సీమాంధ్ర నుంచే తెలంగాణకు నక్సలిజం
టీఆర్‌ఎస్ నేత పేర్వారం వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతం నుంచే తెలంగాణకు నక్సలిజం వచ్చిందని మాజీ డీజీపీ, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు పేర్వారం రాములు వ్యాఖ్యానించారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడారు. పశ్చిమబెంగాల్‌లో పుట్టిన నక్సలిజం సీమాంధ్రకు ముందుగా చేరిందన్నారు. 1980 ప్రాంతంలో సీమాంధ్ర నుంచి వరం గల్ జిల్లాకు వలస వచ్చి అక్రమంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందినవారే నక్సలిజాన్ని వ్యాపింపజేశారని ఆరోపించారు.
1980కు ముందు తెలంగాణలో నక్సలిజమే లేదని, ఈ విషయం రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డికి తెలియదా? అని పేర్వారం ప్రశ్నించారు. అప్పటి నుంచి తెలంగాణలో జరిగిన విధ్వంసం, ప్రాణ, ఆస్తినష్టం సామాన్యమైనది కాదన్నారు. సీమాంధ్ర వలసవాదులు వ్యాపింపజేసిన నక్సలిజం నుండి విముక్తి కావడానికి తెలంగాణకు 20 ఏళ్లు పట్టిందన్నారు. ఇప్పుడు తెలంగాణలో నక్సలైట్ల రిక్రూట్‌మెంట్ లేదని.. దీనిని సాధికారికంగా, గర్వంగా చెప్తున్నానన్నారు. సరైన అక్షరాస్యతతో ఉన్నత ఉద్యోగావకాశాలు రావడం, కుల సంఘాల ప్రభావం వంటివాటి వల్ల నక్సలిజం వైపు ఆకర్షణ తగ్గిందన్నారు. ఇప్పుడు 60 ఏళ్లు దాటినవారు తప్ప యువత నక్సలైట్లలో లేదన్నారు. గతంలో తాను వరంగల్ జిల్లాలోని ఊరికి పోతే వందల పోలీసులు రక్షణగా ఉండాల్సి వచ్చేదని... ఇప్పుడైతే ఒకే గన్‌మన్‌తో వెళ్తున్నట్టు చెప్పారు. ఐనా నక్సలిజం తెలంగాణకే పరిమితమైన సమస్యగా చిత్రీకరించే కుట్రకు సీమాంధ్రులు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇవన్నీ ఆంజనేయరెడ్డికి తెలియకుండానే మాట్లాడుతున్నాడా? అని ప్రశ్నించారు.