ఛత్తీస్‌గఢ్‌లో వామపక్ష తీవ్రవాదం అధికంగా ఉన్న జిల్లాలో మావోయిజం పూర్తిగా తగ్గుముఖం
ఐదు దశాబ్దాల తర్వాత బస్తర్‌తో పాటు కొండెగావ్‌లో ఈ ఏడాది ఒక్క మావో ఘటన లేదన్న కేంద్రం
ఈ ఏడాది ఒక్క చత్తీస్‌గఢ్‌లోనే 208మంది హతం, 802 మంది లొంగుబాటు
ఒకప్పుడు పోలీసులపైకి మెరుపు దాడులు, మందుపాతరల పేలుళ్లు, తుపాకీ మోతలు, బుల్లెట్ల శబ్దాలు, వరుస ఎన్‌కౌంటర్‌లతో రక్తమోడిన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో వామపక్ష తీవ్రవాదం ఇప్పుడు పూర్తిగా కనుమరుగైందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బస్తర్ పేరు చెబితేనే భయపడేంతగా గజగజలాడించిన మావోయిస్టులు ఇప్పుడు అక్కడ తమ పట్టును కోల్పోయారని కేంద్రం పేర్కొంది. ప్రాభల్యం తగ్గిపోవడం, పోలీసుల ముమ్ముర ఏరివేత కార్యక్రమాలు, మరోవైపు పునరవాస కల్పనా చర్యలు, ఇంకోవైపు అభివృధ్ధి కార్యక్రమాల కారణంగా ఇప్పుడు ఆ ప్రాంతంలో మావోయిజం పూర్తిగా కనిపించకుండా పోయిందని వెల్లడించింది.
కేంద్ర చర్యలతో ..
బస్తర్ డివిజన్‌లో బస్తర్, దంతెవాడ, బీజాపూర్, కంఖేర్, నారాయణపూర్, కొండగావ్, సుక్మా మొత్తంగా ఏడు జిల్లాలు ఉన్నాయి. వీటిల్లో మావోయిస్టుల ప్రభావం అత్యధికంగా ఉన్న జిల్లాగా బస్తర్ పేరొందింది. ముఖ్యంగా 2013 ఏడాది మే నెలలో కాంగ్రెస్ నేతలపై మావోలు జరిపిన మెరుపు దాడిలో 27 మందితో పాటు 10 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. ఈ దాడిలోనే కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి మహేంద్ర కర్మ చనిపోయారు. ఆ తర్వాత సైతం ఈ జిల్లా పేరు చెబితేనే పోలీసు బలగాల్లోనూ వణుకు పుట్టేంతస్థాయిలో మావోల మెరుపుదాడులు కొనసాగాయి.
2014 తర్వాత మావోల ఆగడాలకు అడ్డుకట్టవేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దూకింది. ఈ జిల్లావ్యాప్తంగా భద్రతా బలగాల సంఖ్యను విపరీతంగా పెంచింది. లొంగుబాట్లను ప్రోత్సహించింది. మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెట్టింది. దీంతో గడిచిన రెండేళ్లుగా పోలీసులు, మావోలకు మధ్య పరస్పర కాల్పుల ఘటన ఒక్కటి కూడా నమోదు కాలేదు. పైగా జిల్లాలో ఇద్దరు కీలక నేతలు అరెస్ట్ కాగా, మరో 13 మంది కీలక సభ్యులు లొంగిపోయారు. ఈ ఏడాదిలో మావో సంబంధ ఘటన ఒక్కటి కూడా నమోదుకాలేదు. సమీప కొండగావ్ జిల్లాలోనూ ఒక్క ఘటన నమోదుకాలేదు. రెండు జిల్లాలకు పొరుగునే ఉన్న బీజాపూర్ జిల్లాలో 465 మంది, సుక్మా జిల్లాలో 253 మంది మావోలను పోలీసులు అరెస్ట్ చేశారు.
నారాయణపూర్, బీజాపూర్ జిల్లాలో రెండేళ్లలో 100 మందికి పైగా మావోలు పోలీసుల ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. గత ఐదు దశాబ్దాలుగా మావోల కదలికలతో నిత్యం వార్తలో ఉండే బస్తర్ జిల్లాలో ఈ ఏడాది ఒక్కటంటే ఒక్క మావోయిస్టు దుశ్చర్యకు సంబంధించిన ఘటనలు జరగకపోవడం విశేషం. కొండగావ్‌లోనూ మావోల ఉనికి లేదని ఇటీవల ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు, మావోలకు మధ్య జరిగిన పరస్పర ఎదురుకాల్పుల్లో 208మంది మావోలు చనిపోయారు. బస్తర్, కొండగావ్ జిల్లాలో ఇలాంటి ఘటన ఒక్కటి కూడా జరగకపోవడం విశేషం. 802 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు.
బహుముఖ వ్యూహంతో ముందుకు
2026 నాటికి పూర్తిస్థాయిలో మావోలను ఏరివేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ప్రభుత్వం ఈ లక్ష్యసాధన కోసం బహుముఖ వ్యూహాన్ని అనుసరించింది. ఓపక్క భద్రతా చర్యలను పటిష్టం చేస్తూనే, మావోయిస్టుల ప్రభావిత గిరిజన, ఆదివాసీ ప్రాంతాలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించడంపై ప్రధానంగా దృష్టిసారించింది. మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిపై దృష్టి పెట్టింది. చౌక ధరల దుకాణాలను పెంచడం, సమాచార వ్యవస్థల పటిష్టం, ఏకలవ్య పాఠశాలల ఏర్పాటు, రహదారులకు భారీగా నిధుల కేటాయింపు, లొంగిపోయే మావోలకు తక్షణ పునరావాస కార్యక్రమాలతో వారి ఉనికిని కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తోంది.
– సాక్షి, న్యూఢిల్లీ
Comments
Please login to add a commentAdd a comment