హైదరాబాద్ పై బాబు పెత్తనం ఏంటి?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ నగరం పై బాబు పెత్తనం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు అతిథిలాగా మాత్రమే ఉండాలని సూచించారు. పోలవరం ఆర్డినెన్స్ పై ఆదివారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. పోలవరం ముంపు గ్రామాల్ని ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ లోక్‌సభలో ఆర్డినెన్స్‌ను ఆమోదించడాన్ని ఆయన తప్పుబట్టారు. అసలు ఆ బిల్లుపై కేంద్రం వ్యవహరించిన తీరు అప్రజాస్వామికం అని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల హక్కుల్ని కాలరాస్తూ.. అధికార బలంతో ఆర్డినెన్స్ కు చట్టబద్దత కల్పించారని విమర్శించారు. పోలవరంపై రాజ్యసభలో ఓటింగ్ కు పట్టుబడతామన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామని కేటీఆర్ తెలిపారు.
టీటీడీపీ ఎంపీలు తెలంగాణ ప్రజల వైపు ఉండాలనుకుంటున్నారో..లేక చంద్రబాబు తొత్తులుగా ఉండాలనుకుంటున్నారో తేల్చుకోవాలన్నారు.టీడీపీ, బీజేపీ నేతలు తమ పోరాటంతో కలిసి రావాలన్నారు. పోలవరం ప్రాజెక్టు తాము వ్యతిరేకం కాదని..డిజైన్ మార్చమని మాత్రమే డిమాండ్ చేస్తున్నామన్నారు.