
కగార్ పేరుతో కేంద్రం నరసంహారం చేస్తోంది..
ఆపరేషన్ కగార్ నిలిపివేస్తే కాల్పుల విరమణకు ఓకే
ప్రజాప్రయోజనాలే మాకు ముఖ్యం
మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యంలో కొనసాగుతున్న తీవ్ర నిర్బంధం నేపథ్యంలో శాంతిచర్చలకు తాము సిద్ధమని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ప్రకటించింది. అయితే, శాంతిచర్చలు జరిపేందుకు అనువైన వాతావరణం తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆ పార్టీ డిమాండ్ చేసింది. ఇదే సమయంలో చర్చల ప్రక్రియ సజావుగా సాగేలా కేంద్రం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని ప్రజాపక్ష మేధావులు, రచయితలు, హక్కుల సంఘాలు, దళిత, గిరిజన, విద్యార్ధి, యువజన సంఘాలు, పర్యావరణ కార్యకర్తలను ఆ పార్టీ కోరింది.
మీడి యా కూడా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో తాజాగా విడుదల చేసిన లేఖ బుధవారం వెలుగులోకి వచ్చింది. అమానవీయంగా చంపేస్తున్నారు..: ఆపరేషన్ కగార్ పేరుతో 2024 నుంచి విప్లవ ప్రభావిత రాష్ట్రాల్లో కేంద్రం నరసంహారం కొనసాగిస్తోందని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.
సాధారణ ఆదివాసీ ప్రజానీకం, దళసభ్యులు, కమాండర్లు, అగ్రనేతల వరకు 400 మందికి పైగా కగార్ కారణంగా ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. కేంద్రం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కార్డన్ – కిల్ (చుట్టుముట్టి చంపేయడం) ఆపరేషన్లలో పట్టుబడిన తమ పార్టీ నేతలు, సభ్యులు, సానుభూతిపరులను అమానీయంగా చిత్రహింసలకు గురిచేసి చంపేస్తున్నారని, మహిళా కామ్రేడ్లపై అత్యాచారాలకు పాల్పడి ప్రాణాలు తీస్తున్నారని ప్రకటించింది. అందుకే ఈ యుద్ధాన్ని జినోసైడ్ (నరసంహారం)గా పేర్కొంటున్నట్లు వెల్లడించింది.
రాజ్యాంగ విరుద్ధం..
విప్లవోద్యమ ప్రాంతాలను కల్లోలిత ప్రదేశాలుగా ప్రకటించకుండానే అంతర్గత భద్రత కోసం సైన్యాన్ని ఉపయోగించడం రాజ్యాంగ విరుద్ధమని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పేర్కొంది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కమాండో బలగాల ముసుగులో కేంద్రం ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించిందని ఆరోపించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఆదివాసీ యువతను సాయుధ బలగాల్లో చేర్చుకుని వారితోనే ఆదివాసీలను హత్య చేయిస్తున్నారని తెలిపింది. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడమే ప్రభుత్వ లక్ష్యంగా.. ఆదివాసీ, పేదల రక్తపు పునాదులపై వికసిత్ భారత్ ఏర్పాటు జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది.
కాల్పుల విరమణ.. షరతులు
శాంతిచర్చలకు సిద్ధమని ప్రకటించిన మావోలు.. ఇదే సమయంలో కొన్ని షరతులు విధించారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర (గడ్చిరోలి), ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో అమలవుతున్న ఆపరేషన్ కగార్‌ను ఆపేయాలని, విప్లవ ప్రభావిత ప్రాంతాల్లో సాయుధ బలగాలతో కొత్త క్యాంపులు ఏర్పాటు చేయొద్దని ఆ పార్టీ సూచించింది. తమ షరతులకు ఒప్పుకుంటే తక్షణమే కాల్పుల విరమణకు సిద్ధమని ప్రకటించింది. ప్రజా ప్రయోజనాల కోసమే తాము శాంతి చర్చలకు ముందుకొచ్చామని పేర్కొంది.
రౌండ్ టేబుల్ తర్వాత..
శాంతి చర్చల కమిటీ మార్చి 24న హైదరాబాద్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఇందులో ‘మధ్య భారతంలో జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలి, సీపీఐ (మావోయిస్టు) భేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించాలి’అని కోరింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని మావోయిస్టు పార్టీ స్వాగతిస్తూ.. ‘శాంతి చర్చలు – కాల్పుల విరమణ – షరతులు’అని పేర్కొంటూ మార్చి 28న జారీ చేసిన లేఖ బుధవారం వెలుగులోకి వచి్చంది.