పాంచ్ పటాకా | Assembly elections in five states soon in this year | Sakshi
Sakshi News home page

పాంచ్ పటాకా

Published Sun, Jan 1 2017 2:44 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

పాంచ్ పటాకా - Sakshi

పాంచ్ పటాకా

ఈ ఏడాది ఆరంభంలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు

- పోరుకు సిద్ధమైన యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా
- బీజేపీ అగ్ర నాయకత్వానికి యూపీ రూపంలో అగ్ని పరీక్ష
- నోట్ల రద్దు ప్రభావమెంత ఉంటుందనే అంచనాలు
- 2014 లోక్‌సభ ఎన్నికల ప్రదర్శనను బీజేపీ పునరావృతం చేయగలదా?

పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిక్షణ కేంద్రాలపై సర్జికల్‌ దాడులు, ఉగ్రవాదుల చొరబాట్లు, దాడులు, భారత జవాన్ల ఆత్మత్యాగం, నోట్ల రద్దుతో నెలకొన్న గందరగోళం, రాజకీయ పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలతో వాతావరణం వేడెక్కి ఉన్న నేపథ్యంలో.. దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. కీలకమైన ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో 2017 జనవరి ఆఖరు నుంచి మార్చి మొదటి వారం వరకు ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ జనవరి తొలివారంలో వెలువడుతుందని భావిస్తున్నారు. యూపీలో ఎస్పీ, ఉత్తరాఖండ్, మణిపూర్‌లలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా... గోవాలో బీజేపీ, పంజాబ్‌లో అకాలీ–బీజేపీ సంకీర్ణం పాలకపక్షాలుగా ఉన్నాయి. మొత్తంగా ఈ ఎన్నికల పోలింగ్‌ సమయానికి ప్రధాని మోదీ ప్రభుత్వానికి దాదాపు మూడేళ్లు నిండుతాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయాలు నమోదు చేసుకున్న కారణంగా యూపీలో గెలుపు బీజేపీకి అత్యవసరం. దేశంలోని మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలకుగాను 102 నియోజకవర్గాలున్న ఈ ఐదు రాష్ట్రాల్లో కాషాయ పార్టీ సాధించే ఫలితాలను మోదీ పనితీరుకు గీటురాయిగా పరిగణించే అవకాశముంది. ఈ అంశంపై ఈ వారం ఫోకస్‌..    
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌


ఎస్పీతో కాంగ్రెస్‌ పొత్తు కుదిరితే?
ములాయం కుటుంబంలో రాజీ, నోట్ల రద్దు ప్రకటించాక కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు కుదుర్చుకోవాలనే ప్రతిపాదన రెండు పార్టీల్లో వచ్చింది. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌కు సలహాలిస్తున్న ఎన్నికల నిపుణుడు ప్రశాంత్‌ కిశోర్‌ ములాయంను కూడా కలిశారు. అయితే పొత్తు ఉండదని కాంగ్రెస్‌ ఎంపీ రాజ్‌బబ్బర్‌ ప్రకటించారు. అఖిలేశ్‌ మాత్రం ఎస్పీ ఒంటిరిగా పోటీచేసినా మెజారిటీ వస్తుందని, కాంగ్రెస్‌తో కలసి పోటీచేస్తే 300 సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు. కాంగ్రెస్‌కు ఎస్పీ 40 సీట్లు ఇవ్వజూపగా, కాంగ్రెస్‌ కనీసం వంద సీట్లు కావాలంటోందని వార్తలొచ్చాయి. 1996 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి బీఎస్పీతో కాంగ్రెస్‌ పొత్తుపెట్టుకుని 126 సీట్లకు పోటీ చేసింది. కానీ ఆ ఎన్నికల్లో రెండు పార్టీలకు కలిపి వంద సీట్లు (బీఎస్పీకి 67, కాంగ్రెస్‌కు 33) దాటలేదు. అయితే యూపీలో 1989 డిసెంబర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయాక మళ్లీ ఇప్పటి వరకూ అధికారంలోకి రాలేదు. జనతాదళ్, బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ, బీజేపీ నాయకత్వంలో సంకీర్ణ, ఏకపార్టీ ప్రభుత్వాలే పాలించాయి. ఈ కాంగ్రెసేతర సర్కార్ల పాలనను ఎండగడుతూ కాంగ్రెస్‌ ‘27 సాల్‌.. బేహాల్‌ (27 ఏళ్లలో అంతా అస్తవ్యస్తం)’ అనే నినాదంతో ఎన్నికల ప్రచారం ప్రారంభించింది.


బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు?
బీజేపీ ఇంతవరకూ ఏ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బ్రాహ్మణ నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదు. లోపాయికారీగా ప్రచారమూ చేయలేదు. అందుకే ఈసారి పశ్చిమ యూపీకి చెందిన కేంద్ర మంత్రి మహేష్‌కుమార్‌ శర్మను సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఢిల్లీ పక్కనున్న నోయిడాలో ఆయన పేరున్న వైద్యుడు. గౌతంబుద్ధనగర్‌ ఎంపీ. కైలాశ్‌ హాస్పిటల్స్‌ పేరిట ఆయనకు గొలుసుకట్టు ఆస్పత్రులున్నాయి. ఐదుసార్లు గోరఖ్‌పూర్‌ నుంచి ఎంపీగా ఎన్నికైన యోగి ఆదిత్యనాథ్, వరుణ్‌గాంధీ తదితరులు సీఎం పదవిని ఆశిస్తున్నారు. వారి అనుచరులు పలు సందర్భాల్లో పోస్టర్ల ప్రచారం కూడా సాగించారు.

అకాలీ–బీజేపీ సంకీర్ణానికి కష్టకాలం!
పంజాబ్‌
పంజాబ్‌ 15వ అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల క్రితమే వేడి ప్రారంభమైంది. 1997 నుంచీ అంటే దాదాపు 20 ఏళ్లుగా పంజాబ్‌ ముఖ్యమంత్రి పీఠాన్ని ఇద్దరే జాట్‌ సిక్కు నేతలు సొంతం చేసుకున్నారు. వారు కాంగ్రెస్‌ మాజీ సీఎం కెప్టెన్‌ అమరీం దర్‌ సింగ్, ప్రస్తుత అకా లీ సీఎం ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌. మరో విశేషమేమంటే శిరోమణి అకాలీదళ్‌–బీజేపీ సంకీర్ణ సర్కారు సీఎంగా వరుసగా రెండోసారి బాదల్‌ 2012 నుం చీ ఉన్నారు. అంటే పదేళ్ల సుదీర్ఘ అకాలీ–బీజేపీ పాలన కు మూడోసారి జనం ఆమోదముద్ర వేస్తారా? లేక కాంగ్రెస్, కొత్తగా దూసుకొచ్చిన ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌)ల్లో ఒకదానికి అవకాశం కల్పిస్తారా? అనే ప్రశ్నలకు జనవరిలో జరిగే ఎన్నికల్లో జవాబు లభించనుంది. 117 ని యోజకవర్గాల్లోని దాదాపు కోటీ 96 లక్షల మంది ఓటర్లు కీలకమైన తీర్పు ఇవ్వబోతున్నారు. ఆర్థిక సంస్కరణల వల్ల సంపద పెరిగినా.. పంజాబ్‌కు వెన్నుపూస లాంటి వ్యవసాయ రంగం కుదేలైంది.  మాదకద్రవ్యాల వినియోగం మితిమీరిపోయింది.

పట్టణ ప్రాంతాల నుంచి పల్లెలకూ ఈ ‘మత్తు’ మహమ్మారి విస్తరించింది. ఈ నేపథ్యంలో దాదాపు 46 ఏళ్లుగా పంజాబ్‌లో పాలక కుటుంబంగా మారిన బాదల్‌ల ఆధిపత్యానికి వచ్చే ఎన్నికలు తెరదింపుతాయనే భావిస్తున్నారు. కాంగ్రెస్, అకాలీ–బీజేపీ కూటమి ఇలా రెండు రాజకీ య పక్షాలకు అధికారం అప్పగించే అలవాటు నుంచి ప్రజలు బయటపడడానికి ఆప్‌ అవకాశం ఇస్తోంది. మాదకద్రవ్యాల వ్యా పారం వెనుక పాలకపార్టీకి సంబంధం ఉం దనే ఆరోపణలు, బాదల్‌ కుటుంబ సభ్యులౖ పె వస్తున్న అవినీతి ఆరోపణలు అకాలీ–బీజేపీ కూటమిని ఆందోళనకు గురిచేస్తున్నా యి. బీజేపీ మాజీ ఎంపీ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ కాషాయపార్టీని వీడి.. ఎటుపోవాలో తేల్చుకోలేక చివరికి కాంగ్రెస్‌ పక్షాన చేరారు. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఆప్‌ నాలుగు సీట్లు కై వసం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

సర్వేలేం చెబుతున్నాయి..?
ఈ ఏడాది అక్టోబర్‌లో వెలువడిన ఇండియాటుడే–యాక్సిస్‌ సర్వే ఫలితాలు పాలక అకాలీ కూటమికి ఘోర పరాజయం తప్పదని సూచిస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్‌ 49–55 సీట్లతో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించవ చ్చు. సాధారణ మెజారిటీకి 59 సీట్లు అవసరం. ఆప్‌ 42–46 సీట్లతో రెండో స్థానంలో ఉందని సర్వే తెలిపింది. పాలక అకాలీ–బీజేపీ కూటమి కేవలం 17–21 సీట్లతో భారీ ఓటమి ఎదుర్కోబోతోందని వివరించింది. ఏదేమైనా 1970లో 43 ఏళ్ల వయసులో తొలిసారి సీఎం అయిన ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ ఆరోసారి సీఎం పదవిని 2017 మార్చిలో చేపట్టడం సాధ్యమయ్యే విషయం కాకపోవచ్చు.

యూపీ.. లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనలా..?
ఉత్తర్‌ప్రదేశ్‌
దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌. 20 కోట్లకుపైగా జనాభా, 80 లోక్‌సభ స్థానాలు, 403 అసెంబ్లీ సీట్లున్న యూపీ.. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ రాష్ట్ర అసెంబ్లీకి 17వ ఎన్నికలు మూడు నెలల్లోపు జరుగనున్నాయి. మరోవైపు 2014లో బీజేపీ చరిత్రలోనే తొలిసారిగా సొంత మెజారిటీ (282 సీట్లు)తో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితికి చేరుకుంది (మిత్రపక్షాలను కలుపుకొని ఎన్డీయే సంకీర్ణ సర్కారు కొలువుదీరింది). యూపీలో ఏకంగా 71 లోక్‌సభ సీట్లు గెలవడమే బీజేపీకి ఈ స్థాయి విజయాన్ని అందించింది. బీజేపీ బలహీనంగా ఉందని భావించిన తూర్పు యూపీలో గెలుపు కోసం ప్రధాని మోదీ వారణాసి నుంచి కూడా పోటీచేసి విజయం సాధించారు. కిందటి రెండు సార్లు (2007, 2012) జరిగిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు యూపీ శాసనసభ ఎన్నికలు పార్లమెంటు ఎన్నికలకు ‘సెమీఫైనల్‌’ అంటూ రాజకీయ వ్యాఖ్యాతలు పేర్కొన్నారు.

కానీ వాస్తవానికి లోక్‌సభ ఎన్నికలకు రెండేళ్ల ముందు జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలు జాతీయ ఎన్నికల (పార్లమెంటు) ఫలితాలను ప్రభావితం చేయలేదని గత అనుభవాలే చెబుతున్నాయి. 2012లో జరిగిన యూపీ ఎన్నికలను కూడా మీడియా ఇలాగే లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనలంటూ అభివర్ణించింది. అందులో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) తొలిసారి మెజారిటీ సీట్లు (224) సాధించి అధికారంలోకి వచ్చింది. ప్రధాన ప్రతిపక్షం బీఎస్పీ 80 సీట్లు సాధించగా.. బీజేపీ 47 సీట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. 28 స్థానాలతో కాంగ్రెస్‌ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే రెండేళ్ల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఫలితాలకు పొంతన లేని ఫలితాలొచ్చాయి. 71 లోక్‌సభ సీట్లతో బీజేపీ అగ్రస్థానంలో నిలబడింది. ఎస్పీ ఐదు సీట్లు, కాంగ్రెస్‌ రెండు సీట్లే గెలుచుకున్నాయి. 80 అసెంబ్లీ స్థానాలు తెచ్చుకున్న బీఎస్పీకి ఒక్క లోక్‌సభ సీటూ దక్కలేదు.

ఇప్పటి పరిస్థితి ఏమిటి?
కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చాక.. యూపీలో, దేశంలో సంభవించిన పరిణామాలు, ఎస్పీ కొత్త సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ పాలన, ములాయం పరివారంలో కీచులాటలు వంటివి ఏ మేరకు ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికలను ప్రభావితం చేస్తాయో చూడాల్సి ఉంది. డిసెంబర్‌ 30న కుమారుడు అఖిలేశ్, సోదరుడు రాంగోపాల్‌ను ములాయం ఆరేళ్ల పాటు బహిష్కరించారు. 24 గంటలు గడవకుండానే 31న మధ్యాహ్నం ఈ నిర్ణయాన్ని రద్దుచేసుకుని సంచలనం సృష్టించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ములాయం కుటుంబ సభ్యులంతా కలిసే బీజేపీపై పోరాడుతారని ములాయం తమ్ముడు శివపాల్‌సింగ్‌ ప్రకటించడం గమనార్హం. నవంబర్‌ రెండో వారం నుంచి డిసెంబర్‌ 30 వరకూ 50 రోజులు అమలు చేసిన నోట్ల రద్దు ప్రక్రియ ఫలితంగా జనం ఎటు తీర్పిస్తారనే విషయం అనూహ్యంగా కనిపిస్తోంది.


లోక్‌సభ ఫలితాలే పునరావృతమవుతాయా?
యూపీ ప్రత్యేక పరిస్థితులను పక్కనబెడితే... 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఢిల్లీ, బిహార్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. అయితే యూపీ ప్రజలు కేంద్రంలో పదేళ్లు రాజ్యమేలిన కాంగ్రెస్‌ కూటమిని ఓడించడానికి, మోదీని ప్రధానిని చేయడానికే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేశారనే విశ్లేషణలున్నాయి. మరోవైపు కొన్ని నెలల కిందటి ఓ సర్వేలో.. అధికార సమాజ్‌వాదీ పార్టీ ఈసారి మెజారిటీ సాధించకున్నా, అత్యధిక సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా నిలుస్తుందని వెల్లడైంది. తర్వాత జరిపిన సర్వేల్లోనూ సమాజ్‌వాదీ వెనుకబడినట్లు తేలింది. ములాయం కుటుంబంలో రేగిన చిచ్చు, సమాజ్‌వాదీలో పెచ్చరిల్లిన కీచులాటల తర్వాత జరిపిన సర్వేలో మాత్రం బీజేపీ 170 నుంచి 183 సీట్లతో పాలకపక్షంగా మారే వీలుందనే అంచనాలు వేశాయి.

‘పరివార్‌’ కీచులాటలు బీజేపీకి లాభిస్తాయా?
కిందటేడాది జనతా పరివార్‌ పార్టీలు ఎస్పీ, జేడీయూ, ఆర్జేడీ, జేడీఎస్‌లవిలీనం ప్రయత్నాలకు ఎస్పీ నేత ములాయం గండికొట్టారు. అంతేకాదు బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ–జేడీయూలు కాంగ్రెస్‌తో కలసి మహా కూటమి పేరుతో బీజేపీపై పోరుకు సిద్ధమైనపుడు.. సీట్ల పంపకాన్ని నిరసిస్తూ ఎస్పీ విడిగా పోటీచేసింది. దీంతో పరోక్షంగా బీజేపీకి మేలు చేయడానికి ప్రయత్నించిందనే ఆరోపణలు ఎదుర్కొంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని యూపీ ఎన్నికల్లో ఆర్జేడీ–జేడీయూ కూటమి విడిగా పోటీచేస్తే ఎస్పీ కొంతమేర నష్టపోకతప్పదనే అభిప్రాయముంది.

అఖిలేశ్‌పై వ్యతిరేకత లేదా?
2012 మార్చి 15న తండ్రి అనూహ్యంగా వేసిన ఎత్తుగడతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 38 ఏళ్ల అఖిలేశ్‌ యాదవ్‌ గత నాలుగున్నరేళ్లలో తండ్రి, చిన్నాన్నలు, ఆజంఖాన్‌ వంటి సీనియర్‌ మంత్రుల పెత్తనాన్ని భరిస్తూ పాలన సాగిస్తున్నారు. పాలనలో పూర్తి స్వేచ్ఛ లేకున్నా.. యువనేతగా ఆధునిక విధానాలు, పోకడలతో కావల్సినంత మంచి పేరే తెచ్చుకున్నారు. ఆగ్రా–లక్నో ఎక్స్‌ప్రెస్‌వే వంటి ప్రధాన నగరాలను కలిపే విశాలమైన రహదారులు, లక్నో మెట్రో వంటి భారీ ప్రాజెక్టులు అఖిలేశ్‌ చొరవతోనే ప్రారంభమయ్యాయి. వాటిలో కొన్ని పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కులం, మతంతో సంబంధం లేకుండా చదువుకున్న యువతరం, సామాజిక చైతన్యమున్న ప్రజానీకం మద్దతు అఖిలేశ్‌కే లభిస్తోందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ములాయం మాత్రం అఖిలేశ్‌ చేపట్టిన ప్రాజెక్టులు అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీని గెలిపించలేవని, వివిధ సామాజికవర్గాలను దగ్గర చేసుకుని ముందుకు సాగితేనే మంచిదని చెబుతున్నారు. సామాజిక సమీకరణాల్లో తన తమ్ముడు శివపాల్‌ యాదవ్‌ది అందెవేసిన చెయ్యని పొగుడుతూ, ఎన్నికల వ్యూహాల కోసం ఆయననే విశ్వసిస్తున్నారు.

ఏ వర్గం ఓటు ఎటువైపు?
రెండున్నరేళ్ల కింద జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ముస్లింలు మినహా మిగతా అన్ని వర్గాల ప్రజల్లో అత్యధిక శాతం బీజేపీకే ఓటేశారని పోలింగ్‌ అనంతర సర్వేలు సూచించాయి. అగ్రవర్ణాలతోపాటు యాదవేతర వెనుకబడిన వర్గాలు(బీసీలు), దళితులు బీజేపీ వైపు మొగ్గారు. దాదాపు పది శాతం జనాభా ఉన్న బ్రాహ్మణుల విషయానికి వస్తే... వారు ఓటేసినా, వేయకపోయినా వారి మద్దతుందని ప్రచారం జరిగిన పార్టీ లేదా కూటమికి ఎన్నికల్లో మేలు జరిగిన సందర్భాలే ఎక్కువ. బ్రాహ్మణ నేతనుæ సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటించినా, ప్రకటించకపోయినా వారి ఓటు ఈసారి కమలానికేనని ఇటీవల కొన్ని మీడియా సంస్థల సర్వేల్లో తేలింది. బీసీల్లో యాదవేతర బీసీల్లో 44 శాతం వరకూ ఓటు బీజేపీకేనని.. జనాభాలో 19 శాతమున్న ముస్లింలలో అధికశాతం ఎస్పీకి  ఓటేస్తారని భావిస్తున్నారు. అయితే మాయవతి ఈసారి ముస్లిం ఓటు బ్యాంకుపై దృష్టి సారించి, ఇప్పటికే 125 సీట్లను ముస్లింలకు కేటాయించారు. ఇక జనాభాలో 21 శాతం ఉన్న దళితుల్లో అత్యధికులు అభిమానించేది బీఎస్పీనే.

నోట్ల రద్దుతో ఎవరికి నష్టం?
యూపీలో పన్నెండేళ్లుగా ప్రధాన పార్టీలుగా బలపడిన ఎస్పీ, బీఎస్పీలు అసెంబ్లీ ఎన్నికల కోసం పెద్ద మొత్తాల్లో డబ్బు సమకూర్చుకున్నాయనీ, నోట్ల రద్దుతో ఆ రెండు పార్టీలు కుదేలయిపోతాయని కొన్ని మీడియా సంస్థలు విశ్లేషిస్తున్నాయి. బీజేపీ కూడా ఈ ప్రచారానికి ఊతమిస్తోంది. అయితే నోట్ల రద్దుతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడగా.. ఉపాధి కోల్పోయిన అసంఘటిత రంగంలోని ప్రజలు బీజేపీ విషయంలో ఎలా స్పందిస్తారనేది ఫలితాలను తేల్చేస్తుందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.

బీజేపీకి తొలి అవకాశం?
మణిపూర్‌
ఈశాన్య రాష్ట్రాల్లో పెద్దదైన అస్సాంలో గత ఏప్రిల్‌లో తొలిసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఈసారి మణిపూర్‌లోనూ విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఇప్పటివరకూ ప్రాంతీయ పార్టీలే కాంగ్రెసేతర జాతీయ పార్టీలతో చేతులు కలిపి ఇక్కడ అధికారంలోకి వచ్చాయి. కాంగ్రెస్‌ సీఎంలలో తొలుత ఎక్కువ కాలం సీఎంగా ఉన్నది రిషాంగ్‌ కేషింగ్‌. ఆయన మొత్తం పదేళ్లు సీఎం పదవిలో ఉన్నారు. తర్వాత ప్రస్తుత కాంగ్రెస్‌ సీఎం ఓక్రం ఇబోబీ సింగ్‌ రాబోయే ఎన్నికల నాటికి 15 ఏళ్లు వరుసగా ముఖ్యమంత్రిగా ఉన్న నేతగా రికార్డుకెక్కుతారు. 60 సీట్లున్న మణిపూర్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే బీజేపీ కనీస మెజారిటీకి అవసరమైన 31 నుంచి 35 సీట్లు సాధిస్తుందని ఇండియాటుడే–యాక్సిస్‌ సర్వే అంచనా వేసింది. దశాబ్దంన్నరకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు 19–24 సీట్లు మించకపోవచ్చని పేర్కొంది. దాదాపు 42 శాతం హిందువులున్న మణిపూర్‌లో బీజేపీ గెలిస్తే ఈశాన్యంలో ఇది రెండో గెలుపవుతుంది. కేవలం రెండే లోక్‌సభ సీట్లు, 12 లక్షల మంది ఓటర్లే ఉన్నా.. ఇక్కడి గెలుపు ఈశాన్యంలో బీజేపీ బలోపేతం కావడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.

సంప్రదాయం కొనసాగుతుందా?
గోవా
చిన్న రాష్ట్రం గోవాలో  40 అసెంబ్లీ సీట్లున్నాయి. జనాభా రీత్యా చిన్నదే అయినా పరిశ్రమలు, టూరిజం, భౌగోళిక స్థితిగతులు, చరిత్ర కారణంగా ఈ రాష్ట్రానికి రాజకీయ ప్రాధాన్యం ఉంది. కేంద్ర రక్షణమంత్రి మనోహర్‌ పరీకర్‌ గోవా సీఎంగా మూడు సార్లు కలిపి ఆరున్నరేళ్లు పనిచేశారు. గోవా 1987లో రాష్ట్ర హోదా పొందడానికి ముందు కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది. ఆ సమయంలో మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ అనే ప్రాంతీయ పార్టీ అధికారంలో ఎక్కువ కాలం ఉంది. 1990ల రెండో భాగంలో బీజేపీ బలపడింది. గోవా పీపుల్స్‌ పార్టీ నేత ఫ్రాన్సిస్కో సార్డిన్హా బీజేపీ మద్దతుతో 1999 నవంబర్‌ ఆఖరు నుంచి 2000 అక్టోబర్‌ వరకూ సీఎంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించారు. ఆ తర్వాత పాలకపక్షంగా కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఆవిర్భవించింది.

2007 నుంచి బీజేపీ, కాంగ్రెస్‌ ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి రావడం ఆనవాయితీగా మారి గోవాలో రాజకీయ సుస్థిరతకు బాటలుపడ్డాయి. 2014 నవంబర్‌లో అప్పటి సీఎం పరీకర్‌ కేంద్ర మంత్రివర్గంలో చేరాక మరాఠా కుటుంబంలో జన్మించిన లక్ష్మీకాంత్‌ పర్సేకర్‌ గోవా సీఎం అయ్యారు. ఈ రాష్ట్ర ఆరెస్సెస్‌ విభాగంలో కీచులాటలు పెరిగినా.. బీజేపీ పాలనపై జనంలో వ్యతిరేకత రాలేదని ఇటీవలి సర్వేలు చెబుతున్నాయి. మెజారిటీ రాకున్నా 19 నుంచి 21 సీట్లు రావచ్చని ఇండియాటుడే–యాక్సిస్‌ సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. కాంగ్రెస్‌ నేత దిగంబర్‌ కామత్‌ 2007–2012 మధ్య దాదాపు ఐదేళ్లు గోవా సీఎంగా ఉన్నారు. ఒకవేళ బీజేపీ పాలనపై జనంలో అసంతృప్తి కనిపిస్తే.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందనే అంచనాలున్నాయి.

మార్పు తప్పదా?
ఉత్తరాఖండ్‌
హైకోర్టు తీర్పు ఫలితంగా ప్రస్తుత కాంగ్రెస్‌ సీఎం హరీశ్‌ రావత్‌ కిందటి ఏప్రిల్‌ 22న మరోసారి పదవి చేపట్టడంతో ఉత్తరాఖండ్‌ నాలుగో అసెంబ్లీ(70 సీట్లు) ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2000లో ఏర్పాటైన ఉత్తరాఖండ్‌లో తొలి అసెంబ్లీ ఎన్నికలు 2002లో జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడంతో ఎన్‌డీ తివారీ సీఎం అయ్యారు. 2007లో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2012లో మళ్లీ కాంగ్రెస్‌ పార్టీయే గెలుపొందింది. దేశంలోనే అత్యధిక బ్రాహ్మణ జనాభా శాతం ఉన్న ఉత్తరాఖండ్‌లో రెండో పెద్ద కులం క్షత్రియులు(ఠాకూర్లు లేదా రాజ్‌పుత్‌లు). అందుకే సీఎం పదవిని మొదటి నుంచీ ఈ రెండు సామాజికవర్గాల నేతలే చేపడుతున్నారు. ఇక్కడ మాజీ సీఎం విజయ్‌ బహుగుణ ఫిరాయింపుతో కాంగ్రెస్‌లో చీలిక వచ్చినప్పుడు కేంద్రం తొందరపడి రాష్ట్రపతి పాలన విధించి.. హైకోర్టు తీర్పుతో పరువుపోగొట్టుకుంది. ప్రస్తుతం ఎన్నికల సర్వేల ప్రకారం బీజేపీయే ఇక్కడ గెలుపు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తం 70 సీట్లకుగాను బీజేపీకి 38 నుంచి 43 స్థానాలు రావొచ్చని ఇండియాటుడే–యాక్సిస్‌ సర్వేలో పేర్కొంది. కాంగ్రెస్‌కు 26–31 సీట్ల మధ్య రావొచ్చని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement