మనిషి బ్రతకడానికి ఊపిరి తీసుకుంటాడు. అలాంటిది ఈ మధ్య కాలంలో ఊపిరి తీసుకోవడమే ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమించింది. వాతావరణంలో కర్బన ఉద్గారాలు విపరీతంగా పెరిగి పోవడం వలన స్వచ్ఛమైన ప్రాణవాయువు శాతం తగ్గిపోతోంది. దీనివలన చిన్నారుల నుంచి సీని యర్ సిటిజన్స్ వరకు అనేక ఆరోగ్య సమస్యలు అనుభవించాల్సి వస్తోంది.
మనం పీల్చే గాలిలో ప్రాణాంతకమైన కాలుష్య కారకాలు కలుస్తున్నాయి. ఊపిరి తీసుకున్న తరువాత శరీరంలోకి చేరిపోయి అవయవాలను నిర్వీర్యం చేస్తున్నాయి. మనదేశంలో అతిపెద్ద నగ రాలలో సంభవిస్తున్న మరణాల్లో సగటున 7.2 శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణమని తాజా అధ్యయనంలో తెలిసింది. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాలలోని గాలిలో అత్యంత సూక్ష్మమైన ‘పి.ఎం 2.5’ ధూళి కణాలు అధికంగా ఉన్నట్లు ఒక నివేదిక తెలిపింది. మనదేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో చాలా మరణాలకు వాయు కాలుష్యమే కారణమవుతున్నట్లు తెలిపింది. పి.ఎం అంటే పార్టిక్యులేట్ మ్యాటర్. 2.5 అంటే... గాలిలో ఉండే సూక్ష్మ కణాల వ్యాసం 2.5 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ ఉన్నవని అర్థం. ఈ కణాలు ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. ఇవి ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులు, శ్వాసనాళాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఈ గాలిలోకి చేరే సల్ఫేట్లు, బొగ్గు సంబంధమైన కలుషితాల వంటివి ఊపిరితిత్తులకు పట్టేస్తున్నాయి. గుండెకు వెళ్లే రక్తపునాళాల్లో పేరుకుపోతున్నాయి.
మనదేశంలోని పెద్ద పెద్ద నగరాలలో నిత్యం వెలువడుతున్న పి.ఎం 2.5 ధూళికణాల వలన మరణాలు రేటు నానాటికీ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఒక క్యూబిక్ మీటర్ గాలిలో 2.5 ధూళి కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే రోజువారీ మరణాల సంఖ్య 1.4 శాతం పెరుగు తున్నట్లు ఒక పరిశోధనలో గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాల ప్రకారం ఒక రోజు అనగా 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో పి.ఎం 2.5 కణాలు 15 మైక్రోగ్రాముల లోపు ఉంటే ప్రమాదం వుండదు, అంతకంటే పెరిగితే ముప్పు తప్పదు.
భారతదేశ వాయు నాణ్యతా ప్రమాణాల ప్రకారం 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో పి.ఎం 2.5 కణాలు 60 మైక్రోగ్రాముల లోపు ఉంటే ప్రమాదం అంతగా ఉండదు. కానీ మనదేశంలో ప్రస్తుతం 75 మైక్రోగ్రాముల కంటే అధికంగానే ఉంటున్నట్లు తెలిసింది. క్యూబిక్ మీటర్ గాలిలో పి.ఎం 2.5 కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే మరణాల రేటు సగటున 3 శాతం దాకా పెరుగుతున్నట్లు గుర్తించారు. వాయు కాలుష్యం వలన బ్రెయిన్ స్ట్రోక్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మొనరీ వ్యాధులు, న్యూమోనియా, శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది.
కళ్లు, ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో చీకాకుతో పాటు దగ్గు, తుమ్ములు పెరుగుతాయి. దీనితో పాటు ఆస్తమా లాంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరి స్తున్నారు. ఈ వాయుకాలుష్యం ఇలానే పెరిగితే భూమికి రక్షణ కవచం అయిన ఓజోన్ పొర క్షీణించడం ఎక్కువవుతుంది. ఓజోన్ పొర దెబ్బతింటే యూవీ కిరణాలు నేరుగా భూమిపైన పడడం వలన చర్మ, నేత్ర సమస్యలు వస్తాయి. వ్యవసాయంపైన కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి వాయుకాలుష్యం తగ్గించడానికి ప్రభుత్వాలు సాధ్యమైనంత సత్వర చర్యలు తీసుకోవాలి. – మోతె రవికాంత్, సేఫ్ ఎర్త్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment