Presidents Rule
-
శాశ్వత శాంతిని పునరుద్ధరించండి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్‌లో శాశ్వత శాంతిని పునరుద్ధరించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నతాధికారులను ఆదేశించారు. మార్చి 8 నుంచి మణిపూర్‌లోని అన్ని రహదారులపై ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. శాంతిని పునరుద్ధరించే విషయంలో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా దిశానిర్దేశం చేశారు. మణిపూర్ భద్రతా పరిస్థితిపై శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు కీలక ఆదేశాలు చేశారు. ఈ సమావేశంలో మణిపూర్ గవర్నర్, అజయ్‌కుమార్ భల్లా, కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, ఆర్మీ డిప్యూటీ చీఫ్, తూర్పు కమాండ్ ఆర్మీ కమాండర్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్స్, మణిపూర్ భద్రతా సలహాదారు సహా పలువురు ఉన్నతస్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మణిపూర్‌లో శాశ్వత శాంతిని పునరుద్ధరించడానికి అవసరమైన పూర్తి సహాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా పేర్కొన్నారు. అంతేగాక దోపిడీకి సంబంధించిన అన్ని కేసులలో కఠినమైన చర్యలు తీసుకోవడం కొనసాగించాలని... మణిపూర్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఏర్పాటు చేసిన ఎంట్రీ పాయింట్లకు ఇరువైపులా కంచె వేయడం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర హోంమంత్రి సూచించారు. మణిపూర్‌ను మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు, మాదకద్రవ్య వ్యాపారంలో పాల్గొన్న మొత్తం నెట్‌వర్క్‌ను నిర్మూలించాలని ఆదేశించారు. -
మణిపూర్ సీఎంగా మైతేయి వర్గం నేత..!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి పాలనలో ఉన్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. మైతేయి వర్గానికి చెందిన ఎమ్మెల్యేకే ముఖ్యమంత్రిగా మళ్లీ అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఈ వర్గానికి చెందిన ముగ్గురి నేతలు రేసులో ఉండగా వీరికి 22 మంది ఎమ్మెల్యేలు సానుకూలంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో మార్చి 10న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. సీఎం రేసులో శాసనసభ ప్రస్తుత స్పీకర్ తోక్చోమ్ సత్యవ్రత్ సింగ్ కూడా ఉన్నారు. బిరెన్ సింగ్ రెండు పర్యాయాలు సీఎంగా ఉన్నప్పుడు తోక్చోమ్ కేబినెట్ మంత్రిగా పనిచేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న హింసపై బిరెన్ సింగ్‌కు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడి తోక్చోమ్ వార్తల్లో నిలిచారు. ముఖ్యమంత్రి రేసులో ఉన్న రెండో నేత యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్. ఈయన 2017– 2022 సంవత్సరాల మధ్య మణిపూర్ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. బిరేన్ సింగ్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కేబినెట్లో ఉన్నారు. తోక్చోమ్ రాధేశ్యామ్ సింగ్ సీఎం రేసులో ఉన్న మూడో నేత. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సీఎం సలహాదారుగా ఉన్న రాధేశ్యామ్ సింగ్ 2017 –2022 మధ్య విద్య, కారి్మక, ఉపాధి శాఖల మంత్రిగా ఉన్నారు. ఎమ్మెల్యేల్లో రెండు గ్రూపులు బిరేన్ సింగ్ రాజీనామా తర్వాత, మైతేయి వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు రెండు శిబిరాలుగా విడిపోయారు. బిరేన్సింగ్ను మళ్లీ సీఎం చేయాలని ఒక వర్గం కోరుతుండగా, మరో వర్గం వ్యతిరేకిస్తోంది. అయితే మార్చి 10వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మణిపూర్ విషయంలో బీజేపీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయతి్నంచే అవకాశాలున్నాయి. అందుకే ఆలోగా కొత్త సీఎంను ఎంపిక చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ భావిస్తోందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే మాత్రం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను మరింతకాలం కొనసాగించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బలమున్నా.. కరువైన ఏకాభిప్రాయం మాజీ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ కూడా మైతేయి వర్గానికి చెందినవారే. అయితే, కుకీలతో పాటు బీజేపీకి చెందిన పలువురు మైతేయి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. కుకీ–మైతేయి వర్గాల మధ్య 2023 మే 3వ తేదీన మొదలైన హింసకు ఇప్పటికీ అడ్డుకట్టపడలేదు. హింసాకాండ సమయంలో కుకీలకి వ్యతిరేకంగా మైతేయిలను బిరెన్ సింగ్ ప్రేరేపించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన ఫిబ్రవరి 9వ తేదీన సీఎం పదవికి రాజీనామా చేశారు. కొత్త సీఎం ఎంపికపై ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో ఫిబ్రవరి 13న రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. రాష్ట్రంలో ఇంకా అసెంబ్లీని రద్దు చేయని కారణంగా మార్చి 10 లోగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 27 మంది మైతేయిలు, ఆరుగురు కుకీలు, ముగ్గురు నాగాలు, ఒక ముస్లిం ఉన్నారు. నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్)కు చెందిన ఐదుగురు సహా ఎన్డీఏకు మొత్తం 42 మంది ఎమ్మెల్యేలున్నారు. -
బెంగాల్ లో రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు..?
-
కశ్మీర్‌కు పదివేల బలగాలు
న్యూఢిల్లీ/కశ్మీర్: కశ్మీర్ లోయకు పదివేల మంది భద్రతా బలగాలను తక్షణం తరలించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఉగ్రవాదుల కార్యకలాపాలకు అడ్డుకట్టవేసేందుకు, శాంతి భద్రతల విధి నిర్వహణకు వీరిని పంపుతున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 100 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాల (సీఏపీఎఫ్)ను తక్షణం తరలించాలని కేంద్ర హోం శాఖ ఈనెల 25వ తేదీన ఉత్తర్వులు వెలువరించిందని పేర్కొన్నారు. రాష్ట్రానికి మరికొన్ని బలగాలను కూడా తరలించే యోచనలో కేంద్రం ఉందని కూడా వెల్లడించారు. ఒక సీఏపీఎఫ్ కంపెనీలో 100 మంది సిబ్బంది ఉంటారు. కశ్మీర్ లోయకు పంపే వారిలో సీఆర్పీఎఫ్కు చెందిన 50 కంపెనీలు, సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) నుంచి 30, ఐటీబీపీ, బీఎస్ఎఫ్ నుంచి పదేసి కంపెనీల చొప్పున బలగాలు ఉంటాయన్నారు. వీరందరినీ రైళ్లు, విమానాల్లో విధులు చేపట్టే ప్రాంతాలకు తరలిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ఉగ్ర నిరోధక చర్యలతోపాటు అమర్నాథ్ యాత్రకు బందోబస్తు కల్పిస్తున్న 80 బెటాలియన్ల బలగాలకు వీరు అదనమన్నారు. ఒక్కో బెటాలియన్‌లో వెయ్యి మంది సిబ్బంది ఉంటారు. రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరపాలని యోచిస్తున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ బలగాలను మోహరిస్తోందని భావి స్తున్నారు. బలగాలను తరలించాలన్న కేం ద్రం నిర్ణయాన్ని పీడీపీ అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తప్పుపట్టారు. జైషే టాప్ కమాండర్ హతం శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని సోపియాన్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్ అగ్రశ్రేణి జైషే మహమ్మద్ (జేఎం)కు చెందిన కమాండర్ మున్నా లాహోరిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. శుక్రవారం రాత్రి సోపియాన్‌లోని బోన్బజార్ ప్రాంతం బండే మొహల్లాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. దీంతో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గత నెలలో ఇద్దరు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన కారు పేలు డుకు లాహోరి కారణమని పోలీసులు తెలి పారు. పాక్ జాతీయుడైన మున్నా లాహోరి కశ్మీర్లో వరుస పౌర హత్యలకు పాల్పడ్డా డని తెలిపారు. కశ్మీర్లో ఉగ్రవాదుల నియా మకం కోసం లాహోరిని జైషే నియమిం చిందని, అతడు పేలుడు పరికరాల తయా రీలో సిద్ధహస్తుడని పోలీసులు తెలిపారు. -
రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని ప్రతిపక్షాలు గవర్నర్‌ను డిమాండ్ చేశాయి. ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయన్న నమ్మకం లేదని ఆందోళన వ్యక్తం చేశాయి. ఓటర్ల జాబితా తయారవుతున్న సమయంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతుండటాన్ని అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించాయి. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో టీడీపీ, టీజేఎస్, సీపీఐ నేతలు మంగళవారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేసేందుకే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ప్రభుత్వం అరెస్టు చేయించిందని ఉత్తమ్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో కాంగ్రెస్ నేతలు కె. జానారెడ్డి, డీకే అరుణ, భట్టి విక్రమార్క, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, ఆ పార్టీ నేతలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఆ పార్టీ నేతలు పల్లా వెంకట్‌రెడ్డి, కె. సాంబశివరావు తదితరులు ఉన్నారు. గవర్నర్‌ను కలిశాక ఆయా పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో చట్టాలకు పాతర తెలంగాణలో చట్టాలకు కేసీఆర్ పాతరేస్తున్నారు. మానవ హక్కులను కాలరాస్తున్నారు. కేసీఆర్ వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. అంతిమంగా ప్రజలే కేసీఆర్‌కు ఘోరీ కడుతారు. – చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వ్యతిరేకత పెరుగుతోందనే ముందస్తుకు... ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను కొనసాగిస్తే ఆయన అరాచకాలకు, ఎన్నికల అక్రమాలకు పాల్పడే ప్రమాదం ఉంది. ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతోందని గ్రహించే ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు. తద్వారా దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.– కోదండరాం, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు మోదీ, కేసీఆర్ ప్రజాహక్కుల్ని కాలరాస్తున్నారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటే రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయన్న నమ్మకం లేదు. ప్రధాని మోదీతోపాటు కేసీఆర్ ప్రజల హక్కులను కాలరాస్తున్నారు. ఓటర్ల జాబితా సిద్ధమవుతున్న తరుణంలో ముందస్తు ఎన్నికలంటూ అసెంబ్లీని రద్దు చేసి కొత్త ఓటర్లు ఓటేయకుండా కేసీఆర్ అడ్డుపడ్డారు. ఎన్నికల సంఘం ప్రకటించాల్సిన షెడ్యూల్‌ను కేసీఆర్ ప్రకటించారంటేనే కేంద్రంతో కలసి ఆయన ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయాలని చూస్తున్నారని అర్థమవుతోంది. హైదరాబాద్ జంట నగరాల్లో ఓటర్లను అకారణంగా తొలగించారు. కేసీఆర్ కుట్రలను ప్రజలు అర్థం చేసుకుంటారు. 2004లోనే కేసీఆర్‌తోపాటు మంత్రి హరీశ్‌రావుపై దొంగ పాస్‌పోర్టు కేసులు నమోదైనా చర్యలు ఎందుకు తీసుకోలేదు. పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ కేసీఆర్ తొత్తుగా వ్యవహరిస్తున్నారు. జగ్గారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన దామోదర రాజనర్సింహను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాం. పోలీసుల బెదిరింపులకు భయపడం. తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదు. – ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఇష్టారాజ్యంగా సీఎం నిర్ణయాలు ఐదేళ్లు పాలించాలని ప్రజలు టీఆర్ఎస్కు అధికారమిస్తే కేసీఆర్ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని అయోమయంలోకి నెట్టుతున్నారు. రాజ్యాంగ సంస్థలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కేసీఆర్ నయా పెత్తందారీ అవతారమెత్తారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ మధ్య తగాదాలు పెట్టాలని చూస్తున్నారు. ప్రతిపక్షాల మధ్య అనైక్యత సృష్టించే ప్రయత్నాలకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేసీఆర్‌ను వెంటనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తొలగించాలి. రాష్ట్రంలో ఎన్నికలు సవ్యంగా సాగాలంటే రాష్ట్రపతి పాలన విధించడమే శరణ్యం. – ఎల్. రమణ, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు -
రాష్ట్రపతి పాలన అవసరం
– న్యాయవాది ఆచార్య టీనగర్: రాష్ట్రంలో ఎమ్మెల్యేలు స్వతంత్రంగా వ్యవహరించేలా పరిస్థితులు చక్కబడేంత వరకూ అవసరమైన పక్షంలో కనీసం మూడు నెలలపాటు రాష్ట్రపతి పాలన విధించాలని న్యాయవాది ఆచార్య సూచించారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కర్నాటక ప్రభుత్వ న్యాయవాది పి.వి ఆచార్య విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడేందుకు కనీసం మూడు నెలలు పడుతుందన్నారు. రాష్ట్రపతి పాలన వల్ల ఎమ్మెల్యేలు బెదిరింపులు లేకుండా స్వతంత్రంగా వ్యవహరించే వీలుంటుందని ఆయన అన్నారు. స్పీకర్ నిర్ణయం సరికాదు: రాందాస్ అసెంబ్లీలో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు వ్యవహరిం చిన తీరు సరికాదని, దీని ద్వారా ఆ పార్టీల నిజస్వరూపాలు తెలిశాయని రాందాస్ అన్నారు. స్పీకర్, కార్యద ర్శి కుర్చీలు, మైక్‌లు ధ్వంసం చేసిన ఘటనలు ఖండిం చాల్సిన అవసరం ఉందన్నారు. స్పీకర్ ధనపాల్ అన్నాడీఎంకేకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించా రు. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ కోరడం నేటి పరిస్థితుల్లో చక్కని పరిష్కారమని అభిప్రాయపడ్డారు. అన్నాడీఎంకేను సాగనంపండి: అన్భలగన్ అన్నాడీఎంకే పాలనను సాగనంపేందుకు ప్రజలు ముందుకు రావాలని ప్రొఫెసర్ అన్భలగన్ కోరారు. నామక్కల్‌లో ఈస్ట్ జిల్లా డీఎంకే యువజన సంఘం, నగర డీఎంకే ఆధ్వర్యంలో స్టాలిన్ జన్మదిన వేడుకలతోపాటు బహిరంగ సభ శుక్రవారం రాత్రి జరిగింది. ఇందులో డీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రొఫెసర్ అన్భలగన్ పాల్గొని 1,640 మందికి సంక్షేమ సహాయకాలను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో అ న్నాడీఎంకే పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలం తా పాటుపడాలని పిలుపునిచ్చారు. -
శశికళ వర్సెస్ ఓపీఎస్: రాష్ట్రపతి పాలనకే ఓటు
తమిళనాడులో సీఎం పీఠం కోసం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు, పార్టీ కేర్‌టేకర్ శశికళకు మధ్య రేగిన చిచ్చు ఆ రాష్ట్ర రాజకీయాల్లో క్షణక్షణం ఉత్కంఠ రేపుతోంది. తమిళనాడులో నెలకొన్న ఈ సంక్షోభంపై ఆన్లైన్లో నిర్వహించిన సర్వేలో నెటిజన్లు అనూహ్యమైన తీర్పునిచ్చారు. మెజార్టి సభ్యులు అంటే 54 శాతం మంది తమిళనాడులో రాష్ట్రపతి పాలనకు అనుకూలంగా ఓటు వేశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తాజాగా ఎన్నికలు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. తమిళనాడులో సంక్షోభం పరిష్కారానికి ఓ నిర్ణయం తీసుకోవడానికి ఈ రోజు సాయంత్రం ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నైకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇరు వర్గాలను కలిసిన తర్వాత ఓ ప్రకటన ఆయన నిర్ణయం తీసుకోనున్నారు. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన అనంతరం మళ్లీ ఆ పీఠం కోసం పోరాటం సాగిస్తుండగా.. జయ నెచ్చెలి శశికళ ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ ఎంగేజ్మెంట్ ప్లాట్‌ఫామ్ తమిళనాట నెలకొన్న తాజా పరిస్థితులపై ఈ సర్వే నిర్వహించింది. దీనిలో 54 శాతం మంది ప్రెసిడెంట్ రూల్‌కు అనుకూలంగా ఓటు వేస్తూ కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలో అసెంబ్లీ నిర్ణయిస్తుందని 34 శాతం మంది పేర్కొన్నారు. ఇంటర్నెల్‌గా అన్నాడీఎంకే నేతలు నిర్ణయిస్తారని 10 శాతం మంది అభిప్రాయపడ్డారు. మెజార్టి సభ్యులు కోరుతున్న ప్రెసిడెంట్ రూల్‌ను బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా మోదీ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అన్నాడీఎంకేలో నెలకొన్న ఈ సంక్షోభాన్ని అనుకూలంగా తీసుకున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే కూడా తాజా ఎన్నికలకు పట్టుబడుతోంది. చదవండి : 'ఎమ్మెల్యేల సంతకాలన్నీ ఫోర్జరీ' -
రెండో విడత రభసతో మొదలు!
‘రాష్ట్రపతి పాలన’పై పార్లమెంటులో కాంగ్రెస్ ఆందోళన లోక్‌సభ వెల్‌లో ధర్నా.. రాజ్యసభలో నినాదాల హోరు ♦ రాష్ట్రాల్లో విపక్షాల ప్రభుత్వాలను కేంద్రం కూలదోస్తోందని ధ్వజం ♦ ఉభయసభల్లో ఈ అంశంపై చర్చకు పట్టుపట్టిన వైనం ♦ లోక్‌సభలో కాంగ్రెస్ వాయిదా నోటీసును తిరస్కరించిన స్పీకర్ న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండో విడత భేటీ అధికార, ప్రతిపక్షాల ఘర్షణతో మొదలయింది. ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లలో రాష్ట్రపతి పాలన విధించటంపై ఆగ్రహంతో ఉన్న విపక్ష కాంగ్రెస్.. కేంద్రంలోని మోదీ సర్కారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రతిపక్ష పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తోందని ఆరోపిస్తూ సోమవారం పార్లమెంటు ఉభయసభల్లో తీవ్ర ఆందోళనకు దిగింది. ఉభయసభల్లోనూ కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్లలోకి దూసుకెళ్లారు. లోక్‌సభలో రాష్ట్రపతి పాలన అంశంపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించటంతో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జునఖర్గే, పార్టీ సభ్యులు వెల్‌లో ధర్నాకు దిగారు. జేడీయూ, ఆప్ సభ్యులు కూడా వెల్‌లోకి వచ్చారు. పార్టీ ఎంపీల నిరసనతో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ కూడా జతకలిశారు. కాంగ్రెస్ ఆరోపణలను హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తోసిపుచ్చారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీఆజాద్ చర్చకు పట్టుపట్టారు. ‘మోదీ హిట్లర్ పాలన’ అనే నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రపతి పాలన ప్రకటన సభ ముందుకు వచ్చినపుడు చర్చించాలని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సూచించారు. రాజ్యసభ రోజంతా వాయిదాలతో ముగిసింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమే: ఖర్గే లోక్‌సభలో ఖర్గే మాట్లాడుతూ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోయటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమేనని స్పీకర్ సుమిత్రామహాజన్‌తో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని హత్య చేస్తూ బీజేపీ ప్రభుత్వాలను స్థాపించటానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం, వారిపై ఒత్తిళ్లకు పాల్పడటం చేస్తోందని ఆరోపించారు. ఈ అంశంపై తాను వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చానన్నారు. దీనికి అధికారపక్షం నుంచి నిరసన వ్యక్తమైంది. స్పీకర్ స్పందిస్తూ.. ఈ అంశం సుప్రీంకోర్టు ఎదుట ఉందని గుర్తుచేస్తూ.. దీనిపై ఇంకా మాట్లాడరాదని ఖర్గేకు సూచించారు. తాను కేంద్ర ప్రభుత్వ చర్యల గురించి మాట్లాడుతున్నానని, ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను రద్దు చేసిన ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు గురించి మాట్లాడటం లేదని ఖర్గే బదులిచ్చారు. న్యాయస్థానం పరిధిలో ఉన్న ఇష్రాత్జహాన్ కేసు గురించి ఇటీవల సభలో చర్చించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ‘‘ఎన్డీఏ ప్రతి రాష్ట్రంలోనూ అధికారాన్ని లాక్కోవటానికి చాలా తొందరపడుతున్నట్లు కనిపిస్తోంది. రాజ్యాంగం ఉందని మరచిపోవద్దు.. మార్చి 28న విశ్వాస పరీక్ష వరకూ మీరు వేచి ఉండాల్సింది.. కానీ మార్చి 27నే మీరు రాష్ట్రపతి పాలనను విధించారు’’ అని ధ్వజమెత్తారు. బీజేడీ నేత బి.మహతాబ్ మాట్లాడుతూ దీనిపై తాము కూడా నోటీసు ఇచ్చామని చెప్పారు. 356వ అధికరణను ఏకపక్షంగా వినియోగించటానికి తాము వ్యతిరేకమని, కోర్టు న్యాయం చేస్తుందని విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లలో సంక్షోభాలను ఎన్డీఏ కానీ బీజేపీ కానీ సృష్టించలేదని, అది వారి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంక్షోభమని పేర్కొన్నారు. రాష్ట్రపతి పాలన అంశం కోర్టు పరిశీలనలో ఉన్నందున దీనిని ప్రస్తుత రూపంలో లేవనెత్తరాదన్న స్పీకర్ నిర్ణయాన్ని ఆయన ఆహ్వానించారు. రాష్ట్రపతి పాలన ప్రకటన ఉభయసభలకు సమర్పణ ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన ప్రకటన పత్రాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం కాంగ్రెస్ సభ్యుల అభ్యంతరాల మధ్య పార్లమెంటు ఉభయసభలకు సమర్పించింది. మార్చి 27వ తేదీన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జారీ చేసిన ప్రకటనతో పాటు.. ఉత్తరాఖండ్ గవర్నర్ మార్చి 26వ తేదీన ఇచ్చిన నివేదికను, ఈ అంశంపై ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీంకోర్టులో విచారణ పత్రాలను కూడా సభకు నివేదించింది. రెచ్చగొడుతున్నారు రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్ రాష్ట్రపతి పాలన అంశాన్ని లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది కాలంగా ఉద్దేశపూర్వకంగా విపక్షాన్ని రెచ్చగొడుతూ పార్లమెంటు సమావేశాల్లో అంతరాయాలు రేకెత్తించి సభ పనిచేయకుండా చేస్తోందని ఆరోపించారు. ‘శీతాకాల సమావేశాలు జరిగేటపుడు.. అరుణాచల్‌లో చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోశారు. కేంద్రం అక్కడ తన సొంత సర్కారును ప్రతిష్టించే వరకూ ఆగలేదు’ అని ధ్వజమెత్తారు. ఉత్తరాఖండ్ విషయంలో ఆ రాష్ట్ర హైకోర్టు జడ్జీలకు అభినందనలు తెలపాలని కోరుకుంటున్నానని ఆజాద్ పేర్కొనగా.. న్యాయపరమైన అంశాలపై ఎటువంటి వ్యాఖ్యలూ ఉండరాదని సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ చెప్పారు. అయితే ఉత్తరాఖండ్ అంశం న్యాయస్థానం పరిశీలనలో ఉన్నందున దీనిని లేవనెత్తరాదంటూ పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి నక్వీ అభ్యంతరం వ్యక్తంచేశారు. మీరన్నదే పాటించండి సీపీఎం నేత సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. న్యాయపరిశీలనలో ఉన్న అంశాలపైనైనా సరే సభలో చర్చను నిరోధించజాలదని సభా నాయకుడు అయిన అరుణ్‌జైట్లీ గత సమావేశాల్లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘మీరు చెప్పి ఆచరించిన దానిని మీరు పాటించండి’ అని తిప్పికొట్టారు. జైట్లీ స్పందిస్తూ.. రాష్ట్రపతి పాలన ప్రకటన అంశం సభ ముందుకు వస్తుందని, అప్పుడు దానిపై మాట్లాడొచ్చని అన్నారు. కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ గందరగోళంలో కురియన్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. తర్వాత ఇదే పరిస్థితుల్లో మళ్లీ 2 గంటల వరకూ వాయిదా పడింది. తిరిగి సమావేశమయ్యాకా కాంగ్రెస్ నిరసన మధ్యే రాజ్యాంగ(ఎస్సీ) ఉత్తర్వు (సవరణ) బిల్లునుప్రభుత్వం ప్రవేశపెట్టింది. బిల్లు ఆమోదానికి సహకరించాలని నక్వీ విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవటంతో సభ మళ్లీ వాయిదా పడింది. ‘కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి’ దేశంలో నెలకొన్న కరువు, నీటి కొరత, వడగాడ్పులపై లోక్‌సభ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. జీరో అవర్‌లో కాంగ్రెస్ సభ్యుడు ముళ్లప్పళ్లి రామచంద్రన్ ఈ అంశాన్ని లేవనెత్తుతూ దేశంలో 4వ వంతు జనాభా కన్నా ఎక్కువ మందిపై దారుణ కరువు పరిస్థితులు ప్రభావం చూపుతున్నాయన్నారు. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించి ప్రజలకు తక్షణ సాయం అందించాలని కోరారు. ఆయనకు మద్దతుగా పలువురు సభ్యులు మాట్లాడారు. దీనిపై సభ సవివరమైన చర్చ జరపాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు సూచించారు. -
'మోదీ.. నీ నియంతృత్వం చెల్లదు'
'మోదీ.. తెరి తానాషాహి, నహి చెలెగి' (మోదీ నీ నియంతృత్వం చెల్లబోదు) అంటూ రాజ్యసభ ప్రతిపక్షాల నిరసనలతో దద్దరిల్లింది. ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభంపై చర్చకు పట్టుబడుతూ ప్రతిపక్షాలు పెద్దలసభలో ఆందోళనకు దిగారు. అయితే, ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉండటంతో సభలో దీని గురించి చర్చించలేమంటూ ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు అందుకున్నారు. 'మోదీ నీ నియంతృత్వం చెల్లబోదు' అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా కేంద్రం తన అధికారాలను దుర్వినియోగపరిచిందని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ రెండో దఫా సమావేశాలు సోమవారం ప్రారంభమైన వెంటనే రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్ శర్మ ఉత్తరాఖండ్ అంశంపై చర్చ చేపట్టాలని కోరారు. రాష్ట్రపతి పాలనకు ఉద్దేశించిన ఆర్టికల్ 356ను మోదీ ప్రభుత్వం దుర్వినియోగపరిచిందని మండిపడ్డారు. దీనిపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కౌంటర్ ఇస్తూ రాజ్యసభలో ఈ అంశంపై చర్చకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేశామని, ముందు చర్చకు పట్టుబట్టడం సరికాదని సూచించారు. అయినా కాంగ్రెస్ సభ్యులు వెనుకకు తగ్గకపోవడం.. ఉత్తరాఖండ్ అంశంపై చర్చ జరుపాల్సిందేనని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగడం రాజ్యసభ మంగళవారానికి వాయిదాపడింది. -
ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది:సుప్రీం
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ ఆరాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో సుప్రీం కోర్టు హైకోర్టు ఆదేశాలను ఆనెల 27 వరకు తాత్కాలికంగా నిలివేస్తూ ఆదేశాలను జారీ చేసింది. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సుప్రీ కోర్టులో హైకోర్టు తీర్పను సవాల్ చేయడంతో జస్టిస్ శివకీర్తి సింగ్ ,జస్టిస్ దీపక్ మిశ్రా ఈ ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్ర ముఖ్మమంత్రిగా హరీష్ రావత్ పదవీ బాధ్యతలు స్వీకరించడంపై సుప్రీ తీర్పు ప్రభావం పడనుంది. కేంద్ర ప్రభుత్వంఅప్పీల్ చేసినందునఉత్తారాఖండ్ లో రాష్ట్రపతి పాలన కొనసాగుతుందని ఆరాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సుప్రీం నోటీసులు పంపింది. -
కేంద్రం దిష్టిబొమ్మ దహనం
కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కరీంనగర్ : ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం ఆధ్వర్యంలో ఇందిరాచౌక్‌లో బుధవారం కేంద్రం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీకి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య వన్‌టౌన్ సీఐ విజయసారథి కాంగ్రెస్ నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం మృత్యుంజయం మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. ఆకుల ప్రకాశ్, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, కర్ర రాజశేఖర్, జుబేర్, ఉప్పరి రవి, మధు, ముస్తాక్, మూల జైపాల్, మహేశ్, అంజన్‌కుమార్, రాజేందర్, నాగిశేఖర్, రవీందర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, మల్లేశం, రాంచందర్, సరిళ్లప్రసాద్, కిషన్, శ్రీనివాస్‌గౌడ్, నవీన్‌గౌడ్, అంజయ్యయాదవ్, యూత్‌కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, మహిళ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఉప్పరి రవి ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణచౌక్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. రవి మాట్లాడుతూ భారత మాజీ ఉపప్రధాని బాబుజగ్జీవన్‌రాం జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొనకపోవడం దళితులను కించపరచడమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ నాయకులు ఎర్ర శ్రీనివాస్, దండి రవీందర్, ఎన్ఎస్యూఐ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తరాఖండ్‌లో 31న బలపరీక్ష
హైకోర్టు తీర్పు ♦ అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేలకూ ఓటువేసే అవకాశం ♦ కేంద్రానికి ఎదురుదెబ్బ; తీర్పును సవాల్‌చేసే యోచన నైనిటాల్: ఉత్తరాఖండ్ రాజకీయాల్లో కొత్త మలుపు. కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలేలా హైకోర్టు తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన రెండు రోజులకే ఉత్తరాఖండ్ హైకోర్టు ఈనెల 31న అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని మంగళవారం ఆదేశించింది. అలాగే, అనర్హత వేటుపడ్డ 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలనూ ఓటు వేసేందుకు అనుమతించింది. అయితే వారి ఓట్లను విడిగా ఉంచాలని, వీరి అనర్హతను సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తుది తీర్పును బట్టి వాటిపై నిర్ణయం ఉంటుందని చెప్పింది. రాష్ట్రపతి పాలనను సవాల్‌చేస్తూ పదవీచ్యుత సీఎం హరీశ్‌రావత్ దాఖలుచేసిన పిటిషన్‌పై జస్టిస్ యూసీ ధ్యాని వరుసగా రెండోరోజూ వాదనలు విన్నారు. బలపరీక్ష సజావుగా జరిగేందుకు ఆ రోజు అసెంబ్లీ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేయాలని డీజీపీని ఆదేశించారు. విశ్వాసపరీక్ష నిర్వహించాలని ఆదేశించినప్పటికీ, రాష్ట్రపతి పాలనపై స్టే విధించారా లేదా అన్నదానిపైనా, రద్దయిన రావత్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించారా లేదా అన్న విషయాలపైనా స్పష్టత లేదు. తొలుత గవర్నర్ విశ్వాసపరీక్షకు ఈనెల 28ని ఖరారుచేయగా, దాని కంటే ఒకరోజు ముందు కేంద్రం రాష్ర్టపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పుపై కేంద్రం బుధవారం హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసే అవకాశముంది. అలాగే, అనర్హతకు గురైన ఎమ్మెల్యేలను ఓటింగ్‌కు అనుమతించడంపై కాంగ్రెస్ కూడా డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాలనే యోచనలో ఉంది. రావత్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. కేంద్రం నిర్హేతుకంగా విధించిన రాష్ట్రపతి పాలనను తక్షణమే రద్దు చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ వాదనలను కోర్టు అంగీకరించిందని, రాష్ట్రపతి పాలన విధించకుండా విశ్వాస పరీక్ష నిర్వహించడానికి అవకాశముందని పేర్కొందని సింఘ్వీ మీడియాకు చెప్పారు. కేవలం బేరసారాల ఆరోపణల ఆధారంగా రాష్ట్రపతి పాలన విధించలేరని, బల పరీక్షనూ ఆపలేరన్నారు. అనర్హతకు గురైన ఎమ్మెల్యేలను ఓటు వేసేందుకు అనుమతించడంపై సింఘ్వీ మాట్లాడుతూ, వారి అనర్హత రద్దు అయితే తప్ప వారి ఓట్లు చెల్లుబాటు కావని చెప్పారు. వారికి ఎదురుదెబ్బ: రావత్ కోర్టు తీర్పును హరీశ్ రావత్ స్వాగతించారు. నిరంకుశ పాలనను తేవడానికి యత్నిస్తున్న కేంద్రానికి ఇది ఎదురుదెబ్బ అని పేర్కొన్నారు. అలాగే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చేయాలన్న వారి యత్నాలను ఈ తీర్పు అడ్డుకుంటుందన్నారు. ద్రవ్య వినిమయ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందిందని, దీన్ని కేంద్రం అడ్డుకుంటే 24 గంటలపాటు నిరశన దీక్ష చేపడతానని చెప్పారు. తమకు 34 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని కాంగ్రెస్ చెబుతోంది. తమ పార్టీకి చెందిన 27 మంది ఎమ్మెల్యేలతోపాటు 6 మంది పీడీఎఫ్ మ్మెల్యేలు, ఒక బీజేపీ అసమ్మతి ఎమ్మెల్యే మద్దతు ఉందని చెప్పింది. -
రాష్ట్రపతి పాలన రద్దు చేయండి
హైకోర్టులో రావత్ పిటిషన్ ♦ తన సర్కారును పునరుద్ధరించాలని వినతి డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను రద్దుచేసి, తన ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని మాజీ సీఎం హరీశ్ రావత్ హైకోర్టును ఆశ్రయించారు. నిరంకుశత్వంతో మోదీ ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించిందన్నారు. రావత్ తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సోమవారం నైనిటాల్‌లోని హైకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్రంలో ఆర్టికల్ 356 ప్రయోగం చట్టవ్యతిరేకమని, రద్దు కోసం హైకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. అసెంబ్లీలో బలపరీక్షకు ఇంకో రోజు గడువు ఉండగానే, కేంద్రం రాజ్యాంగ ప్రక్రియకు తూట్లు పొడిచేలా నిర్ణయం తీసుకుందన్నారు. ఈ పిటిషన్‌పై యూ.సీ ధ్యాని ఏకసభ్య ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విని మంగళవారానికి వాయిదా వేసింది. గవర్నర్‌తో రావత్ భేటీ.. తనకు సంపూర్ణ మెజారిటీ ఉందని, అందువల్ల బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని రావత్ సోమవారం గవర్నర్ కేకే పాల్‌ను కలిశారు. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను వెంట తీసుకెళ్లారు. వీరిలో 26 మంది కాంగ్రెస్, ఐదుగురు పీడీఎఫ్, ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే ఉన్నారు. తమకు 34 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ గవర్నర్‌కు లేఖ ఇచ్చారు. పరస్పర విమర్శలు.. గవర్నర్ అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునేందుకు సీఎంకు గవర్నర్ గడువు ఇచ్చినప్పటికీ కేంద్రం రాష్ర్టపతి పాలన విధించిందని కాంగ్రెస్ దుయ్యబట్టింది. ప్రభుత్వ బల నిరూపణకు బలపరీక్షే మార్గమని ఎస్ఆర్ బొమ్మైకేసులో సుప్రీం కోర్టు చెప్పిందని పేర్కొంది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ.. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం సృష్టించారని మండిపడ్డారు. ద్రవ్య వినిమయ బిల్లు వీగిపోయినప్పటికీ అది ఆమోదం పొందిందంటూ స్పీకర్ ప్రకటించడాన్ని తప్పుబట్టారు. -
'ఆ నిర్ణయానికి స్వాగతం'
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పరిపాలనను మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం రెబల్ కాంగ్రెస్ పార్టీ నేత విజయ్ బహుగుణ స్వాగతించారు. ఇదొక మంచి ముందడుగని అన్నారు. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనపై స్పందిస్తూ హరీశ్ రావత్ ప్రభుత్వం అవినీతికి పాల్పడినందున ఆయనను తొలగించాల్సిందేనని చెప్పారు. అయితే, రాష్ట్రపతి పాలన ఎంతో కాలం సాగదని, త్వరలోనే మరోసారి ఎన్నికలు జరుగుతాయని తాను భావిస్తున్నానని చెప్పారు. ప్రస్తుత అసెంబ్లీ సమయంలోనే ప్రభుత్వ ఏర్పాటు జరిగితే బాగుండేదని అన్నారు. -
ప్రధాని పదవిపై ఎప్పుడూ ఆశపడలేదు..
తన తాజా పుస్తకంలో ‘రాష్ట్రపతి పాలన’పై ప్రణబ్ * అయోధ్య ‘ద్వారాలు’ తెరవటం రాజీవ్‌గాంధీ చేసిన పొరపాటు * ‘ద టర్బులెంట్ ఇయర్స్: 1980-96’ను ఆవిష్కరించిన హమీద్ అన్సారీ న్యూఢిల్లీ: రాష్ట్రపతి పాలన విధింపు అనేది దుర్వినియోగానికి అవకాశం కల్పిస్తుందని.. అయితే కొన్నేళ్లలో చేసిన విధానపరమైన మార్పులు ఆ అవకాశాన్ని కొంతమేర తగ్గించాయని రాష్ట్రపతి ప్రణబ్ తను రాసిన తాజా పుస్తకంలో పేర్కొన్నారు. ప్రణబ్ తన అనుభవాలతో రాసిన రెండో పుస్తకం ‘ద టర్బులెంట్ ఇయర్స్ 1980-1996’ (కల్లోల సంవత్సరాలు) పుస్తకాన్ని రూపా పబ్లికేషన్స్ ప్రచురించగా.. ఉపరాష్ట్రపతి అన్సారీ గురువారం ఢిల్లీలో ఆవిష్కరించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్యాంగం విఫలమైందన్న ప్రాతిపదికపై రాష్ట్రపతి పాలన విధిస్తూ జారీ చేసిన అధికారిక ప్రకటనపై ప్రణబ్ మంగళవారం నాడే సంతకం చేసిన నేపథ్యంలో.. ఆయనే రాసిన పుస్తకంలోని పై వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అసాధారణ పరిస్థితుల్లో రాష్ట్రాల అధికారాన్ని రద్దుచేసే శక్తిని రాజ్యాంగంలోని 356వ అధికరణ కేంద్రానికి కల్పిస్తోందని.. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఆ శక్తిని దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలతో ఈ అధికరణపై తీవ్ర విమర్శలు వచ్చాయని ప్రణబ్ తన పుస్తకంలో ఉటంకించారు. గణతంత్రం తొలి 50 ఏళ్లలో 2001 మార్చి వరకూ వివిధ రాష్ట్రాల్లో 108 సార్లు రాష్ట్రపతి పాలన విధించటం.. ఈ ఆరోపణలకు బలం చేకూర్చిందన్నారు. గతంలో రాష్ట్రపతి పాలనను మూడేళ్ల వరకూ కొనసాగించవచ్చని.. కానీ రాజ్యాంగానికి 44వ సవరణ తర్వాత రాష్ట్రపతి పాలనను కేవలం ఏడాది పాటే కొనసాగించే వీలుందని.. అది కూడా అధికారిక ప్రకటన జారీ చేసిన రెండు నెలల్లోగా పార్లమెంటు ఉభయసభలూ దానిని ఆమోదించాల్సి ఉంటుందని వివరించారు. ప్రధాని పదవిపై ఎప్పుడూ ఆశపడలేదు ప్రధాని పదవి చేపట్టాలని తానెప్పుడూ ఆశపడలేదని స్పష్టంచేశారు. ఇందిరాగాంధీ హత్యోదంతం తర్వాత ప్రధాని పదవికి సంబంధించి తనపై వచ్చిన కథనాలన్నీ అసత్యాలని పేర్కొన్నారు. రాజీవ్‌గాంధీకి తనకు మధ్య ప్రధాని పదవికి సంబంధించి బాత్రూమ్లో జరిగిన సంభాషణలను వివరించారు. హాలులో జనం ఉండటంతో రాజీవ్ తనను బాత్రూమ్లోకి తీసుకెళ్లారని.. అప్పటి రాజకీయ పరిస్థితులు, రాజీవ్‌ను ప్రధానిగా చేయాలన్న పార్టీ నాయకుల అభిప్రాయాలను తాను చర్చించానని.. దీంతో ప్రధాని పదవి చేపట్టేందుకు రాజీవ్ అంగీకరించారని తాను బయటకొచ్చి రాజీవ్ నిర్ణయాన్ని తెలియజేశానని పేర్కొన్నారు. మాస్ లీడర్‌ను కానని గుర్తించా: తర్వాతి కాలంలో రాజీవ్ కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలకటం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ‘పీవీ నరసింహారావు కూడా అయోమయంలో పడ్డారు’ అని అన్నారు. ఈ విషయంలో రాజీవ్‌తోపాటు తానూ తప్పులు చేశానన్నారు. బహిష్కారానికి గురయ్యాక బయటకొచ్చి ప్రణబ్ రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్ పార్టీని స్థాపించానని.. తాను మాస్ లీడర్‌ను కాననే సంగతి తర్వాతే గుర్తించానన్నారు. రెండేళ్ల తర్వాత తిరిగి పార్టీలోకి వచ్చానన్నారు. అది రాజీవ్ పొరపాటు: పంజాబ్‌లో పరిస్థితి అసాధారణంగా మారిపోవటంతో స్వర్ణదేవాలయంలో ఉగ్రవాదుల ఏరివేతకు.. తనకు ప్రాణాపాయం ఉందని తెలిసీ మరో మార్గం లేకపోవటంతో ‘ఆపరేషన్ బ్లూ స్టార్’పై ఇందిర నిర్ణయం తీసుకున్నారన్నారు. 1986 ఫిబ్రవరి 1న అయోధ్యలో ఆలయ ప్రాంత ద్వారాలను తెరవటం రాజీవ్ అంచనా పొరపాటన్నారు బాబ్రీ మసీదును ధ్వంసం చేయటం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం పాల్పడిన మతిలేని విశ్వాసఘాతుక చర్య అని.. భారత ప్రతిష్టను అది దెబ్బతీసిందన్నారు. మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేయటం.. జనాభాలో భిన్న వర్గాలు వేర్వేరుగా పోగుపడటానికి కారణమైనా సమాజంలో సామాజిక అన్యాయాన్ని తగ్గించేందుకు సాయపడిందన్నారు. కావాలనే రహస్యాలను చెప్పలేదు ‘‘చాలా రహస్యమైన అంశాలపై నేను ఉద్దేశపూర్వకంగానే (పుస్తకంలో) మాట్లాడలేదు. అవి నాతోనే సమాధి అవుతాయి. ఆయా అంశాలకు సంబంధించిన వాస్తవాలను ప్రభుత్వం విడుదల చేసినపుడు చదివి తమ సొంత నిర్ధారణలకు రావాల్సింది పాఠకులే’’ అని ప్రణబ్‌ముఖర్జీ పేర్కొన్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. డైరీలో రోజూ ఒక పేజీ రాసే తన అలవాటు గురించి చెప్తూ.. తన డైరీని ఎన్నడూ బయటపెట్టవద్దని దాని భద్రతను చూస్తున్న తన కుమార్తెకు నిర్దేశించినట్లు తెలిపారు. -
రాష్ట్రపతి పాలనపై పిటిషన్
న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన ప్రకటించటాన్ని సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర మాజీ సీఎం నబమ్‌టుకీ గురువారం తాజా పిటిషన్ దాఖలు చేశారు. దీనితో పాటు.. కాంగ్రెస్ శాసనసభాపక్ష చీఫ్ విప్ రాజేశ్ టాచో వంటి వారు వేసిన పిటిషన్లను జస్టిస్‌జె.ఎస్.ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం విచారణకు స్వీకరించే అవకాశముంది. ఇంతకుముందు వేసిన పిటిషన్లు రాష్ట్రపతి పాలనను ప్రశ్నించలేదని.. రాష్ట్రపతి పాలన విధించటానికి ముందే వాటిని దాఖలు చేశారని కేంద్రం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. పిటిషన్ల సవరణకు ధర్మాసనం అవకాశం ఇవ్వగా నబమ్‌టుకీ తాజాపిటిషన్ వేశారు. సుప్రీం కోర్టు.. రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ ఇచ్చిన నివేదికను తమ ముందుంచాలని ఆ రాష్ట్ర గవర్నర్ జ్యోతిప్రసాద్ రాజ్‌ఖోవాతో పాటు కేంద్ర హోంశాఖకు బుధవారం నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీకి తాళం వేశారు.. అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని సిఫారసు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికలో శాంతిభద్రతలు సహా రాష్ట్రంలో పరిపాలన పతనమవటం, శాసనసభ భవనానికి తాళం వేయటాన్ని రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలటానికి కారణాలుగా అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజ్‌ఖోవా పేర్కొన్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలపై నిషిద్ధ రహస్య నాగా సంస్థ ఎన్ఎస్సీఎన్ (ఖాప్లాంగ్) ద్వారా ఒత్తిడి తెచ్చేందుకు అధికార కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని నివేదికలు సూచిస్తున్నాయని గవర్నర్ చెప్పారు. శాసనసభ సమావేశం శాసనసభ ఆవరణలో జరగకుండా స్పీకర్, ప్రభుత్వంతో కలిసి అడ్డుకున్నారని తెలిపారు. ప్రజాస్వామ్య సూత్రాలను కాలరాసే ప్రయత్నం ఇక కేంద్ర మంత్రివర్గం అరుణాచల్‌లో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ.. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మెజారిటీ మద్దతు లేదని, మైనారిటీ సర్కారుతో చేతులుకలిపిన స్పీకర్ శాసనసభ సమావేశాలు జరగకుండా అడ్డుకోవటం ద్వారా ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలను.. ముఖ్యమంత్రికి సభలో మెజారిటీ మద్దతు ఉండాలని, ఆ మెజారిటీని సభలో పరీక్షించాలని చెప్తున్న రాజ్యాంగ కనీస అవసరాన్ని కాలరాసే ప్రయత్నం చేశారని పేర్కొంది. రాజ్‌భవన్ ప్రాంగణాన్ని సీఎం, స్పీకర్ల మద్దతుదారులు పలు గంటల పాటు దిగ్బంధించారని, గవర్నర్‌ను ఘెరావ్ చేయటం రాష్ట్రంలో రాజ్యాంగం కుప్పకూలటమేనని అభివర్ణించింది. -
‘అరుణాచల్’ సున్నిత విషయం
రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టు వ్యాఖ్య ♦ గవర్నర్ ఇచ్చిన నివేదికను తమ ముందుంచాలని కేంద్రానికి ఆదేశం న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఇది చాలా తీవ్రమైన, సున్నితమైన అంశమంటూ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం.. రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ గవర్నర్ ఇచ్చిన నివేదికను తమ ముందుంచాలని ఆదేశించింది. దీనిపై జనవరి 29 లోగా స్పందించాలంటూ గవర్నర్ జ్యోతిప్రసాద్ రాజ్‌ఖోవాకు, కేంద్ర హోం శాఖకు బుధవారం నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ పాలనలోని అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ జారీ అయిన అధికారిక నోటిఫికేషన్‌ను పిటిషన్‌దారులు తమ తాజా దావాలో సవాలు చేయలేదని, అందువల్ల మళ్లీ దావా వేయాల్సి ఉంటుందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ లేవనెత్తిన సాంకేతికపర అభ్యంతరాన్ని బెంచ్ తోసిపుచ్చింది. తమ దావాను జనవరి 29లోగా సవరించుకునేందుకు పిటిషన్‌దారైన అరుణాచల్ అసెంబ్లీలో సీఎల్పీ చీఫ్ విప్ రాజేశ్ టాకోకు, సహ పిటిషన్‌దారులకు అవకాశమిచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 1కి వేసింది. రాష్ట్రపతి పాలన విధించాలంటూ గవర్నర్ చేసిన సిఫారసు నివేదికను రహస్యంగా ఉంచాలంటూ గవర్నర్ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ సత్పాల్ జైన్ కోరారు. దాంతో పిటిషన్‌దారులకు నివేదిక పంపిన తేదీని చెబితే సరిపోతుందని, తమకు మాత్రం పూర్తి నివేదికను సీల్డ్ కవర్లో అందించాలని బెంచ్ స్పష్టం చేసింది. ‘రాష్ట్రపతి పాలనను సిఫారసు చేయడానికి కారణాలేంటో తెలియకుండా ముందుకు వెళ్లలేం. ఆ కారణాలతో.. రాష్ట్రపతి పాలన విధిస్తూ జారీ అయిన అధికారిక నోటిఫికేషన్‌లోని వివరాలు సరిపోలకపోతే అది వేరే విషయం’ అని పేర్కొంది. గవర్నర్ నివేదికలోని కారణాలు, నోటిఫికేషన్‌లోని కారణాలు వేరుగా ఉండే అవకాశముందని ప్రభుత్వం న్యాయవాది అశోక్ దేశాయి పేర్కొనగా ‘ఎస్.. అందుకే మేం ముందుగా గవర్నర్ నివేదికను చూడాలనుకుంటున్నాం’ అని తేల్చిచెప్పింది. గవర్నర్ నివేదికను రహస్యంగా ఉంచాలన్న అభ్యర్థనను వ్యతిరేకిస్తూ.. ఈ విషయంలో ఐదుగురు కన్నా ఎక్కువ మంది సభ్యులున్న సుప్రీం బెంచ్ ఇప్పటికే ఈ అంశంపై స్పష్టతనిచ్చిందని పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ఫాలీ నారిమన్ తదితరులు చెప్పారు. అంతకుముందు, విచారణ ప్రారంభం కాగానే, 15 నిమిషాల్లో గవర్నర్ నివేదికను కోర్టుకు సమర్పించాలంటూ కోర్టు ఆదేశించడంతో.. రాజ్‌భవన్ ముందు నిరసనలు జరుగుతున్నాయని, గవర్నర్‌కు ప్రాణహాని అవకాశముందని సత్పాల్ జైన్ వివరణ ఇచ్చారు. గవర్నర్ ఇచ్చిన పలు నివేదికల ఆధారంగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారన్న ముకుల్ రోహత్గీ వాదనను.. ఒకే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్లుగా రాష్ట్రపతిపాలన విధిస్తూ జారీ అయిన నోటిఫికేషన్లో ఉందంటూ కోర్టు తిప్పికొట్టింది. రాష్ట్రపతి పాలనకు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు అవసరమైన ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయన్న నారిమన్ వాదనతో విభేదిస్తూ.. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమంది. కాగా అరుణాచల్‌లో రాష్ట్రపతిపాలన సమాఖ్య తత్వానికి దెబ్బని కాంగ్రెస్ పేర్కొంది. తనకు అవకాశమిస్తే.. అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకుంటానని మాజీ సీఎం టుకీ చెప్పారు. -
అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన !
గౌహతి : అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనకు రంగం సిద్ధమైంది. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు కేంద్రమంత్రి వర్గం రాష్ట్రపతికి సిఫార్సు చేసిందని సమాచారం. ఆదివారం న్యూఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో ఆయన అధ్యక్షత కేంద్రమంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా అరుణచల్‌ప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితపై చర్చకు వచ్చింది. అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే కంటే.... దానిని సుప్తచేతనావస్థలో ఉంచి... రాష్ట్రపతి పాలన వైపే కేంద్రమంత్రి వర్గం మొగ్గుచూపినట్లు తెలిసింది. గతేడాది డిసెంబర్ 16, 17 తేదీల్లో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు హోటల్లో జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 60 మంది ఎమ్మెల్యేలు గల ఆ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 47 సీట్లు ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి నబమ్ తుకికి కేవలం 26 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతు ఇస్తున్న విషయం విదితమే. అయితే అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజ్కోవా బీజేపీ ఏజెంట్‌గా వ్యవహారిస్తున్నారంటూ ముఖ్యమంత్రి నబమ్ తుకి ఆరోపించారు. -
ఎన్నికల తర్వాత ఢిల్లీలో సుస్థిర ప్రభుత్వం
న్యూఢిల్లీ: రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందనే ఆశాభావాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ వ్యక్తం చేశారు. ఏడాదిగా ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఉన్న సంగతి తెలిసిందే. మోడల్ టౌన్ నియోజకవర్గంలోని సెయింట్ జేవియర్ స్కూలులో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందన్నారు. దేశంలోనే అత్యధిక ఓట్ల శాతం నమోదు కావడం ద్వారా ఢిల్లీ రికార్డు సృష్టించాలని ఎల్లప్పుడూ ఆశిస్తూ ఉంటానని చెప్పారు. 2013 ఎన్నికల్లో 65.13 శాతం ఓట్లు పోలయ్యాయన్నారు. -
సుస్థిర పాలనకే అత్యధికుల మొగ్గు
న్యూఢిల్లీ: సుదీర్ఘ రాష్ట్రపతి పాలనతో విసిగిపోయిన జాతీయ రాజధానివాసులు వచ్చే నెల ఏడోతేదీన జరగనున్న ఎన్నికల్లో సుస్థిర పాలనకే మొగ్గుచూపే అవకాశముంది. అవినీతి నిర్మూలనకంటే సుస్థిర ప్రభుత్వం అధికకారంలో ఉండాలని వారంతా కోరుకుంటున్నారు. 2013 విధానసభ ఎన్నికల తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కే జ్రీవాల్ 49 రోజుల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. దీంతో అభివృద్ధి పను లు ఆగిపోయాయి. ప్రజల ఈతిబాధలను పట్టించుకునేవారే కరువయ్యారు. ఈ కారణంగా వర్తకులు, మధ్యతరగతి వారు. ఆటోరిక్షా డ్రైవర్లు, ఈ-రిక్షా డ్రైవర్లు, చిన్నచిన్న వ్యాపారుల ధోరణిలో మార్పు వచ్చింది. దీంతో వారంతా ఇప్పుడు సుస్థిర ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. తాము అధికారంలోకి వస్తే అవినీతిని నిర్మూలిస్తామని కేజ్రీవాల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం కలగానే మిగిలిపోయింది. ఎన్నికల తేదీలు వెలువడిన తర్వాత జరిపిన అధ్యయనంలో అనేకమంది ఇదే విషయాన్ని ప్రస్తావించారు. వారంతా సుస్థిర ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారు. రాష్ట్రపతి పాలన ఇన్నాళ్లా: మహ్మద్ కజీమ్ ఇదే విషయమై దర్యాగంజ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ కజీమ్ మాట్లాడుతూ ‘ఢిల్లీలో సొంత ప్రభుత్వం అధికారంలో ఉండాలి. సుదీర్ఘ రాష్ట్రపతి పాలన ఎంతమాత్రం బాగాలేదు. అసలు మంచిది కూడా కాదు’అని అన్నాడు. లంచం ఇస్తేనే ఏ పనైనా: ముఖేష్ గుప్తా ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ముఖేష్ గుప్తా మాట్లాడుతూ ‘పరిస్థితి కొంతమేర మెరుగుపడింది. అయినప్పటికీ లంచం ఇవ్వకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పనీ జరిగే పరిస్థితి ప్రస్తుతం లేదు. సుస్థిర ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదాకా అవినీతి పరంపర కొనసాగుతూనే ఉంటుంది’ అని అన్నాడు. ఢిల్లీ ఎంతో అభివృద్ధి చెందిన నగరమని, ఇక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నాడు. ఇంతకాలం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ చేతిలో అధికారం పగ్గాలు ఉండడంతో విధాన పరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశమే లేకపోయిందన్నాడు. ఈసారి నగరవాసులు నిర ్ణయాత్మకమైన తీర్పు ఇస్తారని ఆశిస్తున్నానన్నాడు, ఆరు నెలలకోసారి ఎన్నికలు రాకూడదని కోరుకుంటున్నట్టు చెప్పాడు. ‘అత్యాచారాల సంఖ్య పెరిగింది’ నగరంలో అత్యాచారాల సంఖ్య గణనీయంగా పెరిగిం దంటూ యువత ఆవేదన వ్యక్తం చేసింది. దీంతోపాటు యాసిడ్ దాడి కేసుల సంఖ్య కూడా బాగా పెరిగిపోయిం దని అంటున్నారు. ఈ విషయమై నగరంలోని కిద్వాయ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని ఇషా కపూర్ మాట్లాడుతూ ‘మహిళలకు భద్రత, వారి హక్కులకు ప్రాధాన్యమిచ్చే ప్రభుత్వానికే ఓటు వేస్తా. 2012లో నిర్భయ ఘటన తర్వాత నిరసనలు వెల్లువెత్తడంతో రాజకీయ నాయకులు అనేక హామీలు ఇచ్చారు. అయినప్పటికీ మహిళలపై నేరాల సంఖ్య ఎంతమాత్రం తగ్గలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఓటు వేయాలని అనిపించడం లేదు’ ఇదే విషయమై నగరంలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతానికి చెందిన రమాశర్మ మాట్లాడుతూ ‘ఓటుహక్కు వినియోగంపై ఆసక్తి తగ్గిపోయింది. సామాన్యుడికి సంబంధించిన సమస్యలను ప్రధాన రాజకీయ పార్టీలు ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. ఒకరిపై మరొకరు బురద చల్లుకోవడానికే పరిమితమవుతున్నారు. నగరంలో మౌలిక వసతులు మెరుగుపడాల్సిన అవసరం ఉంది. మరిన్ని ఆస్పత్రులు, పాఠశాలల నిర్మాణం కూడా జరగాలి. ఎన్నికల బరిలోకి అనేకమంది దిగుతుండడంతో ఎవరిని ఎన్నుకోవాలో కూడా తెలియడం లేదు. నగరం వదిలిపెట్టి పారిపోవాలనిపిస్తోంది’ అని అన్నారు. అవినీతి అనేది తీవ్రంగా పట్టించుకోవాల్సిన విషయమే అయినప్పటికీ దానిని ఏ పార్టీ కూడా నిర్మూలించలేదని అన్నారు. -
పీడీపీకి మద్దతుపై గవర్నర్‌కు ఎన్సీ లేఖ
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో రాజకీయం సరికొత్త మలుపు తిరిగింది. ప్రభుత్వ ఏర్పాటుపై ఎవరూ ముందుకు రాకపోవడంతో రాష్ట్ర అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచి కేంద్రం రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)కి లాంఛనంగా మద్దతు ప్రకటిస్తూ గవర్నర్ ఎన్.ఎన్. వోహ్రాకు మంగళవారం లేఖ రాసింది. పార్టీ జమ్మూ ప్రొవిన్షియల్ ప్రెసిడెంట్ దేవేందర్‌సింగ్ రాణా ఈ లేఖను గవర్నర్‌కు జమ్మూలో అందజేశారు. ఈ మేరకు ఎన్సీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ‘ట్వీట్’ చేశారు. కాగా, తాజా పరిణామంపై పార్టీలో చర్చించాక స్పందిస్తామని పీడీపీ ప్రతినిధి నయీమ్ అఖ్తర్ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు అంశంపై ప్రస్తుతం బీజేపీతో అనధికార స్థాయిలో చర్చలు జరుగుతున్నాయన్నారు. -
రాష్ట్రపతి పాలన విధించాలి: మాయవతి
ఉత్తర ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలంటూ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధ్యక్షురాలు మాయవతి బుధవారం డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పి దుర్భరమైన పరిస్థితి నెలకొందని చెప్పారు. ఆమె బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. శాంతిభద్రతల విషయంలో రాష్ట్రంలో పునర్వవైభవాన్ని తీసుకరావాలని కోరుకుంటున్నట్టు మాయవతి పునరుద్ఘాటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అంతా అరాచకం రాజ్యమేలుతుందని ఆరోపించారు. శాంతిభద్రతలు అదుపులోకి రావాలంటే వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. దీనిపై గవర్నర్ సరైన నివేదికను పంపి, ఆపై రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నట్టు మాయవతి తెలిపారు. -
రాష్ట్రపతి పాలనకు వ్యూహం
చెన్నై, సాక్షి ప్రతినిధి : రాష్ట్రంలో అన్నాడీఎంకే ఆధిపత్యానికి గండికొట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించడం ద్వారా జయలలిత ప్రాభవాన్ని పక్కనపెట్టవచ్చన్న వ్యూహ రచనలో నిమగ్నమయ్యూయి. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో అన్నాడీఎంకే గెలుపొంది అధికారంలోకి వచ్చింది. అంతకు ముందు డీఎంకే అధికారంలో ఉంది. ఐదేళ్లకోసారి అధికార పార్టీ మారడం రాష్ట్రంలో సర్వసాధారణమైనా అన్నాడీఎంకే ప్రధాన ప్రత్యర్థి డీఎంకేకు ఈసారి గట్టిదెబ్బే తగిలింది. కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా శ్రీలంక యుద్ధం సమయంలో సరైన పాత్ర పోషించలేదనే అపవాదును కరుణానిధి మూటగట్టుకున్నారు. శ్రీలంక గస్తీ దళాలు తమిళ జాలర్లపై చెలరేగిపోవడం వల్ల ఈ అపప్రద మరింతగా పెరిగింది. గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో ఒంటిరిపోరుకు దిగిన అన్నాడీఎంకే అత్యధిక స్థానాలు (37) తన్నుకుపోగా మిగిలిన రెండింటిలో బీజేపీ, కూటమి పార్టీ గెలుచుకున్నారు. డీఎంకే అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యూయి. గత నెల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం అమ్మ హవా కొనసాగింది. డీఎంకేకు ఒక్క కార్పొరేషన్, ఒక్క మునిసిపాలిటీ కూ డా దక్కలేదు. అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటుతున్నా అమ్మ ప్రభుత్వంపై ప్రజల్లో ఏమాత్రం అసంతృప్తి లేకుండా పోయింది. అమ్మ క్యాంటీన్లు, అమ్మ ఫార్మసీలు, అమ్మ వాటర్ బాటిళ్లు, అమ్మ చౌకదుకాణాలు ఇలా అన్ని పథకాలతో ప్రజలకు అమ్మ చేరువకావడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. అన్నిటికన్నా ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు మధ్య అనాదిగా సాగుతున్న కావేరీ జలాల వివాదంపై జయ విజయం సాధించారు. పాలనాపరంగా ప్రతిపక్షాల విమర్శలకు అమ్మ చిక్కడం లేదు. 2016లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో అన్నాడీఎంకేను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రతిపక్షాలకు అవకాశమే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో జయ జైలు పాలుకావడం ప్రతిపక్షాలకు కలిసొచ్చింది. రాబోయే ఎన్నికల్లో జయ జైలు అంశాన్నే ప్రధాన ఆయుధంగా మలుచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాదిన్నర కాలంలో అన్నాడీఎంకే అధికారంలో ఉంటే సంకట స్థితిని ఎదుర్కొనే అవకాశం ఉందని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. ఓ పన్నీర్ సెల్వం నేతృత్వంలో కొనసాగుతున పాలనను ఆపద్ధర్మ ప్రభుత్వంలా చూస్తున్న ప్రతిపక్షాలు రాష్ట్రపతి పాలన దిశగా సాగాలని ఆలోచిస్తున్నాయి. జయ జైలు పాలైన తరువాత రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఆందోళనల కారణంగా శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమయ్యూయనే కారణం చూపుతూ కేంద్రంపై ఒత్తిడి తేవడం ద్వారా రాష్ట్రపతి పాలనను సాధించాలని వ్యూహం పన్నుతున్నాయి. అధికార పార్టీ అధినేత్రి కోసం సాగుతున్న ఆందోళనలు కావడంతో పోలీసు శాఖ నుంచి అనుమతులు కూడా తీసుకోవడం లేదని డీఎంకే అధినేత కరుణానిధి సోమవారం నోరువిప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను అదుపు చేసేందుకు కీలకస్థానాల్లో ఉన్నవారు తక్షణం జోక్యం చేసుకోవాలని కరుణ డిమాండ్ చేయడం రాష్ట్రపతి పాలన కోసం డిమాండ్ చేయడంగానే పరిగణిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అన్నాడీఎంకే యేతర పక్షాలన్నీ డీఎంకే నేతృత్వంలో ఒకే గొడుగు కిందకు రావాలనే ప్రయత్నాలు ఇప్పటికే మొద లయ్యూయి. పనిలో పనిగా రాష్ట్రపతి పాలనను సైతం సాధించగలిగితే రాబోయే అసెంబ్లీ ఎన్నికలో గెలుపు నల్లేరు మీద నడకేనని సమాలోచనలు జరుపుతున్న సమాచారం. -
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన
న్యూఢిల్లీ: మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధింపునకు కేంద్ర కేబినెట్ శనివారం సిఫార్సు చేయగా.. దీనికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి పాలన విధింపు ప్రకటనపై ప్రణబ్ సంతకం చేసినట్టు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు ఆదివారం తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో 15 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) మద్దతు ఉపసంహరించడంతో.. పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలో పడడం, దీంతో సీఎం పదవికి చవాన్ రాజీనామా చేయడం తెలిసిందే. -
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన
న్యూఢిల్లీ: వచ్చే నెల 15న శాసనసభ ఎన్నికలు జరగవలసి ఉన్న మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధింపునకు కేంద్ర మంత్రివర్గం శనివారం సిఫార్సు చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేసిన మరుసటి రోజునే ఢి ల్లీలో కేంద్ర మంత్రివర్గం సమావేశమై, ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో మంత్రివర్గ సమావేశానికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. పదిహేనేళ్ల పొత్తుకు స్వస్తి చెబుతూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పృథ్వీరాజ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో చవాన్ శుక్రవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు శనివారం ఆమోదించారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ తన నివేదిక పంపుతూ, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు తెలిసింది. కాగా, నామినేషన్ల పర్వం శనివారంతో ముగిసింది. -
కేంద్రానికి కరుణానిధి లేఖ
చెన్నై: తమిళనాడులో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు లేఖలు రాశారు. తమిళనాడులో రాజ్యంగయంత్రాగం పూర్తిగా విఫలమైందని కరుణానిధి ఆరోపించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్షపడిన నేపథ్యంలో శనివారం అన్నా డీఎంకే కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో కరుణానిధి కేంద్రానికి లేఖలు రాశారు. -
మహారాష్ట్రలోరాష్ట్రపతి పాలనకు సిఫారసు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసినట్టు సమాచారం. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు నివేదికను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ శుక్రవారం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య పొత్తు వికటించడంతో ప్రభుత్వం మైనార్టీలో పడింది. -
సర్కారుపై గుస్సా
సాక్షి, మంచిర్యాల : కొత్త ప్రభుత్వం తమ పదవికి ముప్పు తెస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్, డెరైక్టర్ పదవుల్లో కొనసాగుతున్న పలువురు నాయకులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ సర్కారు నిర్ణయంతో ఊడిపోనున్న తమ పీఠాలను తలుచుకొని నిర్వేదానికి లోనవుతున్నారు. కోల్పోనున్న పదవిని తిరిగి పొందేందుకు కొందరు.. కొత్తగా పదవి పొందేందుకు మరికొందరు హైదరాబాద్‌లో మకాం వేసి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మూడేళ్ల పదవి కాలంతో మార్కెట్ కమిటీ చైర్మన్లు, డెరైక్టర్లను నియమితులయ్యారు. అయితే తాజా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పరాజ యం పాలై టీఆర్ఎస్ గద్దెనెక్కడం, ప్రస్తుత కమిటీలను రద్దు చేసే దిశగా టీఆర్ఎస్ కసరత్తు చేస్తుండటంతో ప్రస్తుతం ఉన్న వారు ఆవేదన చెందుతున్నారు. న్యాయశాఖ సలహాతో ముందుకు.. స్థానిక సంస్థల కమిటీల నియామకాన్ని రద్దుచేసే అవకాశం రాజ్యాంగం కల్పించనందున రాష్ట్రపతి పాలన సమయంలో మార్కెట్ కమిటీలు రద్దు కాలేదు. దీంతో తెలంగాణ సర్కారు తాజాగా మార్కెట్ కమిటీలను రద్దుచేసేందుకు రంగం సిద్ధం చేసింది. అసెంబ్లీ ఆర్డినెన్స్ ద్వారా ఈ చర్యకు దిగాలా లేక ప్రభుత్వ నిర్ణయం సరిపోతుందా అనే విషయంలో న్యాయశాఖ సలహా తీసుకుంది. ‘ప్రభుత్వ విధాన నిర్ణయంతో పాలకవర్గాలను రద్దు చేయవచ్చు’అని న్యాయశాఖ స్పష్టం చేయడంతో ఈ మేరకు మార్కెటింగ్ శాఖ ఫైలు సిద్ధం చేసి సీఎం కార్యాలయానికి పంపింది. సీఎం కేసీఆర్ పాత పాలకవర్గాలను కొనసాగించేందుకు సుముఖంగా లేరనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. కొత్త కమిటీ నియామక ప్రక్రియ ప్రారంభం కానప్పటికీ ముందస్తు ప్రయత్నాల్లో నాయకులు నిమగ్నమయ్యారు. రిజర్వేషన్లు అనుకూలించకపోవడం, వివిధ సమీకరణాల వల్ల పోటీకి అవకాశం దక్కని వారు, ఓటమి పాలైన నాయకులు తమకే అవకాశం ఇప్పించాలని కోరుతున్నారు. వీటికే నియామకాలు జిల్లాలో 17 మార్కెట్ యార్డులు ఉండగా ఇందులో 13 యార్డులకు పాలకమండళ్లు ఉన్నాయి. ఆదిలాబాద్, జైనథ్, నిర్మల్, సారంగాపూర్, కుభీర్, ఖానాపూర్, లక్సెట్టిపేట, మంచిర్యాల, చెన్నూర్, సిర్పూర్ కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, ఇచ్చోడ, బోథ్, వీటికి పాలకమండళ్లు కొనసాగుతున్నాయి. ఈ కమిటీలకు మూడేళ్ల పదవీకాలం ఇంకా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఆదే శాలు రావటంతో వాటి కాలం ముగిసినట్లే. కొత్త వారిని నియమించే అవకాశాల కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. బెల్లంపల్లి, ఇంద్రవెల్లి, జైనూర్, భైంసాల కమిటీల నియామకం కాలేదు. వీటిని కూడా సంబంధిత నామినేటెడ్ సమయంలో భర్తీ చేసే అవకాశం ఉంది. -
ఎన్నాళ్లీ నిరీక్షణ?
సాక్షి, న్యూఢిల్లీ:ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కు ఐదు నెలలు నిండనున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 14న అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రాజీనామా చేసిన తర్వాత శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి, ఆ తర్వాత అదే నెల 17న రాష్ట్రపతిపాలన విధించారు. గత ఐదు నెలలుగా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అధికార యంత్రాంగం సహకారంతో పాలనను కొనసాగిస్తున్నారు. విద్యుత్, నీటి సమస్యల పరిష్కారంతోపాటు ధరల పెరుగుదలను నియంత్రించడం కోసం అక్రమ నిల్వలకు పాల్పడేవారిపై తనిఖీలు జరిపి కఠిన చర్యలు తీసుకోవడంలో నజీబ్ జంగ్ నేత త్వంలోని సర్కారు చురుగ్గా వ్యవహరించింది. అయిన్పటికీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. శాసనసభ ఎన్నికల పేరుతో అయితేనేమీ, రాష్ట్రపతిపాలన వల్లనైతేనేమీ ఏడాది కాలంగా అభివృద్ధి కార్యకలాపాలు మూలనపడ్డాయి. ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశాలు లేనట్లయితే ఎన్నికలు తప్పవని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అంటున్నారు. అన్ని పార్టీలు ఎన్నికలను కోరుకుంటునప్పటికీ ఎమ్మెల్యేలు మాత్రం అందుకు సుముఖంగా లేరు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికలకు సిద్ధమని ప్రకటించాయి. తగినంత సంఖ్యాబలం లేనందువల్ల ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం లేదని ఇంతకాలంగా అంటూ వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం పునరాలోచనలో పడిపోయింది. విద్యుత్ సంక్షోభం, ఉల్లి, ఆలుగడ్డల ధరల పెరుగదల నేపథ్యంలో ప్రజల ముందుకు ఓట్ల కోసం వెళ్లడం సముచితం కాదనే అభిప్రాయాన్ని కొందరు భారతీయ జనతా పార్టీ నేతలు వ్యక్తంచేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా సతీష్ ఉపాధ్యాయ బాధ్యతలు చేపట్టాక పార్టీ వైఖరి స్పష్టమయ్యే అవకాశాలు మెరుగయ్యాయి. ఎన్నికలకు వెళ్లాలని పార్టీ గట్టిగా భావిస్తున్నప్పటికీ అందుకు ఎమ్మెల్యేలు మాత్రం సిద్ధంగా లేరు. సోమవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఎమ్మెల్యేలు ఆయనకు ఈ విషయాన్నే చెప్పారని అంటున్నారు. ఎమ్మెల్యేలు బుధవారం సమావేశం అవుతారని, ప్రభుత్వం ఏర్పాటు చేయాలా? ఎన్నికలకు వెళ్లాలా ? అనే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జగ్దీశ్ ముఖి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని అంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీ శాసనసభలో బీజేపీకి మొత్తం 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. డా. హర్షవర్ధన్, రమేష్ బిధూరీ, ప్రవేశ్ వర్మ ఎంపీలుగా ఎన్నికై, శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో మొత్తం 70 మంది సభ్యులుండే ఢిల్లీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 67కి తగ్గిపోయింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు చేయడానికి 34 మంది ఎమ్మెల్యేలు అవసరం. స్వతంత్ర ఎమ్మెల్యే రామ్‌బీర్ షౌకీన్, జెడియు ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్ బీజేపీకి మద్దతు ఇచ్చినట్లయితే మరో ముగ్గురు ఎమ్మెల్యేల సహాయం అవసరం. అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గానీ ఆప్ ఎమ్మెల్యేలు గానీ బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలుగానీ మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. దిగ్గజాలు సైతం ఓటమి చవిచూసిన ప్రతికూల పరిస్థితుల్లోఎన్నికలలో గెలిచినప్పటికీ పార్టీ తమకు ఉఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ సర్కారుకు బయటినుంచి మద్దతు ఇవ్వవచ్చని అంటున్నారు. -
'ప్రభుత్వం విఫలం - రాష్ట్రపతిపాలనకు డిమాండ్'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజాస్వామ్య పరిక్షరణలో ఘోరంగా విఫలమైందని, రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్ఆర్ సిపి సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు మైసూరా రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ అధ్యక్షుని ఎన్నిక సందర్భంగా ఒంగోలులో ఓటర్లు కానివారు కూడా ఎన్నికల హాలులోకి ఎలా వెళ్లారు? అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడలేకపోతోందన్నారు. టీడీపీ సర్కారు అధికారంలో కొనసాగే అర్హత కోల్పోయిందని చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని తక్షణం బర్తరఫ్ చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతిని కోరతామని చెప్పారు. నెల్లూరు, ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలను ఈ రోజే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రపతిని కలుస్తామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం వ్యవహార తీరు సిగ్గుతో తలదించుకునేలా ఉందన్నారు. అధికార దుర్వినియోగం స్పష్టంగా కనిపిస్తోందని, ప్రజాస్వామ్యమంటే ఇదేనా? అని ప్రశ్నించారు. నెల్లూరు, ప్రకాశం, కర్నూలు ఘటనలపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు మైసూరారెడ్డి తెలిపారు. -
ఉంటుందా..ఊడుతుందా..!
కెరమెరి : వివిధ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది ఒప్పంద కాలం ఈనెల 30తో ముగియనుంది. వీరిని అలాగే కొనసాగిస్తారా..తొలగిస్తారా అనే విషయంపై సందిగ్ధం నెలకొంది. గడువు సమీపిస్తున్నా ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో సిబ్బందిలో ఆందోళన మొదలైంది. కొత్త రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీపైనే ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏఏ శాఖల్లో ఉన్నారంటే.. అన్ని మండలాల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది పని చేస్తున్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఐకేపీ, ఉపాధి హామీ పథకం, మున్సిపల్, హౌసింగ్, ఇరిగేషన్, విద్యుత్ శాఖ, ఆర్వీఎం,లతోపాటు వైద్యఆరోగ్య శాఖ ఏఎన్ఎంలు, జీఎంలు ,సంక్షేమశాఖ హాస్టల్లో కుక్‌లు, కామాటీలు, వాచ్మెన్లు, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖలో టెక్నెకల్ అసిస్టెంట్లు , కంప్యూటర్ ఆపరేటర్లుగా పని చేస్తున్నారు. రాష్ట్రపతిపాలనలో జీవో 84 జారీ రాష్ర్టపతి పాలనలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది సర్వీసుకు సంబంధించి జీవో నం 84 ను జారీ చేశారు. జూన్ 30 తేదీ వరకు సేవలు వినియోగించుకోవాలని ఉమ్మడి రాష్ర్ట ఖజానా ద్వారానే వేతనాల చెల్లింపులు ఉంటాయని పేర్కొన్నారు. విభజన జరిగిన త ర్వాత కొత్తగా ఏర్పడే ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయంపైనే వీరి కొనసాగింపు ఉంటుందని అందులో స్పష్టం చేశారు. తెలంగాణలోని సిబ్బందిని రెన్యూవల్ చేస్తూ చేస్తూ పొడిగిస్తే తప్పా జూలై 1 నుంచి విధులు నిర్వహించే పరిస్థితి లేదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై వేలాది మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. -
యూపీలో రాష్ట్రపతి పాలన విధించండి:బీజేపీ
బాదాన్: అత్యాచారాలకు కేంద్ర బిందువుగా మారిన ఉత్తరప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం చేసి వారిని దారుణంగా హతమార్చినా ఇప్పటి వరకూ ప్రభుత్వం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ ఎద్దేవా చేశారు. 'అమాకులైన ఇద్దరు బాలికలు అత్యాచారానికి గురైనా..ప్రభుత్వం వాటిని దాచడానికి యత్నిస్తోంది. కనీసం ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించలేదు. అసలు ప్రభుత్వం కనీసం స్పందిచకపోవడం దారుణం' అని కళ్యాణ్ సింగ్ విమర్శించారు. అత్యాచార బాధిత కుటుంబాల్ని కలిసిన ఆయన వారికి సానుభూతిని తెలియజేశారు. ఇదొక హృదయ విదారకర ఘటనగా ఆయన అభిప్రాయపడ్డారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?అని సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనను ప్రక్క దోవ పట్టించేందుకు అఖిలేష్ ప్రభుత్వం యత్నిస్తోందన్నారు.ఇటువంటి అసాంఘిక ఘటనపై ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అఖిలేష్ చిన్నపిల్లల మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. -
విభజన ప్రతిపాదనలకు నేడు ఆమోదం
గవర్నర్ ఆధ్వర్యంలో కేబినెట్ ప్రత్యేక సమావేశం శాశ్వతంగా భవనాల కేటాయింపు పోలవరం ముంపు ప్రాంతాల్లో మార్పులు షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన పదేళ్ల పాటు ప్రస్తుత ప్రవేశ పరీక్షల విధానం పలు విభజన కమిటీల ప్రతిపాదనలకు ఆమోదం హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రతిపాదనల ఆమోదానికి గవర్నర్ నరసింహన్ ఆదివారం కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేబినెట్ సమావేశాన్ని గవర్నర్ ఏర్పాటు చేయడం ఏమిటని ఆశ్యర్యపడుతున్నారా? రాష్ట్రపతి పాలనలో గవర్నర్ సీఎంగా, ఆయన సలహాదారులు మంత్రులుగా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలోనే విభజన ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలపడానికి ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గవర్నర్ సలహాదారులు సులావుద్దీన్ అహ్మద్, ఏ.ఎన్.రాయ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి పాల్గొంటారు. ఈ సమావేశంలో అన్ని శాఖలకు చెందిన విభజన ప్రతిపాదనలను ఆమోదించనున్నారు. సచివాలయంతో పాటు రాజధానిలోని ప్రభుత్వ శాఖలు, సంస్థల భవనాలను ఇరు రాష్ట్రాలకు తాత్కాలికంగా కేటాయింపులు చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గవర్నర్ నరసింహన్ తాత్కాలిక కేటాయింపులు కాకుండా శాశ్వత కేటాయింపులు చేయాలని నిర్ణయించడంతో జారీ చేసిన జీవోలు ఓపెన్ కాకుండా కాన్ఫిడెన్షియల్‌గా ఉంచారు. ఆదివారంనాటి సమావేశంలో సచివాలయంతోపాటు పలు శాఖల భవనాలను శాశ్వత కేటాయింపులుగా ఆమోదం తెలుపుతారు. భద్రాచలం డివిజన్లోని పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. గతంలో పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలుగా జారీ చేసిన జీవోలో మరికొన్ని గ్రామాలను చేర్చాల్సి ఉంది. ఈ మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలకు గవర్నర్ నిర్వహించే కేబినెట్ సమావేశం ఆమోదం తెలుపుతుంది. అలాగే రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా రెండు రాష్ట్రాల్లో పదేళ్ల పాటు విద్యా సంస్థల్లో ప్రవేశపరీక్ష ప్రస్తుత విధానంలోనే కొనసాగే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 9, 10లో గల సంస్థలను రెండుగా విభజించడంతో పాటు ఏడాది పాటు అవే సంస్థలు ఇరు రాష్ట్రాలకు సేవలందించే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే పలు శాఖలకు చెందిన విభజన కమిటీల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఫైళ్ల విభజన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఫైళ్ల విభజనతో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన ఉమ్మడి కరెంట్ ఫైళ్ల స్కానింగ్ కూడా పూర్తి అయింది. 4.53 కోట్ల పేజీలను స్కానింగ్ చేశారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో 42 వేల ప్రభుత్వ వాహనాలున్నట్లు గుర్తించారు. ఈ వాహనాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నారు. అలాగే చరాస్తులు 4.69 లక్షలు కాగా స్థిరాస్తులు 66 వేలుగా గుర్తించారు. శాఖల విలీనం, విభాగాల కుదింపు ఇరు రాష్ట్రాల సీఎంల ముందు రాష్ట్ర విభజన నేపథ్యంలో శాఖల విలీనం, విభాగాల కుదింపు ప్రతిపాదనలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంల ముందు ఉంచాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మంత్రుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖలను ఒకే శాఖ కింద విలీనం చేయడానికి అధికారులు ప్రతిపాదించారు. అలాగే విభాగాల సంఖ్య కుదింపునకు ప్రతిపాదించారు. కొత్త రాష్ట్రాల్లోని సీఎంల నిర్ణయం మేరకు శాఖల విలీనం, విభాగాల కుదింపు ఆధారపడి ఉంటుంది. ఫైళ్ల విభజన ఇలా... ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ ఫైళ్లు 15.48 లక్షలు ఆంధ్రప్రదేశ్ ఫైళ్లు 6.46 లక్షలు తెలంగాణ ఫైళ్లు 6.26 లక్షలు రెండు రాష్ట్రాలకు చెందిన ఫైళ్లు 2.76 లక్షలు ఉమ్మడి రాష్ట్రంలో డిస్పోజల్ ఫైళ్లు 28.75 లక్షలు ఆంధ్రప్రదేశ్ ఫైళ్లు 8.93 లక్షలు తెలంగాణ ఫైళ్లు 10.33 లక్షలు రెండు రాష్ట్రాలకు చెందిన ఫైళ్లు 9.49 లక్షలు -
రాష్ట్రపతి పాలనపై ఆప్ పిటిషన్ జూలై 4న విచారణ
సాక్షి, న్యూఢిల్లీ:ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని సవాలుచేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై జులై నాలుగో తేదీన విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తరువాతనే ఢిల్లీలో రాష్ట్రపతి పాలనపై నిర్ణయం తీసుకుంటానని లెఫ్టినెంట్ గవర్నర్ తెలి యజేయడంతో ఈ వ్యవహారంపై జులై నాలు గో తేదీన విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది. మే 16 తరువాతనే రాష్ట్రపతి పాలనపై నిర్ణయం తీసుకోనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపినందువల్ల తమ పిటిషన్‌పై జులై మొదటివారంలో విచారణ జరపాలని ఆప్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది పాలీ నారీమన్ న్యాయస్థానాన్ని కోరారు. ఆప్ నేత ప్రశాంత్ భూషణ్ కూడా ఇదే విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరూ ముందుకురావడం లేదని ఆయన ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం. లోధా నేతృ త్వంలోని ధర్మాసనానికి తెలిపారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయని, ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత పరిస్థితులు మారే అవకాశముందని ప్రశాంత్ భూషణ్ చెప్పారు. రాష్ట్రపతి ఢిల్లీలో అసెంబ్లీని రద్దు చేసి తాజాగా ఎన్నికలు జరపడానికి చట్టపరంగా ఎటువంటి అడ్డంకీ లేదని న్యాయస్థానం అంతకు ముందు పేర్కొంది. అయితే వాస్తవాలు, పరిస్థితుల ఆధారంగా ఈ విషయంలో రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందువల్ల ఇందుకు సంబంధించి ఎలాంటి సూచనను జారీ చేయడం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఢిల్లీలో రాష్ట్రపతి పాలనను రద్దు చేయడానికి రాష్ట్రపతి, లెప్టినెంట్ గవర్నర్లకు ఎలాంటి అడ్డంకి లేదని కాంగ్రెస్, బీజేపీ, ఆప్ తరఫు న్యాయవాదులు అంగీకరించిన నేపథ్యంలో న్యాయస్థానం గతంలో ఉత్తర్వు జారీ చేసింది. తన కార్యకలాపాలు రాజ్యాంగబద్ధమైన అంశాలకు మాత్రమే పరిమితమై ఉంటాయని, రాజకీయాల జోలికి తాను వెళ్లబోనని న్యాయస్థానం స్పష్టం చేసింది. రాష్ట్రపతి పాలన విధింపునకు సంబంధించి రాష్ట్రపతి, లె ఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న చర్య తప్పా లేదా ఒప్పా అనే అంశంపై తాను ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడించ డం లేదని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా అర్వింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం గద్దె దిగిన తరువాత అసెంబ్లీని రద్దు చేయకుండా రాష్ట్రపతిపాలన విధించడాన్ని సవాలుచేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టులో పిటి షన్ దాఖలు చేసింది. ఢిల్లీలో అసెంబ్లీని రద్దుచేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం చేసిన సిఫారసును పక్కనబెట్టిన లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్... శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలన విధించాలంటూ కేం ద్రానికి సిఫారసు చేసిన సంగతి విదితమే. -
జూన్ 2 వరకు రాష్ట్రపతి పాలన
గవర్నర్ నరసింహన్ వెల్లడి ఆ తర్వాతే రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు తిరుమల: ‘‘రాష్ట్ర విభజనలో భాగంగా అపాయింటెడ్ డే నోటిఫికేషన్ ప్రకారం జూన్ 2న రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు కావాల్సి ఉంది. అంతవరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది’’ అని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ వెల్లడించారు. శనివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... రాష్ర్టంలో ఎన్నికల కోడ్ వల్ల సీఈవోగా పూర్తి బాధ్యతలు నిర్వర్తించలేకపోయినా రాజ్యాంగపరమైన గవర్నర్ హోదాలో ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తున్నారని చెప్పారు. వేసవిలో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాలో సమస్యలు లేకుండా నిత్యం సమీక్షిస్తూ రైతుల అవసరానికి అనుగుణంగా చర్యలు చేపట్టామన్నారు. కృష్ణపట్నం విద్యుత్ కేంద్రం నుంచి 270 మెగావాట్ల విద్యుత్‌ను అదనంగా కేటాయించేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. అలాగే ఈ వేసవిలో తాగునీటి సరఫరా, వైద్య సేవలపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. రాష్ట్రంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లాగే సార్వత్రిక ఎన్నికలు కూడా విజయవంతంగా పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇస్తికఫాల్ మర్యాదతో గవర్నర్‌కు శ్రీవారి దర్శనం... రా్రష్టపతి పాలన విధించిన తర్వాత తొలిసారిగా తిరుమలకు వచ్చిన గవర్నర్‌కు టీటీడీ ఆలయ మర్యాదలతో శ్రీవారి దర్శనం చేయించింది. సతీమణి విమలా నరసింహన్‌తో కలసి వచ్చిన ఆయనకు ఆలయ మహద్వారం వద్ద వేద పండితులు, ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు ఆలయ మర్యాదలైన ఇస్తికఫాల్‌తో స్వాగతం పలికారు. స్వామివారి పాదాల వద్ద ఉంచిన శేషవస్త్రాన్ని గవర్నర్‌కు బహూకరించారు. తర్వాత వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం రంగనాయక మండపంలో ఈవో, జేఈవో గవర్నర్ దంపతులకు శ్రీవారి లడ్డూ, స్వామివారి చిత్రపటం అందజేశారు. అంతకుముందు గవర్నర్ దంపతులు తిరుచానూరులో పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి 24గంటలు సాక్షి, తిరుమల: తిరుమలకు శనివారం కూడా భక్తులు పోటెత్తారు. కాలిబాట భక్తులతో కిక్కిరిసిపోయింది. సర్వదర్శనం కోసం మొత్తం 31కంపార్ట్మెంట్లు నిండిపోయి వెలుపల ఆళ్వారు చెరువు చుట్టూ క్యూలో బారులు తీరారు. వీరికి 24 గంటల తర్వాత స్వామి దర్శనం లభించనుంది. కాలిబాటల్లో వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 13 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనం వెలుపల రెండు కిలోమీటర్లు క్యూ కట్టారు. వీరికి 12 గంటలు, రూ.300 టికెట్ల భక్తులకు 6గంటల తర్వాత స్వామి దర్శనానికి అనుమతించనున్నారు. గదుల కోసం భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేంద్రీయ విచారణ కార్యాలయం, ఎంబీసీ-34, పద్మావతి అతిథిగృహాల వద్ద గదుల కోసం భక్తులు క్యూ కట్టారు. తలనీలాలు సమర్పించుకునేందుకు కల్యాణ కట్టల్లో నాలుగు గంటల పాటు భక్తులు పడిగాపులు కాచారు. -
సీసీసీలో క్రైమ్టీమ్స్
నేరాలు జరిగే ప్రాంతాలు, సమయాలతో మ్యాపింగ్స్ స్నాచింగ్, ‘డైవర్షన్’ బాధితులకు ‘ట్రాఫిక్’ సాయం కసరత్తులు పూర్తి చేసిన సీసీఎస్, త్వరలో అమలులోకి సాక్షి, హైదరాబాద్: ఒకవైపు రాష్ట్రపతి పాలన... మరోవైపు ఎన్నికల హడావుడి... ఈ పరిణామాలతో ప్రస్తుతం పోలీసుల దృష్టంతా శాంతిభద్రతల నిర్వహణ, బందోబస్తులపైనే ఉంటుంది. రానురాను ఈ అంశాలకే ప్రాధాన్యం పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు నేరాల నిరోధానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కేవలం ఎన్నికల సీజన్లోనే కాకుండా... భవిష్యత్తులోనూ ఈ విధానాలను కొనసాగించాలని నిర్ణయించామని క్రైమ్స్ డీసీపీ జి.పాలరాజు ‘సాక్షి’కి తెలిపారు. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనల్ని ఉన్నతాధికారులకు పంపి, త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు పూర్తి చేశారు. ఆ సెంటర్లో ప్రత్యేక బృందాలు: నగర కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ) ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఉండే 12 స్క్రీన్లను వినియోగించి నగరంలోని 275 ప్రాంతాల్లో (కూడళ్లు, రహదారులు) పరిస్థితిని పర్యవేక్షించే అవకాశం ఉంది. ఈ సెంటర్లోనే ప్రత్యేక క్రైమ్ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. సీసీఎస్‌తో పాటు నగరంలోని ఠాణాల్లో ఉన్న క్రైమ్ కానిస్టేబుళ్లను ఎంపిక చేసుకుని నిత్యం ముగ్గురు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆయా రహదారులపై తిరుగుతున్న నేరగాళ్లను గుర్తించడం వీరి పని. ఆధునిక పంథాలో మ్యాపింగ్స్: చైన్‌స్నాచింగ్స్, అటెన్షన్ డైవర్షన్ వంటి నేరాలు కొన్ని ప్రాంతాల్లో, కొన్ని సమయాల్లోనే ఎక్కువగా జరుగుతుంటాయి. నగర వ్యాప్తంగా గడిచిన కొన్నేళ్లుగా నమోదైన కేసుల డేటాను విశ్లేషిస్తున్న సీసీఎస్ పోలీసులు ఆ ప్రాంతాలు, సమయాలతో మ్యాప్స్ రూపొందిస్తున్నారు. దీని ఆధారంగా ఆయా ప్రాంతాలు, సమయాల్లో మఫ్టీ పోలీసుల్ని వాహనాలతో మోహరిస్తారు. ఏదైనా ఫిర్యాదు వచ్చినా, సీసీసీలో ఉండే క్రైమ్ సిబ్బంది రోడ్డుపై పాతనేరగాళ్లను గుర్తించినా... ఆ సమీపంలోనే ఉన్న ఈ మఫ్టీ బృందాలు వెళ్లి నేరగాడిని రెడ్‌హ్యాండెడ్ పట్టుకోవడం లేదా.. నేరగాడు తన షెల్టర్‌కు చేరుకునే లోపు పట్టుకొనేలా వ్యూహాలు రచిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసు సహకారం రహదారులపై జరిగే స్నాచింగ్స్, అటెన్షన్ డైవర్షన్ వంటి నేరాల బారినపడుతున్న బాధితులు ప్రస్తుతం సివిల్ పోలీసుల కోసం ఎదురుచూస్తున్నారు. లేదంటే కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయాల్సి వస్తోంది. దాదాపు ప్రతి జంక్షన్, కీలక రోడ్లపై లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉన్నా, ఉండకపోయినా... ట్రాఫిక్ పోలీసులు ఉంటారు. కచ్చితంగా వీరివద్ద వైర్లెస్ సెట్ అందుబాటులో ఉంటుంది. ఇకపై రోడ్ల మీద నేరాల బారినపడిన బాధితులు సమీపంలోని ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు చెప్పే అవకాశాన్నీ కల్పిస్తున్నారు. వీరి వద్ద ఉండే వైర్లెస్ సెట్ ద్వారా కంట్రోల్‌రూమ్‌తో పాటు ఒకేసారి నగర వ్యాప్తంగా ఉన్న పోలీసుల్ని అప్రమత్తం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. బాధితులు మాత్రం షాక్‌లో ఉండకుండా సాధ్యమైనంత త్వరగా సమాచారం ఇచ్చే కోణంలో ప్రచారం నిర్వహించనున్నారు. -
వేడెక్కిన రాజకీయం
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : మొన్న మున్సిపల్, నిన్న సార్వత్రిక ఎన్నికల సమరానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతుండడం.. మున్సిపల్, సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో పొత్తులపైనా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ టీఆర్ఎస్తో పొత్తు విషయమై కమిటీ వేసినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే ఏ సీట్లు ఎవరికి కేటాయిస్తారు.. భవిష్యత్ కార్యాచరణ ఏంటి.. పొత్తులో భాగంగా సీట్లు కోల్పోవాల్సి వస్తే ఏం చేసేదనే ప్రశ్నలు టీఆర్ఎస్ నేతల మదిని తొలుస్తున్నాయి. కాగా.. అసెంబ్లీ టికెట్ల కోసం ప్రయత్నిస్తున్న అన్నిపార్టీల నేతలకు మున్సి‘పల్స్’ తలనొప్పిగా మారాయి. కౌన్సిలర్ల ఎంపిక బాధ్యత నియోజకవర్గ నేతలకు అప్పగించడంతో వారు తంటాలు పడాల్సి వస్తోంది. దీనికితోడు శుక్రవారం సుప్రీం కోర్టు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాలని తీర్పునిస్తే జిల్లాలో రాజకీయం రసకందాయంలో పడనుంది. కదనరంగంలోకి పార్టీలు.. నేతలు.. ఇన్ని రోజులుగా ఒకదానిపై మరొకటి దుమ్మెత్తిపోసుకున్న రాజకీయ పార్టీలు ఇప్పుడు ఎన్నికల కదనరంగంలోకి దిగుతున్నాయి. పట్టుకోసం పాకులాడుతున్నాయి. ఉనికి కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. అవకాశవాద రాజకీయాలకు తెరతీస్తున్నారు. శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మద్య పొత్తులపై చర్చించేందుకు ఆయా పార్టీలు కమిటీలు వేయడం ఆసక్తికరంగా మారింది. పొత్తు ఏర్పడితే నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలాగుంటుందోనని ఆయా పార్టీల నాయకుల్లో కలవరం మొదలైంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల సిట్టింగ్ ఎమ్మెల్యేలలోనూ ఈ ఆందోళన వ్యక్తమవుతోంది. పొత్తు ఖరారైన పక్షంలో నియోజకవర్గం ఏ పార్టీకి కేటాయించిన మిగతా పార్టీ నాయకుల్లో అసంతృప్తి చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అదేజరిగితే అసంతృప్తి నాయకులు ఇతర పార్టీలోకి వెళ్లడం, లేనిపక్షంలో స్వతంత్ర ంగానైనా పోటీలో ఉండే అవకాశాలు లేకపోలేదు. వైఎస్సార్సీపీలో నూతనోత్తేజం కాగా.. ఖమ్మంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సభ విజయవంతం కావడంతో జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం కన్పిస్తోంది. తెలంగాణ ప్రజలూ పార్టీని ఆదరించడం పట్ల సంతోషం వ్యక్తమవుతోంది. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. వైఎస్సార్ అభిమానులు పార్టీ పట్ల మక్కువ చూపిస్తూ నేతలను ఆదరిస్తుండడం కలిసిరానుంది. కాగా.. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న జిల్లా ఇప్పుడు ఖాళీ అవుతోంది. దశాబ్ద కాలంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్న టీడీపీకి గత 2009 ఎన్నికల్లో జిల్లా నుంచి ఆదిలాబాద్, ముథోల్, ఖానాపూర్, బోథ్ స్థానాలు దక్కాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో జోగు రామన్న, వేణుగోపాలాచారి, ఇటీవల గోడం నగేష్ టీఆర్ఎస్లోకి జంప్ అయ్యారు. దీంతో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. పార్టీ నుంచి పలువురు వెళ్లిపోవడంతో ఇప్పుడు పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉంది. దీంతో రాజకీయంగా తటస్థంగా ఉన్న నాయకులపై టీడీపీ దృష్టి సారించింది. మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు గురువారం టీడీపీలో చేరడంతో ఆయన బోథ్ నుంచి పోటీ చేయవచ్చని చర్చ సాగుతోంది. బీజేపీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇక ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల రణరంగంలోకి దిగుతున్నాయి. లోక్‌సభ ఆదిలాబాద్‌కు ఎస్టీ రిజర్వ్ కావడంతో ఆయా పార్టీల ముఖ్యనేతలు అటు అసెంబ్లీ బరిలో ఉండాలా.. లేక లోక్‌సభకు పోటీ చేయాల అనేదానిపై తర్జభర్జన పడుతున్నారు. ప్రచారానికి సిద్ధం.. పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. మున్సిపల్ బరిలో దిగాలనుకుంటున్న నాయకులు స్థానిక వార్డుల్లోని ప్రజలను కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు. వార్డు అభివృద్ధికి తోడ్పడుతామని నాయకులు చెబుతూ ఓటర్ల మన్ననలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకోపక్క పార్టీల పరంగా టికెట్ సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల అధినేతలు జిల్లాలో పర్యటించే అవకాశాలు ఉండడంతో రూట్లను సిద్ధం చేస్తున్నారు. శాసనసభ బరిలో దిగాలనుకుంటున్న నేతలకు స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడే రావడంతో దృష్టిసారింపు విషయంలో అయోమయం చెందుతున్నారు. అయితే స్థానిక పోరులో తన వాళ్లను నెగ్గించుకొని అసెంబ్లీ పోరుకు ధీమాగా వెళ్లాలని, లేనిపక్షంలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని వారిలో భయం కూడా గూడుకట్టుకుంది. వార్డు సభ్యుల ఎంపిక విషయంలో అసంతృప్తి చోటు చేసుకున్న తమకే ఇబ్బంది అవుతుందని నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. పార్టీల పరంగా శాసనసభకు పోటీ చేయాలనుకుంటున్న నాయకులకు మున్సిపోల్స్ సెమీఫైనల్ కానున్నాయి. 94 వార్డులు మహిళలకు రిజర్వు కావడంతో మహిళ నాయకుల్లో సందడి మొదలైంది. ఈనెల 10 నుంచి నామినేషన్ల పర్వం మొదలవుతుండడంతో మున్సిపల్ రాజకీయం వేడెక్కుతుంది. కాగా ఐదేళ్లు దాటినప్పటికీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని సుప్రీం కోర్టు అక్షింతలు వేయడంతో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని ప్రభుత్వం కోరినా.. విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. నేటితో ఆ సస్పెన్స్‌కు తెరపడనుంది. ఒకవేళ ఆ ఎన్నికలు కూడా తప్పనిసరి నిర్వహించాల్సి వస్తే రాజకీయ నేతలకు తలనొప్పులు ప్రారంభమైనట్లేనని చెప్పొచ్చు. -
కొంపముంచిన వర్గపోరు!
పరిగి, న్యూస్‌లైన్: పరిగి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీలోని ఇరువర్గాల మధ్య నెలకొన్న పోటీ అసలుకే ఎసరు తెచ్చింది. పోటాపోటి లాబీయింగ్‌తో రాష్ట్ర నాయకత్వాన్ని డోలాయమానంలో పడేసిన స్థానిక నాయకులు.. చైర్మన్‌గిరి ఎవరికీ దక్కకుండా చేసుకున్నారు. చైర్మన్ పదవీకాలం ముగిసి ఆరు నెలలు గడిచిన నేపథ్యంలో ఆ పదవి కోసం కమతం శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఆర్ వర్గాలు పోటీ పడ్డాయి. తీరా ఈ సమస్య కొలిక్కి వస్తుందనుకున్న నేపథ్యంలో రాష్ట్రపతి పాలన రావడంతోపాటు ఎన్నికల కోడ్ కూడా అమలులోకి వచ్చింది. దీంతో మరో ఆరు నెలలు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఆగస్టుతో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవీ కాలం ముగిసింది. అప్పటినుంచే ఇరు వర్గాల నాయకులు గట్టి ప్రయత్నాలు ప్రారంభించారు. మాజీ మంత్రి కమతం రాంరెడ్డి.. తన కుమారుడినే మళ్లీ ఆ పీఠంపై కూర్చోబెట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తుండగా, పీసీసీ కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డి సైతం లాబీయింగ్ చేశాయి. వీరే కాకుండా మరికొందరు కూడా ఆ పీఠంపై కన్నేసి ముమ్మర ప్రయత్నాలు కొన సాగించారు. మాదంటే మాదే.. మార్కెట్ చైర్మన్ పదవి మాదంటే.. మాదని చివరివరకూ ఇరు వర్గాలు చెప్పుకున్నాయి. ప్రస్తుత చైర్మన్‌కే ఇచ్చే అవకాశం ఉంటే ఇప్పటికే పదవీకాలం పొడిగించే వారని, ఇచ్చే ఉద్దేశం లేకనే పెండింగ్ పెట్టారని కమతం వ్యతిరేకవర్గం ప్రచారం చేసింది. ఈ క్రమంలోనే రామ్మోహన్‌రెడ్డి కుల్కచర్ల మండలానికి చెందిన ఓ బీసీ నేత పేరును సూచిస్తూ పార్టీ పెద్దల వద్ద లాబీయింగ్ చేశారు. కానీ ఎవరి ప్రయత్నాలూ ఫలించలేదు. మంచి ఆదాయ వనరు! గతంలో నామినేటెడ్ పోస్టంటే హోదా కోసమనే భావించేవారు. కానీ అన్నింటిలా కాకుండా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి పెట్టుబడిలేని ఆదాయ వనరులని భావిస్తున్నారు. ఐదారేళ్ల క్రితం వరకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలలోపు ఉన్న పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆదాయం ప్రస్తుతం ఏడాదికి రూ.కోటి దాటింది. మరోవైపు ప్రధాన ఆదాయ వనరుగా జీరో వ్యాపారం.. దీంతో మార్కెట్ చైర్మన్ పదవి కోసం పోటీ పెరిగింది. ప్రస్తుతం పరిగి వ్యవసాయ మార్కెట్‌కు చైర్మన్ లేక, కార్యదర్శి లేక ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. -
ఇక అధికారులదే రాజ్యం!
మంత్రులు, ఎమ్మెల్యేల పెత్తనానికి తెర కొనసాగనున్న కార్పొరేటర్ల హవా సాక్షి, సిటీబ్యూరో : రాష్ట్రపతి పాలన అమల్లోకి రావడంతో సర్కారు సుప్తచేతనావస్థలోకి జారుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేల పెత్తనానికి కత్తెర పడింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. వారి పరిస్థితి ‘కోమా’లో ఉన్నట్లే! ఈ నేపథ్యంలో స్థానిక కార్పొరేటర్లు, అధికారుల హవా సాగనుందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి పాలన వల్ల స్థానిక సంస్థలపై ఎలాంటి ప్రభావం ఉండనందున.. కార్పొరేటర్లు ఎప్పటిలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. దాంతో పాటు అధికారులు యథావిధిగా తమ పనులు తాము చేసుకోపోవచ్చున ంటున్నారు. మామూలుగా అయితే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవా ల వంటి కార్యక్రమాల కోసం ప్రొటోకాల్ నిబంధనల మేరకు స్థానిక ఎమ్మెల్యేలను ఆహ్వానించడం ఆనవాయితీ. రాష్ట్రపతి పాలన కొనసాగేంత వరకు ఎమ్మెల్యేలు ఆయా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లేదు. అదే సమయంలో కార్పొరేటర్లకు ఇలాంటి పరిమితులేం లేవు. దీంతో ఇక తమ రాజ్యం సాగించుకోవచ్చునని కార్పొరేటర్లు భావిస్తున్నారు. ఓవైపు రాష్ట్రపతి పాలన.. మరో వైపు సార్వత్రిక ఎన్నికలకు అతి త్వరలో షెడ్యూలు వెలువడే అవకాశాలున్నందున పాలనలో అధికారులే ముఖ్య భూమిక వహించనున్నారు. ఇప్పుడున్న స్థితిలో రాజకీయ ఒత్తిళ్లు లేకుండా పనులు చేసుకుపోవచ్చునని కొందరు అధికారులు భావిస్తుండగా.. అడ్డూ అదుపూ లేకుండా చేతులారా సంపాదించుకునేందుకు కూడా ఇదే మంచి సమయమన్నది మరికొందరు అధికారుల యోచనగా ఉంది. ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తే.. స్టాండింగ్ కమిటీ సమావేశాలకు.. సదరు కమిటీ ద్వారా నిధుల మంజూరుకు బ్రేక్ పడనుంది. ఏ పనులు చేయాలనుకున్నా అధికారులకే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. దీనిని తమకు అనుకూలంగా మలచుకోవాలనే ఆలోచనలో కొందరుండగా.. ఒత్తిళ్లు లేకుండా, నిజంగా ప్రజలకుపకరించే పనులు చేయవచ్చునన్నది మరికొందరి యోచనగా ఉంది. గవర్నర్ సెక్రటేరియట్‌కు లేఖ త్వరలోనే ఎన్నికల షెడ్యూలు వెలువడనుండటాన్ని దృష్టిలో ఉంచుకొని జీహెచ్ఎంసీ పరిధిలో పలు పనులు చేపట్టేందుకు భారీయెత్తున నిధులు మంజూరు చేశారు. కార్పొరేటర్లు పంతానికి పోయి నిధులు మంజూరు చేయించుకున్నారు. వాటిలో కొన్నింటికి టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా.. మరి కొన్నింటికి టెండర్లు పూర్తి కావాల్సి ఉంది. టెండర్లు పూర్తయినవాటికి వర్క్ ఆర్డర్లు ఇచ్చిన పనులను ప్రారంభించాల్సి ఉంది. వాటిలో కార్పొరేటర్లు పాల్గొనేందుకు అభ్యంతరాలుండవనేది అధికారులకు తెలిసినప్పటికీ.. ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా ఉండేందుకు మరింత స్పష్టత కోసం జీహెచ్ఎంసీ పరిపాలన విభాగం నుంచి శనివారం గవర్నర్ సెక్రటేరియట్‌కు లేఖ రాశారు. రాష్ట్రపతి పాలన నేపథ్యంలో తమ సందేహాలను నివృత్తి చేయాల్సిందిగా అందులో కోరారు. కొత్త పనులకు శంకుస్థాపనలు చేయవచ్చా..? ఇప్పటికే నిధులు మంజూరైన పనులను ప్రారంభించవచ్చా..? శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వంటివి జరపవచ్చా.. లేదా? శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అభ్యంతరాల్లేనట్లయితే.. వాటిలో ఎవరెవరు పాల్గొనవచ్చు..? తదితర సందేహాలు నివృత్తి చేయాల్సిందిగా ఆ లేఖలో కోరారు. కాగా, రేపోమాపో ఎన్నిక ల నియమావళి అమల్లోకి వస్తే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగవని, అప్పుడిక సమస్యే ఉత్పన్నం కాదని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
సాదాసీదాగా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ చివరి స మావేశం శనివారం మొక్కుబడిగా.. సాదాసీదా గా ముగిసింది. 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవి ర్భావం.. రాష్ట్రపతి పాలన నేపథ్యంలో సాగిన సమావేశం ఏటీఆర్ (చర్యల నివేదిక) జోలికి వెళ్లలేదు. ఎజెండాలో చేర్చిన 11 ప్రధానమైన అంశాలపై మూడున్నర గంటల్లో చర్చించి మమ అనిపించారు. విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ మధుయాష్కీ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కో-చైర్మన్, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, రాజ్యసభ సభ్యులు మహ్మద్ అలీఖాన్, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, జేసీ వెంకటేశ్వర్రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రారంభోపన్యాసంలో మధుయాష్కీ 29వ రాష్ట్రంలో జిల్లా చివరి విజిలెన్స్, మానిటరింగ్గా పేర్కొం టూ... తెలంగాణవాదులు, అధికారులు, ప్రజలకు ‘తెలంగాణ’ శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అసువులు బాసిన అమరవీరులకు రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ప్రొటోకాల్ పేరుతో ఆటంకాలు : అన్నపూర్ణ ఆవేదన ఆభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలపై స్పష్టత లేదంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి (ప్రస్తుతం మాజీ మంత్రి) సుదర్శన్ రెడ్డి, ఎన్పీడీసీఎల్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ తదితర అధికారు ల తీరు వల్ల ఆర్మూరు నియోజకవర్గానికి మంజూరైన సుమారు రూ.200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయలేని పరిస్థితి నెలకొందని ఎమ్మె ల్యే అన్నపూర్ణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సుదర్శన్‌రెడ్డి సమయం ఇవ్వకపోవడం... అధికారులు ఆయన రానిదే శిలాఫలకం వేయలేమని ‘ప్రొటోకాల్’ పేరిట హక్కులను హరించారని, నేడో, రేపో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే తమ పరిస్థితి ఏంటని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ జిల్లాలో ఎమ్మెల్యేలు ఏ పనులు చేపట్టాలనుకున్నా తమ దృష్టికి తేవాలని, ప్రభుత్వ నిబంధనలు, ప్రొటోకాల్స్ని పరిగణలోకి తీసుకుని అభివృద్ధి పనులు సాగేలా చూస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ సేద్యానికి పనికి రాని భూములను గుర్తించి ఆ భూముల్లో ఈత, తాటిచెట్ల పెంపకానికి చర్యలు తీసుకోవడం వల్ల 3.50 లక్షల గీత కార్మీకులకు ఉపాధి లభించేలా చూడాలన్నారు. అర్బన్ శాసనసభ్యులు యెండల లక్ష్మినారాయణ మాట్లాడుతూ నగరంలో ఐదు తాగునీటి ట్యాంకులు నిర్మాణమై ట్రయిల్న్ ్రకూడా పూర్తి అయినందున ప్రజలకు తాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు వెయ్యిమందే కనెక్షన్లకు దరఖాస్తులు చేసుకున్నారని, 25 వేల మందికి అవకాశం ఉందని కలెక్టర్ ప్రద్యుమ్న స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని కమిషనర్ మంగ తాయారును ఆదేశించారు. రూ.23 కోట్ల నష్టపరిహారంపై సభ్యుల ఆందోళన 2010 నుంచి జిల్లాలో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడంలో రాష్ర్ట ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అన్నపూర్ణమ్మ, యెండల లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది ఆంధ్ర ప్రాతానికి చెందిన మూడు జిల్లాలకు రూ.800 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం జిల్లా ప్రజలపై వివక్ష చూపిందన్నారు. శుక్ర, శనివారాల్లో కురిసిన వడగళ్లకు భారీగా పంటలు దెబ్బతిన్నాయని, తక్షణమే సర్వే జరిపించి పరిహారం అందేలా చూడాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ప్రద్యుమ్న స్పందిస్తూ రెండు రోజులుగా కురిసిన వర్షం కారణంగాా దెబ్బతిన్న గ్రామాల్లో వ్యవసాయ, రెవెన్యూశాఖల అధికారులు సంయుక్తంగా సర్వే చేస్తున్నారని, పూర్తికాగానే నివేదిక ప్రభుత్వానికి పంపిస్తామన్నా రు. కాగా 11 అంశాల ఎజెండాపై విజిలెన్స్, మాని టరింగ్ కమిటీలో చర్చించిన సభ్యులు.. రాష్ర్టపతి పాలన... ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నందున జిల్లా అభివృద్ధిని కలెక్టరే చూసుకోవాలంటూ ఆయనపై భారం వేశారు. ఎన్నికల పోటీ పరీక్షలో మేము బీజీ అయిపోతామంటూ.. కలెక్టర్ ఈ జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరడంతో ‘ మాకు కూడా ఎన్నికల ఏర్పాట్ల బిజీ ఉంటుందం’టూ చలోక్తి విసిరారు. సభలో మధుయాష్కీ, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అన్నపూర్ణమ్మలు పార్టీలపై నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు, చలోక్తులు సభికులను పలుమార్లు నవ్వించాయి. సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఏజేసీ శేషాద్రి, వివిధశాఖల ఉన్నతాధికారులు శివలిం గయ్య, నగేశ్, వెంకటేశం, శ్రీనివాస్‌రెడ్డిలతోపాటు పలువురు పాల్గొన్నారు. -
జనాగ్రహాగ్ని దహిస్తుందేమో..
సాక్షి, రాజమండ్రి :ఓ పక్క రాష్ట్ర విభజన.. మరోపక్క రాష్ట్రపతి పాలన.. ఇంకోవైపు మున్సిపల్ ఎన్నికలకు చురుకుగా జరుగుతున్న సన్నాహాలు.. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలను అయోమయంలోకి నెడుతున్నాయి. ఎంతగా ఎలుగెత్తినా, సుదీర్ఘ సమరం సాగించినా.. విభజన ఆగలేదన్న ఆగ్రహంతో ఉన్న సీమాంధ్రుల చేతిలో తమకు శృంగభంగం తప్పదని ఆ పార్టీల నేతలు బెంబేలెత్తిపోతున్నారు. అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో తెలుగుదేశం నాయకులు, ఆరునూరైనా ఆంధ్రులను రెండు ముక్కలు చేయాలన్న పంతాన్ని నెగ్గించుకున్న కాంగ్రెస్ అధిష్టానం, ఆ అధిష్టానం నిర్దేశకత్వంతో ఎవరు ఏ కపట నాటకంలో పాత్రధారులవుతున్నారో తెలియని గజిబిజిని సృష్టించిన ఆ పార్టీ నాయకులు.. ఈ తరుణంలో పురపోరు జరిగితే తమకు చెంపపెట్టు తప్పదని జంకుతున్నారు. అయితే హైకోర్టు ఇచ్చిన గడువు ఈనెల మూడుతో ముగుస్తుండడంతో పురపాలక శాఖ ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకుపోతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో శాసనసభ ఎన్నికలకు కాలూచెయ్యీ కూడదీసుకోవడమే కష్టమనుకుంటుంటే.. ఈలోగానే మున్సిపల్ కదనానికి కత్తులు దూయడం దుస్సాధ్యమని వాపోతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న విస్పష్టమైన వైఖరిని కనబరచకుండా..‘కర్ర విరగరాదు.. పాము చచ్చి తీరాలి’ అన్న రీతిలో చిత్రవిచిత్రమైన ధోరణులను అవలంబించిన ఆ పార్టీల నాయకులు ఇప్పుడు పురపోరుకు అభ్యర్థులను అన్వేషించడమే ‘తల ప్రాణం తోకకు వచ్చినంత’ పని అవుతుందని వాపోతున్నారు. నిరాయుధుల్లా.. నిస్సహాయంగా.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సాగిన ఉద్యమం లక్ష్యసాధనలో విఫలమైనా.. కాంగ్రెస్, టీడీపీలపై జనంలో విముఖత పెంచింది. సోనియా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తానంటే, చంద్రబాబు లేఖలు ఇచ్చి మరీ వత్తాసునిచ్చారని జనం రగిలిపోతున్నారు. విభజన పరిణామాలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని కకావికలం చేశాయి. రాజమండ్రి, కాకినాడ కార్పొరేషన్లలో వివిధ విభాగాలకు చెందిన నేతలు పార్టీకి రాజీనామా చేశారు. దీంతో మున్సిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే నాథులు లేకుండా పోయారు. డివిజన్లలో, వార్డుల్లో పోటీకి నిలిపేందుకు అభ్యర్థులే కరువయ్యే పరిస్థితి రెండు పార్టీలనూ వెన్నాడుతోంది. విభజన పాపాన్ని మూటకట్టుకున్న తమ పార్టీలపై జనం కన్నెర్రజేస్తున్న సమయంలో వచ్చిపడుతున్న పురపోరులో నిరాయుధులైనంతగా నిస్సహాయత టీడీపీ, కాంగ్రెస్ నేతలను ఆవహించింది. కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియ.. కాకినాడ నగర పాలక సంస్థతో పాటు జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలకు 2010లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇప్పటి వరకూ ప్రభుత్వం ప్రత్యేకాధికారులతో నెట్టుకు వచ్చింది. గత ఏడాది పంచాయతీ ఎన్నికలప్పుడే మున్సిపల్ ఎన్నికలు కూడా జరిగిపోతాయనుకున్న రాజకీయ పక్షాలకు నిరాశ మిగిలింది. ఎన్నికలపై కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. అన్నింటికీ తెర దించుతూ హైకోర్టు నాలుగు వారాల్లో ఎన్నికలు జరిపి తీరాలని ఫిబ్రవరి మూడున ఆదేశించింది. ఆ గడువు ఈ నెల మూడుతో ముగియనుంది. రాష్ట్రంలో రాజకీయంగా అనిశ్చిత వాతావరణం నెలకొన్నా కోర్టు ఆదేశానుసారం పురపాలక శాఖ ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకుపోతోంది. గత నెల రెండో వారం నుంచి జిల్లాలో భారీగా కమిషనర్ల బదిలీలు జరిగాయి. ఖాళీగా ఉన్న ఎన్నికల అధికారుల పోస్టులను భర్తీ చేశారు. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు తుది ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని శుక్రవారం పురపాలక శాఖ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం తుది ఓటర్ల జాబితా ప్రకటించాలని నిర్ణయించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను బయటికి తీసి తొలి దశ పరిశీలన పూర్తిచేసి, లోపాలు సవరించాలని శనివారం కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. ఎన్నికలు జరిగే పట్టణాలివే.. ఇంకా డివిజన్ల పునర్వ్యస్థీకరణ జరగాల్సి ఉన్నందున ప్రస్తుతానికి కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించడం లేదు. రాజమండ్రి కార్పొరేషన్, అమలాపురం, రామచంద్రపురం, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, తుని, మండపేట మున్సిపాలిటీలు, గొల్లప్రోలు, ముమ్మిడివరం, ఏలేశ్వరం నగర పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. -
ఉన్నా..ఉత్సవ విగ్రహాలే
సాక్షి, కాకినాడ :మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం అనంతరం రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతూ గత నాలుగేళ్లుగా కొనసాగిన కాంగ్రెస్ సర్కారుకు తెరపడింది. నాలుగుదశాబ్దాల తర్వాత రాష్ర్టం తిరిగి రాష్ర్టపతి పాలనలోకి వచ్చింది. శుక్రవారం నాటి కేంద్ర కేబినెట్ నిర్ణయానికి రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం ఆమోదముద్ర వేశారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు జిల్లాల పాలనాపగ్గాలు పూర్తిగా కలెక్టర్ల చేతుల్లోకి వచ్చాయి. శాసనసభను సుప్తచేతనావస్థలో పెడుతూ రాష్ర్టంలో రాష్ర్టపతి పాలనను తీసుకు రావడంతో ఎమ్మెల్యేలు అదే స్థితిలోకి వెళ్లనున్నారు. రాష్ర్టంలో ప్రజాకంటక పాలన సాగించిన ‘కిరణ్’ సర్కార్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన కారణంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై అనర్హత వేటువేయడంతో ఆయన ఇప్పటికే మాజీ అయ్యారు. కిరణ్ కేబినెట్లో పాడిపరిశ్రమ, మత్స్యశాఖామంత్రిగా పనిచేసిన పినిపే విశ్వరూప్ సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో మంత్రి పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి ఈ శాఖలను కూడా జిల్లాకు చెందిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖమంత్రి తోట నరసింహంకు అప్పగించారు. రాష్ర్టపతి పాలన అమలులోకి రావడంతో ఆయన కూడా మంత్రి హోదా కోల్పోయి మాజీగా మిగిలిపోయారు. నోటిఫికేషన్ వస్తే మాజీలే.. తోటతో పాటు జిల్లాకు చెందిన 18 మంది ఎమ్మెల్యేలు కూడా పదవులుండీ ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోనున్నారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు వీరికి కనీస గౌరవం దక్కుతుంది. నోటిఫికేషన్ వస్తే మాత్రం మాజీలుగా మిగిలిపోతారు. ఈలోగా కేంద్రం మనసు మార్చుకొని రాష్ర్టంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుని, రాష్ర్టపతి పాలన ఎత్తివేస్తే అప్పుడు మళ్లీ వీరికి అధికారిక పగ్గాలు వస్తాయి. అప్పటి వరకు వీరు పేరుకు మాత్రమే ఎమ్మెల్యేలు. అధికారులపై కనీసం పెత్తనం చెలాయించే అధికారం కూడా వారికి ఉండదు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్సీల పదవుల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవు. ఎంపీలు పూర్తిగా కేంద్రానికి బాధ్యులై ఉంటారు. ఎమ్మెల్సీ హోదా కేవలం మండలికి మాత్రమే పరిమితమై ఉంటుంది. అలాగే నామినేటెడ్ పదవులు, సర్పంచ్ పదవులకు కూడా ఎలాంటి ఢోకా ఉండదు. స్థానిక ప్రభుత్వాలు యథావిధిగా పనిచేస్తాయి. మహానేత మరణ ంతో అస్థిరతకు బీజం.. తాను సముపార్జించిన అపార జనాభిమానంతో 2004లో కాంగ్రెస్‌కు ఘన విజయం చేకూర్చి, ముఖ్యమంత్రి అయిన వైఎస్ జన సంక్షేమానికే పెద్దపీట వేశారు. దాంతో ప్రజలు 2009 ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్‌కు అందలమిచ్చారు. హెలికాప్టర్ ప్రమాదంలో మహానేత మనకు దూరమైనప్పటి నుంచీ కాంగ్రెస్ సర్కారు అస్థిరత పాలైంది. రోశయ్య, ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డిల హయాంలో రాష్ట్రం తిరోగమించింది. ప్రజా సంక్షేమం కొడిగట్టింది. కేంద్రంలో బీజేపీతో, రాష్ర్టంలో టీడీపీతో కుమ్మక్కు రాజకీయాలు నెరిపిన కాంగ్రెస్ తెలుగుప్రజల మనోభావాలకు విరుద్ధంగా రాష్ట్రాన్ని రెండుముక్కలు చేసింది. విభజనకు అన్ని విధాలా సహాయ సహకారాలందించిన కిరణ్ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అంతా అయిపోయాక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామాలతో ఇంకా సమయం ఉండగానే పాలనాపగ్గాలను తీసుకెళ్లి రాష్ర్టపతి చేతులో పెట్టాల్సి వచ్చింది. ఇప్పటి వరకు రాజకీయ నాయకుల కనుసన్నల్లో సాగిన జిల్లా పాలన ఇక నుంచి పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం చేతుల్లోకి వెళుతుంది. రాజకీయ పలుకుబడులకు తెరపడుతుంది. గవర్నర్ నేతృత్వంలో కలెక్టర్ పూర్తిగా జిల్లా పాలన సాగిస్తారు. వివిధ పథకాల లబ్ధిదారుల ఎంపిక, నిధుల విడుదల, పనుల మంజూరు.. ఇలా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో దేంట్లోనైనా కలెక్టర్‌దే తుది నిర్ణయం. తుదిదినం.. తీరిక లేదు క్షణం కాగా రాష్ట్రపతి పాలన అమలులోకి వస్తుందని ముందే తెలియడంతో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల్లో అత్యధికులు చివరిరోజైన శనివారం క్షణం తీరిక లేకుండా.. తమ తమ నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కేంద్ర మంత్రి వర్గ నిర్ణయానుసారం రాష్ర్టంలో రాష్ట్రపతి పాలనకు ఆయన ఆమోదముద్ర శనివారం మధ్యాహ్నమే లభించింది. అయినప్పటికీ జిల్లాలో కొందరు ప్రజాప్రతినిధులు ‘చూరు పట్టుకుని వేలాడే బాపతు’ తాపత్రయంతో శనివారం రాత్రి కూడా అధికారిక హోదాల్లో కార్యక్రమాల్లో పాల్గొనడం గమనార్హం. ‘తిరిగి ఎన్నికల బరిలో నిలిచినా జనం ఆదరిస్తారన్న నమ్మకం బొత్తిగా లేకపోవడంతోనే ఇలా చివరిరోజు ‘గడువు’ మీరి మరీ అధికారాన్ని వెలగబెట్టారు’ అని పలువురు వ్యాఖ్యానించారు. -
ఎడ్యుకేషనల్ హబ్‌గా సిద్దిపేట
సిద్దిపేటజోన్,న్యూస్‌లైన్: సిద్దిపేట నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో కృషి చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పష్టం చేశారు. శనివారం స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిద్దిపేట పట్టణానికి కేంద్ర మానవవనరుల శాఖ ఆధ్వర్యంలో కేంద్రీయ విద్యాలయం మంజూరైందన్నారు. ఇందుకు తోడు సిద్దిపేటలో ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసిందని సంతోషం వ్యక్తం చేశారు. గత ఏడాది సిద్దిపేటతో పాటు సికింద్రాబాద్‌కు నూతనంగా మహిళా పాలిటెక్నిక్ కళాశాలలు మంజూరైనప్పటికీ సీఎం కిరణ్ సిద్దిపేటపై చూపిన వివక్ష కారణంగా పెండింగ్ పడిందన్నారు. రాష్ట్రపతి పాలన విధిస్తున్న క్రమంలో పెండింగ్‌లోని ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. స్పందించిన ఆయన జీవో విడుదల చేశారన్నారు. దీంతో జిల్లాలోనే సిద్దిపేట నియోజకవర్గానికి మూడు పాలిటెక్నిక్ కళాశాలలు సాధించుకున్న ఘనత దక్కిందన్నారు.గతంలో వెటర్నరీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఐటీఐ, మోడల్ పాఠశాలలు , కస్తూర్బా పాఠశాలలు మంజూరయ్యాయన్నారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రులు కమల్‌నాథ్, పల్లంరాజు, జైరాంరమేష్‌ను కలిసి నియోజకవర్గ ప్రతిపాదనలపై చర్చించామన్నారు. సిద్దిపేటలో 2014-15 విద్యాసంవత్సరానికి సంబంధించి కేంద్రీయ విద్యాలయం, మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్లు తీసుకుంటున్నారన్నారు. కొద్ది రోజుల్లో ఎంసెట్, ఎడ్‌సెట్, పాలిటెక్నిక్ అడ్మిషన్ కేంద్రాలతో పాటు కౌన్సెలింగ్ కేంద్రాల ఏర్పాటుకు జీవో విడుదల కానుందన్నారు. సిద్దిపేటలోని బలహీన వర్గాల కోసం రాజీవ్ ఆవాస్ యోజన పథకం కింద రూ. 120 కోట్లతో ప్రతిపాదనలు పంపామని, త్వరలో మంజూరు కానున్నాయన్నారు. సిదిపేటలో ఎస్ఎంహెచ్ భవనాల నిర్మాణ పనులు రూ. 3.5 కోట్లతో కొనసాగుతున్నాయని, మరో రూ. 2.25 కోట్లు మంజూరు కానున్నాయన్నారు. సిద్దిపేట పట్టణంలో ఉన్నత విద్యా అవకాశాలను మెరుగు పరిచే క్రమంలో ఇంజినీరింగ్, మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రూసా పథకం కింద రూ. 60 కోట్లతో సిద్దిపేటలో యూనివర్సిటీ ఏర్పాటు కానుందని త్వరలో జీవో రానుందని అశాభావం వ్యక్తం చేశారు. రూ. 19 కోట్లతో పీజీ కళాశాల ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ నేతలు దువ్వల మల్లయ్య, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, మాణిక్యరెడ్డి, వెంకట్‌రెడ్డి, నందు పాల్గొన్నారు. -
రాజ్‌భవనే కీలకం
{పధాన సమీక్షలన్నీ అక్కడే.. రాష్ట్రపతి పాలన నేపథ్యంలో పోలీసింగ్‌లో స్వల్పమార్పు జీహెచ్ఎంసీ యథావిధిగానే... సాక్షి, సిటీబ్యూరో : రాష్ట్రపతి పాలన విధించాలని నిర్ణయించిన నేపథ్యంలో నగరంలో మార్పుచేర్పులు ఏ విధంగా ఉంటాయనే విషయం చర్చనీయాంశమైంది. ప్రధానంగా సిటీ, సైబరాబాద్ పోలీసింగ్‌లో స్వల్ప మార్పుచేర్పులు చేసుకోనున్నాయి. జీహెచ్ఎంసీ యథావిధిగానే కొనసాగుతుందని తెలుస్తోంది. శాంతిభద్రతలకు సంబంధించి ఇకపై కీలకమైన సమీక్షలు ముఖ్యమంత్రికి బదులు గవర్నర్ నేతృత్వంలో జరుగనున్నాయి. ఇటీవల ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం నగరంలోని జంట కమిషనరేట్లలో భారీ స్థాయిలో ఇన్స్పెక్టర్ల బదిలీలు చేపట్టాల్సి వచ్చింది. దీంతో పరస్పర బదిలీలకు నిర్ణయించిన కమిషనర్లు.. ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని భావించారు. అయితే ఆ సందర్భంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేసి ఉండటం, డీజీపీ బి.ప్రసాదరావు కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం నిమిత్తం ఢిల్లీ వెళ్లడంతో గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకుని ఆయనకు వివరించారు. ఇకపై ఇలాంటి కీలకాంశాల్లో ఇదే పంథా కొనసాగనుంది. పాలసీ డెసిషన్స్‌కు సంబంధించిన అంశాల్లో గవర్నర్ లేదా ఆయన ఆధీనంలో పనిచేసే సలహాదారుల్లో శాంతిభద్రతల్ని పర్యవేక్షించే అధికారి సూచనల్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందే. జంట కమిషనరేట్ల పరిధిలో శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలు తలెత్తినా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా రాజ్‌భవన్ నుంచి కమిషనర్లను సంజాయిషీ కోరతాయి. ఉదంతం తీవ్రతను బట్టి గవర్నర్ సైతం స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షిస్తారు. ఎన్నికల బందోబస్తు, తీసుకుంటున్న చర్యలపై ఈసీతో పాటు రాజ్‌భవన్ వర్గాలూ ఆరాలు తీయడంతో పాటు, సమీక్షలు నిర్వహిస్తుంటాయి. ప్రజలు ఎవరైనా తమకు తీవ్రస్థాయిలో అన్యాయం జరుగుతోందని, పోలీసులు సైతం నిస్పాక్షికంగా వ్యవహరించట్లేదని భావిస్తే నేరుగా గవర్నర్‌కు ఫిర్యాదు చేసుకోవచ్చు. దీనిపై ఆయనే సంజాయిషీలు, నివేదికలు కోరతారు. చీటికీ మాటికీ పోలీసుస్టేతషన్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలపై ధర్నాల పేరుతో విరుచుకుపడే రాజకీయ పార్టీలు సైతం వెనకడుగు వేయాల్సిందే. పోలీసులు ధైర్యం చేస్తారా? మామూలు సమయాల్లో రాజధానిలో పూర్తిస్థాయిలో నిష్పాక్షిక పోలీసింగ్ జరగదు. సామాన్యుడికి అన్ని విధాలా సహకారం అందదు. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే రాజకీయ జోక్యం, నేతల ఒత్తిడి వంటి కారణాలు చెప్తుంటారు. ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తే గవర్నర్ అజమాయిషీతో రాజకీయం అనే మాటే వినిపించదు. అయినప్పటికీ పోలీసింగ్ నుంచి ఎన్నికల నిర్వహణ వరకు ఎలాంటి రాగద్వేషాలకు తావు లేకుండా పోలీసులు వ్యవహరించగలరా? అంటే పూర్తిగా ఔనని చెప్పలేని స్థితి. దీనికీ కారణం లేకపోలేదు. ఇప్పుడు రాష్ట్రపతి పాలన, ఆ తరవాత ఎన్నికల తంతు ముగిస్తే మళ్లీ పరిస్థితి ‘మామూలే’. ఇప్పుడు పక్కా పోలీసింగ్ పేరుతో విధులు నిర్వర్తిస్తే అప్పుడు టార్గెట్‌గా మారే ప్రమాదం ఉంటుందని అధికారులు భయపడతారు. ఈ భీతికి తావివ్వకుండా ఎందరు అధికారులు ధైర్యం ప్రదర్శిస్తారో వేచి చూడాల్సిందే. జీహెచ్ఎంసీ తీరుతెన్నులివీ... రాష్ట్రపతి పాలన విధించనున్న నేపథ్యంలో.. జీహెచ్ఎంసీ పరిధిలో పరిపాలన ఎలా ఉంటుంది..? పనితీరులో ఏవైనా మార్పు చేర్పులుంటాయా? ప్రస్తుతం కొనసాగుతున్న పాలకమండలి రద్దవుతుందా వంటి అనుమానాలు ఎందరిలోనో నెలకొన్నాయి. అయితే రాష్ట్రపతి పాలన వల్ల స్థానిక సంస్థ అయిన జీహెచ్ఎంసీలో ఎలాంటి మార్పులు ఉండవని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రపతి పాలన వల్ల రాష్ట్రంలో మంత్రిమండలి, అసెంబ్లీ నిర్వహణ వంటివి ఉండవు తప్ప జీహెచ్ఎంసీ యథావిధిగానే పనిచేస్తుందని చెబుతున్నారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో.. తెలంగాణ పరిధిలోకి వచ్చే పది జిల్లాల్లో హైదరాబాద్ ఒక జిల్లాగా ఉంటుందే తప్ప.. స్థానిక సంస్థ అయిన జీహెచ్ఎంసీకి ప్రత్యేక పాలన కానీ.. పరిమితులు కానీ ఉండవని వారు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అయినా జీహెచ్ఎంసీకి సంబంధించినంతవరకు ఎలాంటి మార్పుచేర్పులుండబోవని చెబుతున్నారు. ఎప్పటిలాగే గ్రేటర్లో నివసిస్తున్న ప్రజలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలైన రహదారులు, విద్యుత్, వరదకాలువల వంటి సదుపాయాలు కల్పిస్తారు. పారిశుధ్యం, దోమల నివారణ తదితర పనులు నిర్వహిస్తారు. అలాగే ఆస్తిపన్ను, ట్రేడ్‌లెసైన్సుల ఫీజుల వసూలు వంటివి చేస్తారు. మార్పులుండవ్ స్థానిక సంస్థ అయిన జీహెచ్ఎంసీలో ఎలాంటి మార్పులుండవని, యథావిధిగానే కార్యకలాపాలు కొనసాగుతాయని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. ప్రభుత్వం తరపున ఒక సలహాదారును నియమించే అవకాశాలున్నాయన్నారు. పరిపాలనకు సంబంధించిన సంప్రదింపులు.. ఏవైనా కార్యక్రమాల అమలు కోసం సలహాదారు సూచనలు తీసుకునే వీలుంది. త్వరలోనే ఎన్నికల షెడ్యూలు కూడా వెలువడనున్నందున.. అధికారులు సైతం ఎన్నికల పనుల్లో నిమగ్నం కానున్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినప్పటికీ.. జీహెచ్ఎంసీ తన పని తాను చేసుకుపోతుందే తప్ప.. ఎలాంటి మార్పులకు అవకాశం లేదని సీనియర్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల వారికి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం కాబట్టి రెండు రాష్ట్రాల నుంచి నిధులు పొందేందుకు.. అలాగే కేంద్రం నుంచీ ప్రత్యేక గ్రాంట్లు పొందేందుకు వీలుంటుందని మేయర్ మాజిద్ భావిస్తున్నారు. ఆ మేరకు ఆయా ప్రభుత్వాలకు లేఖలు రాయనున్నారు. -
మంత్రి.. ఇక మాజీనే!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్న కేంద్రకేబినెట్ నిర్ణయంతో రాజకీయ నాయకుల హవాకు తాత్కాలిక బ్రేకులు పడనున్నాయి. కేంద్రకేబినెట్ సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తే మళ్లీ కొత్త ప్రభుత్వం వచ్చేంతవరకు జిల్లాలో పాలనాపగ్గాలు చేతులుమారనున్నాయి. జిల్లా నుంచి మంత్రిమండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న రాంరెడ్డి వెంకటరెడ్డి మాజీ కానుండగా, జిల్లా పాలనా వ్యవహారాల్లో కలెక్టర్ పూర్తిస్థాయిలో కీలకపాత్ర పోషించనున్నారు. అసెంబ్లీ సుప్తచేతనావస్థలోనికి వెళ్లనుండడంతో ఎమ్మెల్యేలు కూడా అదే పరిస్థితిలోకి వెళతారు. కానీ వారి పదవులకు ఎలాంటి ఢోకా ఉండదు. ఒకవేళ రాష్ట్రపతి పాలనకు ఆమోదం తెలిపే ఉత్తర్వుల్లో శాసనసభను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తే మాత్రం ఎమ్మెల్యే పదవులు కూడా పోనున్నాయి. మంత్రి గారి పదవి గోవిందా... రాష్ట్ర ఉద్యానవన శాఖా మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి పోగొట్టుకోనున్నారు. రాష్ట్రపతి పాలనకు ఆమోదం లభిస్తే రాష్ట్రంలో మంత్రిమండలి రద్దవుతుంది కనుక ఆ మంత్రి మండలిలో సభ్యుడయిన రాంరెడ్డి కూడా ఆ హోదా కోల్పోతారు. జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన తొలిసారి వైఎస్ కేబినెట్లో మంత్రిపదవి చేపట్టారు. వైఎస్ రెండోసారి అధికారంలోకి రాగానే మంత్రివర్గంలో చేర్చుకుని సహకార, కార్మిక, ఫ్యాక్టరీలు, బ్రాయిలర్లు మంత్రిత్వ శాఖను అప్పగించారు. అప్పటినుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంతవరకు ఆ శాఖల మంత్రిగా పనిచేశారు. కిరణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేయడంతో రాంరెడ్డి పోర్టుఫోలియో మారింది. ఈయనకు కిరణ్ హయాంలో ఉద్యానవన, పట్టుపరిశ్రమ,మేఘమథనం మంత్రిత్వ శాఖలను అప్పగించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అదే పదవిలో ఉన్న ఆయన రాష్ట్రపతి పాలన వస్తే మాజీ కానున్నారు. మంత్రి హోదాలో ఆయనకు ఉండే ప్రొటోకాల్ రద్దవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ఆయన ఎమ్మెల్యేగా మాత్రం కొనసాగుతారు. పూర్తిగా రద్దు కావు...కానీ మంత్రిమండలి రద్దయినప్పటికీ జిల్లా ఎమ్మెల్యేలు మాత్రం పదవుల్లో ఉంటారు. ఎందుకంటే అసెంబ్లీ సుప్తచేతనావస్తలోనికి వె ళ్తుందే తప్ప పూర్తిగా రద్దు కాదు. ఎన్నికలు జరిగేలోపు మళ్లీ ఏ క్షణంలోనైనా రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తే గవర్నర్ సభను సమావేశపర్చవచ్చు. అందుకోసం ఎమ్మెల్యే పదవులు రద్దు కావని అధికార వర్గాలు చెపుతున్నాయి. ఇక జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీస్పీకర్, ఎంపీలు, ఎమ్మెల్సీల పదవుల్లో ఎలాంటి మార్పులు ఉండవు. ఎందుకంటే రాష్ట్రపతి పాలనతో వీరికి సంబంధం లేదు. ఎంపీలు కేంద్రానికి బాధ్యత వహిం చాల్సి ఉండగా, ఎమ్మెల్సీ హోదా కేవలం మండలికి మాత్రమే పరి మితం అవుతుంది. ఇక డిప్యూటీస్పీకర్ రాజ్యాంగబద్దమైన పదవి కనుక సభ రద్దయ్యేంతవరకు ఆ ప దవి కొనసాగుతుందని అధికారవర్గాలంటున్నాయి. ఇక నామినేటెడ్ పోస్టు లు, సర్పంచ్ పదవులకు కూడా ఎ లాంటి ఢోకా ఉండదు. స్థానిక ప్రభుత్వాలు యథావిధిగా పనిచేస్తాయి. అన్నింటికీ ప్రభుత్వ యంత్రాంగమే రాష్ట్రపతి పాలన వస్తే జిల్లాలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోనుంది. ఇప్పటివరకు రాజకీయ నాయకుల కనుసన్నల్లో సాగిన పాలనా వ్యవహారాలన్నీ పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం చేతుల్లోకి వెళ్లిపోతాయి. రాష్ట్ర గవర్నర్ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ పూర్తిగా జిల్లాలో పాలన సాగిస్తారు. రాజకీయ పలుకుబడులకు బ్రేకులు పడతాయి. పాలన వ్యవహారాల్లో కలెక్టర్ నిర్ణయమే ఫైనల్ కానుంది. ఆయనతో పాటు ఇతర అధికారులపై రాజకీయ నాయకుల ప్రమేయం కానీ, పెత్తనం కానీ ఉండదు. ఏ నిర్ణయమైనా కలెక్టర్ తీసుకోవాల్సిందే. ఆయన నేరుగా గవర్నర్‌కే జవాబుదారీగా ఉంటారు. ప్రజల సమస్యల పరిష్కారం కూడా కలెక్టర్ చేతుల్లోనే ఉంటుంది. అయితే, మాజీమంత్రులు, ఎమ్మెల్యేల హోదాలో ప్రజాప్రతినిధులు కూడా ప్రజాసమస్యల పరిష్కారం కోసం కలెక్టర్, ఇతర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు సిఫారసులు పంపవచ్చు. మళ్లీ ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం కొలువు తీరినా, రాష్ట్రపతి పాలనను ఎత్తివేసినా పాత పరిస్థితులు పునరుద్ధరింపబడతాయి. -
ఇక రాష్ట్రపతి పాలనే!
నేడు కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్ర మంత్రిమండలి రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై చేతులెత్తేసిన కాంగ్రెస్ అధిష్టానం 3 లేదా 4న ఎన్నికల షెడ్యూల్! అసెంబ్లీకి కూడా లోక్‌సభతో పాటే..వాయిదా ఉండదన్న భన్వర్‌లాల్ 5న కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ అపాయింటెడ్ తేదీ... జూన్ 1! ఆ రోజే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త్వరలో గెజిట్ నోటిఫికేషన్ జారీ సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్రంలో కొద్దిరోజులుగా నెలకొన్న రాజకీయ సంక్షోభానికి శుక్రవారంతో తెర పడనుంది. ముఖ్యమంత్రి పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా నేపథ్యంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ అధిష్టానం నిశ్చయించింది. శుక్రవారం ఉదయం 10.30కు జరగబోయే కేంద్ర కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈ అంశాన్ని కేబినెట్ ఎజెండాలో కూడా చేర్చినట్టు సమాచారం. అంతేగాక రాష్ట్ర అసెంబ్లీకి కూడా లోక్‌సభతో కలిపి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 3 లేదా 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను వెలువరించనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికార వర్గాలకు ఈ మేరకు తాజాగా సమాచారం అందింది. శుక్రవారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా అనిశ్చితికి కేంద్రం తెరదించనుందని ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. ఎన్నికల వేళ ఎవరిని ముఖ్యమంత్రిగా నియమించినా పార్టీలో తలనొప్పులు మరింతగా పెరగడమే తప్ప లాభముండదని కేంద్ర పెద్దలు భావించినట్టు తెలిసింది. పైగా రాష్ట్రపతి పాలన విధిస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తేదీ నాటికి విభజన ప్రక్రియ సజావుగా సాగుతుందనేది వారి అభిప్రాయమని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అంతేగాక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తేదీ (అపాయింటెడ్ డే)ని జూన్ 1గా ఖరారు చేస్తూ రాష్ట్రపతి త్వరలో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ఆయన వివరించారు. అప్పటికి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు పూర్తవడమే గాక విభజన ప్రక్రియ పూర్తై ఎలాంటి సమస్యలూ లేకుండా తెలంగాణ, సీమాంధ్రల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటవుతాయని చెప్పుకొచ్చారు. నేతలతో సోనియా మంతనాలు ఇప్పటిదాకా ప్రభుత్వ ఏర్పాటుకు ఉవ్విళ్లూరిన కాంగ్రెస్ పెద్దలు... సీమాంధ్ర నేతల్లోని గందరగోళ వైఖరి తదితరాలను లోతుగా విశ్లేషించుకున్నాక గురువారం వైఖరి మార్చుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు వల్ల విభజన ప్రభావానికి ప్రభుత్వ వ్యతిరేకత తోడవడమే గాక అది ఎన్నికల వరకూ కొనసాగుతుందనిభావించార. వీటికి బదులు పూర్తి కాలం ప్రచారంలో నిమగ్నమవడం మేలన్న అభిప్రాయానికి వచ్చారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, తన రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌లతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, భావి కార్యాచరణపై చర్చించారు. ఇరు ప్రాంతాల నేతలతో సంప్రదింపుల సారాంశం, ప్రభుత్వ ఏర్పాటుకు ఎదురవుతున్న అనైక్యత, అపాయింటెడ్ తేదీని ఇప్పట్లో ఖరారు చేయలేని పరిస్థితి తదితరాలను నేతలు మేడమ్ ముందుంచారు. రాష్ట్రపతి పాలనే శరణ్యమని సలహా ఇచ్చారు. అనంతరం దిగ్విజయ్ ఈ మేరకు సంకేతాలిచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుపైనా పరిశీలన: జైరాం కేంద్ర మంత్రి జైరాం రమేశ్ మాత్రం రాష్ట్రపతి పాలనా, ప్రభుత్వ ఏర్పాటా అన్నదానిపై అధిష్టానం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. వాటిపై లోతుగా పరిశీలిస్తోందని గురువారం హైదరాబాద్ గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తదితరులకు చెప్పారు. రెండు రాష్ట్రాలు మనుగడలోకి వచ్చే అపాయింటెడ్ తేదీని ప్రకటిస్తూ రాష్ట్రపతి భవన్ గెజిట్ నోటిఫికేషన్ జారీ కాగానే రెండు రాష్ట్రాలకు ప్రత్యేక పీసీసీల ఏర్పాటుకు కూడా కాంగ్రెస్ రంగం సిద్ధం చేసుకుంది. గవర్నర్ సలహాదారులుగా అగర్వాల్, కుట్టి? రాష్ట్రపతి పాలన నేపథ్యంలో రాష్ట్ర పాలన పగ్గాలను శుక్రవారం నుంచి గవర్నర్ నరసింహన్ చేపట్టనున్నారు. పాలనలో తనకు సాయపడేందుకు సలహాదారుల వేటలో నిమగ్నమయ్యారు. బయటి వారికి బదులు రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్‌లే మేలని ఆయన భావిస్తున్నారు. ఇద్దరు అధికారులను గవర్నర్ సంప్రదించగా వారు విముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. విభజన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల వారిని నియమించుకుంటేనే మేలని కొందరు అధికారులు ఆయనకు సూచించారు. కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో పనిచేసి రిటైరైన అనిల్‌కుమార్ కుట్టి, ఆర్.కె. అగర్వాల్ వంటి సీనియర్ ఐఏఎస్‌లు సలహాదారులుగా రావచ్చంటున్నారు. మార్చి 5న కలెక్టర్లు, ఎస్పీలతో సీఈఓ భేటీ రాష్ట్రంలో లోక్‌సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో తనను కలిసిన సాక్షి ప్రతినిధితో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రం మరికొంత కాలం కలిసుంటుందా, వెంటనే విడిపోతుందా అన్నదానితో సంబంధం లేదు. రెండు రాష్ట్రాల్లోనైనా ఎన్నికలు యథావిధిగా జరుగుతాయి. విభజన పూర్తవకపోతే 28 రాష్ట్రాల్లోను, పూర్తయితే 29 రాష్ట్రాల్లోను ఎన్నికలు జరుగుతాయి. అంతే తప్ప విభజన వల్ల ఎన్నికలు వాయిదా పడవు’’ అని వివరించారు. ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణకు సంబంధించి కలెక్టర్లు, ఎస్పీలతో మార్చి 5వ తేదీన సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. -
అధికార కేంద్రంగా రాజ్‌నివాస్
రాష్ట్రపతి పాలన నిర్ణయం నేపథ్యంలో రాజ్‌నివాస్‌లోనే ఇక అన్ని అధికారిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఏ నిర్ఱయం తీసుకోవాలన్నా సంబంధిత అధికారులు ఇకపై కచ్చితంగా రాజ్‌నివాస్‌కు వెళ్లాల్సిందే. మరోవైపు ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, ఇతర అభివృద్ధి పనుల కోసం నిధుల విడుదలకు ఎల్జీ... ఓట్ ఆన్ అకౌంట్‌ను ఆమోదించాల్సి ఉంటుంది. సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి పాలన విధించాలని నిర్ణయించడంతో లెప్టినెంట్ గవర్నర్ నివాసం రాజ్‌నివాస్ ఇక అధికార కేంద్రంగా మారనుంది. పాలన మొత్తం లెప్టినెంట్ గవర్నర్ చేతుల్లోకి రానుంది. అన్ని ప్రభుత్వ విభాగాలు , మూడు మున్సిపల్ కార్పొరేషన్లు, ఎన్డీఎంసీ, విద్యుత్ సంస్థలు, ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ)లు ఆయన పరిధిలోకి వస్తాయి. పరిపాలన ను సమర్థంగా సాగించడం కోసం ఎల్జీ ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మొదటిది కీలక ప్రభుత్వ విభాగాల బాధ్యతను సలహాదారులకు అప్పగించడం. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్... విశ్రాంత అధికారులను కొన్ని కీలక విభాగాలకు సలహాదారులుగా నియమించి వారికి మంత్రులకు ఉండే కొన్ని అధికారాలను కట్టబెట్టవచ్చు, ఇక రెండోది ప్రధానకార్యదర్శి లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా అధికారుల అధికారాలను పెంచి తమ విబాగాలకు సంబంధించిన నిర్ణయాధికాకరం కట్టబెట్టవచ్చు. ఇందువల్ల రోజువారీ పాలనా వ్యవహారాలకు సంబంధించి ఫైళ్లు ఎల్జీ నివాసానికి పంపించవలసిన అవసరం ఉండ దు. అయితే అన్ని కీలక విషయాలలో అంతిమ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని ముఖ్య నిర్ణయాలకు అనుమతి కోసం ఫైళ్లు రాజ్‌నివాస్‌కు రావాల్సి ఉంటుంది. ప్రధాన కార్యదర్శి ప్రభుత్వానికి రాజ్‌నివాస్ మధ్యవర్తిగా ఉంటారు. అన్ని విభాగాలకు చెందిన ఫైళ్లు ప్రధాన కార్యదర్శి ద్వారా లె ఫ్టినెంట్ గవర్నర్‌కు చేరతాయి. మొట్టమొదటిసారి ఢిల్లీలో మొట్టమొదటిసారి రాష్ట్రపతి పాలన అమల్లోకి రానుంది. సంపూర్ణ రాష్ట్ర హోదా లేనందువల్ల ఢిల్లీలో భూమి, పోలీసు, శాంతి భద్రతల వ్యవహారాలు కేంద్రం చేతిలో ఉండడంతో రాజ్‌నివాస్ రెండో అధికార కేంద్రంగా ఉండనుంది. అయినప్పటికీ రాష్ట్రపతి పాలనతో పూర్తి అధికారం రాజ్‌నివాస్ కిందికి రానుంది. ఎల్జీ ముందున్న కీలక సవాళ్లు మొట్టమొదటిది ఓట్ ఆన్ ఎకౌంట్‌ను ఆమోదిం చడం. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, ఇతర అభివృద్ధి పనుల కోసం నిధులు విడుదలకు ఎల్జీ... ఓట్ ఆన్ అకౌంట్‌ను ఆమోదించాల్సి ఉం టుంది. రెండోది బకాయిల చెల్లింపులకోసం డిస్కం లకు ఎన్టీపీసీ ఇప్పటికే అల్టిమేటం ఇచ్చింది. డిస్కంలు ఈ చెల్లింపులు జరపనట్లయితే ఢిల్లీ వాసులకు విద్యుత్ కోతలు తప్పవు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి డిస్కంలు ప్రభుత్వం వైపు చూస్తున్నాయి. అనుమతులు లభించక గడిచిన ఆరు నెలలుగా ఢిల్లీ జల్ బోర్డుకు చెందిన అనేక ప్రాజెక్టులు ఆగిపోయాయి. వాటిని పట్టాలపైకి ఎక్కించాలంటే లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి అవసరం. ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) పరిధిలోని 28 ప్రభుత్వ కళాశాలలో పాలకమండలిలో కొత్తవారిని నియమించాలనే ఆప్ సర్కారు ప్రయత్నం సఫలం కాలేదు. ఇప్పుడు ఆ కళాశాలలకు చెందిన పాలకమండళ్లలో 140 మందిని ఎల్జీ నియమించాల్సి ఉంది. స్వరాజ్ చట్టం కింద మొహల్లా సభలకు నిధులు అందచేయాలనే ఉద్దేశంతో ఆప్ సర్కారు ఎమ్మెల్యే నిధులను విడుదల చేయలేదు. ఇపుడు వాటిని లెఫ్టినెంట్ గవర్నర్ విడుదల చేయాల్సి ఉంది. ఆప్ సర్కారు వచ్చిన తరువాత రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల (ఆర్డబ్ల్యూఏ)లకు భాగీధారీ కింద రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. లెఫ్టినెంట్ గవర్నర్ ఇందుకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామనే హామీని నెరవేర్చక మునుపే కేజ్రీవాల్ సర్కారు గద్దెదిగింది. ఈ విషయాన్ని పరిశీలించడం కోసం కేజ్రీవాల్ ప్రభుత్వం నియమించిన కమిటీ నెలరోజులలో నివేదిక ఇవ్వాల్సిఉంది. తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తెస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలోకూడా లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
'రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించండి మహాప్రభో'
రాష్ట్రంలో శాంతి భద్రతల మృగ్యమైన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షురాలు కుమారి మాయావతి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పార్లమెంట్ వెలుపల విలేకర్ల సమావేశంలో మాయావతి మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతలు అనేది మచ్చుకైన లేకుండా పోయాయని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆ రాష్ట్ర గవర్నర్, కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని మధురలోని అత్యాచారానికి గురైన యువతి, ఆమె తల్లి కోర్టు నుంచి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో దుండగులు కాల్పుల జరిపి ఆ యువతిని హత్య చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఆ ఘటనలో ఆ యువతి తల్లి తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ మృత్యువుతో పోరాడుతుందని మాయావతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సంఘటన రాష్ట్రంలోని శాంతిభద్రతలకు ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. ఓ విధంగా చెప్పాలంటే ఉత్తరప్రదేశ్‌లో అరాచకత్వం రాజ్యమేలుతుందని అఖిలేష్ ప్రభుత్వంపై ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల రాష్ట్ర మంత్రి ఆజాం ఖాన్ గేదెలు ఆచూకీ తెలియకపోయాయి. ఆ కేసులో పోలీసులను సస్పెండ్ చేయడం చేయడం ఎంతవరకు సబబని మాయావతి విలేకర్ల సమావేశంలో ప్రశ్నించారు. -
రాష్ట్రపతి పాలనకు అవకాశంలేదు: దిగ్విజయ్ సింగ్
న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశంలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ చెప్పారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను ముఖ్యమంత్రి పరిరక్షించాలని అన్నారు. తాము శాసనసభను తక్కువ చేయడంలేదని చెప్పారు. తెలంగాణ నోట్ శానసభకు వెళుతుందన్నారు. సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చి, పరిస్థితి చేయి దాటిపోతున్న విషయం తెలసిందే. ఈ పరిస్థితులలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశంలేదని ఆయన స్సష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్టం ఏర్పాటుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపినప్పటికీ, తెలంగాణ నోట్ తప్పనిసరిగా శాసనసభకు వెళుతుందని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. -
లొల్లి తగ్గాలంటే ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలి:ఎమ్మెల్సీ దిలీప్
కరీంనగర్: రాష్ట్రంలో లొల్లి తగ్గాలంటే ప్రభుత్వాన్ని భర్తరప్ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణా ఇవ్వాలని ఆయన కోరారు. లేకుంటే లక్ష మంది సైన్యంతో అసెంబ్లీని, పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి సీమాంద్రకే సీఎం అయినట్లు వ్యవహరిస్తూ, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. సామాజిక తెలంగాణా రాష్ట్ర సాధన కోసం తెలంణా యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో లక్ష మంది సైన్యాన్ని తయారు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో సైన్యం రిక్రూట్ మెంట్ ప్రారంభించామని చెప్పారు. త్వరలో అన్ని జిల్లాల్లో సైన్యం ఎంపిక పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే లక్ష మంది సైన్యంతో అసెంబ్లీని, పార్లమెంట్‌ను ముట్టడిస్తామని తెలిపారు. సీమాంధ్ర లాబింగ్లతో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం ఆటంకం కల్పిస్తే తీవ్ర పరిణామాలుంటాయని దిలీప్ కుమార్ హెచ్చరించారు. -
'యూపీలో రాష్ట్రపతి పాలన విధించండి'
శాంతి భద్రతలు క్షీణించిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరినట్లు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి వెల్లడించారు. శుక్రవారం న్యూఢిల్లీలో ప్రణబ్‌ను మాయావతి కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితిని ప్రణబ్‌కు వివరించినట్లు ఆమె పేర్కొన్నారు. ఇటీవల ముజఫర్‌నగర్‌లో చోటు చేసుకున్న మత ఘర్షణలే అందుకు ఉదాహరణ అని మాయావతి చెప్పారు. ముజఫర్‌నగర్ ఘర్షణలను అరికట్టడంలో అఖిలేష్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. అలాగే ఆ ఘర్షణల అనంతరం స్థానికంగా శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు ఆ ప్రభుత్వం ఎలా వైఫల్యం చెందిందో మాయావతి మీడియా ముఖంగా ఏకరువు పెట్టారు. ముజఫర్‌నగర్ ఘర్షణలో దాదాపు 48 మరణించారని, వందలాది మంది గాయాలపాలైయ్యారని ఈ సందర్భంగా మాయావతి వివరించారు. మతఘర్షణల వల్ల వేలాది మంది ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు తరలిపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయిన అఖిలేష్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకుండా నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహారించిందని మాయావతి మండిపడ్డారు. -
యూపీలో రాష్ట్రపతి పాలనకు బీజేపీ డిమాండ్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఫిర్యాదు చేసింది. ముజఫర్‌నగర్ సంఘటనలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని, బాధితులకు సరైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. రాష్ట్రపతిని కలిసిన అనంతరం రాజ్‌నాథ్ సింగ్ విలేకరుల తో మాట్లాడుతూ, యూపీలో పాలన అనేదే లేకుండా పోయిందని ఆరోపించారు. ఆరునెలలుగా యూపీలో అరాచకాలు కొనసాగుతున్నాయని తాము గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి ముందుగానే సమాచారం ఇచ్చినా వారు ఖాతరు చేయలేదన్నారు. -
ఏ క్షణంలోనైనా ప్రభుత్వం బర్తరఫ్: పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఏ క్షణంలోనైనా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసే అవకాశముందని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలన విధించే దిశగా కేంద్రం ఆలోచిస్తోందన్నారు. ఆయన గురువారమిక్కడ ఎమ్మెల్సీ ఆమోస్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గత ఏడాదిన్నరగా ప్రభుత్వ పాలన లేకుండాపోయిందని, వరుస ఉద్యమాలతో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నారు. సీఎం కిరణ్, కేబి నెట్ మంత్రులంతా ప్రభుత్వాన్ని నడిపించడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. ‘‘ఇలాంటి పరిస్థితి గతంలో పి.వి.నరసింహారావు హయాంలో ఏర్పడింది. ఆనాడు ముల్కీ నిబంధనలపై తీర్పు వెలువడటంతోపాటు పీవీ ప్రభుత్వం భూ సంస్కరణల చట్టాన్ని ప్రవేశపెట్టడంతో ఆంధ్రా పెత్తందారులు ‘జై ఆంధ్రా’ ఉద్యమాన్ని నడిపారు. సీఎం పనిచేయలేని పరిస్థితి నెలకొనడం, ఉద్యమాలను నియంత్రించలేకపోవడంతో ఇందిరాగాంధీ ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ర్టపతి పాలన విధించింది. ప్రస్తుతం రాష్ట్రం లో మళ్లీ అలాంటి పరిస్థితులే కన్పిస్తున్నా యి’’ అని అన్నారు. సమైక్య ఉద్యమాన్ని ప్రభుత్వంలో ఉన్నవారే ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం లో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని తనతోపాటు పలువురు ఎంపీలు కేంద్ర పెద్దలను కోరినట్టు తెలిపారు. వారంతా సానుకూలంగా ఉన్నారని, సోనియాగాంధీతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని వెల్లడించారు. రాష్ట్రపతి పాలన వస్తే ప్రస్తుత గవర్నర్ నరసింహన్ తన విధులను సమర్థంగా నిర్వర్తించలేరని, ఆయన స్థానంలో అనుభవమున్న వ్యక్తిని నియమించాలని కోరారు. తెలంగాణ విషయంలో చంద్రబాబు రాజకీయ వ్యభిచారిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. -
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిన నేపథ్యంలో కిరణ్ సర్కార్‌ను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి మాజీ ఎమ్మెల్సీ కే. దిలీప్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు బుధవారం ప్రణబ్‌కు లేఖ రాశారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్రలో సమైక్య ఉద్యమాన్ని కిరణ్ ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆ లేఖలో ఆరోపించారు. ఓ విధంగా చెప్పాలంటే సీఎం కిరణ్ సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఏపీఎన్జీవోల సమ్మెను సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టే తప్పు పట్టినప్పటికీ వారు సభను హైదరాబాద్‌లో జరుపుకునేందుకు అనుమతి ఇవ్వడం సీఎం పక్షపాత ధోరణికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. రాజ్యధర్మాన్ని విస్మరిస్తున్న సీఎం కిరణ్‌కు ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కులేదని దిలీప్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతికి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. -
రాష్ట్రపతి పాలన విధించాలంటూ హైకోర్టులో పిల్
రాష్ట్రంలో పాలన స్తంభించిందని, అందువల్ల రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ హైకోర్టులో ఓ ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. కేసును విచారణకు స్వీకరించిన కోర్టు.. విచారణను ఈనెల 26వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు, సీమాంధ్ర ప్రాంతంలోని 23 జిల్లాల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ సజావుగా సాగట్లేదంటూ మరో ప్రజాహిత వ్యాజ్యం కూడా హైకోర్టులో దాఖలైంది. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు చెందిన కొంతమంది విద్యార్థులు ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కూడా కోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై వివరంగా ఆయా ప్రాంతాల అధికారుల నుంచి నివేదికలు తెప్పించి సమర్పించాలని డీజీపీతో పాటు ఆయా ప్రాంతాల ఐజీపీలను కోర్టు ఆదేశించింది. ఏపీఎన్జీవోల సమ్మె చట్ట విరుద్ధమంటూ దాఖలైన మరో పిటిషన్‌ను కోర్టు వాయిదా వేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి, డీజీపీకి, సీమాంధ్ర సెక్రటేరియట్ ఫోరానికి చెందిన అధికారులకు దీనిపై నోటీసులు పంపిన కోర్టు.. ఈ పిటిషన్ విచారణను కూడా ఆగస్టు 26వ తేదీకి వాయిదా వేసింది. సమ్మెను నిరోధించేందుకు ఏం చర్యలు తీసుకున్నారంటూ ప్రభుత్వ న్యాయవాదులను కోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. సమ్మెను వెంటనే విరమించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని న్యాయవాదులు కోరగా, అసలు ఇప్పటికీ సమ్మె జరుగుతోందన్న నమ్మకం ఏంటని కోర్టు వారిని ప్రశ్నించింది.