మావోయిస్టులు లొంగిపోవాలి: అమిత్ షా
న్యూఢిల్లీ/షహీబ్‌గంజ్ (జార్ఖండ్): దేశంలో నక్సలిజం 2026 మార్చి నాటికి పూర్తిగా అంతమైపోతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ‘‘2026 మార్చి 31లోగా నక్సల్స్ హింసను, భావజాలాన్ని దేశం నుంచి తుడిచిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. అంతకంటే ముందే నక్సలిజాన్ని అంతం చేస్తాం’’ అని పేర్కొన్నారు. హింసను విడనాడి ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. నక్సల్ హింసకు గురైన 55 మంది బాధితులనుద్దేశించి బుధవారం ఆయన మాట్లాడారు.
‘‘మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో భద్రతా దళాలు భారీ విజయాలు సాధించాయి. సమస్య ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లోని నాలుగు జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. పశుపతినాథ్ (నేపాల్) నుంచి తిరుపతి (ఏపీ) దాకా కారిడార్ ఏర్పాటు చేయాలని మావోయిస్టులు ఒకప్పుడు అనుకున్నారు. కానీ ఆ ప్రణాళికలను మోదీ ప్రభుత్వం తిప్పికొట్టింది. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర హోం శాఖ త్వరలో సంక్షేమ పథకం రూపొందిస్తుంది. ఉద్యోగాలు, ఆరోగ్య సంరక్షణ, ఇతర రంగాల్లో సంక్షేమ కార్యక్రమాల ద్వారా సాయం చేస్తుంది’’ అని వెల్లడించారు.
జార్ఖండ్‌లో జేఎంఎం–కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను విపరీతంగా ప్రోత్సహిస్తోందని అమిత్ షా ధ్వజమెత్తారు. దీనికి అడ్డుకట్ట వేయని పక్షంలో మరో పాతికేళ్లలో చొరబాటుదారులే రాష్ట్రంలో మెజారిటీ ప్రజలుగా మారిపోతారని హెచ్చరించారు. స్థానిక గిరిజన సంస్కృతిని వాళ్లు సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. జార్ఖండ్‌లోని గిరి«ద్‌లో పరివర్తన్ యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులను రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తారు. వీటి దెబ్బకు సంతాల్ పరగణాల్లో స్థానిక గిరిజనుల జనాభా 44 శాతం నుంచి 28 శాతానికి తగ్గిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment