
పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ!
ప్రభుత్వం కూడా నెల రోజులు విరమణ పాటించాలని విజ్ఞప్తి
ధ్రువీకరించని పోలీసువర్గాలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తీవ్ర నిర్బంధ పరిస్థితుల నేపథ్యంలో బేషరతుగా కాల్పుల విరమణకు మావోయిస్టులు అంగీకారం తెలిపారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ఆగస్టు 15న రాసినట్లుగా ఉన్న లేఖ ఆలస్యంగా వెలుగు చూసినట్లు మంగళవారం అర్ధరాత్రి జాతీయ మీడియా, సోషల్ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. హిందీలో విడుదలైన ఈ లేఖలో.. తమ పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో అమరుడు కాకముందు నుంచే శాంతి చర్చల ప్రస్తావనను ప్రభుత్వం ముందుకు తెచ్చినట్లు అభయ్ వెల్లడించారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా, దేశంలో మారుతున్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, హోంమంత్రి అమిత్‌షా మొదలు ప్రధాని నరేంద్ర మోదీ వరకు అనేకమంది ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలవాలంటూ చేసిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని సాయుధ పోరాటం విరమించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అయితే ఈ అంశంపై దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఇతర మావోయిస్టు నేతలతో చర్చించుకుని తుది నిర్ణయానికి వచ్చేందుకు కనీసం నెల పాటు ప్రభుత్వం తరఫున కూడా కాల్పుల విరమణ కావాలని కోరారు.
కొన్ని కారణాల వల్ల లేఖ విడుదల జాప్యమైనట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని రేడియో లాంటి ప్రభుత్వ వార్తా సంస్థల ద్వారా గానీ, ఇంటర్నెట్ ద్వారా కానీ తెలిజేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే మావోయిస్టుల లేఖను పోలీసు వర్గాలు ధ్రువీకరించడం లేదు. అయితే లేఖలోని వాస్తవికతను పరిశీలించాల్సి ఉందని ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం, హోం మంత్రి విజయ్ శర్మ చెప్పారు. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ కూడా..మావోయిస్టుల లేఖలోని వాస్తవికతను, అందులోని అంశాలను పరిశీలిస్తున్నామని అన్నారు.