విభజనతో వెసులుబాటు! | Naxal problem may raise after Andhra Pradesh bifurcation | Sakshi
Sakshi News home page

విభజనతో వెసులుబాటు!

Published Sat, Aug 17 2013 12:30 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM

విభజనతో వెసులుబాటు!

విభజనతో వెసులుబాటు!

విశ్లేషణ: ‘‘మన రాష్ట్రంలో నక్సలైట్ల సమస్య పరిష్కారమైపోయిందనుకోవడం తప్పు. నక్సలైట్లవల్ల తలెత్తే శాంతిభద్రతల సమస్యను అదుపులోకి తేవడం మాత్రమే మా పని. శాశ్వత పరిష్కారాన్ని చూపించాల్సింది ప్రభుత్వమే. అందుకు బదులుగా ప్రభుత్వమే నక్సలై ట్లు తయారు కావడానికి కావాల్సిన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను సృష్టిస్తే మేం చేయగలిగేది ఏమీ ఉండదు, మళ్లీ కథ మొదటికే వస్తుంది’’ అంటూ ఒక మాజీ పోలీసు ఉన్నతాధికారి ఆందోళన వెలిబుచ్చారు.
 
 మూడేళ్ల క్రితం నేటి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా పెట్టుబడులు హైదరాబాద్‌కు ముఖం చాటేస్తున్న సంగతి తెలిసిందే. నేటి రాష్ట్ర విభజన ప్రతిపాదన ఆ అనిశ్చితిని తొలగించకపోగా పొడిగిస్తుంది. దీనికి తోడు  నక్సలైట్ల కారణంగా 1988-1992 మధ్య రాజధానిలో నెలకొన్న పారిశ్రామిక అశాంతి తిరిగి నెలకొంటే పెట్టుబడులు రెండు రాష్ట్రాలకు దూరంగా జరిగే ప్రమాదం ఉంది.
 
 కాంగ్రెస్‌పార్టీ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్ల సమ స్య తిరిగి చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో నక్సలైట్ల సమస్య తిరిగి మొదటికి వస్తుందని పలువురు సీనియర్ పోలీసు అధికారులు ఆందోళన చెందుతున్నారు. అలాంటి భయా లు నిరాధారమైనవని తెలంగాణవాదులు కొట్టిపారేస్తున్నారు. రాష్ట్ర విభజనతో సంబంధం లేకుండానే అందరూ అంగీకరించే వాస్తవం ఒకటుంది. దేశవ్యాప్తంగా అసంతృప్తి, ఆందోళనల వ్యాప్తికి అనువైన పరిస్థితులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఆ కారణంగానే మావోయిస్టులు కేరళ నుంచి ఈశాన్యం, జమ్మూ-కాశ్మీర్ వరకు విస్తరించగలిగారు.
 
 21 రాష్ట్రాల్లో 18 రాష్ట్ర కమిటీలతో ఆ పార్టీ పనిచేస్తోంది. దండకారణ్యంగా పిలిచే మధ్య భారతంలో కేంద్ర బలగాలు చేపట్టిన ‘గ్రీన్‌హంట్’ ఆశించిన ఫలితాలిస్తున్న దాఖలాలులేవు. పైగా ఆర్థికవ్యవస్థ ఇప్పట్లో మాంద్య పరి స్థితుల నుంచి బయటపడే సూచనలు లేవు. గ్రామీణ, పట్టణ నిరుద్యోగం వేగంగా పెరుగుతోంది. పెరిగే ధరలకు తోడు, సంక్షేమ వ్యయాల, సబ్సిడీల కోతలు సామాన్యులలో అసంతృప్తిని పెంచుతున్నాయి. ప్రత్యేకించి ఆంధ్ర ప్రదేశ్‌లో వైఎస్ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధం గా అమలైన సంక్షేమ పథకాలను అటకెక్కించారు. దీంతో మన రాష్ట్ర ప్రజానీకంలో అసంతృప్తి ప్రబలుతున్నది. ఈ పరిస్థితుల నేపథ్యం నుంచి చూస్తే రాష్ట్ర విభజనతో రెండు రాష్ట్రాల్లోనూ మావోయిస్టు ఉద్యమం పుంజుకునే అవకాశాలే హెచ్చుగా ఉన్నాయి.
 
 మావోయిస్టు అగ్రనేతల ప్రతిష్టకు సవాలు
 పార్టీ యూనిటీ, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ వంటి ఇతర రాష్ట్రాలకు చెందిన నక్సలైట్ పార్టీలు విలీనమైనా నేటికీ మావోయిస్టు పార్టీ అగ్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్ నేతలదే. మల్లోజుల కోటేశ్వరరావు, చెరుకూరి రాజ్‌కుమార్‌లు మరణించినా అత్యున్నతస్థాయి పొలిట్‌బ్యూరోలోని ఏడుగురిలో ఐదుగురు ఏపీకి చెందినవారే. వారిలో నలుగురు తెలంగాణకు చెందినవారు. స్వరాష్ట్రంలో ఉద్యమం దెబ్బ తినడంతో ఏపీ అగ్రనాయకత్వం ఇతర రాష్ట్రాల్లో పలు సవాళ్లను ఎదుర్కోవాల్సివస్తోంది. ఒడిశా మాజీ మావోయిస్టు నేత సవ్యసాచి పాండా ‘తెలుగువారి ఆధిపత్యమే’ తన తిరుగుబాటుకు కారణమని చెప్పడం గమనార్హం. ‘ఉద్యమ ప్రాంతాలకు నాయకత్వం’ అన్నది ఏపీ నేతలే తెచ్చిన నిర్మాణ సూత్రం.
 
  ఏపీ నేతల ప్రతిష్ట మసకబారడానికి అదే కారణమవుతోంది. కాబట్టి ఏపీలో ఉద్యమ పునర్నిర్మాణం వారికి తక్షణావసరం. ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో మార్పులను పరిగణనలోకి తీసుకోక మావోయిస్టులు గుడ్డిగా పాత పంథానే కొనసాగిస్తుం డటంవల్లనే ఉద్యమ పునర్నిర్మాణం కావడం లేదనేది వాస్తవం కాదు. 2001 నాటికే ఉత్తర తెలంగాణలో 1980 నుంచి 1990ల చివరి వరకు జరిగిన మార్పులపై ఆ పార్టీ లోతైన  అధ్యయనాన్ని నిర్వహించింది.
 
 ఆ పార్టీ తొమ్మిదవ (యూనిటీ) కాంగ్రెస్ (2004) ఆమోదించిన ‘వ్యూహం-ఎత్తుగడలు’, దానిపై ఆధారపడి రూపొందిన ‘పట్టణ ప్రాంతాలలోని పని’ (అర్బన్ పర్‌స్పెక్టివ్ 2007) అనే డాక్యుమెంట్లలో ఆ నూతన అవగాహన కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దేశ ‘ఆర్థిక కేంద్రం గ్రామీణ ప్రాంతాల నుం చి పట్టణ ప్రాంతాలకు మారింద’ని అవి పేర్కొనడం విశేషం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మారిన పరిస్థితులకు తగిన ఎత్తుగడలను, పని పద్ధతులను ఆ డాక్యుమెం ట్లు సూచించాయి. రాష్ట్రంలో తిరిగి పాగా వేయడానికి అవసరమైన సైద్ధాంతిక కసరత్తును పూర్తి చేసిన మావోయిస్టులు రాష్ట్ర విభజనవల్ల ఏర్పడే ‘తాత్కాలిక వెసులుబాటు’ను ఉపయోగించుకోడానికి సకల శక్తులను ఒడ్డుతారనడంలో సందేహం లేదు.
 
 తెలంగాణలో పాగా ఖాయం
 దక్షిణాదిలో ఉద్యమ పునరుద్ధరణకు ఆ పార్టీ పకడ్బందీగా అమలుచేస్తున్న పథకం వివరాలు 2011, డిసెంబర్ 8న నాటి హోంశాఖ స్టేట్ మంత్రి జితేందర్‌సింగ్ లోక్‌సభలో చేసిన ప్రకటనలో ఉన్నాయి. కేరళ వైనాడ్ జిల్లా నుంచి కర్ణాటకలోని మైసూర్ జిల్లాల వరకు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు విస్తరించారు. సాయుధ గె రిల్లా దళాలు ఆ అడవుల్లో పనిచేస్తున్నాయి. కేరళ, తమిళనాడు సరిహద్దుల్లోని నీలంబూర్-గిడలూల్ అటవీ ప్రాంతంలో కూడా దళాలు పనిచేస్తున్నాయి. మరోవంక తెలంగాణకు, ఛత్తీస్‌గఢ్‌కు ఆనుకొని ఉన్న మహారాష్ట్రలోని నాగపూర్, వార్ధా, భండారా, యవత్‌మాల్ జిల్లాలకు వారి ఉద్యమం విస్తరి స్తోంది. ఒకప్పుడు రాష్ట్రం, పొరుగు రాష్ట్రాల్లో ఉద్యమ వ్యాప్తికి తోడ్పడితే, నేడు మావోయిస్టులు పొరుగు రాష్ట్రాలను చుట్టుముట్టి రాష్ట్రంలో ఉద్యమాన్ని పునర్నిర్మించే వ్యూహాన్ని అమలుచేస్తున్నారు.  
 
 కొత్త రాష్ట్రాల కొత్త ప్రభుత్వాలు, యంత్రాంగాల ఏర్పాటుకు, అవి నిలదొక్కుకొని స్థిరపడటానికి కనీసం రెండు మూడేళ్లయినా పడుతుంది. మావోయిస్టులు (ఒకప్పటి కొండపల్లి వర్గం నక్సలైట్లు) 1969 నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ప్రజా పునాదిని సమకూర్చే సాధనంగా చూస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా నక్సలైట్ల ప్రాబల్యం పైకి కనబడిన దానికంటే ఎక్కువే. రాష్ట్ర విభజన తదుపరి ఏర్పడే రెండు ప్రభుత్వాలకు వెంటనే నక్సలైట్లపై దృష్టిని కేంద్రీకరించడం సాధ్యం కాదు. మావోయిస్టు శాంతి భద్రతల సమస్యను, హింసాత్మక ఘటనలను అవి కోరుకోవు. కాబట్టి నక్సలైట్ల విషయంలో అవి తాత్కాలికంగానే అయినా ఉదారవైఖరిని చూపకతప్పదు. మావోయిస్టులు ఆ అపూర్వ అవకాశం వదులుకోకపో వచ్చు.
 
 గోదావరికి ఆవలి దండకారణ్యాన్ని (ఛత్తీస్‌గఢ్) కేంద్రంగా చేసుకొని జినుగు నర్సింహారెడ్డి, పుల్లెల ప్రసాదరావు వంటి అగ్రనేతల నేతృత్వంలో వివిధ జిల్లా కమిటీలు తెలంగాణతో సజీవ సంబంధాలను కొనసాగిస్తున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి, మంగి ఏరియా కమిటీలు, ఖమ్మం జిల్లాలో వెంకటాపూర్, శబరి ఏరియా కమిటీలు గుట్టుగా పనిచేస్తున్నాయి. విభజన వల్ల కలిగే ‘తాత్కాలిక వెసులుబాటు’ మూలంగా మావోయిస్టులకు ఒకప్పడు పెట్టని కోటలైన ఖమ్మం, వరంగ ల్, కరీంనగర్ జిల్లాల్లో వారు తిరిగి పాగా వేయడం తథ్యమని సీని యర్ పోలీసు అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.  
 
 సరిహద్దులలో మావోయిస్టుల దాడుగుమూతలు
 కేంద్ర హోంశాఖ నేతృత్వంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా గత నాలుగేళ్లుగా కేంద్ర బలగాల ‘గ్రీన్‌హంట్’ సాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం ప్రధాన కారణంగా 50 వేలకుపైగా కేంద్ర బలగాలు రంగంలో ఉన్నా, మావోయిస్టులపై పైచేయి సాధించలేకపోతున్నాయి. కేంద్ర హోంశాఖ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయం లోపించి, భిన్న నాయకత్వ కేంద్రాలుగా మారినస్థితే ఇందుకు కారణం.
 
 ఏపీలో నక్సలైట్ల ఆటకట్టిం చడంలో కీలకపాత్ర వహించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థను, ఇన్ఫార్మర్ల నెట్‌వర్క్‌ను నిర్మించడంలో రాష్ట్రాల నుంచి సహకారం అందడంలేదని కేంద్ర హోంశాఖ ఆరోపిస్తోం ది. కేంద్ర కమాండ్, స్థానిక బలగాలను చిన్నచూపు చూస్తోందని రాష్ట్రాలు వాపోతున్నాయి. దీనికి తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే పార్టీకి చెందినవి కాకపోవడం కూడా సమస్యగా మారుతోంది. ఛత్తీస్‌గఢ్, జార్ఖం డ్, ఒడిశాలలో పలు సందర్భాలలో అధికార పార్టీలు స్వీయప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.
 
 ఈ పరిస్థితులను అందిపుచ్చుకుని మావోయిస్టులు కేంద్ర బలగాలపై భారీ దాడులను కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల మధ్యా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ల మధ్యా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌ల మధ్యా మావోయిస్టులు భద్రతాబలగాలతో దాగుడుమూతలు ఆడుతున్నారు. అటు సన్నాహాలు జరిపి, ఇటు దాడులు చేస్తున్నారు.
 
 ఇటు దాడి చేసి, అటు రక్షణ పొందుతున్నారు. ఒడిశా పోలీసులతో సమన్వయ లోపం కారణంగానే 33 మంది ఏపీ గ్రేహౌండ్స్ పోలీసులు 2008లో బలిమెల వద్ద బలైపోయారు. ఖమ్మం జిల్లా పూవర్తి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో మృతి చెందిన ఎస్‌ఐ ప్రసాద్‌బాబు మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్ ప్రాంతం నుంచి తరలించడానికి మూడు రోజులు పట్టింది. అదికూడా హక్కులనేతల సహాయంతో. కేంద్ర హోంశాఖ ఈ మూడు మావోయిస్టు తిరుగుబాటు సరిహద్దు ప్రాంతాలను ‘త్రికోణం’గా అభివర్ణించింది. రాష్ట్ర విభజన ఆ త్రికోణానికి నాలుగో కోణాన్ని చేర్చి చతురస్రంగా మారుస్తుంది.
 
 నల్లమల ఉద్యమ పునరుజ్జీవం... ‘నాలుగో కోణం’
 సీమాంధ్రలోని 13 జిల్లాల్లో 7 జిల్లాలకు తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలతో సరి హద్దు ఉంది. మెదక్‌తో కలిపి ఆ నాలుగు జిల్లాలు దక్షిణ తెలంగాణ ప్రాంతీయకమిటీ కింద బలమైన ఉద్యమ కేంద్రాలు. అప్పట్లో కృష్ణానది మీదుగా మావోయిస్టులు మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల నుంచి కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోకి యథేచ్ఛగా రాకపోకలు సాగించేవారు.
 
 ఆ నాలుగు జిల్లాల్లో విస్తరించిన నల్లమల మావోయిస్టులకు పెట్టనికోట. కొల్లాపూర్, పెద కొత్తపల్లి, లింగాల, అమ్రాబాద్ మండలాలు నక్సలైట్లకు అప్పట్లో మంచి పట్టున్న ప్రాంతాలు. కొల్లాపూర్ మండలం సోమశిల, అమరగిరి, మొలచింతపల్లి, ఎర్రగట్టు బొల్లారం ప్రాంతాల్లో కృష్ణ దాటితే కర్నూలు జిల్లా కొత్తపల్లి మం డలం సిద్ధేశ్వరం, సంగమేశ్వరం, కపిలేశ్వరం, బలపాలదిబ్బ అటవీ ప్రాంతాలకు చేరుకోవచ్చు. కొల్లాపుర్-సోమశిల మధ్యనే ఐపీఎస్ అధికారి పరదేశీనాయుడును మావోయిస్టులు హతమార్చారు. మాజీ ఎమ్మెల్యే రంగదాస్‌ను కాల్చిచంపారు.
 
 లింగాల, అప్పాయిపల్లి, అప్పాపూర్ పెంట, చెన్నంపల్లి గ్రామాలను ఆధారం చేసుకొని పుట్టీలలో నదిని దాటి కర్నూలు జిల్లా శ్రీశైలం, ఆత్మకూరు మండలాల్లో దాడులు చేసి తిరిగి రావచ్చు. అమ్రాబాద్ నదీ పరివాహక ప్రాంతం నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాల అటవీ ప్రాంతాలలోకి చొరబడటం అతి సులువు. అమ్రాబాద్‌లో గతంలో మావోయిస్టులు చాలా దాడులు చేశారు. దేవరకొండ ఎమ్మెల్యే రాగ్యానాయక్‌ను కాల్చిచంపారు. అప్పట్లో కృష్ణపట్టీ దళం ఇటు నల్లగొండ, అటు గుంటూరు జిల్లాల్లో చెలరేగిపోయింది. చందంపేట, పెద అడిచర్లపల్లి మండలాల నుంచి సులువుగా నది దాటి గుంటూరు జిల్లా దాచేపల్లి, మాచవరం, వెల్దుర్తి, మాచర్ల అటవీ ప్రాంతాలకు చేరవచ్చు.
 
 ఒకప్పుడు మేళ్లచెరువు, చందంపేట మండలాల్లో మావోయిస్టులు చురుగ్గా పనిచేశారు. ఆ మండలాల నుంచి దాచేపల్లి, మాచవరం చేరుకోవచ్చు. ఇక నాగార్జున సాగర్ జలాశయం మార్గంగా రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించవచ్చు. మావోయిస్టులు పలుమార్లు గ్రేహౌండ్స్ కూంబింగ్‌ల నుంచి పర్యాటకుల మరబోట్లలో నదిని దాటి తప్పించుకున్నారు. 2005లో నక్సలైట్లు నల్లగొండ జిల్లా నుంచి వెళ్లి గుం టూరు జిల్లా చిలకలూరిపేట పోలీసు స్టేషన్‌పై దాడి చేశారు. ఏపీ రాష్ట్ర కమిటీ కీలక నేతలేగాక, పత్రిక, ప్రెస్, తదిరత యంత్రాంగం నల్లమల నుంచే పనిచేసేవి.
 
 కృష్ణానది, నల్లమల ఆధారంగా మావోయిస్టులు కీలకమైన తెలంగాణ, సీమాంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల మధ్య స్వేచ్ఛగా సంచరించగలుగుతారు. కాబట్టి రా్రష్ట విభజనతో మావోయిస్టులు తెలంగాణతోపాటూ సీమాం ధ్రలో కూడా విస్తరించే అవకాశాలు బలంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో రెండు పార్టీలు అధికారంలో ఉంటే పరి స్థితి మరింత జటిలం అవుతుంది.
 
 ఉత్తరాంధ్ర ఏజెన్సీ, ఒడిశా అటవీ ప్రాంతాలకు కలిపి ఏర్పడ్డ ఆంధ్ర ఒడిశా బోర్డర్ కమిటీ (ఏవోబీ) ఏపీ పోలీసులకు కొరకరాని కొయ్యగా మిగిలింది. ఏ మాత్రం వెసులుబాటు కలిగినా ఏవోబీ నాయకత్వం ఉద్యమాన్ని విశాఖ మైదానాలకు, నగరానికి కూడా విస్తరింపజేస్తుంది. కోస్తా జిల్లాల్లోని మెట్టప్రాంతాల పరిస్థితి, సాగునీటి సదుపాయాలు లేని తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల కంటే ఏమంత మెరుగు కాదు. కాబట్టి నక్సలైటు ఉద్యమవ్యాప్తికి ఇవన్నీ అనువైన ప్రాంతాలే.
 
 ముసుగు సంస్థలు- పట్టణ ఉద్యమం
 1990లలోనే నక్సలైట్లు ముసుగు సంస్థలను (కవర్ సం ఘాలు) నిర్మించడం ప్రారంభించారు. ఆర్‌ఎస్‌యూ, ఆర్‌వైఎల్, సికాస వంటి బహిరంగ ప్రజాసంఘాలకు భిన్నం గా ఎలాంటి సంబంధం లేనట్టు కనిపించే కవర్ ప్రజా సంఘాలను నిర్మించడంపై దృష్టిని కేంద్రీకరించాలని యూనిటీ కాంగ్రెస్ స్పష్టం చేసింది. మావోయిస్టులు ఇప్పుడు తమ ఉనికి బయటపడకుండానే ఉద్యమాలను నిర్మిస్తున్నారు.
 
 ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చూస్తే కేవలం రెండు మూడేళ్ల వెసులుబాటైనా మావోయిస్టులకు చాలు. పైగా మావోయిస్టులు పట్టణాలలో ఉద్యమ నిర్మాణంపై దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ‘ప్రజాయుద్ధానికి, విముక్తి ప్రాంతాల ఏర్పాటుకు అవసరమయ్యే వివిధ రకాల శక్తిసామర్థ్యాలను కలిగిన క్యాడర్లను, నాయకులను అందించే ప్రధాన వనరు పట్టణ ప్రాంతాలే’. (అర్బన్ పర్‌స్పెక్టివ్). పట్టణ ప్రాంతాలకు తగిన నాయకత్వాన్ని, క్యాడర్లను పంపి, నిర్దిష్ట కాలపరిమితితో కూడిన కార్యక్రమంతో పనిచేయాలని 2004 రాజకీయ నిర్మాణ నివేదిక నిర్దేశిం చింది. ముంబై, పూణె, ఢిల్లీలలో మావోయిస్టుల ప్రాబ ల్యం విస్తరిస్తోందని జాతీయ మీడియా చెబుతోంది.
 
  గత ఏడాది మారుతీ సుజుకీ మానేసర్ కర్మాగారం కార్మిక సమ్మె, సీనియర్ ఎగ్జిక్యూటివ్ హత్యల వెనుక వారి హస్తం ఉన్నదని భావించారు. 1990ల మొదట్లో హైదరాబాద్‌లోని శివారు కార్మిక వాడలన్నిటిలోనూ నక్సలైట్లు మంచి పట్టు సాధించారు. నాటి పారిశ్రామిక అశాంతి మూలంగా పలు పారిశ్రామిక సంస్థలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. నేడు మావోయిస్టులు ‘గోల్డెన్ కారిడార్’లపై దృష్టిని కేంద్రీకరించారు. పూణె నుంచి ముంబై, సూరత్, వడోదరాలకు అటు నుంచి అహ్మదాబాద్‌కు విస్తరించిన పారిశ్రామిక కారి డార్‌లో ఉన్న ‘ఖాళీలను’ భర్తీ చేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో విస్తరించిన మరో పారిశ్రామిక కారిడార్‌పైన కూడా కేంద్రీకరించారు. చెన్నై, హైదరాబాద్, విశాఖ పారిశ్రామిక కేంద్రాలతో మరో విప్లవ పారిశ్రామిక కారిడార్ కోసం ప్రత్యేక నాయకత్వాన్ని కేటాయించారు. స్వల్పకాలిక ఫలి తాలను ఆశించకుండా నిర్మితమవుతున్న ఈ పట్టణ ఉద్యమ బలాన్ని అంచనా వేయడం కష్టమని ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ కాన్‌ఫ్లిక్ట్ స్టడీస్’ నిపుణులు అంటున్నారు.
 
 మూడేళ్ల క్రితం నేటి తెలంగాణ ఉద్య మం ప్రారంభమైనప్పటి నుంచి నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా పెట్టుబడులు హైదరాబాద్‌కు ముఖం చాటేస్తున్న సంగతి తెలిసిందే. నేటి రాష్ట్ర విభజన ప్రతిపాదన ఆ అనిశ్చితిని తొలగించకపోగా పొడిగిస్తుంది. దీనికి తోడు నక్సలైట్ల కారణంగా 1988-1992 మధ్య రాజధానిలో నెలకొన్న పారిశ్రామిక అశాంతి తిరిగి నెలకొంటే పెట్టుబ డులు రెండు రాష్ట్రాలకు దూరంగా జరిగే ప్రమాదం ఉం ది. రాష్ట్ర విభజన మావోయిస్టులు ఎదురుచూస్తున్న అనుకూల పరిస్థితులకు దారితీయడం అనివార్యం కావచ్చు. పైగా నక్సలైటు ఉద్యమం గత పదేళ్లలో గుణాత్మకంగా భిన్నమైన సాయుధశక్తిగా ఎదిగింది. పట్టణాలలో సుశిక్షితమైన సాయుధ ఆత్మరక్షణ దళాలను, యాక్షన్ టీంలను నిర్మించడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో తిరిగి నక్సలైటు ఉద్యమం పుంజుకుంటే ఏపీ పోలీసులు కొత్త తరం మావోయిస్టులతో పోరాడవలసి ఉంటుంది.
 
 ‘‘మన రాష్ట్రంలో నక్సలైట్ల సమస్య పరిష్కారమైపోయిందనుకోవడం తప్పు. మేం ఆ పని ఎప్పటికీ చేయలేం. అసలా పని మాదికాదు. నక్సలైట్లవల్ల తలెత్తే శాంతిభద్రతల సమస్యను అదుపులోకి తేవడం మాత్రమే మా పని. శాశ్వత పరిష్కారాన్ని చూపించాల్సింది ప్రభుత్వమే. అందుకు బదులుగా ప్రభుత్వమే నక్సలై ట్లు తయారు కావడానికి కావాల్సిన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను సృష్టిస్తే మేం చేయగలిగేది ఏమీ ఉండదు, మళ్లీ కథ మొదటికే వస్తుంది’’ అంటూ ఒక మాజీ పోలీసు ఉన్నతాధికారి ఆందోళన వెలిబుచ్చారు.    
 - చెవుల కృష్ణాంజనేయులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement