
ప్రణాళికా సంఘం నివేదిక ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ దేశంలోనే అత్యంత వెనుకబడ్డ జిల్లా. స్వతంత్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు అవుతున్నా ఈ జిల్లా పరిస్థితి దాదాపు ఏమీ మారలేదనే చెప్పాలి. ఉమ్మడి జిల్లా నలుదిక్కులా అనేక నదులు ఉపనదులూ ప్రవహి స్తున్నా వ్యవసాయం ఇప్పటికీ వర్షాధారంగానో లేదా భూగర్భ జలాలపైనో ఆధారపడి సాగుతోంది. ఆదిలాబాద్ జిల్లాకు పెద్ద ఎత్తున సాగునీటిని అందించడానికి ‘ప్రాణహిత– తుమ్మిడి హెట్టి’ ప్రాజె క్టుకు వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 2008లో శంకు స్థాపన చేసింది. దానికి ‘బీఆర్ అంబేడ్కర్ ప్రాజెక్టు’గా నామకరణం చేసింది. ప్రాణహిత నుండి ఎల్లంపల్లి వరకు 116 కి.మీ. కాలువ నిర్మాణానికి జిల్లాలో 1700 కోట్లు ఖర్చు చేసింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. 38 వేల కోట్లు అయ్యే మొత్తం ప్రాజెక్టుకు, ఆనాడే 9 వేల కోట్లు ఖర్చు చేశారు. 2014లో బీ(టీ)ఆర్‌ఎస్ అధి కారంలోకి వచ్చింది. నీరు లేదనే కుంటి సాకు చూపి, రీ ఇంజనీరింగ్, రీ డిజైనింగ్ పేరిట (కాళేశ్వరం) మేడి గడ్డకు ప్రాజెక్టును మార్చారు. అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు నిర్మించారు. బడ్జెట్‌ను లక్ష యాభైవేల కోట్లకు పెంచారు.
కాళేశ్వరం ప్రాజెక్టును 2019లో ముగ్గురు మంత్రులు ముచ్చటగా ప్రారంభించారు. నాలుగేళ్ల లోపే ఏడవ బ్లాకులోని అనేక గేట్లు, ఐదు అడుగుల లోతుకు పైగా కుంగిపోయాయి. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలో పునాది అడుగున కూడా భారీ లీకేజీలు, సీపేజీలు ఏర్పడ్డాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ‘డ్యామ్ సేఫ్టీ అథారిటీ’ అత్యున్నత స్థాయి ఇంజనీర్ల బృందం పరిశీలించింది. నీరు నిలువ ఉంచడం ప్రమాదమని, అత్యవసరంగా అన్ని బ్యారేజీలలోని నీటిని బయటికి పంపాలని నాటి ప్రభుత్వాన్ని కోరింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికలో కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ఘోరమైన తప్పులు చేసిందని నిర్ధారించింది. ఈ నివేదికప్రకారం: పునాదికి సంబంధించిన భూగర్భ పరీక్షలు ఏమాత్రం చేయలేదు. బలహీనమైన పునాదులపై బ్యారేజీలు నిర్మించింది. బ్యారేజీలలో వచ్చిన నీరు వచ్చినట్టు కాలువకు వెళ్లాలి. ఎక్కువైన నీరు నదిలోకి వెళ్లాలి. కానీ బలహీన పునాదులపై నిర్మించిన బ్యారే జీలలో, ప్రాజెక్టుల వలె భారీ ఎత్తున నీటిని నిలువ చేశారు. బ్యారేజీలను డ్యాముల వలె నిర్వహించారు. ఆ భారీనీటి నిలువ ఒత్తిడి, తాకిడికి పునాదులు భారీగా దెబ్బతిన్నాయి. కేవలం నాలుగు మీటర్ల పునాది క్రింద ఉన్న అడుగు పొరల్లోని ఇసుకంతా భారీ ఎత్తున కొట్టుకుపోయింది. స్పిల్‌వే నిట్టనిలువుగా పునాది నుండి మూడు ఫీట్ల వెడల్పుతో చీలిపోయి, రెండు చెక్కలయ్యింది. భూమిలో కుంగిపోయింది.
మేడిగడ్డ వలెనే సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు ఎప్పుడైనా భూమిలో కుంగిపోవచ్చు. నాడు భూమిలో కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్‌ను రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు నిశితంగా పరిశీలించి దీని నిర్మాణ ంలో చోటుచేసుకున్న అవినీతిపై విచారణ కమిషన్ వేసి సొమ్ము రికవరీ చేసి శిక్షిస్తామని ప్రకటించారు. ప్రత్యా మ్నాయంగా ప్రాణహిత తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును నిర్మించి తెలంగాణ అంతటికీ సాగునీరు ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా, ప్రాజెక్టును ప్రస్తావించడం లేదు. యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి నిర్మాణం ప్రారంభించవలసిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కాళేశ్వరం(మేడిగడ్డ) ప్రాజెక్టులో సీఎం కేసీఆర్ అవినీతిపై కాంగ్రెస్ వేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ‘పినాకీ చంద్రఘోష్ కమిషన్’ విచారణ జరుపుతోంది. నేటి రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి వారివారి నియోజకవర్గాల్లో, కొత్త ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులు వెచ్చించి శరవేగంతో నిర్మిస్తున్నారు. ఎన్ని కల ప్రణాళికలో పేర్కొన్న ప్రాణహిత – తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన కడెం ఆయకట్టును సస్యశ్యామలం చేసే ‘కుప్టి ప్రాజె క్టు’కు నిధుల కేటాయింపు కానీ, దాని కనీస ప్రస్తావన కానీ లేదు.
కుంటాల జలపాతం ఎగువన ఉన్న, కుప్టి ప్రాజెక్టుతో కడెం ఆయకట్టు చివరి వరకు గూడెం ఎత్తిపోతలు లేకుండానే పూర్తిగా రెండు పంటలకు సాగునీరు ఇవ్వవచ్చు. కడెం ఆయకట్టు సస్యశ్యామలం అవుతుంది. చెన్నూరు– ప్రాణహిత వరకు, మంచి ర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల్లోని బీడు భూము లకు సంపూర్ణ గ్రావిటీతో సాగునీరు అందుతుంది. ‘నెహ్రూ ఉత్తర కాలువ’ లేదా ‘మందాకిని ఎన్టీఆర్ కాలువ’ సాగునీటి కలలు పూర్తిగా నిజం అవుతాయి. ఎల్లంపల్లికి వచ్చే ప్రాణహిత కాలువ, కడెం (నెహ్రూ ఉత్తర లేదా మందాకిని) కాలువ ఎక్స్ (గీ) ఆకారంలో క్రాస్ అవుతూ వెళ్తాయి. బెల్లంపల్లి, చెన్నూర్ నియో జకవర్గాల బీడు భూములకు అవసరమయ్యే నీటిని ప్రాణహిత ద్వారా, కడెం కాలువకు అనుసంధానించ డానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఈ ఉత్తర కాలువకు... శ్రీరాంసాగర్ నీటినీ, సదర్మాట్ నీటినీ, ఎల్లంపల్లి నీటినీ పూర్తి గ్రావిటీతో అనుసంధానం చేయవచ్చు. కుప్టి ప్రాజెక్టు సముద్రమట్టానికి 1450 అడుగుల ఎత్తులో ఉంటుంది. కడెం ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం ఎత్తు 700 అడుగులు. అంటే కడెం కంటే 750 అడుగుల ఎత్తులో కుప్టి ప్రాజెక్టు బెడ్ లెవెల్ ఉంటుంది. కడెంకు కుప్టికి మధ్య ఉన్న దూరం కేవలం 30 కి. మీ. మాత్రమే. 750 అడుగుల ఈ వ్యత్యాసపు ఎత్తు అనేది, నీటిపారుదల పరిభాషలో భారీ ఎత్తు గానే పరిగణిస్తారు. కాలుష్యం లేని జల విద్యుత్తుకు, ఎత్తి పోతలు అసలే లేని గ్రావిటీ సాగుకు అత్యద్భు తమైన అరుదైన ప్రాకృతిక అనుకూలత! జల విద్యుత్తు భారీ ఎత్తున ఉత్పత్తి అవుతుంది. కుప్టితో కుంటాల జలపాతం సంవత్సరం అంతా నీరు ఎత్తిపోస్తూ, తెలంగాణలోనే అతి పెద్ద పర్యాటక కేంద్రంగా భారీ ఆదాయంతో కళకళలాడుతుంది. నేరేడిగొండ, ఇచ్చోడ ప్రాంతపు బీడు భూములకు ఎత్తిపోతలతో సాగునీరు ఇవ్వవచ్చు.
-నైనాల గోవర్ధన్
(వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్
మొబైల్: 97013 81799)
Comments
Please login to add a commentAdd a comment