హైకోర్టులో రావత్ పిటిషన్
♦ తన సర్కారును పునరుద్ధరించాలని వినతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను రద్దుచేసి, తన ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని మాజీ సీఎం హరీశ్ రావత్ హైకోర్టును ఆశ్రయించారు. నిరంకుశత్వంతో మోదీ ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించిందన్నారు. రావత్ తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సోమవారం నైనిటాల్‌లోని హైకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్రంలో ఆర్టికల్ 356 ప్రయోగం చట్టవ్యతిరేకమని, రద్దు కోసం హైకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. అసెంబ్లీలో బలపరీక్షకు ఇంకో రోజు గడువు ఉండగానే, కేంద్రం రాజ్యాంగ ప్రక్రియకు తూట్లు పొడిచేలా నిర్ణయం తీసుకుందన్నారు. ఈ పిటిషన్‌పై యూ.సీ ధ్యాని ఏకసభ్య ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విని మంగళవారానికి వాయిదా వేసింది.
గవర్నర్‌తో రావత్ భేటీ.. తనకు సంపూర్ణ మెజారిటీ ఉందని, అందువల్ల బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని రావత్ సోమవారం గవర్నర్ కేకే పాల్‌ను కలిశారు. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను వెంట తీసుకెళ్లారు. వీరిలో 26 మంది కాంగ్రెస్, ఐదుగురు పీడీఎఫ్, ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే ఉన్నారు. తమకు 34 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ గవర్నర్‌కు లేఖ ఇచ్చారు.
పరస్పర విమర్శలు.. గవర్నర్ అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునేందుకు సీఎంకు గవర్నర్ గడువు ఇచ్చినప్పటికీ కేంద్రం రాష్ర్టపతి పాలన విధించిందని కాంగ్రెస్ దుయ్యబట్టింది. ప్రభుత్వ బల నిరూపణకు బలపరీక్షే మార్గమని ఎస్‌ఆర్ బొమ్మైకేసులో సుప్రీం కోర్టు చెప్పిందని పేర్కొంది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ.. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం సృష్టించారని మండిపడ్డారు. ద్రవ్య వినిమయ బిల్లు వీగిపోయినప్పటికీ అది ఆమోదం పొందిందంటూ స్పీకర్ ప్రకటించడాన్ని తప్పుబట్టారు.
రాష్ట్రపతి పాలన రద్దు చేయండి
Published Tue, Mar 29 2016 4:42 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement