
ఇదే నా ఆరోగ్య రహస్యం: అమిత్ షా
న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన ఆరోగ్య రహస్యాన్ని వివరించారు. సరైన ఆహారం, రోజులో ఆరు గంటల నిద్ర, రెండు గంటలపాటు వ్యాయామం అనే సూత్రాలను తు.చ. తప్పక పాటించడం వల్లే ఫిట్‌గా ఉన్నట్లు వెల్లడించారు. లివర్ డే సందర్భంగా శనివారం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్‌లో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడారు. 2020 నుంచి పాటిస్తున్న ఆరోగ్య సూత్రాల వల్లే బరువు తగ్గానన్నారు.
‘కంటి నిండా నిద్ర, నీరు, సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం అనే నియమాలను పాటిస్తున్నా. వీటి ఫలితంగానే ఎలాంటి ఇంగ్లిష్ మందులను వాడాల్సిన అవసరం నాకు ఇప్పటివరకు రాలేదు. డయాబెటిస్ వంటి వ్యాధుల బారిన పడలేదు’అని ఆయన వివరించారు. నేటి యువతరం కూడా ఇటువంటి నియమాలను పాటించి, మరో 40–50 ఏళ్ల ఆయుర్దాయం పెంచుకోవాలని, దేశాభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన పిలుపునిచ్చారు.
‘శారీరక ఆరోగ్యం కోసం రోజులో రెండు గంటలను వ్యాయామం కోసం కేటాయించండి, మెదడు ఆరోగ్యం కోసం ఆరుగంటలపాటు నిద్రపోండి. ఇది చాలా అవసరం. ఇదే నా అనుభవం’అని ఆయన పేర్కొన్నారు. అనంతరం, అమిత్ షా పాటిస్తున్న ఆరోగ్య సూత్రాలను ప్రధాని మోదీ ఎక్స్‌లో కొనియాడారు. ‘ఆహారంలో నూనెలను తగ్గించుకోవడం వంటి చిన్నచిన్న మార్పులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒబెసిటీపై అవగాహన కల్పిద్దాం. ఆరోగ్య భారతాన్ని నిర్మిద్దాం’అంటూ ఆయన పిలుపునిచ్చారు.