![Chandigarh Controversy: Why Punjab, Haryana At Loggerheads All you Need to Know - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/4/Chandigarh_Shah_Mann.jpg.webp?itok=6RxK5iv3)
పంజాబ్, హరియాణా రాష్ట్రాల మధ్య ‘రాజధాని’ వివాదం మరోసారి రాజుకుంది. చండీగఢ్‌ను తక్షణమే తమకు బదిలీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని పంజాబ్ సర్కారు తాజాగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. బీజేపీ సభ్యులు మినహా శాసనసభలోని మిగతా అన్ని పార్టీలు ఈ తీర్మానానికి మద్దతు పలికాయి. చండీగఢ్‌పై పంజాబ్ తీర్మానం చేసిన నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం ఏప్రిల్ 5న ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసింది. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ వాతావరణం వేడెక్కింది.
అసలేంటి వివాదం?
చండీగఢ్ రాజధానిగా 1950లో పంజాబ్ రాష్ట్రం అవతరించింది. 1966లో పంజాబ్.. హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌గా విడిపోయింది. చండీగఢ్‌ను మాతృరాష్టమైన తమకే కేటాయించాలని ఆ సమయంలో పంజాబ్ పట్టుబట్టింది. భాషా ప్రాతిపదికన కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ విధానాన్ని అనుసరించారని వాదించింది. అయితే పంజాబ్ వాదననను హరియాణా గట్టిగా వ్యతిరేకించింది. ఇరు రాష్ట్రాల మధ్య విభేదాల కారణంగా చండీగఢ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించి.. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చేసింది. పరిపాలనాపరంగా పంజాబ్, హరియాణాలు 60:40 నిష్పత్తిలో చండీగఢ్‌ను పంచుకునేలా ఒప్పందం చేసింది. అప్పటి నుంచి రాజధాని వివాదం రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతూనే ఉంది.
జేసీ షా కమిటీ
రెండు రాష్ట్రాల వివాదాన్ని పరిష్కరించడానికి ఏర్పాటైన జేసీ షా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ.. చండీగఢ్‌ను హరియాణాకు ఇచ్చేయాలని ప్రతిపాదించింది. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి జేసీ షాతో పాటు ఎంఎం ఫిలిప్, ఎస్ దత్ కమిటీలో ఉన్నారు. ద ట్రిబ్యూన్ ఆర్కైవ్స్‌లో లభ్యమైన 1966, జాన్ 6 వార్తా కథనం ప్రకారం... ముగ్గురు సభ్యుల్లో ఇద్దరు హరియాణా వైపు మొగ్గు చూపారు. పంజాబ్ కొత్త రాజధానిని ఎంచుకునే వరకు చండీగఢ్‌ను ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని జస్టిస్ షా, ఫిలిప్ సూచించారు. చండీగఢ్ భవిష్యత్తుపై కమిటీ ఏకాభిప్రాయం రాలేకపోవడం కేంద్రాన్ని సంకటంలో పడేసింది.
నిర్ణీత సమయంలో హరియాణాకు స్వంత రాజధాని నిర్మిస్తామని, పంజాబ్‌కు చండీగఢ్ చెందుతుందని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రకటించారు. ఈ మేరకు 1970లో లోక్‌సభకు కేంద్రం అధికారికంగా సమాచారం ఇచ్చింది. దీంతో పాటు మరికొన్ని ఆప్షన్లను కూడా కేంద్రం సూచించింది. చండీగఢ్‌ను పంజాబ్‌కు ఇచ్చేస్తే ఆ రాష్ట్రంలోని అబోహర్, ఫజిల్కాలోని హిందీ ప్రాంతాలను హరియాణాకు బదిలీ చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. హరియాణా తన కార్యాలయాలు, నివాస గృహాలను 10 ఏళ్ల పాటు చండీగఢ్‌లో కొనసాగించవచ్చని.. తర్వాత స్వంత రాజధానికి తరలించాలని సూచించింది.
హరియాణా సొంత రాజధాని నిర్మాణానికి అప్పట్లో 10 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కూడా కేంద్రం ముందుకు వచ్చింది. దీంతో హరియాణా.. చండీగఢ్‌కు సమీపంలో పంచకుల పేరుతో కొత్త నగరాన్ని నిర్మించింది. చండీగఢ్ నుంచి తన కార్యాలయాలను పెద్ద సంఖ్యలో పంచకుల నగరానికి తరలించింది. అయితే చండీగఢ్ ఉమ్మడి రాజధాని హోదాను 1976లో కేంద్రం మరో 10 సంవత్సరాల పాటు పొడిగించింది. అబోహర్, ఫజిల్కా ప్రాంతాలను వదులుకోవడానికి పంజాబ్ ఒప్పుకోకపోవడంతో సమస్య పరిష్కారం కాలేదు. 1985లో రాజీవ్-లాంగోవాల్ ఒప్పందం(అప్పటి శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సంత్ హర్‌చంద్ సింగ్ లాంగోవాల్‌తో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ సంతకం చేసిన ఒప్పందం) కూడా కాగితాలకే పరిమితం కావడంతో వివాదానికి ఎండ్ కార్డ్ పడలేదు.
రెండు రాజధానులే బెటర్!
సుదీర్ఘంగా కొనసాగుతున్న చండీగఢ్ సమస్య పరిష్కారానికి రెండేళ్ల క్రితం హరియాణా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా ఒక ప్రతిపాదన చేశారు. చండీగఢ్‌ను పంజాబ్ వదులుకుంటే తాము కూడా వదులుకుంటామని 2020, నవంబర్‌లో ప్రతిపాదించారు. చండీగఢ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా అంగీకరించి.. రెండు రాష్ట్రాలు స్వంత రాజధానులను, హైకోర్టు బెంచ్‌లను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇలా చేస్తే రెండు రాష్ట్రాలకు మంచిదని చౌతాలా అభిప్రాయపడ్డారు.
ఏడుసార్లు తీర్మానాలు
చండీగఢ్ వివాదం మరోసారి తాజాగా తెర మీదకు వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరిచి తీర్మానం చేయడంతో ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది. చండీగఢ్‌పై పంజాబ్ అసెంబ్లీ ఇటువంటి తీర్మానాన్ని ఆమోదించడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటివరకు ఏడు సార్లు తీర్మానాలు చేసింది. చండీగఢ్‌లో సెంట్రల్ సర్వీస్ రూల్స్ అమలులోకి వస్తాయని కేంద్ర హెంమంత్రి అమిత్ షా ఇటీవల చేసిన ప్రకటనతో అప్రమత్తమైన ఆప్ సర్కారు తాజా తీర్మానం చేసింది. ముఖ్యంగా పంజాబ్, హరియాణా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, చండీగఢ్‌లకు నీరు విద్యుత్ సరఫరాను నియంత్రించే భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డ్(బీబీఎంపీ)పై కేంద్రం పెత్తనాన్ని బీజేపీ మినహా పంజాబ్‌లోని అన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మున్ముందు రోజుల్లో చండీగఢ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. (క్లిక్: చండీగఢ్ ఇచ్చేయాల్సిందే.. భగవంత్ మాన్ డిమాండ్)
Comments
Please login to add a commentAdd a comment