
ఛండీఘడ్: ఆయనొక ఐఏఎస్ ఆఫీసర్.. కానీ ఆయన కెరీర్ లో 57 సార్లు బదిలీలు. ఆయన బదిలీలతో బాగా ఫేమస్ అయిన ఐఏఎస్ ఆఫీసరే కాదు.. అత్యధిక సార్లు ట్రాన్స్ ఫర్లు చూసిన అధికారిగా రికార్డు కూడా ఆయన సొంతం. ఆయనే మనకు బాగా సుపరిచితమైన అశోక్ ఖేమ్కా.. ఎట్టకేలకు తన కెరీర్‌కు ముగింపు పలికారు, ఈరోజు(ఏప్రిల్ 30) ఆయన రిటైర్ అయ్యారు. ఇక విశ్రాంత ఆఫీసర్ గా ఆయన జీవనం కొనసాగనుంది. ఎప్పుడూ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వాల ఆగ్రహానికి గురైన ఆయన.. అధికంగా ట్రాన్స్ ఫర్లతోనే జీవనం గడిపారు.
సుమారు తన 34 ఏళ్ల కెరీర్‌లో సగటున ప్రతి ఆరు నెలలకొకసారి ఆయన బదిలీ అయ్యారు. హర్యానాలో ఏ అధికారికీ చేయని అత్యధిక బదిలీలుగా ఇది లిఖించబడింది. 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఖేమ్కా హర్యానా కేడర్ అధికారి. అక్రమ భూ పందేరాల్లో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చండశాసనుడిగా పేరున్న అశోక్ ఖేమ్కా గతంలో హర్యానా విత్తనాభివృద్ధి సంస్థ ఎండీగా, హర్యానా ఆర్చీవ్స్‌కు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.
సోనియా గాంధీ అల్లుడైన రాబర్ట్ వాద్రాకు సంబంధించిన డీఎల్ఎఫ్ డీల్ ను రద్దు చేసి సంచలనం సృష్టించిన సీనియర్ ఐఏఎస్ అధికారే అశోక్ ఖేమ్కా. భూ రిజిస్ట్రేషన్లు, భూ గణాంకాల శాఖ డైరక్టర్ జనరల్‌గా పని చేస్తున్న సమయంలో రాబర్ట్ వాద్రాకు డీఎల్ఎఫ్ సంస్థకు నడుమ జరిగిన భూ ఒప్పందాల్లో అక్రమాలను గుర్తించి వాటిని రద్దు చేశారు.
దీంతో దేశ వ్యాప్తంగా ఖేమ్కా పేరు మారుమోగిపోయింది. వీటితో పాటు ఖేమ్కా బెదిరింపు కాల్స్, చంపివేస్తామని హెచ్చరికలు సైతం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. గతంలో బీజేపీ ఖేమ్కాను సమర్థించిన విషయం తెలిసిందే. అయితే ఎన్డీయే హయాంలో కూడా ఈ సిన్సియర్ అధికారిపై బదిలీల పరంపర కొనసాగడం గమనార్హం.
పుట్టినరోజు నాడే.. రిటైర్మెంట్
1965వ సంవత్సరంలో ఏప్రిల్ 30వ తేదీన జన్మించిన ఆయన.. 60 ఏళ్ల పూర్తైన క్రమంలో రిటైర్ అయ్యారు. పుట్టిన రోజు.. ఆయన రిటైర్మెంట్ ఒకే రోజు(ఏప్రిల్ 30) కావడం విశేషం.