
మణిపూర్‌లో 8 కల్లా ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలి
అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తే కఠినచర్యలే
అంతర్జాతీయ సరిహద్దు వెంబడి వీలైనంత తర్వగా కంచె నిర్మాణం పూర్తి చేయాలి
మణిపూర్ భద్రతా పరిస్థితిపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్‌లో శాశ్వత శాంతిని పునరుద్ధరించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నతాధికారులను ఆదేశించారు. మార్చి 8 నుంచి మణిపూర్‌లోని అన్ని రహదారులపై ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు.
శాంతిని పునరుద్ధరించే విషయంలో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా దిశానిర్దేశం చేశారు. మణిపూర్ భద్రతా పరిస్థితిపై శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు కీలక ఆదేశాలు చేశారు. ఈ సమావేశంలో మణిపూర్ గవర్నర్, అజయ్‌కుమార్ భల్లా, కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, ఆర్మీ డిప్యూటీ చీఫ్, తూర్పు కమాండ్ ఆర్మీ కమాండర్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్స్, మణిపూర్ భద్రతా సలహాదారు సహా పలువురు ఉన్నతస్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మణిపూర్‌లో శాశ్వత శాంతిని పునరుద్ధరించడానికి అవసరమైన పూర్తి సహాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా పేర్కొన్నారు. అంతేగాక దోపిడీకి సంబంధించిన అన్ని కేసులలో కఠినమైన చర్యలు తీసుకోవడం కొనసాగించాలని... మణిపూర్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఏర్పాటు చేసిన ఎంట్రీ పాయింట్లకు ఇరువైపులా కంచె వేయడం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర హోంమంత్రి సూచించారు. మణిపూర్‌ను మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు, మాదకద్రవ్య వ్యాపారంలో పాల్గొన్న మొత్తం నెట్‌వర్క్‌ను నిర్మూలించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment