నటుడు సుశాంత్ మృతి కేసులో భారీ ట్విస్ట్‌.. నటి రియాకు.. | CBI Files Closure Report In Hero Sushant Singh Rajput Case, Check Out News Video Inside | Sakshi
Sakshi News home page

నటుడు సుశాంత్ మృతి కేసులో భారీ ట్విస్ట్‌.. నటి రియాకు..

Published Sun, Mar 23 2025 7:55 AM | Last Updated on Sun, Mar 23 2025 12:51 PM

CBI Files Closure Report In Hero Sushant Singh Rajput Case

ముంబై: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్‌ మృతి కేసులో ఊహించని ట్విస్ట్‌ చోటుచేసుకుంది. సుశాంత్‌ మరణంలో ఎలాంటి కుట్ర కోణం లేదని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ).. రెండు కేసులను క్లోజ్ చేసింది. ఇదే సమయంలో సుశాంత్‌ మరణంతో నటి రియా చక్రవర్తికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. దీంతో, సుశాంత్‌ మరణంపై మరోసారి చర్చ జరుగుతోంది.

నటుడు సుశాంత్‌ మృతి కేసులో దాదాపు ఐదేళ్ల పాటు దర్యాప్తు చేసిన సీబీఐ సంచలన రిపోర్టును ఇచ్చింది. తాజాగా సుశాంత్ మరణానికి సంబంధించి నమోదైన రెండు కేసులను సీబీఐ క్లోజ్ చేసింది. ఈ మేరకు శనివారం (మార్చి 22) ముంబై కోర్టులో సీబీఐ క్లోజర్ రిపోర్టును దాఖలు చేసింది. ఈ సందర్భంగా సీబీఐ రిపోర్టులో.. సుశాంత్ మరణంలో ఎటువంటి కుట్ర కోణం లేదు. సుశాంత్ మరణానికి వెనక కుట్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అలాగే, సుశాంత్‌ మరణంతో నటి రియా చక్రవర్తికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఈ క్రమంలోనే సీబీఐ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇదే సమయంలో సుశాంత్ కుటుంబ సభ్యులపై రియా చక్రవర్తి దాఖలు చేసిన కేసును కూడా సీబీఐ క్లోజ్ చేసింది. దీంతో, సుశాంత్‌ మరణంపై మరోసారి చర్చ ప్రారంభమైంది. దీంతో సీబీఐ రిపోర్టుపై ముంబై కోర్టు, సుశాంత్ కుటుంబ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 

ఇదిలా ఉండగా.. నటుడు సుశాంత్ సింగ్ జూన్ 14, 2020న ముంబై బాంద్రాలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. అప్పటి వరకు సక్సెస్ ఫుల్‌గా సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోగా ఎదిగిన సమయంలో ఆయన మృతి సంచలనానికి దారి తీసింది. ఈ క్రమంలో సుశాంత్ మరణం వెనక కుట్ర కోణం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నటి రియా చక్రవర్తి, మరికొంత మందిపై సుశాంత్‌ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. సుశాంత్‌‎ను ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఆర్థిక మోసం, మానసిక వేధింపులకు గురి చేశారని ఆయన తండ్రి  కెకె సింగ్ వ్యాఖ్యానించారు. అనంతరం, పాట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు రియా చక్రవర్తితో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి కౌంటర్ నటి రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ సోదరీమణులపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాళ్లు నకిలీ మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం వల్లే సుశాంత్ మరణించాడని రియా ఫిర్యాదులో పేర్కొంది.

సుశాంత్ సింగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం  సృష్టించడంతో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. రంగంలోకి దిగిన సీబీఐ సుశాంత్ మరణానికి గల కారణాలపై విచారణ మొదలుపెట్టింది. సుశాంత్ తండ్రి, నటి రియా చక్రవర్తి నమోదు చేసిన కేసులను లోతుగా దర్యాప్తు చేసి కేసుల విచారణ ముగించింది. దాదాపు ఐదేళ్ల పాటు సుశాంత్ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ ఈ మేరకు ముంబై కోర్టులో క్లోబర్ రిపోర్టు దాఖలు చేసింది. సుశాంత్ మరణం వెనక ఎలాంటి కుట్ర లేదని సీబీఐ తేల్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement