గ్రూప్–2లో తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే, పేపర్–4 పరీక్షలో కొన్ని ప్రశ్నలు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేవని, కేవలం సమాచారం కోణంలో మాత్రమే ఉన్నాయని కొందరు అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఆంధ్రా నిర్మాణ రంగ సంస్థలు, 1983 ఎన్నికల సమయంలో ఎన్‌టీఆర్ చేసిన వాఖ్యలు, తెలుగుదేశం పార్టీ ఎన్నికల నినాదం, విజన్–2020 డాక్యుమెంట్ రూపొందించిన అంతర్జాతీయ సంస్థ, చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు తదితర ప్రశ్నలు రావడం పట్ల అభ్యర్థులు కొంత గందరగోళానికి గురయ్యారు.
తెలంగాణ ఉద్యమ నేపథ్యానికి సంబంధించిన ప్రశ్నల్లో వాస్తవాధారిత ప్రశ్నలు వచ్చాయని మరికొందరు అభ్యర్థులు చెప్పుకొచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన ప్రశ్న వచ్చిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆవిష్కరించిన కొత్త విగ్రహానికి సంబంధించినది కాకుండా పాత రూపురేఖల గురించి ఇవ్వడంతో అభ్యర్థులు కొంత ఇబ్బంది పడ్డారు.
తెలంగాణ పోరాటయోధుడు వెలిచాల జగపతిరావుకు సంబంధించి రెండు ప్రశ్నలు వచ్చాయి. తెలంగాణ కోసం త్యాగం చేసిన మరికొందరికి సంబంధించిన ప్రశ్నలు కూడా వచ్చాయి. మొత్తంగా పేపర్–4 ప్రశ్నపత్రంలో కొన్ని ప్రశ్నలు మినహాయిస్తే మధ్యస్తంగానే ఉందని అభ్యర్థులు చెబుతున్నారు.
పేపర్–3 లో ప్రశ్నలు కష్టతరంగా...: ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన ప్రశ్నల్లో చాలావరకు కష్టతరంగానే ఉన్నట్టు పరీక్ష రాసిన అభ్యర్థులు చెప్పారు. ప్రశ్నలు చాలా లోతుగా ఉండడంతో వాటికి సమాధానాలు ఎంచుకునేందుకు ఎక్కువ సమయం పట్టిందని, దీంతో చివరి వరకు సమయం చాలక ఆందోళనకు గురైనట్టు వారు అభిప్రాయపడ్డారు. అయితే ప్రశ్నల్లో నాణ్యత పెరిగిందని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు.
రెండ్రోజులపాటు నాలుగు సెషన్లలో జరిగిన ఈ పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా 1,368 కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 5,51,855 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా తొలిరోజు(ఆదివారం) జరిగిన రెండు పరీక్షలకు కేవలం 2,55,490(46.30%) మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. సోమవారం ఉద యం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్–3 (ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్), మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్–4 (తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్) పరీక్షలు జరిగాయి.
ఉదయం జరిగిన పేపర్–3 పరీక్షకు 2,51,738 (45.62%) మంది హాజరు కాగా, మధ్యాహ్నం జరిగిన పేపర్–4 పరీక్షకు 2,51,486(45.57%) మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ గణాంకాలు ప్రాథమికంగా మాత్రమే నని, ఓఎంఆర్ షీట్లు పూర్తిస్థాయిలో అందిన తర్వాత హాజరుశాతంపై స్పష్టత వస్తుందని టీజీపీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్‌నికోలస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment