
విధ్వంసం సృష్టించడానికి వస్తే కఠినంగా వ్యవహరిస్తాం
లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టికరణ
ఇమ్మి్రగేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు–2025కి ఆమోదం
న్యూఢిల్లీ: భారతదేశం ధర్మశాల కాదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. దేశానికి ముప్పు కలిగించేవారు ఇక్కడికి వచ్చి తిష్ట వేస్తామంటే సహింబోమని హెచ్చరించారు. విదేశాల నుంచి పర్యాటకులుగా లేదా విద్య, వైద్యం, వ్యాపారం, పరిశోధనల కోసం ఎవరైనా వస్తామంటే సాదరంగా ఆహా్వనించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కానీ, దేశంలో విధ్వంసం సృష్టించడానికి వచ్చేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు.
దేశంలోకి అక్రమంగా చొరబడేవారిపై కన్నేసి ఉంచుతామన్నారు. కీలకమైన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు–2025 గురువారం లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. ప్రమాదకరమైన ఉద్దేశాలతో దేశానికి వచ్చేవారిని కచి్చతంగా అడ్డుకుంటామని తెలిపారు. అందరికీ ఆశ్రయం ఇవ్వడానికి ఇది ధర్మశాల కాదన్నారు.
జాతీయ భద్రతకు ముప్పుగా మారిన వారిని అనుమతించబోమన్నారు. దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా మారడానికి వచ్చేవారిని స్వాగతిస్తామన్నారు. ప్రతిపాదిత ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టంతో దేశ భద్రత మరింత పటిష్టంగా మారుతుందని అమిత్ షా వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థకు, వ్యాపార రంగానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. మన దేశాన్ని సందర్శించే ప్రతి ఒక్కరి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ చట్టం అవసరమని తెలియజేశారు.
బెంగాల్‌పై ధ్వజం
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్రమ చొరబాటుదార్లను ముద్దు చేస్తోందని అమిత్ షా ధ్వజమెత్తారు. చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించినవారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. బెంగాల్ ప్రభుత్వం భూమిని అప్పగించకపోవడం వల్ల భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో 450 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణం నిలిచిపోయిందని చెప్పారు. అక్కడ కంచె నిర్మించడానికి ప్రయత్నాలు జరిగినప్పుడల్లా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అలజడి సృష్టిస్తున్నారని, మతపరమైన నినాదాలు చేస్తున్నారని విమర్శించారు. చొరబాటుదార్లపై తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేమాభిమానాలు ప్రదర్శిస్తుండడం వల్లే కంచె నిర్మాణం పెండింగ్‌లో ఉండిపోయిందని అన్నారు.
ఏమిటీ బిల్లు?
→ ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు–2025 ప్రకారం.. నకిలీ పాస్‌పోర్టు లేదా నకిలీ వీసాతో ఇండియాలోకి ప్రవేశించినా, ఇక్కడ నివసిస్తున్నా, బయటకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించినా ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 లక్షల దాకా జరిమానా విధించవచ్చు.
→ తమ వద్ద బస చేస్తున్న విదేశీయుల వివరాలను హోటళ్లు తప్పనిసరిగా ప్రభుత్వానికి అందజేయాలి. విద్యాసంస్థలు, హాస్పిటళ్లు, నర్సింగ్ హోమ్‌లలో కూడా విదేశీయులు ఉంటే ఆ సమాచారాన్ని యాజమాన్యాలు ప్రభుత్వానికి తెలియపర్చాలి.
→ చెల్లుబాటు అయ్యే పాసుపోర్టు లేదా ట్రావెల్ డాక్యుమెంట్ లేకుండా ఇండియాలోకి ప్రవేశిస్తే ఐదేళ్ల దాకా జైలు శిక్ష లేదా రూ.5 లక్షల దాకా జరిమానా విధించవచ్చు. ఒక్కోసారి ఈ రెండు శిక్షలు కలిపి విధించవచ్చు.