Harish Rawat
-
ఇక ప్రియాంక ఫుల్ ఫోకస్!
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక గెలుపుతో ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ అదే తరహా జోరు ను తెలంగాణలోనూ కొనసాగించే క్రమంలో పార్టీ పటిష్టతపై మరింత దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణ ఎన్నికల వ్యవహారాలన్నీ ఇకపై పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ కనుసన్నల్లో జరిగేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న తెలంగాణ సహా మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు పూర్తి సమయం కేటాయించేలా ప్రియాంకగాందీని ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించాలని యోచిస్తోంది. సీనియర్ నేతలు హరీశ్ రావత్, తారిఖ్‌అన్వర్‌లో ఒకరిని అక్కడ నియమించనుంది. ఈ నెలలోనే కొత్త నియామక ప్రక్రియను పూర్తిచేసి ప్రియాంకగాందీని తెలంగాణ సహా మిగతా రాష్ట్రాల్లో ప్రచారాస్త్రంగా ప్రయోగించనుంది. సమన్వయం..ప్రచారం.. సమూహాలతో మమేకం కర్ణాటక ఎన్నికల ముందు నుంచే తెలంగాణపై ప్రధానంగా ఫోకస్ పెట్టిన ప్రియాంక ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్ సీనియర్ నేతలతో ఢిల్లీలో సమావేశాలు నిర్వహించారు. నేతల మధ్య సమన్వయానికి ప్రయత్నాలు చేశారు. అనంతరం ఆమె పూర్తి సమయం కర్ణాటక ఎన్నికలపై ప్రధానంగా దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో మళ్లీ గ్రూపు తగాదాలు పెరిగాయని, ఎవరికివారే యమునాతీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారే విమర్శలు వచ్చాయి. చాలా నియోజకవర్గాల్లోలు గ్రూపుల మధ్య వివాదాలు నిత్యకృత్యమయ్యాయి. మరోవైపు ఢిల్లీలో ఉన్న పెద్దల అండదండలున్నాయంటూ ఎవరి అ నుచరులను వారు ఎమ్మెల్యేల అభ్యర్థులు గా ప్రచారం చేసుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే పార్టీ దూత లు నదీమ్‌జావెద్, రోహిత్ చౌదరి అధిస్టాన పెద్దలకు నివేదికలిచ్చారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఇకపై తెలంగాణలో పార్టీని పూర్తిగా గాడిలో పెట్టే బాధ్యతను ప్రి యాంక భుజస్కందాలపై పెట్టాలని అధిష్టానం నిర్ణయించింది. మరో నాలుగైదు రోజుల్లో రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో నిర్వహించే సమావేశాల్లోనూ ప్రియాంక పాల్గొననున్నారు. కర్ణాటక ఫార్ములానే ఇక్కడా.. ముఖ్యంగా రాష్ట్ర నేతల మధ్య సమన్వయాన్ని పూర్తిగా ఆమె పర్యవేక్షించనున్నారు. కర్ణాటకలో మాదిరే సీనియర్లకు పార్టీ పటిష్టత బాధ్యతలు కట్టబెట్టే వ్యూ హాలను ప్రియాంక అమలుచేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రియాంక పర్యటనలు, రోడ్‌షోలు, ర్యాలీలు ఎక్కు వగా ఉండేలా ప్రణాళిక సిద్ధం కానుంది. కర్ణాటక ఎన్నికల్లో ప్రియాంక 17 రోడ్‌షోలలో పాల్గొనడమే కాకుండా 13 బహిరంగసభలలో ప్రసంగించారు. దీంతోపాటే యువత, మహిళా, కార్మికులతో సమావేశాలు నిర్వహించారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా అనేక దేవాలయాలను సందర్శించారు. ఇదే ఫార్ములాను తెలంగాణలోనూ అమలుచేసే అవకాశాలున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలంగా వ్యవహరించిన వర్గాలతో మమేకం, అమరవీరుల కుటుంబాలకు భరోసా కల్పించేలా ఆమె పర్యటనలు రూపొందించనున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా కర్ణాటకలో ‘40 శాతం కమీషన్’ప్రభుత్వ నినాదాన్ని ప్రియాంక బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. అదేరీతిన ఇక్కడి ప్రభుత్వ అవినీతి, కుటుంబపాలన, ఇతర అంశాలు ప్రియాంక ద్వారా ప్రజల్లోకి వెళ్లేలా చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ పెద్దలు ఈ మేరకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నెల మొదలు అక్టోబర్ వరకు నెలకో పర్యటన, బహిరంగసభ ఉండేలా పర్యటనల రోడ్‌మ్యాప్ సిద్ధమైందని ఏఐసీసీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. -
బీజేపీకి పిచ్చిపట్టింది.. ఉత్తరాఖండ్ మంత్రి వ్యాఖ్యలపై రావత్ ఫైర్..
డెహ్రాడూన్: ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలవి హత్యలు కాదు, ప్రమాదాలు అని ఉత్తరాఖండ్ బీజేపీ మంత్రి గణేష్ జోషి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత, మాజీ సీఎం హరీశ్ రావత్ తీవ్రంగా స్పందించారు. బీజేపీకి పిచ్చి పట్టిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమరులను అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. వారి త్యాగాలను కించపరిచే హక్కు ఎవరికీ లేదన్నారు. బీజేపీ మంత్రి చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రావత్ ఈమేరకు ఏఎన్ఐ వార్తా సంస్థతో బుధవారం మాట్లాడారు. మంగళవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మాజీ ప్రధానులు ఇంధిరా గాంధీ, రాజీవ్ గాంధీలవి హత్యలు కాదు ప్రమాదాలు అని గణేష్ జోషి అన్నారు. బలిదానం అనేది గాంధీ కుటంబాల గుత్తాదిపత్యం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్‌లో నిర్వహించిన భారత్ జోడో యాత్ర ముంగిపు సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తన నానమ్మ, నాన్న చనిపోయిన వార్తలను ఫోన్ ద్వారానే తెలుసుకున్నానని, ఆ ఘటనలు తలుచుకుంటే ఇప్పటికీ బాధగా ఉంటుందని అన్నారు. హింసను ప్రేరేపించే ప్రధాని మోదీ, అమిత్ షాలకు ఆ భాద ఎప్పటికీ అర్థంకాదని రాహుల్ అన్నారు. ఈ నేపథ్యంలోనే గణేష్ జోషి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చదవండి: ఐదుగురు భర్తలకు ఒకే భార్య.. టీఎంసీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై దుమారం.. -
‘పాక్ బలహీనంగా ఉంది.. పీఓకేను వెనక్కి తీసుకోవడానికి ఇదే సరైన టైం’
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌పై(పీఓకే) కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్. ప్రస్తుతం పాకిస్థాన్ బలహీన పరిస్థితుల్లో ఉందని, పీఓకేను వెనక్కి తీసుకునేందుకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. పీఓకేను సొంతం చేసుకోవటం మన బాధ్యత అని సూచించారు. పీఓకేను తిరిగి పొందాలనే భారత లక్ష్యం ఎన్నటికీ నెరవేరదని, తమ దేశాన్ని రక్షించుకునేందుకు సైనికులు సిద్ధంగా ఉన్నారని పాక్ సైన్యాధిపతిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన జనరల్ సయ్యద్ అసిమ్ మునిర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ పీఓకే వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘పీఓకేను పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకుంది. దానికి స్వేచ్ఛను కల్పించి, తిరిగి తీసుకోవటం మన బాధ్యత. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పార్లమెంట్లో ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించింది. పీఓకేను తిరిగి తీసుకోవటం మోదీ ప్రభుత్వ అజెండాలో భాగమని నమ్ముతున్నాను. కేవలం చర్చలకే పరిమితం కాకూడదు. పాకిస్థాన్ ప్రభుత్వం బలహీనంగా ఉంది. పీఓకేను తిరిగి పొందేందుకు ఇదే సరైన సమయం.’ అని పేర్కొన్నారు హరీశ్ రావత్. అంతకు ముందు ఈ ఏడాది అక్టోబర్ 28న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం పీఓకేపై సూత్రప్రాయ వ్యాఖ్యలు చేశారు. పీఓకేలోని శరణార్థులు తిరిగి తమ స్వదేశానికి వస్తారని పేర్కొన్నారు. పీఓకేను తిరిగి పొందేందుకు తమ సైన్యం సిద్ధమవుతున్నట్లు భారత సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సైతం కొద్ది రోజుల క్రితం పేర్కొన్నారు. ఇదీ చదవండి: పార్లమెంట్లో మహిళా సభ్యురాలిపై చేయి చేసుకున్న ఎంపీ.. వీడియో వైరల్ -
నాన్నా..‘ఎస్ వికెన్ డూ ఇట్’!
డెహ్రాడూన్: వాళ్లిద్దరూ విభిన్న భావజాలం కలిగిన పార్టీలకు చెందిన వారు. కానీ ఈసారి ఎన్నికల్లో ఒకే లక్ష్యంతో పోటీకి దిగారు. మాజీ సీఎంలైన తమ తండ్రులకు జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. తండ్రులు ఓడిపోయిన నియోజకవర్గాల్లోనే ఎన్నికల బరిలో దిగారు. వారే కాంగ్రెస్ మాజీ సీఎం హరీశ్ రావత్ కుమార్తె అనుపమా రావత్. బీజేపీ మాజీ సీఎం బీసీ ఖండూరి కుమార్తె రీతూ ఖండూరి. బీసీ ఖండూరి 2012 ఎన్నికల్లో కొత్‌ద్వార్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్న రీతూ ఖండూరి మాట్లాడుతూ ‘అప్పట్లో మా నాన్న గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయారు. ఇప్పుడు అదే స్థానంలో పోటీ చేసి నేను గెలిచి చూపిస్తా. మా పార్టీ సంస్థాగతంగా చాలా బలంగా ఉంది’’ అని అన్నారు. ఇక హరీశ్ రావత్ 2017 ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి హరిద్వార్ (రూరల్) నుంచి ఓటమిపాలయ్యారు. రావత్ కుమార్తె అనుపమా గత ఏడేళ్లుగా హరిద్వార్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతున్నారు. ‘‘హరిద్వార్ రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇప్పటివరకు నెగ్గలేదు. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదు. ఇప్పటికే మా నాన్నను ఓడించి తప్పు చేశామన్న భావన ప్రజల్లో ఉంది. ఈ సారి గెలుపు నాదే’’ అని అనుపమ ధీమాగా చెప్పారు. మొత్తానికి ఈ ఇద్దరు కుమార్తెలు తండ్రుల ఓటమికి ప్రతీకారంగా అవే నియోజకవర్గాలను ఎంచుకొని పోటీకి దిగడం అందరినీ ఆకర్షిస్తోంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
Harish Rawat: గజ ఈతగాడు.. ఆయనను కాదని ఒక్క అడుగు ముందుకు వేయలేదు..
దేవుళ్లు నడయాడే భూమిగా పేరున్న ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు సీనియర్ నేత హరీశ్ రావత్. ఆయనను కాదనుకొని ఆ పార్టీ ఒక్క అడుగు కూడా ముందుకు వేసే పరిస్థితి లేదు. ఎన్నికలనే మహాసముద్రంలో ఈత కొట్టనివ్వకుండా హైకమాండ్ ప్రతినిధులు తన కాళ్లూ చేతులు కట్టేశారని, ఇక విశ్రాంతి తీసుకుంటానని రావత్ ఎన్నికలకు ముందు అస్త్రసన్యాసం చేయడానికి సిద్ధపడినా, ముఠా తగాదాలు తారాస్థాయికి చేరుకొని వలసలు ఎక్కువైనా రావత్ అనుభవాన్నే మళ్లీ కాంగ్రెస్ నమ్ముకుంది. ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించి మళ్లీ ఉత్తరాఖండ్ పీఠంపై పాగా వేసే బృహత్తరమైన బాధ్యత ఆయన భుజస్కంధాలపైనే మోపింది. హై కమాండ్ నుంచి రాహుల్ గాంధీ అండదండలు, ముఖ్యమంత్రిగా 43% ప్రజల మద్దతు రావత్‌కే ఉందని వివిధ సర్వేలు తేల్చేయడంతో ఎలాంటి బంధనాలు లేకుండా ఈత కొట్టడానికి ఉత్సాహపడుతున్నారు. ► ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలోని మొహనారి గ్రామంలో రాజ్‌పుత్ కుటుంబంలో 1948 సంవత్సరం ఏప్రిల్ 27న జన్మించారు. ► లక్నో యూనివర్సిటీలో బీఏ ఎల్ఎల్బీ చదువుకున్నారు. ► యువకుడిగా ఉండగానే రాజకీయాల పట్ల ఆకర్షితులై యువజన కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉండే రేణుకను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ► 1980లో తొలిసారిగా అల్మోరా నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1980 – 1989 నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు ► 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ► 2002 నుంచి ఆరేళ్ల పాటు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ► 2009లో హరిద్వార్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2009–14 మధ్య మన్మోహన్ కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. ► 2013 నాటి వరద బీభత్స పరిస్థితుల్ని సమర్థంగా ఎదుర్కోలేకపోవడంతో అప్పటి ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో రావత్ 2014 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ సీఎం అయ్యారు. ► 2016లో ఉత్తరాఖండ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. రావత్‌కి వ్యతిరేకంగా తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. దీంతో ప్రభుత్వం మైనారి టీలో పడిపోయింది ► కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టింది. అయితే మూడు నెలల్లోనే అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకొని తిరిగి సీఎం అయ్యారు. ► అదే సమయంలో సమాచార్ ప్లస్ అనే న్యూస్ చానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో హరీశ్ రావత్ 12 మంది ఎమ్మెల్యేలకు రూ.25 లక్షల చొప్పున ముడుపులు చెల్లించినట్టుగా ఆరోపణలు రావడం ఆయనను ఇరకాటంలో పడేసింది. ► 2017 అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్ రావత్ నేతృత్వంలో ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్ ఓటమిపాలైంది. హరిద్వార్ రూరల్, కిచ్చా స్థానాల్లోంచి పోటీ చేసిన రావత్ ఎక్కడా నెగ్గలేదు. ► పంజాబ్ కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజోత్ సింగ్ సిద్ధూల మధ్య సఖ్యత కుదర్చడంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్గా ఉన్న రావత్ విఫలమైనందుకు ప్రచార కమిటీ బాధ్యతల నుంచి ఆయనను తప్పించింది. ► మరోవైపు ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యవహారాల ఏఐసీసీ ఇన్చార్జ్ దేవేందర్ యాదవ్‌తో విభేదాలు రావత్‌కు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. దీంతో ఇక చేసింది చాలంటూ ట్వీట్ చేసి రావత్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంరేపారు. చివరికి రాహుల్‌గాంధీ జోక్యంతో ఎన్నికల ప్రచార కమిటీ ఇన్చార్జ్గా నియమితులయ్యారు. ► అయిదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రుల్ని మార్చి ఏటికి ఎదురీదుతున్న బీజేపీని ఢీ కొట్టడానికి ఇప్పుడు రావత్ అనే బలమైన నాయకుడు ఉండాలనే కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. దానికనుగుణంగానే రావత్ ఎన్నికల వ్యూహరచన చేస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
సొంత పార్టీపై గళమెత్తిన రావత్.. ఆయన దారి కెప్టెన్ దారేనా? లేక
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ నాయకత్వ లేమిపై సీనియరత్ నేతల అసమ్మతి.. మరోవైపు వరుస ఎదురుదెబ్బలతో సమతమతమవుతున్న కాంగ్రెస్‌కు మరో సమస్య వచ్చిపడింది. ఉత్తరాఖండ్ మాజీ సీఎం, పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ హరీష్ రావత్ అసంతృప్తి గళం వినిపించడం కలకలం రేపుతోంది. గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడిగా.. ట్రబుల్ షూటర్‌గా పేరున్న రావత్ యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2014 నుంచి 2017 వరకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. మొన్నటి వరకు పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఓ వెలుగు వెలిగారు. అయితే అమరీందర్‌సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్దూ మధ్య విభేదాలను పరిష్కరించడంలో విఫలమయ్యారనే కారణంతో ఆయన్ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. దానికితోడు ఉత్తరాఖండ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఇటీవల నియమితులైన దేవేంద్ర యాదవ్‌కు, రావత్‌కు పొసగడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హరీష్ రావత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. (చదవండి: ఒమిక్రాన్‌పై ఊరటనిచ్చే విషయం.. కేసులు తక్కువ, రికవరీ ఎక్కువ.. ఇంకా) వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగే అవకాశముందనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని ముందుండి నడిపించాల్సిన రావత్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇంటా బయట చర్చనీయాంశమయ్యాయి. పార్టీలో తనకు కాళ్లు, చేతులు కట్టేసినట్టుగా ఉందని.. ఇక విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందేమోనని ట్వీట్ చేయడమే కాకుండా భవిష్యత్ కార్యాచరణపై కొత్త సంవత్సరంలో నిర్ణయం తీసుకుంటానని ప్రకటించడం దుమారానికి కారణమైంది. వెంటనే హైకమాండ్ జోక్యం చేసుకుని రావత్‌ను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా ఉత్తరాఖండ్ సీఎల్పీ నేత ప్రీతమ్‌సింగ్, పీసీసీ చీఫ్ గణేశ్ గొడియాల్, హరీష్ రావత్‌ను శుక్రవారం ఢిల్లీకి రావాలని పిలిచింది. అయితే అధిష్ఠానం జోక్యంతో రావత్ మెత్తబడతారా లేక కెప్టెన్ అమరీందర్ సింగ్ తరహాలో తిరుగుబాటు బావుటా ఎగరేసి చికాకులు తెస్తారా అనే చర్చ హస్తిన వర్గాల్లో సాగుతుండడం ఆసక్తికరంగా మారింది. రావత్ మాత్రం సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని ప్రకటించడం మరింత ఉత్కంఠ రేపుతోంది. (చదవండి: మేం ఎన్నికల్లో పాల్గొనడం లేదు) -
రాయని డైరీ.. హరీశ్ రావత్ (73), కాంగ్రెస్
వికలమైన మనసుతో బుధవారం నేను భగవాన్ కేదార్‌నాథ్‌కి ట్వీట్ పెడితే గురువారం ఆ భగవానుడే చెప్పి చేయించినట్లుగా ప్రియాంకా గాంధీ నాకు ఫోన్ చేశారు! ‘‘నమస్తే రావత్జీ! రేపు ఢిల్లీ వచ్చి రాహుల్జీని కలవండి’’ అని చెప్పి, ఫోన్ పెట్టేశారు ప్రియాంక!! రాహుల్‌ని ‘రాహుల్జీ’ని చెయ్యడానికి దేశవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ, రావత్‌జీని ‘రావత్’గా చేయడానికి డెహ్రాడూన్‌లో జరుగుతున్న ప్రయత్నాలను ఢిల్లీలో ఎవరూ గమనిస్తున్నట్లు లేరు. ‘‘దేవేంద్ర యాదవ్ నన్ను లెక్కచేయడం లేదు రాహుల్జీ. అందుకే ఆ కేదారేశ్వరుడికి మొర పెట్టుకున్నాను. కొత్త సంవత్సరంలో నాకో దారి చూపించమని, లేదంటే కాస్త విశ్రాంతిని ప్రసాదించమని ఆయన్ని వేడుకున్నాను..’’ అని శుక్రవారం ఢిల్లీ వెళ్లీ వెళ్లగానే రాహుల్‌తో చెప్పేశాను. ‘‘రావత్జీ! మీరలా వికలమైన మనసుతో మీ ఇష్టదైవానికి ట్వీట్ చేయడం నన్ను, మమ్మీని, ప్రియాంకను ఎంతో బాధించింది. మీ ట్వీట్‌ను కేదారేశ్వరుడొక్కడే చూడడు కదా! నరేంద్ర మోదీజీ చూస్తారు. మమతాజీ చూస్తారు. అమరీందర్‌సింగ్ కూడా చూస్తారు. ట్వీట్ చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించలేకపోయారా?’’ అన్నాడు రాహుల్. ‘‘క్షణికావేదనలో అలా చేసేశాను రాహుల్జీ. కానీ దేవేంద్ర యాదవ్ అన్నీ తనే అని చెప్పుకుని తిరుగుతున్నాడు. తిరగనివ్వండి. ‘రావత్‌కి అంత శక్తి లేదు’ అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. మీరు చెప్పండి రాహుల్జీ. రెండుసార్లు ఉత్తరాఖండ్‌కి సీఎంని అయిన నాకే అంత శక్తి లేకుంటే.. ఎక్కడి నుంచో ఉత్తరాఖండ్ ఇన్ఛార్జిగా వచ్చిన దేవేంద్ర యాదవ్‌కి ఉంటుందా?!’’ అని అడిగేశాను. ‘‘దేవేంద్ర యాదవ్ ఎక్కడి నుంచో రాలేదు రావత్జీ. ఢిల్లీ నుంచే వచ్చాడు’’ అన్నాడు రాహుల్. ‘‘సంతోషం రాహుల్జీ! ఢిల్లీ నుంచి ఎవరొచ్చినా సంతోషమే. అందుకే కదా.. డెహ్రాడూన్‌కి మొన్న మీరు వచ్చినప్పుడు కూడా నేనెంతో సంతోషంగా ఉన్నాను. ఆ సంతోషంలో.. డయాస్ మీద మీతో పాటు ఎవరెవరు ఉండాలో నిర్ణయించవలసింది నేను కదా, దేవేంద్ర యాదవ్ నిర్ణయించేశాడేమిటి అనే ఆలోచన కూడా నాకు రాలేదు!’’ అన్నాను. రాహుల్ అలా వింటూ ఉండిపోయాడు. వినడం వరకేనని నిర్ణయించుకున్నాకే నన్ను ఢిల్లీ పిలిపించినట్లున్నాడు! ‘‘రాహుల్జీ, మీరు మా ఇద్దర్నీ కలిసి పని చెయ్యమన్నారు. దేవేంద్ర యాదవ్ తనొక్కడే చాలనుకుంటున్నాడు. ‘పేరుకే స్టేట్ ఇన్ఛార్జ్. స్టేట్‌లో ఛార్జ్ మొత్తం నాదే’ అని ప్రచారం చేసుకుంటున్నాడు. సీఎం క్యాండిడేట్ని ముందే ప్రకటిస్తే తప్ప అతడు, నేను కలిసి పనిచేసే పరిస్థితి లేదు రాహుల్జీ’’ అన్నాను. ‘‘పరిస్థితా? ప్రసక్తా రావత్జీ’’ అన్నాడు రాహుల్! అంత లోతుగా అతడు ఆలోచించగలడని నేను అనుకోలేదు. ‘‘రావత్జీ! 2017లో అమరీందర్ సింగ్‌ని తప్ప, ఆ తర్వాత ఎవర్నీ మనం సీఎం క్యాండిడేట్‌గా ఎన్నికలకు ముందే ప్రకటించలేదు. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్.. ఎన్నికలు అయ్యాకే సీఎంగా ఎంపికయ్యారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ పేరు కూడా ఎన్నికలు అయ్యాకే సీఎంగా బయటికొచ్చింది. వాళ్లిద్దరూ ఈరోజుకీ సీఎంలుగా ఉన్నారు. ముందే సీఎంగా ప్రకటించి, సీఎంని చేసిన అమరీందర్ సింగ్ ఏమయ్యారో మీకు తెలిసిందే కదా’’ అన్నాడు రాహుల్! ఒక నమస్కారం పెట్టి, వచ్చేశాను. డెహ్రాడూన్‌లో అడుగుపెట్టగానే.. పంజాబ్ నుంచి అమరీందర్‌సింగ్ ఫోన్! ‘‘రావత్జీ! పంజాబ్ స్టేట్ ఇన్‌ఛార్జ్‌గా మీరు నాకు తవ్వారు. ఉత్తరాఖండ్ స్టేట్ ఇన్ఛార్జిగా దేవేంద్ర యాదవ్ ఇప్పుడు మీకు తవ్వుతున్నాడు. కాంగ్రెస్సే కోరి తవ్వకాలు జరిపించుకుంటున్నప్పుడు మీరెంత, నేనెంత, ఆ కేదారేశ్వరుడెంత చెప్పండి’’ అన్నారాయన! -
రావత్, తివారీ ట్వీట్లు; కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో అధినాయకత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న సీనియర్ నాయకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. హైకమాండ్ వైఖరిని తప్పుబడుతూ తాజాగా మనీష్ తివారీ ట్వీట్ చేయడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. ఉత్తరాఖండ్ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన సంక్షోభానికి కేంద్ర నాయకత్వ విధానాలే కారణమన్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు. ‘మొదట అసోం, తర్వాత పంజాబ్, ఇప్పుడు ఉత్తరాఖండ్.. ’ అంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ సొంత పార్టీ నాయకులపై అసంతృప్తి వ్యక్తం చేసిన మరుసటిరోజే మనీష్ తివారీ గళం విప్పడం గమనార్హం. సొంత పార్టీలోనే సహాయ నిరాకరణ: రావత్ డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార చీఫ్, రాష్ట్ర మాజీ సీఎం హరీశ్ రావత్ సొంత పార్టీ నాయకుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ‘ఎన్నికల్లో కష్టపడి పార్టీని విజయతీరాలకు చేర్చే పనిలో చేదోడువాదోడుగా ఉండాల్సిందిపోయి కాంగ్రెస్ నేతలే మొండిచేయి చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలను మొసళ్లుగా వదిలింది. అయినాసరే పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఎన్నికల సంద్రాన్ని ఈదుతున్నాను. ఎన్నికల సాగరంలో నాకు సాయం చేయకపోగా కొందరు నా కాళ్లు చేతులూ కట్టేస్తున్నారు. ఇక రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని పిస్తోంది’ అని రావత్ ట్వీట్ చేశారు. (చదవండి: మహిళా వివాహ వయసు పెంపు.. వాళ్లని బాధిస్తోంది) కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తూ.. ట్వీట్లపై రావత్ మీడియా సలహాదారు సురేంద్ర స్పందించారు. ‘కొన్ని శక్తులు కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తూ కాంగ్రెస్ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తున్నాయి’ అని అన్నారు. రావత్ నేతృత్వంలోకాకుండా ఉమ్మడి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లాలని ఏఐసీసీ ఉత్తరాఖండ్ ఇన్చార్జ్ దేవేంద్ర యాదవ్ పట్టుబడుతుండటం గమనార్హం. కాగా, తాను చేసిన ట్వీట్‌పై వివరణ ఇచ్చేందుకు హరీశ్ రావత్ నిరాకరించారు. సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని విలేకరులతో అన్నారు. (చదవండి: జియా ఉల్ హక్ హయాం.. మోదీ పాలన ఒక్కటే) -
పంజాబ్ కేబినెట్లో ఏడు కొత్త ముఖాలు
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన చరణ్‌జీత్ సింగ్ చన్నీ తొలిసారిగా ఆదివారం తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 15 మందిని కేబినెట్లో చేర్చుకున్నారు. వీరిలో ఏడుగురు కొత్త మంత్రులు ఉన్నారు. మంత్రులతో పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ప్రమాణ స్వీకారం చేయించారు. మరో ఐదు నెలల్లో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం చన్నీ మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమతూకం పాటించినట్లు స్పష్టమవుతోంది. కెప్టెన్ అమరీందర్ సింగ్ మంత్రివర్గంలో పనిచేసిన పలువురికి మరోసారి అవకాశం కల్పించారు. బ్రహ్మ మోహింద్రా, మన్‌ప్రీత్‌సింగ్ బాదల్, త్రిప్త్ రాజీందర్‌సింగ్ బాజ్వా, అరుణా చౌదరీ, సుఖ్బీందర్ సింగ్ సర్కారియా, రజియా సుల్తానా, విజయిందర్ సింగ్, భరత్ భూషణ్ అషూ, రాణా గుర్జీత్ సింగ్ తదితరులు మరోసారి మంత్రులయ్యారు. అమరీందర్‌సింగ్‌కు గట్టి మద్దతుదారులుగా పేరున్న రాణా గుర్మిత్ సింగ్ సోదీ, సాధు సింగ్ ధరంసోత్, బల్బీర్‌సింగ్ సిద్దూ, గురుప్రీత్‌సింగ్ కంగర్, సుందర్‌శామ్ అరోరాకు ఈసారి నిరాశే ఎదురయ్యింది. తమను పక్కనపెట్టడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము చేసిన తప్పేమిటో చెప్పాలని కాంగ్రెస్ నాయకత్వాన్ని నిలదీశారు. ఈ ఐదుగురు అమరీందర్‌కు అత్యంత సన్నిహితులు. చదవండి: (కాంగ్రెస్‌లోకి కన్హయ్య, జిగ్నేష్.. ముహుర్తం ఖరారు) అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు పంజాబ్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హరీష్ రావత్ ప్రయత్నించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ నామినేటెడ్ పదవులు కట్టబెడతామని ఊరడించారు. సామాజిక, ప్రాంతీయ సమతూకం పాటిస్తూ మంత్రివర్గంలో యువతకు పెద్దపీట వేసినట్లు తెలిపారు. పంజాబ్ ఉప ముఖ్యమంత్రులుగా సుఖ్జిందర్ సింగ్ రంధావా, ఒ.పి.సోనీ గత సోమవారమే ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో నిబంధనల ప్రకారం మొత్తం 18 మంది మంత్రులు ఉండాలి. తాజా విస్తరణతో సీఎంతో కలిపి మంత్రుల సంఖ్య 18కి చేరింది. చదవండి: (ఎన్నికల ప్రేమకథ) Congress MLAs Brahm Mohindra and Manpreet Singh Badal take oath as Cabinet ministers of Punjab Govt, at Raj Bhavan in Chandigarh pic.twitter.com/hbInrGHcNG — ANI (@ANI) September 26, 2021 -
పంజాబ్ నూతన సీఎంగా చరణ్‌జీత్ సింగ్ చన్నీ
చండీగఢ్: పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జీత్ సింగ్ చన్నీకి అవకాశం దక్కింది. ఆదివారం సమావేశమైన కాంగ్రెస్ శాసన సభా పక్షం సీఎంగా చన్నీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ మేరకు పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి హరీష్ రావత్ ట్విటర్లో వెల్లడించారు. చన్నీకి సీఎం బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. చదవండి: Amarinder Singh: కెప్టెన్ కథ కంచికి చేరిందిలా! ఇక తాజా మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్.. పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య విభేదాల కారణంగా రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి తలెత్తిన సంగతి తెలిసిందే. మరోవైపు అధిష్టానం కూడా కెప్టెన్ రాజీనామాకే మొగ్గు చూపిందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ శనివారం రాజీనామా చేశారు. ఆయనతో పాటు మంత్రులు కూడా గవర్నర్‌కు రాజీనామా సమర్పించగా ఆయన ఆమోదించారు. చరణ్ జీత్ సింగ్ చన్నీ దళిత వర్గానికి చెందిన నేత. తొలుత సుఖ్జీందర్ సింగ్ రాంద్వాను పంజాబ్ సీఎంగా నియమించాలని భావించినా కాంగ్రెస్‌కు నవజ్యోత్‌సింగ్ సిద్దూ వర్గం నుంచి వ్యతిరేకత రావడంతో తిరిగి పునరాలోచనలు చేయాల్సి వచ్చింది. It gives me immense pleasure to announce that Sh. #CharanjitSinghChanni has been unanimously elected as the Leader of the Congress Legislature Party of Punjab.@INCIndia @RahulGandhi @INCPunjab pic.twitter.com/iboTOvavPd — Harish Rawat (@harishrawatcmuk) September 19, 2021 చదవండి: సిద్దూ వర్సెస్ అమరీందర్, రాజీనామా బాటలో సీఎం? -
రాహుల్ బాటలో మరో కీలకనేత గుడ్‌బై
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్‌గా రాహుల్ గాంధీ వైదొలిగిన మరుసటి రోజు అసోం కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్టు మరో కీలక నేత హరీష్ రావత్ ప్రకటించారు. పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు అసోంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా వ్యవహరించిన హరీష్ రావత్ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రిగా హరీష్ రావత్ పనిచేసిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో అసోంలోని లోక్‌సభ ఎన్నికల్లో 14 లోక్‌సభ స్థానాలకు గాను, కేవలం మూడింటిని మాత్రమే కాంగ్రెస్ గెలుచుకొంది. దీంతో హరీష్ రావత్ అస్సాం ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయనున్నట్లు గురువారం ట్విటర్ వేదికగా వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయానికి తానే బాధ్యుడినని పేర్కొంటూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గురువారం పేర్కొన్న సంగతి తెలిసిందే. తన రాజీనామాను తక్షణమే ఆమోదించి తదుపరి అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ చేపట్టాలని ఆయన పార్టీ శ్రేణులకు రాసిన నాలుగు పేజీల బహిరంగ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు నూతన అధ్యక్షుడి ఎంపిక చేపట్టేవరకూ పార్టీ తాత్కాలిక చీఫ్‌గా మోతీలాల్ వోరాను కాంగ్రెస్ పార్టీ నియమించింది. -
అంచనాలు మించి కమల వికాసం!
ఉత్తరాఖండ్‌లో బీజేపీ అంచనాలను మించి భారీ విజయాన్ని అందుకుంది. ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకి కనిష్ఠంగా 29 నుంచి గరిష్ఠంగా 53 స్థానాల వరకు రావొచ్చని పేర్కొనగా.. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బీజేపీ 56 స్థానాల్లో గెలుపొందింది. ఒక స్థానంలో ఆధిక్యం కనబరుస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. దీంతో ఉత్తరప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్‌లో కూడా మోదీ ప్రజాదరణ స్పష్టంగా కనిపించినట్లయింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమి పాలయ్యారు. హరిద్వార్ రూరల్ నుంచి తొలుత ఫలితం వచ్చింది. అక్కడ ఓడిపోయిన రావత్.. ఆ తర్వాత ఫలితం వెలువడిన కిచ్చా నియోజకవర్గంలో కూడా ఓటమి చవిచూడక తప్పలేదు. పర్వతప్రాంతమైన ఉత్తరాఖండ్‌లో ప్రతిసారీ ఎన్నికలు జరిగినప్పుడల్లా ప్రభుత్వాలు మారుతుండటం సర్వసాధారణం. ఈసారి కూడా అలాగే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో అధికారం చేపట్టాలంటే కనీసం 36 స్థానాలు అవసరం అవుతాయి. ప్రస్తుత అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 32 స్థానాలు ఉండగా, బీజేపీకి 31, బీఎస్పీకి 3, ఉత్తరాఖండ్ క్రాంతి దళ్‌కు ఒకటి, స్వతంత్రులు ముగ్గురు ఉన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ మీద అనేక అవినీతి ఆరోపణలు రావడంతో పాటు స్వయంగా ముఖ్యమంత్రి హరీష్ రావత్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాంతో ఈసారి అక్కడ బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఈసారి బీజేపీకి కనిష్టంగా 29, గరిష్టంగా 53 వరకు స్థానాలు వస్తాయని వివిధ సర్వే సంస్థలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ 15 నుంచి 30 స్థానాల లోపు పరిమితం అవుతుందని చెప్పాయి. దానికి తగినట్లుగానే ఆధిక్యాలు కూడా కనిపిస్తున్నాయి. -
ఉత్తరప్రదేశ్:భారీ విజయం దిశగా బీజేపీ
-
పట్టణాల్లో బీజేపీ, పల్లెల్లో కాంగ్రెస్!
ఉత్తరాఖండ్ ఎన్నికల సరళి బీజేపీకి స్వల్ప ఆధిక్యం! డెహ్రాడూన్ నుంచి కె. రామచంద్రమూర్తి: హోరాహోరీగా సాగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో విపక్ష బీజేపీ స్వల్ప ఆధిక్యాన్ని కనబరిచే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అధికార కాంగ్రెస్ కొంత ఆధిక్యాన్ని సాధించే అవకాశముంది. 2012 ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో అధికంగా నమోదైన 2 శాతం పోలింగ్ కమలదళానికి కలసిరావొచ్చు. రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగాను బీజేపీ 30కిపైగా సీట్లు సాధిస్తే అదంతా మోదీ చలవేనని చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న గోవా, మణిపూర్‌లు చిన్న రాష్ట్రాలు కావడం, ఉత్తరప్రదేశ్ ఫలితం అనిశ్చితిలో ఉండడం, పంజాబ్‌లో అకాలీ–బీజేపీ కూటమికి విజయావకాశాలు సన్నగిల్లడంతో ఉత్తరాఖండ్ ఒక్కటే బీజేపీకి ఆశాకిరణంగా మారింది. ఉత్తరాఖండ్ చిన్న రాష్ట్రమన్న సంగతిని పట్టించుకోకుండా మోదీ ఏకంగా ఐదు సభల్లో ప్రచారం చేశారు. పార్టీ అధినేత అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు కూడా రాష్ట్రమంతటా సుడిగాలి ప్రచారం చేశారు. అయితే అంతర్గత కుమ్ములాటలు కాషాయదళాన్ని చీకాకు పెడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి గోడదూకి వచ్చిన 14 మందికి టికెట్లు ఇవ్వాల్సి రావడంతో చిచ్చు రాజుకుంది. రెబల్స్ పోటీకి దిగడం వీరి విజయానికి ప్రమాదంగా మారింది. బీజేపీ భవితవ్యాన్ని రెండు అంశాలు ప్రధానంగా ప్రభావితం చేసే అవకాశముందని ఓ స్థానిక టీవీ చానల్లో పనిచేసే సీనియర్ పాత్రికేయుడు అవికల్ థాపాలియాల్ చెప్పారు. మొదటి అంశం.. 12 మందికిపైగా రెబల్ అభ్యర్థులు గెలిచే అవకాశం లేకపోయినా వారు బీజేపీ అభ్యర్థుల విజయావకాశాలను భారీగా దెబ్బతీసే అవకాశముంది. బీజేపీ ఈ తిరుగుబాటును ఎలా అధిగమించగలదు? రెండో అంశం.. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడం. క్లీన్ ఇమేజ్ ఉన్న బీసీ ఖండూరీని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే పరిస్థితి పార్టీకి అనుకూలంగా మారేది. అయితే 75 ఏళ్లు దాటిన వారిని ఎన్నికల గోదాలో దింపకూడదన్న పార్టీ నియమం ప్రకారం ఖండూరీపై పార్టీ నాయకత్వం మొగ్గుచూపలేదు. ఒంటరి యోధుడు రావత్.. కాంగ్రెస్ ప్రచారమంతా సీఎం హరీశ్ రావత్ చేతుల మీదుగానే సాగుతోంది. ప్రభుత్వ బాధ్యతలను, పార్టీ బాధ్యతలను ఆయనొక్కడే మోస్తూ బీజేపీకి దీటుగా ప్రచారం చేశారు. గత ఏడాది మార్చిలో ద్రవ్య బిల్లుకు సొంత పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటేసినప్పటి నుంచి ఆయన ప్రభుత్వం ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. మొత్తంగా చూస్తే ఆయన రాష్ట్ర ప్రగతి కోసం కొంత శ్రమించారనే చెప్పాలి. అయితే మోదీ ప్రభంజనాన్ని తట్టుకుని నిలవగలరో లేదో ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి. తమ పార్టీకి 45కు తగ్గకుండా సీట్లొస్తాయని రావత్ డెహ్రాడూన్‌లో ఈ పాత్రికేయుడితో ధీమాగా చెప్పారు. బీజేపీ తరఫున సీఎం రేసులో ఉన్న త్రివేంద్రసింగ్ రావత్ కూడా తమ పార్టీకి 35కుపైగా సీట్లు వస్తాయని అన్నారు. సీఎం సీటు చుట్టూ ఆ ఆరుగురు ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి ‘సీఎం’ రాజకీయాలు ఆరుగురి చుట్టే తిరుగుతున్నాయి. 2000లో రాష్ట్రం అవతరించినప్పుడు బయటి(హరియాణాలో జన్మించిన) వాడైన నిత్యానంద స్వామి.. వాజ్‌పేయి, అడ్వాణీల ఆశీర్వాదంతో సీఎం అయ్యారు. తర్వాత భగత్ సింగ్ కోషియారీ.. స్వామి ప్రభుత్వాన్ని అస్థిరపరచి తాత్కాలిక సీఎం పగ్గాలు అందుకున్నారు. 2002లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్ రావత్ సారథ్యంలో కాంగ్రెస్ గెలిచింది. అయితే ముఠాకక్షలు ఆయన్ను సీఎం పదవికి దూరం చేశాయి. ఎన్డీ తివారీ ఆ పీఠంపై అధిష్టించారు. రావత్ నుంచి తీవ్ర అసమ్మతి ఎదుర్కొంటూనే హైకమాండ్ అండతో పూర్తికాలం(2002–2007) పదవిలో కొనసాగారు. 2007లో బీజేపీ విజయంతో సీఎం అయిన బీసీ ఖండూరీకీ స్వపక్షం నుంచి అసమ్మతి సెగ తగలింది. కోషియారి, రమేశ్ పోఖ్రియల్ నిశాంక్‌ల వ్యతిరేకత ఫలితంగా ఖండూరీ 2009లో గద్దె దిగారు. సీఎం పీఠమెక్కిన నిశాంక్ అవినీతి ఆరోపణల ఫలితంగా 2011లో పదవి కోల్పోగా, ఖండూరీ మళ్లీ పగ్గాలు అందుకున్నారు. 2012 ఎన్నికల్లో రావత్ కృషితో కాంగ్రెస్ గెలిచినా అధికారం మాత్రం విజయ్ బహుగుణకు దక్కింది. 2013 నాటి భారీ వరదల తర్వాత పరిస్థితిని చక్కదిద్దడంతో విఫలమయ్యాడంటూ అధిష్టానం ఆయన్ను తప్పించి రావత్‌కు సీఎం పగ్గాలు అప్పగించింది. 2016 మార్చిలో అసెంబ్లీలో ద్రవ్యబిల్లుపై ఓటింగ్ జరగ్గా బహుగుణ వర్గంలోని 9 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటేశారు. రావత్ బలవంతంగా సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎమ్మెల్యే పదవికి రెబల్స్ అనర్హులని సుప్రీం కోర్టు తేల్చడంతో మే నెలలో రావత్ అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకున్నారు. -
వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే...
► కాంగ్రెస్–ఎస్పీ పొత్తుపై మోదీ విమర్శలు ► యూపీలో అచ్చేదిన్ రాలేదంటే దానికి బాధ్యత అఖిలేశ్‌దే.. బదౌన్ (ఉత్తరప్రదేశ్): తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్రంలో ఇరు పక్షాలు జతకట్టాయని సమాజ్‌వాదీ–కాంగ్రెస్ పార్టీల పొత్తుపై ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘అఖిల్శ్.. అచ్చేదిన్ (మంచిరోజులు) ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు. గత ఐదేళ్లుగా ఆయనే యూపీ సీఎం. మంచిరోజులు రాలేదని ప్రజలు ఆయనతో చెపుతున్నారంటే.. దానికి బాధ్యత ఆయనదే. దీనికి బీఎస్పీ, కాంగ్రెసూ కారణమే’’అని అచ్చేదిన్ హామీపై వెల్లువెత్తిన విమర్శలకు బదులిచ్చారు. అఖిలేశ్ చెపుతున్న ‘కామ్ బోల్తా హై(పనే మాట్లాడుతుంది)’ నినాదం పంక్చర్ అవుతుందని, ఆయన చెపుతున్న మాటలు రాష్ట్రంలోని చెడునంతా ప్రజల కళ్లముందు ఉంచుతున్నాయన్నారు. శనివారం బదౌన్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. మాయావతి ప్రభుత్వం అవినీతి మయమని, దోషులుగా తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన అఖిలేశ్ ఇప్పుటి వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఏ విషయంలోనూ మాయావతి, ములాయం ఒక్కటి కారని, కానీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తనపై కోపంతో వారిద్దరూ ఏకమయ్యారన్నారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి జరుగుతున్న అవినీతి కారణంగా.. యూపీలో నిజాయితీ కలిగిన, అన్ని అర్హతలు ఉన్న ప్రజలు ఉద్యోగాలు పొందలేకపోతున్నారని చెప్పారు. అభివృద్ధి కోసం బీజేపీకి ఓటేయండి రుద్రపూర్: ఉత్తరాఖండ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న రాజకీయ సంకల్పం లేదని మోదీ విమర్శించారు. రాష్ట్ర ప్రగతి కోసం బీజేపీకి ఓటేయాలని రుద్రపూర్‌లో జరిగిన సభలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కెమెరాల ముందు కూడా భయం లేకుండా లంచం తీసుకునే ‘బాహుబలి’లాంటి రాజకీయ నేతలను రాష్ట్రం వదిలించుకోవాలంటూ సీఎం హరీశ్ రావత్‌కు సంబంధించిన స్టింగ్ ఆపరేషన్ వీడియోను మోదీ ప్రస్తావించారు. -
ఈ బాహుబలిని చూస్తే రాజమౌళి కూడా షాకే!
డెహ్రాడూన్: త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు ప్రజల ఓట్లను తమ బుట్టలో వేసుకునేందుకు వీలైన అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయోగాలకు కూడా దిగుతున్నారు. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి విజయం దక్కుతుందన్న ఎగ్జిట్ పోల్స్ మహత్యమో లేక ప్రధాని మోదీకి ధీటుగా తామెం ప్రచారంలో తక్కువకాదని నిరూపించుకునో ప్రయత్నమో మొత్తానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నేత హరీశ్ రావత్ బాహుబలి అవతారం ఎత్తారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బాహుబలి ఎంతటి క్రేజ్ సంపాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో ‘ఎవ్వరంట.. ఎవ్వరంట నిన్ను ఎత్తుకుంది’ అనే పాట మేకింగ్ ఎప్పటికీ వండర్. సినిమాలోని హీరోయిజం మొత్తం ఈ ఒక్కపాటతోనే అర్థమవుతుంది. ఈ గీతం బ్యాక్ గ్రౌండ్‌తోనే ఇప్పుడు బాహుబలి 2 పేరిట ఉత్తరాఖండ్‌లో ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో బాహుబలి హరీశ్ రావత్ కావడం విశేషం. దీన్ని స్వయంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ సిద్ధం చేసి విడుదల చేయగా హరీశ్ రావత్ తన సోషల్ మీడియా ఖాతా నుంచి షేర్ చేశారు. ఈ వీడియో జనాలను కనురెప్పవేయనివ్వడం లేదంటే నమ్మండి. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే.. ఉత్తరాఖండ్ పోరాట యోధుడు హరీశ్ రావత్ అని టైటిల్ పడుతుండగా పాట మొదలవుతుంది. అక్కడి ప్రసిద్ధమైన ప్రాంతాల చిత్రాలు వేగంగా వచ్చి వెళతాయి. అనంతరం బాహుబలిగా హరీశ్ రావత్ కనిపిస్తారు. ఆయనకు ఎదురుగా ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉంటుంది. బాహుబలిలో ప్రభాస్ శివలింగాన్ని ఎలా ఎత్తుకుంటాడో అతడిని మించిన స్థాయిలో ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ హరీశ్ కూడా ఉత్తరాఖండ్ భాగాన్ని తన భుజాలకు ఎత్తుకుంటాడు. అది చూసి అమిత్ షా అవాక్కవుతాడు. కొసమెరుపేంటంటే ఒరిజినల్ బాహుబలిలో సాధువుగా కనిపించిన తనికెళ్ల భరణి ప్రభాస్ శివలింగం అమాంతం ఎత్తుకొని భుజాన పెట్టుకున్నప్పుడు ఎంతగా సమ్మోహితుడై అవాక్కవుతాడో ఆయన స్థానంలో ప్రధాని మోదీ కనిపిస్తూ అంతే ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు. ఒక్క ముఖాలను ఎడిట్ చేసి రూపొందించిన ఈ వీడియో చూపరులను కట్టిపడేస్తోంది. -
ఈ బాహుబలిని చూస్తే రాజమౌళి కూడా షాకే!
-
‘ఫిట్‌గా ఉన్నా, ఎన్నికలకు రెడీ’
డెహ్రడూన్: తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ తెలిపారు. మెడ సంబంధమైన సమస్యలు ఉన్నప్పటికీ, సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలో జరగనున్న ఎన్నికలను వెళతానని చెప్పారు. మెడనొప్పితో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఈ సందర్భంగా ఆస్పత్రి దగ్గర ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను ఫిట్‌గా ఉన్నానని ఉన్నానని అన్నారు. మార్చి 26న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 70 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. తాను రెండు స్థానాల్లో పోటీ చేయాలని హరీశ్ రావత్ భావిస్తున్నారు. కుమావ్, గర్వాల్ స్థానాల్లో బరిలోకి దిగాలని ఆయన యోచిస్తున్నారు. రెండు సీట్లలో పోటీ చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చిన్నరాష్ట్రమైన ఉత్తరాఖండ్ ఒకే వ్యక్తి రెండు సీట్లలో పోటీ చేయడం సమంజసం కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. -
పాంచ్ పటాకా
ఈ ఏడాది ఆరంభంలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు - పోరుకు సిద్ధమైన యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా - బీజేపీ అగ్ర నాయకత్వానికి యూపీ రూపంలో అగ్ని పరీక్ష - నోట్ల రద్దు ప్రభావమెంత ఉంటుందనే అంచనాలు - 2014 లోక్‌సభ ఎన్నికల ప్రదర్శనను బీజేపీ పునరావృతం చేయగలదా? పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిక్షణ కేంద్రాలపై సర్జికల్ దాడులు, ఉగ్రవాదుల చొరబాట్లు, దాడులు, భారత జవాన్ల ఆత్మత్యాగం, నోట్ల రద్దుతో నెలకొన్న గందరగోళం, రాజకీయ పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలతో వాతావరణం వేడెక్కి ఉన్న నేపథ్యంలో.. దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. కీలకమైన ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో 2017 జనవరి ఆఖరు నుంచి మార్చి మొదటి వారం వరకు ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ జనవరి తొలివారంలో వెలువడుతుందని భావిస్తున్నారు. యూపీలో ఎస్పీ, ఉత్తరాఖండ్, మణిపూర్లలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా... గోవాలో బీజేపీ, పంజాబ్‌లో అకాలీ–బీజేపీ సంకీర్ణం పాలకపక్షాలుగా ఉన్నాయి. మొత్తంగా ఈ ఎన్నికల పోలింగ్ సమయానికి ప్రధాని మోదీ ప్రభుత్వానికి దాదాపు మూడేళ్లు నిండుతాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయాలు నమోదు చేసుకున్న కారణంగా యూపీలో గెలుపు బీజేపీకి అత్యవసరం. దేశంలోని మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలకుగాను 102 నియోజకవర్గాలున్న ఈ ఐదు రాష్ట్రాల్లో కాషాయ పార్టీ సాధించే ఫలితాలను మోదీ పనితీరుకు గీటురాయిగా పరిగణించే అవకాశముంది. ఈ అంశంపై ఈ వారం ఫోకస్.. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ ఎస్పీతో కాంగ్రెస్ పొత్తు కుదిరితే? ములాయం కుటుంబంలో రాజీ, నోట్ల రద్దు ప్రకటించాక కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు కుదుర్చుకోవాలనే ప్రతిపాదన రెండు పార్టీల్లో వచ్చింది. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌కు సలహాలిస్తున్న ఎన్నికల నిపుణుడు ప్రశాంత్ కిశోర్ ములాయంను కూడా కలిశారు. అయితే పొత్తు ఉండదని కాంగ్రెస్ ఎంపీ రాజ్‌బబ్బర్ ప్రకటించారు. అఖిలేశ్ మాత్రం ఎస్పీ ఒంటిరిగా పోటీచేసినా మెజారిటీ వస్తుందని, కాంగ్రెస్‌తో కలసి పోటీచేస్తే 300 సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు. కాంగ్రెస్‌కు ఎస్పీ 40 సీట్లు ఇవ్వజూపగా, కాంగ్రెస్ కనీసం వంద సీట్లు కావాలంటోందని వార్తలొచ్చాయి. 1996 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి బీఎస్పీతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకుని 126 సీట్లకు పోటీ చేసింది. కానీ ఆ ఎన్నికల్లో రెండు పార్టీలకు కలిపి వంద సీట్లు (బీఎస్పీకి 67, కాంగ్రెస్‌కు 33) దాటలేదు. అయితే యూపీలో 1989 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయాక మళ్లీ ఇప్పటి వరకూ అధికారంలోకి రాలేదు. జనతాదళ్, బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ, బీజేపీ నాయకత్వంలో సంకీర్ణ, ఏకపార్టీ ప్రభుత్వాలే పాలించాయి. ఈ కాంగ్రెసేతర సర్కార్ల పాలనను ఎండగడుతూ కాంగ్రెస్ ‘27 సాల్.. బేహాల్ (27 ఏళ్లలో అంతా అస్తవ్యస్తం)’ అనే నినాదంతో ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు? బీజేపీ ఇంతవరకూ ఏ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బ్రాహ్మణ నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదు. లోపాయికారీగా ప్రచారమూ చేయలేదు. అందుకే ఈసారి పశ్చిమ యూపీకి చెందిన కేంద్ర మంత్రి మహేష్‌కుమార్ శర్మను సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఢిల్లీ పక్కనున్న నోయిడాలో ఆయన పేరున్న వైద్యుడు. గౌతంబుద్ధనగర్ ఎంపీ. కైలాశ్ హాస్పిటల్స్ పేరిట ఆయనకు గొలుసుకట్టు ఆస్పత్రులున్నాయి. ఐదుసార్లు గోరఖ్‌పూర్ నుంచి ఎంపీగా ఎన్నికైన యోగి ఆదిత్యనాథ్, వరుణ్‌గాంధీ తదితరులు సీఎం పదవిని ఆశిస్తున్నారు. వారి అనుచరులు పలు సందర్భాల్లో పోస్టర్ల ప్రచారం కూడా సాగించారు. అకాలీ–బీజేపీ సంకీర్ణానికి కష్టకాలం! పంజాబ్ పంజాబ్ 15వ అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల క్రితమే వేడి ప్రారంభమైంది. 1997 నుంచీ అంటే దాదాపు 20 ఏళ్లుగా పంజాబ్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఇద్దరే జాట్ సిక్కు నేతలు సొంతం చేసుకున్నారు. వారు కాంగ్రెస్ మాజీ సీఎం కెప్టెన్ అమరీం దర్ సింగ్, ప్రస్తుత అకా లీ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్. మరో విశేషమేమంటే శిరోమణి అకాలీదళ్–బీజేపీ సంకీర్ణ సర్కారు సీఎంగా వరుసగా రెండోసారి బాదల్ 2012 నుం చీ ఉన్నారు. అంటే పదేళ్ల సుదీర్ఘ అకాలీ–బీజేపీ పాలన కు మూడోసారి జనం ఆమోదముద్ర వేస్తారా? లేక కాంగ్రెస్, కొత్తగా దూసుకొచ్చిన ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)ల్లో ఒకదానికి అవకాశం కల్పిస్తారా? అనే ప్రశ్నలకు జనవరిలో జరిగే ఎన్నికల్లో జవాబు లభించనుంది. 117 ని యోజకవర్గాల్లోని దాదాపు కోటీ 96 లక్షల మంది ఓటర్లు కీలకమైన తీర్పు ఇవ్వబోతున్నారు. ఆర్థిక సంస్కరణల వల్ల సంపద పెరిగినా.. పంజాబ్‌కు వెన్నుపూస లాంటి వ్యవసాయ రంగం కుదేలైంది. మాదకద్రవ్యాల వినియోగం మితిమీరిపోయింది. పట్టణ ప్రాంతాల నుంచి పల్లెలకూ ఈ ‘మత్తు’ మహమ్మారి విస్తరించింది. ఈ నేపథ్యంలో దాదాపు 46 ఏళ్లుగా పంజాబ్‌లో పాలక కుటుంబంగా మారిన బాదల్‌ల ఆధిపత్యానికి వచ్చే ఎన్నికలు తెరదింపుతాయనే భావిస్తున్నారు. కాంగ్రెస్, అకాలీ–బీజేపీ కూటమి ఇలా రెండు రాజకీ య పక్షాలకు అధికారం అప్పగించే అలవాటు నుంచి ప్రజలు బయటపడడానికి ఆప్ అవకాశం ఇస్తోంది. మాదకద్రవ్యాల వ్యా పారం వెనుక పాలకపార్టీకి సంబంధం ఉం దనే ఆరోపణలు, బాదల్ కుటుంబ సభ్యులౖ పె వస్తున్న అవినీతి ఆరోపణలు అకాలీ–బీజేపీ కూటమిని ఆందోళనకు గురిచేస్తున్నా యి. బీజేపీ మాజీ ఎంపీ నవజ్యోత్‌సింగ్ సిద్ధూ కాషాయపార్టీని వీడి.. ఎటుపోవాలో తేల్చుకోలేక చివరికి కాంగ్రెస్ పక్షాన చేరారు. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఆప్ నాలుగు సీట్లు కై వసం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. సర్వేలేం చెబుతున్నాయి..? ఈ ఏడాది అక్టోబర్‌లో వెలువడిన ఇండియాటుడే–యాక్సిస్ సర్వే ఫలితాలు పాలక అకాలీ కూటమికి ఘోర పరాజయం తప్పదని సూచిస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ 49–55 సీట్లతో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించవ చ్చు. సాధారణ మెజారిటీకి 59 సీట్లు అవసరం. ఆప్ 42–46 సీట్లతో రెండో స్థానంలో ఉందని సర్వే తెలిపింది. పాలక అకాలీ–బీజేపీ కూటమి కేవలం 17–21 సీట్లతో భారీ ఓటమి ఎదుర్కోబోతోందని వివరించింది. ఏదేమైనా 1970లో 43 ఏళ్ల వయసులో తొలిసారి సీఎం అయిన ప్రకాశ్‌సింగ్ బాదల్ ఆరోసారి సీఎం పదవిని 2017 మార్చిలో చేపట్టడం సాధ్యమయ్యే విషయం కాకపోవచ్చు. యూపీ.. లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనలా..? ఉత్తర్‌ప్రదేశ్ దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. 20 కోట్లకుపైగా జనాభా, 80 లోక్‌సభ స్థానాలు, 403 అసెంబ్లీ సీట్లున్న యూపీ.. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ రాష్ట్ర అసెంబ్లీకి 17వ ఎన్నికలు మూడు నెలల్లోపు జరుగనున్నాయి. మరోవైపు 2014లో బీజేపీ చరిత్రలోనే తొలిసారిగా సొంత మెజారిటీ (282 సీట్లు)తో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితికి చేరుకుంది (మిత్రపక్షాలను కలుపుకొని ఎన్డీయే సంకీర్ణ సర్కారు కొలువుదీరింది). యూపీలో ఏకంగా 71 లోక్‌సభ సీట్లు గెలవడమే బీజేపీకి ఈ స్థాయి విజయాన్ని అందించింది. బీజేపీ బలహీనంగా ఉందని భావించిన తూర్పు యూపీలో గెలుపు కోసం ప్రధాని మోదీ వారణాసి నుంచి కూడా పోటీచేసి విజయం సాధించారు. కిందటి రెండు సార్లు (2007, 2012) జరిగిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు యూపీ శాసనసభ ఎన్నికలు పార్లమెంటు ఎన్నికలకు ‘సెమీఫైనల్’ అంటూ రాజకీయ వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. కానీ వాస్తవానికి లోక్‌సభ ఎన్నికలకు రెండేళ్ల ముందు జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలు జాతీయ ఎన్నికల (పార్లమెంటు) ఫలితాలను ప్రభావితం చేయలేదని గత అనుభవాలే చెబుతున్నాయి. 2012లో జరిగిన యూపీ ఎన్నికలను కూడా మీడియా ఇలాగే లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనలంటూ అభివర్ణించింది. అందులో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) తొలిసారి మెజారిటీ సీట్లు (224) సాధించి అధికారంలోకి వచ్చింది. ప్రధాన ప్రతిపక్షం బీఎస్పీ 80 సీట్లు సాధించగా.. బీజేపీ 47 సీట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. 28 స్థానాలతో కాంగ్రెస్ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే రెండేళ్ల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఫలితాలకు పొంతన లేని ఫలితాలొచ్చాయి. 71 లోక్‌సభ సీట్లతో బీజేపీ అగ్రస్థానంలో నిలబడింది. ఎస్పీ ఐదు సీట్లు, కాంగ్రెస్ రెండు సీట్లే గెలుచుకున్నాయి. 80 అసెంబ్లీ స్థానాలు తెచ్చుకున్న బీఎస్పీకి ఒక్క లోక్‌సభ సీటూ దక్కలేదు. ఇప్పటి పరిస్థితి ఏమిటి? కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చాక.. యూపీలో, దేశంలో సంభవించిన పరిణామాలు, ఎస్పీ కొత్త సీఎం అఖిలేశ్ యాదవ్ పాలన, ములాయం పరివారంలో కీచులాటలు వంటివి ఏ మేరకు ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికలను ప్రభావితం చేస్తాయో చూడాల్సి ఉంది. డిసెంబర్ 30న కుమారుడు అఖిలేశ్, సోదరుడు రాంగోపాల్‌ను ములాయం ఆరేళ్ల పాటు బహిష్కరించారు. 24 గంటలు గడవకుండానే 31న మధ్యాహ్నం ఈ నిర్ణయాన్ని రద్దుచేసుకుని సంచలనం సృష్టించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ములాయం కుటుంబ సభ్యులంతా కలిసే బీజేపీపై పోరాడుతారని ములాయం తమ్ముడు శివపాల్‌సింగ్ ప్రకటించడం గమనార్హం. నవంబర్ రెండో వారం నుంచి డిసెంబర్ 30 వరకూ 50 రోజులు అమలు చేసిన నోట్ల రద్దు ప్రక్రియ ఫలితంగా జనం ఎటు తీర్పిస్తారనే విషయం అనూహ్యంగా కనిపిస్తోంది. లోక్‌సభ ఫలితాలే పునరావృతమవుతాయా? యూపీ ప్రత్యేక పరిస్థితులను పక్కనబెడితే... 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. అయితే యూపీ ప్రజలు కేంద్రంలో పదేళ్లు రాజ్యమేలిన కాంగ్రెస్ కూటమిని ఓడించడానికి, మోదీని ప్రధానిని చేయడానికే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేశారనే విశ్లేషణలున్నాయి. మరోవైపు కొన్ని నెలల కిందటి ఓ సర్వేలో.. అధికార సమాజ్‌వాదీ పార్టీ ఈసారి మెజారిటీ సాధించకున్నా, అత్యధిక సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా నిలుస్తుందని వెల్లడైంది. తర్వాత జరిపిన సర్వేల్లోనూ సమాజ్‌వాదీ వెనుకబడినట్లు తేలింది. ములాయం కుటుంబంలో రేగిన చిచ్చు, సమాజ్‌వాదీలో పెచ్చరిల్లిన కీచులాటల తర్వాత జరిపిన సర్వేలో మాత్రం బీజేపీ 170 నుంచి 183 సీట్లతో పాలకపక్షంగా మారే వీలుందనే అంచనాలు వేశాయి. ‘పరివార్’ కీచులాటలు బీజేపీకి లాభిస్తాయా? కిందటేడాది జనతా పరివార్ పార్టీలు ఎస్పీ, జేడీయూ, ఆర్జేడీ, జేడీఎస్లవిలీనం ప్రయత్నాలకు ఎస్పీ నేత ములాయం గండికొట్టారు. అంతేకాదు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ–జేడీయూలు కాంగ్రెస్‌తో కలసి మహా కూటమి పేరుతో బీజేపీపై పోరుకు సిద్ధమైనపుడు.. సీట్ల పంపకాన్ని నిరసిస్తూ ఎస్పీ విడిగా పోటీచేసింది. దీంతో పరోక్షంగా బీజేపీకి మేలు చేయడానికి ప్రయత్నించిందనే ఆరోపణలు ఎదుర్కొంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని యూపీ ఎన్నికల్లో ఆర్జేడీ–జేడీయూ కూటమి విడిగా పోటీచేస్తే ఎస్పీ కొంతమేర నష్టపోకతప్పదనే అభిప్రాయముంది. అఖిలేశ్‌పై వ్యతిరేకత లేదా? 2012 మార్చి 15న తండ్రి అనూహ్యంగా వేసిన ఎత్తుగడతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 38 ఏళ్ల అఖిలేశ్ యాదవ్ గత నాలుగున్నరేళ్లలో తండ్రి, చిన్నాన్నలు, ఆజంఖాన్ వంటి సీనియర్ మంత్రుల పెత్తనాన్ని భరిస్తూ పాలన సాగిస్తున్నారు. పాలనలో పూర్తి స్వేచ్ఛ లేకున్నా.. యువనేతగా ఆధునిక విధానాలు, పోకడలతో కావల్సినంత మంచి పేరే తెచ్చుకున్నారు. ఆగ్రా–లక్నో ఎక్స్‌ప్రెస్‌వే వంటి ప్రధాన నగరాలను కలిపే విశాలమైన రహదారులు, లక్నో మెట్రో వంటి భారీ ప్రాజెక్టులు అఖిలేశ్ చొరవతోనే ప్రారంభమయ్యాయి. వాటిలో కొన్ని పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కులం, మతంతో సంబంధం లేకుండా చదువుకున్న యువతరం, సామాజిక చైతన్యమున్న ప్రజానీకం మద్దతు అఖిలేశ్‌కే లభిస్తోందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ములాయం మాత్రం అఖిలేశ్ చేపట్టిన ప్రాజెక్టులు అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీని గెలిపించలేవని, వివిధ సామాజికవర్గాలను దగ్గర చేసుకుని ముందుకు సాగితేనే మంచిదని చెబుతున్నారు. సామాజిక సమీకరణాల్లో తన తమ్ముడు శివపాల్ యాదవ్‌ది అందెవేసిన చెయ్యని పొగుడుతూ, ఎన్నికల వ్యూహాల కోసం ఆయననే విశ్వసిస్తున్నారు. ఏ వర్గం ఓటు ఎటువైపు? రెండున్నరేళ్ల కింద జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ముస్లింలు మినహా మిగతా అన్ని వర్గాల ప్రజల్లో అత్యధిక శాతం బీజేపీకే ఓటేశారని పోలింగ్ అనంతర సర్వేలు సూచించాయి. అగ్రవర్ణాలతోపాటు యాదవేతర వెనుకబడిన వర్గాలు(బీసీలు), దళితులు బీజేపీ వైపు మొగ్గారు. దాదాపు పది శాతం జనాభా ఉన్న బ్రాహ్మణుల విషయానికి వస్తే... వారు ఓటేసినా, వేయకపోయినా వారి మద్దతుందని ప్రచారం జరిగిన పార్టీ లేదా కూటమికి ఎన్నికల్లో మేలు జరిగిన సందర్భాలే ఎక్కువ. బ్రాహ్మణ నేతనుæ సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటించినా, ప్రకటించకపోయినా వారి ఓటు ఈసారి కమలానికేనని ఇటీవల కొన్ని మీడియా సంస్థల సర్వేల్లో తేలింది. బీసీల్లో యాదవేతర బీసీల్లో 44 శాతం వరకూ ఓటు బీజేపీకేనని.. జనాభాలో 19 శాతమున్న ముస్లింలలో అధికశాతం ఎస్పీకి ఓటేస్తారని భావిస్తున్నారు. అయితే మాయవతి ఈసారి ముస్లిం ఓటు బ్యాంకుపై దృష్టి సారించి, ఇప్పటికే 125 సీట్లను ముస్లింలకు కేటాయించారు. ఇక జనాభాలో 21 శాతం ఉన్న దళితుల్లో అత్యధికులు అభిమానించేది బీఎస్పీనే. నోట్ల రద్దుతో ఎవరికి నష్టం? యూపీలో పన్నెండేళ్లుగా ప్రధాన పార్టీలుగా బలపడిన ఎస్పీ, బీఎస్పీలు అసెంబ్లీ ఎన్నికల కోసం పెద్ద మొత్తాల్లో డబ్బు సమకూర్చుకున్నాయనీ, నోట్ల రద్దుతో ఆ రెండు పార్టీలు కుదేలయిపోతాయని కొన్ని మీడియా సంస్థలు విశ్లేషిస్తున్నాయి. బీజేపీ కూడా ఈ ప్రచారానికి ఊతమిస్తోంది. అయితే నోట్ల రద్దుతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడగా.. ఉపాధి కోల్పోయిన అసంఘటిత రంగంలోని ప్రజలు బీజేపీ విషయంలో ఎలా స్పందిస్తారనేది ఫలితాలను తేల్చేస్తుందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. బీజేపీకి తొలి అవకాశం? మణిపూర్ ఈశాన్య రాష్ట్రాల్లో పెద్దదైన అస్సాంలో గత ఏప్రిల్‌లో తొలిసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఈసారి మణిపూర్‌లోనూ విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఇప్పటివరకూ ప్రాంతీయ పార్టీలే కాంగ్రెసేతర జాతీయ పార్టీలతో చేతులు కలిపి ఇక్కడ అధికారంలోకి వచ్చాయి. కాంగ్రెస్ సీఎంలలో తొలుత ఎక్కువ కాలం సీఎంగా ఉన్నది రిషాంగ్ కేషింగ్. ఆయన మొత్తం పదేళ్లు సీఎం పదవిలో ఉన్నారు. తర్వాత ప్రస్తుత కాంగ్రెస్ సీఎం ఓక్రం ఇబోబీ సింగ్ రాబోయే ఎన్నికల నాటికి 15 ఏళ్లు వరుసగా ముఖ్యమంత్రిగా ఉన్న నేతగా రికార్డుకెక్కుతారు. 60 సీట్లున్న మణిపూర్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే బీజేపీ కనీస మెజారిటీకి అవసరమైన 31 నుంచి 35 సీట్లు సాధిస్తుందని ఇండియాటుడే–యాక్సిస్ సర్వే అంచనా వేసింది. దశాబ్దంన్నరకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు 19–24 సీట్లు మించకపోవచ్చని పేర్కొంది. దాదాపు 42 శాతం హిందువులున్న మణిపూర్‌లో బీజేపీ గెలిస్తే ఈశాన్యంలో ఇది రెండో గెలుపవుతుంది. కేవలం రెండే లోక్‌సభ సీట్లు, 12 లక్షల మంది ఓటర్లే ఉన్నా.. ఇక్కడి గెలుపు ఈశాన్యంలో బీజేపీ బలోపేతం కావడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. సంప్రదాయం కొనసాగుతుందా? గోవా చిన్న రాష్ట్రం గోవాలో 40 అసెంబ్లీ సీట్లున్నాయి. జనాభా రీత్యా చిన్నదే అయినా పరిశ్రమలు, టూరిజం, భౌగోళిక స్థితిగతులు, చరిత్ర కారణంగా ఈ రాష్ట్రానికి రాజకీయ ప్రాధాన్యం ఉంది. కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పరీకర్ గోవా సీఎంగా మూడు సార్లు కలిపి ఆరున్నరేళ్లు పనిచేశారు. గోవా 1987లో రాష్ట్ర హోదా పొందడానికి ముందు కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది. ఆ సమయంలో మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ అనే ప్రాంతీయ పార్టీ అధికారంలో ఎక్కువ కాలం ఉంది. 1990ల రెండో భాగంలో బీజేపీ బలపడింది. గోవా పీపుల్స్ పార్టీ నేత ఫ్రాన్సిస్కో సార్డిన్హా బీజేపీ మద్దతుతో 1999 నవంబర్ ఆఖరు నుంచి 2000 అక్టోబర్ వరకూ సీఎంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించారు. ఆ తర్వాత పాలకపక్షంగా కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఆవిర్భవించింది. 2007 నుంచి బీజేపీ, కాంగ్రెస్ ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి రావడం ఆనవాయితీగా మారి గోవాలో రాజకీయ సుస్థిరతకు బాటలుపడ్డాయి. 2014 నవంబర్‌లో అప్పటి సీఎం పరీకర్ కేంద్ర మంత్రివర్గంలో చేరాక మరాఠా కుటుంబంలో జన్మించిన లక్ష్మీకాంత్ పర్సేకర్ గోవా సీఎం అయ్యారు. ఈ రాష్ట్ర ఆరెస్సెస్ విభాగంలో కీచులాటలు పెరిగినా.. బీజేపీ పాలనపై జనంలో వ్యతిరేకత రాలేదని ఇటీవలి సర్వేలు చెబుతున్నాయి. మెజారిటీ రాకున్నా 19 నుంచి 21 సీట్లు రావచ్చని ఇండియాటుడే–యాక్సిస్ సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. కాంగ్రెస్ నేత దిగంబర్ కామత్ 2007–2012 మధ్య దాదాపు ఐదేళ్లు గోవా సీఎంగా ఉన్నారు. ఒకవేళ బీజేపీ పాలనపై జనంలో అసంతృప్తి కనిపిస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే అంచనాలున్నాయి. మార్పు తప్పదా? ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పు ఫలితంగా ప్రస్తుత కాంగ్రెస్ సీఎం హరీశ్ రావత్ కిందటి ఏప్రిల్ 22న మరోసారి పదవి చేపట్టడంతో ఉత్తరాఖండ్ నాలుగో అసెంబ్లీ(70 సీట్లు) ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2000లో ఏర్పాటైన ఉత్తరాఖండ్‌లో తొలి అసెంబ్లీ ఎన్నికలు 2002లో జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఎన్డీ తివారీ సీఎం అయ్యారు. 2007లో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2012లో మళ్లీ కాంగ్రెస్ పార్టీయే గెలుపొందింది. దేశంలోనే అత్యధిక బ్రాహ్మణ జనాభా శాతం ఉన్న ఉత్తరాఖండ్‌లో రెండో పెద్ద కులం క్షత్రియులు(ఠాకూర్లు లేదా రాజ్‌పుత్‌లు). అందుకే సీఎం పదవిని మొదటి నుంచీ ఈ రెండు సామాజికవర్గాల నేతలే చేపడుతున్నారు. ఇక్కడ మాజీ సీఎం విజయ్ బహుగుణ ఫిరాయింపుతో కాంగ్రెస్‌లో చీలిక వచ్చినప్పుడు కేంద్రం తొందరపడి రాష్ట్రపతి పాలన విధించి.. హైకోర్టు తీర్పుతో పరువుపోగొట్టుకుంది. ప్రస్తుతం ఎన్నికల సర్వేల ప్రకారం బీజేపీయే ఇక్కడ గెలుపు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తం 70 సీట్లకుగాను బీజేపీకి 38 నుంచి 43 స్థానాలు రావొచ్చని ఇండియాటుడే–యాక్సిస్ సర్వేలో పేర్కొంది. కాంగ్రెస్‌కు 26–31 సీట్ల మధ్య రావొచ్చని తెలిపింది. -
సీఎం చాప కిందకు మళ్లీ నీళ్లు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మళ్లీ రాజకీయ అనిశ్చితి మొదలయ్యేలా ఉంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, దాని భాగస్వామ్య పక్షం పీడీఎఫ్‌కు మధ్య విభేదాలు రాజుకున్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కిశోర్ ఉపాధ్యాయను వెంటనే తొలగించకపోతే తాము తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పీడీఎఫ్ చీఫ్ మంత్రిప్రసాద్ నైథాని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి అంబికా సోనీకి స్పష్టం చేశారు. పీడీఎఫ్ మద్దతు ఉపసంహరించుకుంటే హరీష్ రావత్ ప్రభుత్వం మెజారిటీ కోల్పోతుంది. వచ్చే సంవత్సరం ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. అప్పటివరకు ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి కష్టంగానే కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్‌తో కలుస్తారా లేదా అన్న విషయాన్ని మాత్రం పీడీఎఫ్ అప్పుడే చెప్పడం లేదు. ఈ విషయమై కాంగ్రెస్ అధ్యక్షుడు కిశోర్ ఉపాధ్యాయ మాత్రం ఏమీ స్పందించడం లేదు. ఇంతకుముందు మార్చినెలలో ఉత్తరాఖండ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం తర్వాత మొత్తం 12 మంది సభ్యులపై అనర్హత వేటు వేశారు. వారిలో పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలుండగా ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. దాంతో అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 58కి పడిపోయింది. కాంగ్రెస్, బీజేపీలకు తలో 26 మంది సభ్యులుండగా, పీడీఎఫ్‌కు ఆరుగురు (ముగ్గురు స్వతంత్రులు, ఇద్దరు బీఎస్పీ, ఒకరు యూకేడీ) ఎమ్మెల్యేలున్నారు. ఇన్నాళ్లూ ఈ ఆరుగురు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడంతో ఆ ప్రభుత్వం ఎలాగోలా నడుస్తోంది. ఇప్పుడు వాళ్లు మాట మారిస్తే.. మళ్లీ అధికార మార్పిడి తప్పకపోవచ్చు. -
గంగా నది ఒడ్డున సత్యసాయి ఘాట్
రిషికేశ్‌లో ఈ నెల 10న ప్రారంభం సాక్షి, హైదరాబాద్: పుట్టపర్తి శ్రీ సత్య సాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్‌లో రిషికేశ్ వద్ద గంగానది ఒడ్డున నిర్మించిన స్నాన ఘట్టం (ఘాట్)ను ఈ నెల 10న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ప్రారంభించనున్నారు. ఈ ఘాట్‌లో ఏటా సుమారు 10 లక్షల మంది స్నానమాచరించే అవకాశం ఉంది. ఈ నెల 9-11 తేదీల్లో సత్యసాయి సేవా సంస్థ రిషికేశ్‌లో పలు కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ సందర్భంగా యువ సంగీత కళాకారులను ప్రోత్సహించేందుకు శ్రీ సత్యసాయి నామ్ సంకీర్తన్ సమ్మేళన్ పేరిట వార్షిక సంగీతోత్సవంతో పాటు అనూప్ జలోటా, ప్రశాంత్ భజన బృందంతో ప్రత్యేక ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని కూడా నిర్వహిస్తారు. సత్యసాయి బోధనలతో కూడిన పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు కూడా ఉచితంగా అందుబాటులో ఉండేలా 11న శ్రీ సత్యసాయి వేదిక్ లెర్నింగ్ సెంటర్, లైబ్రరీని ప్రారంభిస్తారు. ఉచిత విద్య, ఆరోగ్యం తదితర రంగాల్లో దశాబ్దాల తరబడి సేవలు అందిస్తున్న తమ సంస్థ నూతనంగా చేపట్టే కార్యక్రమాల ద్వారా రిషికేశ్‌లోని భక్తులకు మరింత మెరుగైన మౌలిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని సత్యసాయి సేవా సంస్థ అఖిల భారత అధ్యక్షుడు నిమిశ్ పాండ్యా తెలిపారు. -
కొన్ని గంటలకే మాటమార్చిన సీఎం
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోకి చైనా బలగాలు చొరబడిన విషయం నిజమేనని చెప్పిన కొన్ని గంటల్లోనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్ మాట మార్చారు. భారత సరిహద్దు వెంట చైనా బలగాల సంఖ్య పెరుగుతున్న మాట వాస్తవమే గానీ, ఉత్తరాఖండ్ భూభాగంలోకి మాత్రం చైనా దళాలు వచ్చాయంటూ వస్తున్న కథనాలు సరికాదని ఆయన అన్నారు. తమ భూభాగాన్ని మ్యాపింగ్ చేసేందుకు వెళ్లిన రాష్ట్ర రెవెన్యూ బలగాలకు చైనా దళాలు కనిపించాయని, అంతకుముదు అప్పుడప్పుడు చైనా వాళ్లు కనిపించి పోయినా.. ఈసారి మాత్రం పెద్ద సంఖ్యలో చైనా సైనికులు వచ్చారని ఆయన అన్నారు. అయితే.. ఆ బలగాలు చైనా భూభాగంలోనే ఉండటంతో వాళ్ల కార్యకలాపాల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాజాగా చెప్పారు. వాళ్ల కదలికలు కనిపించడంతో తాము అప్రమత్తమయ్యామని, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ విషయం తెలుసని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తంగా ఉందని.. తగిన సమయంలో సరైన చర్యలు తీసుకుంటారని రావత్ అన్నారు. ఇదే విషయమై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు కూడా స్పందించారు. సరిహద్దుల్లో కదలికల గురించి ఇండో టిబెటన్ సరిహద్దు దళం (ఐటీబీపీ) సునిశితంగా పరిశీలిస్తోందని, చైనా దళాలు నిజంగా మన భూభాగంలోకి చొచ్చుకొచ్చాయా.. లేవా అనే విషయాన్ని, పరిస్థితి తీవ్రతను వాళ్లు అంచనా వేస్తున్నారని అన్నారు. సమగ్ర నివేదిక తీసుకుని.. ఏం చేయాలో చేస్తామని పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. -
చైనా బరితెగింపు నిజమే!
భారత భూభాగంలోకి మరోసారి చైనా బలగాలు చొచ్చుకొచ్చాయి. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోకి చైనా బలగాలు చొరబడిన విషయం నిజమేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్ బుధవారం వెల్లడించారు. చైనా సరిహద్దుల్లో ఉన్న చమోలి జిల్లాలోని బరాహోటి ప్రాంతంలోకి గత నెల 13న డ్రాగన్ బలగాలు చొచ్చుకొని వచ్చాయని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. చైనా బలగాలు మన భూభాగంలోకి వచ్చినప్పటికీ అక్కడ కీలకమైన కాలువ దగ్గరికి వెళ్లలేదని, ఇది భారత్‌కు సంబంధించినంతవరకు మంచి విషయమని సీఎం రావత్ చెప్పారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని తాము భావిస్తున్నామన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంతో చైనాకు 350 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. గతంలోనూ చైనా పలుమార్లు ఉత్తరాఖండ్‌లోకి చొరబడి.. ‘చైనా’ అనే బోర్డులు పెట్టింది. -
ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
విశ్వాస పరీక్షలో క్రాస్ ఓటింగ్ చేసినందుకు ఇద్దరు ఎమ్మెల్యేలపై ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్పీకర్ గోవింద్‌సింగ్ కుంజ్వల్ అనర్హత వేటు వేశారు. వేటు పడిన వారిలో ఒకరు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కాగా, మరొకరు బీజేపీ ఎమ్మెల్యే. హరీష్ రావత్ సర్కారుపై మే 10వ తేదీన నిర్వహించిన విశ్వాసపరీక్షలో కష్టమ్మీద అధికార కాంగ్రెస్ పార్టీ నెగ్గిన విషయం తెలిసిందే. బీజేపీ రెబెల్ ఎమ్మెల్యే భీమ్ లాల్ ఆర్య కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేయగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే రేఖా ఆర్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. వీళ్లిద్దరిపైనా అనర్హత వేటు వేయాలని నిర్ణయించుకున్నట్లు స్పీకర్ గురువారం తెలిపారు. వాళ్ల చర్య ఫిరాయింపుల నిరోధక చట్టం కింద శిక్షార్హమని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు ప్రకారం.. తమ పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా సభ్యుడు ఓటు వేసినా, ఓటింగుకు గైర్హాజరైనా వాళ్ల మీద అనర్హత వేటు వేయొచ్చు. కాంగ్రెస్, బీజేపీ రెండూ తమ తమ నిర్ణయాలకు అనుకూలంగా విప్‌లు జారీచేశాయి. అయినా కూడా ఆ ఎమ్మెల్యేలిద్దరూ వాటిని ఉల్లంఘించారు. ఇద్దరిపై వేటు వేయడంతో.. ఇప్పుడు 61 మంది సభ్యులున్న సభలో కాంగ్రెస్ పార్టీకి 26 మంది, బీజేపీకి 27 మంది సభ్యులు ఉన్నట్లయింది. అయితే ఆరుగురు సభ్యులున్న ప్రోగ్రెసివ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) మద్దతుతో కాంగ్రెస్ గట్టెక్కుతోంది. -
నేను నిరపరాధిని: సీఎం రావత్
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ తాజాగా మరో వివాదంలో ఇరుకున్నారు. లంచం కేసు ఎదుర్కొంటున్న ఆయన ఇటీవల స్థానిక దినపత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, నిర్దోషినని అందులో పేర్కొన్నారు. ప్రజలు తనకు అండగా నిలవాలని కూడా అభ్యర్థించారు. స్టింగ్ ఆపరేషన్ కేసులో సీబీఐ ఎదుట హాజరు కావడానికి ముందురోజు ఉత్తరాఖండ్ సమాచార శాఖ ఈ ప్రకటన జారీచేసింది. తనను కుట్రపూరితంగా ఇరికించారని ప్రకటనలో రావత్ పేర్కొన్నారు. దీనిపై ప్రధాన ప్రతిపక్షం బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. ప్రజా ధనాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారని మండిపడింది. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లఘించి ప్రకటన ఇచ్చిన రావత్ పై కేసు నమోదు చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి మున్నా సింగ్ చౌహాన్ డిమాండ్ చేశారు. అయితే సీఎం సందేశాన్నే ప్రకటన రూపంలో ఇచ్చామని సమాచార శాఖ డైరెక్టర్ వినోద్ శర్మ తెలిపారు. -
చంద్రబాబుకు ఒక నీతి.. హరీష్‌కు మరో నీతా?
హైదరాబాద్: స్టింగ్ ఆపరేషన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ఒక నీతి.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కు మరో నీతా.. అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాథ్ ప్రశ్నించారు. ఎన్డీఏ సర్కార్ స్టింగ్ ఆపరేషన్ల విషయంపై ఏపీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి 'ఓటుకు కోట్లు' కేసులో చంద్రబాబుపై సీబీఐ విచారణ ఎందుకు జరిపించడం లేదన్నారు. చంద్రబాబు కొనుగోలు బాగోతం ఆడియో టేపుల్లో రికార్డయింది.. అంతకంటే సాక్ష్యం ఏం కావాలో చెప్పాలన్నారు. విచారణల పేరుతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులపై కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ కక్ష సాధిస్తోందని ఎపీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటుకు కోట్లు కేసు ఏమైంది.. ఆ కేసును విచారణ జరిపించాలని తెలంగాణ కాంగ్రెస్ నేత గండ్ర రమణారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీఎంలకు ఒక నీతి.. ఏపీ సీఎం చంద్రబాబుకు మరో నీతా? అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసిన బాగోతంపై సీబీఐ విచారణ జరిపించాలని గండ్ర రమణారెడ్డి కోరారు. -
సీబీఐ ఎదుట హాజరైన హరీశ్ రావత్
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో సంచలం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్ మంగళవారం సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం విచారణ కొనసాగుతోంది. ఓ ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో హరీష్ రావత్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు డబ్బులు ఎరచూపుతూ ఉన్న ఆడియో, వీడియో టేపులు బయటపడ్డాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న సీబీఐ దీనిపై విచారణ చేపట్టింది. విచారణకు హజరయ్యేందుకు వెళుతూ రావత్... తాను ఎలాంటి తప్పు చేయలేదని, సీబీఐ అడిగినా అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానన్నారు. ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వ బలనిరూపణకు ముందు.. స్టింగ్ ఆపరేషన్ వీడియోలో ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ఎమ్మెల్యేలను బేరమాడుతున్నట్లు ఓ వీడియో టేపులు బయటకు వచ్చిన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ ఆయనను విచారిస్తోంది. కాగా మే 10న రావత్ బలనిరూపణ పరీక్షలో రావత్ గెలుపొందిన విషయం తెలిసిందే. సీబీఐ ఇప్పటివరకు రావత్‌కు మూడుసార్లు సమన్లు జారీ చేసింది. -
స్టింగ్ ఆపరేషన్; సీఎంకు సీబీఐ సమన్లు
న్యూఢిల్లీ: ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్ కు సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. మంగళవారం సీబీఐ ప్రధాన కార్యలయంలో విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు అందజేసింది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ బలనిరూపణకు ముందు.. స్టింగ్ ఆపరేషన్ వీడియోలో సీఎం రావత్ ఎమ్మెల్యేలను బేరమాడుతున్నట్లుగా కూడా కనిపించడం కలకలంరేపింది. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ ఆయనను విచారిస్తోంది. కాగా, మే 10న రావత్ బలనిరూపణ పరీక్షలో రావత్ గెలుపొందిన విషయం తెలిసిందే. సీబీఐ ఇప్పటివరకు రావత్ కు మూడుసార్లు సమన్లు జారీ చేసింది. -
'ఆమెకు థ్యాంక్స్ చెప్పేందుకు మాటలు రావట్లే..'
ఉత్తరాఖండ్: దేశంలో ఇటీవల అందరినీ ఆకర్షించిన రాష్ట్రం ఉత్తరాఖండ్. రాష్ట్రపతి పాలనను ఎదుర్కొని తిరిగి అధికారాన్ని నిలబెట్టుకున్న కాంగ్రెస్ నేత హరీశ్ రావత్. బలపరీక్షను సమర్థంగా ఎదుర్కొని తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ వాది పార్టీ అధ్యక్షురాలు మాయవతి సహాయాన్ని ఆయన పదేపదే స్మరిస్తున్నారు. ఆమెకు ఎలా ధన్యవాదాలో తెలపాలో కూడా తనకు అర్ధం కావడం లేదని అన్నారు. అలా చెప్పేందుకు కూడా తనకు మాటలు రావడం లేదన్నారు. ఆమెకు చాలా రుణపడి ఉన్నానని చెప్పారు. ఓ రకంగా బీఎస్పీ తనకు పెద్ద మొత్తంలో రిలీఫ్ ఇచ్చిందని, ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు వల్లే ప్రభుత్వం నిలబడిందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల్లో తాము కలిసి పనిచేస్తామని అన్నారు. మతశక్తులపై పోరాడే బీఎస్పీ తమ సిద్ధాంతానికి అనుకూలమైన పార్టీ అని.. ఆ పార్టీ సహాయంతో బీజేపీ ఓటు బ్యాంకును గల్లంతు చేస్తామని అన్నారు. -
రావత్ గెలుపునకు ‘సుప్రీం’ ఆమోదం
ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన తొలగించాలని కేంద్ర కేబినెట్ సిఫారసు ♦ 9 మంది ఎమ్మెల్యేల అనర్హతను రద్దు చేస్తే మళ్లీ విశ్వాసపరీక్ష న్యూఢిల్లీ/డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మంగళవారం జరిగిన బలపరీక్షలో కాంగ్రెస్ నేత హరీశ్‌రావత్ విజయానికి సుప్రీంకోర్టు బుధవారం ఆమోదముద్ర వేసింది. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు వీలుగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను వెంటనే తొలగించాలని కేంద్రానికి నిర్దేశించింది. ఈ పరిణామాలు.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన కేంద్రంలోనిమోదీ సర్కారుకు పెద్ద ఎదురుదెబ్బగా పరిశీలకులు భావిస్తున్నారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు మంగళవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాసపరీక్ష, ఓటింగ్ ప్రక్రియ, ఫలితాలను అధికారులు సీల్డ్ కవర్లో సుప్రీంకు అందించగా.. జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్ శివకీర్తిసింగ్‌ల బెంచ్ తెరచి పరిశీలించింది. ‘మొత్తం 61 (ఎమ్మెల్యే) ఓట్లలో రావత్‌కు 33 లభించాయి. ఓటింగ్‌లో ఎలాంటి అక్రమాలూ కనిపించలేదు. 9 మంది ఎమ్మెల్యేలు అనర్హత కారణంగా ఓటు వేయలేదు’ అని స్పష్టంచేసింది. అటార్నీ జనరల్ ముకుల్రోహ్తగి మాట్లాడుతూ.. రావత్ శాసనసభలో తన మెజారిటీని నిరూపించుకున్నారనటంలో సందేహం లేదన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను తొలగిస్తామని కేంద్రం చెప్పినట్లు నివేదించారు. కోర్టు అనుమతితో బుధవారం నాడే రాష్ట్రపతి పాలనను తొలగిస్తామని చెప్పారు. రాష్ట్రపతి పాలనను తొలగించిన తర్వాత రావత్ సీఎంగా బాధ్యతలు చేపడతారని కోర్టు చెప్పింది. రాష్ట్రపతి పాలనను తొలగిస్తూ ఇచ్చిన ఆదేశాలను శుక్రవారం తమకు అందివ్వాలంది. అయితే.. మార్చి 28న విధించిన రాష్ట్రపతి పాలన చట్టవ్యతిరేకమని రాష్ట్ర హైకోర్టు కొట్టివేయగా దానిపై సుప్రీంలో విచారణ సాగుతున్నందున.. రాష్ట్రపతి పాలన చట్టబద్ధత అంశమింకా మనుగడలోనే ఉంటుందని పేర్కొంది. అనర్హతకు గురైన 9 మంది ఎమ్మెల్యేలు హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేశారని.. దానిపైనా విచారణ కొనసాగుతోందని ప్రస్తావించింది.‘రాష్ట్రపతి పాలన విధించటం సమర్థనీయమా కాదా అన్నది పరిశీలించాల్సి ఉంది. ఒకవేళ ఎమ్మెల్యేల అనర్హతను మేం కొట్టివేసినట్లయితే.. మరోసారి విశ్వాస పరీక్ష జరుగుతుంది’ అని వివరించింది. అంతకుముందు.. విశ్వాస పరీక్ష ఫలితాలను సుప్రీం తెవరకుండా అడ్డుకునేందుకు.. అనర్హతకు గురైన కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యే శైలారాణిరావత్ పిటిషన్ వేయటం ద్వారా చేసిన ప్రయత్నం ఫలించలేదు. రావత్ గెలుపుకు సుప్రీం ఆమోదముద్ర లభించిన వెంటనే.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను తొలగించాల్సిందిగా కేంద్ర కేబినెట్ రాష్ట్రపతికి సిఫారసు చేసింది. దీంతో.. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేసినట్లు బుధవారం రాత్రి కేంద్ర హోం శాఖ ప్రకటించింది. మోదీ క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్, ఆప్ ఉత్తరాఖండ్‌లో ప్రజాస్వామ్యం గెలిచిందని, అక్కడ అప్రజాస్వామికంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించినందుకు ప్రధానిమోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేశాయి. ఇది మోదీకి ఒక గుణపాఠమని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ట్విటర్లో పేర్కొన్నారు. మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ నేత కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. ఆప్ నేత కేజ్రీవాల్ కూడా మోదీ క్షమాపణ చెప్పాలని ట్విటర్లో డిమాండ్ చేశారు. -
ఇక అధికారికంగా ఆయనే ముఖ్యమంత్రి
డెహ్రాడూన్: ఎమ్మెల్యేల తిరుగుబాటు, పార్టీ ఫిరాయింపులు, రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడం, మెజార్టీ లేదంటూ కేంద్రం రాష్ట్రపతి పాలన విధించడం, రెబెల్స్, సర్కార్ ఒకరికి వ్యతిరేకంగా మరొకరు కోర్టును ఆశ్రయించడం, ఈ మధ్యలో ఎమ్మెల్యేలతో బేరసారాలకు పాల్పడ్డారంటూ స్టింగ్ ఆపరేషన్ వీడియోలు వెలుగుచూడటం.. ఇలా ఎన్నో రాజకీయ మలుపులు తిరిగిన ఉత్తరాఖండ్‌లో పదవీచ్యుత ముఖ్యమంత్రి హరీశ్ రావత్ అధికారికంగా విజయం సాధించారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో హరీశ్ మెజార్టీ నిరూపించుకున్నట్టు సుప్రీం కోర్టు బుధవారం అధికారికంగా ప్రకటించింది. బలపరీక్షలో హరీశ్ సర్కార్‌కు అనుకూలంగా 33 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 28 ఓట్లు పడ్డాయి. ముఖ్యమంత్రిగా హరీశ్ బాధ్యతలు చేపట్టేందుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఇందుకు వీలుగా ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తామని కేంద్రం తరపున అటార్నీ జనరల్ సుప్రీం కోర్టుకు తెలిపారు. దీంతో ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభానికి తెరపడినట్టయింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మంగళవారం బలపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వివరాలను సీల్డు కవర్లో సుప్రీం కోర్టుకు సమర్పించగా, ఈ రోజు ఫలితాన్ని ప్రకటించింది. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మొత్తం 70 మంది ఎమ్మెల్యేలు ఉండగా తొమ్మిదిమంది కాంగ్రెస్ రెబెల్స్‌పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో మిగిలిన 61 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరిలో బీజేపీకి 28, కాంగ్రెస్‌కు 27, బీఎస్పీకి ఇద్దరు, ఉత్తరాఖండ్ క్రాంతి దళ్‌కు ఓ ఎమ్మెల్యే, మరో ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రేఖ ఆర్య బీజేపీ గూటికి చేరగా, బీజేపీ ఎమ్మెల్యే భీమ్ లాల్ ఆర్య కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. ఇక బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో హరీశ్ రావత్ ప్రభుత్వం మైనార్టీలో పడిన సంగతి తెలిసిందే. మార్చి 27 న రాష్ట్రపతి పాలన విధించారు. -
హిప్ హిప్ హుర్రే...
న్యూఢిల్లీ: నేడు తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల మధ్య ఉత్తరాఖండ్ అసెంబ్లీలో హరీష్ రావత్ బలపరీక్ష ఎదుర్కున్నారు. ఓటింగ్ అనంతరం ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు. హిప్ హిప్ హుర్రే ఫర్ డెమోక్రసీ అంటూ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యయే గెలిచిందంటూ ట్వీట్ లో పేర్కొన్న దిగ్విజయ్... తమ పార్టీ నేత హరీశ్ రావత్ కు శుభాకాంక్షలు తెలిపి కాంగ్రెస్ గెలుపుపై ధీమా వ్యక్తంచేశారు. ప్రజాస్వాయ్యాన్ని న్యాయవ్యవస్థ కాపాడిందని దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో అసెంబ్లీ స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్వాల్ ఓటింగ్ మంగళవారం ఓటింగ్ నిర్వహించారు. ఆ వివరాలను సీల్డు కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పిస్తారు. బుధవారం సుప్రీంకోర్టు అధికారికంగా బలపరీక్ష ఫలితాన్ని ప్రకటించనుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతుగా 33 మంది ఎమ్మల్యేలు ఓటు వేసినట్టు ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతుండగా.. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ తన అభిప్రాయాలను వెల్లడించారు. Hip Hip Hurray for Democracy and Three Cheers for Harish Rawat. Judiciary has saved our Democracy. pic.twitter.com/OZpnVFEyph — digvijaya singh (@digvijaya_28) 10 May 2016 -
బలపరీక్షకు ముందు ఎమ్మెల్యేలు జంప్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బలపరీక్షకు ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పదవీచ్యుత ముఖ్యమంత్రి హరీశ్ రావత్ మెజార్టీ నిరూపించుకుంటారని కాంగ్రెస్ పార్టీ విశ్వాసంతో ఉండగా, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రేఖ ఆర్య షాక్ ఇచ్చారు. సోమవారం నుంచి కాంగ్రెస్ పార్టీకి అందుబాటులో లేకుండా అజ్ఞాతంలో ఉన్న రేఖ పార్టీ ఫిరాయించారు. ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ గూటికి చేరారు. దీంతో కాంగ్రెస్ నాయకులు షాక్ తిన్నారు. మంగళవారం రేఖ ఆర్య బీజేపీ సభ్యులతో కలసి అసెంబ్లీ వద్ద ప్రత్యక్షమయ్యారు. ఆమె హరీశ్ రావత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. కాగా బీజేపీ ఎమ్మెల్యే భీమ్ లాల్ ఆర్య ఆ పార్టీకి హ్యాండిచ్చి కాంగ్రెస్ శిబిరంలో చేరారు. ఆయన హరీశ్ రావత్ తో కలసి అసెంబ్లీకి వచ్చారు. భీమ్ లాల్ కాంగ్రెస్ కు ఓటు వేశారు. ఇక బీఎస్పీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బీఎస్పీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరితో పాటు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో అసెంబ్లీ స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్వాల్ ఈ రోజు బలపరీక్ష నిర్వహించారు. బలపరీక్ష వివరాలను సీల్డు కవర్లో సుప్రీం కోర్టుకు సమర్పించనున్నారు. బుధవారం సుప్రీం కోర్టు అధికారికంగా బలపరీక్ష వివరాలను ప్రకటించనుంది. కాగా ఓటింగ్‌లో తామే గెలిచినట్టు హరీశ్ రావత్ ప్రకటించారు. -
ఫలితం సీల్డు కవర్లో.. నేనే నెగ్గాను
డెహ్రాడూన్: ఉత్కంఠ పరిణామాల మధ్య ఉత్తరాఖండ్ అసెంబ్లీలో పదవీచ్యుత ముఖ్యమంత్రి హరీశ్ రావత్ బలపరీక్ష ఎదుర్కొన్నారు. మంగళవారం సుప్రీం కోర్టు పర్యవేక్షణలో అసెంబ్లీ స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్వాల్ ఓటింగ్ నిర్వహించారు. ఫలితాన్ని ప్రకటించలేదు. బలపరీక్ష వివరాలను సీల్డు కవర్లో సుప్రీం కోర్టుకు సమర్పించనున్నారు. బుధవారం సుప్రీం కోర్టు అధికారికంగా బలపరీక్ష వివరాలను ప్రకటించనుంది. దీంతో ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతుగా 33 మంది ఎమ్మల్యేలు ఓటు వేసినట్టు ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పారు. బలపరీక్ష అనంతరం తానే నెగ్గానని, ఇది ప్రజాస్వామ్య విజయమని హరీశ్ రావత్ ప్రకటించారు. బీజేపీ ఓటమిని అంగీకరించినట్టు సమాచారం. బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మొత్తం 70 మంది ఎమ్మెల్యేలు ఉండగా తొమ్మిదిమంది కాంగ్రెస్ రెబెల్స్‌పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో మిగిలిన 61 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరిలో బీజేపీకి 28, కాంగ్రెస్‌కు 27, బీఎస్పీకి ఇద్దరు, ఉత్తరాఖండ్ క్రాంతి దళ్‌కు ఓ ఎమ్మెల్యే, మరో ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. బలపరీక్షకు ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే రేఖ ఆర్య.. బీజేపీ గూటికి చేరగా, కాంగ్రెస్‌కు బీఎస్పీ అధినేత్రి మాయావతి మద్దతు ప్రకటించారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ మద్దతు తెలిపారు. కాగా బలపరీక్షలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఎన్ని ఓట్లు పడ్డాయన్నది అధికారికంగా తేలాల్సివుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో హరీశ్ రావత్ ప్రభుత్వం మైనార్టీలో పడిన సంగతి తెలిసిందే. మార్చి 27 నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు హరీశ్ బలపరీక్ష ఎదుర్కొన్నారు. బలపరీక్ష నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు రాష్ట్రపతి పాలన తొలగించారు. -
నార్కో పరీక్షకు సిద్ధం: హరీశ్
డెహ్రాడూన్: ఎమ్మెల్యేలకు డబ్బులు పంచారన్న ఆరోపణలపై పదవీచ్యుత ముఖ్యమంత్రి హరీశ్ రావత్ స్పందించారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని,నార్కో అనాలసిస్ పరీక్షలకు కూడా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. తనపై చేసిన స్టింగ్ ఆపరేషన్ లో సీబీఐ ప్రమేయం ఉందని హరీశ్ ఆరోపించారు.రాజకీయ నాయకునిగా తాను పలుమార్లు సీబీఐ ముందు హాజరయ్యానని హరీశ్ రావత్ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం తాను అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవాల్సి ఉందన్నారు. దానికి సంబంధించిన పనులు ఉన్నందువల్లే... సీబీఐ విచారణకు ఇవాళ హాజరు కావడం లేదని ఆయన తెలిపారు. అలాగే తనతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆ పార్టీ నేతలు కైలాశ్ విజయ్ వర్గియా, భగత్ సింగ్ కొశారి, అజయ్ భట్ లకు సైతం నార్కో పరీక్ష చేయాల్సిందిగా హరీశ్ డిమాండ్ చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ విశ్వాస పరీక్షలో నెగ్గుతామన్న రావత్.. తాజా వీడియో గురించి తనకేమీ తెలియదన్నారు. -
బీజేపీ బ్లాక్ మొయిల్ రాజకీయాలకు పాల్పడుతోంది
డెహ్రాడూన్: కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటూ బీజేపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని, బ్లాక్ మోయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఆరో్పించారు. హరీష్ తమతో లావాదేవీలు చేసిన వీడియోలను కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు టీవీ ఛానళ్లకు విడుదల చేశారు. దీంతో రాష్ట్రంలో మరోసారి రాజకీయ దుమారం రేగుతోంది. డెహ్రాడూన్ లోని ప్రెస్ కాన్ఫరెన్స్ లో హరీష్ మాట్లాడుతూ.. నేను ఇప్పటి వరకు ఆవీడియోలు చూడలేదన్నారు. స్నేహంగా ఉంటూ ఎవరినైనా ఈజీగా మోసం చేయవచ్చునని తెలిపారు. ఇందంతా ముందస్తు ప్లానింగ్ ప్రకారం జరిగిందని ఆయన ఆరోపించారు. అవి నఖిలీ వీడియోలని మమ్మల్ని చులకన చేయడానికి బీజేపీ చేస్తున్న కుట్రగా ఆయన పేర్కొన్నారు. మేమేమన్నా దేశ ద్రోహులమా రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నంలో ఇదంతా భాగమని హరీష్ ఆరో్పించారు. -
బలపరీక్షకు ముందే రావత్‌కు మరో షాక్!
మరో రెండు రోజుల్లో హరీశ్ రావత్ తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొనుండగా.. ఆయనకు మరో గట్టి షాక్ తగిలింది. రావత్ తరఫున రెబల్ ఎమ్మెల్యేలకు లంచం ఇచ్చానని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు అంగీకరిస్తున్నట్టు భావిస్తున్న స్టింగ్ ఆపరేషన్ వీడియో బయటపడటం కలకలం రేపుతోంది. స్థానిక న్యూస్ చానెల్ సమాచార్ ప్లస్ ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ బిష్ట్, రెబల్ ఎమ్మెల్యే హరక్ సింగ్ రావత్‌తో మాట్లాడుతూ.. పదవీచ్యుత సీఎం రావత్ తరపున డిప్యూటీ స్పీకర్ ఏపీ మైఖూరికి, 12మంది రెబల్ ఎమ్మెల్యేలకు తాను కోట్లాది రూపాయల డబ్బు లంచంగా ముట్టజెప్పినట్టు చెప్పడం ఈ వీడియోలో కనిపిస్తున్నది. కొంతమంది ఎమ్మెల్యేలకు రూ. 25 లక్షల చొప్పున ఇచ్చానని, డిప్యూటీ స్పీకర్ మైఖూరికి రూ. 50 లక్షలు రావత్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో రావత్ ప్రభుత్వం మైనారిటీలో పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ 12మందిపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించగా.. సుప్రీంకోర్టు పదవీచ్యుత సీఎం రావత్‌కు ఈ నెల 10న అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోవడానికి అనుమతి ఇచ్చింది. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలకు రావత్ లంచాలు ఇవ్వజూపినట్టు ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియో వెలుగుచూడగా.. తాజాగా మరో వీడియో వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. -
బలపరీక్షకు ముందు రావత్ కు స్టింగ్ దెబ్బ!
న్యూఢిల్లీ: బలనిరూపణకు ముందు హరిశ్ రావత్ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. మే10న అసెంబ్లీలో బలనిరూపణకు కొంతమంది సభ్యులను కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ సింగ్ బేరమాడినట్లు చూపుతున్న వీడియో ప్రస్తుతం దుమారం రేపుతోంది. తనకు డబ్బు అవసరం లేదని.. పేద ఎమ్మెల్యేలకు డబ్బు ఇవ్వదలుచుకున్నానని ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున సొంత ఖర్చులకు ఇచ్చినట్లు ఆయన వీడియోలో పేర్కొన్నారు. ఇప్పటివరకు 12 మంది ఎమ్మెల్యేలకు డబ్బు ఇచ్చానని.. హరిష్ రావత్ కు కూడా ఈ విషయం తెలుసననే మదన్ సింగ్ మాటలు ఉన్నాయి. ఈ వీడియోను ఉత్తరాఖండ్ సమాచార్ ప్లస్ ఎడిటర్ ఇన్ చీఫ్ బయటపెట్టారు. పాత స్టింగ్ ఆపరేషన్ కు సంబంధించిన వీడియోతో పాటు ఈ వీడియోను కలిపి సమాచార్ ప్లస్ విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలను కొంటున్నారనే హరీశ్ రావత్ ఆరోపణలు అబద్ధమని తెలిపోయాయి. కుర్చీని నిలబెట్టుకోవడానికి రావత్ ఎంతకైనా దిగజారతారని బీజేపీ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయవర్గ్యానంద్ అన్నారు. -
మాజీ సీఎంకు సీబీఐ సమన్లు
న్యూఢిల్లీ: శాసనసభలో బల నిరూపణకు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేకి లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలపై ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఆయనను సోమవారం విచారించనుంది. తనకు లంచం ఇవ్వడానికి బేరసారాలు సాగిస్తున్నవీడియోను రెబెల్ ఎమ్మెల్యే బయటపెట్టారు. లంచం ఆరోపణలను రావత్ ఖండించారు. ఈ వీడియో ప్రామాణికతను నిర్ధారించడానికి దాన్ని కేంద్ర హోంశాఖ చండీగఢ్ లోని ఫోరెన్పిక్ సైన్స్ లేబొరేటరీకి పంపింది. వీడియో నిజమైనదేనని విచారణలో తేలడంతో రావత్ ను సోమవారం ప్రశ్నించేందుకు సీబీఐ సమన్లు జారీ చేసింది. గత నెల27 న ఉత్తరాఖండ్ లో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత ఇప్పటివరకు అక్కడ ప్రభుత్వం లేదు. రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. -
ఇన్నాళ్లూ అబద్ధం ఎందుకు చెప్పారు?
రెబల్ ఎమ్మెల్యేలకు డబ్బులిచ్చి బుజ్జగించడానికి ప్రయత్నిస్తూ స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిపోయిన ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ గత 35 రోజులుగా ఎందుకు అబద్ధాలు చెబుతున్నారని బీజేపీ ప్రశ్నించింది. ఆ సీడీలలో ఉన్నది తానేనంటూ రావత్ అంగీకరించడంతో ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మున్నా సింగ్ చౌహాన్ స్పందించారు. రావత్ ఉన్న సీడీ బయటపడి 35 రోజులు కావస్తోందని, ఇన్నాళ్లబట్టి ఆయన అది తప్పుడు సీడీ అని.. మార్ఫింగ్ చేశారని చెబుతూ ఉత్తరాఖండ్ ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టించారని ప్రశ్నించారు. సీడీలో ఉన్న గొంతు తనది కాదంటూ ఇన్నాళ్లుగా చెప్పడానికి కారణమేంటో ఆయన బయటపెట్టాలని చౌహాన్ డిమాండ్ చేశారు. తనకు, సదరు జర్నలిస్టుకు ఓ సమావేశం జరిగిందని కూడా రావత్ అంగీకరించారని ఆయన అన్నారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న రావత్.. ప్రభుత్వ హెలికాప్టర్లో జాలీగ్రాంట్ ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్ వద్దకు ఒక జర్నలిస్టును కలిసేందుకు వెళ్లారంటేనే విషయం అర్థమవుతోందని చౌహాన్ చెప్పారు. తాను ఏమైనా తప్పు చేసి ఉంటే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమని గతంలో హరీష్ రావత్ చెప్పిన విషయాన్ని చౌహాన్ గుర్తుచేశారు. అయితే హరీష్ రావత్ మాత్రం ఒకవైపు ఆ సీడీలో ఉన్నది తానేనని ఒప్పుకొంటూనే జర్నలిస్టుతో భేటీ కావడం తప్పా.. సాంకేతికంగా అప్పటికి ఇంకా అనర్హత వేటు పడని ఎమ్మెల్యే నాతో మాట్లాడితే ఏమవుతుంది అంటూ వితండవాదం చేస్తున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా ఏదైనా చానల్‌ను బ్లాక్ చేయించానా అని కూడా ప్రశ్నించారు. రెబల్ ఎమ్మెల్యేలను తాను మద్దతు కోరి, అందుకు బదులుగా వాళ్లకు ఏమైనా ఆఫర్ చేసినట్లు ఆ సీడీలో రుజువైతే తాను బహరింగ ఉరికి కూడా సిద్ధమని చెప్పారు. -
ఆ సీడీలో ఉన్నా.. మాజీ సీఎం అంగీకారం!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ఆదివారం ఓ స్టింగ్ ఆపరేషన్ విషయమై సంచలన అంగీకారం చేశారు. ఉత్తరాఖండ్‌లో రాజకీయ సంక్షోభానికి కారణమైన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నట్టు భావిస్తున్న స్టింగ్ ఆపరేషన్ సీడీలో తాను ఉన్న విషయం వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ఇప్పటివరకు ఈ స్టింగ్ ఆపరేషన్ ఓ బూటకమని కొట్టిపారేస్తూ వచ్చిన రావత్ తొలిసారి ఈ సీడీలో తాను ఉన్నానని అంగీకరించారు. అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలను కొనేందుకు ఓ జర్నలిస్టుతో అప్పటి సీఎం రావత్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు వెలుగులోకి వచ్చిన ఓ స్టింగ్ ఆపరేషన్ కలకలం రేపింది. ఓ ప్రైవేటు న్యూస్ చానెల్ ఎడిటర్ ఈ స్టింగ్ ఆపరేషన్‌ను నిర్వహించారు. ఈ సీడీ కాపీలను కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు మీడియాకు పంపారు. స్టింగ్ ఆపరేషన్‌కు పాల్పడిన జర్నలిస్టుతో తాను సమావేశమైన విషయం వాస్తవమేనని రావత్ తాజాగా స్పష్టం చేశారు. 'ఓ జర్నలిస్టుతో సమావేశం కావడం నేరమా? అప్పటికీ సాంకేతికంగా అనర్హత పడిన ఓ ఎమ్మెల్యేతో నేను మాట్లాడటం తప్పా? రాజకీయాల్లో మేం ఏదైనా చానెల్‌ను నిషేధించామా' అని రావత్ ఆదివారం డెహ్రాడూన్‌లో విలేకరులతో అన్నారు. రావత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొమ్మిదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎదురుతిరగడం, అసెంబ్లీలో బలపరీక్షకు ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశించడం, అంతకుముందే కేంద్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడంతో ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
హరీశ్ రావత్, ముఖ్యమంత్రి రాయని డైరీ
నెల రోజులుగా పని లేదు. మొత్తం రాష్ట్రపతే చూసుకుంటున్నారు ఢిల్లీ నుంచి. పైనున్న బృహస్పతిలా! ఉత్తరాఖండ్ దేవభూమి. దేవుళ్లు, దేవతలు ఉండే భూమి. రాష్ర్టపతి పాలన అన్నప్పుడు.. తప్పదు, ప్రజలతో పాటు దేవుళ్లూ ప్రణబ్ ముఖర్జీ పాలన కిందికి వెళ్లవలసిందే. రాష్ర్టం కన్నా, రాష్ట్ర ప్రజల కన్నా, రాష్ట్రంలోని దేవుళ్ల కన్నా ముఖ్యమంత్రి గొప్పవాడేం కాదు కనుక అతడూ.. అధికరణాల ముందు నిలబడవలసిందే. ‘కూర్చోండి సార్, మీరు నిలబడడం ఏమిటి?’ అంటున్నారు నా ఎమ్మెల్యేలు. కూర్చుని ఏం చెయ్యాలి? పని లేనప్పుడు కూర్చున్నా ఒకటే, సచివాలయం లాన్లో నడుచుకుంటూ వెళ్లినా ఒకటే. ‘బల నిరూపణలో ఎప్పటికైనా మనమే గెలుస్తాం సార్’ అంటున్నాడు కిశోర్ ఉపాధ్యాయ్. ఆయన మా పార్టీ ప్రెసిడెంటు. పక్కకు రమ్మన్నాను. ఆయనతో పాటు యూత్ కాంగ్రెస్ లీడర్లు కొందరు పక్కకు వచ్చారు. సెంటర్లో బీజేపీ ఉన్నంత కాలం ఎవల్యూషన్ థియరీలు, రివల్యూషన్ థియరీలు పనిచెయ్యవని వీళ్లకెలా అర్థమయ్యేలా చెప్పాలి? చెప్పలేదు. వాళ్లూ చెప్పమని అడగలేదు. దటీజ్ కాంగ్రెస్. పార్టీనుంచి వెళ్లిపోయిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలదీ సేమ్‌టుసేమ్. డి.ఎన్.ఎ. వెళ్లేముందు ఎందుకు వెళ్లిపోతున్నదీ చెప్పలేదు. వెళ్లాకైనా ఎందుకు వెళ్లిపోయిందీ చెప్పలేదు. ‘బల నిరూపణకు తొందరేముంది? ముందసలు మీ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టారో తేలనివ్వండి’ అంది కోర్టు! మా లాయర్ ఏదో చెప్పబోయాడు. కోర్టు ‘ ష్..’ మంది. నోటి మీద వేలేసుకుని వెనక్కి వచ్చేశాడు. మా చీఫ్ సెక్రెటరీ ఏదో అడగబోయాడు. నీకిక్కడ పనేమిటంది కోర్టు. ఆయనా హర్ట్ అయ్యాడు. కోర్టులు వినేది వింటాయి. చెప్పేది చెప్తాయి. విన్నదీ, చెప్పిందీ మ్యాచ్ అవ్వాలని ఆశించడం కోర్టువారి ధర్మాన్ని, కోర్టువారి న్యాయాన్ని శంకించడమే. శంకల్లేకుండా మా వాళ్లు కోర్టు మెట్లు దిగి వచ్చేశారు. కేసు తెగే లోపు కోర్టు సెలవులు వచ్చేశాయంటే.. మళ్లీ ఇంకో నెల రోజులు రాష్ట్రపతి పాలన. చార్ధామ్ యాత్ర కోసమని ఈ అరవై తొమ్మిదేళ్ల వయసులో కోర్టువారు నాకు సెలవులు ప్రసాదించబోతున్నట్టే ఉంది చూస్తుంటే. ‘ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు సార్’ అన్నాడు కిషోర్ ఉపాధ్యాయ్ మళ్లీ వచ్చి. మోదీ పేరో, అమిత్‌షా పేరో, వాళ్లిద్దరూ కాకపోతే ఉత్తరాఖండ్ బీజేపీ ప్రెసిడెంట్ అజయ్ భట్ పేరో చెప్తాడనుకున్నాను. అవేవీ చెప్పకుండా, ‘రాష్ట్రపతి ఆత్మ ప్రబోధానుసారం పని చెయ్యడం లేదు సార్’ అన్నాడు. నాకైతే అలా అనిపించలేదు. ఆత్మలు లేవు, అంతరాత్మలు లేవు. ఒకవేళ ఉన్నా 2014 నుంచి ఎవరి ఆత్మలు, అంతరాత్మలు వారి దగ్గర ఉండడం లేదు. ఎవర్నని తప్పు పడతాం? ఉత్తరాఖండ్ నిండా గుళ్లున్నాయి. గుళ్లల్లో దేవుళ్లున్నారు. ఊళ్లున్నాయి. ఊళ్లలో ప్రజలున్నారు. ఒక దండం పెట్టి వాళ్లకు వదిలేస్తే సరి.. బలాబలాలు వాళ్లే తేల్చేస్తారు. బల నిరూపణలతో పని లేకుండా. మాధవ్ శింగరాజు -
విశ్వాస పరీక్ష నిర్వహించాల్సిందే: హైకోర్టు
ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగాలా వద్దా అన్న విషయాన్ని తేల్చుకోడానికి గురువారం.. అంటే ఈనెల 31వ తేదీన విశ్వాస పరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలంటూ నిర్ణయం తీసుకున్న కేంద్రప్రభుత్వానికి ఇది పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. గత కొన్ని నెలలుగా ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి సెగలు కక్కుతోంది. తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కీలకమైన ఆర్థికబిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంతో ప్రభుత్వం మైనారిటీలో పడిందన్న విషయం రుజువైందని కేంద్రం చెప్పింది. అయితే.. మార్చి 28న తాను విశ్వాసపరీక్ష ఎదుర్కొంటానని గవర్నర్ కేకే పాల్‌ను కోరినా, ఈలోపే కేంద్రం అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది. 70 మంది సభ్యులున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చి బీజేపీ పక్షాన చేరిన తొమ్మిది మంది రెబెల్ ఎమ్మెల్యేలపై ఉత్తరాఖండ్ స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో అసెంబ్లీలో విశ్వాస పరీక్షను రావత్ ప్రభుత్వం అలవోకగా ఎదుర్కొని నిలబడగలుగుతుంది. స్పీకర్ సస్పెన్షన్ నిర్ణయంతో సభలో మొత్తం సంఖ్య 61 పడిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 27 మంది సభ్యులుండగా, మరో ఆరుగురు స్వతంత్ర సభ్యులు కూడా సర్కారుకు మద్దతిస్తారని అంటున్నారు. అదే నిజమైతే 33 మంది సభ్యుల బలంతో రావత్ సర్కార్ విశ్వాస పరీక్షలో గట్టెక్కే అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ స్వతంత్ర సభ్యులు సర్కారుకు వ్యతిరేకంగా ఓటు వేస్తే మాత్రం హరీష్ రావత్ ఇంటిదారి చూసుకోక తప్పదు. -
రాష్ట్రపతి పాలన రద్దు చేయండి
హైకోర్టులో రావత్ పిటిషన్ ♦ తన సర్కారును పునరుద్ధరించాలని వినతి డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను రద్దుచేసి, తన ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని మాజీ సీఎం హరీశ్ రావత్ హైకోర్టును ఆశ్రయించారు. నిరంకుశత్వంతో మోదీ ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించిందన్నారు. రావత్ తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సోమవారం నైనిటాల్‌లోని హైకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్రంలో ఆర్టికల్ 356 ప్రయోగం చట్టవ్యతిరేకమని, రద్దు కోసం హైకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. అసెంబ్లీలో బలపరీక్షకు ఇంకో రోజు గడువు ఉండగానే, కేంద్రం రాజ్యాంగ ప్రక్రియకు తూట్లు పొడిచేలా నిర్ణయం తీసుకుందన్నారు. ఈ పిటిషన్‌పై యూ.సీ ధ్యాని ఏకసభ్య ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విని మంగళవారానికి వాయిదా వేసింది. గవర్నర్‌తో రావత్ భేటీ.. తనకు సంపూర్ణ మెజారిటీ ఉందని, అందువల్ల బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని రావత్ సోమవారం గవర్నర్ కేకే పాల్‌ను కలిశారు. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను వెంట తీసుకెళ్లారు. వీరిలో 26 మంది కాంగ్రెస్, ఐదుగురు పీడీఎఫ్, ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే ఉన్నారు. తమకు 34 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ గవర్నర్‌కు లేఖ ఇచ్చారు. పరస్పర విమర్శలు.. గవర్నర్ అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునేందుకు సీఎంకు గవర్నర్ గడువు ఇచ్చినప్పటికీ కేంద్రం రాష్ర్టపతి పాలన విధించిందని కాంగ్రెస్ దుయ్యబట్టింది. ప్రభుత్వ బల నిరూపణకు బలపరీక్షే మార్గమని ఎస్ఆర్ బొమ్మైకేసులో సుప్రీం కోర్టు చెప్పిందని పేర్కొంది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ.. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం సృష్టించారని మండిపడ్డారు. ద్రవ్య వినిమయ బిల్లు వీగిపోయినప్పటికీ అది ఆమోదం పొందిందంటూ స్పీకర్ ప్రకటించడాన్ని తప్పుబట్టారు. -
'9 మంది ఎమ్మెల్యేలకు వెయ్యి కోట్లు ఇచ్చారు'
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని, రాష్ట్ర గవర్నర్ పై కేంద్రంలోని నరేంద్ మోదీ సర్కారు బెదిరింపులకు పాల్పడిందని ముఖ్యమంత్రి హరీష్ రావత్ వ్యాఖ్యానించారు. 9 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలకు భారీగా ముడుపులు ముట్టాయని, రూ.1000 కోట్లకు పైగా చేతులు మారాయని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తమ పార్టీ నేతలను ప్రలోభపెట్టిందని, తమ ప్రభుత్వాన్ని కూల్చేయడానకి విశ్వప్రయత్నాలు చేసిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఇక భవిష్యత్తు ఉండదని వారి రాజకీయ జీవితానికి తెరపడినట్లేనని అభిప్రాయపడ్డారు. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించడం, అందుకు దారితీసిన పరిస్థితులపై ఆయన చాలా ఆగ్రహంగా ఉన్నారు. కేంద్ర కేబినెట్ రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ కు శనివారం సిఫార్స్ చేయగా, ఈ విషయాన్ని గవర్నర్, రాష్ట్రపతికి సిఫార్సు చేశారు. రాష్ట్రపతిపాలన విధిస్తున్నట్లు ప్రణబ్ ముఖర్జీ ఆదివారం నిర్ణయాన్ని ప్రకటించారు. గత రెండు రోజులుగా బీజేపీ కారణంగా రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల ఇలా జరిగిందని రావత్ ఆరోపించారు. 2014 ఫిబ్రవరిలో తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మా ప్రభుత్వాన్ని కూల్చేయాలని బీజేపీ కుట్రలు పన్నిందని, మెజారిటీ సంఖ్యా బలం ఉన్నప్పటికీ ఈ విధంగా జరగడంపై సీఎం హరీష్ రావత్ విచారం వ్యక్తంచేశారు. -
పంతం నెగ్గించుకున్న మోదీ సర్కారు!
న్యూఢిల్లీ/డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని నెలకొన్న రాజకీయ సంక్షోభం ఊహించని మలుపు తీసుకుంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. కేంద్ర కేబినేట్ రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ కు శనివారం సిఫార్స్ చేశారు. గవర్నర్ తన నివేదిక, సిఫార్సును ప్రణబ్ ముఖర్జీకి అందజేశారు. ఈ మేరకు ప్రణబ్ ముఖర్జీ, గవర్సర్ సిఫార్సు మేరకు రాష్ట్రపతి పాలన అమలుచేశారు. కాంగ్రెస్ పార్టీకి సీఎం హరీశ్ రావత్ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కొనుండగా.. అంతకుముందే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే దిశగా పావులు కదిపిన విషయం తెలిసిందే. బలం ఉన్నా... హైడ్రామా జరిగింది! కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చి బీజేపీ పక్షాన చేరిన తొమ్మిది మంది రెబెల్ ఎమ్మెల్యేలపై ఉత్తరాఖండ్ స్పీకర్ సస్పెన్షన్ వేటు వేయడం.. ఈ సస్పెన్షన్ కనుక నిజమైతే, అసెంబ్లీలో విశ్వాస పరీక్షను రావత్ ప్రభుత్వం అలవోకగా ఎదుర్కొని నిలబడగలుగుతుంది. ప్రస్తుతం 70 మంది సభ్యులున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో స్పీకర్ సస్పెన్సన్ నిర్ణయంతో ఆ సంఖ్య 61 పడిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 27 మంది సభ్యులుండగా, మరో ఆరుగురు సభ్యుల అండ కూడా రావత్ ప్రభుత్వానికి ఉంది. దీంతో 33 మంది సభ్యుల బలంతో రావత్ సర్కార్ విశ్వాస పరీక్షలో బలనిరూపణ చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు రాష్ట్రపతి పాలన కోసం శతవిధాలా ప్రయత్నించి తమ పంతం నెగ్గించుకుంది. -
రాష్ట్రపతి పాలనా? విశ్వాస పరీక్షా?
న్యూఢిల్లీ/డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని నెలకొన్న రాజకీయ సంక్షోభం ఊహించని మలుపు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీకి హరీశ్ రావత్ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కొనుండగా.. అంతకుముందే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే దిశగా కదులుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చి బీజేపీ పక్షాన చేరిన తొమ్మిది మంది రెబెల్ ఎమ్మెల్యేలపై ఉత్తరాఖండ్ స్పీకర్ సస్పెన్షన్ వేటు వేసినట్టు వార్తలు వేస్తున్నాయి. ఈ సస్పెన్షన్ కనుక నిజమైతే.. అసెంబ్లీలో విశ్వాస పరీక్షను రావత్ ప్రభుత్వం అలవోకగా ఎదుర్కొని నిలబడగలుగుతుంది. ప్రస్తుతం 70 మంది సభ్యులున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో స్పీకర్ సస్పెన్సన్ నిర్ణయంతో ఆ సంఖ్య 61 పడిపోనుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 27 మంది సభ్యులుండగా, మరో ఆరుగురు సభ్యుల అండ కూడా రావత్ ప్రభుత్వానికి ఉంది. దీంతో 33 మంది సభ్యుల బలంతో రావత్ సర్కార్ విశ్వాస పరీక్షలో బలనిరూపణ చేసుకుంటుంది. ఈ క్రమంలో రాజకీయంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. స్పీకర్ సస్పెన్షన్ ఉత్తర్వుల నేపథ్యంలో విశ్వాస పరీక్షకు ముందు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. 9మంది అధికార పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలోని పరిస్థితిపై కేంద్రం గవర్నర్ నుంచి నివేదిక తెప్పించుకుంది. అసోంలో ఎన్నికల ప్రచారం ముగించుకొని ప్రధాని నరేంద్రమోదీ శనివారం రాత్రి హుటాహుటిన ఢిల్లీ చేరుకొని.. కేంద్ర మంత్రిమండలితో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడంతోపాటు కేంద్రం ముందు ఉన్న వివిధ ప్రత్యామ్నాయాలను ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం. అయితే ఈ భేటీలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నదనేది ఇంకా స్పష్టం కాలేదు. కానీ ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించే దిశగా కేంద్రం కదులుతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. మరోవైపు రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ విషయంలో వస్తున్న వార్తలు సరికావని ఉత్తరాఖండ్ మంత్రి ఒకరు తెలిపారు. ఈ పరిణామాల నడుమ ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనా? లేక విశ్వాస పరీక్ష అన్నది తేలాల్సి ఉంది. -
సీఎంపై స్టింగ్ ఆపరేషన్.. బయటికొచ్చిన సీడీ
ఉత్తరాఖండ్ రాజకీయాలు మంచి ఆసక్తికరంగా మారాయి. అక్కడి ముఖ్యమంత్రి హరీష్ రావత్‌పై చేసిన స్టింగ్ ఆపరేషన్ సీడీలను కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు బయటపెట్టారు. తిరుగుబాటు జెండా ఎగరేసిన 9 మంది ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు బీజేపీ ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్లు రెబెల్ ఎమ్మెల్యేలు చెప్పారు. తనకు మద్దతిస్తే డబ్బులిస్తానని రావత్ మభ్యపెట్టారని అన్నారు. మార్చి 23వ తేదీన ఈ స్టింగ్ ఆపరేషన్ చేశారని, ఇందులో ముఖ్యమంత్రి హరీష్ రావత్ స్వయంగా ఎమ్మెల్యేల కొనుగోలు గురించి మాట్లాడారని రెబెల్ ఎమ్మెల్యేలు తెలిపారు. అయితే, రెబెల్ ఎమ్మెల్యేల ఆరోపణలను ముఖ్యమంత్రి హరీష్ రావత్ తోసిపుచ్చారు. వాళ్ల ఆరోపణలలో వాస్తవం లేదని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ చీఫ్ కూడా అన్నారు. -
'కాంగ్రెస్ ప్రభుత్వాలపై బీజేపీ కుట్ర'
డెహ్రడూన్: కాంగ్రెస్ పాలనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కూనీ చేస్తోందని విమర్శించారు. సమాఖ్య వ్యవస్థ గురించి మొసలి కన్నీరు కారుస్తూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. కపట రాజకీయ వ్యూహాలతో ఎదురుదాడికి దిగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముందు పోలీసు గుర్రంపై దాడికి చేశారు.. ఇప్పుడు రాజకీయ బేరసారాలకు పాల్పడుతున్నారని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్‌లోని కాంగ్రెస్ సర్కారు మైనారిటీలో పడిందన్న బీజేపీ వాదన నేపథ్యంలో.. మార్చి 28 లోగా అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని సీఎం హరీశ్ రావత్‌ను రాష్ట్ర గవర్నర్ కృష్ణకాంత్ పాల్ ఆదేశించారు. -
'అదే జరిగితే సీఎం పదవికి రాజీనామా చేస్తా'
డెహ్రాడూన్: తనకు ఇప్పటికీ మెజారిటీ ఉందని, దానిని అసెంబ్లీలో నిరూపించుకుంటానని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ పార్టీ సీఎం హరీష్ రావత్ అన్నారు. తొమ్మిదిమంది రెబల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తమతోనే ఉన్నారని, వారు కాంగ్రెస్ తోనే ఉండిపోతామని చెప్పారని అన్నారు. ఒక వేళ మెజారిటీ లేకపోతే అప్పుడు రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి పదిమంది రెబల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చి బీజేపీతో చేతులు కలిపినట్లు వార్తలు వచ్చాయి. అదీకాకుండా ప్రస్తుతం తమకు 35మంది శాసనసభ్యుల మద్దతు ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ ఆ రాష్ట్ర గవర్నర్ ను కలిసిన నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలోనే రావత్ స్పందించారు. తనకు పూర్తి బలం ఉందని, రెబల్ ఎమ్మెల్యేలకపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హరీష్ రావత్ అంటున్నారు. తమ ఎమ్మెల్యేలు అటు వెళ్లిపోయారంటూ బీజేపీ వాళ్లు చెబుతున్న సంఖ్యలన్నీ తప్పులేనని అన్నారు. ఇప్పటివరకు కేవలం ఒక్క పేరు మాత్రమే బయటకు వచ్చిందని, ఇంకా ఎవరెవరు ఉన్నారో చూడాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. -
మరో సీఎం పదవికి ఎసరు!
మరో ముఖ్యమంత్రి చాప కిందకు నీళ్లు వస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ తర్వాత ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తబోతోంది. హరీష్ రావత్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 10 మంది కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు.. 28 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసిపోయారు. శుక్రవారం రాత్రి పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. వీళ్లంతా కలిసి శనివారం నాడు బీజేపీ అధినాయకత్వాన్ని కలిసే అవకాశం కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ, హరక్ సింగ్ రావత్, ప్రదీప్ బాత్రా, శైలేంద్ర సింఘాల్, ఉమేష్ చంద్ర కౌ, సుబోధ్ ఉనియాల్, శైలా రాణి రావత్, అమృతా రావత్, కుమార్ ప్రణవ్.. ఈ పదిమందీ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ భగత్ సింగ్ కోషియారీ నేతృత్వంలోని త్రిసభ్య బీజేపీ కమిటీ గవర్నర్ కేకే పాల్‌ను కలిసి.. హరీష్ రావత్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని, అందువల్ల దాన్ని డిస్మిస్ చేయాలని కోరింది. ఈ బృందంలో ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ ఎమ్మెల్యే అజయ్ భట్ కూడా ఉన్నారు. తగిన వివరాలు సేకరించిన తర్వాత చర్యలు తీసుకుంటామని గవర్నర్ ఆ బృందానికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే తనకు పూర్తి బలం ఉందని, రెబల్ ఎమ్మెల్యేలకపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హరీష్ రావత్ అంటున్నారు. తమ ఎమ్మెల్యేలు అటు వెళ్లిపోయారంటూ బీజేపీ వాళ్లు చెబుతున్న సంఖ్యలన్నీ తప్పులేనని అన్నారు. ఇప్పటివరకు కేవలం ఒక్క పేరు మాత్రమే బయటకు వచ్చిందని, ఇంకా ఎవరెవరు ఉన్నారో చూడాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, తాజా పరిణామంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. తొలుత అరుణాచల్ ప్రదేశ్ లోను, ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోను ఎమ్మెల్యేలను కొనేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ అత్యంత అవినీతిమయమైన, దేశద్రోహ, అధికార దాహంతో ఉన్న పార్టీ అని రుజువు అవుతోందని వ్యాఖ్యానించారు. Brazen horse trading-first Arunachal now Uttarakhand. BJP proving to be most corrupt, deshdrohi n power hungry party https://t.co/vNTpy7T2xE — Arvind Kejriwal (@ArvindKejriwal) March 19, 2016 -
బీఫ్‌పై సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
హరిద్వార్: గొడ్డుమాంసం, గోవధ చేసేవారిపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవధ చేసేవారికి భారత్‌లో నివసించే హక్కులేదని హరీష్ రావత్ వ్యాఖ్యానించారు. 'గోవులను ఏ మతానికి చెందినవారు చంపినా సరే.. వాళ్లు భారత్‌కు అతిపెద్ద శత్రువు. అలాంటి వ్యక్తులకు దేశంలో నివసించే హక్కులేదు' అని ఓ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం అన్నారు. గోవులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గోవధ చేసేవారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. దేశంలో అసహనం పెరిగిపోతోందని నిరసన తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో మార్చ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకే చెందిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలావుండగా, బీజేపీ పాలిత హరియాణ ముఖ్యమంత్రి ఎమ్ ఎల్ ఖట్టర్ ఇటీవల బీఫ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముస్లింలు బీఫ్ తినడం మానేయాలని వ్యాఖ్యానించారు. -
మా అడ్రస్ తప్పుగా ఉందేమో?
డెహ్రాడూన్: కేంద్ర ప్రభుత్వ నిధులు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి అందకపోవటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్.. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. ఆర్థిక సాయం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా.. అదిగో.. ఇదిగో.. అంటూ చెబుతున్నారే తప్ప ఇంతవరకు తమ వద్దకు నిధులు చేరలేదని రావత్ అన్నారు. ఉత్తరాఖండ్ అడ్రసు తప్పుగా నమోదై ఉండబట్టే నిధులు తమదాకా చేరటం లేదేమోనని రావత్ ఎద్దేవా చేశారు. అర్ధ కుంభమేళా, క్లీన్ గంగా పథకాలకోసం నిధులు ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం తప్పించుకోలేదన్నారు. వచ్చే ఏడాది హరిద్వార్‌లో జరగనున్న అర్ధ కుంభమేళాకు రూ.500కోట్లు విడుదల చేయాలని రావత్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా తొలగించాలన్న 14వ ఫైనాన్స్ కమిషన్ నివేదికలు సరికాదన్నారు. -
'ఐటీ విప్లవ పితామహుడు'
డెహ్రాడూన్:భారతదేశంలో ఐటీ విప్లవంలో వచ్చిన సమూల మార్పులకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీనే కారణమని ఉత్తరఖాండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ప్రశంసలు కురిపించారు. రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో భాగంగా ఇక్కడకు విచ్చేసిన రావత్.. రాజీవ్ గాంధీ ఎప్పటికీ ఐటీ విప్లవ పితామహుడిగా నిలిచిపోతారనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ప్రపంచదేశాల్లో భారత్ ను బలమైన దేశంగా చేయడానికి రాజీవ్ చేసిన కృషి వెలకట్టలేదని రావత్ తెలిపారు. ఆయన 1984-89 మధ్య కాలంలో దేశ ప్రధానిగా చేసిన సేవలు ఎప్పటికీ ప్రజల్లో నిలిచిపోతాయన్నారు. ఆయన ఎప్పుడూ నియంతలా కాకుండా ప్రజల ఐక్యత కోసం పాటు పడేవారని కొనియాడారు. ఒక ఐటీ రంగాన్ని అభివృద్ధి పరచడంలోనే కాకుండా.. ప్రజాస్వామ్య దేశానికి పంచాయతీ రాజ్ సంస్థలు అవసరం ఎంతో ఉందని గ్రహించిన ప్రధాని ఆయననే పేర్కొన్నారు. ఆ క్రమంలోనే పంచాయతీ రాజ్ లను తీర్చిదిద్దడానికి రాజీవ్ ఎంతో కృషి చేశారన్నారు. -
ప్రారంభమైన చార్‌థామ్ యాత్ర
-
ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ యాత్ర ప్రారంభం
ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి, గంగోత్రి ఆలయాల గేట్లు తెరుచుకోవడంతో చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. అక్షయ తృతీయ రోజునే ఈ యాత్రను ప్రారంభించాలని ముందుగా ముహూర్తం పెట్టారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఖర్సాలి ప్రాంతంలో పవిత్ర ఢోలీని స్వయంగా ఎత్తుకుని యమునోత్రికి వెళ్లి.. ఈ యాత్రను ప్రారంభించారు. గంగోత్రి గేట్లను మధ్యాహ్నం 12.30 గంటలకు తెరిచారు. యమునోత్రి గేట్లను మాత్రం అంతకంటే గంట ముందే, అంటే ఉదయం 11.30 గంటలకు తెరిచారు. చార్ధామ్ యాత్రలోని మరో రెండు క్షేత్రాలైన కేదార్నాథ్ గేట్లను ఈనెల 24వ తేదీ ఉదయం 8.30 గంటలకు, బద్రీనాథ్ గేట్లను 26వ తేదీ ఉదయం 5.15 గంటలకు తెరుస్తారు. రెండేళ్ల క్రితం చార్ధామ్ యాత్ర సమయంలోనే ఉన్నట్టుండి వరదలు రావడంతో వేలాది మంది యాత్రికులు మరణించారు. ఆలయాలు కూడా కొట్టుకుపోయాయి. ఈసారి అలా భయపడాల్సిన ప్రమాదం ఏమీ లేదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. -
రావత్, ఫడ్నవిస్ వాగ్వాదం
ప్రణాళికా సంఘం రద్దు ప్రతిపాదనపై గొడవ న్యూఢిల్లీ: ప్రణాళికా సంఘాన్ని రద్దుచేయాలన్న కేంద్రప్రభుత్వ ప్రతిపాదనపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య శనివారం వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ అంశంపై, కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్‌కు, బీజేపీ పాలిత రాష్ట్రమైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు వాదోపవాదాలు జరిగాయి. శనివారం ఢిల్లీలో ‘ఎజెండా ఆజ్‌తక్’ శీర్షికతో జరిగిన చర్చ సందర్భంగా ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఈ వాగ్వాదం నెలకొంది. చాలా కాలంగా ఎన్నో పరీక్షలకు తట్టుకుని నిలబడ్డ ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయాలన్న ప్రతిపాదనవల్ల దేశంలో అనిశ్చితి ఏర్పడిందని, దీనిపై ఉత్తరాఖండ్ వంటి చిన్న రాష్ట్రాలకు పలు అనుమానాలు నెలకొన్నాయని, ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలకు న్యాయం చేసేందుకు ప్రణాళికా సంఘం వంటి సంస్థలు గతంలో ఎంతో కృషిచేశాయని హరీష్ రావత్ వాదించగా, ఆయనవాదనను ఫడ్నవిస్ ఖండించారు. ప్రణాళికా సంఘం స్థానంలో కొత్తగా ఏర్పడబోయే సంస్థవల్ల రాష్ట్రాలకు మరిన్ని హక్కులు సంక్రమిస్తాయని ఫడ్నవిస్ అన్నారు. ఈ విషయమై రావత్ వ్యక్తంచేసిన ఆందోళనలు ఆధారరహితమైనవని ఆయన వ్యాఖ్యానించారు. ఎలాంటి సంప్రదింపులు లేకుండానే ప్రణాళికా సంఘాన్ని రద్దుచేయాలన్న ప్రతిపాదన ఏకపక్షంగా ఉందని రావత్ వ్యాఖ్యానించగా, దేశం అభివృద్ధి పథంలో సాగేందుకు, బీజేపీ రాష్ట్రాలు, బీజేపీయేతర రాష్ట్రాలు ప్రగతి సాధించేందుకు కేంద్రంలోని బీజేపీ తగిన చర్యలు తీసుకుంటుందని ఫడ్నవిస్ అన్నారు. -
సీఎం కాన్వాయ్ పై రాళ్లు రువ్విన బీజేపీ కార్యకర్తలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కాన్వాయ్ పై బీజేపీ కార్యకర్తలు శుక్రవారం రాళ్లు రువ్వారు. నైనిటాల్ జిల్లాలోని హల్దవానీలో ఓ కుటుంబాన్ని పరామర్శించి తిరిగొస్తుండగా సీఎం కాన్వాయ్ పై బీజేపీ కార్యక్తలు ఈ దాడికి పాల్పడ్డారు. వారు విసిరిన రాళ్లు సీఎం ప్రయాణిస్తున్న కారు వెనుక అద్దానికి తగిలాయి. హరీష్ రావత్ కారు ముందు సీటులో కూర్చోవడంతో ఆయన ఎటువంటి గాయాలు కాలేదని ఏడీజీ రాంసింగ్ మీనా తెలిపారు. రాళ్లు రువ్విన నలుగురు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి, ప్రశ్నిస్తున్నట్ట చెప్పారు. ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో బాధిత కుటుంబాన్ని రావత్ అంతకుముందు పరామర్శించారు. దోషులను చట్టప్రకారం శిక్షిస్తామని హామీయిచ్చారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని ఏడీజీ తెలిపారు. -
ఉత్తరాఖండ్ ఎన్నికల్లో 50 శాతం పోలింగ్
డెహ్రాడున్: ఉత్తరాఖండ్ లో ఆదివారం జరిగిన ఉప ఎన్నికల్లో 50 శాతం పోలింగ్ నమోదైంది. మూడు అసెంబ్లీ స్థానాలకు గాను ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో సగం మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ధార్చులా, దోయ్ వాలా, సోమేశ్వర్ అసెంబ్లీ స్థానాల్లో మూడు లక్షల మంది ఓటర్లు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు శాంతియుతంగా ఓటు వినియోగించుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి రాధా రాతూరి తెలిపారు. పోలింగ్ ఏర్పాట్లు ఇక్కడ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన హరీష్ రావత్ కు ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యమైనవి. ముఖ్యమంత్రిగా రావత్ తన బలాన్ని నిరూపించుకునే గడువు జూలై 31 తో ముగుస్తున్నసంగతి తెలిసిందే. విజయ్ బహుగుణ నుంచి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన ఆయన ఫిబ్రవరి 1వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ధార్చులా అసెంబ్లీ నుంచి బరిలోకి దిగిన రావత్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది వరదలతో పెను విధ్వంసానికి గురైన ఉత్తరాఖండ్‌లో విజయ్ బహుగుణ సరైన రీతిలో సహాయ, పునరావాస చర్యలు చేపట్టడంలో విఫలమవడంతో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ తన ప్రతిష్టను కాపాడుకునేందుకు విజయ్ బహుగుణను తొలగించి అప్పటి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి 65 యేళ్ళ హరీష్ రావత్ ను ముఖ్యమంత్రిగా నియమించింది. అప్పట్లో కాంగ్రెస్ అధినాయకత్వం చేసిన విజ్ఞప్తి మేరకు విజయ్ బహుగుణ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. -
ఉత్తరాఖండ్ సీఎంగా రావత్
మరో 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా హరీశ్ రావత్ పగ్గాలు చేపట్టారు. శనివారమిక్కడ రాజ్‌భవన్ లాన్స్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా 65 ఏళ్ల రావత్‌తో గవర్నర్ అజీజ్ ఖురేషీ పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరంతా ఇంతకుముందు విజయ్ బహుగుణ మంత్రివర్గంలో పనిచేసినవారే. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రావత్ మాట్లాడుతూ.. గతేడాది సంభవించిన పెను వరదల తాకిడితో దెబ్బతిన్న రాష్ట్రాన్ని తిరిగి కోలుకునేలా చేయడమే తన ముందున్న ప్రధాన కర్తవ్యమని ఉద్ఘాటించారు. అంతకుముందు దాదాపు సుదీర్ఘంగా ఐదుగంటలపాటు సాగిన ఉత్తరాఖండ్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావేశంలో కేంద్ర మంత్రి హరీశ్ రావత్‌ను సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి జనార్దన్ ద్వివేదితోపాటు గులాం నబీ ఆజాద్, అంబికాసోనీలు పార్టీ కేంద్ర పరిశీలకులుగా హాజరయ్యారు. సమావేశానంతరం పార్టీ సీనియర్ నేత జనార్దన్ ద్వివేది మాట్లాడుతూ.. రావత్ పేరును కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమోదించినట్టు వెల్లడించారు. గతేడాది ఉత్తరాఖండ్‌ను వరదలు ముంచెత్తిన సమయంలో సీఎంగా ఉన్న విజయ్ బహుగుణ వ్యవహరించిన తీరుపై విపక్షాలనుంచేగాక సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కారణంగా పార్టీ ప్రతిష్ట మసకబారింది. -
ఉత్తరాఖండ్ సీఎం విజయ్ బహుగుణ రాజీనామా?
కాంగ్రెస్ అధిష్ఠానం తనను తొలగించే అవకాశం ఉందన్న కథనాలు రావడంతో.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. గవర్నర్ అజీజ్ ఖురేషీకి ఆయన తన రాజీనామా లేఖ సమర్పించారని విశ్వసనీయ సమాచారం. ముఖ్యమంత్రి పదవి రేసులో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి హరీష్ రావత్ అందరికంటే ముందున్నారు. ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రీతమ్ సింగ్, లోక్‌సభ సభ్యుడు సత్పాల్ మహరాజ్‌ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.అయితే హరీష్ రావత్ ఒక్కరికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఉత్తరాఖండ్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా హరీష్ రావత్ పేరు సీఎం రేసులో వినిపించింది. కానీ అనూహ్యంగా విజయ్ బహుగుణను సీఎం చేశారు. హరీష్ రావత్‌ను ముఖ్యమంత్రిని చేయొద్దంటూ 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోనియాగాంధీకి ఈనెల 11న ఓ లేఖ రాశారు. విజయ్ బహుగుణ సర్కారు బాగానే పనిచేస్తోందని, అందువల్ల రావత్‌ను తీసుకురావాల్సిన అవసరం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ, ఇప్పటికే బహుగుణను తప్పించాలని అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు తెలిసింది. పైపెచ్చు, ఈ పదవి కోసం ఢిల్లీ నాయకులను రావత్ ఈనెల మొదట్నుంచే కలవడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసి మిగిలిన నాయకులు కూడా సీఎం కుర్చీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. తనకు అవకాశం ఇస్తే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తానని రావత్ ఈనెల 14న బహిరంగంగా ప్రకటించారు.