సాగునీటి, విద్యుత్‌ ప్రాజెక్టులపైనా గురి | Special Report on Medigadda Barrage Failures: TS | Sakshi
Sakshi News home page

సాగునీటి, విద్యుత్‌ ప్రాజెక్టులపైనా గురి

Published Wed, Dec 20 2023 2:44 AM | Last Updated on Wed, Dec 20 2023 2:44 AM

Special Report on Medigadda Barrage Failures: TS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాగునీరు, విద్యుత్‌ ప్రాజెక్టుల కోసం గత పదేళ్లలో చేసిన అప్పులు, వ్యయం, కల్పించిన ఆయకట్టు, నష్టాలు తదితర అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టనుంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఈ మేరకు వివరాలు సిద్ధం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం, పాలనపరమైన అనుమతులు, ఇప్పటివరకు చేసిన ఖర్చు, ప్రతిపాదించిన ఆయకట్టు, స్థిరీకరించిన ఆయకట్టు, మిగిలిన ఆయకట్టుకు సాగునీటి సరఫరాకు కావాల్సిన నిధులు, ఇప్పటివరకు ప్రాజెక్టు ద్వారా తరలించిన జలాలు, ఇందుకు అయిన నిర్వహణ వ్యయం, ప్రాజెక్టు కోసం చేసిన మొత్తం అప్పులు వంటి అంశాలను పొందుపరిచారు.

ప్రాజెక్టుపై ఇప్పటివరకు రూ.81 వేల కోట్లకు పైగా ఖర్చు చేయగా, ఇప్పటివరకు ఎంత ఆయకట్టుకు సాగునీరు అందించారు? మిగిలిన ఆయకట్టుకు అందించడం సాధ్యమేనా? ఇందుకు ఎంత వ్యయం అవుతుంది? వంటి విషయాలతో సమాచారం తయారు చేసినట్లు చెబుతున్నారు. సీఎం సూచనల మేరకు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై ప్రత్యేక నివేదికను సైతం సిద్ధం చేసినట్లు తెలిసింది.

గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పనుల స్థితిగతులు, తెలంగాణ ఏర్పడడానికి ముందు చేసిన వ్యయం, తెలంగాణ వచ్చాక ఈ ప్రాజెక్టు విషయంలో జరిగిన నిర్లక్ష్యంపై కూడా నివేదికను రూపొందించారని అంటున్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ఉమ్మడి మెదక్‌ జిల్లాకు సాగునీరు అందించే అంశంపై అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. తుమ్మిడిహెట్టికి బదులు గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన వార్ధా బ్యారేజీ విషయంలో ముందుకు వెళ్తారా? అన్నదానిపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

క్రాప్‌ హాలిడే పైనా వివరణ 
నాగార్జునసాగర్‌ జలాశయంలో నిల్వలు అడుగంటి పోవడంతో ప్రస్తుత యాసంగి సీజన్‌లో సాగర్‌ ఎడమ కాల్వ కింద ఉన్న 6.4 లక్షల ఎకరాల ఆయకట్టులో పంటల సాగుకు విరామం (క్రాప్‌ హాలిడే) ప్రకటించాలని ఇటీవల రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కల్వకుర్తి, బీమా, పాలేరు, వైరా, మల్లూరు, లంకాసాగర్, గొల్లవాగు ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సైతం నీరు ఇవ్వలేని పరిస్థితి ఉంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు మొత్తం ఎన్ని టీఎంసీల వరద వచ్చింది? ఆశించిన మేరకు వరద రాకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? ఎన్ని టీఎంసీలు సాగు, తాగునీటి అవసరాలకు వాడారు? తదితర అంశాలపై కూడా ప్రభుత్వం వివరణ ఇవ్వనుందని తెలిసింది.   

విద్యుత్‌ సంస్థల నష్టాలు, అప్పులే ప్రధానం 
తెలంగాణ వచి్చన తర్వాత రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు తీసుకున్న అప్పులు, నష్టాలు, ఇందుకు సంబంధించి గత ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలను విశ్లేషిస్తూ విద్యుత్‌ శాఖ అధికారులు నివేదిక ఇచి్చనట్లు తెలిసింది. రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి భట్టి విక్రమార్క సోమ, మంగళవారాల్లో విద్యుత్‌ సౌధలో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ సయ్యద్‌ ముర్తుజా అలీ రిజ్వీతో సమావేశమై విద్యుత్‌ శాఖకు సంబంధించి సమీక్ష నిర్వహించారు.

కాగా ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, కాళేశ్వరం, ఇతర ఎత్తిపోతల పథకాల నిర్వహణకు వాడుకున్న విద్యుత్‌కు సంబంధించి రూ.28,140 కోట్ల కరెంట్‌ బిల్లులు బకాయి ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం. రూ.12,515 కోట్ల ట్రూఅప్‌ చార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు అనుమతించకుండా తామే వచ్చే ఐదేళ్లలో విడతల వారీగా చెల్లించేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థల (టీఎస్‌ఎనీ్పడీసీఎల్‌/టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) నష్టాలు రూ.50,275 కోట్లకు పెరిగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వివరించనున్నట్టు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement