
మావోయిస్టులకు అమిత్ షా పిలుపు
దంతెవాడ(ఛత్తీస్‌గఢ్): మావోయిస్ట్ పార్టీ శ్రేణులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్నేహ హస్తం చాపారు. ఆయుధాలను వదిలేసి, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని అమిత్ షా వారికి పిలుపునిచ్చారు. నక్సలైట్ చనిపోతే ఎవరూ హర్షించరన్న ఆయన.. 2026 మార్చి కల్లా వామపక్ష తీవ్రవాదాన్ని రూపుమాపాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. బస్తర్ ప్రాంత గిరిజనుల అభివృద్ధిని అడ్డుకోగల సత్తా మావోయిస్టులకు నేడు లేదని పేర్కొన్నారు.
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘బస్తర్ పాండుమ్’ఉత్సవం ముగింపు కార్యక్రమంలో శనివారం మంత్రి షా ప్రసంగించారు. ‘బస్తర్‌లో తుపాకీ కాల్పులు, బాంబుల మోతలు వినిపించే రోజులు పోయాయి. ఇకనైనా ఆయుధాలను విడనాడి, ప్రధాన జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్ట్ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరూ ఈ దేశ పౌరులే. నక్సలైట్ చనిపోతే ఎవరూ సంతోషపడరు. మీ ఆయుధాలను అప్పగించండి.
ఆయుధాలు చూపి బస్తర్ ప్రాంత గిరిజన సోదరసోదరీమణుల పురోభివృద్ధిని ఆపలేరు’అని ఆయన స్పష్టం చేశారు. లొంగిపోయి అభివృద్ధి ప్రక్రియలో పాలుపంచుకునే మావోయిస్ట్‌లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి భద్రత కల్పిస్తాయని మంత్రి భరోసా ఇచ్చారు. ‘బస్తర్ గత 50 ఏళ్లుగా ఎంతో వెనుకబాటుకు గురైంది.
ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇందుకోసం అవసరమైనవన్నీ సమకూర్చేందుకు ప్రధాని మోదీ సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ సుసాధ్యం కావాలంటే బస్తర్ ప్రజలు తమ గ్రామాలను నక్సలైట్ రహితంగా మార్చాలని నిర్ణయించుకోవాలి. ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆరోగ్య బీమా సమకూర్చడంతోపాటు చిన్నారులు స్కూలుకు వెళ్లగలిగి, ఆరోగ్య కేంద్రాలు పనిచేసినప్పుడే అభివృద్ధి సాధ్యం’అని అమిత్ షా అన్నారు.
మావోయిస్ట్ విముక్త గ్రామాలకు రూ. కోటి
నక్సలైట్లు లొంగుబాట పట్టేలా కృషి చేసి, మావోయిస్ట్ రహితంగా ప్రకటించుకునే గ్రామాలకు రూ.కోటి చొప్పున అందజేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని అమిత్ షా గుర్తు చేశారు. రూ.కోటి అందుకునేందుకు ప్రతి గ్రామం తీవ్రంగా కృషి చేయాలని కోరారు.
నక్సలిజాన్ని తుదముట్టించేందుకు ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నామంటూ ఆయన...‘అభివృద్ధికి ఆయుధాలు, గ్రనేడ్లు, మందుపాతరలతో అవసరం లేదు, కంప్యూటర్లు, పెన్నులు ఉంటే సరిపోతుందని అర్థం చేసుకునే వారు లొంగిపోయారు. 2024లో 881 మంది, 2025లో ఇప్పటివరకు మొత్తం 521 మంది మావోయిస్ట్‌లు ఆయుధాలను అప్పగించారు. లొంగిపోయిన వారు జన జీవన స్రవంతిలో కలుస్తారు, మిగిలిన వారి పనిని భద్రతా బలగాలు చూసుకుంటాయి. వచ్చే ఏడాది మార్చి కల్లా రెడ్ టెర్రర్ నుంచి దేశానికి విముక్తి కలుగనుంది’అని అమిత్ షా అన్నారు.