Maoists Peace Talks ఇరువురి అజెండా ఒకటవ్వాలి! | peace talks with Maoists should be end Mutual consent | Sakshi
Sakshi News home page

Maoists Peace Talks ఇరువురి అజెండా ఒకటవ్వాలి!

Published Fri, Apr 25 2025 10:54 AM | Last Updated on Fri, Apr 25 2025 10:54 AM

peace talks with Maoists should be end Mutual consent

వామపక్ష తీవ్రవాదమైన నక్సలిజాన్ని 2026 మార్చి నాటికి సమూలంగా అంతం చెయ్యాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించి, ఆ లక్ష్యం నెర వేరేలాగా పోలీసు యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు. సాధార ణంగా బీజేపీ ప్రతిపాదిత విధా నాలను వ్యతిరేకించడమే విధానంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలు నక్సలిజంపై యుద్ధం విషయంలో మాత్రం అమిత్‌ షా కి అనుకూలంగా ఉన్నాయి. జార్ఖండ్‌  సీఎం హేమంత్‌ సోరేన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం పినరయి విజయన్‌లు కూడా మావోయిస్టుల ఏరివేతలో తాము భాగస్వాములేనని ప్రకటించారు. దాదాపుగా జాతీయ ఏకాభిప్రాయంతో మావోయిస్టుల ఏరివేత జరుగుతున్నదనేది వాస్తవం. వేల సంఖ్యలో ఉన్న పారామిలిటరీ బలగాలను ఎదుర్కోవటం మావో యిస్టులకు కుదరడం లేదు. ఈ స్థితిలో మావోయిస్టులు తెల్ల జెండా ఎత్తి లొంగిపోకుండా మేము చర్చలకు సిద్ధం అని ప్రకటించారు. 

అయితే ఈ చర్చల ప్రకటన కొత్తదేమీ కాదు. నక్స లిజం పుట్టిన తర్వాత చర్చల ప్రస్తావన ఒకసారి కన్నా ఎక్కువ సార్లే వచ్చింది. 2004లో ఆంధ్ర ప్రదేశ్‌లో రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం చర్చలు జరిపినా అవి విఫల మయ్యాయి. ముందుగా ఆయుధాలు, అడవులను వదిలి బయటకు రావాలని ప్రభుత్వం చర్చలకు నిబంధన పెడితే... రక్షణ బలగాలను ముందుగా ఉపసంహ రించుకోండి అంటున్నారు మావోయిస్టులు. చుట్టు ముట్టిన ప్రతిసారీ చర్చల ప్రతిపాదన పెట్టి కొత్త స్థావరాలను సృష్టించుకున్నారు మావోయిస్టులు అనేది ప్రభుత్వ వర్గాల వాదన. చర్చల పేరుతో బయటకు రప్పించి తమ ఆనవాళ్ళను తెలుసుకుని దాడులు
పెంచుతున్నారనేది మావోయిస్టుల ఆరోపణ. 

ఎవరి వాదనలు ఎలా ఉన్నా అడవుల్లో పోరాటం సాగుతున్నది. మావోయిస్టులు, భద్రతా దళాల సభ్యులు నేలకొరుగుతున్నారు. కొత్త తరం మావో యిజం పట్ల ఆకర్షించబడటం లేదు. అడవిబాట పట్టి తమ జీవితాలను వృథా చేసుకునే ఆలోచన నేటి యువతకు లేదు. అయినా కొందరు యువకులు మావోయిస్టులుగా మారుతున్నారంటే వారి గ్రామీణ ప్రాంతాలలో నెలకొన్న పెత్తందారీ వ్యవస్థలో బలిపశు వులు కావటమే. అలాంటి పెద్దలను వ్యక్తిగా వ్యతిరేకించలేక, పోరాడే మార్గం కనబడక నక్సల్స్‌ సహాయం కోసం అడవుల్లోకి వెళుతున్నారు. తమ వ్యక్తిగత కక్షను నక్సల్స్‌ ద్వారా తీర్చుకున్న తర్వాత వారికి ఆ ఉద్య
మంతో అవసరం లేదు. కానీ అప్పటికే పోలీసులు లిస్టులోకి ఎక్కి ఉన్న ఆ యువతీయువకులు అడవులు, ఆయుధాలను వదలలేక అక్కడే ఉంటున్నారు. ఇటీవల కాలంలో లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వస్తున్న మావోయిస్టుల కథలు ఇటువంటివే. 

నక్సల్‌ ఉద్యమం పుట్టిన నాటికి ఉన్న సామాజిక పరిస్థితులు నేడు లేవు. భూమి మీద పెత్తనం బడా భూస్వాముల చేతిలో లేదు. పలు రాష్ట్రాలలో అమలైన భూసంస్కరణలు కేంద్రం, రాష్ట్రాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు చాల వరకు మార్పును తెచ్చాయి. ఆర్థిక సంస్కరణల అమలు తర్వాత ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు వచ్చాయి. జీతాలు పెరిగాయి. యువతలో సైద్ధాంతిక రాద్ధాంతం కన్నా కెరీర్‌ ముఖ్యం అనే అభిప్రాయం పెరిగింది. అందుకే నక్సల్‌ ఉద్యమంవైపు కొత్తవారు వెళ్లడం లేదు. ఒకనాటి సైద్ధాంతిక నేతలు వయసుమళ్లి మరణించారు. కొందరు అనారో గ్యంతో చివరి దశకి చేరారు. బయటి సమాజంలో
ఉండే అవలక్షణాలు అడవుల్లోని మావోయిస్టుల్లోనూ ఉన్నాయి. శ్రమదోపిడీ, లైంగిక దోపిడీ, కుల అహంకా రాలు, అధికారాలు ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు మాజీ  మావోయిస్టుల నోటి వెంట వచ్చాయి. 

మరోవైపు నవీన ఆయుధాలు, సాంకేతికతను భద్రతా బలగాలు ప్రయోగిస్తున్నాయి. అడవిలో ఏ మూల నక్కిన నక్సలైట్‌నైనా పట్టకలిగిన సాంకేతికత వచ్చింది. గురిచూసి వారిని చంపేసే డ్రోన్స్‌ వచ్చాయి. ప్రభుత్వాలు గిరిజన ప్రాంతాల్లో రహదారులు, ఆసు పత్రులు, పాఠశాలలను నిర్మించారు. కమ్యూనికేషన్‌ టవర్లు, బ్యాంకులు ఏర్పాటు చేశారు. అభివృద్ధి ఫలా లను గిరిజనులు అనుభవించి, మావోయిస్టులకు మద్దతు తగ్గించారు. ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో గిరిజనులు 2024 ఎన్నికల్లో భారీగా ఓటింగ్‌లో పాల్గొనడం అందుకు నిదర్శనం. 

చదవండి: ఉద్యోగం కోసం వెళ్లి, 42 ఏళ్లు అక్కడే మగ్గిపోయాడు...చివరికి

అయితే ప్రభుత్వ అభివృద్ధి నమూనాను మావో యిస్టులు తిరస్కరిస్తున్నారు. అటవీ, ఖనిజ సంపదను బడా కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు, ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతూ అభివృద్ధి ముసుగులో దోచుకుంటున్నారు అనేది వారి ఆరోపణ. రహదారులనిర్మాణం, గనుల ఏర్పాటుకు, ముడి సరుకు రవాణాకు తప్పించి ఆ ప్రాంత అభివృద్ధికి పనికి రాదన్నది మావోయిస్టుల మాట. ఎవరి వాదన వారిది. వాస్తవం ఆ రెండింటి  మధ్యలో ఎక్కడో ఉంటుంది. గిరిజనుల జీవితాలు మెరుగవ్వాలంటే వారిని నలిపేస్తున్న ఇరుపక్షాలలోనూ మార్పులు రావాలి. ముందుగా ప్రభుత్వం సమాజంలో ఉన్న ఆర్థిక అవక తవకల తొలగింపునకు కూడా ఒక  నిర్దిష్ట  ప్రణాళికను ప్రకటించాలి. గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఒక స్పష్ట యోజనను ప్రకటించాలి. ఆర్థిక సంస్కరణల తర్వాత దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగాయి.  అధికారంలో ఉన్నవారి ఆదరణతో పారిశ్రామికవేత్తలు లక్షల కోట్ల సంపద సమకూర్చుకున్నారు. అదే సమ యంలో సామాన్య వర్గాలు ఆర్థికంగా చితికి పోతు న్నాయి. అధిక ధరలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అధికార యంత్రాంగం అవినీతి పెరుగుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే నక్సల్స్‌ ఉద్యమం మళ్లీ బలపడుతుంది. అవినీతి, సామాజిక, ఆర్థిక అసమాన తలను తొలగించే విధానాల అమలు మాత్రమే ప్రజ లందరినీ ఏకం చేసి, సవ్య అభివృద్ధి అజెండాకి కట్టు బడి ఉండేలా చేస్తాయి. అడవి బాట పట్టినవారిదీ, అధి కారంలో ఉన్న వారిదీ ఒకే తరహా అజెండా కాగలిగితే ఘర్షణ వాతావరణం పోయి, సమాజం ప్రశాంతంగా ఉంటుంది.

-పి. వేణుగోపాల్‌ రెడ్డి 
ఏకలవ్య ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు
pvg2020@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement