మెుక్కలతోనే ప్రకృతి పరిరక్షణ
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్
గుడివాడ టౌన్ :
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్రకృతిని కాపాడాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. శనివారం ఆయన పట్టణంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం జగన్నాధపురంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మొక్కలు నాటారు. అనంతరం స్థానిక వీకేఆర్ అండ్ వీఎన్‌బీ కళాశాలలో కమ్మ మహాజనసంఘం ఆధ్వర్యంలో జరిగిన విద్య పారితోషిక పురస్కారాల మహోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఇచ్చిన దానాన్ని గుర్తుంచుకుని దాని విలువను తెలుసుకుని దాతలుగా మారినప్పుడే పొందిన çపురస్కారాలకు, చేయూతకు అర్థం వస్తుందని అన్నారు. ప్రతి వ్యక్తి రెండు మొక్కలు నాటి మనదేశం రుణంతీర్చుకోవాలని సూచించారు. ప్రకృతికి, మానవ జీవితానికి ప్రగాఢ అనుబంధం ఉందన్నారు. కేరళలో ఒక మొక్కను తొలగించాల్సిన అవసరం వస్తే దానికి ప్రత్యామ్నాయంగా రెండు మొక్కలు నాటుతారని తెలిపారు. ఇక్కడ కనీసం ఒక్క మొక్క కూడా నాటాలనే ఆలోచన లేదన్నారు. విద్యార్థి దశలో ఉన్న మీరు ఈ సంప్రదాయాన్ని ప్రారంభిస్తే భావితరాలకు మార్గదర్శకులుగా ఉంటారని, ప్రకృతి ప్రశాంతతను పొందగలుగుతారని అన్నారు.