బంధం వీడింది | President signs ordinance to merge 7 Telangana mandals with Seemandhra | Sakshi
Sakshi News home page

బంధం వీడింది

Published Fri, May 30 2014 2:02 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

President signs ordinance to merge 7 Telangana mandals with Seemandhra

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సుదీర్ఘ అనుబంధం వీడిపోయింది. జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు, వారి సంస్కృతి, సంప్రదాయాలు,  అడవితల్లి అందాలు జిల్లా నుంచి విడిపోనున్నాయి. జిల్లాలోని పోలవరం ముంపు మండలాలన్నింటినీ తెలంగాణ నుంచి వేరుచేసేందుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆర్డినెన్స్‌ను ఆమోదిస్తూ సంతకం చేయడంతో కేంద్ర న్యాయ శాఖ గురువారం గెజిట్ జారీ చేసింది.

ఈ గెజిట్ ప్రకారం జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గం పాడు, భద్రాచలం, వీఆర్‌పురం, చింతూరు, కూనవరం మండలాలన్నీ సీమాంధ్ర ప్రాంతంలోకి వెళ్లనున్నాయి. అయితే, భద్రాచలం మండలంలోని భద్రాచలం పట్టణం (రెవెన్యూ గ్రామం)తోపాటు బూర్గంపాడు మండలంలోని 12 గ్రామాలు మాత్రం తెలంగాణలోనే ఉం టాయి. జూన్ రెండు నుంచి సాంకేతికంగా ఈ మండలాలన్నీ ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ నుంచి విడిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా రూపురేఖలే మారిపోతాయి. స్థానిక సంస్థల స్థానాలు, జిల్లా జనాభా, మండలాలు తగ్గిపోనున్నాయి.

గెజిట్‌లో పేర్కొన్న ప్రకారం భద్రాచలం రామయ్య మినహా భద్రాచలం ఏజెన్సీలోని నాలుగు మండలాలు పూర్తిగా సీమాంధ్రలోకి వెళతాయి. అయితే, మొదటి నుంచీ కొంత గందరగోళంగా ఉన్న బూర్గంపాడు మండలం విషయంలో స్పష్టత వచ్చింది. బూర్గంపాడు మండలంలోని పినపాక, మోరంపల్లి బంజర, బూర్గంపాడు, నాగినేనిప్రోలు, కృష్ణసాగర్, టేకుల, సారపాక, ఇరవెండి, మోతెపట్టినగర్, ఉప్పుసాక, సోంపల్లి, నకిరిపేట రెవెన్యూ గ్రామాలు తెలంగాణలోనే ఉండనున్నాయి. మిగిలిన గ్రామాలు సీమాంధ్రలో కలవనున్నాయి. అయితే, కేవలం ప్రాంతాలను విలీనం చేస్తూ గెజిట్ జారీ చేశారు కానీ ముంపు బాధితుల పునరావాసానికి సంబంధించి ఎలాంటి ప్రస్తావనా గెజిట్‌లో చేయకపోవడం గమనార్హం.

 మరి మండలాలెన్నో!
 ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపడంతో జిల్లాలోని మండలాల సంఖ్యలో మార్పు జరగనుంది. మొత్తం జిల్లాలో ఇప్పటివరకు 46 మండలాలుండగా, ఏడు మండలాలను వేరుచేయడంతో ఆ సంఖ్య 39కి తగ్గనుంది. అయితే, భద్రాచలం పట్టణంతో పాటు బూర్గంపాడు మండలంలోని 12 గ్రామాలు తెలంగాణలోనే ఉండడంతో, వాటన్నింటిని కలిసి ఒక మండలం చేసే ఆలోచనలో జిల్లా అధికార యంత్రాంగం ఉంది. అలా జరిగితే మండలాల సంఖ్య 40 కానుంది.

 అయితే, కొత్తగా ఏర్పాటు చేయనున్న మండలానికి మండల కేంద్రంలో ఎక్కడన్నది అప్పుడు ప్రశ్నార్థకమవుతోంది. ఎందుకంటే భద్రాచలంతోపాటు బూర్గంపాడు మండల కేంద్రమైన బూర్గంపాడు కూడా తెలంగాణలోనే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో గోదావరి అవతల ఉన్న భద్రాచ లాన్ని మండల కేంద్రంగా చేస్తారా? గోదావరి ఇవతల ఉన్న బూర్గంపాడును మండల కేంద్రంగా చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. అయితే, ఈ రెండింటిని కలపడం అసెంబ్లీ స్థానాల వారీగా ఇబ్బందులను కలిగిస్తుంది. ఎందుకంటే భద్రాచలం అసెంబ్లీ పరిధిలో భద్రాచలం పట్టణం ఉండగా బూర్గంపాడులోని 12 గ్రామాలు పినసాక అసెంబ్లీ పరిధిలోనికి వస్తాయి. ఈ నేపథ్యంలో వీటన్నింటినీ కలిపి ఒక మండలం చేయడం కష్టసాధ్యమవుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో భద్రాచలం రెవెన్యూ గ్రామ జనాభా 50వేలకు పైగా ఉన్నందున దానిని ప్రత్యేక మండలంగా చేసి, మిగిలిన 12 గ్రామాలను బూర్గంపాడు మండలంగా ఉంచితే ఎలాంటి సమస్యా ఉండదు. అప్పుడు జిల్లాలో మండలాల సంఖ్య 41 కానుంది.

 జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తారా?
 ముంపు మండలాలు సాంకేతికంగా సీమాంధ్రలోనికి వెళ్లిపోతే ఆయా మండలాల్లో గత ఎన్నికలలో జెడ్పీటీసీలుగా గెలుపొందిన వారికి జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికలో అవకాశం కల్పిస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అధికారికంగా ఆయా మండలాలు సీమాంధ్రకు వెళ్లిపోయాయి కాబట్టి ఖమ్మం జెడ్పీ చైర్మన్ ఎన్నికలో వీరికి ఎలాంటి ప్రాధాన్యం ఉండకపోవచ్చని అధికారవర్గాలంటున్నాయి. అయితే, ముంపు మండలాల్లో కేవలం ఐదు జెడ్పీటీసీలకు మాత్రమే ఎన్నికలు జరగ్గా అందులో మూడు టీడీపీ, రెండు వైఎస్సార్‌సీపీలు గెలిచాయి. వీఆర్‌పురం, కూనవరం, భద్రాచలంలలో టీడీపీ గెలుపొందగా, బూర్గంపాడు, చింతూరులో వైఎస్సార్‌సీపీ గెలిచాయి. ఈ పరిస్థితులలో టీడీపీ బలం మూడు స్థానాలు తగ్గి 19కి పడిపోతుంది.

అప్పుడు మొత్తం 40 మండలాలుంటే 21 జెడ్పీటీసీలు, 41 మండలాలయితే 22 జెడ్పీటీసీ స్థానాలు టీడీపీకి అవసరం అవుతాయి. 41 మండలాలుంటే భద్రాచలం, బూర్గంపాడులకు చెందిన ఒక్కో స్థానం టీడీపీ, వైఎస్సార్‌సీపీ ఖాతాలోనే ఉంటాయి. లేదంటే ఈ ప్రాంతాలను కలిపి ఒకే మండలం చేస్తే మండల కేంద్రం ఎక్కడ ఉంటే ఆ జెడ్పీటీసీని పరిగణనలోకి తీసుకుంటారు. ఈ పరిస్థితిలో జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికలో బలాబలాల సంఖ్యలో కూడా మార్పు రానుంది. అయితే, ఖమ్మం జిల్లా పరిధిలోనే ఎన్నికలు జరిగినందున జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికలో ముంపు మండలాల ప్రతినిధులకు అవకాశం ఇవ్వాలా లేక సీమాంధ్రకు వెళ్లిపోయారు కాబట్టి ఇవ్వకూడదా అనే అంశంపై స్పష్టత కోరుతూ జిల్లా యంత్రాంగం ఎన్నికల సంఘానికి నివేదించనుంది. ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు దీనిపై స్పష్టత రానుంది.

 ఎమ్మెల్యే మనకే
 భద్రాచలం అసెంబ్లీ పరిధిలోని నాలుగు మండలాలు ముంపు కింద సీమాంధ్రలో కలిసిపోయినప్పటికీ అసెంబ్లీ స్థానాల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని అధికార వర్గాలంటున్నాయి. ఎందుకంటే శాసనసభా స్థానాల మార్పు పూర్తిగా పునర్విభజనపై ఆధారపడి ఉంటాయి. అసెంబ్లీ స్థానాల పునర్విభజన ఇప్పట్లో ఉండదు కాబట్టి చర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలతో పాటు భద్రాచలం పట్టణం కలిపి భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంగా ఉంటుంది. అదే పునర్విభజన సమస్య ప్రకారం ఇప్పుడు ముంపు పేరుతో సీమాంధ్రలోనికి వెళుతున్న ఏడు మండలాలను ఆ ప్రాంతంలోని ఏ అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గంలో కూడా కలిపే వీలులేదు.

మరి అలాంటప్పుడు ఆ మండలాల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకం కానుంది. అయితే, అధికారికంగా నియోజకవర్గాల పునర్విభజన జరగకపోయినా ప్రస్తుత ఆర్డినెన్స్‌కు పార్లమెంటులో చట్టం చేసే సమయంలో సవరణలు చేసి ఈ మండలాలు ఆంధ్రలోని ఏ నియోజకవర్గంలోనికి వెళ్లాలో నిర్ణయించవచ్చని అధికారులంటున్నారు. అయితే, అదే సమయంలో ఆర్డినెన్స్‌కు మార్పులు చేయాల్సి వస్తే భద్రాచలం పట్టణం నుంచి తెలంగాణలోనే ఉండే దుమ్ముగూడెం, చర్ల, వాజేడు మండలాలకు వెళ్లే మార్గంలో ఉన్న మూడు రెవెన్యూ గ్రామాలు సీమాంధ్రలోకి వెళుతున్నాయి. అలాంటప్పుడు భద్రాచలం నుంచి ఆ మూడు మండలాలకు రహదారి సౌకర్యం లేకుండా పోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ మూడు గ్రామాలను తెలంగాణలోనే ఉంచుతూ ఆర్డినెన్స్‌లో మార్పులు జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement