీర్పులను అనేకులు ప్రశంసించారు. తన రాజకీయ రంగ ప్రవేశ నిర్ణయంతో ఆ తీర్పులపై సందేహాలు తలెత్తటానికి ఆయనే కార కులయ్యారు. బీజేపీ నేతలు స్వర్గీయ అరుణ్ జైట్లీ, ప్రస్తుత కేంద్రమంత్రి నితీన్ గడ్కరి వంటివారు పదవీ విరమణ తర్వాత జడ్జీలు ఏ పదవీ తీసుకోరాదని అభిప్రాయపడ్డారు. అసలు సీవీసీ పదవికున్నట్టే జడ్జీలకు సైతం రిటైరయ్యాక పదవులు చేపట్టరాదన్న ఆంక్షలుండాలని చాలామంది చెబుతారు. అలా కాకపోయినా కనీసం రెండేళ్లపాటు ఏ పదవీ తీసుకోకుండా వుండటం శ్రేయస్కరం. రాజకీయాలకు అతీతంగా న్యాయవ్యవస్థ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగల స్థితిలో వుందనే సంకేతం మన దేశ గౌరవాన్ని మరింత పెంచుతుందని అందరూ గుర్తించాలి. -
రాజ్యాంగం.. ఓ రక్షణ కవచం
సాక్షి, హైదరాబాద్: న్యాయమూర్తులు అంతర్నిర్మిత దురభిప్రాయాలను వదిలించుకోవాలని, రాజ్యాంగ నైతికతను అన్ని సమయాల్లో సమర్థించాల్సిన అవ సరం ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లు సూచించారు. నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ, తెలంగాణ హైకోర్టు శనివారం సంయుక్తంగా నిర్వ హించిన దక్షిణ భారత న్యాయమూర్తుల ప్రాంతీయ సదస్సు మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో జరిగింది. ఈ సద స్సుకు హాజరైన న్యాయమూర్తులు, జిల్లా జడ్జిలను ఉద్దేశించి వారు మాట్లాడారు. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా మాట్లాడుతూ.. ‘కేవలం లక్ష్యాలను సాధించా లనే ఉద్దేశంతో న్యాయమూర్తులు ప్రయత్నించకుండా, సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపర్చుకుని తీర్పుల్లో నాణ్యతను మరింత పెంచాలి. వీలైనంత త్వరిత పద్ధతిలో గుణాత్మక, సమర్థవంతమైన న్యా యాన్ని అందించాలి. బెయిల్ కోసం ఇంకా అనేక మంది నిందితులు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తోంది. రాజ్యాంగంలోని అత్యంత ప్రాధాన్యమైన ఆర్టి కల్ 21ని రక్షించడానికి మనం తీవ్రంగా కృషి చేయా లి. ఈ సోషల్ మీడియా యుగంలో మన పనితీరు పై ప్రజల పరిశీలన పెరిగిందన్న విషయాన్ని న్యా యమూర్తులు తెలుసుకోవాలి. న్యాయమూర్తులకు నిరంతర శిక్షణ ఎల్లప్పుడూ అవసరం. నాకు నచ్చిన సిటీల్లో హైదరాబాద్ ఒకటి. నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయ డం అభినందనీయం. కింది స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు ఏ న్యాయమూర్తికైనా శిక్షణ అవసరమే. ఒక్కో రాష్ట్రంలో చట్టాల్లో మార్పులు ఉంటాయి. అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది’అని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై మరింత నమ్మకం కలిగించాలి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మాట్లాడుతూ.. ‘ప్రజలకు న్యాయవ్యవస్థపై మరింత నమ్మకం కలిగేలా న్యా యమూర్తుల విధి నిర్వహణ ఉండాలి. న్యాయ వ్యవస్థ తమకు ఓ రక్షణ కవచం అన్న భావన కల్పించాలి. సామాన్యుల విశ్వాసం చూరగొన్నప్పుడే న్యా యవ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు. ఆ విశ్వ సనీయత కోల్పోయిన రోజు ఈ వ్యవస్థ నిష్ప్రయో జనం. అంతిమంగా రాజ్యాంగ సారాంశం సమా నత్వమే. పక్షపాతాలను పక్కకు పెట్టి పనిచేయాలి. న్యాయమూర్తులు ఉపన్యాసాలు ఇవ్వడం మాని.. చట్టప్రకారం మాత్రమే తీర్పులు వెల్లడించాలి’అని సూచించారు. అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ అలోక్ అరాధే మాట్లాడుతూ.. రా జ్యాంగం కేవలం ఒక చట్టపరమైన డాక్యుమెంట్ మాత్రమే కాదని, ప్రజల రక్షణ కవచమని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ జస్టిస్ సుజోయ్ పాల్, తెలంగాణ రాష్ట్ర న్యాయ అకాడమీ అధ్యక్షుడు జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, తెలంగాణ, ఇతర హైకోర్టుల న్యాయమూర్తులు మాట్లాడారు. -
హైకోర్టు జడ్జీలుగా ఐదుగురు
న్యూఢిల్లీ: నాలుగు హైకోర్టుల్లో నియామకానికిగాను సుప్రీంకోర్టు కొలీజియం అయిదుగురు జడ్జీల పేర్లను ప్రతిపాదించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలో భేటీ అయిన కొలీజియం ఈ మేరకు కేంద్రానికి సిఫారసులను పంపించింది. కొలీజియంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్ కూడా ఉన్నారు. జమ్మూ కశీ్మర్ అండ్ లద్దాఖ్ హైకోర్టుకు చెందిన జస్టిస్ రాహుల్ భారతి, జస్టిస్ మోక్షా ఖజూరియా కజి్మలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియంకోరింది. బాంబే హైకోర్టులో అదనపు జడ్జి అభయ్ అహుజాను శాశ్వత న్యాయమూర్తిగా, కోల్‌కతా హైకోర్టు న్యాయాధికారి చైతలి చటర్జీ(దాస్)ను అదే హైకోర్టులో న్యాయమూర్తిగా, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయాధికారి అరవింద్ కుమార్ వర్మను అదే హైకోర్టులో జడ్జిగా నియమించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. -
ఇద్దరు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తుల బదిలీకి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. జస్టిస్ సుధీర్‌కుమార్‌ను మద్రా స్ హైకోర్టుకు, జస్టిస్ చిల్లకూర్ సుమలతను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేయాలని కొద్ది రోజుల కిందట సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఆ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని కేంద్రమంత్రి పేర్కొన్నారు. వీరితోపాటు ఇతర రాష్ట్రాల కు చెందిన మరో ముగ్గురు న్యాయమూర్తుల బదిలీకికూడా రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. తెలంగాణ హైకోర్టులో మొత్తం న్యాయమూర్తు ల సంఖ్య (సీజేతో కలిపి) 42 కాగా, ప్రస్తుతం 28 మంది ఉన్నారు. జస్టిస్ చిల్లకూర్ సుమలత, జస్టిస్ సుధీర్‌కుమార్ బదిలీతో ఆ సంఖ్య 26కు చేరగా.. ఖాళీల సంఖ్య 16కు పెరిగింది. చదవండి: కేసీఆర్‌కు కోటి అప్పు ఇచ్చిన వివేక్ -
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జీలు
న్యూఢిల్లీ: ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందనున్నారు. సీజేఐ జస్టిస్ డీ వై చంద్రచూడ్ సారథ్యంలోని సుప్రీంకోర్టు కొలీజియం సోమవారం కేంద్రానికి ఈ మేరకు సిఫార్సు చేసింది. ఈ జాబితాలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, రాజస్తాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా ఉన్నారు. ప్రతిభ, సామర్థ్యం, నిజాయితీ, విశ్వసనీయత, నేపథ్యం తదితరాలను జాగ్రత్తగా మదింపు చేసిన అనంతరం సుప్రీం న్యాయమూర్తులుగా వారి పేర్లను సిఫార్సు చేసినట్లు కొలీజియం తెలిపింది. వారి నియామకాలకు కేంద్రం ఆమోదం తెలిపితే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34కు పెరుగుతుంది. న్యాయమూర్తులపై పెరుగుతున్న విపరీతమైన పని భారం దృష్ట్యా సుప్రీంకోర్టులో ఎప్పుడూ ఒక్క ఖాళీ కూడా ఉండకుండా చూడాల్సిన అవసరం ఉందని కొలీజియం అభిప్రాయపడింది. -
సీజే రోస్టర్‌కే జడ్జీలు కట్టుబడి ఉండాలి
సాక్షి, అమరావతి: ప్రధాన న్యాయమూర్తి (సీజే) మాత్రమే నిర్ణయించే రోస్టర్ (ఏ న్యాయమూర్తులు ఏ రకమైన కేసులు వినాలి)ను అనుసరించే విషయంలో సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి కేటాయించని కేసుపై న్యాయమూర్తులు విచారణ జరపడం తీవ్రమైన అనౌచిత్యమని స్పష్టంచేసింది. న్యాయమూర్తులందరూ కూడా ప్రధాన న్యాయమూర్తి నిర్ధేశించిన రోస్టర్‌కు కట్టుబడి ఉండాలని తేల్చిచెప్పింది. అలాగే, వారంతా క్రమశిక్షణతో వ్యవహరించాలని, సీజే కేటాయించిన కేసు తప్ప మరే ఇతర కేసును విచారించడానికి వీల్లేదని తెలిపింది. రోస్టర్ ప్రకారం నిర్ధిష్ట కేటగిరి కింద తమ ముందుకొచ్చిన కేసును విచారించడం లేదా సీజే నిర్ధిష్టంగా అప్పగించిన కేసును విచారించడం మాత్రమే న్యాయమూర్తులు చేయాల్సి ఉంటుందని ‘సుప్రీం’ స్పష్టంచేసింది. అలాగే, కొందరు కక్షిదారులు తాము అనుకున్న ఉత్తర్వులు పొందేందుకు తమ కేసును నిర్ధిష్టంగా ఓ న్యాయమూర్తి వద్దకు వచ్చేలా చేయడం.. ఉత్తర్వులిచ్చే అవకాశంలేని న్యాయమూర్తి ముందు నుంచి తమ కేసును తప్పించడం వంటి అనైతిక చర్యలకు పాల్పడుతుండటాన్ని కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఈ విధంగా ఫోరం షాపింగ్ (కావాల్సిన జడ్జి వద్దకు కేసు వచ్చేలా చేయడం, కేసు రాకుండా చేయడం)కు పాల్పడడం ఎంతమాత్రం సరికాదంది. తమ ముందున్న కేసులో కక్షిదారులు వ్యవహరించిన తీరు విస్మయకరమంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఫోరం షాపింగ్‌కు పాల్పడినందుకు ఆ కక్షిదారులకు రూ.50వేల జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ఇటీవల తీర్పు వెలువరించారు. మొదటక్వాష్.. పనికాకపోవడంతో రిట్ పిటిషన్.. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజస్థాన్‌కు చెందిన నలుగురు వ్యక్తులపై వేర్వేరుగా ఆరు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మరికొందరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ రెండు ఎఫ్ఐఆర్లను కొట్టేయాలంటూ నలుగురు వ్యక్తులు రాజస్థాన్ హైకోర్టులో సీఆర్పీసీ సెక్షన్–482 కింద క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఈ ఏడాది ఏప్రిల్ 23న విచారణ జరిపిన న్యాయమూర్తి ఆ నలుగురు వ్యక్తులు కోరిన విధంగా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో ఆ నలుగురు వ్యూహం మార్చి ఆరు ఎఫ్ఐఆర్లను కలిపేసి, వాటన్నింటినీ ఒకే ఎఫ్ఐఆర్గా పరిగణించాలని కోరుతూ 8 మే 2023న సివిల్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన మరో న్యాయమూర్తి ఆ నలుగురు వ్యక్తులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఫిర్యాదుదారు అంబలాల్ పరిహార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. ఆ నలుగురు వ్యక్తులు కూడా గతంలో తమకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించిన న్యాయమూర్తి ముందు తిరిగి తమ కేసు రాకుండా చేసేందుకే ఎఫ్ఐఆర్లన్నింటినీ కలపాలంటూ పిటిషన్ దాఖలు చేశారని అంబలాల్ తన పిటిషన్లో ఆరోపించారు. అంతేకాక.. ఎనిమిది ఎఫ్ఐఆర్లలో తమపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని కూడా కోరారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పైపెచ్చు ఫిర్యాదుదారులను అసలు ప్రతివాదులుగా చేర్చలేదని వివరించారు. ఫోరం షాపింగ్‌కు ఈ కేసు ఓ ఉదాహరణ.. వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. గతంలో ఎఫ్ఐఆర్లను కొట్టేయాలంటూ క్రిమినల్ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది, ఎఫ్ఐఆర్లన్నింటినీ కలిపేయాలంటూ సివిల్ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది ఒకరేనని గుర్తించింది. ఫోరం షాపింగ్‌కు ఈ కేసు ఓ ప్రామాణిక ఉదాహరణని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. అంతేగాక.. న్యాయ ప్రక్రియ దుర్వినియోగానికి ఈ కేసు ఓ మచ్చుతునకని కూడా తెలిపింది. ఎఫ్ఐఆర్లన్నింటినీ కలిపేయాలంటూ దాఖలు చేసిన సివిల్ రిట్ పిటిషన్‌ను అసలు ఎలా విచారించారంటూ విస్మయం వ్యక్తంచేసింది. క్రిమినల్ కేసులను విచారించేందుకు సీజే నిర్ధిష్ట రోస్టర్‌ను ఖరారు చేశారని.. ఈ కేసులో నలుగురు నిందితులు దాఖలు చేసినటువంటి పిటిషన్లను న్యాయస్థానాలు అనుమతిస్తూ వెళ్తే సీజే నిర్ధేశించే రోస్టర్‌కు ఎంతమాత్రం విలువ ఉండదని తేల్చిచెప్పింది. ఆ నలుగురు వ్యక్తులు మరో న్యాయమూర్తి ముందు దాఖలు చేసిన సివిల్ రిట్ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు తెలిపింది. ఈ నలుగురు వ్యక్తుల వ్యవహారశైలిని సెక్షన్–482 కింద వీరి పిటిషన్లను విచారిస్తున్న న్యాయమూర్తి దృష్టికి తీసుకురావాలని స్పష్టంచేసింది. ‘ఫోరం షాపింగ్’ బాబు బ్యాచ్‌కు కొట్టిన పిండి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో పాటు విభజిత ఏపీ హైకోర్టులో కూడా ఫోరం షాపింగ్, నాట్ బిఫోర్ అనగానే వెంటనే గుర్తొచ్చేది చంద్రబాబు అండ్ కోనే. గతంలో ఎన్నడూ వినని, తెలియని ఫోరం షాపింగ్, నాట్ బిఫోర్ వంటి వాటిని సామాన్య జనానికి తెలిసేలా చేసింది ఆ బ్యాచే. గతంలో చంద్రబాబు ఈ ‘ఫోరం షాపింగ్’ ను అడ్డంపెట్టుకుని ఎన్నో కేసుల నుంచి బయటపడ్డ ఉదంతాలున్నాయి. ♦ అక్రమాస్తులకు సంబంధించి లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్లో చంద్రబాబు ఏ రకంగా వ్యవహరించారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ♦ రామోజీ, చంద్రబాబు తదితరుల అక్రమార్జనపై వైఎస్ విజయమ్మ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంలోనూ చంద్రబాబు అండ్ కో వేసిన నాట్ బిఫోర్ నాటకాలతో న్యాయవ్యవస్థే విస్మయం చెందింది. ♦ ఫలానా న్యాయమూర్తి తమకు అనుకూలంగా ఉత్తర్వులివ్వరని భావిస్తే, అతనిపైకి కొందరు న్యాయవాదులను ఉసిగొల్పి, ఆ న్యాయమూర్తితో ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకుని ఆ కేసు విచారణ నుంచి ఆ న్యాయమూర్తులు తప్పుకునేలా చేసిన కేసులూ ఎన్నో. ♦ ఇలా న్యాయమూర్తులతో గొడవలు పెట్టుకున్నందుకు ఆ న్యాయవాదులకు పెద్ద మొత్తాల్లో డబ్బు ముట్టజెప్పిన సంగతి న్యాయవర్గాల్లో అందరికీ తెలుసు. ♦ తాజాగా.. ఓ కేసులో కూడా చంద్రబాబు బృందం ఇలానే ఫోరం షాపింగ్‌కు పాల్పడింది. దీనిపై ప్రస్తుతం న్యాయవర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. -
CBN Arrest: ‘క్యాంపెయిన్‌గా జడ్జిలను ట్రోల్ చేశారు’
సాక్షి, గుంటూరు: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత.. ఆయన పిటిషన్లను విచారించిన జడ్జిలపై రాజకీయపరంగా.. ఉద్దేశపూర్వకంగానే దూషణల పర్వం కొనసాగిందని ఏపీ ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు ఏపీ హైకోర్టులో ఇవాళ క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్‌పై విచారణ జరిగింది. పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో.. టీడీపీ నేత బుద్దా వెంకన్న, గోరంట్ల బుచ్చయ్య చౌదరీ సహా 26 మందికి నోటీసులు జారీ చేయాలని బుధవారం హైకోర్టు ఏపీ డీజీపీని ఆదేశించింది. క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా.. ‘‘క్యాంపెయిన్‌గా జడ్జిపై ట్రోలింగ్ చేశార’’ని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తెలిపారు. ఇద్దరు హైకోర్టు జడ్జీలు, ఏసీబీ జడ్జి ఫ్యామిలీ టార్గెట్‌గా ట్రోలింగ్ నడిచిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన. దీంతో ట్రోల్ చేసిన సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించి.. ఆ 26 మందికి నోటీసులు ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు. తదుపరి చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. నాలుగు వారాలకు పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది హైకోర్టు. యెల్లో బ్యాచ్‌తో పాటు చంద్రబాబు అరెస్ట్ తర్వాత హైకోర్టు, దిగువ కోర్టు జడ్జిలపై దూషణల పర్వం కొనసాగింది. టీడీపీ నేతలు, చంద్రబాబు సానుభూతి పరులు న్యాయవ్యవస్థపై దుర్మార్గపు వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులపై నిందలు, ఆరోపణలు, విమర్శలు చేసింది పచ్చ మీడియా. దీంతో ఈ వ్యవహారంలో బుద్దా వెంకన్న సహా 26 మంది ప్రతివాదులుగా చేర్చింది ప్రభుత్వం. బుద్దా వెంకన్నతో పాటు ఎస్. రామకృష్ణ, మరికొన్ని సోషల్ మీడియా పేజీల నిర్వాహకులకు పరిశీలన తర్వాత నోటీసులు జారీ కానున్నాయి. అలాగే ప్రతివాదులుగా ఉన్న గూగుల్, ఎక్స్(ట్విటర్), ఫేస్‌బుక్‌కు కూడా నోటీసులు ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. మహాదారుణంగా.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది. కోర్టులో 10 గంటల వాదనల తరువాత చంద్రబాబుకు రిమాండ్ విధించింది. ఆపై హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. దానిని హైకోర్టు కొట్టేసింది. అయితే ఈ తీర్పులను ఇచ్చిన జడ్జీలను సామాజిక మాధ్యమాల వేదికగా వికృత రూపాల్లో తూలనాడుతూ పోస్టులు వెల్లువెడ్డాయి. రాష్ట్రపతి కార్యాలయం స్పందన మరోవైపు జడ్జీలపై అభ్యంతరకర పోస్టులపై రాష్ట్రపతి భవన్ పై స్పందించి పోస్ట్ లు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్రపతి కార్యాలయం లేఖ రాసింది. తదనంతరం హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. -
అడ్డంగా దొరికిపోయి.. జడ్జిలపై నిందలా!
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): ‘అడ్డగోలుగా తప్పులు చేసి సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికిపోయి.. ఆ కేసుల్లో తీర్పు చెప్పిన జడ్జిలపై నిందలు వేస్తారా’ అంటూ టీడీపీ నాయకులు, ఆ పార్టీ అనుకూల మీడియాను పలువురు వక్తలు ప్రశ్నించారు. విజయవాడలోని ఐలాపురం హోటల్లో ఆంధ్రా అడ్వకేట్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో ‘కోర్టు తీర్పులపై రాజకీయాలు–వక్ర భాష్యాలు’ అనే అంశంపై శనివారం సదస్సు జరిగింది. ఫోరం కన్వినర్ బి.అశోక్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో న్యాయవాదులు, న్యాయ నిపుణులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, మేధావులు పాల్గొన్నారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించిన నాటి నుంచి టీడీపీ నాయకులు, అనుకూల మీడియా న్యాయవ్యవస్థపై, జడ్జిలపై విమర్శలు చేయడాన్ని వక్తలు ఖండించారు. జడ్జిలపై వ్యక్తిత్వ హననం చేసేలా ఉన్న వ్యాఖ్యలను కోర్టులు సుమోటోగా తీసుకోవాలన్నారు. తీర్పులు తమకు అనుకూలంగా వస్తే ఒక విధంగా, వ్యతిరేకంగా వస్తే మరో విధంగా జడ్జిలపై నిందలు వేస్తూ మాట్లాడటం సరికాదని హితవు పలికారు. కోర్టు సాక్ష్యాధారాలు చూస్తుందని, చంద్రబాబు కేసులో పూర్తి సాక్ష్యా«ధారాలు చూపినందు వల్లే కోర్టు ఆయనకు రిమాండ్ విధించిందన్నారు. సదస్సు అనంతరం న్యాయవ్యవస్థపై నిర్వహించిన క్విజ్ పోటీలలో గెలుపొందిన పాఠశాలల విద్యార్థులకు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేశారు. సదస్సులో వివిధ సంఘాల ప్రతినిధులు ఎం శ్రీనివాసరెడ్డి, బడేజానీ, హృదయరాజు, ఎం.కోటేశ్వరరావు, వలిపర్తి బసవరాజు తదితరులు పాల్గొన్నారు. న్యాయస్థానం సుమోటోగా తీసుకోవాలి రాష్ట్రంలో ప్రధాన మీడియా తీర్పులు చెప్పిన జడ్జిల వ్యక్తిత్వ హననానికి తెగబడుతోంది. తీర్పులపై చర్చలు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. ఇది కచి్చతంగా కోర్టు ధిక్కారం అవుతుంది. హైకోర్టు, సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకోవాలి. జైలర్ సెలవుపై పుంఖాను పుంఖాలుగా కథనాలు రాశారు. చివరికి అతని భార్య చనిపోతే ఆ వార్త కూడా కనిపించకుండా చేశారు. – విజయబాబు, అధ్యక్షుడు, అధికార భాషా సంఘం కేసు పూర్వాపరాలు చూసే రిమాండ్ స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు సాక్ష్యా«ధారాలతో దొరికిపోయారు. జడ్జి పూర్వాపరాలు పరిశీలించిన మీదటే రిమాండ్ విధించారు. బెయిల్ పిటిషన్ వేయకుండా రిమాండ్ విధించడమే తప్పు అన్న వాదన తెచ్చారు. చంద్రబాబు తాను తప్పు చేయకపోతే నిర్థోíÙత్వం నిరూపించుకోవాలి. జడ్జిలను తప్పుబట్టడం, న్యాయస్థానాలను తప్పుబట్టడం సరికాదు. – పి.గౌతంరెడ్డి, చైర్మన్, ఏపీ ఫైబర్ నెట్ జడ్జిల వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు కేసులు విచారణలో ఉండగా వాటిపై చర్చలు పెట్టడం, విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. అక్రమ అరెస్ట్, రిమాండ్ అక్రమం, నిర్బంధం అక్రమమంటూ చెబుతున్నారు. వాస్తవానికి అది చెప్పాల్సింది కోర్టులు. కోర్టులు చెప్పాల్సిన అంశాలను మీడియా చానల్స్ చెప్పడం దురదృష్టకరం. – వీవీఆర్ కృష్ణంరాజు, ఎడిటర్స్ అసోసియేషన్ చంద్రబాబు బొక్క బోర్లా పడ్డాడు స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించడం చరిత్రాత్మక తీర్పు. ఇన్నాళ్లూ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తప్పించుకు తిరుగుతున్న చంద్రబాబు చట్టం ముందు బొక్క బోర్లా పడ్డాడు. లూథ్రాను ఆంధ్ర న్యాయవాదులు తిప్పికొట్టారు. – ఎం.గురునాథం, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్డీఎఫ్ ప్రభుత్వంపై బురద జల్లడం సరికాదు చంద్రబాబు కేసులో నిష్పక్ష తీర్పు వచ్చింది. చంద్రబాబుకు జైల్లోనూ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. తనకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. జడ్జిలపై విమర్శలు చేస్తూ ఏవేవో ఆపాదిస్తూ నిందలు వేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. – విఠల్ రావు, సీనియర్ న్యాయవాది సూత్రధారులకు శిక్ష తప్పదు ఏ కేసులోనైనా నేరం చేసిన వాడిది ఎంత తప్పో, నేరానికి ప్రేరేపించిన వాడిది అంతే తప్పు. కేసులో సాక్ష్యాధారాలు ఉంటేనే కోర్టు రిమాండ్ విధిస్తుంది. చంద్రబాబు కేసులో అదే జరిగింది. న్యాయవ్యవస్థపై, జడ్జిలపై నిందలు మోపొద్దు. – జయరాజ్, మాజీ పీపీ తీర్పులకు వక్రభాష్యం తగదు తవ్వేకొద్దీ చంద్రబాబు స్కామ్‌లు బయటకు వస్తున్నాయి. ఇన్నాళ్లు కొందరు వ్యక్తులను అడ్డుపెట్టుకుని వ్యవస్థలను అనుకూలంగా మార్చుకున్నారు. అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు రిమాండ్ విధిస్తే జడ్జి తీర్పులపై వక్రభాష్యం చెబుతున్నారు. కోర్టు తీర్పులపై మీడియా తప్పుడు ప్రచారం చేయడం సరికాదు. – ఎం.వెంకటేశ్వరరెడ్డి, హోటల్స్ అసోసియేషన్ -
కింది కోర్టుల లాయర్లనూ హైకోర్టు జడ్జిలుగా నియమించాలి
సాక్షి, అమరావతి : హైకోర్టు జడ్జిలుగా కేవలం హైకోర్టు న్యాయవాదులనే కాక కింది కోర్టుల లాయర్లను సైతం పరిగణనలోకి తీసుకోవాలని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ కోరారు. కింది కోర్టుల్లో కూడా ఎంతో మంది ప్రతిభావంతులైన న్యాయవాదులు ఉన్నారని తెలిపారు. కింది కోర్టుల్లో ఉన్న సీనియర్ లాయర్లకు సీనియర్ న్యాయవాది హోదా కల్పించాలన్నారు. శనివారం గుంటూరులో జరిగిన ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) రాష్ట్ర మహాసభల్లో జస్టిస్ దేవానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నత న్యాయవ్యవస్థలో ‘సామాజిక భిన్నత్వం’ లోపించిందని అన్నారు. అణగారిన వర్గాలు, మహిళల సంఖ్య పెరగాలని చెప్పారు. 2018 నుంచి 2023 వరకు హైకోర్టుల్లో 601 మంది న్యాయమూర్తుల నియామకాలు జరగ్గా, అందులో జనరల్ కోటా 457 మంది, ఎస్సీలు 18 మంది, ఎస్టీలు 9 మంది, ఓబీసీలు 72 మంది, మహిళలు 91 మంది, మైనారిటీలు 32 మంది, ఇతరులు 13 మంది ఉన్నారన్నారు. న్యాయవ్యవస్థలో రిజర్వేషన్ విధానం లేకపోయినప్పటికీ, న్యాయమూర్తుల నియామకాల్లో అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని చెప్పారు. న్యాయమూర్తుల నియామకాల్లో నా ణ్యతపై లా కమిషన్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు చేసిన సిఫార్సులను కొలీజియం పరిగణనలోకి తీసుకో వాలని కోరారు. దేశంలోని కోర్టుల్లో దాదాపు 5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటి భారం చాలా తీవ్రమైన అంశమని చెప్పారు. న్యాయం అందించడంలో జాప్యం జరిగితే న్యాయం అందని పరిస్థితికి దారి తీస్తుందన్నారు. జాప్యం ఇలాగే కొనసాగితే విసిగిపోయిన కక్షిదారులు రాజ్యాంగేతర, అసాంఘిక శక్తులను ఆశ్రయించి తక్కువ ఖర్చుతో వేగవంతమైన న్యాయం పొందేందుకు ప్రయత్నిస్తారని తెలిపారు. ఇది అంతిమంగా శాంతిభద్రతల సమస్యగా మారి, సమాజంలో అశాంతి, అరాచకానికి దారి తీస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత న్యాయమూర్తులు, న్యాయవాదులపై ఉందని తెలిపారు. న్యాయవాదుల రక్షణకు చట్టం తెచ్చేలా తీర్మానం చేయాలని ఐలూ కార్యవర్గాన్ని కోరారు. ఈ సందర్భంగా జస్టిస్ దేవానంద్‌ను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు విఘాతం పార్లమెంట్ చేసే చట్టాలను సమీక్షించే అధికారాన్ని న్యాయవ్యవస్థకు రాజ్యాంగం ఇచ్చిందని, దీంతో న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేందుకు కార్యనిర్వాహక వ్యవస్థ చాలా గట్టిగా ప్రయత్నిస్తోందని ఐలూ జాతీయ కార్యదర్శి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వి.సురేంద్రనాథ్ చెప్పారు. అందులో భాగంగానే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం న్యాయవ్యవస్థపై దుష్ప్రచారం మొదలు పెట్టిందన్నారు. న్యాయమూర్తుల ఎంపికలో ఆధిపత్యానికి ఆరాటపడుతోందన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటే ప్రజాస్వామ్యం మరో విధంగా మారుతుందని, దేశం లౌకిక, సార్వభౌమ దేశంగా కొనసాగే పరిస్థితి ఉండదని చెప్పారు. దీనిని అడ్డుకోవాల్సిన బాద్యత న్యాయవాదులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఐలు రాష్ట్ర అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లి సత్యనారాయణ, ఏపీ కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మణిపూర్ కోసం ముగ్గురు మాజీ మహిళా జడ్జీలతో కమిటీ.. సుప్రీం కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: మణిపూర్ ఘటనలపై విచారణ సందర్భంగా ఇవాళ సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మణిపూర్ హింసపై దర్యాప్తు కోసం ముగ్గురు మాజీ మహిళా హైకోర్టు జడ్జిలతో కమిటీ కూడిన కమిటీని ప్రతిపాదించింది. దర్యాప్తు పరంగానే కాకుండా.. పునరావాసం, ఇతరత్రా అంశాలపైనా ఈ కమిటీ దృష్టిసారిస్తుందని స్పష్టం చేసింది. అంతేకాదు వివిధ రాష్ట్రాల నుంచి డీజీఐ ర్యాంక్ అధికారులతో కూడిన 42 సిట్లు... సీబీఐయేతర కేసులు విచారణ చేపడతాయని తెలిపింది. ఒక్కో అధికారి ఆరు సిట్లను పర్యవేక్షిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘‘మా ప్రయత్నాలు చట్ట పాలనపై విశ్వాసాన్ని పునరుద్ధరించడం. మేము ఒక స్థాయిలో ముగ్గురు మాజీ హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీ దర్యాప్తు మాత్రమే కాకుండా - సహాయక చర్యలను, నివారణ చర్యలు మొదలైనవాటిని కూడా పరిశీలిస్తుంది’’ అని చీఫ్ జస్టిస్ డీవైచంద్రచూడ్ ప్రకటించారు. ► ముగ్గురు సభ్యుల కమిటీలో జమ్ము కశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షాలినీ జోషి, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆశా మీనన్ ఉన్నట్లు తెలిపింది. ► సీబీఐ దర్యాప్తు బృందంలో ఐదు రాష్ట్రాల నుంచి డిప్యూటీ సూపరిడెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారులు ఐదుగురు ఉంటారని, సీబీఐ దర్యాప్తును మాజీ ఐపీఎస్ అధికారి దత్తాత్రేయ పద్సల్గికర్ Dattatray ‘Datta’ Padsalgikar (మహారాష్ట్ర మాజీ డీజీపీ) పర్యవేక్షిస్తారని తెలిపింది. ► సీబీఐకి ట్రాన్స్ఫర్ కాని కేసుల్ని 42 సిట్లు విచారణ చేపడతాయి. ఈ సిట్లను మణిపూర్ రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి డీఐజీ ర్యాంక్ అధికారులు నేతృత్వం వహిస్తారు. దర్యాప్తు సక్రమంగా సాగుతుందో లేదో.. ఒక్కో అధికారి ఆరు సిట్లను చూసుకుంటారు అని తెలిపింది. అంతకు ముందు.. మణిపూర్ డీజీపీ రాజీవ్ సింగ్ వ్యక్తిగతంగా చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు హాజరయ్యారు. ఎఫ్ఐఆర్ల వ్యవహారం తప్పుల తడకగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఆయన్ని హాజరు కావాలంటూ ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక.. మణిపూర్ హింసపై దర్యాప్తునకు ఆరు జిల్లాల వారీగా ప్రత్యేక దర్యాప్తు బృందాలను(సిట్) ఏర్పాటు చేసినట్లు కేంద్రం సుప్రీం కోర్టుకు నివేదించింది. బయట నుంచి కాకుండా.. సిట్లను జిల్లా స్థాయిల్లో ఏర్పాటు చేయించి దర్యాప్తునకు అనుతించాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెంచ్‌కు తెలిపారు. అయితే సుప్రీం మాత్రం తమ ప్రతిపాదనకే మొగ్గు చూపించింది. -
కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్ కళాసికం సుజన, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఫస్ట్ కోర్టు హాల్లో ఉదయం 9.45 గంటలకు జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, అడ్వొ కేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, న్యాయవాదులు తదిత రులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన సుజన, లక్ష్మీనారాయణ, అనిల్ కుమార్‌లను అదనపు జడ్జీలుగా నియమిస్తూ రాష్ట్ర పతి గత వారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరి నియామకంతో హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. ఇంకా శాశ్వత, అదనపు న్యాయమూర్తులు కలిపి 12 ఖాళీలున్నాయి. బాధ్యతలు చేపట్టిన తొలిరోజే కొత్త న్యాయమూర్తులు కేసుల విచారణలో పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో... సోమవారం సాయంత్రం తెలంగాణ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్త న్యాయమూర్తులు జస్టిస్ సుజన, జస్టిస్ లక్ష్మీనారాయణ, జస్టిస్ అనిల్ కుమార్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏఏ అధ్యక్షుడు పల్లె నాగేశ్వర్రావు, ఉపాధ్యక్షుడు కల్యాణ్‌రావు చెంగల్వ, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
కొత్త కోర్టులతో సత్వర న్యాయం అందాలి
విజయనగరం లీగల్: విజయనగరం జిల్లాలో కొత్తగా ఏర్పాటైన న్యాయస్థానాల ద్వారా ప్రజలకు సత్వర న్యాయం అందాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు అభిలషించారు. ఈ దిశగా న్యాయాధికారులు, న్యాయవాదులు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. విజయనగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో కొత్తగా మంజూరైన అదనపు సీనియర్ సివిల్ కోర్టుని ఆదివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి, జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ ఉపమాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ దుప్పల వెంకటరమణ ప్రారంభించారు. న్యాయసేవా సదన్‌లో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కార్యాలయాన్ని జస్టిస్ ఏవీ శేషసాయి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ యువ న్యాయవాదులకు తగిన శిక్షణ ఇచ్చి మెరికల్లాంటి న్యాయవాదులను అందించాలని సీనియర్ న్యాయవాదులకు సూచించారు. న్యాయవాదులు, న్యాయాధికారులు పరస్పరం గౌరవించుకోవడం ద్వారా సమాజానికి మేలు చేయగలమన్నారు. జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ మాట్లాడుతూ జిల్లా కోర్టు భవన సముదాయాలకు రూ.99 కోట్లతో మంజూరైన కొత్త భవనాలను నాణ్యతగా నిరి్మంచేలా బార్ కౌన్సిల్, యంత్రాంగం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా జడ్జి బి.సాయి కళ్యాణచక్రవర్తి, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు తదితరులు పాల్గొన్నారు.