అంచనాలు మించి కమల వికాసం!
ఉత్తరాఖండ్‌లో బీజేపీ అంచనాలను మించి భారీ విజయాన్ని అందుకుంది. ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకి కనిష్ఠంగా 29 నుంచి గరిష్ఠంగా 53 స్థానాల వరకు రావొచ్చని పేర్కొనగా.. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బీజేపీ 56 స్థానాల్లో గెలుపొందింది. ఒక స్థానంలో ఆధిక్యం కనబరుస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. దీంతో ఉత్తరప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్‌లో కూడా మోదీ ప్రజాదరణ స్పష్టంగా కనిపించినట్లయింది.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమి పాలయ్యారు. హరిద్వార్ రూరల్ నుంచి తొలుత ఫలితం వచ్చింది. అక్కడ ఓడిపోయిన రావత్.. ఆ తర్వాత ఫలితం వెలువడిన కిచ్చా నియోజకవర్గంలో కూడా ఓటమి చవిచూడక తప్పలేదు. పర్వతప్రాంతమైన ఉత్తరాఖండ్‌లో ప్రతిసారీ ఎన్నికలు జరిగినప్పుడల్లా ప్రభుత్వాలు మారుతుండటం సర్వసాధారణం. ఈసారి కూడా అలాగే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో అధికారం చేపట్టాలంటే కనీసం 36 స్థానాలు అవసరం అవుతాయి.
ప్రస్తుత అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 32 స్థానాలు ఉండగా, బీజేపీకి 31, బీఎస్పీకి 3, ఉత్తరాఖండ్ క్రాంతి దళ్‌కు ఒకటి, స్వతంత్రులు ముగ్గురు ఉన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ మీద అనేక అవినీతి ఆరోపణలు రావడంతో పాటు స్వయంగా ముఖ్యమంత్రి హరీష్ రావత్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాంతో ఈసారి అక్కడ బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఈసారి బీజేపీకి కనిష్టంగా 29, గరిష్టంగా 53 వరకు స్థానాలు వస్తాయని వివిధ సర్వే సంస్థలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ 15 నుంచి 30 స్థానాల లోపు పరిమితం అవుతుందని చెప్పాయి. దానికి తగినట్లుగానే ఆధిక్యాలు కూడా కనిపిస్తున్నాయి.