jasti chalameswar
-
సీఎం వైఎస్ జగన్‌ని కలిసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్
సాక్షి,అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం తాడేపల్లిలోని సీఎం నివాసం ఇందుకు వేదికైంది. ఈ సందర్భంగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌ను సీఎం వైఎస్ జగన్ శాలువాతో సత్కరించారు. ఆయనతో పాటు ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా ఉన్నారు. -
ఇంతింతై.. నాయకుడంతై!
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఓటర్లను రకరకాలుగా బెదిరించి, ప్రత్యర్థి పార్టీలకు మద్దతుదార్లని భావించినవారి ఓట్లు తొలగించి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఇది ఆక్షేపణీయం. 2017–18లో వివిధ పార్టీలకు ముట్టిన నిధుల్లో సగం ‘అజ్ఞాత వర్గాల’ నుంచి వచ్చిందేనని ఏడీఆర్ నివేదిక చెప్పిందంటేనే మన దేశంలో ఎలాంటి పరిస్థితులు న్నాయో అర్ధమవుతుంది. అవినీతిపరులైన రాజకీయవేత్తలు, నేరగాళ్లు, నిరంకుశాధికారవర్గాల అనుబంధం అందరికీ తెలిసిందే. ఆశ్చర్యకరమేమంటే రాజకీయనేతల ఆదాయపన్ను వివరాలు బయటికి పొక్కకుండా పాలకులు అన్నివిధాలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ స్థితిలో అవినీతి అంతకంతకు విస్తరించడంలో వింతేముంది? ‘‘అవినీతిపరులైన రాజకీయవేత్తలు పదేపదే తిరిగి అధికారంలోకి వస్తూంటారు. గత 30 ఏళ్లుగా మన కళ్లెదుట ఆవిష్కరించుకుంటూ వస్తున్న దృశ్యం ఇదే. బయటకు తెలిసిన ఆదాయ వనరులకు మించిపోయిన సంపద పోగుపడినందుకు విచారణను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు, ఎంపీలే ఎప్పుడూ తిరిగి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తు న్నారు. గత ఐదేళ్ల వ్యవధిలోనే ఒక అభ్యర్థి తన ఆదాయం 1000 శాతం పెరిగినట్టు చూపిన మరుక్షణమే విచారణ ప్రారంభించే యంత్రాంగం రంగంలోకి దిగాలి. దీనికి కారణం పసలేని విచారణ అయినా అయి ఉండాలి లేదా అలా స్వేచ్ఛగా వదిలేయడమైనా అయి ఉండాలి’’ – జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం ఆదేశం (11.09.2017) ఈ సందర్భంగా ఒక బౌద్ధయుగ సూక్తి గుర్తుకొస్తోంది. ఈనాడు ‘ధర్మపోరాటం’ పేరు చాటున అధర్మ ప్రచారాలకు పాల్పడే పాలకులున్నట్టే బౌద్ధయుగంలో కూడా ‘ధర్మధరుడ’నే పేరిట ఒక అబద్ధాలకోరు, వంచకుడు ఉండేవాడు. ‘పేరు ధర్మరాజు, పెను వేపవిత్తయా’ అన్నట్టు ఇంతకూ జ్ఞానం ప్రధానమా? వ్యక్తి నడవడిక శీలం ప్రధానమా? అన్న చర్చ ముందుకు రావడంతో కాశీ రాజు సర్వసాధారణంగా జ్ఞానాన్ని గౌరవించేవాడే అయినా, ఈసారి ఆయన దృష్టి మనిషి శీలంపై పడింది. ధర్మధరుడ్ని అందరూ జ్ఞానిగా భావిస్తున్నందున, ముఖ్యంగా రాజుకు నచ్చిన వాడవడంవల్ల, ఊళ్లో ఉన్న వ్యాపారులు కూడా ధర్మధరుడి జ్ఞానం మీదనే దృష్టి పెట్టి అతడి అబద్ధాల్ని నమ్మి, అతడి శీలాన్ని పరిగణనలోకి తీసుకోక భంగపడ్డారు. ధర్మధరుడు చివరికి పరుల ఆస్తిని దోచుకునే దొంగగా మారినట్టు వ్యాపారులే కనిపెట్టేశారు. ఈ గుట్టు తెలి యకముందు ధర్మధరుడిని జ్ఞానిగా భ్రమించిన ఒక వజ్రాల వ్యాపారి దుకాణానికే అతడు (ధర్మధరుడు) ఎసరుపెట్టాడు. కొట్టు యజమానితో మాట్లాడుతున్నట్టే నటిస్తూ ధర్మధరుడు నింపాదిగా ఓ వజ్రాన్ని కాస్తా కాజేసి ఉడాయించాడు. ఇలా వరసనే మూడురోజులు ధర్మధరుడు ఈ పనిలోనే ఉన్నాడు. దాంతో వ్యాపారి ఉండబట్టలేక ‘జ్ఞాని’గా ఫోజులు పెడుతున్న ధర్మధరుడితో ‘‘ఓరి దొంగ వెధవా, నీ జ్ఞానం తగలబడా ఇన్నాళ్లూ నిన్ను గౌరవించి తప్పు చేశాన’’ని అన్నాడట. అతగాడికి నాలుగు తగిలించి మరీ పంపించేశాడట. అలాగే, సుప్రీంకోర్టు మాజీ సీనియర్ న్యాయమూర్తి చలమేశ్వర్ ధర్మాసనం గడచిన రెండు జనరల్ ఎన్నికల మధ్య అయిదేసి ఏళ్ల వ్యవధిలోనే రాజకీయవేత్తల ఆస్తులు పాదరసంలా పాకి ఇంతింతై ఆకాశాన్ని అంటడానికి దారితీస్తున్న కారణాలను శోధించి విచారించవలసిన అవసరం ఉందని భావించి దేశాన్ని హెచ్చరించి ఉంటుంది. రెండేళ్లనాడు ధర్మాసనం చేసిన ఈ హెచ్చరికకు దేశంలోని శాసనకర్తలు (ఆంధ్రప్రదేశ్ సహా) ఈ రెండేళ్లలోనూ ఎంత ‘విలువ’ ఇచ్చారో, ఇస్తున్నారో ఈ వంచకుల్ని భరిస్తున్న దేశ ప్రజా బాహుళ్యానికి తెలుసు. ఇలాంటివారిని చూసే నీగ్రోల విమోచన ప్రదాత, అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ‘‘దుర్దశ, ఇబ్బంది, ఆపద అనేవి దాదాపు మనుషులందరికీ వచ్చేవే. కానీ మనిషి వ్యక్తిత్వాన్ని గుణగణాలను పరీక్షించాలంటే అతడికి అధికారం కట్టబెట్టి చూడండి, అతని అసలు సరుకేదో తెలిసిపోతుంది’’ అన్నాడు. పాలకుడి ఆలోచనలోనే, దృక్పథంలోనే బలహీనత ఉంటే, అతడి వ్యక్తిత్వమూ (క్యారెక్టర్) అలాగే తయారవుతుందని ఐన్‌స్టీన్ స్పష్టం చేశాడు. ఈ వ్యక్తిత్వ వికాసం మన కేంద్ర, రాష్ట్ర పాలకుల్లో (పార్టీ బ్రాండ్ ఏదైనా) సొంత సంపదను మేట వేసుకోడానికి ఉపయోగపడినంతగా రిపబ్లిక్ రాజ్యాంగ నిర్దేశాలను అనుసరించడానికి తోడ్పడటం లేదు. సుప్రీం ధర్మాసనం చెప్పడమే కాదు, 1993లోనే కేంద్ర హోంశాఖ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం.ఎన్. వోహ్రా అధ్యక్షతన ఏర్పడిన కమిటీ దేశంలో ‘రాజకీయ వ్యవస్థ నేరమయమైపోయింది, రాజకీయవేత్తలు, నేరగాళ్లు (క్రిమినల్స్), అధికారగణాల (బ్యూరాక్రాట్) మధ్య పీటముడి ఏర్పడి పనిచేస్తోందని నిశితమైన వ్యాఖ్య చేసిందని మరచిపోరాదు. ఈ ‘పీటముడి’ బాగా బిగిసిపోయి ఉన్నందుననే రాజకీయుల ఆదాయపు పన్ను వివరాలను బహిరంగంగా తెలపరాదన్న నిబంధన వచ్చింది, చివరికి సమాచార హక్కు చట్టం కింద కూడా ఏ వివరాలూ వెల్లడించరాదన్న నిబంధనను కేంద్రం విధించింది. ప్రజా సేవకులమని విర్రవీగుతున్న వందలాదిమంది శాసనకర్తల వద్ద ‘లెక్కకు అందకుండా మేట వేసుకుంటున్న సంపద వివరాల’ను ఎందుకు ప్రజా బాహుళ్యానికి తెలపకుండా దాచవలసి వస్తోందో ప్రజలు తెలుసుకోగోరుతున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయినా జవాబులేదు. పైగా తాజా నివేదికలో ‘ప్రజాస్వామ్య సంస్కరణల అమ లుకు’ ఉద్దేశించిన సంస్థ (ఏడీఆర్) 2017–18 ఆర్థిక సంవత్సరంలోనే జాతీయ పార్టీలకు అందిన నిధులలో 50 శాతం పైగా ‘అజ్ఞాత వర్గాల’ నుంచి ముట్టాయని ప్రకటించింది. ఇలా ప్రజలకు తెలియని వేలకోట్ల నిధులు అందుకున్నవాటిలో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, టీఎంసీ, ఎన్సీపీ ఉన్నాయి. అధికార దుర్వినియోగం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ‘అప్పుల కుప్ప’గా మార్చి, దివాళా దశకు నెట్టిన ‘తెలుగుదేశం’ ఇలాంటి నిధులు పొందిన ప్రాంతీయ పార్టీలలో అగ్రస్థానంలో ఉంది. మరొక మాటలో చెప్పాలంటే, 200 ఏళ్ల పై చిలుకు చరిత్ర ఉన్న అమెరికాలో 450మంది బిలియనీర్లు ఉండగా, కేవలం 70 ఏళ్ల వయస్సుగల భారత గణతంత్ర రిపబ్లిక్లో 400 మంది పై చిలుకు బిలియనీర్లు, మరికొన్ని వేలమంది మిలియనీర్లు తలెత్తడం విశేషమో, విషాదమో విజ్ఞులకు తెలియాలి. ప్రపంచ ప్రసిద్ధ విశ్లేషణా సంస్థ ‘ఆక్స్‌ఫామ్’ జరిపిన తాజా సర్వే ప్రకారం భారతదేశ సంపదలో 50 శాతం కేవలం 9మంది చేతుల్లో పోగుబడి ఉండగా, 60 శాతం జనాభా వద్ద ఉన్న సంపద 5 శాతమేనని వెల్ల డైంది. మరో లెక్క ప్రకారం, ఇతర దేశాల్లో సంపదంతా జనాభాలో కేవలం ఒక్కశాతం మంది వద్దనే పోగుబడి ఉండగా, అదే 120 కోట్ల జనాభాగల మన దేశం (ఇండియా)లో కేవలం 10 మంది దగ్గరే సంపదలో మెట్టు భాగం కేంద్రీకరించి ఉంది. ఒకవైపున ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తి మన దేశమేనని చెప్పుకుంటున్న దశలో ఇంతటి వ్యత్యాస భారతాన్ని కూడా చూస్తున్నాం. ప్రజలకు ఓటుమీద ప్రజాస్వామ్యంమీద విశ్వాసం లేనట్టుగా, ‘ఓటుహక్కును ప్రతి పౌరుడూ వినియోగించాలి. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఎన్నికల’ని ‘ఓటు హక్కు వినియోగం పవిత్ర ధర్మమ’నీ రాష్ట్రపతి, ప్రధానమంత్రి దగ్గరనుంచి రాష్ట్రాల్లో చోటామోటా నాయకుల దాకా కొత్తగా ప్రజలకు రిపబ్లిక్ దినోత్సవంనాడు ఊదర దంచారు. కానీ ఓటు విలువ ప్రజలకు తెలియకకాదు, మంచివాళ్లను ఎన్నుకోవాలనేదే వారి లక్ష్యం. కానీ ఆ లక్ష్యాన్ని ఆచరణ సాధ్యం కాకుండా చేస్తున్నది అవినీతిపరులైన ‘రాజకీయవేత్తలు–నేరగాళ్లు– నిరంకుశాధికార వర్గ పరస్పర అనుబంధమే’నని మరచిపోరాదు. బహుశా అందుకే శాస్త్రీయ సోషలిస్టు–కమ్యూనిస్టు సిద్ధాంత నిర్మాత అయిన కారల్‌మార్క్స్ ‘ప్రతి అయిదేళ్లకొకసారి ప్రజల నెత్తిమీద ఎక్కి ఎలా తొక్కి దోచుకోవాలో నిర్ణయించుకునేందుకు సంపన్న వర్గాల రాజ కీయ పాలక శక్తులు ఈ ఎన్నికల్ని వినియోగించుకుంటుంటాయ’ని చెప్పిన మాటల్ని మరవరాదు. ‘నన్ను గెలిపిస్తేనే మీకు భవిష్యత్తు, ‘నేను వేయించిన రోడ్లపైనే మీరు నడుస్తున్నారని మరచిపోకండి’, ‘బడిపిల్లలకు నన్ను గురించి పాఠాలు చెప్పాలి’, ‘యూనివర్సిటీలకు ఇచ్చిన గ్రాంట్లను నాకు వాపసు చేయండి’ ‘ఓటర్ల జాబితా నుంచి ప్రత్యర్థి పార్టీల ఓటర్ల పేర్లను తొలగించేందుకు సిద్ధంకండి’– ఇలాంటి చావు తెలివితేటలున్న చంద్రబాబులాంటి నేతల్ని అధికారంలోకి అనుమతించినంతకాలం, డబ్బు సంచులతో దొంగ వ్యాపార ప్రకటనల ద్వారా పాలకులు ప్రోత్సహించే కిరాయి వార్తా పత్రికలున్నంతకాలం జరిగేవి ఎన్నికలూ కావు, ప్రజలు వినియోగించేవి ‘ఓట్లూ’ కావని గుర్తించాలి. ఆధునిక టెక్నాలజీని, జ్ఞాన తృష్ణను పెంచుకునే సాధనంగా కాకుండా ఓట్లను తారుమారుచేసి, ఓటర్లను ఆటపట్టించే మాధ్యమంగా, వారి తాలూకు వ్యక్తిగత విషయాలపై కూపీ లాగి, బెదిరింపులకు ఒక సాధనంగా వినియోగించి సుమారు 15 కోట్లమంది భారతీయుల కూపీ లాగి అమెరికా వద్ద నిక్షిప్తం చేసి బెదిరింపుల సాధనంగా మార్చిన జుకర్‌బర్గ్ లాంటివాళ్లు మన దేశంలోని కొందరు ఆధునిక రాజకీయవేత్తలకు ‘ఆదర్శమూర్తులు’! ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు పార్లమెంట్ సభ్యులను కోట్లాది రూపాయలకు సంతలో పశువుల మాదిరిగా కొనుగోలు చేసి బొటాబొటిగా ఉన్న తన ముఖ్యమంత్రిత్వాన్ని నిలుపుకొన్న చంద్రబాబుది ఒక పాలనగా గానీ, అతనొక పాలకుడిగాగానీ, ప్రజా రాజకీయ శాస్త్రం ఒప్పుకోదు. ఈ దేశంలో కొందరు సభాపతుల ప్రవర్తనా అలాగే తయారైంది. ఆమాటకొస్తే అసలు రిపబ్లిక్ రాజ్యాంగాన్ని, దాని వ్యవస్థలనూ పాలకులు భ్రష్టుపట్టిస్తూ నామరూపాలు లేకుండా చేస్తున్నారు. దీనికితోడు పాలకుల తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి సుప్రీంకోర్టును ‘సీల్డు కవర్’ రాజకీయం ద్వారా నోరు నొక్కాలని పాలకులు చూస్తున్నారు. అందుకే సుప్రీంకోర్టు ‘‘ప్రజా ప్రతినిధులమని చెప్పుకునే చట్టసభల సభ్యుల అవినీతి ప్రవర్తనకు సంబంధించిన సమాచారం పొక్కకుండా ఎందుకు రక్షణ కల్పించాలి?’’ అని పదే పదే ప్రశ్నించవలసి వస్తోంది. abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
స్వతంత్ర న్యాయ వ్యవస్థ లేకుంటే బలవంతుడిదే రాజ్యం
సాక్షి, అమరావతిబ్యూరో: దేశానికి స్వతంత్ర న్యాయవ్యవస్థ చాలా అవసరమని, లేకపోతే బలవంతుడిదే రాజ్యం అవుతుందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వ్యాఖ్యానించారు. విజయవాడలోని బిషప్ అజరయ్య ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) 44వ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన చలమేశ్వర్ మాట్లాడుతూ దేశంలో అసహనం పెరిగిందని, తాను చెప్పిందే సరైందన్న వితండ వాదంతో ప్రమాదం పొంచి ఉందన్నారు. ఆ వితండవాదంతో తాను విభేదించడం వల్లే తన మాటలు వివాదాస్పదమయ్యాయన్నారు. ఉపాధ్యాయులు పాఠశాలల్లో పిల్లలకు జవాబుదారీతనం నేర్పాలని సూచించారు. మంచి, చెడులను ధైర్యంగా చెప్పగలిగే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు. తెలంగాణలో సీపీఎస్ రద్దు చేస్తానన్న బాబు ఏపీలో చేయరెందుకు..? మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ సీపీఎస్ అంశంపై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో తమ కూటమి గెలిస్తే సీపీఎస్ రద్దు చేస్తామంటూ వాగ్దానాలు ఇచ్చారని, మరి నాలుగున్నరేళ్లుగా అధికారంలో ఉన్న ఏపీలో ఎందుకు చేయరని ప్రశ్నించారు. ఉద్యోగులను మోసం చేయడానికి ఓ టక్కర్ కమిషన్ వేసి చేతులు దులుపుకున్నారన్నారు. ప్రభుత్వం కాలయాపన నెపంతో కమిషన్ వేస్తే అది ఎప్పటికీ తేలదని, పరిశీలిస్తూ పర్యటిస్తూ దాటవేస్తుందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అధికారంలోకి వచ్చిన మొదట్లోనే కమిషన్ వేసి, నివేదిక తెప్పించి రద్దు చేయాల్సిందని వ్యాఖ్యానించారు. -
జస్టిస్ చలమేశ్వర్ భావోద్వేగం
న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి తర్వాత దేశ అత్యున్నత న్యాయస్థానంలో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జాస్తి చలమేశ్వర్ భావోద్వేగానికి గురయ్యారు. ఏదో కార్యాలయాన్ని అధిరోహించడం కోసం తాను యత్నిస్తున్నట్లు కొందరు ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఓ జాతీయ చానెల్‌తో చెప్పారు. మరో రెండు నెలల్లో రిటైర్ అవుతాననగా ఇలాంటి వార్తలు రావడం బాధగా ఉందని అన్నారు. ఇలాంటి ఆరోపణలతో తాను రిటైరకావాలనుకోవడం లేదని చెప్పారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉండే అధికారాలను ప్రశ్నిస్తూ ప్రముఖ న్యాయవాది శాంతి భూషణ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు తిరస్కరించారు. గత రెండు నెలలుగా జరుగుతున్న పరిణామాల రీత్యా తాను ఈ పిల్‌ను విచారించలేనని జాస్తి పేర్కొన్నారు. తాను ఇచ్చిన తీర్పును 24 గంటల్లో మరోసారి మార్చబడకూడదని అనుకుంటున్నట్లు చెప్పారు. -
జర్నలిస్టు ఏబీకే ప్రసాద్‌కు సన్మానం
సాక్షి, విశాఖపట్టణం : పత్రికా రంగానికి అందించిన సేవలకుగాను సీనియర్ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్‌కు విశాఖపట్టణంలో శనివారం ఘన సన్మానం జరిగింది. రైటర్స్ అకాడమీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సభకు హాజరైన సుప్రీం కోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏబీకేతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి పత్రికా రంగంలోకి వచ్చిన ఏబీకేకు ఆయన నేపథ్యమే ప్రశ్నించడాన్ని అలవర్చిందని అన్నారు. -
బత్తాయిల భాషలో మాట్లాడుకున్నారు..!!
సాక్షి, న్యూఢిల్లీ : నలుగురు సీనియర్ జడ్జిలు పుట్టించిన సెగ ఇప్పుడిప్పుడే చల్లారుతుందనగా.. ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ మరో బాంబు పేల్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను లక్ష్యంగా చేసుకుని సంచలన ఆరోపణలు చేశారు. ఉత్తరప్రదేశ్ మెడికల్ సీట్ల కుంభకోణంలో సీజేఐ పాత్ర ముమ్మాటికీ నిజమని, అందుకే సిట్ ఏర్పాటుకు ఆయన జంకుతున్నారని మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ భూషణ్.. జస్టిస్ మిశ్రాపై సుప్రీంకోర్టులో అంతర్గత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ‘‘సీజేఐకి, కుట్రదారులకు మధ్య బత్తాయి పండ్లు, ఆలయాల పేర్లతో కోడ్ లాగ్వేజీ సంవాదాలు నడిచాయ’ని చెప్పారు. లక్నో పోలీస్ స్టేషన్లో సీజేఐపై ఈ మేరకు ఫిర్యాదుచేశానని కూడా చెప్పారు. 200 బత్తాయి పండ్లను ఢిల్లీ మందిర్‌కు తీసుకురా! : ఉత్తరప్రదేశ్ మెడికల్ సీట్ల కుంభకోణంలో జడ్జిల పాత్రను సీబీఐనే నిర్ధారించిందన్న ప్రశాంత్ భూషణ్.. సిట్టింగ్ జడ్జిలను ప్రశ్నించే అధికారం దర్యాప్తు సంస్థకు లేనందున సుప్రీంకోర్టు నేతృత్వంలోనే ఇన్వెస్టిగేషన్ జరగాలని డిమాండ్ చేశారు. ‘‘యూపీలోని 46 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లపై మెడికల్ కౌన్సిల్ విధించిన నిషేధాన్ని తొలగిస్తూ కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల వెనుక పెద్ద కథ నడిచింది. దీపక్ మిశ్రా సభ్యుడిగా ఉన్న ధర్మాసనమే ఆ తీర్పు ఇచ్చింది. అత్యంత వ్యూహాత్మకంగా, రహస్యంగా సాగిన ఈ వ్యవహారానికి సంబంధించి నా దగ్గర ఆధారాలున్నాయి. డబ్బుల్ని బత్తాయి పండ్లుగా, కలవాల్సిన చోటుని మందిరంగా పేర్కొంటూ కోడ్ లాగ్వేజీ సంభాషణలు నడిచాయి. ‘200 బత్తాయిలను తీసుకుని ఢిల్లీ మందిర్‌కు రా..’, ‘100 బత్తాయిలు.. అలహాబాద్ మందిర్..’ లాంటి మాటలు రికార్డయ్యాయి. వీటితోపాటు మరికొన్ని ఆధారాలను చూపించి లక్నో పోలీస్ స్టేషన్లో సీజేఐ మిశ్రాపై కేసు పెట్టాను’’ అని ప్రశాంత్ భూషణ్ వివరించారు. జాస్తి చలమేశ్వర్‌కు పంపిన నోట్లోనూ దొరికిపోయారు : యూపీ మెడికల్ సీట్ల కుంభకోణం, ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి ఇష్రత్‌పై అవినీతి ఆరోపణలు.. ఈ రెండు కేసులకు సంబంధించిన విచారణ నుంచి జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌ను తప్పిస్తూ సీజేఐ దీపక్ మిశ్రా ఇచ్చిన ఉత్తర్వుల్లోనూ లోపాలున్నాయని ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. ‘‘నవంబర్ 8న సుప్రీంకోర్టులో ఏం జరిగిందో అందరికీ తెలుసు. జాస్తి చలమేశ్వర్ ఇచ్చిన ఆదేశాలను అప్పటికప్పుడు రద్దుచేయడమేకాక ఆ కేసును వేరే బెంచ్‌కు మార్చుతూ సీజేఐ నోటీసులు ఇచ్చారు. కానీ ఆ కాపీలో తేదీ నవంబర్ 6 అని ఉంది. అంటే ఏమిటి? రెండు రోజుల ముందే ఉత్తర్వులు జారీ అయిఉంటే రహస్యంగా ఎందుకు ఉంచినట్లు? ఇలాంటి ప్రశ్నలెన్నింటికో సమాధానం చెప్పాల్సింది సీజేఐనే. కాబట్టి ఆయన లేకుండా పారదర్శకంగా దర్యాప్తు, విచారణ జరగాలని మేం డిమాండ్ చేస్తున్నాం..’’ అని ప్రశాంత్ భూషణ్ అన్నారు. ఇవే ఆ రెండు కేసులు.. సుప్రీంకోర్టులో నంబర్2గా కొనసాగుతోన్న జస్టిస్ చలమేశ్వర్‌ను విచారణ నుంచి తొలగించినవి.. పరస్పరం సంబంధమున్న రెండు కేసులు. 1. యూపీ మెడికల్ సీట్ల కుంభకోణం, 2. ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి ఇష్రత్‌పై అవినీతి ఆరోపణలు. పూర్వాపరాల్లోకి వెళితే.. : ఉత్తరప్రదేశ్‌లోని లఖ్నో కేంద్రంగా నడిచే ప్రసాద్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌కు చెందిన మెడికల్ కాలేజీతోపాటు 46 ఇతర మెడికల్ కాలేజీల్లో సరైన వసతులులేని కారణంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) వాటిలో అడ్మిషన్లను రద్దు చేసింది. అయితే.. ఈ విషయంలో సుప్రీంకోర్టులో అనుకూలమైన ఆదేశాలు వచ్చేలా చూస్తామంటూ కొందరు కాలేజీ యాజమాన్యాలతో భారీ డీల్ కుదుర్చుకున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసిన సీబీఐ.. డీల్స్ కుదుర్చుకున్నది మరెవరోకాదు సాక్షాత్తూ ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి(2004-10 మధ్య పనిచేశారు) ఇష్రత్ మస్రూర్ ఖుద్దూసీ, ఆయన అనుచరుడు భావనా పాండే, మరో మధ్యవర్తి విశ్వనాథ్ అగ్రావాలాలే అని తేల్చింది. ఈ క్రమంలో గత సెప్టెంబర్‌లో జస్టిస్ ఇష్రత్ సహా ఐదుగురిని సీబీఐ అరెస్టు చేసింది. పలువురు సిట్టింగ్ జడ్జిల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో పొందరుపర్చింది. ఆ పేర్లలో దీపక్ మిశ్రా పేరుకూడా ఒకటికావడం గమనార్హం. ఈ కేసులో స్వయంగా జడ్జిలపైనే ఆరోపణలు వచ్చినందున... ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేయాలని ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలా లేదా అనే దానిపై వాదనలు విన్న జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. చివరకు పిటిషన్‌ను స్వీకరిస్తున్నట్లు చెప్పింది. అంతలోనే.. ‘కాలేజీల్లో అడ్మిషన్లు జరుపుకోవచ్చు’అన్న తీర్పు ఇచ్చింది మిశ్రా ధర్మాసనమే కాబట్టి ఆయన పేరు లేకుండా బెంచ్‌ను ఏర్పాటుచేయాలని పిటిషనర్లు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను కూడా పరిగణలోకి తీసుకున్న చలమేశ్వర్.. 145(3) ప్రకారం సీజేఐ లేకుండానే బెంచ్‌ను ఏర్పాటుచేశారు. అంతలోనే.. ‘ఈ కేసును మీరు విచారించరాదు, దీన్ని వేరొక బెంచ్‌కు అప్పగించాలంటూ’ సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నుంచి హుటాహుటిన ఆదేశాలు వచ్చాయి. జస్టిస్ ఇష్రత్ పేరుతో ముడుపుల కేసును విచారిస్తున్న రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్ చలమేశ్వర్‌ను తప్పిస్తూ సీజేఐ మిశ్రా మరో ఉత్తర్వులిచ్చారు. ఈ రెండు అంశాలే తాజా వివాదానికి ప్రధాన కారణాలు భావిస్తున్నారు. -
‘ఆ నలుగురిపై ఎలాంటి చర్యలుండవు’
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు అంశాన్ని రాజకీయం చేయొద్దని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) విజ్ఞప్తి చేసింది. బీసీఐ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా సోమవారమిక్కడ మాట్లాడుతూ...జడ్జీల మధ్య వివాదం ముగిసిందని, సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అని ఆయన అన్నారు. కోర్టు వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని అంగీకరించమని, అంతర్గతంగా అందరూ చర్చించుకున్నారని మనన్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు. జడ్జిలందరూ విధులకు హాజరయ్యారని, కోర్టు కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయన్నారు. న్యాయవ్యవస్థ పాలనా వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ నలుగురు జడ్జిలపై ఎలాంటి చర్యలుండవని బీసీఐ స్పష్టం చేసింది. మరోవైపు కేసుల కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పనితీరు సక్రమంగా లేదంటూ వ్యాఖ్యలు చేసిన సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ గొగోయ్, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ ఇవాళ యథావిధిగా విధులకు హాజరు అయ్యారు. ఇక సుప్రీంకోర్టు జడ్జిల మధ్య తలెత్తిన సంక్షోభం ముగిసినట్లేనని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ప్రకటించారు. ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఈ విషయాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారికంగా మీడియా ఎదుట ప్రకటించనుంది. -
'సుప్రీం' సంక్షోభం
దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలోనే సంచలనం! దేశంలో ఇంతకు ముందెన్నడూ చోటుచేసుకోని అనూహ్య పరిణామం. సర్వోన్నత న్యాయస్థానానికి చెందిన నలుగురు న్యాయమూర్తులు తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. సుప్రీంకోర్టులో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలపై గొంతువిప్పారు. కొద్దినెలలుగా కోర్టు పాలన వ్యవస్థలో అవాంఛనీయ పరిణామలు చోటు చేసుకుంటున్నాయని, ఇది దేశ ప్రజాస్వామ్యానికే ముప్పు అని వ్యాఖ్యానించారు. కేసుల కేటాయింపు, కొన్ని కేసుల్లో కోర్టు ఉత్తర్వులను ప్రస్తావిస్తూ.. ఒకవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ దీపక్ మిశ్రాపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఈ అసాధారణ పరిణామం అటు న్యాయవ్యవస్థలో ఇటు ప్రభుత్వ, రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. – సాక్షి, న్యూఢిల్లీ దేశ అత్యున్నత న్యాయస్థానం ఔన్నత్యాన్ని కాపాడాలి. లేదంటే దేశంలో ప్రజాస్వామ్యం మనజాలదు. సుప్రీం కోర్టులో జరుగుతున్న అవాంఛనీయ పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ నలుగురం ప్రధాన న్యాయమూర్తిని కలిశాం. కానీ మా ప్రయత్నాలన్నీ విఫల మయ్యాయి. న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడేలా చర్యలు చేపట్టాల్సిందిగా మేం సీజేని ఒప్పించలేకపోయాం. ఇలా న్యాయమూర్తులు మీడియా ముందుకు రావడం దేశంలో అసాధారణం. కానీ తప్పలేదు. సుప్రీంకోర్టు పాలన విషయంలో జరుగుతున్న పరిణామాలు దేశ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. సీజేఐ అభిశంసన విషయంపై దేశమే నిర్ణయం తీసుకోవాలి. – ‘ప్రెస్‌మీట్’లో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపే ముఖ్యమైన కేసులను కూడా గతంలో పని చేసిన సీజేఐలు ఎలాంటి హేతుబద్ధ ప్రాతిపదిక లేకుండా, తమ ఇష్టానుసారంగా వివిధ బెంచ్‌లకు కేటాయించేవారు. ఈ పోకడకు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకట్ట వేయాలి. లేదంటే ఇది అవాంఛనీయ పరిస్థితులకు దారి తీస్తుంది. న్యాయ వ్యవస్థ నిజాయతీపైనా అనుమానాలకు తావిస్తుంది. సీజేకు ఉన్న కేసుల కేటాయింపు, రోస్టర్ అధికారం కోర్టు మరింత సమర్థంగా పనిచేయడానికి మాత్రమే. అంతేకానీ జడ్జీలపై అధికారం చలాయించేందుకు కాదు. చీఫ్ జస్టిస్ అంటే ‘సమానుల్లో ప్రథముడు.’ అంతే తప్ప ఎవరికంటే ఎక్కువ కాదు. తక్కువ కాదు. – ‘లేఖ’లో నలుగురు ‘సుప్రీం’ న్యాయమూర్తులు తీవ్ర ఆవేదనతో మీడియా ముందుకొచ్చాం.. సుప్రీం కోర్టు సీనియర్ జడ్జిలు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు శుక్రవారం జస్టిస్ చలమేశ్వర్ నివాసంలో మీడి యా సమావేశం నిర్వహించారు. జడ్జిలు ఇలా మీడియా ముందుకు రావడం అసాధారణమని, కానీ మరో మార్గం లేక తీవ్ర ఆవేదన, బాధతో ఇలా రాక తప్పలేదని స్వయంగా జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. సుప్రీంకోర్టులో గత కొద్ది నెలలుగా జరుగుతున్న అవాంఛనీయ పరిణామాలపై ఆవేదన చెంది, వాటిని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లామని, కానీ ఆయన ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లిన అంశాలతో కూడిన లేఖను మీడియాకు విడుదల చేశారు. ఈ లేఖను కొద్ది నెలల ముందే సీజేకు పంపినట్టు వివరించారు. కోర్టు పాలనా తీరును సరిదిద్దాలంటూ శుక్రవారం ఉదయం కూడా ఆయన్ను కలిసినట్టు వివరించారు. ‘‘దేశ అత్యు న్నత న్యాయస్థానం ఔన్నత్యాన్ని కాపాడాలి. లేదంటే దేశంలో ప్రజాస్వామ్యం మనజాలదు. సుప్రీంకోర్టులో జరుగుతున్న అవాంఛనీయ పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ మేం నలుగురం ప్రధాన న్యాయమూర్తిని కలిశాం. కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరాం. కానీ దురదృష్టవశాత్తూ మా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడేలా చర్యలు చేపట్టాల్సిందిగా మేం సీజేని ఒప్పించలేకపోయాం. న్యాయవ్యవస్థ, దేశం పట్ల మేం బాధ్యతాయుతంగా ఉన్నాం. ఇలా జడ్జిలు మీడియా ముందుకు రావ డం దేశంలో అసాధారణమే అయినా.. కానీ రాక తప్పలేదు. సుప్రీంకోర్టు పాలన విషయంలో జరుగుతున్న పరిణామాలు దేశ ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్న విషయంలో మేం నలుగురం ఏకాభిప్రాయంతో ఉన్నాం’’ అని జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. కోర్టు పాలనలో జరుగుతున్న అవాంఛనీయ అంశాలు ఏంటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘సీజే ద్వారా జరుగుతున్న కేసుల కేటాయింపు’వంటివి అందులో కొన్ని అని బదులిచ్చారు. ఉన్నట్టుండి.. కోర్టును వీడి మీడియా ముందుకు వచ్చి సంచలనం సృష్టించిన నలుగురు జడ్జిలు శుక్రవారం ఉదయం ఎప్పట్లాగే సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. ఉదయం 11.30 గంటల సమయంలో జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ తమ కోర్టు రూంలకు చేరుకున్నారు. జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి లోకూర్ కూడా తమ చాంబర్లో కేసులు విన్నారు. నిమిషాల వ్యవధిలోనే ఈ నలుగురు కోర్టును వీడి 4, తుగ్లక్ రోడ్ బంగ్లాలో ఉన్న జస్టిస్ చలమేశ్వర్ నివాసానికి చేరుకుకొని కాసేపటికే మీడియా ముందుకు వచ్చారు. జడ్జిలు ఉన్నట్టుండి బయటకు వెళ్లారన్న వార్త కోర్టు కారిడార్లలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇక జడ్జిల మీడియా సమావేశానికి హేమాహేమీలైన లాయర్లు, పాత్రికేయులు హాజరయ్యారు. శేఖర్ గుప్తా, ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్ తదితరులు తరలి వచ్చారు. జైసింగ్ కొన్ని ప్రశ్నలు అడగబోగా.. ఇది మీడియా సమావేశమని, మేమే అడగాలని కొందరు పాత్రికేయులు అభ్యంతరం తెలిపారు. అయితే తాను ఓ పౌరురాలిగా అడుగుతున్నట్టు జైసింగ్ వారికి బదులిచ్చారు. మొత్తంగా జడ్జిలు 7–8 నిమిషాలు మీడియాతో మాట్లాడారు. సీజేతో ఏజీ భేటీ.. జడ్జిల మీడియా సమావేశం నేపథ్యంలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సీజే జస్టిస్ దీపక్ మిశ్రాతో భేటీ అయ్యారు. సమావేశంలో వీరిద్దరు ఏం చర్చించారన్న అంశాలు తెలియరాలేదు. సీజే, ఏజీలు కూడా మీడియా సమావేశంలో మాట్లాడతారన్న వార్తలు వచ్చాయి. దీంతో పాత్రికేయులంతా సుప్రీంకోర్టుకు హుటాహుటిన వెళ్లి సాయంత్రం 4 గంటల దాకా నిరీక్షించారు. కానీ వారు మీడియా ముందుకు రాలేదు. అభిశంసనపై దేశమే నిర్ణయించాలి.. సీజేఐని అభిశంసించాలని కోరుకుంటున్నారా అని మీడియా జస్టిస్ చలమేశ్వర్‌ను అడగ్గా.. ‘‘ఆ విషయంపై జాతి నిర్ణయం తీసుకుంటుంది’’అని సమాధానమిచ్చారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం 25 మంది జడ్జిలు ఉన్నారు. గత ఆగస్టు 28న జస్టిస్ మిశ్రా సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది అక్టోబర్ 2న ఆయన పదవీకాలం ముగియనుంది. ఈయనతోపాటు ప్రస్తుతం మీడియా ముందుకు వచ్చిన నలుగురు న్యాయమూర్తులు కొలీజియంలో ఉన్నారు. సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసుపై విచారణ జరుపుతున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి బీహెచ్ లోయా అనుమానాస్పద మృతి కేసును సుప్రీం శుక్రవారమే విచారణకు స్వీకరించింది. ఇదే సమయంలో జడ్జీలు మీడియా ముందుకు రావడం సంచలనం రేకెత్తించింది. పలు అంశాల్లో సీజే వ్యవహరిస్తున్న తీరును ప్రస్తావించిన నలుగురు జడ్జిలు.. కొద్ది నెలల కిందట ఆయనకు రాసిన ఏడు పేజీల లేఖను కూడా మీడియాకు విడుదల చేశారు. ఈ పెడ పోకడను అడ్డుకోవాలి.. కేసుల రోస్టర్, వాటి కేటాయింపు అంశాల్లో ప్రధాన న్యాయమూర్తి వ్యవహార శైలిని జడ్జిలు తమ లేఖలో పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపే ముఖ్యమైన కేసులను కూడా గతంలో పని చేసిన సీజేఐలు ఎలాంటి హేతుబద్ధ ప్రాతిపదిక లేకుండా, తమ ఇష్టానుసారంగా, తమకు కావాల్సిన బెంచ్‌లకు కేటాయించేవారు. ఈ పోకడకు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకట్ట వేయాలి. లేదంటే ఇది అవాంఛనీయ పరిస్థితులకు దారి తీస్తుంది. న్యాయవ్యవస్థ నిజాయతీపైనా అనుమానాలకు తావిస్తుంది. న్యాయ వ్యవస్థ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవద్దన్న ఉద్దేశంతోనే మేం వివరాల్నింటినీ వెల్లడించడం లేదు. కానీ సదరు చర్యల వల్ల న్యాయవ్యవస్థ ప్రతిష్ట ఇప్పటికే కొద్దిగా మసకబారింది’’అని పేర్కొన్నారు. ‘‘సీజేకు ఉన్న కేసుల కేటాయింపు, రోస్టర్ అధికారం కోర్టు మరింత సమర్థంగా పనిచేయడానికి ఉద్దేశించింది మాత్రమే. అంతేకానీ జడ్జిలపై అధికారం చెలాయించేందుకు ఏమాత్రం కాదు. ప్రధాన న్యాయమూర్తి అంటే ‘సమానుల్లో ప్రథముడు’. అంతేగానీ ఎవరికంటే ఎక్కువ కాదు. తక్కువ కాదు..’’అని స్పష్టంచేశారు. జస్టిస్ చలమేశ్వర్‌ను కలిసిన రాజా జస్టిస్ చలమేశ్వర్‌ను సీపీఐ నేత డి.రాజా ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. ‘నాకు జస్టిస్ చలమేశ్వర్ చాలాకాలంగా తెలుసు. ఏం జరిగిందో తెలుసుకోవాలని వచ్చా. న్యాయవ్యవస్థలో ఇలాంటి సమస్యల పరిష్కారానికి పార్లమెంటే ఓ మార్గం చూపాలి’అని భేటీ అనంతరం రాజా అన్నారు. కొందరు జడ్జిలు కూడా చలమేశ్వర్‌ను కలిసినట్టు తెలిసింది. ‘‘రాజా వ్యక్తిగతంగా వెళ్లి చలమేశ్వర్‌ను కలిశారు. దీంతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదు’’అని పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. న్యాయమూర్తుల అంశంలో తమ పార్టీ తలదూర్చబోదని, సమస్యను న్యాయ వ్యవస్థనే పరిష్కరించుకుంటుందని అన్నారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా 1997 జూన్ 23న నియమితులయ్యారు. ఆ తర్వాత గౌహతి, కేరళ హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిం చారు. 2011 అక్టోబర్ 10న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై ప్రస్తుతం నెంబర్ టూగా కొనసాగుతున్నారు. ఇంటర్నెట్లో పోస్టు చేయడం వాక్స్వాతంత్య్రమంటూ ప్రక టించిన ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్నారు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) ఏర్పాటుపై 2015లో ఇచ్చిన తీర్పులో మిగిలిన న్యాయమూర్తులతో విభేదించారు. కొలీజియం వ్యవస్థ ఆశ్రిత పక్షపాతానికి అలంకారంగా మారిందని ఆక్షేపించారు. ఆధార్ తప్పనిసరి కాదంటూ తీర్పునిచ్చిన ధర్మాసనంలో చలమేశ్వర్ కూడా ఉన్నారు. గోప్యత అనేది ప్రాథమిక హక్కు అని 2017 ప్రకటించిన తొమ్మిది మంది న్యాయమూర్తుల్లో ఆయన ఒకరు. పార్లమెంటరీ కార్యదర్శులను నియమించుకుంటూ చట్టాలు చేసే హక్కు రాష్ట్రాలకు లేదంటూ తీర్పునిచ్చిన ధర్మాసనానికి ఆయన నేతృత్వం వహించారు. జస్టిస్ రంజన్ గొగోయ్ గౌహతి హైకోర్టులో 2001 ఫిబ్రవరి 28న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010లో పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు బదిలీ తర్వాత అక్కడే ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2012, ఏప్రిల్ 23న పదోన్నతి పొందారు. జస్టిస్ దీపక్ మిశ్రా తరువాత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతారు. రాజకీయ నాయకుల ఉచిత కానుకల హామీలపై మార్గదర్శకాలను రూపొందించాలని తీర్పునిచ్చిన ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్నారు. అలాగే ఓటు వేసే సమయంలో పౌరులు ఒక నిర్ణయం తీసుకోవటానికి వీలుగా.. అభ్యర్థులు నామినేషన్ అఫిడవిట్లో పూర్తి సమాచారాన్ని అందించటం తప్పనిసరని తీర్పునిచ్చిన ధర్మాసనంలోనూ సభ్యుడిగా ఉన్నారు. జస్టిస్ దీపక్ మిశ్రా... జస్టిస్ దీపక్ మిశ్రా 1953 అక్టోబర్ 3న జన్మించారు. 1977, ఫిబ్రవరి 14న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. రాజ్యాంగం, సివిల్, క్రిమినల్, రెవెన్యూ సర్వీసు, పన్నులకు సంబంధించిన కేసులను వాదించారు. 1996 జనవరి 17న ఒరిస్సా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1997 డిసెంబర్ 19న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2009 డిసెంబర్ 23న పదోన్నతిపై పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2010 మే 24న ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2011 అక్టోబర్ 10న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2017 ఆగస్టు 28న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2018, అక్టోబర్ 2న పదవీ విరమణ చేయనున్నారు. బాబ్రీ కేసు, సిక్కుల ఊచకోత, బీసీసీఐలో సంస్కరణలు లాంటి కీలక కేసులను విచారిస్తున్న బెంచ్‌లకు నేతృత్వం వహిస్తున్నారు. జస్టిస్ మదన్ బి.లోకూర్ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా 1999లో నియమితులయ్యారు. 2010లో ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత గౌహతి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2012 జూన్ 4న పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. న్యాయవ్యవస్థలో కంప్యూటరీకరణ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. గత దశాబ్ద కాలంలో మణిపూర్‌లో జరిగిన 98 ఎన్కౌంటర్ హత్యలపై సీబీఐ దర్యాప్తు జరపాలని జస్టిస్ లోకూర్, జస్టిస్ ఉదయ్ లలిత్‌లతో కూడిన ధర్మాసనం 2017 జూలైలో ఆదేశించింది. దేశంలో రైతు ఆత్మహత్యలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఆదేశాలు జారీచేసిన, జైల్లో అసహజ మరణాలకు గురైన వారి కుటుంబ సభ్యులకు పరిహారం అందచేయాలని కేంద్రంతో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనాలకు నేతృత్వం వహించారు. జస్టిస్ కురియన్ జోసెఫ్ కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా 2000, జూన్ 12న నియమితులయ్యారు. కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత పదోన్నతిపై హిమాచల్‌ప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 మార్చి 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ట్రిపుల్ తలాక్‌ను నిషేధించిన, బొగ్గు కేటాయింపు కుంభకోణం కేసును విచారించిన ధర్మాసనాల్లో సభ్యుడిగా ఉన్నారు. పార్లమెంటుపై దాడి కేసులో.. ముద్రణపత్రాలు, సీడీలను ఎలాంటి నిర్ధారణ లేకుండా ప్రాథమిక సాక్ష్యాలుగా పరిగణించటాన్ని సమర్థిస్తూ 2005లో ఇచ్చిన తీర్పును ధర్మాసనం తరఫున జస్టిస్ కురియన్ రాశారు. చదవండి: ⇒ ‘సుప్రీం’ సంక్షోభంపై న్యాయ నిపుణుల స్పందనలు ⇒ ‘సుప్రీం’లో సంక్షోభానికి కారణాలివి! -
మెుక్కలతోనే ప్రకృతి పరిరక్షణ
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ గుడివాడ టౌన్ : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్రకృతిని కాపాడాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. శనివారం ఆయన పట్టణంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం జగన్నాధపురంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మొక్కలు నాటారు. అనంతరం స్థానిక వీకేఆర్ అండ్ వీఎన్‌బీ కళాశాలలో కమ్మ మహాజనసంఘం ఆధ్వర్యంలో జరిగిన విద్య పారితోషిక పురస్కారాల మహోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఇచ్చిన దానాన్ని గుర్తుంచుకుని దాని విలువను తెలుసుకుని దాతలుగా మారినప్పుడే పొందిన çపురస్కారాలకు, చేయూతకు అర్థం వస్తుందని అన్నారు. ప్రతి వ్యక్తి రెండు మొక్కలు నాటి మనదేశం రుణంతీర్చుకోవాలని సూచించారు. ప్రకృతికి, మానవ జీవితానికి ప్రగాఢ అనుబంధం ఉందన్నారు. కేరళలో ఒక మొక్కను తొలగించాల్సిన అవసరం వస్తే దానికి ప్రత్యామ్నాయంగా రెండు మొక్కలు నాటుతారని తెలిపారు. ఇక్కడ కనీసం ఒక్క మొక్క కూడా నాటాలనే ఆలోచన లేదన్నారు. విద్యార్థి దశలో ఉన్న మీరు ఈ సంప్రదాయాన్ని ప్రారంభిస్తే భావితరాలకు మార్గదర్శకులుగా ఉంటారని, ప్రకృతి ప్రశాంతతను పొందగలుగుతారని అన్నారు.