పోలగరం..
శాసనసభ, మండలిలో వేడివేడిగా చర్చ
కేంద్రంపై బాబు ఒత్తిడి వల్లే ఆర్డినెన్స్: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడంపై ఉభయసభల్లో గురువారం గరంగరం చర్చ జరిగింది. అసెంబ్లీలోనూ శాసనమండలిలోనూ ఈ విషయమై సభ్యులు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ప్రతిపక్షాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలవరంపై ప్రతిపక్షపార్టీ అధ్యక్షుల అభిప్రాయమేమిటో స్పష్టం చేయాలని సీఎం డిమాండ్ చేశారు. అలా కుదరదని, ఆ ప్రాంత ప్రజాప్రతినిధుల అభిప్రాయాలనే పరిగణనలోకి తీసుకోవాలని ప్రతిపక్షాలన్నాయి. ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ మండలి తీర్మానం చేయాలని కాంగ్రెస్ కోరింది. సీఎం నేతృత్వంలో అఖిలపక్ష బృందం ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీకి విన్నవించాలని డిమాండ్ చేసింది.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఒత్తిడి వల్లే పోలవరం ఆర్డినెన్స్ జారీ అయిందని కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పోలవరం అంశాన్ని ప్రస్తావించారు. ‘‘నేను తెలంగాణ వాడిని. కానీ నా మండలం, ఊరు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లాయి.
నేను ఇక్కడున్నా నా ఓటు, భూమి, గుర్తింపు కార్డు వంటివన్నీ అక్కడున్నాయి’’ అని ఆవేదన వెలిబుచ్చారు. పోలవరం ఆర్డినెన్స్ వల్ల అమాయక గిరిజనులు అన్యాయానికి గురవుతారన్నారు. దాన్ని వెనక్కు తీసుకునేలా ప్రయత్నించాలని సూచించారు. ‘మేం ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు. అయితే ముంపు సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలి’ అని సూచించారు. కేసీఆర్ జోక్యం చేసుకుని, ఈ విషయాన్ని మీ పార్టీ అధ్యక్షులకు చెప్పండని సూచించారు. ‘‘ముందు మీరు కండువాలు కప్పుకున్న పార్టీలు దీనిపై స్పష్టంగా ముందుకు రావాలి. అవి రాకపోతే మీరు బయటకు రండి. పోలవరంపై టీడీపీ కూడా వైఖరి స్పష్టం చేయాలి. ఒక పార్టీకి ఒకే సిద్ధాంతం, ఒకే అభిప్రాయం ఉండాలి.
ఈ విషయంలో బాబు దుశ్చర్యకు పాల్పడ్డారు. జూన్ 2న ఆయన ఢిల్లీకి వెళ్లి ఒత్తిడి తేవడం వల్లే కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చింది. దీనిపై నేనిప్పటికే రాష్ర్టపతికి, ప్రధానికి లేఖలు రాశాను. బంద్ కూడా పాటించాం’’ అన్నారు. పోలవరం విషయంలో పార్టీలతో నిమిత్తం లేకుండా, తెలంగాణ ప్రజాప్రతినిధుల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని విపక్ష నేత జానారెడ్డి సూచించారు. పార్టీల అభిప్రాయాలను పట్టించుకోనవసరం లేదన్నారు. దీనిపై రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించొద్దని, వేరే పార్టీలపై ఒత్తిడి తేవద్దని రేవంత్‌రెడ్డి (టీడీపీ) సూచించారు. పోలవరం ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించాలని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి మండలిలో డిమాండ్ చేశారు. ఏడు మండలాలను అప్రజాస్వామికంగా ఆంధ్రలో కలిపేయడంపై భద్రాచలం గిరిజన ప్రాంతం అట్టుడికిపోతోందన్నారు. గవర్నర్ ప్రసంగంలో పోలవరం ఆర్డినెన్స్ ప్రస్తావనే లేదంటూ బి.వెంకటేశ్వర్లు (టీడీపీ) ఆక్షేపించారు.