దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలోనే సంచలనం! దేశంలో ఇంతకు ముందెన్నడూ చోటుచేసుకోని అనూహ్య పరిణామం. సర్వోన్నత న్యాయస్థానానికి చెందిన నలుగురు న్యాయమూర్తులు తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. సుప్రీంకోర్టులో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలపై గొంతువిప్పారు. కొద్దినెలలుగా కోర్టు పాలన వ్యవస్థలో అవాంఛనీయ పరిణామలు చోటు చేసుకుంటున్నాయని, ఇది దేశ ప్రజాస్వామ్యానికే ముప్పు అని వ్యాఖ్యానించారు. కేసుల కేటాయింపు, కొన్ని కేసుల్లో కోర్టు ఉత్తర్వులను ప్రస్తావిస్తూ.. ఒకవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ దీపక్ మిశ్రాపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఈ అసాధారణ పరిణామం అటు న్యాయవ్యవస్థలో ఇటు ప్రభుత్వ, రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. – సాక్షి, న్యూఢిల్లీ
దేశ అత్యున్నత న్యాయస్థానం ఔన్నత్యాన్ని కాపాడాలి. లేదంటే దేశంలో ప్రజాస్వామ్యం మనజాలదు. సుప్రీం కోర్టులో జరుగుతున్న అవాంఛనీయ పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ నలుగురం ప్రధాన న్యాయమూర్తిని కలిశాం. కానీ మా ప్రయత్నాలన్నీ విఫల మయ్యాయి. న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడేలా చర్యలు చేపట్టాల్సిందిగా మేం సీజేని ఒప్పించలేకపోయాం. ఇలా న్యాయమూర్తులు మీడియా ముందుకు రావడం దేశంలో అసాధారణం. కానీ తప్పలేదు. సుప్రీంకోర్టు పాలన విషయంలో జరుగుతున్న పరిణామాలు దేశ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. సీజేఐ అభిశంసన విషయంపై దేశమే నిర్ణయం తీసుకోవాలి. – ‘ప్రెస్‌మీట్’లో జస్టిస్ జాస్తి చలమేశ్వర్
దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపే ముఖ్యమైన కేసులను కూడా గతంలో పని చేసిన సీజేఐలు ఎలాంటి హేతుబద్ధ ప్రాతిపదిక లేకుండా, తమ ఇష్టానుసారంగా వివిధ బెంచ్‌లకు కేటాయించేవారు. ఈ పోకడకు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకట్ట వేయాలి. లేదంటే ఇది అవాంఛనీయ పరిస్థితులకు దారి తీస్తుంది. న్యాయ వ్యవస్థ నిజాయతీపైనా అనుమానాలకు తావిస్తుంది. సీజేకు ఉన్న కేసుల కేటాయింపు, రోస్టర్ అధికారం కోర్టు మరింత సమర్థంగా పనిచేయడానికి మాత్రమే. అంతేకానీ జడ్జీలపై అధికారం చలాయించేందుకు కాదు. చీఫ్ జస్టిస్ అంటే ‘సమానుల్లో ప్రథముడు.’ అంతే తప్ప ఎవరికంటే ఎక్కువ కాదు. తక్కువ కాదు. – ‘లేఖ’లో నలుగురు ‘సుప్రీం’ న్యాయమూర్తులు
తీవ్ర ఆవేదనతో మీడియా ముందుకొచ్చాం..
సుప్రీం కోర్టు సీనియర్ జడ్జిలు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు శుక్రవారం జస్టిస్ చలమేశ్వర్ నివాసంలో మీడి యా సమావేశం నిర్వహించారు. జడ్జిలు ఇలా మీడియా ముందుకు రావడం అసాధారణమని, కానీ మరో మార్గం లేక తీవ్ర ఆవేదన, బాధతో ఇలా రాక తప్పలేదని స్వయంగా జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. సుప్రీంకోర్టులో గత కొద్ది నెలలుగా జరుగుతున్న అవాంఛనీయ పరిణామాలపై ఆవేదన చెంది, వాటిని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లామని, కానీ ఆయన ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లిన అంశాలతో కూడిన లేఖను మీడియాకు విడుదల చేశారు. ఈ లేఖను కొద్ది నెలల ముందే సీజేకు పంపినట్టు వివరించారు. కోర్టు పాలనా తీరును సరిదిద్దాలంటూ శుక్రవారం ఉదయం కూడా ఆయన్ను కలిసినట్టు వివరించారు. ‘‘దేశ అత్యు న్నత న్యాయస్థానం ఔన్నత్యాన్ని కాపాడాలి. లేదంటే దేశంలో ప్రజాస్వామ్యం మనజాలదు. సుప్రీంకోర్టులో జరుగుతున్న అవాంఛనీయ పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ మేం నలుగురం ప్రధాన న్యాయమూర్తిని కలిశాం. కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరాం. కానీ దురదృష్టవశాత్తూ మా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడేలా చర్యలు చేపట్టాల్సిందిగా మేం సీజేని ఒప్పించలేకపోయాం. న్యాయవ్యవస్థ, దేశం పట్ల మేం బాధ్యతాయుతంగా ఉన్నాం. ఇలా జడ్జిలు మీడియా ముందుకు రావ డం దేశంలో అసాధారణమే అయినా.. కానీ రాక తప్పలేదు. సుప్రీంకోర్టు పాలన విషయంలో జరుగుతున్న పరిణామాలు దేశ ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్న విషయంలో మేం నలుగురం ఏకాభిప్రాయంతో ఉన్నాం’’ అని జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. కోర్టు పాలనలో జరుగుతున్న అవాంఛనీయ అంశాలు ఏంటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘సీజే ద్వారా జరుగుతున్న కేసుల కేటాయింపు’వంటివి అందులో కొన్ని అని బదులిచ్చారు.
ఉన్నట్టుండి.. కోర్టును వీడి
మీడియా ముందుకు వచ్చి సంచలనం సృష్టించిన నలుగురు జడ్జిలు శుక్రవారం ఉదయం ఎప్పట్లాగే సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. ఉదయం 11.30 గంటల సమయంలో జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ తమ కోర్టు రూంలకు చేరుకున్నారు. జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి లోకూర్ కూడా తమ చాంబర్‌లో కేసులు విన్నారు. నిమిషాల వ్యవధిలోనే ఈ నలుగురు కోర్టును వీడి 4, తుగ్లక్ రోడ్ బంగ్లాలో ఉన్న జస్టిస్ చలమేశ్వర్ నివాసానికి చేరుకుకొని కాసేపటికే మీడియా ముందుకు వచ్చారు. జడ్జిలు ఉన్నట్టుండి బయటకు వెళ్లారన్న వార్త కోర్టు కారిడార్లలో తీవ్ర చర్చకు దారి తీసింది.
ఇక జడ్జిల మీడియా సమావేశానికి హేమాహేమీలైన లాయర్లు, పాత్రికేయులు హాజరయ్యారు. శేఖర్ గుప్తా, ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్ తదితరులు తరలి వచ్చారు. జైసింగ్ కొన్ని ప్రశ్నలు అడగబోగా.. ఇది మీడియా సమావేశమని, మేమే అడగాలని కొందరు పాత్రికేయులు అభ్యంతరం తెలిపారు. అయితే తాను ఓ పౌరురాలిగా అడుగుతున్నట్టు జైసింగ్ వారికి బదులిచ్చారు. మొత్తంగా జడ్జిలు 7–8 నిమిషాలు మీడియాతో మాట్లాడారు.
సీజేతో ఏజీ భేటీ..
జడ్జిల మీడియా సమావేశం నేపథ్యంలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సీజే జస్టిస్ దీపక్ మిశ్రాతో భేటీ అయ్యారు. సమావేశంలో వీరిద్దరు ఏం చర్చించారన్న అంశాలు తెలియరాలేదు. సీజే, ఏజీలు కూడా మీడియా సమావేశంలో మాట్లాడతారన్న వార్తలు వచ్చాయి. దీంతో పాత్రికేయులంతా సుప్రీంకోర్టుకు హుటాహుటిన వెళ్లి సాయంత్రం 4 గంటల దాకా నిరీక్షించారు. కానీ వారు మీడియా ముందుకు రాలేదు.
అభిశంసనపై దేశమే నిర్ణయించాలి..
సీజేఐని అభిశంసించాలని కోరుకుంటున్నారా అని మీడియా జస్టిస్ చలమేశ్వర్‌ను అడగ్గా.. ‘‘ఆ విషయంపై జాతి నిర్ణయం తీసుకుంటుంది’’అని సమాధానమిచ్చారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం 25 మంది జడ్జిలు ఉన్నారు. గత ఆగస్టు 28న జస్టిస్ మిశ్రా సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది అక్టోబర్ 2న ఆయన పదవీకాలం ముగియనుంది. ఈయనతోపాటు ప్రస్తుతం మీడియా ముందుకు వచ్చిన నలుగురు న్యాయమూర్తులు కొలీజియంలో ఉన్నారు.
సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసుపై విచారణ జరుపుతున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి బీహెచ్ లోయా అనుమానాస్పద మృతి కేసును సుప్రీం శుక్రవారమే విచారణకు స్వీకరించింది. ఇదే సమయంలో జడ్జీలు మీడియా ముందుకు రావడం సంచలనం రేకెత్తించింది. పలు అంశాల్లో సీజే వ్యవహరిస్తున్న తీరును ప్రస్తావించిన నలుగురు జడ్జిలు.. కొద్ది నెలల కిందట ఆయనకు రాసిన ఏడు పేజీల లేఖను కూడా మీడియాకు విడుదల చేశారు.
ఈ పెడ పోకడను అడ్డుకోవాలి..
కేసుల రోస్టర్, వాటి కేటాయింపు అంశాల్లో ప్రధాన న్యాయమూర్తి వ్యవహార శైలిని జడ్జిలు తమ లేఖలో పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపే ముఖ్యమైన కేసులను కూడా గతంలో పని చేసిన సీజేఐలు ఎలాంటి హేతుబద్ధ ప్రాతిపదిక లేకుండా, తమ ఇష్టానుసారంగా, తమకు కావాల్సిన బెంచ్‌లకు కేటాయించేవారు. ఈ పోకడకు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకట్ట వేయాలి. లేదంటే ఇది అవాంఛనీయ పరిస్థితులకు దారి తీస్తుంది. న్యాయవ్యవస్థ నిజాయతీపైనా అనుమానాలకు తావిస్తుంది.
న్యాయ వ్యవస్థ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవద్దన్న ఉద్దేశంతోనే మేం వివరాల్నింటినీ వెల్లడించడం లేదు. కానీ సదరు చర్యల వల్ల న్యాయవ్యవస్థ ప్రతిష్ట ఇప్పటికే కొద్దిగా మసకబారింది’’అని పేర్కొన్నారు. ‘‘సీజేకు ఉన్న కేసుల కేటాయింపు, రోస్టర్ అధికారం కోర్టు మరింత సమర్థంగా పనిచేయడానికి ఉద్దేశించింది మాత్రమే. అంతేకానీ జడ్జిలపై అధికారం చెలాయించేందుకు ఏమాత్రం కాదు. ప్రధాన న్యాయమూర్తి అంటే ‘సమానుల్లో ప్రథముడు’. అంతేగానీ ఎవరికంటే ఎక్కువ కాదు. తక్కువ కాదు..’’అని స్పష్టంచేశారు.
జస్టిస్ చలమేశ్వర్‌ను కలిసిన రాజా
జస్టిస్ చలమేశ్వర్‌ను సీపీఐ నేత డి.రాజా ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. ‘నాకు జస్టిస్ చలమేశ్వర్ చాలాకాలంగా తెలుసు. ఏం జరిగిందో తెలుసుకోవాలని వచ్చా. న్యాయవ్యవస్థలో ఇలాంటి సమస్యల పరిష్కారానికి పార్లమెంటే ఓ మార్గం చూపాలి’అని భేటీ అనంతరం రాజా అన్నారు. కొందరు జడ్జిలు కూడా చలమేశ్వర్‌ను కలిసినట్టు తెలిసింది. ‘‘రాజా వ్యక్తిగతంగా వెళ్లి చలమేశ్వర్‌ను కలిశారు. దీంతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదు’’అని పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. న్యాయమూర్తుల అంశంలో తమ పార్టీ తలదూర్చబోదని, సమస్యను న్యాయ వ్యవస్థనే పరిష్కరించుకుంటుందని అన్నారు.
జస్టిస్ జాస్తి చలమేశ్వర్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా 1997 జూన్ 23న నియమితులయ్యారు. ఆ తర్వాత గౌహతి, కేరళ హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిం చారు. 2011 అక్టోబర్ 10న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై ప్రస్తుతం నెంబర్ టూగా కొనసాగుతున్నారు. ఇంటర్నెట్‌లో పోస్టు చేయడం వాక్‌స్వాతంత్య్రమంటూ ప్రక టించిన ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్నారు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) ఏర్పాటుపై 2015లో ఇచ్చిన తీర్పులో మిగిలిన న్యాయమూర్తులతో విభేదించారు.
కొలీజియం వ్యవస్థ ఆశ్రిత పక్షపాతానికి అలంకారంగా మారిందని ఆక్షేపించారు. ఆధార్ తప్పనిసరి కాదంటూ తీర్పునిచ్చిన ధర్మాసనంలో చలమేశ్వర్ కూడా ఉన్నారు. గోప్యత అనేది ప్రాథమిక హక్కు అని 2017 ప్రకటించిన తొమ్మిది మంది న్యాయమూర్తుల్లో ఆయన ఒకరు. పార్లమెంటరీ కార్యదర్శులను నియమించుకుంటూ చట్టాలు చేసే హక్కు రాష్ట్రాలకు లేదంటూ తీర్పునిచ్చిన ధర్మాసనానికి ఆయన నేతృత్వం వహించారు.
జస్టిస్ రంజన్ గొగోయ్
గౌహతి హైకోర్టులో 2001 ఫిబ్రవరి 28న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010లో పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు బదిలీ తర్వాత అక్కడే ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2012, ఏప్రిల్ 23న పదోన్నతి పొందారు. జస్టిస్ దీపక్ మిశ్రా తరువాత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతారు.
రాజకీయ నాయకుల ఉచిత కానుకల హామీలపై మార్గదర్శకాలను రూపొందించాలని తీర్పునిచ్చిన ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్నారు. అలాగే ఓటు వేసే సమయంలో పౌరులు ఒక నిర్ణయం తీసుకోవటానికి వీలుగా.. అభ్యర్థులు నామినేషన్ అఫిడవిట్‌లో పూర్తి సమాచారాన్ని అందించటం తప్పనిసరని తీర్పునిచ్చిన ధర్మాసనంలోనూ సభ్యుడిగా ఉన్నారు.
జస్టిస్ దీపక్ మిశ్రా...
జస్టిస్ దీపక్ మిశ్రా 1953 అక్టోబర్ 3న జన్మించారు. 1977, ఫిబ్రవరి 14న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. రాజ్యాంగం, సివిల్, క్రిమినల్, రెవెన్యూ సర్వీసు, పన్నులకు సంబంధించిన కేసులను వాదించారు. 1996 జనవరి 17న ఒరిస్సా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1997 డిసెంబర్ 19న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2009 డిసెంబర్ 23న పదోన్నతిపై పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.
2010 మే 24న ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2011 అక్టోబర్ 10న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2017 ఆగస్టు 28న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2018, అక్టోబర్ 2న పదవీ విరమణ చేయనున్నారు. బాబ్రీ కేసు, సిక్కుల ఊచకోత, బీసీసీఐలో సంస్కరణలు లాంటి కీలక కేసులను విచారిస్తున్న బెంచ్‌లకు నేతృత్వం వహిస్తున్నారు.
జస్టిస్ మదన్ బి.లోకూర్
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా 1999లో నియమితులయ్యారు. 2010లో ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత గౌహతి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2012 జూన్ 4న పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. న్యాయవ్యవస్థలో కంప్యూటరీకరణ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. గత దశాబ్ద కాలంలో మణిపూర్‌లో జరిగిన 98 ఎన్‌కౌంటర్ హత్యలపై సీబీఐ దర్యాప్తు జరపాలని జస్టిస్ లోకూర్, జస్టిస్ ఉదయ్ లలిత్‌లతో కూడిన ధర్మాసనం 2017 జూలైలో ఆదేశించింది.
దేశంలో రైతు ఆత్మహత్యలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఆదేశాలు జారీచేసిన, జైల్లో అసహజ మరణాలకు గురైన వారి కుటుంబ సభ్యులకు పరిహారం అందచేయాలని కేంద్రంతో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనాలకు నేతృత్వం వహించారు.
జస్టిస్ కురియన్ జోసెఫ్
కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా 2000, జూన్ 12న నియమితులయ్యారు. కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత పదోన్నతిపై హిమాచల్‌ప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 మార్చి 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ట్రిపుల్ తలాక్‌ను నిషేధించిన, బొగ్గు కేటాయింపు కుంభకోణం కేసును విచారించిన ధర్మాసనాల్లో సభ్యుడిగా ఉన్నారు.
పార్లమెంటుపై దాడి కేసులో.. ముద్రణపత్రాలు, సీడీలను ఎలాంటి నిర్ధారణ లేకుండా ప్రాథమిక సాక్ష్యాలుగా పరిగణించటాన్ని సమర్థిస్తూ 2005లో ఇచ్చిన తీర్పును ధర్మాసనం తరఫున జస్టిస్ కురియన్ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment