
నేను నిరపరాధిని: సీఎం రావత్
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ తాజాగా మరో వివాదంలో ఇరుకున్నారు. లంచం కేసు ఎదుర్కొంటున్న ఆయన ఇటీవల స్థానిక దినపత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, నిర్దోషినని అందులో పేర్కొన్నారు. ప్రజలు తనకు అండగా నిలవాలని కూడా అభ్యర్థించారు. స్టింగ్ ఆపరేషన్ కేసులో సీబీఐ ఎదుట హాజరు కావడానికి ముందురోజు ఉత్తరాఖండ్ సమాచార శాఖ ఈ ప్రకటన జారీచేసింది. తనను కుట్రపూరితంగా ఇరికించారని ప్రకటనలో రావత్ పేర్కొన్నారు.
దీనిపై ప్రధాన ప్రతిపక్షం బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. ప్రజా ధనాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారని మండిపడింది. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లఘించి ప్రకటన ఇచ్చిన రావత్ పై కేసు నమోదు చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి మున్నా సింగ్ చౌహాన్ డిమాండ్ చేశారు. అయితే సీఎం సందేశాన్నే ప్రకటన రూపంలో ఇచ్చామని సమాచార శాఖ డైరెక్టర్ వినోద్ శర్మ తెలిపారు.