
దేశం కోసం పనిచేసే వారికి విజయం తథ్యం
ఉమ్మడి పౌరస్మృతి అమలు చేసి తీరుతాం
‘టైమ్స్ నౌ’సదస్సులో అమిత్ షా
న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ కనీసం 30 ఏళ్లపాటు అధికారంలో ఉంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు. స్థిరమైన పనితీరు కనబరుస్తున్న తమ పార్టీ పట్ల ప్రజాదరణ చెక్కుచెదరదని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పార్టీ విజయమైనా కష్టపడి పనిచేసే లక్షణంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. సొంత బాగు కోసం కాకుండా దేశం కోసం పనిచేస్తే విజయం కచ్చితంగా సొంతమవుతుందని వెల్లడించారు.
కేంద్రంలో బీజేపీ రాబోయే 30 ఏళ్లపాటు అధికారంలో ఉంటుందని తాను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చెప్పానని గుర్తుచేశారు. గత పదేళ్లుగా అధికారంలో కొనసాగుతోందని, మరో 20 ఏళ్లపాటు పార్టీకి ఢోకా లేదని తేల్చిచెప్పారు. శుక్రవారం రాత్రి ‘టైమ్స్ నౌ’సదస్సులో అమిత్ షా మాట్లాడారు. చక్కటి పరిపాలన అందించిన పార్టీకి ప్రజాదరణ లభిస్తుందని, తద్వారా ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. ప్రజలు మెచ్చే పాలన అందించలేని పార్టీలకు ఇలాంటి ఆత్మవిశ్వాసం లభించదని స్పష్టంచేశారు.
పదేళ్లలో 16,000 మంది లొంగుబాటు
దేశంలో అంతర్గత భద్రతకు ప్రస్తుతం వచ్చిన ముప్పేమీ లేదని అమిత్ షా స్పష్టంచేశారు. నక్సలైట్ల హింసాకాండ, జమ్మూకశీ్మర్‌లో ఉగ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదం అనే మూడు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ మూడు అంశాలకు సంబంధించి గత పదేళ్లలో 16,000 మంది యువత లొంగిపోయారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో శాంతి నెలకొల్పాల్సిన బాధ్యత హోంమంత్రిగా తనపై ఉందన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణకు నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఆరాధన స్థలాల చట్టం–1991పై ఇప్పుడు తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని పేర్కొన్నారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉండడంతో మనం మాట్లాడడం సరైంది కాదన్నారు. కోర్టులో ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. ఈ చట్టంపై సుప్రీంకోర్టు సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. కోర్టు ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తామన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ వలసదార్లను ఓటుబ్యాంకుగా మార్చుకుంటోందని అమిత్ షా మండిపడ్డారు. పొరుగు దేశం నుంచి వచ్చినవారిని ఓటర్లుగా చేర్పిస్తున్నారని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు.
ప్రభుత్వ కార్యకలాపాల్లో ఆర్‌ఎస్‌ఎస్ జోక్యం లేదు
ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)పై అమిత్ షా స్పందించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ ఒకదాని వెంట ఒకటి యూసీసీని ప్రవేశపెట్టబోతున్నాయని వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లో యూసీసీపై చట్టం తీసుకొచ్చారని, గుజరాత్‌లోనూ దీనిపై కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. బీజేపీ ఏర్పాటైనప్పటి నుంచి పార్టీ ఎజెండాలో యూసీసీ అనేది అత్యంత కీలకమైన అంశమని ఉద్ఘాటించారు. దేశంలో యూసీసీని అమలు చేస్తామంటూ హామీ ఇచ్చామని తెలిపారు. అది జరిగి తీరుతుందని స్పష్టంచేశారు. యూసీసీని తీసుకురావాలన్నది రాజ్యాంగ సభ నిర్ణయమని పేర్కొన్నారు.
ఆ విషయం కాంగ్రెస్ పార్టీ మర్చిపోయినప్పటికీ బీజేపీ మర్చిపోలేదన్నారు. చెప్పినట్లుగానే ఆర్టికల్ 370ని రద్దు చేశామని, అయోధ్యలో రామమందిరం నిర్మించామని, ఇక యూసీసీని అమలు చేయడం తథ్యమని వివరించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు దొరికిన ఘటనపై త్రిసభ్య కమిటీ ఇచ్చే నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. కమిటీ విచారణకు ప్రభుత్వం సహకరిస్తోందని అన్నారు. మోదీ ప్రభుత్వ కార్యకలాపాల్లో ఆర్‌ఎస్‌ఎస్ జోక్యం చేసుకుంటోందన్న విమర్శల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని వెల్లడించారు. సంఘ్ గత వందేళ్లుగా దేశభక్తులను తయారు చేస్తోందని ప్రశంసించారు.