ఫలితం సీల్డు కవర్లో.. నేనే నెగ్గాను
డెహ్రాడూన్: ఉత్కంఠ పరిణామాల మధ్య ఉత్తరాఖండ్ అసెంబ్లీలో పదవీచ్యుత ముఖ్యమంత్రి హరీశ్ రావత్ బలపరీక్ష ఎదుర్కొన్నారు. మంగళవారం సుప్రీం కోర్టు పర్యవేక్షణలో అసెంబ్లీ స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్వాల్ ఓటింగ్ నిర్వహించారు. ఫలితాన్ని ప్రకటించలేదు. బలపరీక్ష వివరాలను సీల్డు కవర్లో సుప్రీం కోర్టుకు సమర్పించనున్నారు. బుధవారం సుప్రీం కోర్టు అధికారికంగా బలపరీక్ష వివరాలను ప్రకటించనుంది. దీంతో ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతుగా 33 మంది ఎమ్మల్యేలు ఓటు వేసినట్టు ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పారు. బలపరీక్ష అనంతరం తానే నెగ్గానని, ఇది ప్రజాస్వామ్య విజయమని హరీశ్ రావత్ ప్రకటించారు. బీజేపీ ఓటమిని అంగీకరించినట్టు సమాచారం. బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మొత్తం 70 మంది ఎమ్మెల్యేలు ఉండగా తొమ్మిదిమంది కాంగ్రెస్ రెబెల్స్పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో మిగిలిన 61 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్లో పాల్గొన్నారు. వీరిలో బీజేపీకి 28, కాంగ్రెస్కు 27, బీఎస్పీకి ఇద్దరు, ఉత్తరాఖండ్ క్రాంతి దళ్కు ఓ ఎమ్మెల్యే, మరో ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. బలపరీక్షకు ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే రేఖ ఆర్య.. బీజేపీ గూటికి చేరగా, కాంగ్రెస్కు బీఎస్పీ అధినేత్రి మాయావతి మద్దతు ప్రకటించారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ మద్దతు తెలిపారు. కాగా బలపరీక్షలో కాంగ్రెస్కు అనుకూలంగా ఎన్ని ఓట్లు పడ్డాయన్నది అధికారికంగా తేలాల్సివుంది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో హరీశ్ రావత్ ప్రభుత్వం మైనార్టీలో పడిన సంగతి తెలిసిందే. మార్చి 27 నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు హరీశ్ బలపరీక్ష ఎదుర్కొన్నారు. బలపరీక్ష నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు రాష్ట్రపతి పాలన తొలగించారు.