naxalism
-
నక్సలిజం కొన ఊపిరితో ఉంది: కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఛత్తీస్‌గఢ్–ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 14 మంది నక్సలైట్లు మృతిచెందడం మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘నక్సలిజానికి మరో పెద్ద ఎదురుదెబ్బ. దేశాన్ని నక్సల్ రహితం చేయాలన్న లక్ష్యం దిశగా భద్రతాబలగాలు పెద్ద విజయం సాధించాయి. సీఆర్పీఎఫ్, ఒడిశా స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, ఛత్తీస్‌గఢ్ పోలీసు బలగాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో 14 మంది నక్సలైట్లు మృతి చెందారు. నక్సల్స్ లేని భారత్ దిశగా ఇదొక ముందడుగు. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉంది..’ అని అమిత్ షా పేర్కొన్నారు.2026 నాటికి అంతం చేస్తాం: ఛత్తీస్‌గఢ్ సీఎంకేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్న డబుల్ ఇంజన్ సర్కారు నక్సలిజం అణచివేతను విజయవంతంగా కొనసాగిస్తోందని ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ పేర్కొన్నారు. ‘2026 మార్చి నాటికి నక్సలిజం అంతం చేస్తాం. ఆ దిశగా భద్రతా దళాలు ముందుకెళుతున్నాయి’ అని ఆయన తెలిపారు. -
2026కల్లా నక్సలిజం అంతం
న్యూఢిల్లీ/షహీబ్‌గంజ్ (జార్ఖండ్): దేశంలో నక్సలిజం 2026 మార్చి నాటికి పూర్తిగా అంతమైపోతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ‘‘2026 మార్చి 31లోగా నక్సల్స్ హింసను, భావజాలాన్ని దేశం నుంచి తుడిచిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. అంతకంటే ముందే నక్సలిజాన్ని అంతం చేస్తాం’’ అని పేర్కొన్నారు. హింసను విడనాడి ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. నక్సల్ హింసకు గురైన 55 మంది బాధితులనుద్దేశించి బుధవారం ఆయన మాట్లాడారు. ‘‘మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో భద్రతా దళాలు భారీ విజయాలు సాధించాయి. సమస్య ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లోని నాలుగు జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. పశుపతినాథ్ (నేపాల్) నుంచి తిరుపతి (ఏపీ) దాకా కారిడార్ ఏర్పాటు చేయాలని మావోయిస్టులు ఒకప్పుడు అనుకున్నారు. కానీ ఆ ప్రణాళికలను మోదీ ప్రభుత్వం తిప్పికొట్టింది. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర హోం శాఖ త్వరలో సంక్షేమ పథకం రూపొందిస్తుంది. ఉద్యోగాలు, ఆరోగ్య సంరక్షణ, ఇతర రంగాల్లో సంక్షేమ కార్యక్రమాల ద్వారా సాయం చేస్తుంది’’ అని వెల్లడించారు. జార్ఖండ్‌లో జేఎంఎం–కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను విపరీతంగా ప్రోత్సహిస్తోందని అమిత్ షా ధ్వజమెత్తారు. దీనికి అడ్డుకట్ట వేయని పక్షంలో మరో పాతికేళ్లలో చొరబాటుదారులే రాష్ట్రంలో మెజారిటీ ప్రజలుగా మారిపోతారని హెచ్చరించారు. స్థానిక గిరిజన సంస్కృతిని వాళ్లు సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. జార్ఖండ్‌లోని గిరి«ద్లో పరివర్తన్ యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులను రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తారు. వీటి దెబ్బకు సంతాల్ పరగణాల్లో స్థానిక గిరిజనుల జనాభా 44 శాతం నుంచి 28 శాతానికి తగ్గిందన్నారు. -
చిన్ననాటి స్నేహితులు చెరో దారిలో నడిచారు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: వాళ్లిద్దరూ చెడ్డీ దోస్తులు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత స్నేహం వారిది. ఇద్దరూ కలిసి పదో తరగతి దాకా చదువుకున్నారు. టెన్త్ పూర్తయ్యాక చెరో దారిలో నడిచారు. అది కూడా వర్గ శత్రువులుగా భావించే నక్సలిజం వైపు ఒకరు వెళ్తే, కేంద్ర పారామిలటరీ బలగాల్లోకి మరొకరు వెళ్లారు. కొన్నేళ్ల తర్వాత ఏడాది తేడాలో ఆ ఇద్దరూ అసువులు బాసారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామం పెద్ద వెంకట్‌రెడ్డి, భూమవ్వల కుమారుడైన సిద్దారెడ్డి, అదే గ్రామానికి చెందిన కంది నాగమణి, శంకరయ్య దంపతుల పెద్ద కొడుకు సిద్దరాములు ఇద్దరూ చిన్ననాటి నుంచీ మంచి స్నేహితులు. స్కూలుకైనా, వాగులో ఈతకైనా, ఆటల్లో అయినా ఇద్దరూ ఇద్దరే. అలాంటి స్నేహితులు నూనూగు మీసాల వయసులో చెరో దారిని ఎంచుకున్నారు. సిద్దారెడ్డి అలి యాస్ సిద్దన్న సమసమాజం కోసమంటూ అప్పటి పీపు ల్స్వార్ ఉద్యమంలో చేరిపోయాడు. తర్వాత కాలంలో ఆ ప్రాంత ఆర్గనైజర్‌గా చురుగ్గా పాల్గొన్న సిద్దారెడ్డి 1998లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందారు. సిద్దారెడ్డి స్నేహితుడు సిద్దరాము లు దేశ రక్షణ తన విధిగా భావించి 1990లో సీఆర్పీఎఫ్ జవా నుగా సెలెక్టయ్యాడు. ఆయన 1997 డిసెంబర్ 14న అస్సాంలోని కొక్రా జిల్లాలో బోడో తీవ్రవాదులు మందుపాతర పేల్చిన ఘటనలో తనువు చాలించాడు. సిద్దారెడ్డి స్తూపం పక్కనే సిద్దరాములు విగ్రహం...చిట్యాల గ్రామంలోకి అడుగుపెట్టగానే ప్రధాన కూడలి వద్ద రోడ్డు పక్కన స్తూపం, దాని పక్కనే విగ్రహం ఉంటాయి. గ్రామంలో సిద్దారెడ్డితో పాటు చనిపోయిన మరికొందరి పేర్లతో అమరవీరు ల స్తూపం నిర్మించారు. కాగా జవాన్ సిద్దరాములు తల్లి కంది నాగమణి తన కొడుకు విగ్రహం పెట్టాలని ఎన్నో ఏళ్లుగా ప్రయ త్నించి.. చివరకు ఏర్పాటు చేసి గతేడాది మార్చి 27న ఆవిష్కరింపజేసింది. ఇద్దరి విగ్రహాలు పక్కపక్కనే ఏర్పాటు చేయడం యా దృచ్ఛికంగా జరిగినా, దోస్తులూ పక్కపక్కనే ఉన్నట్టుంటుంది. -
Chhattisgarh Assembly Election 2023: కాంగ్రెస్ నక్సలిజాన్ని ప్రోత్సహిస్తోంది
జగదల్పూర్: కాంగ్రెస్ పార్టీ నక్సలిజాన్ని ప్రోత్సహిస్తోందని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రభుత్వ తొమ్మిదేళ్లపాలనలో వామపక్ష తీవ్రవాద ఘటనలు 52 శాతం మేర తగ్గుముఖం పట్టాయని ఆయన చెప్పారు. ఛత్తీస్‌గఢ్ సీఎం భగేల్ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌కు ఏటీఎంగా మార్చారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలన స్కాముల ప్రభుత్వంగా తయారైందని పేర్కొన్నారు. జగదల్పూర్, కొండగావ్‌లలో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీల్లో అమిత్ షా మాట్లాడారు. ‘రాష్ట్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అర్ధించటానికే మీ ముందుకు వచ్చా. స్కాములకు పాల్పడటం ద్వారా గిరిజనుల డబ్బును దోచుకున్నవారిని తలకిందులుగా వేలాడదీస్తాం’అని ఆయన అన్నారు. బీజేపీకే ఓటు వేయాలని ప్రజలను కోరిన అమిత్ షా, ‘మీ ముందు రెండు అవకాశాలున్నాయి..ఒకటి నక్సలిజాన్ని ప్రోత్సహించే కాంగ్రెస్, మరోవైపు, ఈ బెడదను నిర్మూలించే బీజేపీ. కోట్లాది రూపాయల అవినీతి సొమ్మును ఢిల్లీ దర్బార్‌కు పంపే కాంగ్రెస్.. కోట్లాది మంది పేదలకు గ్యాస్ సిలిండర్లు, మరుగుదొడ్లు, తాగునీరు, ఆరోగ్య సదుపాయాలు, రేషన్, ఇళ్లు అందజేస్తున్న బీజేపీ. ఈ రెండింట్లో మీరు ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటారు?’అని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్ ప్రజలు దీపావళి పండుగను ఈసారి మూడుసార్లు జరుపుకుంటారంటూ... మొదటిది దీపావళి రోజున, రెండోది డిసెంబర్ 3న రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక, మూడోది జనవరిలో అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తయ్యాక (శ్రీరాముడి మాతామహుల నివాసం ఛత్తీస్‌గఢ్ అని ప్రజల విశ్వాసం)అని అమిత్ షా చెప్పారు. ‘రాష్ట్రంలో బీజేపీకి అధికారమిస్తే, ఈ బెడద నుంచి పూర్తిగా విముక్తి కలి్పస్తాం. మోదీ ప్రభుత్వ పాలనలో 9 ఏళ్ల కాలంలో నక్సల్ సంబంధ హింస 52% తగ్గగా నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య 62% మేర క్షీణించింది’అని ఆయన వివరించారు. ఈ ప్రాంతంలో జరిగే తీవ్రవాద సంబంధ హింసాత్మక ఘటనల్లో ప్రాణాలు కోల్పోయే పోలీసులైనా, పౌరులైనా, నక్సలైట్లయినా అందరూ గిరిజనులేనని ఆయన చెప్పారు. -
తుది దశకు మావోయిస్టులపై పోరు
జగదల్పూర్: దేశంలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతోన్న పోరాటం తుది దశకు చేరుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. రేపో మాపో ఈ పోరాటంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది చేస్తున్న ఆత్మత్యాగాలే ఈ పోరాటంలో అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్) 84వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లుగా నక్సలిజంపై భద్రతా సిబ్బంది పోరాటం చేస్తున్నారని విజయం సాధించే దిశగా ముందడుగు వేశారని అన్నారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఎదురయ్యే అడ్డంకుల్ని అధిగమించడంలో సీఆర్పీఎఫ్ జవాన్ల పాత్ర ప్రశంసనీయమని కితాబునిచ్చారు. -
‘నక్సలిజాన్ని రూపుమాపేందుకు ఏం చేస్తున్నారు?
సాక్షి, అమరావతి: నక్సలిజం సమస్యను రూపుమాపేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని హైకోర్టు మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో జరిపిన సంప్రదింపుల వివరాలను ఓ నివేదిక రూపంలో తమ ముందుంచాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీని ఆదేశించింది. ఈ సమస్యకు ఓ పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని పేర్కొంది. ఇటీవల విశాఖ జిల్లా మాదినమల్లు అటవీ ప్రాంతంలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో గాయపడి, కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న మావోయిస్టు భవానీని మెరుగైన చికిత్స నిమిత్తం మంచి వైద్య సదుపాయాలున్న ఆసుపత్రికి తరలించాలని హోంశాఖను ఆదేశించింది. ఈ విషయంలో తీసుకున్న చర్యలను కూడా వివరించాలని సూచించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఎదురు కాల్పుల్లో ఎంతమంది పోలీసులు.. ఎంతమంది నక్సలైట్లు చనిపోయారో తెలియచేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ‘పిల్’గా హెబియస్ కార్పస్ పిటిషన్ మాదినమల్లు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిన తరువాత మావోయిస్టు పార్టీ అగ్రనేత అరుణ, భవానీ, గుమ్మిరేవుల మాజీ సర్పంచి నారాయణరావు ఆచూకీ తెలియడం లేదని, పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోందని, అందువల్ల వారిని కోర్టులో హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ పౌర హక్కుల సంఘం నేత చిలుకా చంద్రశేఖర్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ హెబియస్ కార్పస్ వ్యాజ్యాన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యంగా(పిల్) మారుస్తున్నామని స్పష్టం చేసింది. -
రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. నక్సలిజంపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరవుతారు. ఉదయం 7:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకుంటారు. సీఎం జగన్ ఉదయం 11 గంటలకు కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశానికి హాజరవుతారు. రాష్ట్రాల్లో నక్సలిజం సమస్యపై తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సారథ్యంలో సమావేశం జరుగుతుంది. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల సీఎం లు, ఇతర కీలక పోలీసు అధికారులు దీనిలో పాల్గొంటారు. మన రాష్ట్రంలో ఆంధ్ర-ఒడిశా సరిహద్దుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న నక్సలిజం సమస్యపై చర్చ జరగనుంది. సాయంత్రం వరకూ ఈ సమావేశం కొనసాగుతంది. మంగళవారం ఉదయం బయల్దేరి మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరిగి విజయవాడ చేరుకుంటారు. -
నక్సలిజమ్ బ్యాక్‌డ్రాప్?
చిరంజీవి ‘సైరా: నరసింహారెడ్డి’ అక్టోబర్‌లో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయనున్నారు. కొరటాల గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా సోషల్ డ్రామాగా తెరకెక్కనుంది. ప్రచారంలో ఉన్న ప్రకారం ఈ చిత్రం నక్సలిజమ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతోందని తెలిసింది. ఇందులో చిరంజీవి డ్యూయెల్ రోల్లో కనిపించనున్నారు. ఒక పాత్ర నక్సలిజమ్ చుట్టూ తిరుగుతుందని, ఆ పాత్ర కోసం చిరంజీవి సాల్ట్ అండ్ పెప్పర్ (అక్కడక్కడా నెరిసిన జుట్టు) లుక్‌లో కనిపిస్తారని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మించనున్న ఈ సినిమాలో నయనతార కథానాయికగా ఎంపిక అయ్యారట. చిరంజీవి పుట్టిన రోజున (ఆగస్ట్ 22) ఈ సినిమా ప్రారంభం కానుందని తెలిసింది. సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారట. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. -
మానవహక్కులకు దిక్కేది?
దాదాపు అర్ధశతాబ్దం కిందట ఆరంభమైన నక్సలైట్ ఉద్యమంతో పాటే మానవ హక్కుల నేతల కార్యకలాపాలు కూడా ఊపందుకున్నాయి. నక్సౖ ట్లు పోలీసులతో జరిగిన నిజమైన ఎన్కౌంటర్లో చనిపోతే మానవ హక్కుల కార్యకర్తలు ప్రశ్నించేవారు కాదు. పట్టుకొని కాల్చి చంపడాన్ని నకిలీ ఎన్‌కౌంటర్‌గా అభివర్ణించి దాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తారు. పట్టుకున్న నక్సలైట్‌ను న్యాయస్థానంలో హాజరుపరిచి నిజమైన నక్సలైట్ అని నిర్ధారించి చట్టప్రకారం శిక్ష విధించమని వారు అడుగుతారు. నక్సలైట్ లేదా మావోయిస్టు ఉద్యమానికి మూలకారణం రాజకీయార్థికమనీ, దీనిని శాంతి,భద్రతల సమస్యగా పరిగణించకుండా మూలాలకు వెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి చేయాలనీ రాజ్యాంగం పట్ల విశ్వాసం, విధేయత ఉన్నవారు కోరుతూ వచ్చారు. మావోయిస్టులకు ఈ రాజ్యాంగంపైన విశ్వాసం లేదు, ఈ వ్యవస్థను కూలదోసి నూతన వ్యవస్థను నిర్మించాలనేది వారి సిద్ధాంతం, అటువంటప్పుడు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు వారికి ఎట్లా వర్తిస్తాయని ప్రశ్నించేవారు మొదటి నుంచీ ఉన్నారు. మావోయిస్టులకు రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదు సరే, రాజకీయ నాయకులకూ, పోలీసు అధికారులకూ, సాధారణ పౌరులకూ రాజ్యాంగంపట్ల విశ్వాసం ఉన్నది కనుక ప్రభుత్వం తీసుకునే ప్రతిచర్యా రాజ్యాంగబద్ధంగానే ఉండాలి. మావోయిస్టులపైన పోరాటం పేరుతో రాజ్యాంగాన్ని ఉల్లంఘించకూడదు. హక్కులను కాలరాయకూడదు. రాజ్యాంగాన్ని ప్రభుత్వ నిర్వాహకులే ఉల్లంఘిస్తే వారికీ, మావోయిస్టులకూ తేడా ఏమున్నది? ఈ రకమైన ప్రశ్నలూ, సమాధానాలూ ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్న 1960–90లలో రాష్ట్రం అంతటా వినిపించేవి. వివిధ కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్ ఉద్యమం తగ్గుముఖం పట్టి ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలలోనూ, ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోనూ, మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలోనూ కేంద్రీకృతమైంది. ఈ లోగా దేశంలో అసహన వాతావరణం ప్రబలింది. మావోయిస్టులను పట్టుకొని కాల్చిచంపడాన్ని (‘ఎన్కౌంటర్’ చేయడాన్ని) ప్రశ్నించేవారి నోరు మూయించే వాతావరణం వచ్చింది. మానవ హక్కుల కార్యకర్తలని మావోయిస్టుల సానుభూతిపరులుగానో లేదా మావోయిస్టులుగానో అభివర్ణించడం, ‘సో కాల్డ్ హ్యూమన్‌రైట్స్ యాక్టివిస్ట్స్’ అంటూ ఎద్దేవా చేయడం ఆనవాయితీగా మారింది. ప్రస్తుత రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్న రోజుల్లో ‘రొమాన్సింగ్ విత్ మావోయిజం’ అంటూ ఒక వ్యాసాన్ని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో రాశారు. చత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను మావోయిస్టులు మందుపాతర పేల్చి చంపినప్పుడు మానవ హక్కుల నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటూ ప్రశ్నించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపకురాలు నందినీ సుందర్, సామాజిక కార్యకర్త స్వామీ అగ్నివేష్, మానవ హక్కుల నేతలు హిమాన్షు కుమార్, సోనీ సోరీ, బేలాభాటియా సుక్మా ఘటనను ఖండించారు. చనిపోయిన జవాన్ల గౌరవార్ధం బిలాస్పూర్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. సన్నగిల్లిన సామాజిక స్పృహ 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత, విదేశాలలో చదివే అవకాశాలు పెరిగిన అనంతరం యువత దృష్టి చదువుల మీదికీ, వ్యాపారంపైకీ మళ్ళింది. సామాజిక స్పృహ క్రమంగా సన్నగిల్లింది. విద్యాసంస్థల నుంచి నేరుగా నక్సలైట్ ఉద్యమంలోకి చేరే యువతీయువకుల సంఖ్య తగ్గిపోయింది. నాయకుల నేపథ్యం ఏమైనప్పటికీ దళసభ్యులు అధికంగా ఆదివాసీలూ, దళితులే. పోరాటం సైతం వారిదే. ఉద్యమం ఉనికి అడవి ప్రాంతాలకే పరిమితమైపోయింది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభుత్వానికీ, మావోయిస్టు పార్టీకీ మధ్య చర్చలు విఫలమైన తర్వాత ఈ వ్యవహారంలో రాజీకి ఆస్కారం లేదనీ, ఉత్తరదక్షిణ ధ్రువాలను కలపాలనే ప్రయత్నం వ్యర్థమనే అభిప్రాయం ఏర్పడింది. మావోయిస్టు నాయకులకు ఆశ్రయం ఇచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది. పోలీసులు వ్యూహం మార్చారు. మావోయిస్టుల ఆచూకీ తెలియగానే గ్రామాన్ని చుట్టుముట్టి గ్రామీణులను హింసించే ప్రక్రియకు స్వస్తి చెప్పారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను పటిష్ఠం చేసుకొని మావోయిస్టుల గుట్టుమట్టులు తెలుసుకొని ‘ఎన్కౌంటర్’ చేయడం ద్వారా ఏరివేయడం ఆరంభించారు. ఆ దశ కూడా ముగిసింది. ఛత్తీస్‌గడ్‌లోనూ, మహారాష్ట్రలోనూ దాడులూ, ప్రతిదాడులూ సాగుతున్నాయి. చంపుడు పందెం సాగుతోంది. ఎవరి లెక్కలు వారు సరి చూసుకుంటున్నారు. సాధించే అవకాశం లేని లక్ష్యం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేస్తున్న మావోయిస్టులను సమర్థించేవారు సమాజంలో కొందరు ఉంటారు. దానిని రాజకీయార్థిక సమస్యగా గుర్తించి పరిష్కరిస్తే సంతోషించేవారే ఎక్కువ మంది. మావోయిస్టులతో వ్యవహరించే విషయంలో రాజ్యాంగం ప్రసాదించిన మానవ హక్కులనూ, 1993 మానవ హక్కుల చట్టాన్నీ ఉల్లంఘించరాదనే నియమాన్ని ప్రభుత్వాలు తు.చ. తప్పకుండా పాటించాలనే హక్కుల కార్యకర్తలు కోరుతున్నారు. హక్కుల నాయకులలో సైతం వ్యత్యాసం ఉంటుంది. ఎటువంటి హింసనైనా నిర్ద్వంద్వంగా ఖండించేవారు ఒక బాపతు. రాజ్యం బలమైనదీ, రాజ్యాంగానికి కట్టుబడి నడవవలసిందీ కనుక రాజ్యహింసకు ప్రతిగానే మావోయిస్టుల హింస ఉంటుందని భావించేవారూ ఉన్నారూ. వారు వ్యక్తిగతంగా హింసావాదులు కారు. మావోయిస్టుల హింసను సైతం ఖండిస్తారు. ప్రముఖ హక్కుల నాయకుడు కె బాలగోపాల్ నక్సలైట్ల హింసావాదాన్ని కూడా గట్టిగా వ్యతిరేకించారు. హక్కుల నేతల పట్ల యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు కఠిన వైఖరిని అవలంబించాయి. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో హక్కుల కార్యకర్తలపైన ఒత్తిడి పెరిగింది. మావోయిజాన్ని రూపుమాపడం బదులు మావోయిస్టులను నిర్మూలిస్తామంటూ దేశీయాంగ మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ ప్రకటిస్తున్నారు. అండాసెల్‌లో సాయిబాబా ఈ ధోరణికి నిదర్శనమే పన్సారే, కల్బుర్గీ, దభోల్కర్, గౌరీ లంకేశ్ వంటి హక్కుల నాయకుల అమానుష హత్యలు. ఢిల్లీ విశ్వవిద్యాయం మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకూ, మరి కొందరికీ యావజ్జీవ శిక్ష విధించి నాగపూర్ సెంట్రల్ జైలులోని అండాసెల్‌లో నిర్బంధించారు. తొంభై శాతం శారీక నిస్సత్తువ కలిగి, వీల్‌చైర్‌కే పరిమితమైన వ్యక్తిని ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి కుట్ర చేసినవాడిగా పరిగణించి కనీస సౌకర్యాలు లేని సెల్లో నిర్బంధించి నరకం చూపిస్తున్నారు. మహారాష్ట్ర హైకోర్టు బెయిల్ దరఖాస్తును తిరస్కరించినప్పుడు సాయిబాబా తరఫున సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. సుప్రీంకోర్టు 2016 మార్చిలో మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వకేట్ జనరల్‌కు తలంటింది. ‘నిందితుల పట్ల మీరు చాలా అన్యాయంగా వ్యవహరించారు,’ అంటూ జస్టిస్ జేఎస్ ఖేహార్, జస్టిస్ నాగప్పన్‌లతో కూడిన సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది. తర్వాత మరో కేసు బనాయించి జైలులో పెట్టారు. సాయిబాబా ఆరోగ్యం క్షిణించిందనీ, వైద్యం అందకపోతే ప్రాణాలు దక్కవనీ భార్య వసంత చేసిన విజ్ఞప్తులు పాలకుల చెవికి ఎక్కలేదు. ఆయనను తక్షణం విడుదల చేసి, వైద్య సదుపాయం సమకూర్చాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి ప్రవీణులు మోదీ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రచురించే ‘డీయూ బీట్’ పత్రికలో ‘కలిసే నేరస్థులుగా ఉందాం సార్’ (డియర్ ప్రొఫెసర్, లెట్స్ బి క్రిమినల్స్ టుగెదర్) అనే శీర్షికతో సంపాదకీయం రాశారు. ప్రముఖ కవి, విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు (వీవీ) ఇంటిలో, ఆయన బంధువుల ఇళ్ళలో పోదాలు జరిపి, ఆయనను అరెస్టు చేసి పుణె జైలుకు తరలించిన సంగతి విదితమే. భీమా కోరేగాం హింసకు కారకులని చెబుతూ ఒక కేసు పెట్టారు. తర్వాత మోదీ హత్యకు కుట్ర చేశారని మరో కేసు పెట్టారు. ఈ కుట్రలో ఎం–4 రైఫల్ కొనుగోలు చేయడానికి అవసరమైన ఎనిమిది కోట్ల రూపాయలు సమకూర్చే బాధ్యత వీవీ స్వీకరించారని ఆరోపణ. ఆయనకు బెయిల్ ఇప్పించాలనే ప్రయత్నం ఫలించడం లేదు. 79 సంవత్సరాల వీవీ అనారోగ్యం కారణంగాæ జైలులో ఉండలేకపోతున్నారనీ, ఆరోపణలు నిరాధారమైనవనీ చెబుతూ వీవీ శ్రీమతి హేమలత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌కి బహి రంగ లేఖ రాశారు. కడచిన 45 సంవత్సరాలలో వీవీపైన 25 కేసులు బనాయించారనీ, వాటిలో 13 కేసులలో సుదీర్ఘమైన విచారణ తర్వాత వీవీని నిర్దోషిగా కోర్టులు ప్రకటించాయనీ, తక్కిన 12 కేసులనూ సాక్ష్యాధారాలు బొత్తిగా లేనికారణంగా ప్రభుత్వాలు ఉపసంహరించుకున్నాయనీ హేమలత వివరించారు. జస్టిస్ గొగోయ్ నుంచి స్పందన లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)కు కూడా బహిరంగ లేఖ రాశారు. 1968 నుంచి యాభై సంవత్సరాలుగా ప్రత్యేక తెలంగాణ వాదనను వీవీ బలపరిచారని గుర్తు చేశారు. 2005 సెప్టెంబర్‌లో చంచల్గూడా జైలులో ఉన్న వీవీని చూసేందుకు కేంద్ర మంత్రిగా ఉండిన కేసీఆర్ నాటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన అభ్యంతరాలను లెక్క చేయకుండా వెళ్ళిన సంగతి జ్ఞాపకం చేశారు. ఫలితం లేదు. ఈ హక్కుల నేతల గురించి ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు ప్రస్తావించలేదు. సమాజం స్పందించడం లేదు. ఎవరి గొడవ వారిది ‘మీరు చెప్పేదానిని నేను ఆమోదించను కానీ మీకు చెప్పడానికి ఉన్న హక్కును చనిపోయేవరకూ కాపాడతా (I disapprove of what you say, but I will defend to death your right to say it) అంటూ ఫ్రెంచ్ తత్వవేత్త వోల్తేర్ చెప్పిందే ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణం. ఛత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం యధేచ్ఛగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా పోలీసు బలగాలనూ, నక్సలైట్ల వ్యతిరేక ప్రైవేటు సాయుధ బలాలనూ (సల్వాజుడుం) వినియోగించింది. మానవ హక్కులను హరించడాన్ని ప్రశ్నించిన చరిత్రకారుడు రామచంద్రగుహా, నందినీ సుందర్, స్వామీ అగ్నివేష్, మాజీ ఉన్నతాధికారి ఇఏఎస్ శర్మలను మావోయిస్టు సానుభూతిపరులుగా అభివర్ణించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపడుతూ 2011లో చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. జస్టిస్ బి సుదర్శనరెడ్డి, ఎస్ఎస్ నిజ్జర్‌తో కూడిన ఇద్దరు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలిస్తూ నక్సలైట్ లేదా మావోయిస్టు ఉద్యమం మూలాలలోకి వెళ్ళింది. మానవ హక్కులకోసం ప్రశ్నించే ప్రతి వ్యక్తినీ అనుమానించి మావోయిస్టుల సానుభూతిపరులుగా ముద్రవేయడం, వారిపైన ఉక్కుపాదం మోపడం తప్ప మరో మార్గం లేదని ఛత్తీస్‌గఢ్ సర్కార్ తరఫున వాదించడం తమకు విస్మయం కలిగిస్తోందని బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ సమస్యకు మూలం, అందువల్లనే పరిష్కారం, వేరే చోట ఉన్నది (The root cause of the problem, and hence its solution, lies elsewhere)అని స్పష్టం చేశారు. మానవ హక్కుల గురించి మాట్లాడమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాజ్యానికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా, దేశద్రోహంగా పరిగణిస్తున్న ఈ రోజులలో న్యాయం ఎక్కడ దొరుకుతుంది? హేమలత లేఖకు సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి వెంటనే స్పందించకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఎన్నికల జాతర జరుగుతోంది. వివిధ పార్టీల నాయకులు లక్ష్మణరేఖ దాటి ఒకరిపైన ఒకరు యధాశక్తి బురద చల్లుకుంటున్నారు. ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఎన్నికల సంఘం నిర్ణయం చెప్పకపోయినా, చెప్పిన నిర్ణయం తమకు నచ్చకపోయినా సుప్రీంకోర్టు తలుపు తడుతున్నారు. దీనికి తోడు ప్రధాన న్యాయ మూర్తిపైనే లైంగికవేధింపుల ఆరోపణ (లేదా కుట్ర)పైన విచారణ. సర్వోన్నత న్యాయస్థానంలో ఊపిరి పీల్చుకునేందుకు కూడా తీరిక లేదు. ఎన్నికల సంఘం నియంత్రణ, సుప్రీంకోర్టు అభిశంసనలను ఖాతరు చేయకుండా ప్రచారాంకంలో అమీతుమీ తేల్చుకునే అంతిమ ఘట్టంలో ఒక వైపు ప్రధాని నరేంద్రమోదీ, మరో వైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మోహరించి వాగ్బాణాలు సంధిస్తూ, పరస్పరం గాయపరుచుకుంటూ, రక్తం కళ్ళజూస్తూ పోరాటాన్ని రక్తికట్టిస్తు న్నారు. పాకిస్తాన్‌పైన సర్జికల్ స్ట్రయిక్స్ మేము చేశామంటే మేము చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ రంధిలో మానవ హక్కులను ఎవరు పట్టించుకుంటారు? సాయిబాబానూ, వరవరరావునీ విడుదల చేయాలన్న లేదా కనీసం బెయిలు ఇప్పించాలన్న న్యాయమైన విన్నపాలను ఎవరు వినిపించుకుంటారు? కె. రామచంద్రమూర్తి -
కరువు గడ్డ.. ఆధిపత్యాలకు అడ్డా
సాక్షి, కొత్తకోట(చిత్తూరు) : జిల్లాలోనే కరువుకు పెట్టింది పేరు తంబళ్లపల్లె. వెంటాడే వరుస కరువు.. ఉపాధి కోసం ఊళ్లు విడిచి వెళ్లే జనం..ఇక్కడే కనిపిస్తారు. ఇదంతా నాణేనికి ఒకవైపు. అయితే తంబళ్లపల్లె అంటే దశాబ్దాల తరబడి రాజకీయ పోరు రాజుకుంటూనే ఉంది. ఇక్కడ ఎన్నికల్లో వర్గపోరు దే కీలకపాత్ర. ఏ ఎన్నిక జరిగినా..ఎప్పుడు ఏమి జరుగుతుందోననే భయం. వర్గరాజకీయాలే కాక, ఆధిపత్యం కోసం జరిగిన హత్యా రాజకీయాలకు ఎందరో బలయ్యారు. 1980–90 దశాబ్దాల మధ్య నడచిన రాజకీయ వర్గపోరుతో ఇక్కడి ప్రజ ల జీవితాలు భయంలోకి నెట్టబడ్డాయి. జీవనప్రమాణాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడలేదు. ఆధిపత్యం చెలాయించడానికి జరిగిన రాజకీయ క్రీడలో ఎందరో బలయ్యారు. ఈ పరిస్థితుల్లో పీ పుల్స్వార్ ఉద్యమం తంబళ్లపల్లెలో పురుడు పో సుకుని నక్సల్ ఉద్యమానికి బీజం పడింది. ఇదీ తంబళ్లపల్లె నియోజకవర్గం రాష్ట్ర, జిల్లా రాజకీయాల్లో తంబళ్లపల్లె నియోజకవర్గానికి ఘన చరిత్రే ఉంది. కంటిచూపుతో రాజకీయాలు శాసించిన నేతలున్న నియోజకవర్గమిది. జిల్లాలో మారుమూలన, కర్ణాటక, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లా సరిహద్దులోని ఈ నియోజకవర్గంలో ఆధిపత్య రాజకీయాలు నడిచాయి. 1952లో తొలి నియోజకవర్గంగా బి.కొత్తకోట మండలంలోని గట్టు కేంద్రంగా ఏర్పడింది. తర్వాత 1955లో తంబళ్లపల్లె కేంద్రంగా పెద్దమండ్యం, తంబళ్లపల్లె, ములకలచెరువు, పెద్దతిప్పసముద్రం మండలాలు, బి.కొత్తకోట మండలంలోని ఐదు పంచాయతీలతో నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో జరిగిన పునర్విభజనతో మదనపల్లె నియోజకవర్గంలోని కురబలకోట మండలం, బి.కొత్తకోట మండలంలోని మిగిలిన ఆరు పంచాయతీలను కలిపి ఆరు మండలాలతో తంబళ్లపల్లె నియోజకవర్గం ఏర్పాటు చేశారు. టీఎన్, కలిచర్ల కుటుంబాలదే పైచేయి నిత్య కరువు, వర్గపోరుకు నిలయమైన తంబళ్లపల్లె రాజకీయాల్లో టీఎన్, కలిచర్ల కుటుంబాలదే పైచేయి. తొలిసార్వత్రిక ఎన్నికలు 1952 నుంచి 2004 వరకు ఎమ్మెల్యే పదవి విషయంలో వీరిమధ్యనే పోటీ. ఎమ్మెల్యే, రాజంపేట ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన చరిత్ర టీఎన్ కుటుంబానిదే. ఈ కుటుంబం నుంచి టీఎన్ రామకృష్ణారెడ్డి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత ఒకసారి ఎంపీగా, ఐదుసార్లు ఎమ్మెల్యేలుగా ఈ కుటుంబీకులే గెలిచారు. ఒకసారి టీఎన్ కుటుంబం, ఒకసారి కలిచర్ల కుటుంబం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసి ఎమ్మెల్యేలయ్యారు. 1983లో రాష్ట్రమంతా ఎన్టీఆర్ ప్రభంజనం ఉంటే తంబళ్లపల్లెలో టీఎన్.శ్రీనివాసులురెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. ఈ రెండు కుటుంబాల నడుమ 1978లో సాధారణ కుటుంబానికి చెందిన ఆవుల మోహన్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున ఒకసారి, 1985 నుంచి జరిగిన ఎన్నికల్లో అనిపిరెడ్డి వెంకట కుటుంబం నుంచి ఏవీ లక్ష్మీదేవమ్మ రెండుసార్లు, ఆమె తనయుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఒకసారి టీడీపీ తరఫున ఎమ్మెల్యేలు అయ్యారు. 1989 నుంచి తంబళ్లపల్లె రాజకీయాల ను శాసించి ఐదుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా గెలిచిన టీఎన్ కుటుంబం, నాలుగుసార్లు ఎ మ్మెల్యేగా గెలుపొందిన కలిచర్ల కుటుంబం 2014 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. నక్సలిజానికి ఆజ్యం నియోజకవర్గంలో 1980–90 దశాబ్దాల్లో నక్సలిజం పురుడు పోసుకుంది. జిల్లాలో పీపుల్స్‌వార్ కార్యకలాపాలు పుట్టింది ఇక్కడే. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తంబళ్లపల్లె మండలంలోని అన్నగారిపల్లెలో నక్సలైట్ల ధర్మగంట ఏర్పాటు ఒక అధ్యాయం. అన్యాయానికి గురైన వారు ఈ గంట మోగిస్తే రాత్రివేళల్లో అన్నలు పల్లెలోకి వచ్చి తీర్పులు ఇచ్చేవారు. భూ సమస్యలపై జరిగిన వివాదాల్లో ములకలచెరువు, తంబళ్లపల్లె మండలాల్లో నక్సలైట్లు, వారి వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన సంఘటనల్లో 13 మంది చనిపోయారు. నక్సలైట్లకు వ్యతిరేకంగా చౌడసముద్రంలో రైతు, రైతు కూలీ సమన్వయ సంఘం ఏర్పాటైన తర్వాత వరుస హత్యలు జరిగాయి. పీపుల్స్‌వార్ దళాలు పేదలతో కలిసి చౌడసముద్రంపై జరిపిన దాడిలో ముగ్గురిని హతమార్చారు. పీపుల్స్‌వార్ జిల్లా కార్యదర్శులుగా చౌడసముద్రం ఎల్వీ రమణ, కలిచర్లకు చెందిన కృష్ణప్ప, మల్లూరివాండ్లపల్లెకు చెందిన రామచంద్రారెడ్డి పనిచేశారు. తర్వాత కృష్ణప్ప రాయలసీమ కార్యదర్శిగా పనిచేశారు. జొన్నచేనువారిపల్లె వేమనారాయణరెడ్డి పీపుల్స్‌వార్‌తో విభేదించి కొత్తగా పీపుల్స్‌వార్ విముక్తి పథం ఏర్పాటు చేశారు. 1984లో తంబళ్లపల్లె సమీపంలో జిల్లా వార్ ప్లీనరీలో కొండపల్లె సీతారామయ్య హాజరయ్యారు. -
మూడేళ్లలో నక్సలిజం అంతం
-
మూడేళ్లలో నక్సలిజం అంతం
లక్నో: రాబోయే మూడేళ్లలో దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఉగ్రవాదులు, వామపక్ష తీవ్రవాదులను ఎదుర్కోవడంలో సీఆర్పీఎఫ్ బలగాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని కితాబిచ్చారు. సీఆర్పీఎఫ్ అనుబంధ విభాగమైన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) 26వ వార్షికోత్సవ వేడుకల్లో రాజ్‌నాథ్ మాట్లాడుతూ..‘ఆ రోజు ఎంతో దూరంలో లేదు. రాబోయే 2–3 ఏళ్లలో దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తాం. గతంలో దేశవ్యాప్తంగా 126 జిల్లాల్లో తీవ్రవాదుల ప్రాబల్యముంటే.. ఈ సంఖ్య ప్రస్తుతం 10 నుంచి 12 జిల్లాలకు పడిపోయింది. మీ (సీఆర్పీఎఫ్ జవాన్ల) అంకితభావం, ధైర్యం, కృషి కారణంగానే ఇది సాధ్యమైంది. ఆర్ఏఎఫ్ బలగాలు స్పందించడంలో వేగంగా ఉండాలే తప్ప ప్రజలతో దురుసుగా వ్యవహరించకూడదు’ అని తెలిపారు. దేశంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఆయా రాష్ట్రాల పోలీసులతో కలిసి సీఆర్పీఎఫ్ విశేష కృషి చేస్తోందని ప్రశంసిం చారు. భద్రతాబలగాలు 2018లో ఇప్పటివరకూ 131 మంది ఉగ్రవాదులు, వామపక్ష తీవ్రవాదులను మట్టుబెట్టాయని రాజ్‌నాథ్ తెలిపారు. దీంతోపాటు 1,278 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరో 58 మంది లొంగిపోయారని వెల్లడించారు. జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. కశ్మీరీ యువకులు ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారనీ, అయినా రాష్ట్రంలో సీఆర్పీఎఫ్ బలగాలు శాంతిభద్రతలను పరిరక్షిస్తున్నాయని కితాబిచ్చారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో యాపిల్ కంపెనీ మేనేజర్‌ను పోలీసులు కాల్చిచంపడంపై పరోక్షంగా స్పందిస్తూ.. ‘ఆందోళనలు, అల్లర్ల సందర్భంగా ఆర్ఏఎఫ్ బలగాలు సత్వరం స్పందించాలే తప్ప ప్రజలతో దురుసుగా, నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. సుశిక్షితులైన భద్రతాబలగాలు ప్రజలతో దురుసుగా ప్రవర్తించి కూర్రులుగా గుర్తింపు తెచ్చుకోకూడదు. విధి నిర్వహణ సందర్భంగా ప్రజలతో ఎప్పుడు, ఎంతమేరకు, ఎలా వ్యవహరించాలన్న అంశంపై జవాన్లకు అవగాహన ఉండాలి’ అని రాజ్‌నాథ్ వెల్లడించారు. దేశంలో అల్లర్లు, ఆందోళనలను అదుపు చేసేందుకు 1991లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హైదరాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్, అలహాబాద్, ముంబై, అలీగఢ్, కోయంబత్తూర్, జంషెడ్పూర్, భోపాల్, మీరట్‌లో ఆర్ఏఎఫ్ బెటాలియన్లను మోహరించారు. -
హక్కుల కోసం నక్సల్స్‌లో చేరొద్దు
బాబాసాహెబ్ మనకు రాజ్యాంగాన్నిఇచ్చారు. మీ హక్కులను కాపాడేలా భరోసానిచ్చారు. దీన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. మీరు తుపాకీ మోయాల్సిన పనిలేదు. అది మీ జీవితాలను నాశనం చేస్తుంది. ఉద్యమాన్ని నడుపుతున్న వారు మీలో ఒకరు కాదు. ఆ నాయకులంతా భద్రంగా ఉంటూ.. మీ పిల్లలనుబలి చేస్తున్నారు. జంగాలా (బీజాపూర్): సమాజంలోని వెనుకబడిన తరగతుల హక్కుల పరిరక్షణ కోసం భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్.. రాజ్యాంగంలో ప్రత్యేకాంశాలను జోడించారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పేదలు, వెనుకబడిన వర్గాల వారు తమ హక్కులను పొందటానికి అంబేడ్కరే కారణమన్నారు. ఆయన రాసిన రాజ్యాంగం కారణంగానే తను ఈ స్థాయికి ఎదిగినట్లు మోదీ తెలిపారు. ‘సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గానికి చెందిన ఓ పేదరాలి కుమారుడు.. ప్రధాని కావటం నిజంగా బాబాసాహెబ్ అంబేడ్కర్ కారణంగానే సాధ్యమైంది’ అని ప్రధాని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతమైన బీజాపూర్ జిల్లా జంగాలాలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని అంబేడ్కర్ జయంతి సందర్భంగా మోదీ ప్రారంభించారు. ‘అంబేడ్కర్ విదేశాల్లో గొప్ప చదువు చదివారు. దీని కారణంగా ఏదో ఓ అభివృద్ధి చెందిన దేశంలో స్థిరపడి.. దర్జాగా బతికేసేందుకు అవకాశం ఉంది. కానీ అలా చేయలేదు. స్వదేశానికి తిరిగొచ్చి.. దళితుల జీవితాలను ఉద్ధరించేందుకు తన జీవితాన్నే అంకితం చేశారు. అంబేడ్కర్ కారణంగానే.. నేడు దళితులు తమ హక్కులను పొందుతూ గౌరవంగా జీవిస్తున్నారు. ప్రభుత్వం కూడా వారి ఆకాంక్షలను పూర్తి చేసేందుకు పనిచేస్తోంది’ అని మోదీ పేర్కొన్నారు. యువతీ, యువకులు తమ హక్కులను కాపాడుకునేందుకు నక్సలిజంలో చేరొద్దని ఆయన సూచించార. అంబేడ్కర్ చూపిన బాటలో.. మావోయిస్టుల కారణంగానే వీరి ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుబడిందన్నారు. హక్కుల సాధనకు యువకులు నక్సలిజం వైపు అడుగులు వేస్తున్నారని.. అది సరైన మార్గం కాదని మోదీ తెలిపారు. ‘బాబాసాహెబ్ మనకు రాజ్యాంగాన్నిచ్చారు. మీ హక్కులను కాపాడేలా ఆయన భరోసా ఇచ్చారు. ఈ భరోసాను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. మీరు (యువతీ, యువకులు) తుపాకీ మోయాల్సిన పనిలేదు. అది మీ జీవితాలను నాశనం చేస్తుంది. ఉద్యమాన్ని నడుపుతున్న వారు ఎక్కడినుంచో వచ్చారు. వారు మీలో ఒకరు కాదు. అడవుల్లో ఆ నాయకులంతా భద్రంగా ఉంటూ.. మీ పిల్లలను బలిపశువులు చేస్తున్నారు’ అని ప్రధాని పేర్కొన్నారు. ఇలాంటి పేదలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వారి హక్కులను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మోదీ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే.. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. పీహెచ్‌సీల దశ మారుస్తాం.. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా.. లక్షా 50వేల గ్రామాల్లోని ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) స్థాయి, సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో పనిచేయనున్నారు. 2022 కల్లా పీహెచ్‌సీలను ఆరోగ్య, వెల్నెస్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తామని మోదీ తెలిపారు. ఈ పథకంలో భాగంగా జంగాలాలో తొలి పీహెచ్‌సీని మోదీ ప్రారంభించారు. ఈ పథకంలో దేశంలోని 115 వెనుకబడిన జిల్లాలకు ప్రాధాన్యతనిస్తామన్నారు. ‘పాత మార్గాల్లో వెళ్తూ.. కొత్త లక్ష్యాలను చేరుకోవటం కష్టం. అందుకే ప్రభుత్వం ఈ ప్రాంతాల్లో పనిచేసేందుకు కొత్త అభివృద్ధి నమూనాలను సిద్ధం చేస్తోంది’ అని ప్రధాని తెలిపారు. శనివారం ప్రారంభించిన మరో పథకం ‘గ్రామ్ స్వరాజ్ యోజన’ ద్వారా పేదలు, దళితులు, గిరిజనులు, మహిళలు, సమాజంలోని ఇతర వెనుకబడిన వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో చరణ్ పాదుకా పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ఓ గిరిజన మహిళకు చెప్పులు బహూకరించి తొడుగుతున్న మోదీ -
‘చివరి అంచుల్లో నక్సలిజం’
గుర్గావ్ : దేశంలో నక్సజలిం చివరి అంచుల్లో ఉందని, భద్రతా దళాలు నక్సలిజాన్ని ఎదుర్కోవడంలో విజయవంతం అయ్యాయని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. హరియాణాలోని గుర్గావ్లో శనివారం సీఆర్పీఎఫ్ దళాల 79వ రైసింగ్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుక్మా ఎన్కౌంటర్లో మరణించిన జవాన్లకు నివాళులర్పించిన అనంతరం రాజ్‌నాథ్ ప్రసంగించారు. ‘నక్సలిజాన్ని ఎదుర్కొవడం పెద్ద సవాల్. కానీ, సీఆర్పీఎఫ్ సహా భద్రతాదళాలు దానిని కట్టడి చేయటంలో కృషి చేస్తున్నాయి. భద్రతా దళాలను నేరుగా ఎదుర్కొనే శక్తిలేక మావోయిస్టులు పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారు. దీనివల్ల భద్రతా సిబ్బంది మరణాల రేటు తీవ్రంగా పెరిగింది. అందుకే నక్సల్ వ్యతిరేక చర్యలను పోత్సహిస్తున్నాం. నిర్ణయాత్మక చర్యలతో వారి చేష్టలను తిప్పికొడుతున్నాం’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. వాళ్లే నష్టపోతున్నారు... ‘మావోయిస్టుల చర్యల వల్ల సామాన్య ప్రజానీకం కూడా ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకం. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. వారి చర్యల వల్ల వారే నష్టపోతున్నారు’ అని రాజ్‌నాథ్ తెలిపారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి వ్యతిరేకంగా మావోయిస్టులు పని చేస్తున్నారని, చివరకు రోడ్లు వేస్తున్న సిబ్బందిని కూడా హతమారుస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. నిజానికి రైసింగ్ డే మార్చి 19నే కాగా, రాజ్‌నాథ్ బిజీ షెడ్యూల్ మూలంగా ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. -
నక్సలిజం అంతం దానితోనే సాధ్యం
న్యూఢిల్లీ: దేశంలో ప్రధాన సమస్యగా మారిన నక్సలిజాన్ని కేవలం యుద్ధం, బులెట్స్ ద్వారానే అంతం చేయలేమని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. స్వాతంత్య్రం తర్వాత కూడా మనం చేరుకోలేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేస్తేనే నక్సల్ ప్రభావం తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ‘రైజింగ్ ఇండియా’ కార్యక్రమంలో మాట్లాడిన రాజ్‌నాథ్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా దేశంలో నక్సలిజం ప్రధాన సమస్యగా మారిందని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ఒక్కటే దానిని అంతం చేయగలదని పేర్కొన్నారు. గత నాలుగేళ్లతో పోలిస్తే ఇప్పడు నక్సలిజం సమస్యను ఎంతో అధిగమించామని, ఇది ప్రభుత్వ విజయమన్నారు. దేశంలో వెనుకబడిన గ్రామీణ ప్రాంత ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల హెల్త్‌స్కీం ఆ సమస్యలను తీరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధికి ఆర్థికవేత్తలు, మేధావులు, సైంటిస్టుల సహకారం కావాలని, అప్పుడే దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని పిలుపునిచ్చారు. -
గన్‌జాటం!
♦ స్టేటస్ సింబల్‌గా తుపాకీ ♦ జిల్లాలో కనిపించని ఫ్యాక్షన్, నక్సలిజం ♦ అయినా పెరిగిన దరఖాస్తులు ♦ లైసెన్స్ జారీలో ఆచితూచి అడుగులు ♦ అదుపుతప్పితే ముప్పే ♦ లోతుగా విశ్లేషిస్తున్న పోలీసులు అనంతపురం అర్బన్ : చెప్పుకోదగ్గ ఫ్యాక్షన్ లేదు.. నక్సలిజం జాడ కనిపించట్లేదు.. ప్రత్యేకంగా ముప్పు ఉన్నట్లు ఎవరూ ముందుకు రాలేదు.. ఇక ప్రజాప్రతినిధులకు ఎలాగూ ప్రభుత్వం గన్మెన్లను కేటాయిస్తోంది. ఇవన్నీ పరిశీలిస్తే ప్రత్యేకంగా ఎవరికీ గన్‌తో పని లేదనేది సుస్పష్టం. అయితే గన్ కలిగి ఉండటం స్టేటస్‌గా భావిస్తున్నట్లు ఇటీవల కాలంలో చేసుకున్న దరఖాస్తులను చూస్తే అర్థమవుతుంది. జిల్లాలో నెలకొన్న తాజా పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం 400 మందికి గన్ లైసెన్స్‌లు ఉండగా.. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కొత్తగా 23 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే లైసెన్స్ ఉండి రెన్యూవల్ కోసం 51 మంది దరఖాస్తు చేశారు. ఈ రెండింటికీ 74 దరఖాస్తులు వచ్చినట్లు అధికారుల ద్వారా తెలిసింది. ఇందులో 8 మందికి లైసెన్స్ మంజూరయింది. 11 మంది దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించగా.. 55 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. స్టేటస్ కోసమేనా.. ఒకప్పుడు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్షన్ జాడ ఉంది. ఆ క్రమంలో కొందరు తమ ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉందనే ఉద్దేశంతో గన్‌లైసెన్స్ పొందారు. ప్రస్తుతం జిల్లాలో ఫ్యాక్షన్ సద్దుమణిగింది. అదేవిధంగా ఒకప్పుడు నక్సలిజం కూడా కొన్ని ప్రాంతాల్లో కనిపించింది. ఈ క్రమంలో ఆయా కారణాలు చూపిస్తూ గతంలో కొందరు గన్‌లైసెన్స్ పొందినా.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఫ్యాక్షనిజం, నక్సలిజం కనుమరుగయ్యింది. ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం ప్రత్యేకంగా 1+1 తక్కువ కాకుండా, వారి స్థాయిని బట్టి గన్మెన్లను కేటాయిస్తోంది. ప్రాణాలకు ముప్పు ఉందని గుర్తించిన వారికీ గన్మెన్లను మంజూరు చేస్తున్నారు. వీరే కాకుండా కొత్తగా లైసెన్స్ కోసం పదుల సంఖ్యలో దరఖాస్తులు దాఖలు అవుతుండటం చూస్తే గన్ సంస్కృతికి పెరుగుతున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. గన్ కలిగి ఉండటం స్టేటస్‌గా భావిస్తుండటం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు చర్చ జరుగుతోంది. సూక్ష్మ పరిశీలన తర్వాతే మంజూరు గతంలో గన్ లైసెన్స్‌ని అప్పటి పరిస్థితుల ఆధారంగా ఇచ్చేవారు. ప్రస్తుతం జిల్లా పరిస్థితులు పూర్తిగా మారడంతో లైసెన్స్ మంజూరులో అధికారులు సూక్ష్మ పరిశీలన చేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారి నేపథ్యం, వారికి నిజంగా ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉందా? వారు చూపుతున్న కారణంలో నిజం ఎంత? గన్ లేకపోతే ప్రాణ హాని ఉంటుందా? పోలీసు ప్రొటెక్షన్ కలిగి ఉన్నారా? ఒకవేళ ఇప్పటికే కలిగి ఉన్న లైసెన్స్‌కి నిర్ణీత గడువులో రెవెన్యూవల్కి దరఖాస్తు చేసుకున్నారా? ఇలా దరఖాస్తుదారునికి సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అన్ని విధాల సంతృప్తి చెందితేనే లైసెన్స్ మంజూరు చేయడం.. లేదా రెన్యూవల్ చేయడం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. లైసెన్స్‌లకు రెకమండ్ చేయట్లేదు గన్ లైసెన్స్‌కు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి రెకమెండ్ చేయడం లేదు. రెన్యూవల్కి వచ్చిన దరఖాస్తులను విచారణకు పంపుతాం. కొందరు లైట్ థ్రెట్ ఉందంటున్నారు. అందులో వారు పేర్కొన్న కారణాల ప్రకారం థ్రెట్ ఉందా లేదా అనేది పరిశీలిస్తాం. ఆ తర్వాతే రెన్యూవల్ చేస్తాం. నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత లైసెన్స్‌లకు రెకమెండ్ చేయలేదు. బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్స్ చాలా మంది ఉన్నారు. వారికి మాత్రమే రెకమెండ్ చేస్తున్నాం. – జి.వి.జి.అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ -
'దళిత బాలికల బట్టలిప్పించడం చూశాను'
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులతో ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరును ఆ రాష్ట్రానికే చెందిన ఓ ప్రభుత్వాధికారిణి ఎండగట్టింది. నక్సల్ సమస్యను చూపుతూ రాష్ట్రంలో ఆదివాసీల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందంటూ రాయ్‌పూర్ జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ వర్షా డొంగ్రే చేసిన ఫేస్బుక్ పోస్టు సంచలనం సృష్టించింది. ఛత్తీస్‌ఘడ్‌లోని ఆదివాసీలపై సాయుధబలగాల ప్రయోగానికి వ్యతిరేకంగా అక్కడి ప్రభుత్వ అధికారి గళం విప్పడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 24వ తేదీన సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై నక్సల్ దాడి తర్వాత ఆమె ఈ పోస్టు చేశారు. హిందీలో సాగిన ఆమె పోస్టులో ఏముందంటే.. ‘అందరూ ఒకసారి ఆత్మపరిశోధన చేసుకుంటే నిజం నిగ్గు తేలుతుందని నమ్ముతాను. నక్సల్ పోరాటంలో ప్రాణాలు కోల్పోతున్న నక్సల్స్, జవాన్లు ఇద్దరూ.. భారతీయులే. వీరిలో ఎవరూ ప్రాణాలు కోల్పోయినా దేశం మొత్తం బాధపడుతుంది. ఆదివాసి ప్రాంతాల్లో పెట్టుబడిదారీ వ్యవస్ధను అమలు చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లోని భూమిని సొంతం చేసుకునేందుకు ఆయా ప్రాంతాల నుంచి అడవి బిడ్డలను వెళ్లగొట్టేందుకు వారికి ప్రత్యక్ష నరకం చూపుతున్నారు. గ్రామాలను తగలబెడుతున్నారు. ఆదివాసి మహిళలను మానభంగం చేస్తున్నారు. పులుల ప్రాజెక్టుల పేరుతో రాజ్యాంగంలో ఐదో షెడ్యూలు ఆదివాసీలను తమ భూముల నుంచి పంపించడాన్ని నిరోధిస్తున్నా.. దాన్ని ఉల్లంఘిస్తూ బలవంతంగా గిరిజనులను అక్కడి నుంచి తరలిస్తున్నారు. నక్సలిజాన్ని రూపుమాపుతున్నామనే పేరుతో అటవీ ప్రాంతాల్లో లభ్యమయ్యే ఖనిజసంపద కోసం.. వాటిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, తమ సొంతగూటిని వదులుకునేందుకు ఇష్టపడని అడవిబిడ్డలు ఆ ప్రాంతాన్ని వదిలేందుకు ఒప్పుకోకుండా ప్రభుత్వ బలగాల దాష్టీకానికి బలవుతున్నారు. నక్సలిజం అంతరించిపో్వాలని ఆదివాసీలు కోరుకుంటున్నారు. కానీ, పోలీసు బలగాల చేతుల్లో నలిగిపోతున్న తమ కూతుళ్లను, కాలిపోతున్న తమ గుడిసెలను కాపాడుకోలేకపోతున్నారు. నిరక్షరాస్యత వల్ల తప్పుడు కేసుల్లో ఇరుక్కున్న వాళ్లకు ఎవరు న్యాయం చేస్తారు?. సీబీఐ, సుప్రీం కోర్టులు ఆదివాసీలపై జరగుతున్న అఘాయిత్యాల గురించి వ్యాఖ్యానిస్తాయంతే. ఇంకా ఎవరైనా మానవహక్కుల కార్యకర్తో లేక ఓ విలేకరో సమస్యకు పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నిస్తే వారిని తప్పుడు కేసుల్లో ఇరికిస్తారు. ఆదివాసీ ప్రాంతాల్లో అంతా బావుంటే.. ఎందుకు ప్రభుత్వం భయపడుతోంది?. నిజాన్ని తెలుసుకోవడానికి వెళ్లేందుకు ఎవరినీ ఎందుకు అనుమతించడం లేదు. 14 నుంచి 16 సంవత్సరాల వయసున్న గిరిజన బాలికలను పోలీసు స్టేషన్లో వివస్త్రలను చేసి హింసించడం నేను కళ్లారా చూశాను. వారి శరీర భాగాలకు కరెంటు షాక్ ఇస్తూ పోలీసులు క్రూరంగా ప్రవర్తించారు. మైనర్లపై వాళ్లు థర్డ్ డిగ్రీని ఎందుకు ప్రయోగించారు?. ఆ బాలికలను తక్షణ వైద్యం చేయించాలని నేను ఆదేశాలు ఇచ్చాను. ఒకరిని హింసించేందుకు మన రాజ్యాంగం ఒప్పుకోదు. రాష్ట్రంలో రాజ్యాంగంలోని ఐదో షెడ్యూలు (రాజ్యాంగంలోని ఐదు షెడ్యూలు పంచాయితీ రాజ్ ఎక్స్టెన్షన్ టూ షెడ్యూల్డ్ ఏరియా-1996ను తెలుపుతుంది. దీన్ని రాష్ట్రపతి సూచించిన ప్రాంతాల్లో అమలు చేస్తారు) ను వెంటనే అమలు చేయాలి. ఆదివాసీలు ప్రకృతిలో ఒక భాగం. మనం ప్రకృతిని సంరక్షించాలే తప్ప నాశనం చేయకూడదు. పెట్టుబడిదారీ వ్యవస్ధ రెండు పార్శ్వాలను అర్ధం చేసుకోవాలి. రైతులు, జవానులు సోదరులు లాంటి వారు. వీరు ఇరువురు ఒకరినొకరు చంపుకోవడం అభివృద్ధికి, శాంతికి ఆటకం కలుగజేయడమే. రాజ్యాంగం అందరికీ కోసం. అందరికీ న్యాయం జరగాలి. నేను కూడా వ్యవస్ధ బాధితురాలినే. కానీ, అన్యాయాన్ని ఎదిరించి నిలిచాను. కుట్రలతో నన్ను బలిపశువును చేయాలని చూశారు. నాకు లంచాలు ఇవ్వజూపారు. కానీ, నిజమే గెలిచింది. మనకు ఇంకా సమయం ఉంది. సత్యం వైపు మనం నిలబడకపోతే.. పెట్టుబడీదారులు మన దేశం నుంచి మానవత్వాన్ని నశింపజేస్తారు. అన్యాయం ఎక్కడ జరిగినా సహించనని మనకు మనమే మాట ఇచ్చుకుందాం. రాజ్యాంగం వర్ధిల్లాలి. భారత్ వర్ధిల్లాలి.’ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమకాల్లో అవినీతి జరిగిందని 2006లో వర్షా ఛత్తీస్‌గఢ్ కోర్టులో కేసు వేశారు. కేసులో నెగ్గిన తర్వాత ఆమె డిప్యూటీ జైలు సూపరింటెండెంట్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఫేస్బుక్లో పోస్టు చేసిన కొద్దిరోజుల తర్వాత ఆమె దాన్ని తొలగించారు. కాగా, వర్షా పోస్టుపై స్పందించిన రాష్ట్ర జైళ్ల శాఖ డీఐజీ కేకే గుప్తా.. వర్షాను సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమె పోస్టుపై ప్రాథమిక విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. వర్షా ఆ పోస్టును రాశారా? లేదా? అనే విషయంపై విచారణ జరుగుతుందని తెలిపారు. దీనిపై వర్షా వాయిస్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించారు. -
‘మావోయిస్టుల అసలురూపం బయటపడింది’
రాయ్‌పూర్: తీవ్రవాదం, ఉగ్రవాదం అనేవి ఒకే నాణేనికి ఉండే బొమ్మా బొరుసుల్లాంటివని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే సుపరిపాలనే మార్గమని ఆయన సూచించారు. ‘హిందూ మహా సముద్ర ప్రాంతంలో ఉగ్రవాదం’అనే అంశంపై ‘ఇండియా ఫౌండేషన్’సంస్థ ఢిల్లీలో ఒక సదస్సును నిర్వహించింది. రాయ్‌పూర్‌లోని తన అధికారిక నివాసం నుంచి రమణ్ సింగ్ ఈ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ప్రజాస్వామ్య ఆకాంక్షల ద్వారా పరిపాలనా వ్యవస్థను బలహీనం చేయడం, భయాన్ని వ్యాపింపజేసి సమాజాన్ని దోచుకోవడమే నక్సలైట్ల లక్ష్యమని రమణ్‌సింగ్ అన్నారు. ‘మావోయిస్టుల అసలురూపం బయటపడింది. వారు బస్తర్‌లో విద్య, ఆరోగ్యం, రహదారులు, కమ్యూనికేషన్ సాధనాలు తదితరాలను నాశనం చేశారు’అని రమణ్ సింగ్ పేర్కొన్నారు. నక్సల్స్ ప్రాబల్యం అధికంగా ఉన్న బస్తర్ డివిజన్లో సమస్యను అధిగమించేందుకు తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందనీ, అభివృద్ధి పనులు చేపట్టడంతోపాటు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తోందని రమణ్‌సింగ్ వెల్లడించారు. -
పల్నాట.. ఉలికిపాటు
► మళ్లీ వార్తల్లోకి ఎక్కిన గుత్తికొండ ► వేమగిరిలో స్పెషల్ పార్టీ పోలీసుల కూంబింగ్ ► ఆయుధాల విడిభాగాల తయారీ మిషన్లు, సామాగ్రి గుర్తింపు ► నాటు తుపాకులు, 600 బుల్లెట్లు స్వాధీనం ► దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసు యంత్రాంగం ► మావోల కదలికలపై బలపడుతున్న అనుమానాలు ► పల్నాడు ప్రాంతంలో సంచలనం పిడుగురాళ్ళ: గుత్తికొండ గ్రామం మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. కొన్నేళ్లుగా కనుమరుగైన నక్సలిజం కదలికలు మళ్లీ మొదలైన జాడ కనిపిస్తోంది. మావోయిజానికి అంకురార్పణ జరిగింది ఇక్కడే... అదే మావోయిజానికి బీటలు వారింది ఇక్కడే... పిడుగురాళ్ళ మండలంలోని ఈ గ్రామ సమీపంలోనే వేమగిరి అటవీ ప్రాంతంలో సోమవారం ఆయుధాలు తయారు చేసే మిషనరీతో పాటు పలు సామాగ్రి ఉన్న బాక్సులు లభ్యం కావడంతో పల్నాడు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక్కడ ఆయుధాలను తయారు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందడంతో స్పెషల్ పార్టీ పోలీసులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. నక్సలైట్లు వాడే ఆయుధాలను, తూటాలను తయారు చేసే మిషనరీని స్వాధీనం చేసుకున్నారు. అక్కడున్న నలుగురైదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని మూడు ప్రత్యేక వాహనాల్లో పిడుగురాళ్లకు తరలించారు. మిషనరీతోపాటు, నాటు తుపాకులు, 600 బుల్లెట్లు, తూటాలుతయారు చేసే సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ మిషనరీ పవర్ స్ప్రేయర్లు తయారు చేసేదని తయారీదారులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. నక్సలిజానికి పెట్టింది పేరు గుత్తికొండ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నక్సలైట్లు కీలక విభాగాల్లో పనిచేశారు. గతంలో గుత్తికొండ ప్రాంతంలో నక్సలైట్లు పలువురు రాజకీయ నాయకులను, ఇన్ఫార్మర్లను హత్య చేశారు. తదనంతర పరిణామాల్లో పోలీసులు మావోయిస్టులను అణచివేసే కార్యక్రమంలో భాగంగా నక్సలైట్ల ప్రభావం తగ్గింది. నక్సలైట్లు వారి సాధక బాధకాలు చర్చించుకునేందుకు పిడుగురాళ్ళ మండలం గుత్తికొండ గ్రామానికి వేదిక చేసుకుని భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో నక్సల్స్ ఆయువు పట్టును ప్రభుత్వ ఇంటిలిజెన్సు వర్గాలు చేజిక్కించుకున్నాయి. ఈ బహిరంగ సభకు సంబంధించి ప్రభుత్వ ఇంటిలిజెన్సు వర్గాలు ఫొటోలు, వీడియోలు తీసి పక్కా సమాచారాన్ని సేకరించింది. దీంతో పోలీసులు నక్సలిజానికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు నక్సలిజం జాడ లేదు. ప్రస్తుతం గుత్తికొండ ప్రాంతం మావోయిస్టులకు అనుకూలంగా ఉండటంతో ఈ ప్రాంతంలో టీడీపీ ప్రభుత్వం ఓ కన్నేసింది. అక్కడ ఎలాంటి కదలికలు ఉన్నా సునిశితంగా పరిశీలిస్తోంది. దీంతో సోమవారం పోలీసుల కూంబింగ్‌లో ఆయుధాల విడిభాగాలు తయారు చేసే మిషనరీ బయట పడటం పల్నాడులో చర్చనీయాంశమైంది. మళ్లీ పల్నాడులో ఇప్పుడిప్పుడే నక్సలైట్ల కదలికలు మొదలవుతున్నాయనే అనుమానం వ్యక్తమవుతోంది. కూపీ లాగుతున్న పోలీసులు.. గతంలో గుత్తికొండ తరచూ వార్తల్లోకి ఎక్కేది. ఇప్పుడు మళ్లీ ఈ ప్రాంతంలో తుపాకులు తయారు చేస్తున్న సమాచారం తెలుసుకుని పోలీసులు అక్కడకు వెళ్లారు. పవర్‌స్ప్రేయర్లు తయారు చేసే మిషన్లను తయారీదారులు చెబుతున్నప్పటికీ ఈ మిషన్లను ఇలాంటి మారుమూల ప్రాంతంలో ఎందుకు పెట్టారు.. తపంచాలు తయారు చేసేందుకు ఉపయోగిస్తున్నారా అనే కోణంటో పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇవి నక్సలైట్ల ఉద్యమానికి సహకరించడానికా, లేక అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించడానికి రౌడీ మూకలు చేస్తున్న పనా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నక్సలిజం వస్తే బాగుండును: రేవంత్‌రెడ్డి
నిజామాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నిజామాబాద్ కలెక్టరేట్ ముందు... ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడారంటే.. తెలంగాణ రాష్ట్రంలో బిహార్ మాదిరిగా అరాచక పాలన నడుస్తోంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడింది. ప్రజలంతా అఖిలపక్షంగా ఏర్పడి అరాచకాలపై పోరాటం చేయాలి. ఒకప్పుడు నక్సలిజం అనేది అభివృద్ధి విరోధకంగా ఉండేదనుకున్నాను. కానీ, ప్రస్తుతం తెలంగాణలో నక్సలిజం వస్తే బాగుండును. యూనివర్సిటీల్లోని యువత నక్సలిజం వైపు మొగ్గు చూపుతోంది. సాగర్, శృతి ఇలానే నక్సలిజంలోకి వెళ్లి వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. కేసీఆర్ వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఎన్కౌంటర్ జరిగింది. నెల క్రితం ఆర్మూరులో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడానికి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కారణమని' అన్నారు. -
నక్సలిజంపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధం
ముంబై: రాష్ట్రంలో పెరుగుతున్న నక్సలిజాన్ని అరికట్టడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ముఖ్యమంత్రి సారథ్యంలో ఓ ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయనున్నారు. సీఎం అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో హోం, ఆర్థిక, పీడ బ్ల్యూడీ, రాష్ట్ర, జాతీయ నిఘా విభాగం, రక్షణ విభాగం అధికారులు సభ్యులుగా ఉంటారు. మావోయిస్టులను ఎదుర్కోడానికి వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను ఈ బృందం అధ్యయనం చేస్తుంది. నక్సలిజాన్ని అదుపుచేయడానికి అవలంభించాల్సిన విధానాలు, వ్యూహాలపై కమిటీ అధ్యయనం చేస్తుంది. ప్రతి రెండు నెలలకోసారి కమిటీ సమావేశమవుతుందని, రాష్ట్రంలో నక్సలిజాన్ని అదుపు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటుందని ఓ అధికారి తెలిపారు. నక్సలిజాన్ని అణిచివేయడానికి ఇతర రాష్ట్రాలు, కేంద్రంతో కలసి పనిచేస్తుందని చెప్పారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కమిటీ అభివృద్ధి పథకాలు అమలు చేస్తుందని, అందుకు కావలసిన సామాగ్రిని కూడా సమకూరుస్తుందని చెప్పారు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా 2010లో అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఇందులో భాగంగా చత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసుకున్నాయి. అసోం, జమ్మూ-కశ్మీర్ రాష్ట్రాలు సీఎం నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నాయి. -
అన్నింటా..బెస్ట్
♦ బడ్జెట్లో ప్రత్యేక నిధులు ♦ పోలీస్ యంత్రాంగంలో కొత్త స్థైర్యం ♦ విస్తృత కార్యక్రమాలతో ప్రజలకు చేరువ ♦ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గచ్చిబౌలి : ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలిజం, తీవ్రవాదుల బెడద ఉంటుందని, భూములు కబ్జాలకు గురవుతాయనే అపోహలు సృష్టించారు. అయితే నూతన రాష్ట్రం ఏర్పడిన ఏడాదిలో ఆ అపోహలన్నీ పటాపంచలయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతిభద్రతలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ యావత్ పోలీస్ సిబ్బందిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. నా 24 ఏళ్ల సర్వీస్‌లో ఎన్నడూ లేని విధంగా పోలీసు శాఖకు ప్రణాళిక బద్దమైన బడ్జెట్, వనరులు, సౌకర్యాలు సమకూర్చారు.సైబరాబాద్ కమిషనరేట్‌లో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఈ చలానా, మూడు రోజుల్లో పాస్‌పోర్టు వెరిఫికేషన్, వాట్సప్ సౌకర్యం, ీషీ టీమ్స్ ఏర్పాటుతో పారదర్శకంగా, జవాబుదారితనంతో ఉండేం దుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సైబరాబాద్ కమిషనర్ సీ.వీ.ఆనంద్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. పెట్రోలింగ్ వ్యవస్థలో మార్పులు 60 లక్షల జనాభా, 3,700 కిలో మీటర్ల పరిధిలో విస్తరించిన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3 వేల మంది పోలీసులు, 2 వేల మంది హోంగార్డ్స్ సేవలందిస్తున్నారు. ప్రతి స్టేషన్‌కు ఐదు ఇన్నోవా కార్లు, బ్లూ కోల్ట్స్ ఇచ్చారు. రాత్రి వేళల్లో సెట్లో అందుబాటులో లేని అధికారులు, సిబ్బంది పనితీరును పరిశీలిస్తాం. వాహనాల్లో జీపీఎస్ సిస్టమ్, జాబ్ చార్ట్, పెట్రోల్ సిస్టిమ్‌ను పర్యవేక్షించేందుకు ఎఫ్‌ఆర్‌సీసీ నిఘా ఉంటుంది. దీంతో పది నిమిషాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటాం. భూ వివాదాలపై ఎస్ఓపీ విధానాన్ని ప్రవేశ పెట్టాం. ఎస్హెచ్ఓలు నిబంధనలు తప్పకుండా పాటించాలి. ఇందుకు సంబందించి ఇప్పటికే 650 కేసులు నమోదు చేశాం. నిబంధనలు పాటించని ఏసీపీ, సీఐలను సస్పెండ్ చేశాం. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ను బలోపేతం చేశాం. క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చలానా చెల్లించవచ్చు. సైబరాబాద్‌లో సరైన అడ్రస్ లేని వాహనాలు ఉండటంతో నగదు చలానాకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ట్రాఫిక్ స్పీడ్ గన్స్, బ్రీత్ ఎనలైజైర్స్, క్రెన్స్ కెమెరా, ట్రాఫిక్ ఆఫీసర్లకు బాడీ కెమెరాలు అమర్చి పారదర్శకంగా పనిచేస్తున్నాం. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ మూడు రోజుల్లో పూర్తవుతుంది. ఐటీ కారిడార్‌లో మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశాం. ప్రతి పీఎస్‌లో ఉమెన్ హెల్ప్ డెస్క్, ఐటీ కారిడార్‌లో మహిళ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశాం. వాట్సాప్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చాం. ఇప్పటి కే 50 వేల మంది ఇందులో రిజిస్టర్ అయ్యారు. కమిషనరేట్ పరిధిలో ఏ ఘటన జరిగిన సమాచారంతో పాటు ఫోటోలు వస్తాయి. దీంతో అధికారులకు వేగంగా ఆదేశాలు ఇచ్చేందుకు వీలుంటుంది. -
నక్సలిజం పెరగలేదు
- పెండింగ్ కేసులు పరిష్కరించాలి - కరీంనగర్ రేంజ్ డీఐజీ భీమానాయక్ సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఉత్తర తెలంగాణలో నక్సలిజం ఏమాత్రం పెరగలేదని కరీంనగర్ రేంజ్ డీఐజీ భీమానాయక్ పేర్కొన్నారు. తెలంగాణ సరిహద్దుల్లోని మహారాష్ట్ర, గడ్చిరోలీ, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నా రాష్ట్రం లోకి రాకుండా గట్టి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో మట్కా, పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించాలని, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను 30 రోజుల్లో పరిష్కరించాలని పోలీసుశాఖ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం పోలీసుశాఖ అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా కలెక్టర్ జగన్మోహన్, జడ్జి గోపాలకృష్ణమూర్తి, జిల్లా ఎస్పీ గజరావు భూపాల్, సబ్ జడ్జి అజిత్సింహరావులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఐజీ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 1,504 వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించాలన్నారు. కేసుల నమోదు అనంతరం నిందితులను కోర్టులో ప్రవేశపెట్టాలని అన్నారు. రంజాన్‌తోపాటు రానున్న ఆరు నెలల్లో దసరా, దీపావళి పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. పోలీసు సిబ్బందికి ఇప్పటికే కొందరికి వారంతపు సెలవులు ఇస్తున్నామని, ఈ విషయంలో తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని పేర్కొన్నారు. ప్రత్యేక యూనిఫాం విషయంలో కూడా తమకు ఆదేశాలు రాలేదన్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 6,625 ఎంవీ యాక్ట్ కేసులు నమోదు చేసి రూ.26.35 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. పోలీసుస్టేషన్ల పునర్వ్యవస్థీకరణ : ఎస్పీ జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్ల పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి తమ శాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామని ఎస్పీ గజరావు భూపాల్ అన్నారు. మాదారం వంటి పోలీసుస్టేషన్లను జిల్లాలో అవసరం ఉన్న చోట్లకు మార్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీలు టి. పనసారెడ్డి, భరత్ భూషన్, జోయల్ డెవిస్, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
తెలంగాణతో నక్సలిజం పెరగదు: డీజీపీ
పోలీసు శాఖలో రాజకీయ జోక్యాన్ని అధిగమిస్తాం: డీజీపీ ఏటూరునాగారం, న్యూస్‌లైన్: అభివృద్ధి చెందిన చోట నక్సలిజం ఉండదని డీజీపీ బి.ప్రసాదరావు అన్నారు. వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించటంతోపాటు ఆయన జిల్లా కేంద్రంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగునీటి వనరులు, యువతకు చేతినిండా పని లభిస్తే నక్సలిజం అనేది ఉండదన్నారు. నక్సల్స్ గోదావరి అవతలి వైపు అభయారణ్యంలో అడుగు పెట్టవచ్చని, వారు పూర్తిగా లేరని చెప్పలేమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సల్స్ వ్యవస్థ పెరగకపోవచ్చని, ఒకవేళ ఎక్కువగా ఉంటే అణచివేసేందుకు పోలీస్‌శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. పోలీసు శాఖలో రాజకీయ ప్రమేయం సాధారణమేనని, దానిని అధిగమించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా ఆయన సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. -
సీమాంధ్ర నుంచే తెలంగాణకు నక్సలిజం
టీఆర్ఎస్ నేత పేర్వారం వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతం నుంచే తెలంగాణకు నక్సలిజం వచ్చిందని మాజీ డీజీపీ, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు పేర్వారం రాములు వ్యాఖ్యానించారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడారు. పశ్చిమబెంగాల్లో పుట్టిన నక్సలిజం సీమాంధ్రకు ముందుగా చేరిందన్నారు. 1980 ప్రాంతంలో సీమాంధ్ర నుంచి వరం గల్ జిల్లాకు వలస వచ్చి అక్రమంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందినవారే నక్సలిజాన్ని వ్యాపింపజేశారని ఆరోపించారు. 1980కు ముందు తెలంగాణలో నక్సలిజమే లేదని, ఈ విషయం రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డికి తెలియదా? అని పేర్వారం ప్రశ్నించారు. అప్పటి నుంచి తెలంగాణలో జరిగిన విధ్వంసం, ప్రాణ, ఆస్తినష్టం సామాన్యమైనది కాదన్నారు. సీమాంధ్ర వలసవాదులు వ్యాపింపజేసిన నక్సలిజం నుండి విముక్తి కావడానికి తెలంగాణకు 20 ఏళ్లు పట్టిందన్నారు. ఇప్పుడు తెలంగాణలో నక్సలైట్ల రిక్రూట్మెంట్ లేదని.. దీనిని సాధికారికంగా, గర్వంగా చెప్తున్నానన్నారు. సరైన అక్షరాస్యతతో ఉన్నత ఉద్యోగావకాశాలు రావడం, కుల సంఘాల ప్రభావం వంటివాటి వల్ల నక్సలిజం వైపు ఆకర్షణ తగ్గిందన్నారు. ఇప్పుడు 60 ఏళ్లు దాటినవారు తప్ప యువత నక్సలైట్లలో లేదన్నారు. గతంలో తాను వరంగల్ జిల్లాలోని ఊరికి పోతే వందల పోలీసులు రక్షణగా ఉండాల్సి వచ్చేదని... ఇప్పుడైతే ఒకే గన్‌మన్‌తో వెళ్తున్నట్టు చెప్పారు. ఐనా నక్సలిజం తెలంగాణకే పరిమితమైన సమస్యగా చిత్రీకరించే కుట్రకు సీమాంధ్రులు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇవన్నీ ఆంజనేయరెడ్డికి తెలియకుండానే మాట్లాడుతున్నాడా? అని ప్రశ్నించారు. -
రాష్ట్రంలో పెరిగిన నక్సలిజం
-
విభజనతో నక్సల్స్ సమస్య పెరుగుతుంది: బిట్టా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగితే నక్సల్స్ సమస్య పెరిగే అవకాశం ఉందని యాంటీ టెర్రరిస్ట్ యాక్ట్ ఛైర్మన్ మణిందర్ సింగ్ బిట్టా అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన న్యూఢిల్లీలో విలేకర్లతో మాట్లాడుతూ... విభజనతో తీవ్రవాదుల ప్రభావం కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 80 శాతం వరకు నక్సల్స్ సమస్య తగ్గిందని తెలిపారు. విభజన జరిగితే రాష్ట్రం ప్రమాదకరంగా మారుతుందని వ్యాఖ్యానించారు. -
నక్సలిజం వద్దు
న్యూఢిల్లీ: నక్సల్స్ ఉద్యమాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో కేంద్రం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని గిరిజనులను చైతన్యవంతం చేసేందుకు నడుంకట్టింది. దీనికి గాను ఆయా ప్రాంతాల్లో రేడియో ద్వారా నక్సల్స్ వ్యతిరేక ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పలు కార్యక్రమాలు చేపడుతున్న కేంద్ర హోం శాఖ తాజాగా రేడియో కార్యక్రమాల రూపకల్పన, నిర్వహణకు గాను రూ.2.16 కోట్లను విడుదల చేసింది. మావోల ప్రభావానికి గ్రామీణులు, గిరిజనులు, నిరుద్యోగులు ప్రభావితం కాకుండా విధంగా కార్యక్రమాలను రూపొందించాలని ఆలిండియా రేడియోను ఇప్పటికే కోరిన ప్రభుత్వం, రానున్న 2 నెలల్లో ప్రసారం చేయాలని కూడా సూచించింది. -
నాడు తూటా.. నేడు టీ..
రాంచీ: జార్ఖండ్‌కు చెందిన రష్మీ మహ్లీ ఒకప్పుడు పోలీసులను చూస్తే.. ఆగ్రహంతో రగిలిపోయేది. వారిపై తూటాలు కురిపించేది. మరిప్పుడో.. వారినే ఆప్యాయంగా పలకరిస్తోంది.. టీ అందిస్తోంది! రష్మీ ఓ మావోయిస్టు. చిన్న వయసులోనే ఉద్యమంలోకి వెళ్లిపోయింది. మరో నక్సల్‌ను పెళ్లి చేసుకుంది. జార్ఖండ్ కీలక మావోయిస్టు నేత, అక్కడి వీరప్పన్‌గా పేరొందిన కుందన్ పహాన్ గ్రూపులో ఏడేళ్లపాటు పనిచేసింది. మహిళా నక్సల్స్ దళం నారీముక్తి సంఘ చోటానాగ్పూర్ జోన్‌కు ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించింది. కొన్నాళ్ల క్రితం ఆమె భర్త పోలీసు కాల్పుల్లో మరణించాడు. అయితే, దీన్ని అలుసుగా తీసుకుని సహచరులు లైంగిక వేధింపులకు గురిచేయడం.. హింసపై రష్మీకి విరక్తి కలగడం వంటి కారణాలతో 2011లో పోలీసులకు లొంగిపోయింది. అక్కడ్నుంచి ఆమె జీవితమే మారిపోయింది. లొంగిపోయిన నక్సల్స్ పునరావాస ప్యాకేజీ కింద ప్రభుత్వం నుంచి రూ.1.5 లక్షలు వచ్చాయి. దీంతో అధికారుల సహకారంతో ఆమె రాంచీ కలెక్టరేట్లోని డిప్యూటీ పోలీసు కమిషనర్ కార్యాలయం వద్దే టీస్టాల్‌ను ఏర్పాటు చేసుకుంది. గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ టీ స్టాల్‌ను డిప్యూటీ కమిషనర్ సాకేత్ కుమార్ ప్రారంభించారు. రష్మీ.. ఇప్పుడు భవిష్యత్‌పై ఆశావహ దృక్పథంతో ముందడుగు వేస్తోంది. అంతేకాదు.. తన ఎనిమిదేళ్ల కొడుకు ఏదో ఒకరోజు తప్పకుండా పోలీసు అవుతాడని గర్వంగా చెబుతోంది. -
‘ప్రత్యేక’ విదర్భ అవసరం లేదు
సాక్షి, ముంబై: ప్రత్యేక విదర్భ రాష్ట్రం వల్ల నక్సలైట్ల ప్రభావం పెరిగే అవకాశముందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఏర్పాటుచేసిన ఛత్తీస్గడ్, జార్ఖంఢ్లలో పెద్ద ఎత్తున నక్సలైట్ల ప్రభావం పెరిగిందని గుర్తుచేశారు. చంద్రాపూర్ జిల్లా చిమూర్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక విదర్భ రాష్ట్రం అవసరం లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ ప్రకటన అనంతరం మహారాష్ట్రలో ప్రత్యేక విదర్భ ఉద్యమం మరోసారి జోరుగా కొనసాగుతుండటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేక విదర్భ ఏర్పాటైతే నక్సలైట్ల ప్రభావం మరింత పెరుగుతుందన్నారు. అభివృద్ధితోనే విదర్భకు మేలు.. ప్రత్యేక విదర్భ రాష్ర్ట ఏర్పాటు పెద్దగా అవసరం లేదని, అయితే అక్కడ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు నిర్వహించి విదర్భను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పృథ్వీరాజ్ చవాన్ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి జరిగితే విదర్భకు మేలు జరుగుతుందన్నారు. పుణే, ముంబైలతో పోలిస్తే విదర్భలో అభివృద్ధి కొంతమేర కుంటుపడిందని ఆయన అంగీకరించారు. ఈ కారణంతోనే ప్రత్యేక విదర్భ ఏర్పాటు చేయమనడం సబబు కాదన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విదర్భ కోసం ప్రత్యేక ప్యాకేజీల ద్వారా అభివృద్ధి చేసేందుకు కృషి చేయనున్నట్టు చెప్పారు. సమైక్యంగా ఉంటేనే అందరికీ లాభమన్నారు. ఐక్యతే మహారాష్ట్ర అభివృద్ధికి ప్రధాన కారణమని తెలిపారు. కాగా, ప్రత్యేక తెలంగాణ ప్రకటన అనంతరం మహారాష్ట్రలో ప్రత్యేక విదర్భ ఉద్యమం మరోసారి జోరుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పృథ్వీరాజ్ చవాన్ తరచూ చేస్తున్న వ్యాఖ్యలపై విదర్భ వాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
విభజనతో వెసులుబాటు!
విశ్లేషణ: ‘‘మన రాష్ట్రంలో నక్సలైట్ల సమస్య పరిష్కారమైపోయిందనుకోవడం తప్పు. నక్సలైట్లవల్ల తలెత్తే శాంతిభద్రతల సమస్యను అదుపులోకి తేవడం మాత్రమే మా పని. శాశ్వత పరిష్కారాన్ని చూపించాల్సింది ప్రభుత్వమే. అందుకు బదులుగా ప్రభుత్వమే నక్సలై ట్లు తయారు కావడానికి కావాల్సిన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను సృష్టిస్తే మేం చేయగలిగేది ఏమీ ఉండదు, మళ్లీ కథ మొదటికే వస్తుంది’’ అంటూ ఒక మాజీ పోలీసు ఉన్నతాధికారి ఆందోళన వెలిబుచ్చారు. మూడేళ్ల క్రితం నేటి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా పెట్టుబడులు హైదరాబాద్‌కు ముఖం చాటేస్తున్న సంగతి తెలిసిందే. నేటి రాష్ట్ర విభజన ప్రతిపాదన ఆ అనిశ్చితిని తొలగించకపోగా పొడిగిస్తుంది. దీనికి తోడు నక్సలైట్ల కారణంగా 1988-1992 మధ్య రాజధానిలో నెలకొన్న పారిశ్రామిక అశాంతి తిరిగి నెలకొంటే పెట్టుబడులు రెండు రాష్ట్రాలకు దూరంగా జరిగే ప్రమాదం ఉంది. కాంగ్రెస్‌పార్టీ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్ల సమ స్య తిరిగి చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో నక్సలైట్ల సమస్య తిరిగి మొదటికి వస్తుందని పలువురు సీనియర్ పోలీసు అధికారులు ఆందోళన చెందుతున్నారు. అలాంటి భయా లు నిరాధారమైనవని తెలంగాణవాదులు కొట్టిపారేస్తున్నారు. రాష్ట్ర విభజనతో సంబంధం లేకుండానే అందరూ అంగీకరించే వాస్తవం ఒకటుంది. దేశవ్యాప్తంగా అసంతృప్తి, ఆందోళనల వ్యాప్తికి అనువైన పరిస్థితులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఆ కారణంగానే మావోయిస్టులు కేరళ నుంచి ఈశాన్యం, జమ్మూ-కాశ్మీర్ వరకు విస్తరించగలిగారు. 21 రాష్ట్రాల్లో 18 రాష్ట్ర కమిటీలతో ఆ పార్టీ పనిచేస్తోంది. దండకారణ్యంగా పిలిచే మధ్య భారతంలో కేంద్ర బలగాలు చేపట్టిన ‘గ్రీన్‌హంట్’ ఆశించిన ఫలితాలిస్తున్న దాఖలాలులేవు. పైగా ఆర్థికవ్యవస్థ ఇప్పట్లో మాంద్య పరి స్థితుల నుంచి బయటపడే సూచనలు లేవు. గ్రామీణ, పట్టణ నిరుద్యోగం వేగంగా పెరుగుతోంది. పెరిగే ధరలకు తోడు, సంక్షేమ వ్యయాల, సబ్సిడీల కోతలు సామాన్యులలో అసంతృప్తిని పెంచుతున్నాయి. ప్రత్యేకించి ఆంధ్ర ప్రదేశ్‌లో వైఎస్ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధం గా అమలైన సంక్షేమ పథకాలను అటకెక్కించారు. దీంతో మన రాష్ట్ర ప్రజానీకంలో అసంతృప్తి ప్రబలుతున్నది. ఈ పరిస్థితుల నేపథ్యం నుంచి చూస్తే రాష్ట్ర విభజనతో రెండు రాష్ట్రాల్లోనూ మావోయిస్టు ఉద్యమం పుంజుకునే అవకాశాలే హెచ్చుగా ఉన్నాయి. మావోయిస్టు అగ్రనేతల ప్రతిష్టకు సవాలు పార్టీ యూనిటీ, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ వంటి ఇతర రాష్ట్రాలకు చెందిన నక్సలైట్ పార్టీలు విలీనమైనా నేటికీ మావోయిస్టు పార్టీ అగ్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్ నేతలదే. మల్లోజుల కోటేశ్వరరావు, చెరుకూరి రాజ్‌కుమార్‌లు మరణించినా అత్యున్నతస్థాయి పొలిట్‌బ్యూరోలోని ఏడుగురిలో ఐదుగురు ఏపీకి చెందినవారే. వారిలో నలుగురు తెలంగాణకు చెందినవారు. స్వరాష్ట్రంలో ఉద్యమం దెబ్బ తినడంతో ఏపీ అగ్రనాయకత్వం ఇతర రాష్ట్రాల్లో పలు సవాళ్లను ఎదుర్కోవాల్సివస్తోంది. ఒడిశా మాజీ మావోయిస్టు నేత సవ్యసాచి పాండా ‘తెలుగువారి ఆధిపత్యమే’ తన తిరుగుబాటుకు కారణమని చెప్పడం గమనార్హం. ‘ఉద్యమ ప్రాంతాలకు నాయకత్వం’ అన్నది ఏపీ నేతలే తెచ్చిన నిర్మాణ సూత్రం. ఏపీ నేతల ప్రతిష్ట మసకబారడానికి అదే కారణమవుతోంది. కాబట్టి ఏపీలో ఉద్యమ పునర్నిర్మాణం వారికి తక్షణావసరం. ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో మార్పులను పరిగణనలోకి తీసుకోక మావోయిస్టులు గుడ్డిగా పాత పంథానే కొనసాగిస్తుం డటంవల్లనే ఉద్యమ పునర్నిర్మాణం కావడం లేదనేది వాస్తవం కాదు. 2001 నాటికే ఉత్తర తెలంగాణలో 1980 నుంచి 1990ల చివరి వరకు జరిగిన మార్పులపై ఆ పార్టీ లోతైన అధ్యయనాన్ని నిర్వహించింది. ఆ పార్టీ తొమ్మిదవ (యూనిటీ) కాంగ్రెస్ (2004) ఆమోదించిన ‘వ్యూహం-ఎత్తుగడలు’, దానిపై ఆధారపడి రూపొందిన ‘పట్టణ ప్రాంతాలలోని పని’ (అర్బన్ పర్స్పెక్టివ్ 2007) అనే డాక్యుమెంట్లలో ఆ నూతన అవగాహన కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దేశ ‘ఆర్థిక కేంద్రం గ్రామీణ ప్రాంతాల నుం చి పట్టణ ప్రాంతాలకు మారింద’ని అవి పేర్కొనడం విశేషం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మారిన పరిస్థితులకు తగిన ఎత్తుగడలను, పని పద్ధతులను ఆ డాక్యుమెం ట్లు సూచించాయి. రాష్ట్రంలో తిరిగి పాగా వేయడానికి అవసరమైన సైద్ధాంతిక కసరత్తును పూర్తి చేసిన మావోయిస్టులు రాష్ట్ర విభజనవల్ల ఏర్పడే ‘తాత్కాలిక వెసులుబాటు’ను ఉపయోగించుకోడానికి సకల శక్తులను ఒడ్డుతారనడంలో సందేహం లేదు. తెలంగాణలో పాగా ఖాయం దక్షిణాదిలో ఉద్యమ పునరుద్ధరణకు ఆ పార్టీ పకడ్బందీగా అమలుచేస్తున్న పథకం వివరాలు 2011, డిసెంబర్ 8న నాటి హోంశాఖ స్టేట్ మంత్రి జితేందర్‌సింగ్ లోక్‌సభలో చేసిన ప్రకటనలో ఉన్నాయి. కేరళ వైనాడ్ జిల్లా నుంచి కర్ణాటకలోని మైసూర్ జిల్లాల వరకు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు విస్తరించారు. సాయుధ గె రిల్లా దళాలు ఆ అడవుల్లో పనిచేస్తున్నాయి. కేరళ, తమిళనాడు సరిహద్దుల్లోని నీలంబూర్-గిడలూల్ అటవీ ప్రాంతంలో కూడా దళాలు పనిచేస్తున్నాయి. మరోవంక తెలంగాణకు, ఛత్తీస్‌గఢ్‌కు ఆనుకొని ఉన్న మహారాష్ట్రలోని నాగపూర్, వార్ధా, భండారా, యవత్మాల్ జిల్లాలకు వారి ఉద్యమం విస్తరి స్తోంది. ఒకప్పుడు రాష్ట్రం, పొరుగు రాష్ట్రాల్లో ఉద్యమ వ్యాప్తికి తోడ్పడితే, నేడు మావోయిస్టులు పొరుగు రాష్ట్రాలను చుట్టుముట్టి రాష్ట్రంలో ఉద్యమాన్ని పునర్నిర్మించే వ్యూహాన్ని అమలుచేస్తున్నారు. కొత్త రాష్ట్రాల కొత్త ప్రభుత్వాలు, యంత్రాంగాల ఏర్పాటుకు, అవి నిలదొక్కుకొని స్థిరపడటానికి కనీసం రెండు మూడేళ్లయినా పడుతుంది. మావోయిస్టులు (ఒకప్పటి కొండపల్లి వర్గం నక్సలైట్లు) 1969 నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ప్రజా పునాదిని సమకూర్చే సాధనంగా చూస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా నక్సలైట్ల ప్రాబల్యం పైకి కనబడిన దానికంటే ఎక్కువే. రాష్ట్ర విభజన తదుపరి ఏర్పడే రెండు ప్రభుత్వాలకు వెంటనే నక్సలైట్లపై దృష్టిని కేంద్రీకరించడం సాధ్యం కాదు. మావోయిస్టు శాంతి భద్రతల సమస్యను, హింసాత్మక ఘటనలను అవి కోరుకోవు. కాబట్టి నక్సలైట్ల విషయంలో అవి తాత్కాలికంగానే అయినా ఉదారవైఖరిని చూపకతప్పదు. మావోయిస్టులు ఆ అపూర్వ అవకాశం వదులుకోకపో వచ్చు. గోదావరికి ఆవలి దండకారణ్యాన్ని (ఛత్తీస్‌గఢ్) కేంద్రంగా చేసుకొని జినుగు నర్సింహారెడ్డి, పుల్లెల ప్రసాదరావు వంటి అగ్రనేతల నేతృత్వంలో వివిధ జిల్లా కమిటీలు తెలంగాణతో సజీవ సంబంధాలను కొనసాగిస్తున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి, మంగి ఏరియా కమిటీలు, ఖమ్మం జిల్లాలో వెంకటాపూర్, శబరి ఏరియా కమిటీలు గుట్టుగా పనిచేస్తున్నాయి. విభజన వల్ల కలిగే ‘తాత్కాలిక వెసులుబాటు’ మూలంగా మావోయిస్టులకు ఒకప్పడు పెట్టని కోటలైన ఖమ్మం, వరంగ ల్, కరీంనగర్ జిల్లాల్లో వారు తిరిగి పాగా వేయడం తథ్యమని సీని యర్ పోలీసు అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. సరిహద్దులలో మావోయిస్టుల దాడుగుమూతలు కేంద్ర హోంశాఖ నేతృత్వంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా గత నాలుగేళ్లుగా కేంద్ర బలగాల ‘గ్రీన్‌హంట్’ సాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం ప్రధాన కారణంగా 50 వేలకుపైగా కేంద్ర బలగాలు రంగంలో ఉన్నా, మావోయిస్టులపై పైచేయి సాధించలేకపోతున్నాయి. కేంద్ర హోంశాఖ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయం లోపించి, భిన్న నాయకత్వ కేంద్రాలుగా మారినస్థితే ఇందుకు కారణం. ఏపీలో నక్సలైట్ల ఆటకట్టిం చడంలో కీలకపాత్ర వహించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థను, ఇన్ఫార్మర్ల నెట్‌వర్క్‌ను నిర్మించడంలో రాష్ట్రాల నుంచి సహకారం అందడంలేదని కేంద్ర హోంశాఖ ఆరోపిస్తోం ది. కేంద్ర కమాండ్, స్థానిక బలగాలను చిన్నచూపు చూస్తోందని రాష్ట్రాలు వాపోతున్నాయి. దీనికి తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే పార్టీకి చెందినవి కాకపోవడం కూడా సమస్యగా మారుతోంది. ఛత్తీస్‌గఢ్, జార్ఖం డ్, ఒడిశాలలో పలు సందర్భాలలో అధికార పార్టీలు స్వీయప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ పరిస్థితులను అందిపుచ్చుకుని మావోయిస్టులు కేంద్ర బలగాలపై భారీ దాడులను కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల మధ్యా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ల మధ్యా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌ల మధ్యా మావోయిస్టులు భద్రతాబలగాలతో దాగుడుమూతలు ఆడుతున్నారు. అటు సన్నాహాలు జరిపి, ఇటు దాడులు చేస్తున్నారు. ఇటు దాడి చేసి, అటు రక్షణ పొందుతున్నారు. ఒడిశా పోలీసులతో సమన్వయ లోపం కారణంగానే 33 మంది ఏపీ గ్రేహౌండ్స్ పోలీసులు 2008లో బలిమెల వద్ద బలైపోయారు. ఖమ్మం జిల్లా పూవర్తి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో మృతి చెందిన ఎస్ఐ ప్రసాద్‌బాబు మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్ ప్రాంతం నుంచి తరలించడానికి మూడు రోజులు పట్టింది. అదికూడా హక్కులనేతల సహాయంతో. కేంద్ర హోంశాఖ ఈ మూడు మావోయిస్టు తిరుగుబాటు సరిహద్దు ప్రాంతాలను ‘త్రికోణం’గా అభివర్ణించింది. రాష్ట్ర విభజన ఆ త్రికోణానికి నాలుగో కోణాన్ని చేర్చి చతురస్రంగా మారుస్తుంది. నల్లమల ఉద్యమ పునరుజ్జీవం... ‘నాలుగో కోణం’ సీమాంధ్రలోని 13 జిల్లాల్లో 7 జిల్లాలకు తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలతో సరి హద్దు ఉంది. మెదక్‌తో కలిపి ఆ నాలుగు జిల్లాలు దక్షిణ తెలంగాణ ప్రాంతీయకమిటీ కింద బలమైన ఉద్యమ కేంద్రాలు. అప్పట్లో కృష్ణానది మీదుగా మావోయిస్టులు మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల నుంచి కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోకి యథేచ్ఛగా రాకపోకలు సాగించేవారు. ఆ నాలుగు జిల్లాల్లో విస్తరించిన నల్లమల మావోయిస్టులకు పెట్టనికోట. కొల్లాపూర్, పెద కొత్తపల్లి, లింగాల, అమ్రాబాద్ మండలాలు నక్సలైట్లకు అప్పట్లో మంచి పట్టున్న ప్రాంతాలు. కొల్లాపూర్ మండలం సోమశిల, అమరగిరి, మొలచింతపల్లి, ఎర్రగట్టు బొల్లారం ప్రాంతాల్లో కృష్ణ దాటితే కర్నూలు జిల్లా కొత్తపల్లి మం డలం సిద్ధేశ్వరం, సంగమేశ్వరం, కపిలేశ్వరం, బలపాలదిబ్బ అటవీ ప్రాంతాలకు చేరుకోవచ్చు. కొల్లాపుర్-సోమశిల మధ్యనే ఐపీఎస్ అధికారి పరదేశీనాయుడును మావోయిస్టులు హతమార్చారు. మాజీ ఎమ్మెల్యే రంగదాస్ను కాల్చిచంపారు. లింగాల, అప్పాయిపల్లి, అప్పాపూర్ పెంట, చెన్నంపల్లి గ్రామాలను ఆధారం చేసుకొని పుట్టీలలో నదిని దాటి కర్నూలు జిల్లా శ్రీశైలం, ఆత్మకూరు మండలాల్లో దాడులు చేసి తిరిగి రావచ్చు. అమ్రాబాద్ నదీ పరివాహక ప్రాంతం నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాల అటవీ ప్రాంతాలలోకి చొరబడటం అతి సులువు. అమ్రాబాద్‌లో గతంలో మావోయిస్టులు చాలా దాడులు చేశారు. దేవరకొండ ఎమ్మెల్యే రాగ్యానాయక్‌ను కాల్చిచంపారు. అప్పట్లో కృష్ణపట్టీ దళం ఇటు నల్లగొండ, అటు గుంటూరు జిల్లాల్లో చెలరేగిపోయింది. చందంపేట, పెద అడిచర్లపల్లి మండలాల నుంచి సులువుగా నది దాటి గుంటూరు జిల్లా దాచేపల్లి, మాచవరం, వెల్దుర్తి, మాచర్ల అటవీ ప్రాంతాలకు చేరవచ్చు. ఒకప్పుడు మేళ్లచెరువు, చందంపేట మండలాల్లో మావోయిస్టులు చురుగ్గా పనిచేశారు. ఆ మండలాల నుంచి దాచేపల్లి, మాచవరం చేరుకోవచ్చు. ఇక నాగార్జున సాగర్ జలాశయం మార్గంగా రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించవచ్చు. మావోయిస్టులు పలుమార్లు గ్రేహౌండ్స్ కూంబింగ్ల నుంచి పర్యాటకుల మరబోట్లలో నదిని దాటి తప్పించుకున్నారు. 2005లో నక్సలైట్లు నల్లగొండ జిల్లా నుంచి వెళ్లి గుం టూరు జిల్లా చిలకలూరిపేట పోలీసు స్టేషన్‌పై దాడి చేశారు. ఏపీ రాష్ట్ర కమిటీ కీలక నేతలేగాక, పత్రిక, ప్రెస్, తదిరత యంత్రాంగం నల్లమల నుంచే పనిచేసేవి. కృష్ణానది, నల్లమల ఆధారంగా మావోయిస్టులు కీలకమైన తెలంగాణ, సీమాంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల మధ్య స్వేచ్ఛగా సంచరించగలుగుతారు. కాబట్టి రా్రష్ట విభజనతో మావోయిస్టులు తెలంగాణతోపాటూ సీమాం ధ్రలో కూడా విస్తరించే అవకాశాలు బలంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో రెండు పార్టీలు అధికారంలో ఉంటే పరి స్థితి మరింత జటిలం అవుతుంది. ఉత్తరాంధ్ర ఏజెన్సీ, ఒడిశా అటవీ ప్రాంతాలకు కలిపి ఏర్పడ్డ ఆంధ్ర ఒడిశా బోర్డర్ కమిటీ (ఏవోబీ) ఏపీ పోలీసులకు కొరకరాని కొయ్యగా మిగిలింది. ఏ మాత్రం వెసులుబాటు కలిగినా ఏవోబీ నాయకత్వం ఉద్యమాన్ని విశాఖ మైదానాలకు, నగరానికి కూడా విస్తరింపజేస్తుంది. కోస్తా జిల్లాల్లోని మెట్టప్రాంతాల పరిస్థితి, సాగునీటి సదుపాయాలు లేని తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల కంటే ఏమంత మెరుగు కాదు. కాబట్టి నక్సలైటు ఉద్యమవ్యాప్తికి ఇవన్నీ అనువైన ప్రాంతాలే. ముసుగు సంస్థలు- పట్టణ ఉద్యమం 1990లలోనే నక్సలైట్లు ముసుగు సంస్థలను (కవర్ సం ఘాలు) నిర్మించడం ప్రారంభించారు. ఆర్ఎస్యూ, ఆర్‌వైఎల్, సికాస వంటి బహిరంగ ప్రజాసంఘాలకు భిన్నం గా ఎలాంటి సంబంధం లేనట్టు కనిపించే కవర్ ప్రజా సంఘాలను నిర్మించడంపై దృష్టిని కేంద్రీకరించాలని యూనిటీ కాంగ్రెస్ స్పష్టం చేసింది. మావోయిస్టులు ఇప్పుడు తమ ఉనికి బయటపడకుండానే ఉద్యమాలను నిర్మిస్తున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చూస్తే కేవలం రెండు మూడేళ్ల వెసులుబాటైనా మావోయిస్టులకు చాలు. పైగా మావోయిస్టులు పట్టణాలలో ఉద్యమ నిర్మాణంపై దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ‘ప్రజాయుద్ధానికి, విముక్తి ప్రాంతాల ఏర్పాటుకు అవసరమయ్యే వివిధ రకాల శక్తిసామర్థ్యాలను కలిగిన క్యాడర్లను, నాయకులను అందించే ప్రధాన వనరు పట్టణ ప్రాంతాలే’. (అర్బన్ పర్స్పెక్టివ్). పట్టణ ప్రాంతాలకు తగిన నాయకత్వాన్ని, క్యాడర్లను పంపి, నిర్దిష్ట కాలపరిమితితో కూడిన కార్యక్రమంతో పనిచేయాలని 2004 రాజకీయ నిర్మాణ నివేదిక నిర్దేశిం చింది. ముంబై, పూణె, ఢిల్లీలలో మావోయిస్టుల ప్రాబ ల్యం విస్తరిస్తోందని జాతీయ మీడియా చెబుతోంది. గత ఏడాది మారుతీ సుజుకీ మానేసర్ కర్మాగారం కార్మిక సమ్మె, సీనియర్ ఎగ్జిక్యూటివ్ హత్యల వెనుక వారి హస్తం ఉన్నదని భావించారు. 1990ల మొదట్లో హైదరాబాద్‌లోని శివారు కార్మిక వాడలన్నిటిలోనూ నక్సలైట్లు మంచి పట్టు సాధించారు. నాటి పారిశ్రామిక అశాంతి మూలంగా పలు పారిశ్రామిక సంస్థలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. నేడు మావోయిస్టులు ‘గోల్డెన్ కారిడార్’లపై దృష్టిని కేంద్రీకరించారు. పూణె నుంచి ముంబై, సూరత్, వడోదరాలకు అటు నుంచి అహ్మదాబాద్‌కు విస్తరించిన పారిశ్రామిక కారి డార్లో ఉన్న ‘ఖాళీలను’ భర్తీ చేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో విస్తరించిన మరో పారిశ్రామిక కారిడార్‌పైన కూడా కేంద్రీకరించారు. చెన్నై, హైదరాబాద్, విశాఖ పారిశ్రామిక కేంద్రాలతో మరో విప్లవ పారిశ్రామిక కారిడార్ కోసం ప్రత్యేక నాయకత్వాన్ని కేటాయించారు. స్వల్పకాలిక ఫలి తాలను ఆశించకుండా నిర్మితమవుతున్న ఈ పట్టణ ఉద్యమ బలాన్ని అంచనా వేయడం కష్టమని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ స్టడీస్’ నిపుణులు అంటున్నారు. మూడేళ్ల క్రితం నేటి తెలంగాణ ఉద్య మం ప్రారంభమైనప్పటి నుంచి నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా పెట్టుబడులు హైదరాబాద్‌కు ముఖం చాటేస్తున్న సంగతి తెలిసిందే. నేటి రాష్ట్ర విభజన ప్రతిపాదన ఆ అనిశ్చితిని తొలగించకపోగా పొడిగిస్తుంది. దీనికి తోడు నక్సలైట్ల కారణంగా 1988-1992 మధ్య రాజధానిలో నెలకొన్న పారిశ్రామిక అశాంతి తిరిగి నెలకొంటే పెట్టుబ డులు రెండు రాష్ట్రాలకు దూరంగా జరిగే ప్రమాదం ఉం ది. రాష్ట్ర విభజన మావోయిస్టులు ఎదురుచూస్తున్న అనుకూల పరిస్థితులకు దారితీయడం అనివార్యం కావచ్చు. పైగా నక్సలైటు ఉద్యమం గత పదేళ్లలో గుణాత్మకంగా భిన్నమైన సాయుధశక్తిగా ఎదిగింది. పట్టణాలలో సుశిక్షితమైన సాయుధ ఆత్మరక్షణ దళాలను, యాక్షన్ టీంలను నిర్మించడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో తిరిగి నక్సలైటు ఉద్యమం పుంజుకుంటే ఏపీ పోలీసులు కొత్త తరం మావోయిస్టులతో పోరాడవలసి ఉంటుంది. ‘‘మన రాష్ట్రంలో నక్సలైట్ల సమస్య పరిష్కారమైపోయిందనుకోవడం తప్పు. మేం ఆ పని ఎప్పటికీ చేయలేం. అసలా పని మాదికాదు. నక్సలైట్లవల్ల తలెత్తే శాంతిభద్రతల సమస్యను అదుపులోకి తేవడం మాత్రమే మా పని. శాశ్వత పరిష్కారాన్ని చూపించాల్సింది ప్రభుత్వమే. అందుకు బదులుగా ప్రభుత్వమే నక్సలై ట్లు తయారు కావడానికి కావాల్సిన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను సృష్టిస్తే మేం చేయగలిగేది ఏమీ ఉండదు, మళ్లీ కథ మొదటికే వస్తుంది’’ అంటూ ఒక మాజీ పోలీసు ఉన్నతాధికారి ఆందోళన వెలిబుచ్చారు. - చెవుల కృష్ణాంజనేయులు