నార్కో పరీక్షకు సిద్ధం: హరీశ్
డెహ్రాడూన్: ఎమ్మెల్యేలకు డబ్బులు పంచారన్న ఆరోపణలపై పదవీచ్యుత ముఖ్యమంత్రి హరీశ్ రావత్ స్పందించారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని,నార్కో అనాలసిస్ పరీక్షలకు కూడా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. తనపై చేసిన స్టింగ్ ఆపరేషన్ లో సీబీఐ ప్రమేయం ఉందని హరీశ్ ఆరోపించారు.రాజకీయ నాయకునిగా తాను పలుమార్లు సీబీఐ ముందు హాజరయ్యానని హరీశ్ రావత్ అన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం తాను అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవాల్సి ఉందన్నారు. దానికి సంబంధించిన పనులు ఉన్నందువల్లే... సీబీఐ విచారణకు ఇవాళ హాజరు కావడం లేదని ఆయన తెలిపారు. అలాగే తనతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆ పార్టీ నేతలు కైలాశ్ విజయ్ వర్గియా, భగత్ సింగ్ కొశారి, అజయ్ భట్ లకు సైతం నార్కో పరీక్ష చేయాల్సిందిగా హరీశ్ డిమాండ్ చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ విశ్వాస పరీక్షలో నెగ్గుతామన్న రావత్.. తాజా వీడియో గురించి తనకేమీ తెలియదన్నారు.