ఐపీఎల్‌లో పొగాకు, మద్యం ఉత్పత్తుల ప్రకటనలపై నిషేధం? | Health Ministry Calls for Ban on Tobacco and Alcohol Advertising in IPL | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌లో పొగాకు, మద్యం ఉత్పత్తుల ప్రకటనలపై నిషేధం?

Published Mon, Mar 10 2025 12:51 PM | Last Updated on Mon, Mar 10 2025 1:25 PM

Health Ministry Calls for Ban on Tobacco and Alcohol Advertising in IPL

ప్రజారోగ్యాన్ని పెంపొందించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మ్యాచ్‌లు, సంబంధిత కార్యక్రమాలు, జాతీయ టెలివిజన్ ప్రసారాల సమయంలో అన్ని రకాల పొగాకు, ఆల్కహాల్ ప్రకటనలను నిషేధించాలని కోరింది. ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడంలో, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్‌సీడీ) వ్యాప్తిని నియంత్రించడంలో క్రీడల పాత్ర కీలకమని ఎత్తిచూపుతూ ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్, బీసీసీఐకి లేఖ రాసింది.

దేశంలో ఏటా సంభవించే మరణాల్లో 70 శాతం ఎన్‌సీడీల వల్ల జరుగుతున్నవేనని ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖలో హైలైట్‌ చేసింది. పొగాకు, మద్యపానం హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహంతో సహా అనేక ఇతర రోగాలకు దోహదం చేసే ప్రధాన ప్రమాద కారకాలుగా ఉన్నాయని తెలిపింది. పొగాకు సంబంధిత మరణాల్లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి దాదాపు 14 లక్షల మరణాలతో  రెండో స్థానంలో ఉందని గణాంకాలను తెలియజేసింది.

ఇదీ చదవండి: స్వల్పంగా పెరిగిన బంగారం ధర! తులం ఎంతంటే..

క్రికెట్‌కు భారత్‌లో ఆదరణ పెరుగుతోందని తెలియజేస్తూ, క్రీడలు ప్రజల ఆరోగ్య సంరక్షణ బాధ్యతను నిర్వర్తించాలని చెప్పింది. పొగాకు లేదా ఆల్కహాల్ బ్రాండ్లను ప్రోత్సహించే ప్రకటనలను నిరోధించడానికి కఠినమైన నిబంధనలు అనుసరించాలని ఐపీఎల్‌, బీసీసీఐను మంత్రిత్వ శాఖ కోరింది. అంతేకాకుండా క్రీడాకారులు, కామెంటేటర్లు, ఇతర భాగస్వాములు పొగాకు, ఆల్కహాల్‌తో ముడిపడి ఉన్న ఉత్పత్తులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రోత్సహించకుండా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఐపీఎల్‌కు ఉన్న అపారమైన ప్రజాదరణ, రోల్ మోడల్స్‌గా క్రికెటర్ల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్య కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని తెలిపింది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 2025 సీజన్‌ ప్రారంభంకానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement