environment
-
ఎలాంటి ఉత్పత్తులు వాడాలో చెప్పిన మంత్రి
పర్యావరణానికి అనుకూలమైన ఉత్పత్తులను వినియోగించడంపై ప్రజలు దృష్టి సారించాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దీంతో కర్బన ఉద్గారాలను తగ్గించ వచ్చన్నారు. ఫలితంగా పర్యావరణ సంబంధిత సమస్యలకూ పరిష్కారం లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో గోయల్ మాట్లాడారు.‘ప్రస్తుత జీవన శైలి ధోరణుల కారణంగా వెలువడుతున్న వ్యర్థాలు, కర్బన ఉద్గారాల పట్ల స్పృహ కలిగి ఉండడం ఎంతో అవసరం. ప్రపంచానికి మెరుగైన భవిష్యత్‌కు ఇది కీలకం. వినియోగ ధోరణలను చక్కదిద్దుకోకపోతే సుస్థిర, పర్యావరణ సవాళ్లకు పరిష్కారం లభించదు. తయారీ రంగం వెలువరించే కర్బన ఉద్గారాల వల్లే పూర్తిగా పర్యావరణ సవాళ్లు వస్తున్నట్లు భావించకూడదు. వినియోగం కూడా అందుకు కారణం. వినియోగ డిమాండ్‌పైనే తయారీ ఆధారపడి ఉంటుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: యాపిల్‌లో ఉద్యోగం జైలు జీవితం లాంటిది!వినియోగ ధోరణుల్లో మార్పు రావాలని మంత్రి అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా పర్యావరణ విధ్వంసానికి దక్షిణాది దేశాలు కారణం కాదని..ఇందులో అభివృద్ధి చెందిన దేశాల పాత్రం ప్రధానమని చెప్పారు. అవి చౌక ఇంధనాలను వినియోగిస్తున్నాయని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఆర్థిక, పరిశ్రమల మంత్రి ఎంకే నిర్ బర్కత్ ఇదే సమావేశంలో మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్యం మరింత పెరగాలని ఆకాంక్షించారు. ఈ సదస్సులో ఇటలీ, భూటాన్, బహ్రెయిన్, అల్జీరియా, నేపాల్, సెనెగల్, దక్షిణాప్రికా, మయన్మార్, ఖతార్, కంబోడియా దేశాల సీనియర్ మంత్రులు పాల్గొన్నారు. -
అరశతాబ్ది కిందే విత్తులు చల్లిన నాయకత్వం
‘ఈ స్పృహ ఈనాటిది కాదు. దీనికి యాభయ్యేళ్లకు పైబడిన చరిత్ర ఉంది. మానవకారక కాలుష్యాల వల్ల ముంచుకొస్తున్న ముప్పు పర్యావరణ మార్పు దుష్ఫలితాలను ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక సహాయం చేయాలన్నది ఒప్పందం. అంతే తప్ప, ఆ పేరుతో పెట్టుబడుల్ని సాయంగా చూపి వ్యాపారం చేయడం కాదని ఇవాళ మనం నిర్దిష్టంగా డిమాండ్ చేస్తున్నాం. పదమూడేళ్ల కింద (2011 కోపెన్‌హాగెన్) మీరే అంగీకరించి, సంసిద్ధత ప్రకటించినట్టు ఏటా ఇవ్వాల్సిన లక్ష కోట్ల డాలర్ల పర్యావరణ ఆర్థిక సహాయాన్ని మీ మీ వ్యాపారాల వృద్ధికి బంగారు బాట చేసుకోకండి’ అని తాజాగా భారత్ స్పష్టం చేసింది. అజర్‌బైజాన్‌లోని ‘బాకు’లో ‘కాప్–29’ సదస్సు జరుగుతున్న సందర్భంలో భారత్ ఈ ప్రకటన వెలువరించింది. ఇవాళ 140 కోట్ల మానవ వనరుల శక్తిగా, మార్కెట్ ప్రపంచానికి గమ్యస్థానంగా ఉన్న భారత్, శాసించాల్సిన చోట నామమాత్రపు పాత్రకే పరిమితమౌతోంది. కారణం, పర్యావరణ స్పృహ, దూరదృష్టి, ప్రపంచ దృక్పథం కలిగిన నాయకత్వం లేకపోవడమేనన్నది కొట్టొచ్చినట్టు కనిపించే వాస్తవం. యాభై ఏళ్ల కింద, నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ చూపిన పర్యావరణ దృక్పథం, చేసిన ఆలోచనలు కాలం కన్నా ఎంతో ముందున్నాయి. తదుపరి అయిదారు దశాబ్దాల్లో అభివృద్ధి– పర్యావరణ పరిరక్షణ మధ్య తలెత్తబోయే ఘర్షణను గుర్తించారు. ఇదే విషయమై సంపన్న–పేద దేశాల మధ్య బంధాలకు సరికొత్త నిర్వచనాల అవసరాన్ని ఆమె సహేతుకంగా అంచనా వేశారు. అభివృద్ధి పేరిట ప్రకృతి వనరులను అవసరాలకూ, దామాషాకూ మించి కొల్లగొట్టడాన్ని పర్యావరణ నేరంగానే చూశారామె! విఘాతం కలిగించిన వారే మూల్యం/ నష్టపరిహారం చెల్లించాలన్న ఆలోచనకు ఆమె నాడే బీజం వేశారు. భారతదేశపు పర్యావరణ దృక్పథానికి, భావధారకు మూలాలు 1971–72 నాటి పాలకుల ఆలోచనల్లో, కేంద్ర ప్రభుత్వ చర్యల్లో కనిపిస్తాయి. నాటి ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న వివిధ నిర్ణయాలు, చేపట్టిన పలు చర్యలు దీన్ని ధ్రువీకరిస్తాయి. స్వీడన్ వినతి మేరకు ఐక్యరాజ్యసమితి చొరవతో మొదటి ప్రపంచ పర్యావరణ సదస్సు స్టాక్‌హోమ్‌లో 1972 జూన్‌లో జరిగింది. కానీ, అంతకు ముందే 1972 ఫిబ్రవరిలోనే ‘పర్యావరణ ప్రణాళిక–సమన్వయ జాతీయ కమిటీ’ (ఎన్సీఈపీసీ) భారత్‌లో ఏర్పాటయింది. దీని ఏర్పాటుకు ఇంది రాగాంధీ చొరవ కారణం. ఆ కమిటీయే 1985లో కేంద్ర ‘పర్యావరణ అటవీ మంత్రిత్వ’ శాఖగా రూపాంతరం చెందింది. 1971 డిసెంబరులో ఆమె సిమ్లాలో ఉన్నారు. పాక్‌తో యుద్ధం, బంగ్లాదేశ్ అవతరణ తర్వాతి పరిణామాల్లో... పాకిస్తాన్ ప్రధాన మంత్రి జుల్ఫికర్ అలీ భుట్టోతో ఆమె దౌత్య చర్చలు జరుపుతున్నారు. అంతటి ఒత్తిడిలోనూ, సిమ్లా నుంచే ఆమె బిహార్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అభివృద్ధి పేరుతో చేపట్టిన ఒక ప్రాజెక్టుకు అటవీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం బదలాయిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందనీ, అది పర్యావరణానికి హాని చేసే తప్పుడు చర్య అవుతుంది కనుక ఉపసంహరించుకోవాలనీ ఆ లేఖలో పేర్కొన్నారు.దక్షిణ ప్రపంచానికి గొంతిచ్చిన వైనంస్టాక్హోమ్ పర్యావరణ వేదికను ఇందిరాగాంధీ ఎంతో వ్యూహాత్మకంగా, ప్రభావవంతంగా వాడుకున్నారు. అక్కడ ఆమె ఒక అరుదైన ఆలోచనాత్మకమైన ప్రసంగం చేశారు. ఆతిథ్య స్వీడన్ కాకుండా ఆమె ఒక్కరే దేశాధినేత హోదాలో ‘ప్లీనరీ ప్రసంగం’ చేశారు. ‘ఆ సదస్సు తర్వాత పదేళ్లకు పైగా ఆ ఊపు ఆమెలో కనిపించింది. దాని ఫలితంగానే, ఇప్పటికీ దేశంలో గొప్ప రక్షణాయుధాలుగా ఉన్న పలు ప్రగతిశీల అటవీ, వన్యప్రాణి–సహజవనరుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ చట్టాలు ఆ కాలంలోనే వచ్చాయ’ని ఆమె సమకాలికులైన ప్రభుత్వాధికారులు ఆయా సందర్భాల్లో వ్యాఖ్యానించేవారు. స్వల్ప జనాభా ఉన్న సంపన్న దేశాలు సౌఖ్యాలకు మరిగి, అసాధారణ స్థాయిలో ప్రకృతి సహజ వనరుల్ని కొల్లగొడుతూ చేస్తున్న పర్యావరణ హానిని ఆమె సోదాహరణంగా ఎండ గట్టారు. అభివృద్ధి–పర్యావరణ ఘర్షణను విడమర్చారు. కాలుష్య నివారణ కోసం విధించే కట్టుబాట్లు వెనుకబడ్డ దేశాల ప్రగతికి ప్రతిబంధకం అయ్యే తీరును ఎత్తిచూపడమే కాక ‘కాలుష్య కారకులే నష్టాల మూల్యం చెల్లించాల’నే వాదనను తెరపైకి తెచ్చి, మూడో ప్రపంచ దేశాల గొంతుకయ్యారు. ‘పర్యావరణ వాదననే మనం నెత్తికెత్తుకుంటే... యుద్ధం, పేదరికం వంటి సంక్షోభాలు అప్రాధాన్యమవుతాయేమో?’ అంటూ సదస్సు చైర్మన్‌గా ఉన్న యూఎన్ ప్రతినిధి మౌరిస్ స్ట్రాంగ్ వ్యక్తం చేసిన భయాన్ని ఆమె తిప్పికొట్టారు. ‘ప్రకృతి పరిరక్షణ’ అనేది అభివృద్ధి–పేదరిక నిర్మూలన బాధ్యతకు వ్యతిరేకం కాదనీ, అదే వారి జీవనప్రమాణాల వృద్ధికి దోహదపడుతుందనీ ఆమె అదే వేదిక నుంచి స్పష్టం చేశారు. సంపద, హోదా, అధికార పరంగా మనమెంత బలిష్టులమైనా, పర్యావరణ మార్పు విపరిణామాలకు ప్రభావితులం కాకుండా తప్పించు కోజాలమని ఆనాడే హెచ్చరించారు.పర్యావరణ స్పృహగల వారిప్పుడు వాడుతున్న ‘ఒకే పృథ్వి’ ‘జీవులున్న ఏకైక గ్రహం’ వంటి మాటల్ని ఇందిరా గాంధీ 70లలోనే వినియోగించారు. ‘ప్రపంచం ఏ మూల నుంచో తరచూ సమాచారం అందుతోంది, దేశం వెనుక దేశం అభివృద్ధి పేరిట ప్రకృతి విధ్వంసానికి తెగిస్తోంది, ఇలా సాగితే దీనికి ముగింపేమిటి?’ అని ఆమె ప్రశ్నించారు. సాటి మనుషుల్ని రక్షించడం, దోషుల్ని శిక్షించడమే కాదు, సకల జీవుల పట్ల కరుణతో ఉండాలని బుద్ధుడు, అశోకుడు 2 వేల ఏళ్ల కింద ఏర్పరచిన బాట, భారతీయ సంస్కృతిని ఆమె స్టాక్‌హోమ్ వేదిక నుంచి జగతికి వినిపించారు. అతి పురాతనమైన రుగ్వేదాన్ని ఉటంకిస్తూ ఇందిరాగాంధీ ఆనాడు స్టాక్‌హోమ్‌లో చెప్పిన ‘ప్రకృతి నుంచి తీసుకున్నంత, తిరిగి వెనక్కి ఇవ్వటం మానవ ధర్మం’ అన్న మాట, మనమంతా ఆచరించాల్సిన అక్షరసత్యం!- దిలీప్ రెడ్డి పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్(నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి) -
నిధులు రావాలి! నిశ్చయం కావాలి!
పర్యావరణ మార్పుల సమస్యపై ప్రపంచ దేశాలు మరోసారి చర్చకు కూర్చున్నాయి. పర్యావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) శిఖరాగ్ర సదస్సు ‘కాప్–29’ అజర్‌బైజాన్‌లోని బాకూలో సోమవారం మొదలైంది. బొగ్గు, ముడిచమురు, సహజవాయువుల వినియోగం నుంచి దూరం జర గాలని చరిత్రాత్మక ఒప్పందం కుదిరిన ఏడాది తరువాత జరుగుతున్న ఈ 12 రోజుల మేధామథనం అనేక విధాల ప్రాధాన్యం సంతరించుకుంది. గడచిన 2023, ఆ వెంటనే వర్తమాన 2024... ఇలా వరుసగా రెండో ఏడాది కూడా అత్యధిక వేడిమి నిండిన వత్సరంగా రుజువవుతున్న వేళ జరుగు తున్న సదస్సు ఇది. అలాగే, అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన కొద్ది రోజులకే ఇది జరుగుతోంది. పర్యావరణ సంక్షోభం వట్టి నాటకమన్నది ఆది నుంచి ట్రంప్ వైఖరి కావడంతో మిగతా ప్రపంచమంతా బాకూ వైపు ఆసక్తిగా చూస్తోంది. నిజానికి, ఈ 2024 చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతా నామ సంవత్సరం కానున్నట్లు కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్ లాంటి నివేదికలు సూచిస్తున్నాయి. పారిశ్రామికీకరణ ముందు నాటి కన్నా 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర ఉష్ణోగ్రత ఎక్కువైన తొలి ఏడాదే ఇదే కానుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పర్యవసానంగా కరవు, తుపానులు, వరదలు ప్రపంచమంతటిపై ప్రభావం చూపుతున్నాయి. ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కాప్–29 జరుగుతుండడం గమనార్హం. గమనిస్తే, ప్రపంచ కాలుష్య ఉద్గారాలలో ఇప్పటికే చైనా ప్రథమ స్థానంలో, అమెరికా రెండో స్థానంలో ఉంటే, భారత్ మూడో స్థానంలో నిలిచింది. అయితే, ఈసారి సదస్సుకు అమెరికా, చైనా, భారత్, బ్రిటన్, జర్మనీ, బ్రెజిల్, ఫ్రాన్స్ దేశాల అగ్రనేతలు హాజరు కావడం లేదు. అధ్యక్షుడు బైడెన్ రావట్లేదు. కొత్తగా ఎన్నికైన ట్రంప్ ఎలాగూ రారు. అయితేనేం, అమెరికా ప్రభావం ఈ కాప్–29పై అమితంగా ఉండనుంది. నిరుటి చర్చల్లో చేసుకున్న ప్రధాన వాగ్దానానికి కట్టుబడడంలో అనేక దేశాలు విఫలమయ్యాయి. ఉదాహరణకు, అన్ని దేశాల కన్నా అత్యధికంగా ముడిచమురును ఉత్పత్తి చేస్తున్న అమెరికా తన పద్ధతి మార్చుకోనే లేదు. ఇప్పుడు ట్రంప్ గద్దెనెక్కినందున చమురు ఉత్పత్తి, వినియోగం పెరుగుతుందే తప్ప తగ్గే సూచన లేదు. పర్యావరణ పరిరక్షణ చర్యల నుంచి అమెరికా పూర్తి దూరం జరిగినా జరగవచ్చు. ఇది ప్రమాద ఘంటిక. అగ్ర దేశాలు హాజరు కాకున్నా సమస్య తీవ్రతయితే మారదు. వాతావరణ సంక్షోభ నివారణకు మరిన్ని నిధులవసరం. అందుకే, కాప్–29 కొత్త వాతావరణ పరిరక్షణనిధిని ప్రాధాన్యాంశంగా ఎంచుకుంది. వర్ధమాన దేశాలు తమ ఉద్గారాల సమస్యను దీటుగా ఎదుర్కొని, పెరుగుతున్న వాతావరణ ముప్పును వీలైనంత తగ్గించాలంటే ఆ దేశాలకు తగినంత ఆర్థిక సహాయం అవసరం. అందుకు 100 బిలియన్ డాలర్ల వార్షిక లక్ష్యాన్ని 2009లోనే నిర్ణయించారు. 2020 కల్లా దాన్ని చేరాలని భావించారు. కానీ, అంతకంతకూ పెరుగుతున్న వాతావరణ సంక్షోభ పరిస్థితుల మధ్య ఆ నిధులు ఇప్పుడు ఏ మూలకూ రావు. కాబట్టి, వర్తమాన పరిస్థితులకూ, అవసరాలకూ తగ్గట్టు దాన్ని ఇప్పుడు సవరించుకోవాల్సిన పరిస్థితి. భాగస్వామ్య పక్షాలైన 198 దేశాలకూ వీటో ఉన్న నేపథ్యంలో ఏకాభిప్రాయ సాధన సులభమేమీ కాదు. అలాగే, ఈ మొత్తంలో ఎంత మేర ప్రజాధనం సేకరించా లనేది కూడా కీలక ప్రశ్నే. అనేక దేశాలు ఆర్థిక భారంతో ఉన్న వేళ దీని పైనా అందరి వైఖరీ ఒకేలా లేదు. అయితే, చర్యలు చేపట్టడం ఆలస్యమైన కొద్దీ మరింత భారీగా నిధులు అవసరమవుతాయి. నిధులెంత కావాలన్నదే కాదు... వాటిని ఎలా సేకరించాలి, పర్యావరణ మార్పుల కష్టనష్టాల నుంచి కోలుకొనేందుకు దేశాలకు ఎలా ఆ నిధుల్ని పంచాలి, సంక్షోభ పరిష్కారానికి రూపొందించాల్సిన ఆర్థిక వ్యవస్థ ఏమిటనేది కూడా సదస్సులో కీలక చర్చనీయాంశాలే. పర్యావరణ, ఆర్థిక, మానవ నష్టాలను నిరోధించాలంటే పరిస్థితి చేతులు దాటక ముందే ఉద్గారాల్ని తగ్గించడం కీలకం. వాతావరణ ఉత్పాతాలతో విస్తృతంగా నష్టం, పర్యవసానాలు తప్పవు. నష్టం పెరిగిన కొద్దీ ఆ దేశాల పునరుజ్జీవానికి మరింత ఖర్చవుతుంది. ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న పుడమి పరిస్థితి మరింత క్షీణించకుండా ఉండాలంటే, తక్షణ చర్యలు అవసరం. అభివృద్ధి చెందిన దేశాలు గతంలో కోవిడ్–19 సమయంలో తమ పౌరులకూ, వ్యాపారాలకూ అండగా నిలిచేందుకు 48 నెలల్లోనే దాదాపు 8 లక్షల కోట్ల డాలర్లను అందించి, ఆ సవాలును ఎదుర్కొన్నాయి. అప్పటి కోవిడ్లానే ఇప్పుడీ పర్యావరణ మార్పు సమస్యనూ అంతే అత్యవసరంగా చూడడం ముఖ్యం. ప్రజాధనంతో పాటు ప్రైవేట్ రంగ ఆర్థిక సాయం కూడా లేకుంటే కష్టమని కాప్–29 బాధ్యులు సైతం తెగేసి చెబుతున్నారు. హరిత పర్యావరణ నిధి అంటూ పెట్టినా, సమకూరింది తక్కువే. ఇప్పటికైతే ఏటా కనీసం లక్ష కోట్ల డాలర్లు అవసరమంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు బాధ్యతను విస్మరించి వ్యవహరిస్తుండడంతో, వర్ధమాన దేశాల స్వచ్ఛ అభివృద్ధి, దారిద్య్ర నిర్మూలనకు గండి పడుతోంది. అసలు ఆ నిధుల్లోనూ 60 శాతం పైగా రుణాలైతే, 30 శాతం పైగా ఈక్విటీలు. కేవలం 5 శాతమే గ్రాంట్లు. అసలే కునారిల్లుతున్న అనేక పేద దేశాలకు ఇది మోయలేని భారమే. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని, కాప్–29 చర్చించడం ముఖ్యం. బలమైన ఆర్థికవ్యవస్థగా రూపొందుతున్న భారత్ సైతం చొరవ తీసుకోవాలి. హరిత ఇంధన టెక్నాలజీ, పరిశోధన – అభివృద్ధి, తక్కువ ఖర్చు పరిష్కారాల వైపు ప్రపంచం దృష్టి సారించేలా చూడాలి. ఏమైనా, గండం గట్టెక్కాలంటే మరిన్ని నిధులు కావాలి. అదీ వేగంగా అందాలి. వనరుల సమీకరణ సాధ్యమేనని చరిత్ర చెబుతోంది గనక, ఇప్పుడిక రాజకీయ కృతనిశ్చయముందా అన్నదే ప్రశ్న. ఈ 12 రోజుల సదస్సులో దానికి సమాధానం స్పష్టం కానుంది. -
పరిసరాలపై విశ్వాసం
సాక్షి, సిటీబ్యూరో: ప్లాస్టిక్ సంచులు, ఇతర వ్యర్థాలను కాల్వలు, చెరువు కట్టలు, రహదారికి ఇరువైపులా ఎక్కడపడితే అక్కడ పడేస్తుండటం గమనిస్తాం. ఆయా ప్రాంతాలను శుభ్రం చేయాలంటే పురపాలక సిబ్బంది రావాలని అనుకుంటాం. ఆలస్యమైతే ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తాం.. అలా కాకుండా మనమే శుభ్రం చేద్దామని కంకణం కట్టుకున్నవారెంతమంది ఉంటారు? అలాంటి వారు నగరంలో చాలా అరుదనే చెప్పాలి.కొందరు యువత మాత్రం చెరువుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, మద్యం సీసాలు, ఇతర వ్యర్థాలను తొలగించే కార్యక్రమానికి నడుం బిగించారు. 2021 నుంచి నగరంలో సరూర్‌నగర్ చెరువు, అమీన్పూర్ చెరువు, నల్లగండ్ల చెరువు, గాంధీ చెరువు, పీరంచెరువు, ఖాజాగూడ చెరువు, తదితర ప్రాంతాల వద్ద కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి సెలవు రోజునా చెరువు కట్ట, పరిసర ప్రాంతాలను శుభ్రం చేయాలన్నది వారి లక్ష్యం. ఫలితంగా పర్యావరణ పరిరక్షణ, ఇతర వ్యక్తుల్లో క్లీనింగ్ పట్ల స్పృహ కల్పించడం, ఎన్నో రకాల పక్షులను ఆదుకున్నట్లవుతుందని భావిస్తున్నారు. ఐదుగురు స్నేహితులతో ప్రారంభమైన విశ్వ సస్టైనబుల్ ఫౌండేషన్ ప్రస్తుతం సుమారు 500 మందికిపైగా వలంటీర్లను జత చేసుకుంది.బృందాలుగా ఏర్పడి...వీరంతా బృందాలుగా ఏర్పడి చెరువులను దత్తత తీసుకుంటున్నారు. వారాంతంలో వారికి కేటాయించిన చెరువుల దగ్గర ప్రజలు వేసే చెత్త, ప్లాస్టిక్ సంచులు, తాగుబోతులు విసిరేసిన గాజు సీసాలు వంటి వ్యర్థాలను ఏరిపారేస్తున్నారు. సంచుల్లో ప్యాక్ చేసి జీహెచ్ఎంసీకి తరలిస్తున్నారు. దేశంలోనే మొదటి బయోడైవర్సిటీ చెరువుగా గుర్తింపు పొందిన అమీన్పూర్ చెరువుతో పాటు నగరంలో పలు చెరువులకు వలస పక్షలు వస్తున్నాయి.ఈ సీజన్లో వాటి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలా వలస వచ్చిన పక్షలు ఇక్కడ ప్లాస్టిక్ భూతానికి బలైపోతున్నాయి. ఆహారంగా చేపలు, ఇతర కీటకాలను వేటాడే సమయంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తింటున్నాయి. ఈ క్రమంలో వాటికి ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలి. ప్రకృతి సిద్ధంగా ఉన్న చెరువులను ఆహ్లాదకరంగా మార్చాలనే పట్టుదలతో ఒక్కో చెరువునూ ఒక్కో బృందం పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం నగరంలో ఏడు బృందాలు పనిచేస్తున్నాయి. -
రాష్ట్రంలో రెండో బయోస్పియర్ పార్క్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/కొయ్యూరు: రాష్ట్రంలో చింతూరు, రంపచోడవరం ప్రాంతాల్లోని సుమారు 2 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో బయోస్పియర్ పార్కు (జీవావరణ పార్క్) ఏర్పాటుకు అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో 40 రోజుల్లో యునెస్కోకు ప్రతిపాదనలు పంపాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో శేషాచలం అటవీ ప్రాంతాన్ని 2010లోనే యునెస్కో జీవావరణ పార్కుగా గుర్తించింది. 4,756 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన శేషాచలం పార్కు రాష్ట్రంలో మొదటిది కాగా తాజాగా 2 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రెండో పార్కును ప్రతిపాదిస్తున్నారు. ప్రధానంగా అటవీ ప్రాంతాన్ని సంరక్షించడంతో పాటు వివిధ జీవరాశులకు రక్షణ కల్పించే ఉద్దేశంతో బయోస్పియర్ పార్కును అటవీశాఖ ప్రతిపాదిస్తోంది. దీనికి ఆమోదం లభిస్తే అటవీ, జంతు సంరక్షణతో పాటు పరిశోధనలు, శిక్షణ కార్యకలాపాలకు యునెస్కో సహాయం అందించనుంది. బయోస్పియర్ రిజర్వ్‌గా మర్రిపాకల అటవీ ప్రాంతం మర్రిపాకల అటవీప్రాంతాన్ని బయోస్పియర్ రిజర్వ్‌గా ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నట్లు చింతపల్లి డీఎఫ్‌వో వైవీ నర్సింగరావు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కాకరపాడు డిపోలో కలప వేలం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చింతూరు, రంపచోడవరం డీఎఫ్‌వోలను సంప్రదించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. దట్టమైన అడవి ఉన్న మర్రిపాకల ప్రాంతాన్ని కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. స్మగ్లర్లపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కొందరు విద్యుత్ తీగలు అమర్చి జంతువులను వేటాడుతున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. జీవావరణ పార్కులో 3 జోన్లు ఉంటాయి కోర్ జోన్: ఈ ప్రాంతంలో ఎటువంటి కార్యకలాపాలను అనుమతించరు. బఫర్ జోన్: పరిమితంగా స్థానిక ప్రజలను మాత్రమే అవసరమైన వనరుల సమీకరణకు అనుమతిస్తారు. ఫ్రీ జోన్: ఇది పార్కు వెలుపలి ప్రాంతం. ఇక్కడ ఎటువంటి నియంత్రణ లేకుండా సాధారణ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా 18 పార్కులు..జీవావరణ పార్కుల అభివృద్ధి కార్యక్రమాన్ని 1971లో యునెస్కో చేపట్టింది. ఇప్పటివరకు వివిధ రాష్ట్రాల్లో 18 జీవావరణ పార్కులు ఏర్పాటయ్యాయి. -
ఓ పచ్చని నీడ! గ్రీన్ వారియర్..పద్నాలుగేళ్లకే..!
పద్నాలుగు సంవత్సరాల వయసులోనే ఏం చేయగలం!’ అని ఎవరైనా నిట్టూరిస్తే... ‘ఎంతో చేయగలం’ అని చెప్పడానికి కెన్యాకు చెందిన ఎల్లియానే బలమైన ఉదాహరణ. పచ్చని చెట్టు నీడలో, చల్లటి వెన్నెల నీడలో ఆమె విన్న కథల్లో పర్యావరణ ఉద్యమకారిణి ప్రొఫెసర్ మాథాయ్ ఉంది. మాథాయ్ స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా వేలాది మొక్కలు నాటింది ఎల్లియానే. ‘చిల్డ్రన్స్ విత్ నేచర్’ స్వచ్ఛంద సంస్థ స్థాపించి మొక్కల పెంపకాన్ని ఉద్యమంగా మార్చింది. స్ఫూర్తి అనేది ఎంత గొప్పదో చెప్పడానికి బలమైన ఉదాహరణ ఎల్లియానే వాంజీ క్లిస్టన్. చిన్నప్పుడు తాను విన్న కథల్లో కథానాయిక వంగరి మాథాయ్. నోబెల్ బహుమతి గ్రహీత వంగరి మాథాయ్ చెట్ల రక్షణ, మొక్కల పెంపకం గురించి చేసిన కృషి, ఉద్యమం అంతా ఇంతా కాదు. ఆమె ప్రారంభించిన ‘గ్రీన్ బెల్ట్ మూమెంట్’ గురించి కథల రూపంలో విన్నది ఎల్లియానే. వంగరి మాథాయ్ స్ఫూర్తితోనే గ్రీన్ వారియర్‌గా మారింది.మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, ఫ్లోరెన్స్ నైటింగేల్ లాంటి ప్రపంచ ప్రసిద్ధుల గురించి వినడం ద్వారా ‘మార్పు’ గొప్పదనం ఏమిటో తెలుసుకుంది. ‘మన భూగోళాన్ని రక్షించడానికి నేను సైతం’ అంటూ ప్రయాణం ప్రారంభించింది. పర్యావరణ కార్యక్రమాలలో భాగంగా కింగ్ చార్లెస్లాంటి వారిని కలుసుకోవడం, గ్రామీ అవార్డ్ గ్రహీత మెజీ అలాబీ, మాజీ ఫుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెక్‌హామ్‌తో కలిసి వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ప్రచారంలో పాల్గొనడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దృష్టిని ఆకర్షించింది.‘నేను ప్రొఫెసర్ మాథాయ్ కావాలనుకుంటున్నాను’ అని చిన్నప్పుడు ఎల్లియానే తల్లితో అన్నప్పుడు ఆ తల్లి నుంచి తక్షణ స్పందనగా రావాల్సిన మాట... వెరీ గుడ్! అయితే కూతురు నుంచి వచ్చిన మాట విని తల్లి భయపడింది. మాథాయ్ను మానసికంగా ఎలా గాయపరిచారో, కొట్టారో, జైల్లో పెట్టారో వివరంగా చెప్పింది. ‘నువ్వు డాక్టర్ లేదా లాయర్ కావడం మంచిది’ అని కూతురికి సలహా కూడా ఇచ్చింది ఆ తల్లి. తల్లి చెప్పింది విని ఎల్లియానే భయపడి ఉండాలి. కానీ అలా జరగలేదు. పైగా ప్రొఫెసర్ మాథాయ్పై మరింత గౌరవం పెరిగింది.తొలిసారిగా ఒక విత్తనాన్ని నాటింది. అది మొలకెత్తిన అద్భుతాన్ని చూసింది. ఇక అప్పటినుంచి చెట్ల వెనక ఉన్న సైన్స్ గురించి తెలుసుకుంటూనే ఉంది. కెన్యా ఫారెస్ట్రీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో డాక్టర జేన్ జుగునా ద్వారా మొక్కల పెంపకానికి సంబంధించి పనిముట్ల నుంచి సరైన మట్టి వరకు ఎన్నో విషయాలు తెలుసుకుంది. ‘చిల్డ్రన్ విత్ నేచర్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా పిల్లలకు పాఠాలు చెప్పింది. ‘మీరు తలచుకుంటే మీ ప్రాంతంలో మార్పు తీసుకు రావచ్చు’ అని ధైర్యాన్ని ఇచ్చింది.‘2020 నాటికి వేలాది మొక్కలను నాటాను. కెన్యాలోనే కాకుండా విదేశాలలో కూడా ట్రీ లవర్స్ కమ్యూనిటీలను ఏర్పాటు చేశాను’ అంటున్న ఎల్లియానే మొరాకో నుంచి జాంబియా వరకు తాను వెళ్లిన ఎన్నో దేశాలలో మొక్కలు నాటింది. అయితే వాతావరణ మార్పుల గురించి ప్రపంచ వ్యాప్తంగా వివిధ సదస్సులలో పాల్గొనడం వల్ల ‘గతంతో పోల్చితే మొక్కల పెంపకంలో వెనక పడ్డాను’ అనే బాధ ఎల్లియానేలో కనిపిస్తుంది.చెట్ల పెంపకం సంగతి సరే, మరి చదువు సంగతి ఏమిటి?చదువులో ఎప్పుడూ ముందే ఉంటుంది ఎల్లియానే. పిల్లల తోపాటు జంతువులపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని గురించి వివరించే ‘సేవ్ అవర్ వైల్డ్‌లైఫ్’ అనే డాక్యుమెంటరీలో కనిపించింది. ఈ డాక్యుమెంటరీలో తనకు ఇష్టమైన జంతువు ఏనుగు గురించి చెప్పింది. వేట కంటే మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల వాటికి కలుగుతున్న ముప్పు గురించి వివరంగా మాట్లాడింది. ‘ఆఫ్రికాలోని గ్రీన్‌బెల్ట్‌లో మొక్కలు నాటాలి అనేది నా కల’ అంటుంది ఎల్లియానే. ‘ఏదీ అసాధ్యం కాదు’ అనేది ఎల్లియానే నోటినుంచి ఎప్పుడూ వినిపించే మాట. (చదవండి: ‘బ్రిటిష్ హైకమిషనర్’గా 19 ఏళ్ల అమ్మాయి..!) -
గాలి నిండా మీథేన్!
పర్యావరణానికి ప్రధాన శత్రువు మనిషేనని మరోసారి రుజువైంది. శిలాజ ఇంధనాల వాడకం, పారిశ్రామికీకరణ వంటి మానవ కార్యకలాపాల వల్ల 20 ఏళ్లలోనే ఏకంగా 67 కోట్ల టన్నుల మేరకు ప్రమాదకర మీథేన్ వాయువు వాతావరణంలోకి విడుదలైందట. స్టాన్‌ఫర్డ్ వర్సిటీ సైంటిస్టుల తాజా అధ్యయనంలో తేలిన చేదు నిజమిది. ఈ దెబ్బకు పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే గాలిలో మీథేన్ పరిమాణం ఏకంగా 2.6 రెట్లు పెరిగిపోయిందని ఆ నివేదిక పేర్కొంది. పైగా, ‘‘ఇవి 2020 నాటి గణాంకాల ఆధారంగా వేసిన లెక్కలు. ఈ నాలుగేళ్లలో పరిస్థితి మరింత దిగజారింది’’ అంటూ హెచ్చరించింది... 2000 నుంచి కొన్నాళ్ల పాటు వాతావరణంలో మీథేన్ పెరుగుదల కాస్త అదుపులోనే ఉంటూ వచ్చింది. కానీ ఆ తర్వాత పలు దేశాలు శిలాజ ఇంధనాల ఉత్పత్తి, వాడకాలను విచ్చలవిడిగా పెంచేయడంతో ప్రమాదకర స్థాయిలో పెరుగుతూ వస్తోంది. బొగ్గు, చమురు, సహజవాయువు తదితరాల వెలికితీత, వాడకం వల్ల వెలువడుతున్న మీథేన్ పరిమాణం గత 20 ఏళ్లలో ఏకంగా 33 శాతం పెరిగిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అలాగే వ్యర్థాలు తదితరాల నుంచి మీథేన్ విడుదలవుతున్న 20 శాతం, వ్యవసాయం వల్ల మరో 14 శాతం పెరిగిందని అధ్యయనం తేలి్చంది! ‘ప్రపంచం పెద్దగా పట్టించుకోవడం లేదు గానీ, వాతావరణంలో పెరిగిపోతున్న మీథేన్ పరిమాణం పర్యావరణానికి పెద్ద విపత్తుగా పరిణమిస్తోంది’ అని అధ్యయనానికి సారథ్యం వహించిన గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ హెడ్, స్టాన్‌ఫర్డ్ వర్సిటీలో పర్యావరణ శాస్త్రవేత్త రాబ్ జాక్సన్ హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటుంది. ‘‘2000 సంవత్సరంలో వాతావరణంలోని మొత్తం మీథేన్ పరిమాణంలో మనిషి వాటా 60 శాతంగా ఉండేది. ఇప్పుడది ఎకాయెకి 65 శాతానికి పెరిగింది. భూ వాతావరణంలో మీథేన్ పెరుగుదల కార్బన్ డయాక్సైడ్ (సీఓటూ) కంటే చాలా ఎక్కువగా నమోదవుతోంది. 2015లోనైతే వాతావరణంలో మీథేన్ సాంద్రత గత 80 లక్షల ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీగా నమోదైంది! వాతావరణంలో వేలాది ఏళ్లపాటు ఉండిపోయే సీఓటూతో పోలిస్తే మీథేన్ ఉండేది 12 ఏళ్లే అయినా అది కలగజేసే నష్టం మాత్రం ఎక్కువ. ఎందుకంటే పర్యావరణానికి సీఓటూ కంటే మీథేన్ 82 రెట్లు ఎక్కువ నష్టం చేస్తుంది’’ అని జాక్సన్ వివరించారు. ‘‘మీథేన్, సీఓటూ ఉద్గారాలు ఇలాగే కొనసాగితే 2050 నాటికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ఏకంగా 3 డిగ్రీలకు మించి పెరిగిపోతాయి. అది వినాశనానికి దారితీస్తుంది’’ అని ఆందోళన వెలిబుచ్చారు. ఈ అధ్యయన ఫలితాలు ‘ఎని్వరాన్మెంటల్ రీసెర్చ్ లెటర్స్’లో మంగళవారం ప్రచురితమయ్యాయి.కాగితాల్లోనే లక్ష్యం...మీథేన్ ముప్పుపై అంతర్జాతీయ వేదికలపై ఎన్నోసార్లు చర్చోపచర్చలు జరిగాయి. పర్యావరణ శాస్త్రవేత్తల వరుస ఆందోళనల ఫలితంగా 2021లో దేశాలన్నీ దీనిపై లోతుగా చర్చించాయి. వాతావరణంలో మీథేన్ పరిమాణాన్ని తగ్గిస్తామంటూ ప్రతినబూనాయి. ‘గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్’గా పిలిచే ఒప్పందంపై 100కు పైగా దేశాలు సంతకాలు చేశాయి. మీథేన్ ఉద్గారాలను 2030 నాటికి 30 శాతానికి పైగా తగ్గించాలన్నది దీని లక్ష్యం. ఫలితంగా 2050 నాటికి గ్లోబల్ వార్మింగ్‌లో 0.2 డిగ్రీ సెల్సియస్ మేరకు తగ్గుదల నమోదవుతుందని అంచనా. కానీ ఆచరణలో ఏ దేశమూ చేసింది పెద్దగా ఏమీ లేకపోవడంతో ఈ లక్ష్యం కాగితాలకే పరిమితమైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ మీథేన్‌తో పెను ప్రమాదమే⇒ ఏటా 5.8 కోట్ల టన్నుల మీథేన్ వాతావరణంలోకి విడుదలవుతోందని అంచనా. ఇందులో మనిషి వాటాయే ఏకంగా 60 శాతం. ⇒ వ్యవసాయం, శిలాజ ఇంధనాల వెలికితీత, వాటి వాడకం తదితరాల వల్ల 60 శాతం మీథేన్ విడుదలవుతోంది. ⇒ అమెరికాలో కేవలం గ్యాస్ డ్రిల్లింగ్ కారణంగా 2005 నుంచి ఇప్పటిదాకా ఏకంగా 1.17 కోట్ల టన్నుల మీథేన్ విడుదలై ఉంటుందని అంచనా! ⇒ గాల్లో మీథేన్ పరిమాణం పెరిగితే వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ⇒ గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధాన కారణమైన గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాల్లో మీథేన్దే పెద్ద వాటా. ⇒ పారిశ్రామికీకరణ అనంతరం గత 150 ఏళ్లలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ప్రమాదకరంగా పెరిగిపోతుండటం తెలిసిందే. అందులో మూడో వంతు పెరుగుదల మీథేన్ వల్లే సంభవిస్తోంది! ⇒ వాతావరణంలోని వేడిని మీథేన్ నిర్బంధించి దాన్ని తిరిగి భూమిపైకే పంపుతుంది. మరోలా చెప్పాలంటే భూ ఉపరితలంపై ఓజోన్ పొరలాంటి దాన్ని ఏర్పరుస్తుంది. అలా భూ ఉష్ణోగ్రతలు పైకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. తద్వారా పర్యావరణం నానాటికీ వేడెక్కుతోంది. ⇒ వాయు నాణ్యతను కూడా మీథేన్ బాగా దెబ్బ తీస్తుంది. దాంతో మనుషులతో పాటు జంతువుల్లో కూడా శ్వాసకోశ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ⇒ పర్యావరణానికి కార్బన్ డయాక్సైడ్ కంటే మీథేన్ వల్ల జరిగే నష్టం ఏకంగా 82 రెట్లు ఎక్కువ! ⇒ తాజా అధ్యయనం కేవలం 2020 నాటికి అందులో ఉన్న డేటా ఆధారంగా చేసినదే. ఈ నాలుగేళ్లలో మీథేన్ ప్రభావం మరింత వేగంగా పెరుగుతూ వస్తోందన్నది పర్యావరణవేత్తల మాట. తక్షణం దిద్దుబాటు చర్యలు తప్పవని వారంటున్నారు.భూ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలను అంతర్జాతీయంగా అంగీకరించిన 1.5 డిగ్రీ సెల్సియస్ స్థాయికి పరిమితం చేయాలంటే సీఓటూ ఉద్గారాలను సగానికి, మీథేన్ ఉద్గారాలను మూడో వంతుకు తగ్గించాలి. ఈ దిశగా తక్షణ కార్యాచరణ అత్యవసరం – బిల్ హేర్, క్లైమేట్ అనలిటిక్స్ సీఈఓ, పర్యావరణ శాస్త్రవేత్త -
పచ్చదనాల పల్లె.. మరియపురం
గీసుకొండ: ఒకప్పుడు పల్లెలు పచ్చదనానికి పట్టుగొమ్మలు, ఇప్పుడంతా మారిపోయిందని అంటూ ఉంటారు. కానీ వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని మరియపురం మాత్రం ఇప్పటికీ పచ్చదనంతో కళకళలాడుతోంది. ఏ ఇంటి ఆవరణ చూసినా, ఏ వీధిలో తిరిగినా పచ్చటి చెట్లు, మొక్కలు కనువిందు చేస్తున్నాయి. 2019 నుంచి ఇటీవలి వరకు సర్పంచ్‌గా పనిచేసిన అల్లం బాలిరెడ్డి చొరవే దీనికి కారణం. ఆయన సొంత ఖర్చుతో నర్సరీల నుంచి మొక్కలు తెప్పించారు. గ్రామంలోనూ నర్సరీ ఏర్పాటు చేయించారు. వివిధ పండ్లు, పూలు, కూరగాయల మొక్కలను ఇంటింటికి అందించారు. మొక్కలు నాటి సంరక్షించిన వారికి బహుమతులు ఇచ్చారు. నిండా పచ్చదనంతో, కాలుష్యానికి దూరంగా ఉండే ఈ గ్రామానికి ఇప్పటికే జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీగా గుర్తింపు వచ్చి0ది. ఇటీవల రాష్ట్ర స్థాయి పర్యావరణ పరిరక్షణ అవార్డు ఇచ్చారు. ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు.. సోలార్ ఉత్పత్తిలోనూ.. గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడానికీ సర్పంచ్ కృషి చేశారు. గ్రామంలో ఇంటింటికీ జనపనార, క్లాత్ సంచులను అందించారు. తనకు వచ్చే గౌరవ వేతనాన్ని మßహిళా సంఘాలకు ఇచ్చి.. వారితో వారంలో ఒకరోజు ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే పనులు చేయించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను పోగుచేసి విక్రయించి, ఆ సొమ్మును గ్రామ అభివృద్ధికి ఖర్చు చేశారు. ఇక గ్రామంలో 20 మంది తమ ఇళ్లపై సౌర విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం సర్పంచ్ తన వంతుగా రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. గత ఐదేళ్లలో గ్రామంలో పుట్టిన 29 మంది బాలికలకు రూ.10వేల చొప్పున సాయం అందించారు. గ్రామాల అభివృద్ధితోనే దేశ ప్రగతి.. ‘‘ప్రజలు, ప్రభుత్వ అధికారుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేశాం. అన్ని గ్రామాలు స్వయం సమృద్ధి చెందితే దేశం మరింత ప్రగతి సాధిస్తుంది.’’ – మాజీ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి -
ఊపిరి తీస్తున్న వాయు కాలుష్యం!
మనిషి బ్రతకడానికి ఊపిరి తీసుకుంటాడు. అలాంటిది ఈ మధ్య కాలంలో ఊపిరి తీసుకోవడమే ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమించింది. వాతావరణంలో కర్బన ఉద్గారాలు విపరీతంగా పెరిగి పోవడం వలన స్వచ్ఛమైన ప్రాణవాయువు శాతం తగ్గిపోతోంది. దీనివలన చిన్నారుల నుంచి సీని యర్ సిటిజన్స్ వరకు అనేక ఆరోగ్య సమస్యలు అనుభవించాల్సి వస్తోంది.మనం పీల్చే గాలిలో ప్రాణాంతకమైన కాలుష్య కారకాలు కలుస్తున్నాయి. ఊపిరి తీసుకున్న తరువాత శరీరంలోకి చేరిపోయి అవయవాలను నిర్వీర్యం చేస్తున్నాయి. మనదేశంలో అతిపెద్ద నగ రాలలో సంభవిస్తున్న మరణాల్లో సగటున 7.2 శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణమని తాజా అధ్యయనంలో తెలిసింది. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాలలోని గాలిలో అత్యంత సూక్ష్మమైన ‘పి.ఎం 2.5’ ధూళి కణాలు అధికంగా ఉన్నట్లు ఒక నివేదిక తెలిపింది. మనదేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో చాలా మరణాలకు వాయు కాలుష్యమే కారణమవుతున్నట్లు తెలిపింది. పి.ఎం అంటే పార్టిక్యులేట్ మ్యాటర్. 2.5 అంటే... గాలిలో ఉండే సూక్ష్మ కణాల వ్యాసం 2.5 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ ఉన్నవని అర్థం. ఈ కణాలు ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. ఇవి ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులు, శ్వాసనాళాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఈ గాలిలోకి చేరే సల్ఫేట్లు, బొగ్గు సంబంధమైన కలుషితాల వంటివి ఊపిరితిత్తులకు పట్టేస్తున్నాయి. గుండెకు వెళ్లే రక్తపునాళాల్లో పేరుకుపోతున్నాయి.మనదేశంలోని పెద్ద పెద్ద నగరాలలో నిత్యం వెలువడుతున్న పి.ఎం 2.5 ధూళికణాల వలన మరణాలు రేటు నానాటికీ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఒక క్యూబిక్ మీటర్ గాలిలో 2.5 ధూళి కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే రోజువారీ మరణాల సంఖ్య 1.4 శాతం పెరుగు తున్నట్లు ఒక పరిశోధనలో గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాల ప్రకారం ఒక రోజు అనగా 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో పి.ఎం 2.5 కణాలు 15 మైక్రోగ్రాముల లోపు ఉంటే ప్రమాదం వుండదు, అంతకంటే పెరిగితే ముప్పు తప్పదు.భారతదేశ వాయు నాణ్యతా ప్రమాణాల ప్రకారం 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో పి.ఎం 2.5 కణాలు 60 మైక్రోగ్రాముల లోపు ఉంటే ప్రమాదం అంతగా ఉండదు. కానీ మనదేశంలో ప్రస్తుతం 75 మైక్రోగ్రాముల కంటే అధికంగానే ఉంటున్నట్లు తెలిసింది. క్యూబిక్ మీటర్ గాలిలో పి.ఎం 2.5 కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే మరణాల రేటు సగటున 3 శాతం దాకా పెరుగుతున్నట్లు గుర్తించారు. వాయు కాలుష్యం వలన బ్రెయిన్ స్ట్రోక్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మొనరీ వ్యాధులు, న్యూమోనియా, శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది.కళ్లు, ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో చీకాకుతో పాటు దగ్గు, తుమ్ములు పెరుగుతాయి. దీనితో పాటు ఆస్తమా లాంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరి స్తున్నారు. ఈ వాయుకాలుష్యం ఇలానే పెరిగితే భూమికి రక్షణ కవచం అయిన ఓజోన్ పొర క్షీణించడం ఎక్కువవుతుంది. ఓజోన్ పొర దెబ్బతింటే యూవీ కిరణాలు నేరుగా భూమిపైన పడడం వలన చర్మ, నేత్ర సమస్యలు వస్తాయి. వ్యవసాయంపైన కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి వాయుకాలుష్యం తగ్గించడానికి ప్రభుత్వాలు సాధ్యమైనంత సత్వర చర్యలు తీసుకోవాలి. – మోతె రవికాంత్, సేఫ్ ఎర్త్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, హైదరాబాద్ -
ఈ నేల ఈ గాలి... పర్యావరణ గీతం
ఏయిర్ ఫోర్స్ అధికారి కూతురు అయిన బవ్రీన్ దేశంలోని వివిధప్రాంతాలలో చదువుకుంది. అలా ఎన్నో సంస్కృతులు, కళలు, ప్రకృతి అందాలతో పరిచయం అయింది. లండన్‌లోని వాయు కాలుష్యం గురించి వ్యాసం ఒకటి చదివింది బవ్రీన్. ‘దిల్లీలో కూడా ఇలాంటి పరిస్థితే కదా’ అని నిట్టూర్చింది. ‘ఇది లోకల్ ప్రాబ్లం కాదు. గ్లోబల్ ప్రాబ్లమ్’ అనుకుంది. వర్తమానం సంగతి ఎలా ఉన్నా పొగచూరిన భవిష్యత్ మసక మసకగా కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాపీరైటర్ ఉద్యోగాన్ని వదులుకొని ‘వారియర్ మామ్స్’కు శ్రీకారం చుట్టింది బవ్రీన్. ‘ వాయుకాలుష్యం అనేది చర్మం, జుట్టు, ఊపిరితిత్తులు, గుండెపై ప్రభావం చూపుతుంది. ఆహార ఉత్పత్తులలోని పోషక విలువలను నాశనం చేస్తుంది. అన్నిరకాలుగా హాని కలిగిస్తుంది’ అంటున్న బవ్రీన్ ‘వారియర్ మామ్స్’ ద్వారా పల్లె నుంచి పట్టణం వరకు ఎన్నోప్రాంతాలు తిరిగింది.క్షేత్రస్థాయిలో వాయుకాలుష్యం గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తనలాగే ఆలోచించే మహిళలు తోడు కావడంతో ‘వారియర్ మామ్స్’కు బలం పెరిగింది. మొదట్లో వాయుకాలుష్యం ప్రమాదాల గురించి ప్రచారం మొదలుపెట్టినప్పుడు ‘ఈ విషయాలు మాకు ఎందుకు’ అన్నట్లుగా ముఖం పెట్టేవారు. ప్రమాద తీవ్రత గురించి తెలుసుకున్న తరువాత మాత్రం వారిలో మార్పు రావడం మొదలైంది.‘మీ పిల్లల భవిష్యత్ గురించి కూడా ఆలోచించండి’ అనే మాట వారిని కదిలించి కార్యక్షేత్రంలోకి తీసుకువచ్చింది. ప్రపంచం ఎలా మారాల్సి వచ్చిందో చెప్పడానికి కోవిడ్ మహమ్మారి పెద్ద ఉదాహరణ. ఈ నేపథ్యంలోనే... ‘మరొక మహమ్మారిని నివారించడానికి మనం ఎందుకు మారకూడదు?’ అని ప్రశ్నిస్తోంది. ‘అభివృద్ధి’ గురించి మాట్లాడినప్పుడు ‘పర్యావరణ హితం’ గురించి కూడా మాట్లాడాలి అంటుంది బవ్రీన్.‘కొన్నిసార్లు దూకుడుగా ముందుకు వెళ్లాలి’ అనేది కొన్ని సందర్భాలలో బవ్రీన్ నోటినుంచే వినిపించే మాట. సమస్య గురించి అధికారుల దృష్టికి తెచ్చినప్పుడు, వారి స్పందనలో అలసత్వం కనిపించినప్పుడు, ‘నా కంపెనీకి మేలు జరిగితే చాలు పర్యావరణం ఏమైపోతే నాకెందుకు!’ అనుకునేవాళ్లను చూసినప్పుడు బవ్రీన్ దూకుడుగా ముందుకు వెళుతుంది, తాను ఆశించిన ఫలితం వచ్చే వరకు మడమ తిప్పకుండా పోరాడుతుంది. ‘మార్పు మన ఇంటి నుంచే మొదలు కావాలి’ అంటున్న బవ్రీన్ మాటలు ఎంతోమందిలో మార్పు తీసుకువచ్చాయి. ‘పదిమందిలో ఏడుగురు వాతావరణ మార్పుల గురించి ఆందోళన చెందుతున్నారు. పదిమందిలో తొమ్మిదిమంది వాతావరణ మార్పులపై తగిన కార్యాచరణ అవసరం అంటున్నారు. కానీ పదిమందిలో నలుగురు మాత్రమే కార్యాచరణలో భాగం అవుతున్నారు’ అంటున్న బవ్రీన్ ఆశ మాత్రం కోల్పోలేదు. ‘వారియర్ మామ్స్’ ద్వారా అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉంది. ‘ఏమీ చేయలేమా?’ అనే ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు వినిపించే జవాబులు రెండు... ‘మనం మాత్రం ఏం చేయగలం!’ ‘కచ్చితంగా మనమే చేయగలం’‘మనం మాత్రమే చేయగలం’ అని దిల్లీకి చెందిన బవ్రీన్ కాంధరీ అనుకోవడం వల్లే‘వారియర్ మామ్స్’ పుట్టుక సాధ్యం అయింది. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా పదమూడు రాష్ట్రాలలో క్షేత్రస్థాయిలో పర్యావరణ హిత ప్రచారాన్ని నిర్వహిస్తోంది బవ్రీన్. కాపీరైటర్ నుంచి ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్‌గా ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకం... -
నేచర్‌లో... కాలుష్యానికి దూరంగా..! ఆరోగ్యానికి దగ్గరగా..!!
ఐటీ జాబ్ అంటే వరుస మీటింగ్‌లు, టార్గెట్లతో బిజీబిజీ.. వీకెండ్ వస్తే తప్ప వ్యక్తిగత జీవితానికీ, కుటుంబానికీ టైం ఇవ్వలేని పరిస్థితి. అలా కాకుండా ఉద్యోగమే పచ్చని చెట్ల కింద, చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం, జీవ వైవిధ్యం మధ్యలో ఉంటే.. ఎంత బాగుంటుందో కదూ! అవును.. అచ్చం అలాంటి వాతావరణాన్నే కోరుకుంటున్నారు నేటి యువ ఐటీ ఉద్యోగులు, ఎంటర్‌ప్రెన్యూర్స్. వీరి అభిరుచికి తగ్గట్టుగానే పలు నిర్మాణ సంస్థలు ‘కలెక్టివ్ ఫామింగ్ గేటెడ్ కమ్యూనిటీ’లకు శ్రీకారం చుట్టాయి. ఈ నయా ట్రెండ్ గురించే ఈ కథనం.. – సాక్షి, సిటీబ్యూరోనగరంలోని గేటెడ్ కమ్యూనిటీలు, హైరైజ్ అపార్ట్ మెంట్లతో జనసాంద్రత పెరిగిపోతుంది. దీంతో రోడ్లు, నీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వసతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. అత్యాధునిక వసతులున్న లగ్జరీ కమ్యూనిటీల్లో నివాసం ఉంటున్నా సరే నాణ్యమైన జీవితం గగనమైపోతోంది. పచ్చని ప్రకతిలో, స్వచ్ఛమైన గాలి పీల్చలేని పరిస్థితి.ప్రస్తుత జనాభా అవసరాలకు వెడల్పాటి రోడ్లు వేసినా.. కొన్నేళ్లకు పెరిగే జనాభా, వాహనాల రద్దీకి అవి ఇరుకుగా మారిపోతున్నాయి. పోనీ, నగరానికి కాస్త దూరంగా విశాలమైన స్థలంలో వీకెండ్ హోమ్ లేదా ఫామ్ హౌస్ సొంతంగా కట్టుకోవాలన్నా, దాన్ని నిరంతరం నిర్వహణ చేయాలన్నా కష్టంతో కూడుకున్న పని. దీనికి పరిష్కారంగా కొందరు డెవలపర్లు ‘కలెక్టివ్ ఫామింగ్ గేటెడ్ కమ్యూనిటీ’ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు.ఇదీ ప్రత్యేకత.. కరోనాతో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకే గదిలో గంటల కొద్దీ కంప్యూటర్ ముందు కూర్చొని పని చేయడం బోర్ కొట్టేసింది. దీంతో ఉద్యోగస్తులకు అనారోగ్య సమస్యలతో పాటు కంపెనీలకు ఉత్పాదకత తగ్గుతోంది. దీంతో ఇప్పుడు నగరంలో వర్క్ ఫ్రం ఫామ్ కల్చర్ హల్చల్ చేస్తోంది. పచ్చని ప్రకృతిలో నివాసం, అక్కడి నుంచే ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా ఆధునిక ఏర్పాట్లు ఉండటమే వీటి ప్రత్యేకత. సాధ్యమైనంత వరకూ పచ్చని చెట్లు, జీవ వైవిధ్యానికి ప్రాధాన్యం ఇస్తూ, కొద్దిపాటి స్థలంలోనే నిర్మాణాలుంటాయి. రోడ్డు కనెక్టివిటీ బాగున్న ప్రాంతాలను ఎంచుకొని కాలుష్యానికి దూరంగా, ఆరోగ్యానికి దగ్గరగా ప్రత్యేక వసతులు ఏర్పాటు చేస్తున్నారు.70 శాతం ఐటీ ఉద్యోగులే..చేవెళ్ల, షాద్‌నగర్, శామీర్‌పేట, శంషాబాద్, ఘట్కేసర్, హయత్‌నగర్ వంటి నగరం నలువైపులా ఈ తరహా ప్రాజెక్టులను చేపడుతున్నారు. వీటిల్లో గృహాలు 600 గజాల నుంచి 1,800 గజాల మధ్య ఉంటాయి. 70 శాతం మంది ఐటీ ఉద్యోగులే ఉంటున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బహుళ జాతి కంపెనీలకు చెందిన ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు కస్టమర్లుగా ఉన్నారు.ఇంటర్నెట్, మీటింగ్ రూమ్‌లు..ప్రత్యేకంగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వ్యవస్థతో హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. ఉద్యోగులకు విద్యుత్ అంతరాయం కలగకుండా జనరేటర్లు, సౌర విద్యుత్ ఏర్పాట్లు కూడా ఉంటాయి. బృంద చర్చల కోసం 10–20 మంది కూర్చునేందుకు వీలుగా కాన్ఫరెన్స్ హాల్, బోర్డ్ రూమ్స్ ఉంటాయి. నేటి యువతరానికి అవసరమైన స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి సదుపాయాలు కూడా ఉంటాయి.రచ్చబండలతో సోషల్ బంధం.. వేప, రావి వంటి చెట్లతో పాటు ఆకు కూరలు, కూరగాయలతో పాటు వ్యవసాయం కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌ల లోపలికి ఓనర్లకైనా సరే వాహనాలకు ప్రవేశం ఉండదు. అత్యవసర వెహికిల్స్‌కు మినహా ప్రధాన ద్వారం వద్దే వాహనాలను పార్కింగ్ చేసి, అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ బగ్గీలో ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. అలా నడుచుకుంటూ వెళ్తుంటూ దారికి ఇరువైపులా కనుచూపుమేర పచ్చని గడ్డితో ల్యాండ్ స్కేపింగ్ ఉంటుంది. చిన్న కొలనులో సందడి చేసే బాతులు, కొంగలు, పిచ్చుకల కిలకిలలు, తుమ్మెదలు, సీతాకోక చిలుకల సందడితో కనువిందుగా ఉంటుంది. పాత తరహాలో ఇంటి పక్కనే రచ్చబండలుంటాయి. దీంతో ఇరుగుపొరుగు వారితో సోషల్ బంధం పెరుగుతుంది.స్థానికులకు ఉపాధి.. వీకెండ్లో మాత్రమే వచ్చే కస్టమర్ల గృహాలను మిగిలిన రోజుల్లో నిర్వహణ అంతా కమ్యూనిటీయే చూసుకుంటుంది. గార్డెనింగ్, వంట వాళ్లు అందరూ స్థానిక గ్రామస్తులనే నియమించుకోవడంతో వారికీ ఉపాధి కల్పించినట్లవుతుంది.– నగేష్ కుమార్, ఎండీ, ఆర్గానోఈ వాతావరణం బాగుంది..ప్రతిరోజూ ట్రాఫిక్ చిక్కుల్లో నరకం అనుభవిస్తూ ఆఫీసుకు వెళ్లే సరికి అలసిపోయినట్లు అయిపోతోంది. దీంతో ఏకాగ్రత తగ్గిపోతోంది. ఈ ప్రాజెక్ట్‌కు వచ్చాక ఆహ్లాదకర వాతావరణంలో పనిచేయడం చాలా బాగుంది. ఉత్పాదకత పెరిగింది.– సీహెచ్ శ్రీనివాస్, ఫార్మా ఉద్యోగిప్రతీది ఇక్కడే అందుబాటులో..శివారు ప్రాంతంలో ప్రాజెక్ట్ అంటే మొదట్లో భయమనిపించినా ఇక్కడికి వచ్చాకే తెలిసింది ప్రతి ఒక్కటీ ఇక్కడే అందుబాటులో ఉంది. సేంద్రీయ ఆహార ఉత్పత్తులతో నిత్యావసరాలు, మినీ థియేటర్ వంటి అన్ని రకాల సదుపాయాలున్నాయి. పైగా స్వచ్ఛమైన గాలి, వెలుతురు, చుట్టూ పచ్చని ప్రకృతితో ఎంతో ఆనందంగా ఉంది.– చిందె స్వాతి, గృహిణి -
Akanksha: ఇన్నోవేషన్.. పర్యావరణ హితం!
తండ్రి సైన్యంలో పనిచేస్తుండడంతో ఆకాంక్ష ప్రియదర్శిని బాల్యం దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో గడిచింది. పచ్చదనం అంటే చెప్పలేనంత ఇష్టం. రూర్కెలాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చేసిన ఆకాంక్షకు కాలుష్య సమస్య గురించి ఆందోళనగా ఉండేది.వాయు కాలుష్య ప్రభావంతో తన బంధువులు, కాలేజి స్నేహితులలో కొందరికి శ్వాసకోశ సమస్యలు రావడం ఆమెను కలవరపరిచింది. వాయు కాలుష్యంకు సంబంధించి ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొనాలనే లక్ష్యంతో క్లైమెట్ టెక్ స్టార్టప్ ‘ఆరాసుర్’ప్రారంభించింది. ఒడిషాలోని భువనేశ్వర్ కేంద్రంగా ఎన్విరాన్మెంటల్ కన్సల్టెంట్ ‘ఆరాసుర్’ ప్రయాణం మొదలైంది.వైర్లెస్, సెన్సర్ ఆధారిత సాంకేతిక సహాయంతో ప్రభుత్వం, ప్రజలకు మధ్య ఉన్న సమాచార అంతరాన్ని తగ్గించడానికి కంపెనీ చురుగ్గా పనిచేస్తోంది. హైపర్–లోకల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ అభివృద్ధి చేసింది. డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించిన సందేహాలకు సమాధానం చెప్పడానికి మా హార్డ్‌వేర్ పరికరాల నుంచి సేకరించిన డేటా ఉపయోగపడుతుంది.ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి, రెవెన్యూ ఎలా జెనరేట్ చేయాలి....అనే విషయాలకంటే పర్యావరణ విషయాలకేప్రాధాన్యత ఇచ్చాం’ అంటుంది ఆకాంక్ష. హార్డ్‌వేర్ డిజైనింగ్, సప్లైచైన్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్, ఇన్స్టాలేషన్... మొదలైన వాటిలో ప్రావీణ్యం సాధించిన ఆకాంక్ష ‘మల్టీటాలెంటెడ్’గా గుర్తింపు పొందింది.ఇవి చదవండి: Arpan Kumar Chandel: తొలి ఆల్బమ్‌తోనే.. రాగాల రారాజుగా.. -
వాతావరణ యాంగ్జైటీ అంటే ఏంటి..? ఎదుర్కోవడం ఎలా..?
పచ్చని చెట్లు కొట్టేస్తూంటే మీకు గుబులుగా ఉంటోందా? ఊరి చెరువు నెర్రలుబారితే అయ్యో ఇలా అయ్యిందేమిటి? అన్న ఆందోళన మొదలవుతుందా? ఉష్ణోగ్రత ఒక్క డిగ్రీ పెరిగినా..‘‘అంతా అయిపోయింది’’ అన్న ఫీలింగ్ మీకు కలుగుతోందా? అయితే సందేహం లేదు.. మీరు కూడా ఎకో యాంగ్జైటీ బారిన పడ్డట్టే అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. ఏంటీ ఎకో యాంగ్జైటీ? మానసిక రోగమా? చికిత్స ఉందా? లేదా? ఎలా ఎదుర్కోవాలి? ఈ రోజు జూన్ ఐదవ తేదీ. ప్రపంచం మొత్తమ్మీద పర్యావరణ దినంగా ఉత్సవాలు జరుగుతాయి. మారిపోతున్న పర్యావరణం తీసుకొచ్చే ముప్పుల గురించి చర్చలు, అవగాహన శిబిరాలూ నిర్వహిస్తారు. అయితే ఇటీవలి కాలంలో పర్యావరణ మార్పుల చర్చల్లో ఎకో యాంగ్జైటీ కూడా ఒక టాపిక్‌గా మారిపోయింది. వాతావరణంలో వస్తున్న మార్పుల మీలో ఆందోళన, ఒత్తిడి కలిగిస్తూంటే దాన్ని ఎకో యాంగ్జైటీ అని పిలుస్తున్నారు. కొన్నిసార్లు మనం దాన్ని గుర్తించలేకపోవచ్చు. గానీ ఆ ప్రభావం మనం మీద ఎక్కువగానే ఉంటుంది. దీని కారణంగా మన మూడ్స్ మారిపోవడం జరిగి ఒక దానిపై ఏకాగ్రత పెట్టలేని స్థితికి చేరుకుంటాం. ముఖ్యంగా వరదలు, అడవి మంటలు, భూకంపాలు, అపూర్వమైన వేసవి, చలికాలం, హిమనీనదాలు కరగడం, గ్లోబల్ వార్మంగ్ తదితరాలన్నీ మానవులను ఆందోళనకు గురి చేసేవేననిశారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేవేనని నిపుణులు చెబుతున్నారు. పెనుముప్పు... మారుతున్న వాతావరణం కలిగించే ఆందోళన ప్రపంచానికి పెనుముప్పు అని అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ స్వయంగా చెబుతోందంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. చాలాసార్లు దీన్ని వైద్య పరీక్షల ద్వారా గుర్తించలేమని అంచనా. అయితే తట్టుకునేందుకు, సమస్య నుంచి బయటపడేందుకు చాలా మార్గాలు ఉన్నాయని వీరు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించుకునేలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. అందుకోసం శాస్త్రీయంగా చేయాల్సిన పనులపై దృష్టిసారించడం, తీసుకోవాల్సిన చర్యలు, పరిష్కారాలను అమలు చేయడం వంటివి చేయాలి. కార్బన్ ఉద్గారాలను తగ్గించేలా పర్యావరణ అనుకూలమైన జీవనశైలి మార్పులను చేసుకోవడం వాతావరణ పరిక్షణకు అనుకూలంగా ఉన్న విధానాలకు మద్దతు ఇవ్వడం లేదా స్థానిక పర్యావరణ కార్యక్రమాల్లో పాల్గొనడం. మైండ్‌ఫుల్‌నెస్, రిలాక్సేషన్‌ను ప్రాక్టీస్ చేయడం. మనసు ప్రశాంతంగా ఉంచేలా ధ్యానం, శ్వాస లేదా ప్రకృతిలో గడపడం వంటి వాటితో ఈ పర్యావరణ ఆందోళనను తగ్గించుకోవచ్చు ఈ వాతావరణ మార్పులను తట్టుకునేలా ఇతరులతో కనెక్ట్ అవ్వడం. ఆన్లైన్ కమ్యూనిటీలు లేదా స్థానిక సంస్థల్లో చేరడం వంటివి చేయండి. వాతావరణ సంక్షోభంపై అవగాహన కలిగి ఉండటం తోపాటు సవాళ్లును ఎదుర్కొనేలా సిద్ధం కావాలి. అలాగే పురోగతిని, వాతావరణ మార్పులు పరిష్కరించడానికి సమిష్టి ప్రయత్నాలు చేయాలి. (చదవండి: పర్యావరణహితం యువతరం సంతకం) -
ప్రకృతి హితం.. మన అభిమతం
సాక్షి, అమరావతి: భావితరాలకు స్వచ్ఛమైన భూమి, గాలి, నీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు చేపట్టే పర్యావరణ హిత కార్యక్రమాల్లోను భాగమవుతోంది. పర్యావరణ హితం.. తమ అభిమతం.. అని చాటుతోంది. ‘పుడమి సేవలో పరిశ్రమిస్తూ.. కాలుష్యాన్ని ప్రతిఘటిస్తూ.. పచ్చదనం పెంచుకుంటే.. ప్రకృతిని కాపాడుకుంటే.. మనిషికి అదే మనుగడ.. జీవకోటికదే తోడూ.. నీడ’ అంటూ ఈ ప్రయత్నంలో ‘భాగస్వామ్యం కండి’ అనే నినాదాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ మే 22న అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం నిర్వహిస్తున్నారు. సకల జీవులకు నిలయమైన ఈ భూమిని రక్షించే ఉమ్మడి కార్యాచరణలో మన దేశంతోపాటు మన రాష్ట్రం సైతం పాలుపంచుకుంటోంది. ఈ పవిత్రయజ్ఞంలో భాగంగా 2028నాటికి పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం వ్యక్తిగత, సామూహిక చర్యలు తీసుకోవడానికి కనీసం ఒక బిలియన్ మంది భారతీయులు, ఇతర ప్రపంచ పౌరులను సమీకరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘మిషన్ లైఫ్’ ప్రాజెక్టులో ఏపీ భాగమవుతోంది. దీనిద్వారా రానున్న నాలుగేళ్లలో 80శాతం గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలను పర్యావరణ అనుకూలమైనవిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బృహత్తర యజ్ఞానికి విశాఖపట్నం నుంచి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. జీవుల మనుగడకు అనుకూల చర్యలు ప్రకృతిలో ప్రతి ప్రాణి స్వేచ్ఛగా జీవించేందుకు అనువైన వాతావరణం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూమి, పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా క్లైమేట్ చేంజ్ సెల్(ఈఈఈ)ను రూపొందించింది. ఈ సెల్ వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళికతో సమానంగా పర్యావరణ వ్యవస్థ ఆధారిత అప్రోచ్(ఈబీఏ) ద్వారా రాష్ట్రంలో వాతావరణ మార్పుల సమస్యలను పరిష్కరిస్తుంది.ఇందులో ఆయా రంగాల నిపుణులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు, అర్బన్ డెవలప్మెంట్, రవాణా శాఖలతోపాటు పలు ప్రభుత్వ రంగ సంస్థలకు భాగస్వామ్యం కల్పించింది. భూమి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం కోసం మిషన్ లైఫ్ ఎనర్జీ కన్జర్వేషన్, వాటర్ కన్జర్వేషన్, సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్, అడాప్షన్ ఆఫ్ సస్టెయినబుల్ ఫుడ్ సిస్టమ్స్, వేస్ట్ రిడక్షన్, హెల్తీ లైఫ్ స్టైల్స్, ఈ–వేస్ట్ తగ్గింపు అనే ఏడు విభాగాల్లో 75 కార్యక్రమాలను మన రాష్ట్రంలో అమలుచేస్తున్నారు. అదేవిధంగా కాలుష్యాన్ని తగ్గించడం కోసం స్థానికంగా లైఫ్ గ్రూపులను ఏర్పాటుచేశారు. సైకిల్ ర్యాలీలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లపై స్పెషల్ డ్రైవ్‌లు, సోషల్ మీడియాలో ప్రచారం, కమ్యూనిటీ వర్క్‌షాపులు, సెమినార్లు, క్విజ్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నారు. కాలుష్య కారక వాహనాలను అరికట్టడం కోసం ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్‌లను చేపడుతున్నారు. పాఠశాలల్లో ఎనర్జీ క్లబ్‌ల ఏర్పాటు ద్వారా భూమి పరిరక్షణ ఆవశ్యకతపై చైతన్యం తీసుకువస్తున్నారు. విశాఖలో లైఫ్ మిషన్ అమలుపర్యావరణ హిత జీవనశైలిని అనుసరించేలా ప్రజలను ప్రోత్సహించడమే లక్ష్యంగా మొదలైన లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ పథకం అమలుకు రాష్ట్రంలోని సముద్ర తీరప్రాంతంలో ఉన్న విశాఖ నగరం అనుకూలమని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) గుర్తించింది. దేశవ్యాప్తంగా 2028 నాటికి 5.15 లక్షల గ్రామాలు, 3,700 పట్టణ స్థానిక సంస్థల్లోని కోటి మంది ప్రజలను ‘ప్రో ప్లానెట్ పీపుల్’గా మార్చాలనేది లైఫ్ మిషన్ లక్ష్యం. పుడమి, జీవ పరిరక్షణ కోసం చేపట్టిన ఈ పథకాన్ని విశాఖలో అమలు చేయనున్నట్లు బీఈఈ ఇటీవల ప్రకటించింది. విశాఖతోపాటు విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి నగరాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు బీఈఈ వెల్లడించింది. లైఫ్ మిషన్ అమలుకు బీఈఈ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దశలవారీ కార్యాచరణ రూపొందిస్తోంది. -
ఉత్తరాఖండ్ నిర్లక్ష్యం
నిర్లక్ష్యం మంటల్లో నిత్యం దహించుకుపోతున్న ఉత్తరాఖండ్ అడవులపై సర్వోన్నత న్యాయస్థానం దృష్టిసారించటం, సంజాయిషీ కోరడం హర్షించదగిన పరిణామం. ఈ మంటల్లో చిక్కుకుని ఇంతవరకూ అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇతర జీవరాశులకు కలిగిన నష్టమెంతో తెలియదు. హిమాలయ సానువుల్లో కొలువుదీరి పర్యావరణ పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న ఈ అడవులపై అధికార యంత్రాంగం ప్రదర్శిస్తున్న అంతులేని నిర్లక్ష్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. వాతావరణపరంగా ఉత్తరాఖండ్‌లో, పొరుగునున్న హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఈ రెండుచోట్లా శీతాకాలంలో భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన గాలులు వీస్తాయి. అంతకుముందు విపరీతంగా మంచుకురుస్తుంది. దేవదారు వృక్షాలనుంచి రాలిపడిన ఆకులతో కొండ ప్రాంతాలన్నీ నిండిపోతాయి. ఈ ఆకులు మామూలుగా అయితే చిన్న నిప్పురవ్వ తగిలినా భగ్గునమండుతాయి. కానీ ఆ సమయంలో పడే వర్షాలతో అటవీప్రాంతమంతా చిత్తడిగా మారిపోతుంది. వేసవిలో కూడా ఇదే స్థితి కొనసాగుతుంది. అయితే వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఇదంతా తారుమారైంది. నవంబర్ నుంచే అడవుల్లో అగ్నికీలలు కనబడ్డాయి. ఈ పరిణామాన్ని అంచనా వేయటం పెద్ద కష్టం కాదు. కొండ ప్రాంతమంతా రాలిన ఆకులతో నిండినప్పుడు, ఎండలు మండుతున్నప్పుడు ఏం జరుగుతుందో గత అనుభవాలే చెబుతున్నాయి. దీనికితోడు పొగరాయుళ్లు నిర్లక్ష్యంగా పడేసే చుట్ట, బీడీ, సిగరెట్ వంటివి కూడా ప్రమాదాలు తెస్తున్నాయి. మాఫియాల బెడద సరేసరి. అటవీ భూములు అందుబాటులోకొస్తే కోట్లు గడించవచ్చని ఉద్దేశపూర్వకంగా అడవుల్ని తగలబెడుతుంటారు. వీరికి రాజకీయ నాయకుల అండదండలు కూడా ఉంటాయి. ఇక కొండప్రాంతాలకు సమీపంలో పంట వ్యర్థాలను కళ్లాల్లోనే తగలబెట్టే అలవాటు అధికం. ఇది కూడా అడవులు అంటుకోవటానికి కారణమవుతోంది. ఇలాంటివారినుంచి అడవుల్ని కాపాడటానికీ, నిప్పు జాడ కనుక్కుని వెనువెంటనే ఆర్పడానికీ కొండలపై గార్డులు గస్తీ కాస్తుంటారు. కానీ వారంతా ఎన్నికల విధులు నిర్వర్తించటానికి తరలిపోయారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన దాఖలా లేదు. అందువల్లే ఈ దఫా ఇంతవరకూ 1,400 హెక్టార్ల అడవి తగలబడిందని ఒక అంచనా. గత నెలనుంచి చూసుకున్నా అడవులు అంటుకున్న ఉదంతాలు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్లతో పోలిస్తే ఉత్తరాఖండ్‌లోనే అధికమని ఈమధ్య ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఐ) డేటా తెలిపింది. ఉత్తరాఖండ్‌లో దాదాపు 24,305 చదరపు కిలోమీటర్లమేర అడవులున్నాయి. రాష్ట్ర భౌగోళిక ప్రాంతంలో ఇది 44.5 శాతం. ఇంత విస్తారంగా అడవులున్న రాష్ట్రం వాటిని ప్రాణప్రదంగా చూసుకోవద్దా? కొండలపై రాలిపడే ఆకుల్ని ఏరేందుకూ, తామరతంపరగా పెరిగే గడ్డి మొక్కల్ని తొలగించటానికీ, అగ్ని ప్రమాదాల నివారణకూ మనుషుల్ని నియమించాలి. ఇందుకోసం ఏటా దాదాపు రూ. 9 కోట్లు ఖర్చవుతుందని అంచనా. కానీ చిత్రమేమంటే ప్రభుత్వం కేవలం రూ. 3.15 కోట్లు మంజూరు చేసి చేతులు దులుపుకుంది. మంటల జాడ లేకుండా చూడాలే తప్ప, ఒకసారి అంటుకుంటే అదుపు చేయటం అంత సులభం కాదు. ఈ నెల మొదట్లో అడవులు తగలబడుతున్నప్పుడు వైమానిక దళ హెలికాప్టర్లు రంగంలోకి దిగి వేలాది లీటర్ల నీటిని వెదజల్లాయి.ఈ చర్య కొంతమేర ఉపయోగపడినా అనుకోకుండా కురిసిన భారీ వర్షంతో పరిస్థితి అదుపులోకొచ్చింది. ఇలా ప్రతిసారీ జరుగుతుందని ఆశిస్తూ కూర్చుంటే అంతా తలకిందులవుతుంది. తమకున్న అడవుల్లో కేవలం 0.1 శాతం ప్రాంతంలో మాత్రమే మంటల బెడద ఉన్నదని ఉత్తరాఖండ్ దాఖలుచేసిన అఫిడవిట్ తెలిపింది. ఎంత శాతమని కాక, ఏమేరకు ముందస్తు ప్రణాళికలు అమలు చేస్తున్నామో, వాటి లోటుపాట్లేమిటో అధ్యయనం చేస్తున్న దాఖలా లేదు. ఎంత ప్రాంతంలో వృక్షాలు దెబ్బతిన్నాయో లెక్కలు చెబుతున్నారు. కానీ పర్యావరణానికి కలిగే నష్టం ఎవరూ గమనించటం లేదు. అగ్ని ప్రమాదాలవల్ల వాతావరణంలో కార్బన్‌డై ఆక్సైడ్ పరిమాణం పెరుగుతుంది. నేలల్లో తేమ తగ్గిపోతుంది. పోషకాలు కూడా కనుమరుగవుతాయి. వీటికి సంబంధించిన డేటా ప్రభుత్వం దగ్గర ఉందో లేదో తెలియదు. నిజానికి ఇలాంటి డేటాతో స్థానిక ప్రజల్లో చైతన్యం తీసుకొస్తే, అడవులు తగలబడటంవల్ల భవిష్యత్తులో ఎన్ని చిక్కులు ఏర్పడే అవకాశమున్నదో చెబితే వారే స్వచ్ఛంద సైనికుల్లా ముందుకొస్తారు. అడవులను కాపాడతారు. మాఫియాలను కట్టడి చేసేందుకు సైతం సంసిద్ధులవుతారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఆ రకమైన చొరవేది?ఉత్తరాఖండ్ అడవులు విశిష్ఠమైనవి. అక్కడ రెండు టైగర్ రిజర్వ్‌లున్నాయి. పక్షుల సంరక్షణ కేంద్రాలున్నాయి. ఇక్కడి గాలులు మోసుకెళ్లే ఆక్సిజన్ కారణంగానే కాలుష్యం కోరల్లో చిక్కుకున్న ఢిల్లీ నగరం ఆ మాత్రమైనా ఊపిరి పీల్చుకోగలుగుతోంది. ఇక్కడి వృక్షాలవల్ల హిమాలయాల్లోని మంచుపర్వతాలు ఒక క్రమపద్ధతిలో కరిగి జీవనదులు పారుతున్నాయి. ఇంతటి అపురూపమైన అడవులు మానవ నిర్లక్ష్యం కారణంగా నాశనం కావటం అత్యంత విషాదకరం.ఎంత ప్రాంతమని కాదు...అడవిలోని ఒక్క వృక్షమైనా మన నిర్లక్ష్యంవల్ల, తప్పిదాలవల్ల నేలకొరగరాదన్న దృఢ సంకల్పాన్ని ప్రదర్శిస్తే, దానికి అనుగుణమైన చర్యలు తీసుకుంటే అడవులు కళకళలాడతాయి. మనుషులు మాత్రమే కాదు...సకల జీవరాశులూ సురక్షితంగా ఉంటాయి. సర్వోన్నత న్యాయస్థానం జోక్యంవల్ల ఇదంతా నెరవేరితే అంతకన్నా కావాల్సిందేముంది? -
ముత్తు నందిని ప్యాలెస్ ఇష్టాల ఇల్లు
రాజ్ చందర్ పద్మనాభన్, నాగ జయలక్ష్మి దంపతులు తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారిలో నివసించేవారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునే క్రమంలో వీరు అనుసరించిన విధానం ఇప్పుడు దేశమంతటినీ ఆకర్షిస్తోంది. పర్యావరణ ప్రేమికులనైతే మరీ ఎక్కువగా ఆకట్టుకుంటోంది. రెండేళ్ల కిందట గృహప్రవేశం చేసుకున్న కొత్త ఇల్లది. అయితే ఆ ఇంట్లో అడుగుపెడితే కాలం గిర్రున సినిమా రీల్‌లాగ వందేళ్ల వెనక్కి తిరిగిపోయిందా అనిపిస్తుంది. ఇంటిని చూడడానికి వచ్చిన వాళ్లను అతిథి మర్యాదలతో ముంచెత్తుతారు ఈ దంపతులు. సేంద్రియ పద్ధతిలో పండించిన దినుసులు, కాయగూరలతో సంప్రదాయ తమిళ, చెట్టినాడు వంటలను వడ్డిస్తారు. ఎర్రమట్టి, సున్నపు రాయితో నిర్మించిన ఇంట్లో భూగర్భ జలాలను పరిరక్షించే ఏర్పాటు ఉంది. బంకమట్టి నిర్మాణం కావడంతో ఎండాకాలం చల్లగా ఉంటుంది. నేచర్ ఫ్రెండ్లీ ట్రావెల్‌ను ఇష్టపడే వాళ్లు ఇక్కడ బస చేస్తుంటారు. బస చేయకపోయినా చూసి పోవడానికి వచ్చేవాళ్లు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ కాలంలో ఇంటిని ఇలా ఎందుకు కట్టుకున్నారనే ప్రశ్న దాదాపుగా ప్రతి ఒక్కరి నుంచి ఎదురవుతుంటుంది. జయలక్ష్మి ప్రతి ఒక్కరికీ పూసగుచ్చినట్లు వివరిస్తుంటుంది. బాల్యంలోకి వెళ్లారాయన! ‘‘రాజ్‌చందర్ వృత్తిరీత్యా జియో డాటా అనలిస్ట్. ఆయనకు ఇష్టమైన రోజులంటే చిన్నప్పుడు వాళ్ల అమ్మమ్మ గారింట్లో గడిపిన బాల్యమే. పైగా రాజ్ అభిరుచి, విధి నిర్వహణ కూడా పర్యావరణవేత్తలతో కలిసి పని చేయడమే. ఈ రెండు ఇష్టాలను కలుపుతూ చక్కటి ఇల్లు కట్టుకోవాలని ఎప్పుడూ చెప్పేవారు. నాక్కూడా మా సంప్రదాయ నిర్మాణంలో ఉండే సౌందర్యం చాలా ఇష్టం. ఇద్దరి అభిరుచులూ కలవడంతో ఇంటిని ఇలా కట్టుకున్నాం. మా ఇద్దరి ఇష్టాల మేరకు ఎలా కట్టుకోవాలో ఒక ఐడియా వచ్చేసింది. ఎక్కడ కట్టాలనే విషయంలో ఒక అభిప్రాయానికి రావడం కొంచెం కష్టమే అయింది. లొకేషన్ సెర్చింగ్ మొదలు పెట్టాం. సంజీవని శకలం కన్యాకుమారికి సమీపంలో పోథయాడి గ్రామాన్ని చూసినప్పుడు కొండలు, పచ్చటి చెట్లతో ప్రదేశం బాగుందనిపించింది. ఆశ్చర్యంగా మరో విషయం తెలిసింది. అదేంటంటే... రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు వైద్యం కోసం హనుమంతుడు ఏకంగా సంజీవని మొక్క ఉన్న పర్వతం అంతటినీ ఎత్తుకొచ్చాడని విన్నాం. వైద్యం చేసిన తర్వాత ఆ పర్వతాన్ని తిరిగి తీసుకెళ్లే క్రమంలో పర్వతంలోని ఒక శకలం విరిగి కింద పడి పోయిందని, ఆ శకలమే ఈ కొండ అని చె΄్పారు స్థానికులు. వాళ్ల విశ్వాసాన్ని పక్కన పెడితే ఆ కొండమీద చుట్టు పక్కల ఉన్న మొక్కలన్నీ ఔషధ మొక్కలే. ప్రకృతితో మమేకమై నివసించడానికి మాకు ఇంతకంటే సౌకర్యవంతమైన ప్రదేశం మరోటి ఉండదేమో అనిపించింది. అంతే... 2021లో నిర్మాణం మొదలు పెట్టాం. ఒక ఏడాదిలో తమిళ, వేనాడు, చెట్టినాడు సంస్కృతుల సమ్మేళనమైన మా ఇంటి నిర్మాణం పూర్తయింది. సంప్రదాయ కళాకృతుల సేకరణ నా హాబీ. ఇంటిని తమిళ సంప్రదాయ సంస్కృతికి ప్రతీకగా మలిచాను. ఇంటి ముఖద్వారం నుంచి నేల, గోడ, మెట్లు, పై కప్పు, అలంకరణ వస్తువులు ప్రతి ఒక్కటీ తమ వైభవాన్ని తామే చెప్పుకుంటాయి. పర్యావరణ హితమైన సున్నపు పోడి ఇటుకలు, ఎర్ర మట్టి, ఆవుపేడ, ధాన్యం పోట్టు, కోడిగుడ్లు, బెల్లంతోపాటు అత్తంగుడి నది తీరాన దొరికే ఇసుకతో తయారు చేసే అత్తంగుడి టైల్స్‌ను వాడాం. పై కప్పుకి కాంక్రీట్ వాడకాన్ని తగ్గించి ఫిల్లర్ స్లాబ్ టెక్నిక్ ఉపయోగించాం. వర్షపు నీటిని నిల్వ చేయడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్, కరెంటుకోసం సోలార్ ప్యానెల్స్ పెట్టాం. ఈ మట్టి సౌధంలో 5బెడ్ రూమ్‌లు, మూడు బాల్కనీలు, మూడు లివింగ్ స్పేస్‌లు ఉన్నాయి. ఇప్పటివరకు రెండు వందల మందికి పైగా పర్యాటకులు ఈ హోమ్ స్టేలో బస చేశారు. ఆహారం కూడా తమిళనాటప్రాంంతాల వారీగా విలసిల్లిన విభిన్నమైన రుచులుంటాయి. ఇంటి ఆవరణలో అన్ని రకాల కూరగాయలనూ పండిస్తాం. వంటగదిలో వచ్చే వ్యర్థాలనే ఎరువుగా వేస్తాం’’ అని తమ పర్యావరణ హిత భవనం ముత్తు నందిని ప్యాలెస్ గురించి వివరించింది జయలక్ష్మి. -
ఏక్యూఐ ఉమెన్ అంబాసిడర్
సరోజ్ బెన్, జరీనా, ముంతాజ్‌లాంటి సామాన్య మహిళలు తమలాంటి సామాన్యుల కోసం వాయు కాలుష్యంపై దిల్లీ గల్లీలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోర్టబుల్ ఏక్యూఐ(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) మానిటర్లతో ‘వాయు కాలుష్య నివారణకు మన వంతుగా చేయాల్సింది’ అనే అంశంపై ప్రచారం చేస్తున్నారు... దిల్లీలోని నందనగిరి ప్రాంతం. చేతిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) మానిటర్‌తో 39 సంవత్సరాల సరోజ్ బెన్ ఇద్దరు ముగ్గురు మహిళలతో మాట్లాడుతున్నప్పుడు ‘విషయం ఏమిటీ?’ అని అడుగుతూ మరో ఇద్దరు మహిళలు, ఆ తరువాత మరో ముగ్గురు మహిళలు వచ్చారు. అడిగిన వారికల్లా ఓపిగ్గా చెబుతోంది సరోజ్. ‘మీ ఏరియాలో వాయుకాలుష్యం ప్రమాదకరమైన స్థాయిలో ఉంది...’ అంటూ ప్రారంభించి ఆ సమస్య తలెత్తడానికి కారణాలు, దీని ప్రభావం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, నివారణ చర్యలు... మొదలైన వాటి గురించి చెబుతూ పోయింది. ‘మీరు గవర్నమెంట్ ఆఫీసరా?’ అని ఎవరో అడిగారు. ‘కాదమ్మా, నేనూ నీలాగే గృహిణిని. పెరుగుతున్న వాయుకాలుష్యం గురించి బాధపడి, కాలుష్య నివారణకు నా వంతుగా ఏదైనా చేయాలని ఇలా వీధులు తిరుగుతున్నాను’ అని చెప్పింది సరోజ్. సరోజ్ బెన్ మాత్రమే కాదు గ్రాస్‌రూట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ‘మహిళా హౌజింగ్ ట్రస్ట్’ కమ్యూనిటీ మూమెంట్ ‘హెల్ప్ దిల్లీ బ్రీత్’ ప్రభావంతో ఎంతోమంది సామాన్య మహిళలు వాయు కాలుష్యంపై అవగాహన చేసుకున్నారు. తమలాంటి వారికి అవగాహన కలిగించడానికి వాడ వాడా తిరుగుతున్నారు. కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, సాధారణ పౌరుల్లో వాయు కాలుష్యంపై అవగాహన కలిగించడానికి మహిళా హౌజింగ్ ట్రస్ట్, హెల్ప్ దిల్లీ బ్రీత్ సంస్థలు సామాన్య మహిళలకు శిక్షణ ఇస్తున్నాయి. పోర్టబుల్ ఏక్యూఐ మానిటర్లతో దిల్లీలోని గల్లీలు తిరుగుతూ వాయుకాలుష్య నివారణపై ప్రచారం నిర్వహిస్తున్న ఈ మహిళలు ‘ఏక్యూఐ ఉమెన్ అంబాసిడర్’లుగా గుర్తింపు పొందారు. ఏక్యూఐ అంబాసిడర్లు హెల్ప్ దిల్లీ బ్రీత్, మహిళా హౌజింగ్ ట్రస్ట్ నిర్వహించే సమావేశాలకు హాజరు కావడమే కాదు ప్రచార వ్యూహాల గురించి కూడా ఒకరితో ఒకరు చర్చించుకుంటారు. ‘కమ్యూనిటీ యాక్షన్ గ్రూప్’గా ఏర్పడి సమాచారాన్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటారు. ‘వాయు కాలుష్యం గురించి కొద్దిసేపు మీతో మాట్లాడాలనుకుంటున్నాను అని ఒక గృహిణితో అన్నప్పుడు నా ముఖం మీద తలుపు వేసినంత పనిచేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్నాను. ఈసారి అలా కాదు ఇలా చేయాలనుకున్నాను. దిల్లీలోని నెహ్రూ నగర్‌కు వెళ్లినప్పుడు నా బ్యాగులో ఉన్న కొన్ని పోస్టర్లను ఆమెకు చూపాను. అవి చూసి అయ్యో ఏమిటి ఇది అన్నట్లుగా అడిగింది. అలా మెల్లగా టాపిక్‌ను మొదలుపెట్టాను. ఆమె చాలా శ్రద్ధగా విన్నది. పరిస్థితులను బట్టి ఏ రూట్లో వెళ్లాలో అప్పటికప్పుడు నిర్ణయించుకుంటే సమస్య ఉండదు’ అంటుంది సీమ అనే ఏక్యూఐ అంబాసిడర్. ‘ఉపన్యాసం ఇచ్చినట్లు కాకుండా మన ఇంటి పరిసరాల్లో ప్రమాదం పొంచి ఉంటే ఎలా చెబుతామో అలా వాయు కాలుష్యం గురించి చెబుతాను. ఉదాహరణలతో అర్థమయ్యేలా చెబుతాను. పెద్దవాళ్లకే సాధ్యం కాని పెద్ద సమస్య ఇది. మన వల్ల ఏమవుతుంది... అని కొందరు అంటారు. మీలా అందరూ అనుకోవడం వల్లే అది పెద్ద సమస్యగా మారింది అని నేను అంటాను. మొదటగా మీరు చేయాల్సింది మీ పెరట్లో ఒక మొక్క నాటడం అని సలహా ఇస్తాను. నేను చెప్పింది వారికి నచ్చినట్లు వారి హావభావాలను బట్టి గ్రహిస్తాను’ అంటుంది ఏక్యూఐ అంబాసిడర్ ముంతాజ్. ఏక్యూఐ అంబాసిడర్ల కృషి వృథా పోవడం లేదు. ఇప్పుడు ఎంతో మంది కాలుష్యాన్ని నియంత్రించే చర్యల గురించి నిర్మాణాత్మకంగా మాట్లాడుతున్నారు. వారు పెద్ద చదువులు చదుకున్నవారేమీ కాదు. సామాన్య మహిళలు. ఏక్యూఐ అంబాసిడర్ల విజయానికి ఇది ఒక ఉదాహరణ. మార్పు మొదలైంది... జరీనా ప్రతిరోజూ ఏక్యూఐ మానిటర్‌తో ఉదయం, సాయంత్రం వివిధ ప్రాంతాలలో పొల్యూషన్ లెవెల్స్‌ను చెక్ చేస్తుంది. ‘కొన్నిసార్లు కాలుష్యం తక్కువగా, మరికొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంది. కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు ఏక్యూఐ మానిటర్‌పై ఎరుపు రంగు కనిపిస్తుంది. కొత్త సంఖ్యలు కనిపిస్తాయి. ఒకప్పుడు వాయుకాలుష్యం గురించి పెద్దగా ఆలోచించేవారు కాదు. అయితే ఇప్పుడు చాలామందిలో మార్పు రావడాన్ని గమనించాను’ అంటుంది జరీనా.ఏక్యూఐ అంబాసిడర్ అయిన జరీనా వాయునాణ్యత, వెంటిలేషన్, బొగ్గు పొయ్యిలకు దూరంగా ఉండడం... మొదలైన అంశాలపై దిల్లీ గల్లీలలో విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. ఇలా కూడా... వాడ వాడలా తిరుగుతూ వాయుకాలుష్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాదు లేబర్ కార్డు, ఆయుష్మాన్ భారత్ కార్డు, పీఎం సురక్షిత్ మాతృత్వ అభియాన్, సుమన్ యోజనలాంటి ప్రభుత్వ సామాజిక, సంక్షేమ పథకాల గురించి భనన నిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు తెలియజేస్తున్నారు ఏక్యూఐ అంబాసిడర్లు. స్కీమ్‌కు సంబంధించిన పత్రాలు నింపడం నుంచి ఐడీ కార్డ్‌లు వారికి అందేలా చేయడం వరకు ఎన్నో రకాలుగా సహాయం అందిస్తున్నారు. -
Interim Budget 2024: బయో–ఫౌండ్రీకి స్కీము
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల చర్యల్లో భాగంగా త్వరలో బయో–తయారీ, బయో–ఫౌండ్రీ కోసం కొత్తగా స్కీమును ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బయో–ఫార్మా, బయో–ప్లాస్టిక్స్, బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ మొదలైన వాటికి ఇది ఊతమివ్వనుంది. ప్రపంచ ఎకానమీని మార్చేయగలిగే సత్తా ఈ స్కీముకు ఉంటుందని కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. 2047 నాటికి వికసిత భారత్‌ను సాకారం చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యానికి ఇది తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. 2014లో కేవలం 10 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ బయో ఆర్థిక వ్యవస్థ గడిచిన ఎనిమిది, తొమ్మిదేళ్లలో 140 బిలియన్ డాలర్లకు చేరిందని సింగ్ చెప్పారు. -
Year End 2023: అన్నీ మంచి శకునములే!
ఓజోన్ పొరకు గండి పూడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం బాగా పెరుగుతోంది. పర్యావరణపరంగా వరుస దుర్వార్తల పరంపర నడుమ ఇలాంటి పలు సానుకూల పరిణామాలకు కూడా 2023 వేదికవడం విశేషం! బ్రెజిల్లో అమెజాన్ అడవుల క్షీణత బాగా తగ్గుముఖం పట్టడం మొదలు ఇటీవలి కాప్28 సదస్సులో కీలక పర్యావరణ తీర్మానం దాకా ముఖ్యమైన ఇలాంటి ఓ ఐదు పరిణామాలను గమనిస్తే... సంప్రదాయేతర ఇంధనోత్పత్తి పైపైకి... శిలాజ ఇంధనాలకు వీలైనంత త్వరగా స్వస్తి పలికితేనే గ్లోబల్ వారి్మంగ్ భూతాన్ని రూపుమాపడం సాధ్యమని పర్యావరణవేత్తలంతా ఎప్పటినుంచో చెబుతున్నదే. సౌర విద్యుత్ వంటి సంప్రదాయేతర ఇంధన వనరులకు మళ్లడం ఇందుకున్న మార్గాల్లో ముఖ్యమైనది. ఈ విషయంలో 2023లో ప్రపంచ దేశాలు చెప్పుకోదగ్గ ప్రగతినే సాధించాయి. అంతర్జాతీయంగా సంప్రదాయేతర ఇంధనోత్పత్తి ఈ ఒక్క ఏడాదే ఏకంగా 30 శాతం, అంటే 107 గిగాబైట్లకు పైగా పెరిగిందట! అంతర్జాతీయ ఇంధన సంస్థ ఈ మేరకు వెల్లడించింది. వాతావరణ కాలుష్య కారక దేశాల్లో అగ్ర స్థానంలో ఉన్న చైనాయే ఈ విషయంలోనూ అందరికంటే ముందుంది! చైనా సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం గత జూన్ నాటికే మిగతా ప్రపంచ దేశాలన్నింటి ఉమ్మడి సామర్థ్యాన్ని కూడా మించిపోయిందని ఒక నివేదిక తేల్చడం విశేషం. అదే సమయంలో చైనాలో బొగ్గు ఉత్పత్తి కూడా కొద్ది నెలలుగా తారస్థాయికి చేరినా, త్వరలోనే అది బాగా దిగొస్తుందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తుండటం మరో సానుకూల పరిణామం. హాలోవీన్ వేడుక సందర్భంగా పోర్చుగల్ అక్టోబర్ 31 నుంచి వరుసగా ఆరు రోజుల పాటు కేవలం సంప్రదాయేతర ఇంధన వనరులను మాత్రమే వినియోగించి ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచింది. ఓజోన్ క్రమంగా కోలుకుంటోంది... అతినీల లోహిత కిరణాల వంటివాటి బారి నుంచి భూమిని కాపాడే కీలకమైన ఓజోన్ పొర కోలుకునే ప్రక్రియ 2023లో మరింతగా వేగం పుంజుకుంది. విచ్చలవిడి క్లోరోఫ్లోరో కార్బన్ల విడుదల తదితరాల కారణంగా ఓజోన్‌కు రంధ్రం పడిందని, అది నానాటికీ పెరుగుతోందని 1980ల నుంచీ పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ వస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు అంతర్జాతీయంగా జరిగిన ప్రయత్నాలు ఫలితాలిస్తున్నట్టు వారు తాజాగా చెబుతున్నారు. ఇందుకోసం చేసుకున్న మాంట్రియల్ ఒప్పందం ప్రకారం క్లోరో ఫ్లోరో కార్బన్లకు పూర్తిగా స్వస్తి చెప్పాలన్న లక్ష్యాన్ని అందుకునేందుకు ప్రపంచ దేశాలు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాయి. ఈ కృషి ఇలాగే కొనసాగితే 2040 కల్లా ఓజోన్ పొర 1980లకు ముందునాటి స్థితికి మెరుగు పడటం ఖాయం’’ అని ఐరాస తాజా నివేదికలో హర్షం వెలిబుచి్చంది. అయితే అంటార్కిటికా మీద మాత్రం ఓజోన్‌కు పడ్డ రంధ్రం గతంతో పోలిస్తే మరింతగా విస్తరించిందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెజాన్‌కు ఉద్దీపన అమెజాన్ అడవులను ప్రపంచం పాలిట ఊపిరితిత్తులుగా, ఆకుపచ్చని వలగా అభివరి్ణస్తుంటారు. ప్రపంచంలోనే అతి పెద్ద వర్షాధారిత అడవులివి. బ్రెజిల్లో కొన్నేళ్లుగా అడ్డూ అదుపూ లేకుండా సాగుతూ వస్తున్న వాటి విచ్చలవిడి నరికివేతకు 2023లో భారీ బ్రేక్ పడింది. బ్రెజిల్ గురించే చెప్పుకోవడం ఎందుకంటే 60 శాతానికి పైగా అమెజాన్ అడవులకు ఆ దేశమే ఆలవాలం! గత జూలై నాటికే అక్కడ అడవుల నరికివేత ఏకంగా 22.3 శాతం దాకా తగ్గుముఖం పట్టిందట. గత ఆర్నెల్లలో ఇది మరింతగా తగ్గిందని పలు నివేదికలు ఘోషిస్తున్నాయి. 2030 నాటికి బ్రెజిల్లో అడవుల నరికివేతను పూర్తిగా అరికట్టడమే లక్ష్యమని ప్రకటించిన నూతన అధ్యక్షుడు లులా డసిల్వా ఆ దిశగా గట్టి చర్యలే తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల జోష్ పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాలు ప్రపంచమంతటా దుమ్ము రేపుతున్నాయి. 2023లో వాటి అమ్మకాల్లో అంతర్జాతీయంగా విపరీతమైన పెరుగుదల నమోదైంది. అగ్ర రాజ్యం అమెరికాలోనైతే ఈవీల అమ్మకాలు ఆల్‌టైం రికార్డులు సృష్టించాయి! 2023లో అక్కడ 10 లక్షలకు పైగా పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడైనట్టు బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది. చైనాలో కూడా 2023లో మొత్తం వాహనాల అమ్మకాల్లో 19 శాతం వాటా ఈవీలదేనట! పలు యూరప్ దేశాల ప్రజలు కూడా వాటిని ఇబ్బడిముబ్బడిగా కొనేస్తున్నారు. అక్కడ 2022తో పోలిస్తే ఈవీల అమ్మకాల్లో 55 శాతానికి పైగా వృద్ధి నమోదైంది! మొత్తమ్మీద 2023లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం వాహన కొనుగోళ్లలో 15 శాతానికి ఈవీలేనని తేలింది. ప్రపంచ కాలుష్యంలో ఆరో వంతు వాటా రోడ్డు రవాణా వాహనాలదే. ఈ నేపథ్యంలో ఈవీలు ఎంతగా పెరిగితే ఈ కాలుష్యం అంతగా దిగొస్తుంది. శిలాజ ఇంధనాలపై తీర్మానం బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా నిలిపేయాలని ఇటీవల దుబాయ్‌లో జరిగిన కాప్28 అంతర్జాతీయ పర్యావరణ సదస్సు తీర్మానించడం విశేషం. పర్యావరణ పరిరక్షణకు కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాల్లో ఈ తీర్మానాన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఏకంగా 100కు పైగా దేశాలు దీనికి సంపూర్ణంగా మద్దతు పలకగా, ఈ దిశగా శక్తివంచన లేకుండా ప్రయతి్నంచాలని మరో 50 పై చిలుకు దేశాలు ఈ సదస్సు వేదికగా అభిప్రాయపడ్డాయి. గతంలోనూ పలు కాప్ సదస్సుల్లో ఈ దిశగా ప్రయత్నాలు జరిగినా అవి చర్చల స్థాయిని దాటి తీర్మానం దాకా రాకుండానే వీగిపోయాయి. అందుకే ఇది చరిత్రాత్మక తీర్మానమని కాప్28 సదస్సుకు అధ్యక్షత వహించిన సుల్తాన్ అల్ జబర్ అభివరి్ణంచారు. ఇది దేశాల ఆర్థిక వ్యవస్థలనే పునరి్నర్వచిస్తుందని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు. దీనికి దేశాలు ఏ మేరకు కట్టుబడి ఉంటాయన్న దానిపై భూగోళం భవిష్యత్తు చాలావరకు ఆధారపడి ఉంటుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉత్తరాఖండ్ టన్నెల్ నేర్పిన పాఠం! 'పేదల జీవితాలతో ఆడుకోవద్దు'!
దీపావళి రోజున ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ సిల్క్యారా టన్నెల్ కూలిపోవడంతో సొరంగంలో 41 మంది చిక్కుకుపోయిన ఘటన యావత్త్ దేశాన్ని కలవరిపరిచింది. వారంతా బయటకు రావాలని కులమతాలకు అతీతంగా అందరూ ప్రార్థించారు. ఆ ప్రార్థనలు ఫలించాయో లేక ఆ కూలీలను రక్షించేందుకు అహర్నిశలు కష్టపడుతున్న రెస్క్యూ బృందాల కృషికి అబ్బురపడి ప్రకృతి అవకాశం ఇచ్చిందో గానీ వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఎవ్వరికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు కూడా ప్రకటించడం అందర్నీ సంతోషంలో ముచ్చెత్తింది. దాదాపు 17 రోజుల నరాల తెగే ఉత్కంఠకు తెరపడి జయించాం అనే ఆనందాన్ని ఇచ్చింది. సరే గానీ ఈ ఉత్తర కాశీ టన్నెల్ ఘటన మన భారత ప్రభుత్వానికి, పరిశ్రమలకు ఓ గొప్ప పాఠాన్ని నేర్పాయి. అభివృద్ధి అనే పేరుతో ఏం జరుగుతుందో ప్రపంచానికి కళ్లకు కట్టినట్టు చూపింది. అలాగే పర్యావరణం కూడా ఎలా మసులుకోవాలో మానవుడిని పరోక్షంగా హెచ్చరించింది. ఆ ఉత్తర కాశీ ఘటన నేర్పిన గుణపాఠం ఏంటంటే.. నిజానికి ఆ ఉత్తరకాశీ సిల్క్యారా సోరంగం నరేంద్ర మోదీ ప్రభుత్వం చార్‌థామ్ ప్రాజెక్ట్‌లో భాగంగా చేపట్టిన నిర్మాణం. ఇది హిందూ ప్రముఖ క్షేత్రాలను కలుపుతుంది. ఇది పూర్తి అయితే యమునోత్రికి వెళ్లే యాత్ర మార్గం 20 కిలోమీటర్లు తగ్గుతుంది. భక్తుల చార్ధామ్ యాత్ర సులభతరం చేసేందుకు నిర్మించిన భూగర్భ మార్గం అని చెప్పాలి. కానీ ఇలా అభివృద్ధి పేరుతో చేపట్టే ప్రాజెక్టుల్లో పేద ప్రజల జీవితాలు ఎలా అగాధంలో పడతాయనేది అనేది అందరికీ తెలిసేలా చేసింది ఈ ఘటన. ఇప్పటి వరకు మనం నిర్మించిన చాలా ప్రాజెక్టులో చాలామంది కార్మికులు ప్రాణాలు కూడా ఇలానే పోయాయా అనే ఆలోచన కూడా వచ్చింది. ఆ ఘటనలు జరిగిన మీడియా మాధ్యమాలు, వార్త పత్రికల పుణ్యమాని ఒకటి రెండు రోజులే హాటాపిక్గా ఆ విషయంగా ఉంటుంది. ఆ తర్వాత అందరూ మర్చిపోతారు. అబ్బా! భారత్ ఎంతో ముందకు పోతుంది. ఎన్నో ఫైఓవర్లు, భూగర్భ రైలు మార్గాలు ఏర్పాటు చేసేశాం, టెక్నాలజీని అందుకుంటున్నాం అని స్టేమెంట్లు నాయకులు ఇచ్చేస్తుంటే..అదే నిజం అని గర్వంగా ఫీలైపోతాం. నిజానికి ఆయా పెద్ద పెద్ద రహాదారుల లేదా రైల్వే నిర్మాణాలకు వెనక ఉన్న కార్మికుల శ్రమ ఎవ్వరికి తెలియదు. ఆ నిర్మాణం జరుగుతున్న సమయంలో పేదల జీవితాలు ఎలా చిధ్రమయ్యాయి అన్నది కూడా పట్టదు. నాయకులు, అధికారులు ఇలాంటి పెద్ద నిర్మాణాలు, ప్రాజెక్టులు కట్టేటప్పుడూ ఇవన్నీ కామన్ అన్నట్టు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇలాంటి ఉత్తరకాశీ లాంటి కొన్ని ఘటనలు తెరమీదకు రాకుండానే కనుమరుగయ్యాయి. అందువల్లే సాధారణ ప్రజలకు కూడా ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయన్న విషయం కూడా తెలియదు. ఈ టన్నెల్ కూలిన ఘటన ప్రభుత్వాలకు, పరిశ్రమలకు పేదల జీవితాలతో చెలగాటం ఆడొద్దని నొక్కి చెప్పింది. కూలే అవకాశం ఉందని ముందే తెలుసా..! ఈ టన్నెల్ నిర్మాణాన్ని నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ చేపట్టింది. ఇదే కంపెనీ కాంట్రాక్టర్లు గతంలో మహారాష్ట్ర థానే జిల్లాలో నాగ్‌పూర్-ముంబై సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేని నిర్మించిన ఘటన ఇప్పుడు తెరమీదకు వచ్చింది. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ నిర్మాణంలో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగి 20 మంది కార్మికులు, ఇంజనీర్లు మరణించారు. దీంతో ఆయ కంపెనీ కాట్రాక్టర్లపై ఎఫైర్ కూడా నమోదైంది. మరీ మళ్లీ అదే కంపెనీకి ఈ ఉత్తరకాశీ టన్నెల్ ప్రాజెక్ట్ అప్పగించడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక జర్మన్-ఆస్ట్రియన్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ బెర్నార్డ్ గ్రుప్పీ మన భారత కంపెనీ నవయగ ఇంజనీరింగ్ లిమిటెడ్‌కి టన్నెల్ నిర్మాణ ప్రారంభానికి ముందు నుంచి కూడా టెండర్ డాక్యుమెంట్లో ఊహించిన దానికంటే భౌగోళిక పరిస్థితులు చాల సవాళ్లుగా ఉన్నాయని హెచ్చరించింది. అందువల్ల ఎలాంటి ప్రమాదాల సంభవిస్తే బయటపడేలా ఎస్కేప్ పాసేజ్ని నిర్మించమని 2018లోనే ఆదేశించింది. మరీ ఇక్కడ సొరంగం కూలిపోయేంత వరకు కూడా దాన్ని ఎందుకు నిర్మిచలేదనేది స్పష్టం కావాల్సి ఉంది. ప్రస్తుతం బయట పడ్డ ఆ కూలీలంతా ఈ ఎస్కేప్ పాసేజ్ నుంచే సురక్షితంగా బటయకొచ్చిన సంగతి తెలిసిందే. డెవలప్మెంట్ పర్యావరణాన్ని ప్రమదంలో పడేస్తుందా? ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాలకు నిలయం హిమాలయ పర్వతాలు. దాదాపు 45 మిలియన్ ఏళ్ల క్రితం ఏర్పడినవి. నిజానికి ఈ ప్రాంతం ఎక్కువుగా భూకంపాలకు గురయ్యే ప్రాంతం కూడా. పైగా ఇక్కడ శిలలు అవక్షేపణ శిలలుగా ఉంటాయి. పైగా ఇక్కడ పర్యావరణం అస్థిరంగ ఉంటుంది. నిర్మాణ పద్ధతులకు అస్సలు అనూకులమైనది కూడా కాదు. అలాంటి ప్రదేశంలో అభివృద్ధి పేరుతో మనం చేస్తున్న పనులు ముఖ్యంగా పర్యావరణానికి ఇబ్బంది కలిగించేవే. ఈ విషయమై ఉత్తరాఖండ్ కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు ఎస్కె పట్నాయక్ ఎన్నోసార్లు ఆందోళన వ్యక్తం చేశారు. మన జీవన శైలి సౌలభ్యానికి అవసరమైన మార్పలు ఎంత అవసమో పర్యావరణాన్ని విఘాత కలగించకుండా చేసే అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేది కూడా అంతే ముఖ్యం. లేదంటే ప్రకృతి ప్రకోపానికి బలవ్వక తప్పదు. కానీ ఇలాంటి విపత్తులో బలయ్యేది కూడా పేద కార్మికులే అనే విషయం గుర్తించుకోవాలి అధికారులు. (చదవండి: ఎక్కువ రోజులు సొరంగంలో ఉంటే కార్మికుల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది! వైద్యుల ఆందోళన) -
ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: పర్యావరణానికి ప్రమాదంగా మారిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని స్వచ్ఛందంగా నిషేధించాలని సీఎస్ శాంతి కుమారి పిలుపునిచ్చారు. సచివాలయంలో వీటి వాడకాన్ని నిషేధించి, ప్రత్యామ్నాయాలను వాడడం ద్వారా కార్యదర్శులు మొదలు ప్రతీ అధికారి, ఉద్యోగులు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 17 లక్షల మంది స్వయం సహాయక బృందాల మహిళలతో వీటి నిషేధంపై పౌరులను చైతన్య పరుస్తున్నామని తెలిపారు. శనివారం సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం నిషేధంపై జరిగిన వర్క్ షాప్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ రాజీవ్ శర్మ తోపాటు వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నా..సామాజిక భాద్యతతోనే సాధ్యం శాంతి కుమారి మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో స్టీల్, పింగాణీ వస్తువుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ నిషేధంపై ఇప్పటికే ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల ఇది సాధ్యం కాదని, స్వచ్ఛందంగా సామాజిక బాధ్యతతో పాటించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ప్లాస్టిక్ లో కేవలం 9 శాతం మాత్రమే రీ–సైక్లింగ్ జరుగుతోందని, మిగిలిన ప్లాస్టిక్ వ్యర్థాలు నాలాలు, చెరువులు, నదీ జలాల్లో కలుస్తూ జీవనానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించి భూమిని కాపాడుకొందాం’అనే నినాదంతో రూపొందించిన పోస్టర్‌ను ఈ సందర్భంగా శాంతి కుమారి, రాజీవ్ శర్మ ఆవిష్కరించారు. -
ఇంట్లో అక్వేరియం ఉంటే డాక్టర్ ఉన్నట్టే
అక్వేరియం వద్ద కాసేపు గడిపితే హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ గణనీయంగా తగ్గుతాయని ఎన్విరాన్మెంట్ అండ్ బిహేవియర్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం పేర్కొంది.ప్లిమౌత్ యూనివర్సిటీ, నేషనల్ మెరైన్ అక్వేరియం ఆధ్వర్యంలో పరిశోధకుల బృందం జరిపిన అధ్యయనాన్ని ఈ జర్నల్ ప్రచురించింది. తీవ్ర ఒత్తిడిలో జీవనం సాగించే పట్టణ జనాభాలో ఒత్తిడిని తగ్గించే కారకాలపై ఈ బృందం పరిశోధనలు జరిపింది. రోజులో 10 నిమిషాల సేపు ఒక అక్వేరియం ముందు కూర్చుని అందులో కదిలే చేపలను గమనిస్తే హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ బాగా నియంత్రణలోకి వస్తాయని ఆ బృందం గుర్తించింది. – తమనంపల్లి రాజేశ్వరరావు, ఏపీ సెంట్రల్ డెస్క్ ఓ గాజు పెట్టె.. దాని నిండా నీళ్లు.. అడుగున రంగు రాళ్లు.. రెండు మూడు లైవ్ ఫ్లాంట్స్.. దానిలో నాలుగైదు చేపలు.. ఇదే కదా అక్వేరియం అంటే. చెప్పడానికైతే అంతే. కానీ తరచి చూస్తే దానిలో ఓ సైన్స్ ఉంది. ఆ పెట్టెలోపల ఓ పర్యావరణం ఉంది. ఆ నీళ్లలో ఒక జీవన చక్రం ఉంది. అందులోని చేపలకు తమదైన ఓ ప్రపంచమూ ఉంది. అంతేకాదు.. అది ఓ ప్రశాంత నిలయం. దాంతో మన ఇంటిలోనూ ఒక ప్రశాంతత. అక్వేరియంలోకి అలా చూస్తూ కాసేపు గడిపితే... ఎంత ఉత్సాహంగా ఉంటుందో అనుభవించి చూడాల్సిందే. ఒంటికి రంగులద్దుకున్న ఆ చేపలు.. వయ్యారంగా అలా కదులుతూ ఉంటే.. ఆ నీటిని సుతారంగా అలా చిలుకుతూ ఉంటే.. చూడముచ్చటగా ఉంటుంది. ఇంటికి అందం.. మనసుకు ఆహ్లాదం అక్వేరియం అనేది మన ఇంటికి అదనపు అందాన్నిస్తుంది. ఇంట్లో ఓ సరికొత్త శోభను తీసుకొస్తుంది.రంగు రంగుల చేపలతో అక్వేరియం ఉన్న ఇల్లు కళకళలాడుతూ కాంతివంతంగా ఉంటుంది. చాలా మంది అక్వేరియంను అందం కోసం ఇంట్లో పెట్టుకుంటారు. కానీ అక్వేరియంతో ఆరోగ్యం కూడా సమకూరుతుందంటే ఆశ్చర్యమే మరి. నీటిలో ఈదుతున్న చేపలను చూస్తూ రోజూ కొంత సమయం గడపడం అన్నది ఆరోగ్యంపై అమితమైన ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మనసు, శరీరం రిలాక్స్ అవుతాయని, బీపీ, హార్ట్రేట్లు నియంత్రణలో ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అల్జీమర్స్ దరిచేరదని, ఆ వ్యాధి ఉన్నవారికి సైతం ఉపశమనం లభిస్తుందని వారు పేర్కొంటున్నారు. అక్వేరియం వద్ద గడిపే పిల్లలు ఎంతో నేర్చుకుంటారు.. చేపలకు ఫుడ్ వేయడం, నీళ్లు మార్చడం వంటి వాటితో క్రమశిక్షణ అలవడుతుంది. మనసికంగా పరిణతి సాధిస్తారు. అందరికీ అందుబాటు ధరల్లో.. అక్వేరియాలు అందరికీ అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. వాటిలో వేసే చేపలు, వాటి రకాలను బట్టి వాటి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. గతంలో ఈ అక్వేరియాల కోసం హైదరాబాద్, విశాఖ, విజయవాడ వంటి పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇటీవల కాలంలో వాటి వినియోగం పెరగడంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలోనూ, ముఖ్య పట్టణాల్లోనూ అందుబాటులోకొచ్చాయి. అనేక రకాలు..: అక్వేరియంలో పెంచే చేపల్లో రెగ్యులర్ గోల్డ్‌తో పాటు ఒరాండా, షుబుకిన్ గోల్డ్, బెట్టాస్, ఏంజిల్ ఫిష్, గౌరామీ, కోయీ కార్ప్స్, టైగర్ షార్క్, మోలీస్, గప్పీస్, ప్లాటీస్, ప్యారట్, టైగర్ ఆస్కార్స్ ఇలా పలు రకాలున్నాయి. రెగ్యులర్‌గా నిర్దేశిత పరిమాణంలో మాత్రమే వాటికి ఆహారాన్నివ్వాలి. ఆహారం తక్కువైనా, ఎక్కువైనా చేపలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. బెట్టా వంటి ఫైటర్ ఫిష్‌లు ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతాయి. అలాంటి చేపల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఫ్లవర్ హార్న్, అరవానా వంటివి కాస్త ధర ఎక్కువ. ఇవి కూడా ఒంటరిగానే ఉంటాయి. వాస్తుపరంగానూ ఇంటికి అక్వేరియం చాలా మేలు చేస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈశాన్యంలో ఉంటే ఆ ఇంటికి అన్ని రకాలుగా కలిసొస్తుందని విశ్వసిస్తారు. మనపై ఏదైనా నెగెటివ్ ప్రభావం పడినప్పుడు.. దానిని అక్వేరియంలోని చేపలు గ్రహించి మనల్ని రక్షిస్తాయని కూడా చాలామంది నమ్ముతారు. అక్వేరియం ఆరోగ్యదాయిని.. అక్వేరియంలోని చేపలను కొద్దిసేపు నిశితంగా పరిశీలించడం ద్వారా ఒత్తిడి, ఆందోళన, రక్తపోటు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఎలక్ట్రో కన్వెన్షనల్ థెరపీ అవసరమైన వారు నీటి ట్యాంక్‌లోని చేపలను రోజూ చూడటం వల్ల వారిలో ఆందోళన 12 శాతం తగ్గిందని ఓ అ«ధ్యయనంలో తేలింది. ఇంట్లో అక్వేరియం ఉంటే డిమెన్షియా ఉన్న వారిపై సానుకూల ప్రభావం చూపుతుందని తాజాగా చేసిన పరిశోధన తేల్చి చెప్పింది. అక్వేరియంలో ఉండే రంగు, రంగుల చేపలు, అవి ఈదటం, నీటి బుడగల శబ్దాలు ఆటిజం ఉన్న పిల్లల్లో అటెన్షన్‌ను పెంచడమేగాక వారికి రిలాక్స్నిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. – సీతామహాలక్ష్మి జెట్టి, సైకాలజిస్ట్, గుంటూరు ఒత్తిడిని అధిగమించాను.. బాధ్యతలతో పని ఒత్తిడి ఉండేది. పిల్లలకోసంఇంట్లో ఈ మధ్యే ఓ అక్వేరియం ఏర్పాటు చేసుకున్నాం. స్కూల్ నుంచి ఇంటికి రాగానే రోజూ కాసేపు చేపలతో ఆడుకోవడం, వాటికి ఆహారం వేయడం, వారానికోసారి అక్వేరియంలో నీరు మార్చడం వంటివి చేస్తున్నాం. చాలా రిలాక్స్డ్గా ఉంటోంది. ఒత్తిడి చాలా వరకు తగ్గింది. – సీహెచ్‌వీబీ హరిణి, టీచర్, కొల్లూరు, బాపట్ల జిల్లా మెయింటెనెన్స్ సులభమే.. అక్వేరియం అనగానే మెయింటెనెన్స్ చాలా కష్టం కదా అని అనుకుంటుంటారు. ఇపుడు అనేక పరికరాలు అందుబాటులోకి వచ్చేశాయి. క్లీనింగ్ సులభంగా చేసుకోవచ్చు. సులభమైన టిప్స్ కూడా ఉన్నాయి. బ్రీడర్ ఫిష్ఫామ్లలో చేపలు చాలా తక్కువ ధరలలో దొరుకుతు న్నాయి. అక్వేరియం, యాక్సెస్సరీస్ ధరలు కూడా ఇపుడు అందుబాటులోనే ఉన్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినా వినియోగదారులకు చేరుస్తున్నారు. – పి.సాయి ఈశ్వర్, ఫార్చ్యూన్ ఆక్వాహబ్ (బ్రీడర్ ఫిష్ ఫామ్) నిర్వాహకుడు, వణుకూరు,కృష్ణా జిల్లా -
Joyeeta Gupta: డైనమిక్ ప్రొఫెసర్‌కు డచ్ నోబెల్
ఆర్థికశాస్త్రం చదువుకున్నవారి ఆసక్తి గణాంకాలకే పరిమితమని, న్యాయశాస్త్రం చదువుకున్న వారి ఆసక్తి ఆ శాస్త్రానికి సంబంధించిన అంశాలపైనే ఉంటుందనేది ఒక సాధారణ భావన. ‘విభిన్న విద్యానేపథ్యం ఉన్న మేధావి’గా గుర్తింపు పొందిన జ్యోయితా గుప్తా ఆర్థికశాస్త్రం నుంచి న్యాయశాస్త్రం వరకు ఎన్నో శాస్త్రాలు చదివింది. అయితే ఆమె ప్రయాణంలో ఆ శాస్త్రాలేవీ వేటికవే అన్నట్లుగా ఉండిపోలేదు. వాతావరణ మార్పులపై తాను చేసిన శాస్త్రీయ పరిశోధనకు మరింత విస్తృతిని ఇచ్చాయి. నెదర్లాండ్స్‌లోని యూనివర్శిటీ ఆఫ్ ఆమ్‌స్టార్‌డమ్‌లో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జ్యోయితా గుప్తా డచ్ రిసెర్చి కౌన్సిల్ నుంచి ‘డచ్ నోబెల్’గా పేరొందిన ప్రతిష్టాత్మకమైన స్పినోజా ప్రైజ్‌ను ది హేగ్‌లో అందుకుంది... దిల్లీలో పుట్టి పెరిగింది జ్యోయితా గుప్తా. లోరెటో కాన్వెంట్ స్కూల్లో చదువుకుంది. దిల్లీ యూనివర్శిటీలో ఎకనామిక్స్, గుజరాత్ యూనివర్శిటీలో న్యాయశాస్త్రం, హార్వర్డ్ లా స్కూల్లో ఇంటర్నేషనల్ లా చదివింది. ‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాతావరణ మార్పులు’ అనే అంశంపై ఆమ్స్టార్ డామ్‌లోని వ్రిజే యూనివర్శిటీలో డాక్టరేట్ చేసింది. 2013లో ఈ యూనివర్శిటీలో ఫ్యాకల్టీగా చేరింది. వాతావరణ మార్పుల వల్ల సమాజంపై కలుగుతున్న ప్రభావం, ఉత్పన్నమవుతున్న సామాజిక అశాంతి... మొదలైన అంశాలపై లోతైన పరిశోధనలు చేసింది. 2016లో ఐక్యరాజ్య సమితి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఔట్లుక్ (జీఈవో)కు కో– చైర్‌పర్సన్‌గా నియమితురాలైంది. యూనివర్శిటీ ఆఫ్ ఆమ్‌స్టర్‌డమ్‌లో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జ్యోయితా గుప్తా ‘ఆమ్స్టర్డామ్ గ్లోబల్ చేంజ్ ఇన్స్టిట్యూట్’ సభ్యులలో ఒకరు. పరిశోధనలకే పరిమితం కాకుండా పర్యావరణ సంబంధిత అంశాలపై విలువైన పుస్తకాలు రాసింది జ్యోయిత. ‘ది హిస్టరీ ఆఫ్ గ్లోబల్ క్లైమెట్ గవర్నెన్స్’ ‘ది క్లైమెట్ ఛేంజ్ కన్వెన్షన్ అండ్ డెవలపింగ్ కంట్రీస్’ ‘టాక్సిక్ టెర్రరిజమ్: డంపింగ్ హజడస్ వేస్ట్’ ‘అవర్ సిమరింగ్ ప్లానెట్’ ‘ఆన్ బిహాఫ్ ఆఫ్ మై డెలిగేషన్: ఏ సర్వె్యవల్ గైడ్ ఫర్ డెవలపింగ్ కంట్రీ క్లైమెట్ నెగోషియేటర్స్’ ‘మెయిన్ స్ట్రీమింగ్ క్లైమేట్ చేంజ్ ఇన్ డెవలప్మెంట్ కో ఆపరేషన్’... మొదలైన పుస్తకాలు రాసింది. అమెరికా పరిశ్రమల చెత్త ఏ దేశాలకు చేరుతుంది? ఎంత విషతుల్యం అవుతుందో 1990లోనే ‘టాక్సిక్ టెర్రరిజమ్: డంపింగ్ హాజడస్ వేస్ట్’ పుస్తకంలో కళ్లకు కట్టినట్లు వివరించింది. పాశ్చాత్య దేశాల పరిశ్రమలు ఉత్పత్తి చేసే విషపూరిత వ్యర్థాలు మరోవైపు విదేశీ మారకద్రవ్యం కోసం పరితపిస్తూ పర్యావరణాన్ని పట్టించుకోని దేశాల గురించి లోతైన విశ్లేషణ చేసింది జ్యోయిత. సాధారణంగానైతే పర్యావరణ అంశాలకు సంబంధించిన చర్చ, విశ్లేషణ ఒక పరిధిని దాటి బయటికి రాదు. అయితే జ్యోయిత విశ్లేషణ మాత్రం ఎన్నో కోణాలను ఆవిష్కరించింది. వాతావరణంలోని మార్పులు ప్రభుత్వ పాలనపై చూపే ప్రభావం, ధనిక, పేద సమాజాల మధ్య తలెత్తే వైరుధ్యాల గురించి చెప్పడం ఇందుకు ఒక ఉదాహరణ. ‘ప్రపంచవ్యాప్తంగా తగినన్ని ఆర్థిక వనరులు ఉన్నాయి. అందరి జీవితాలను బాగు చేయడానికి ఆ వనరులను ఎలా ఉపయోగించాలనేదే సమస్య. ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు, నిరుపేదల మధ్య అసమానతలు ఉన్నాయి. భారత్‌లాంటి దేశాల్లో కూడా ఇదొక పెద్ద సవాలు’ అంటుంది జ్యోయిత. ఆమె విశ్లేషణలో విమర్శ మాత్రమే కనిపించదు. సందర్భాన్ని బట్టి పరిష్కారాలు కూడా కనిపిస్తాయి. ‘విస్తృతమైన, విలువైన పరిశోధన’ అంటూ స్పినోజా ప్రైజ్ జ్యూరీ గుప్తాను కొనియాడింది. కొత్త తరం పరిశోధకులకు ఆమె మార్గదర్శకత్వం విలువైనదిగా ప్రశంసించింది. తనకు లభించిన బహుమతి మొత్తాన్ని (1.5 మిలియన్ యూరోలు) శాస్త్రపరిశోధన కార్యక్రమాలపై ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకుంది జ్యోయితా గుప్తా. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు, పర్యావరణ సంరక్షణకు చట్టాలతో కూడిన ప్రపంచ రాజ్యాంగం కోసం జ్యోయితా గుప్తా గట్టి కృషి చేస్తోంది. -
మన దేశంలోనే ఆ కంపెనీలు ఉన్నాయని తెలిసి షాక్ అయ్యాను: దియా మీర్జా
లైట్స్, కెమెరా, యాక్షన్ అనేవి సుప్రసిద్ధ నటి దియా మీర్జాకు సుపరిచిత పదాలు. అయితే ఆమెకు సంబంధించి ఈ పదాలు సినీ స్టూడియోలకే పరిమితం కాలేదు. తన కంటి కెమెరాతో ప్రకృతిని చూస్తుంది. పర్యావరణ నష్టానికి సంబంధించిన విధ్వంస చిత్రాలపై నలుగురి దృష్టి పడేలా ‘లైట్స్’ ఫోకస్ చేస్తోంది. తన వంతు కార్యాచరణగా క్లైమేట్ యాక్షన్ అంటూ నినదిస్తోంది... నటిగా సుపరిచితురాలైన దియా మీర్జా గ్లామర్ ఫీల్డ్ నుంచి పర్యావరణ స్పృహకు సంబంధించిన ప్రచారం వైపు అడుగులు వేసింది. ‘క్లైమేట్ యాక్టివిస్ట్’గా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. యూఎన్ ఎన్విరాన్మెంట్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పర్యావరణ ఉద్యమకారులతో కలిసి పనిచేస్తోంది.పర్యావరణానికి సంబంధించిన చర్చలు జరిగే ఇంట్లో పెరిగిన దియాకు సహజంగానే పర్యావరణ విషయాలపై ఆసక్తి మొదలైంది. దీనికితోడు స్కూల్లో టీచర్ ద్వారా విన్న పర్యావరణ పాఠాలు కూడా ఆమె మనసుపై బలమైన ప్రభావాన్ని వేసాయి. ఇక కాలేజీరోజుల్లో పర్యావరణ సంబంధిత చర్చాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ‘ప్రకృతిపై ప్రేమ అనే విలువైన బహుమతిని తల్లిదండ్రులు నాకు ఇచ్చారు’ అంటున్న దియ చిన్నప్పుడు చెట్లు, కొండలు ఎక్కేది. పక్షుల గానాన్ని ఎంజాయ్ చేసేది. మర్రిచెట్టు ఊడలతో ఉయ్యాల ఊగేది. ఉడతలతో గంతులు వేసేది. ఇల్లు దాటి చెట్ల మధ్యకు వెళ్లినప్పుడల్లా తనకు మరో ప్రపంచంలోకి వెళ్లినట్లుగా ఉండేది.బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాక దియాకు పర్యావరణ సంబంధిత అంశాలపై ఎన్నో సామాజిక సంస్థలతో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. ఆ సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా ఎన్నో విషయాలపై అవగాహన ఏర్పడింది. ఆ అవగాహనతోనే పర్యావరణ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొనాలని నిర్ణయించుకుంది. ‘ప్రజలకు మేలు చేసేదే పర్యావరణానికి మేలు చేస్తుంది’ అనే నినాదంతో పర్యావరణ ఉద్యమాలలో భాగం అయింది. ‘వాతావరణంలో మార్పు అనేది భవిష్యత్‌కు సంబంధించిన విషయం మాత్రమే కాదు వర్తమానాన్ని కలవరపెడుతున్న విషయం. ప్రకృతిమాత చేస్తున్న మేలును గుర్తుంచుకోలేకపోతున్నాం. పర్యావరణ సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వం, స్వచ్ఛందసంస్థలు, శాస్త్రవేత్తలకే పరిమితమైనది కాదు. అన్ని వర్గాల ప్రజలు, అన్ని వయసుల వారు శాస్త్రీయ విషయాలపై అవగాహన పెంచుకోవాలి’ అంటుంది దియ.వాయు కాలుష్యానికి సంబంధించిన అధ్యయనం దియాను ఆందోళనకు గురి చేసింది. ‘వాయు కాలుష్యం అనగానే దిల్లీ గురించే ఎక్కువగా మాట్లాడతాం. అయితే లక్నో నుంచి ముంబై వరకు ఎన్నో పట్టణాలలో వాయు కాలుష్య సమస్య తీవ్రంగా ఉంది’ అంటున్న దియా తన ఎజెండాలో ‘స్వచ్ఛమైన గాలి’కి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇక ఆమెను కలవరపెట్టిన మరో సమస్య ప్లాస్టిక్. షూటింగ్ నిమిత్తం మహా పట్టణాల నుంచి మారుమూల పల్లెటూళ్లకు వెళ్లినప్పుడు ప్లాస్టిక్ కనిపించని చోటు అంటూ ఉండేది కాదు.‘ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నప్పుడు వాటికి సంబంధించిన కంపెనీలు మన దేశంలోనే ఉన్నాయనే విషయాన్ని తెలుసుకున్నాను. బ్యాంబు బ్రష్‌లు, ఇయర్ బడ్స్ వాడుతున్నాను. నా దగ్గర ఆకర్షణీయమైన బ్యాంబు పోర్టబుల్ స్పీకర్ ఉంది’ అంటున్న దియా తాను వాడుతున్న ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులను స్నేహితులకు కూడా పరిచయం చేస్తుంది. పర్యావరణ సంరక్షణకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పర్యావరణ స్పృహతో కూడిన జీవనవిధానాన్ని ప్రచారం చేయడానికి ఎకో–ఫ్రెండ్లీ సంస్థల్లో పెట్టుబడులు పెడుతుంది దియా మీర్జా. తాను పెట్టుబడులు పెట్టిన అయిదు కంపెనీలు మన దేశానికి చెందినవి. మహిళల నాయకత్వంలో నడుస్తున్నవి.‘నేను కష్టపడి సంపాదించిన డబ్బు, పొదుపు మొత్తాలను పర్యావరణ హిత కంపెనీలలో పెట్టుబడి పెట్టడం గర్వంగా ఉంది’ అంటుంది దియా. దియా మీర్జాకు సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఆ ప్రొడక్షన్ హౌజ్ ద్వారా ప్రజల్లో మార్పును తీసుకువచ్చే చిత్రాలను వినోదం మేళవించి తీయాలనుకుంటోంది. అవును...ఈరోజే మంచిరోజు అత్యుత్తమ రోజు అంటే ఈ రోజే... అనే సామెత ఉంది. మంచి పని చేయడానికి మరోరోజుతో పనిలేదు. మన భూమిని కాపాడుకోడానికి ప్రతిరోజూ విలువైన రోజే. పిల్లలను పార్క్‌లు, వనాల దగ్గరకు తీసుకువెళ్లడం ద్వారా వారికి ప్రకృతి పట్ల ఆసక్తి కలిగించవచ్చు. పచ్చటి గడ్డిలో పాదరక్షలు లేకుండా నడిపించడం, అప్పుడే మొదలైన వానలో కొంచెంసేపైనా గంతులేసేలా చేయడం...ఇలా చిన్న చిన్న పనుల ద్వారానే వారిని ప్రకృతి నేస్తాలుగా తీర్చిదిద్దవచ్చు. పిల్లలకు వినోదం అంటే సినిమాలు మాత్రమే కాదు. ప్రకృతితో సాన్నిహిత్యానికి మించి పిల్లలకు వినోదం ఏముంటుంది! – దియా మీర్జా, నటి, క్లైమేట్ యాక్టివిస్ట్ -
గర్భిణీ స్త్రీలు ప్లాస్టిక్ పాత్రల్లో తింటున్నారా?దీనిలోని బిస్ఫినాల్ వల్ల..
నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ప్లాస్టిక్ కాలుష్యం ఒకటి.గత కొన్నేళ్లుగా ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఓవైపు ప్లాస్టిక్‌ను నిర్మూలించాలని చెబుతున్నా మరింత ఎక్కువగా వాడుతున్నాం. ఇప్పటికే ప్లాస్టిక్ ఉత్పత్తి సంవత్సరానికి 40 కోట్ల టన్నులకు చేరుకుందని అంచనా. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో సమస్య సంక్షోభంగా మారే అవకాశం తొందర్లోనే ఉంది. ప్లాస్టిక్ కవర్ల వల్ల కలిగే నష్టాలివే పర్యావరణ_కాలుష్యం: ►సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు పర్యావరణ కాలుష్యానికి ప్రధాన మూలం. ఎందుకంటే అవి భూమిలో ఇంకిపోవడానికి చాలా సమయం పడుతుంది.ప్లాస్టిక్ కవర్లు వన్యప్రాణులకు హాని కలిగిస్తాయి. జంతువులు వాటిని ఆహరంగా భావించి తినేస్తున్నాయి. ఇది ఎక్కువైతే, మరణానికి కూడా దారితీయొచ్చు. ► ప్లాస్టిక్ కవర్లు అనేక రసాయనాలు కలిగి ఉంటుంది. వీటిని నీటిలో వదలడం వల్ల అవి కూడా కలుషితం అయ్యి ప్రమాదాన్ని కలిగిస్తాయి. ► కొన్ని ప్లాస్టిక్ కవర్లలో మానవ ఆరోగ్యానికి హాని కలిగించే బిస్ఫినాల్ A (BPA), థాలేట్స్ ,ఫ్లేమ్ రిటార్డెంట్స్ వంటి రసాయనాలు ఉండవచ్చు. ఈ రసాయనాలు ప్లాస్టిక్ నుండి బయటకు వెళ్లి ఆహారం లేదా పానీయాలలోకి వెళ్లి, హార్మోన్ల అసమతుల్యత, పునరుత్పత్తి సమస్యలు మరియు క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ► ప్లాస్టిక్ కవర్ల ఉత్పత్తి, పారవేయడం గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలకు దోహదం చేస్తుంది. ఇది వాతావరణ మార్పు, ఇతర పర్యావరణ సమస్యలకు దోహదం చేస్తుంది. ప్లాస్టిక్ పాత్రల్లో ఆహారం తింటున్నారా? మీరు రోజూ ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారం తీసుకుంటున్నారా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే. వేడి పదార్థాలను ప్లాస్టిక్ లేదా డిస్పోజబుల్ ప్లేట్లలో ఉంచడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని పరాశోధకులు ప్లాస్టిక్ (Plastic) తయారు చేసేందుకు బిఎస్ ఫినాల్ను ఉపయోగిస్తారు. ప్రధానంగా పాలికార్బోనేట్ లేదా రీసైకిల్ కోడ్7గా పిలువబడే ఇది ప్లాస్టిక్‌లో కలుస్తుంది. ఇది విషపూరితమైనది. దీని వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ పొంచివుండే ప్రమాదం ఉంది. బీపీఏ అనేది మానవ శరీరంలోని ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లను అసమతుల్యత చేసే రసాయనమని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీని వల్ల మానసిక ఒత్తిడి మొదలైన వాటికి దారి తీస్తుంది. అలాగే అలెర్జీలు, గుండెకు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్ తీవ్రతను పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గుతుంది ఎక్కువగా ప్లాస్టిక్ పాత్రల్లో తినడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అలాగే గర్భిణీ స్త్రీలు ప్లాస్టిక్ పాత్రలలో ఆహారం తినడం వల్ల పుట్టబోయే పిల్లలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మైక్రోవేవ్‌లో ప్లాస్టిక్ పాత్రలలో ఆహారాన్ని వేడి చేయడం కూడా హానికరమంటున్నారు. మీరు మైక్రోవేవ్ ఉపయోగించాల్సి వస్తే ప్లాస్టిక్‌కు బదులుగా మీరు పేపర్ టవల్, గ్లాస్ ప్లేట్ లేదా సిరామిక్ వస్తువులను ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. ఓవైపు ప్లాస్టిక్‌ను నిషేధించాలని పదేపదే చెబుతున్నా, ఇంకా ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. ప్లాస్టిక్ కవర్స్‌ని నిషేధించే విధంగా చర్యలు చేపట్టినా, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్లాస్టిక్ భూమిలో కరగడానికి కొన్ని వందల ఏళ్లు సమయం పట్టడం, అందులో ప్లాస్టిక్ తయారీలో కలిసే పదార్థం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఎంతో మంది నిపుణులు చెబుతున్నా.. ఇంకా ప్లాస్టిక్ రూపుమాపడం లేదు. ప్లాస్టిక్ కవర్ల హానికరమైన ప్రభావాలను తగ్గించడానికి, సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌ల వినియోగాన్ని తగ్గించడం, కంటైనర్లు, పత్తి లేదా బీస్వాక్స్ వంటి సహజ పదార్థాలతో తయారు చేయబడిన ర్యాప్ల వంటి మరింత స్థిరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ప్లాస్టిక్ కవర్లను రీసైక్లింగ్ చేయడం సరైన పరిష్కారం కాదు. దానికంటే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడమే సమస్యను పరిష్కరించడానికి ఉత్తతమైన మార్గం. -నవీన్ నడిమింటి ప్రముఖ ఆయుర్వేద వైద్యనిపుణులు